ఆదిత్యహృదయం వివరణ

– శ్రీ ఉదయభాస్కర్ దువ్వూరి

Last updated: Nov 28th 2015

1. ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః

ఇప్పట్నుంచి ప్రతిఆదివారం ఆదిత్యహృదయం పారాయణతో పాటు సూర్యోపాసన మొదలుపెడదాము

రామరామ మహాబాహో,శృణుగుహ్యంసనాతనం
యేన సర్వా నరీన్వత్స, సమరే విజయిష్యసి//

ఓ రఘుకుల రామా! పరశురాముని బలాన్నికూడా తీసుకొని ద్విగుణీకృతబలముతోప్రకాశిస్తున్న రామా !శతృవులనుయుధ్ధములో సునాయాసముగా జయించి విజయాన్నిపొందడానికి ఉపయోగపడే సనాతనమైనది రహస్యమైన (ఓ)ఈస్తోతా్రన్ని విను.

శ్రీ రమద్వాల్మీకిరామాయణంలోయుధ్దకాండలో 107 ౧౦౭ సర్గ
రామరావణ యుధ్ధాన్నిచూడటానికి ఆకాశమార్గం లో దేవతలతో కూడా వచ్చిన అగస్త్య మహర్షి రాముని వద్దకు వచ్చి ఆదిత్య హృదయస్తోతా్రన్ని ఉపదేశిస్తాడు.

సూర్యోపాసన వల్ల
మహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజుఅక్షయపాత్రని పోందేడుట;
మహాభాగవతం దశమస్కందం లో సతా్రజిత్తుకు
శ్యమంతకమణి దొరికిందిట;
ఋక్షరజస్సు అనే వానరానికి సుగీ్రవుడు, కుంతీదేవికి కర్ణుడు పుతు్రలుగా  దొరికేరుట;

అంతెందుకు తేజస్సు కావాలంటే సూర్యోపాసన, సుఖం కావాలంటే సూర్యోపాసన, యశస్సు కావాలంటే సూర్యోపాసన_ ఒకటేమిటి సూర్యభగవానుడు సాక్షాత్తు ఆరోగ్యదేవత కదా_ ఏదికావాలంటే అదేపొందచ్చు.

కృష్ణునికి జాంబవతికి పుట్టినసాంబుడు దూర్వాసుని శాపం వల్లకుష్టురోగి అయితే సూర్యోపాసన చేసి నిరోగి, సుందరాంగుడిగా మారాడుట.

సూర్యోపాసనతో బాహ్యాభ్యంతర తిమిరాన్ని పారదో్రలి సాధనలో జ్జానజ్యోతిని సత్వరం దర్శించుకోడానికి వీలవుతుంది అంటారు విజ్ఞులు.  అలాంటి ఆదిత్యహృదయాని్న ఒక్కసారి పరికిద్దాం.

ఆదిత్యహృదయం లో మొత్తం 31 శ్లోకాలు, వెరసి వెయ్యి అక్షరాలు ఉన్నాయి.
మొదటి తొమ్మిది శ్లోకాలు నుతి (స్తుతి) అంటే ఈశ్వరారాధనలో నమకం లాంటివి.
చివరి 10 శ్లోకాలు శ్తోత్ర మాహాత్మ్యం తెలియ చేస్తాయి.

ఇంకమధ్యలో వున్న 12 శ్లోకాలు ద్వాదశాదిత్యులన్న మాట.
అంటే మన పారాయణకి 6వ శ్లోకం రశ్మిమంతం సముద్యంతం  నుంచి మొదలుపెడితే 24వ శ్లోకం
వేదాశ్చ క్రతవశ్చైవ వరకూ చె ప్పుకొంటే చాలు.

వచ్చేవారం సూర్యోపాసన యొక్క ఆవశ్యకత విశిష్టత మరియు పధ్ధతులను తెలుసుకొని
రశ్మిమంతం సముద్యంతం
అనేశ్లోకంతో ఆదిత్యస్తుతి లోకి వెడదాము.
        
స్వస్తి.
2. ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః

ఆదిత్యహృదయం 2 వ శ్లోకం:

ఆదిత్యహృదయం విశిష్ఠత ఏమిటంటే, ఏ పరిస్తితుల్లొ ఈ ఆదిత్య హృదయం చెప్పబడిందో చూస్తే
ఇటు,సాక్షాత్తూశీ్రమహావిష్ణువు,
అవతారపురుషుడు, ఇప్పటికే ఎన్నోవందల మంది          రాక్షసులను సునాయాసంగా సంహరించి,బ్రహ్మాస్త్రంతో సహా అనేకమయిన అస్త్రశస్త్రాలతో అజేయుడిగా ఉన్న శీ్రరాముడు-
ఉదరములో అమృతభాండాన్ని పెట్టుకొని దురహంకారంతోమదించిన రావణుని సంహరించే సంగ్రామం మధ్యలో ఆదిత్యహృదయం ఉపదేశాన్ని పొందేడు.

అటు ఉపదేశము ఇచ్చేవ్యక్తి సామాన్యుడా!
కుంభసంభవుడు, బ్రహ్మర్షులలో అగే్రసరుడు, మంత్రద్రష్ట, దివ్యతేజశ్వి, తి్రకాలవేదిఅయిన అగస్తు్యడు  అపరాహ్ణకాలంలో వచ్చి అనుగ్రహించేడు.

సిట్యుయేషన్ చూస్తూంటే  భగవద్గీతా యుద్ధమధ్యం లోనే
ఆదిత్యహృదయం కూడా అదే పరిస్తితుల్లోనే చెప్పబడింది.

ఈ మహామంత్రాన్నిపఠించడం వల్ల-
సర్వ శతృ వినాశనం - మన లోపల వుండే కామ,కో్రధ,మద,మాత్సర్యాదులు అనే అంత:శతృవులను, బయట శతృవులు- మన చేత ద్వేషింపబడేవారు, మనల్ని ద్వేషించేవారు అగు సర్వ శతృవులను పూర్తిగా నశింప చేస్తుంది.

ఙయావహం జపేన్నిత్యమ్- ప్రతి నిత్యము దీనిని పఠిస్తే విజయం నిశ్చయం.        ఇంకా
చింతాశోక ప్రశమనం- చింత అంటే రాబోయే అనర్ధాన్ని తలచుకొని వ్యాకుల పడటం; శోకమంటే ఇష్టమైన వస్తువు నష్టమైనప్పుడు కలిగే దుఃఖము-  ఈరెండు రకాలైన దుఃఖాలను పూర్తిగా తొలగిస్తుంది.  అంతేకాదు
అయుర్వర్ధన ముత్తమం-  అంటే ఉన్నఆయుస్సు(విహిత ఆయుస్సు)ను అధికఆయుస్సు గా చేస్తుంది అని చెబుతోంది ఆదిత్యహృదయం.  ఇంతకంటే ఏమికావాలి చెప్పండి.

అర్ధం తెలియక పోయినా నమ్మకంతో పారాయణ చేస్తే పూర్తి ఫలితం ఉంటుంది- ఎలాగంటే  డాక్టరు రాసి ఇచ్చిన  టాబ్లెట్- దాని కంపొజిషన్, కెమికల్స్ యాక్షన్ మనకు తెలియక పోయినా మనం ఆటాబ్లెట్ వేసుకొంటే జబ్బు తగ్గుతోంది కదా -  అలాగే ఈబీజాక్షరాల సంపుటి మన భవతిమిర రోగాలకు దివ్యమైన ఔషధం అనడంలో కించిత్తు సందేహం కూడా అక్కరలేదు. విశ్వాసంతో పఠించండి. మనోవాక్కాయాల్ని ఏకంచేసి పా్రర్ధించండి.

పారాయణ తర్వాత,  సూర్యోపాసన ఎలాచేయాలి అనేది తెలుసుకొందాం:

సూర్యోపాసన:  ఆదిత్యహృదయ పారాయణతోపాటు సూర్యకిరణాలనుండి వచ్చే జీవశక్తి  మన శరీరానికి సోకేట్లుగా సూర్యునికభిముఖముఖంగా వీరాసనములో కూర్చొని చేసే ప్రకి్రయ. సూర్యోదయమునకు పూర్వమే స్నానం చేసి సూర్యుడు సూర్యోదయమునుంచి ప్రత్యక్షముగా కనపడే ఎత్తయిన ప్రదేశము అంటే ఓపెన్ టెర్రేస్ లేదా నదీతీరము ,సీషోర్,లేదా నిర్జనప్రదేశము ఎంచుకొని పూర్వాభిముఖంగా వీరాసనం లో కూర్చోవాలి.  దేహమంతా సూర్యరశ్మి శోకే విధంగా వస్త్రధారణ చేయాలి. సూర్యోదయం నుంచి సూర్యబింబం వైపు చూస్తూఉండాలి కాని సూర్యబింబం లోకి డైరెక్ట్ గా చూడకూడదు. కన్నులు పూర్తిగా తెరుచుకొని ఆదిత్యహృదయాన్ని స్పష్టముగా నిదానముగా(స్లోలీ) ఒక సారి  గాని, మూడుసార్లుగాని, లేదా ఐదుసార్లుగాని  పఠించాలి.
ఉదయము సాయంత్రము 15 నిముషాలనుంచి 30,45లేదా ఒక గంట(ఎక్కువలోఎక్కువ) ఉపాసన చేయవచ్చును.
ఉపాసన అయినతరువాత ముందుగా నీటిని చూడాలి. తరువాత పచ్చటి చెట్లను చూడాలి. తిరిగి నీటిని మళ్ళీ పచ్చని చెట్లను పదేపదే మార్చి చూసేక బహిర్ముఖులవవచ్చును.
ఆహార నియమం పాటించాలి.  పులపు, ఉప్పు, కారం బాగా తగ్గించి సుధ్ధసాత్విక ఆహారం తీ సుకోవాలి.
ఉదయం తూర్పు గాను సాయంత్రం పడమరగాను తిరిగి ఇదే పద్దతి లోచేయాలి.
యోగవిద్యాపరిభాషలో కుడికన్ను సూర్యుని ప్రతిరూపమని ఉపనిషత్తులు చెబుతున్నాయి.  యోగ సాధనలో భూ్రమధ్యములో దృష్టినుంచి  సాగునప్పుడు మన ఆంతర్యములోసూర్యోదయమై ప్రకాశము ప్రసరిస్తుంది. తద్వారా తపస్సు తీవ్రమై జ్త్రానోదయం అవడానికి దోహపడుతుంది.  

స్వస్తి
3. ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః

ఆదిత్య హృదయం  3  - 6 వ శ్లోకం :

(ఇంతకు ముందు రెండు వారాల్లోనూ ఆదిత్యహృదయ పారాయణ విధానం, సూర్యోపాసన ల గురించి తెలుసు కున్నాము.  ఈ దీక్షాసమయం లో పులుపు, కారము, ఉప్పు ల ఉపయోగము తగ్గించడం మంచిది.  పాలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, పచ్చికొబ్బరి  మరియు అటుకులు తినుట మంచిది.)

ఓరామా! జపింపదగిన ఆదిత్యస్వరూపమును గురించి సావధానముగా విని పూజయస్వ-పూజింపుము అని అగస్త్య మహర్షి చెబుతున్నారు:

రశ్మిమంతం  సముద్యన్తం దేవాసుర  నమస్క ృతం
పూజయస్వ వినస్వంతం భాస్కరం భువనేశ్వరం!!

పూజయస్వ అనే ఆదేశానికి - రశ్మిమంతం, సముద్యన్తం, దేవాసుర నమస్క ృతం, వివస్వంతం, భాస్కరం, భువనేశ్వరం అనే ఆరు ప్రత్యయాలు ఇవ్వడంతో ఇదే ధ్యానశ్లోకం కూడా అయ్యింది.
రశ్మిమంతం-బంగారం వంటి కాంతి గల ప్రశస్తమైన కిరణములు కలవాడు;
సముద్యంతం-పూర్తిగా కనిపించేటట్లు బాగా ఉదయించిన వాడు;
దేవాసుర నమస్క ృతం- ఈఆదిత్యుడుదేవతలకు శే్రయస్సును (మోక్షమును), అసురులకు పే్రయస్సును (ఇహపర సుఖమును)ఇచ్చువాడైనందున దేవాసురులు ఇద్దరు నమస్కరింతురు.
వివస్వన్తం-తన తేజోవిశేషము చేత మిగిలిన తేజస్సులను కప్పివేసేవాడు.
భాస్కరం-  సూర్య, చంద్ర అగ్నులకు తేజస్సునిచ్చే పరమాత్మ ఈ భాస్కరుడు.
భువనేశ్వరం- చతుర్దశ భువనాలకి ప్రభువైనందున వీరిని భువనేశ్వరుడన్నారు.

ఆసూర్యభగవానుడు బంగారుకాంతి వలె ప్రశస్తమైన కిరణములు కలిగి బాగుగా ఉదయించినవాడు, సత్వరజస్తమోగుణములకు ప్రతీకలైన దేవతలు అసురులు చేత నమస్కరింపబడేవాడు, తన తేజోవిశేషముచేత చందు్రడు, అగ్నిమొదలయిన చిన్నచిన్నతేజోమండలాలను కప్పివేయువాడు, ఎండకాచి, వర్షింపచేసి సమస్త లోకాలను నియమించువాడు, సూర్య చంద్ర అగ్నులకు కాంతినిచ్చు పరబ్రహ్మ స్వరూపముగా తెలుసుకొని పూజింపుము అన్నాడు అగస్తు్యడు.

ఆదిత్యహృదయం 4 - 7శ్లోకం 

భాస్కరుని ఉపాసించు అని చెప్పిన తర్వాత దేవతలెందరోఉండగా ఈ సూర్యునే ఎందుకు పూజించాలి అనే సందేహం తొలగించడానికి అగస్త్య మహర్షి ఇలా చెబుతున్నాడు: సర్వదేవాత్మకోహ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏషదేవాసుర గణాన్ లోకాన్పాతి గభస్తిభిః!! సర్వ దేవాత్మకః - సకల దేవతలు ఆ భాస్కరునిలోనే మూర్తీభవించి ఉన్నారు. తేజస్వీ- పరులను తిరస్కరించదగిన తేజస్సు కలవాడు గభస్తిభిః దేవాసుర గణాన్- దేవతలను రాక్షసులను సమ భావముతో పోషించు సాత్విక స్వభావము సూర్యకిరణాలలో స్వతసిద్ధంగా ఉందిట. మరి ఈసూర్యభగవానుడు మంచివారికి, చెడ్డవారికి, ఉన్నవారికి- లేనివారికి, పండితులకు-పామరులకు, పూరిగుడిసెలకు-రాజభవనములకు, జడములకు-చేతనములకు, పుణ్యాత్ములకు-పాపాత్ములకు అందరకూ సమానముగా ప్రకాశము, ప్రేరణ కలగచేస్తున్నాడు కదా. ఈ సాత్విక స్వభావాన్ని «సాధారణ సూర్యో మానుషాణాం» అని వర్ణించారు. సూర్యుడు అందరినీ సమంగా అనుగ్రహిస్తున్నాకూడా, ప్రపంచం లోఉన్న ప్రతి పా్రణి వారివారి సామర్ధా్యన్ననుసరించి వారు సూర్యునినుంచి లాభాన్ని పోందుతున్నారుట. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, సూర్యుని పే్రరణ వల్ల మనుషులందరూ సూర్యరశ్మిలో ఎంతెంత పని చేయగలుగుతున్నారో, అంత ధనం గాని తత్స మానమైన వస్తువులుగానీ పొందుతున్నారు అంటున్నారు. అందుకే, ఈ సూర్యుడే సమస్త దేవతలకు ఆత్మ. ఇతర దేవతలున్నారని శాస్త్రాధారాలవల్ల మాత్రమే తెలుస్తుంది కానీ సూర్యుడుని ప్రత్యక్షముగా మన కళ్ళతో చూడగలుగుతున్నాము కనుక మనకు ప్రత్యక్షదైవము. రాబోయే మంత్రంలో తి్రమూర్తులు, మహేందు్రడు, కుబేరుడు, కాలుడు,యముడు,సోముడు వరుణుడు కూడా ఇతడే సందేహమెందుకు అంటున్నాడగస్త్య మహర్షి.
ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

5. ఆదిత్యహృదయం -8 శ్లోకం:

ఏష బ్రహ్మాచ విష్ణూశ్చ శివస్కన్దః ప్రజాపతిః
మహేంద్రోధనదః కాలో యమస్సోమోహ్యపాంపతిః!!
ఏషః=ఇతడే
బ్రహ్మాచ = చతుర్ముఖ బ్రహ్మ; విష్ణుశ్చ= విష్ణుమూర్తి;
శివః=సాంబమూర్తి; స్కన్దః=కుమారస్వామి; ప్రజాపతియూ; మహేంద్రః=దేవరాజయిన ఇందు్రడును; ధనదః= కుబేరుడును; కాలః= కాలపురుషుడును; యమః= శిక్షించువాడైన యముడును; సోమః= చందు్రడునూ; అపాంపతిః=వరుణుడునూ; ఏషః=ఇతడే;
ఇతడు చతుర్ముఖశరీరుడు.
 «ఏకామూర్తిస్త్రయోదేవా బ్రహవిష్ణుమహేశ్వరాః» అని తెలిపినట్లు సూర్యభగవానుడు తి్రమూర్తి స్వరూపము.
భవిష్యపురాణంలోఇంకొక ఆదిత్యహృదయం ఉంది. దానిలో
ఉదయేబ్రహ్మణోరూపం! మధ్యాన్నేతు మహేశ్వరం!
సాయంకాలేస్వయంవిష్ణుః! తి్రమూర్తిశ్చదివాకరః!
అని చెప్పేరు.
ఫాల్గుణ మాసాధిపతి యగు సూర్యునకు విష్ణువని పేరు.
పరాశర మహర్షి వచనానుసారం విష్ణువనగా రక్షకుడు, విశ్వవ్యాపకుడు(అంతటా ప్రవేశించువాడు).

సూర్యభగవానుడు ఉదయం నుంచి సాయంత్రంవరకు భూమిలోని నీటిని తన కిరణములచేత ఆవిరి రూపములో స్వీకరించడం వల్ల ఆకిరణాలన్నీ సాయంతా్రనికి నీటితోనిండి నీలవర్ణంతో «నీలగీ్రవోవిలోహితః» అన్నట్టుగా కాలకూట విషాన్ని కంఠంలో పెట్టుకొన్న శివుడిలా ఉన్నాడుట. శివుడనగామంగళాన్నిచ్చేవాడు- అపరిమిత మంగళ పుణ్యస్వభావంగల ఈ సూర్యుడే శివుడు.

సర్వ శతృవులను శోషింప చేయువాడు-మహాసేనాని షణ్ముఖుడు(స్కన్దుడు)-తన కిరణములతోనే ఎంతవారినైనా తిరస్కరించ గలిగిన ఆదిత్యుడా స్కన్దుడే అంటారు.

ప్రజాపతులు తొమ్మిది మంది. ప్రజాపతీనాం దక్షోహం- ప్రజాపతి అంటే దక్షుడి లాఉండాలి అన్నట్లుసూర్యుడే ప్రజాపతి.

స్వరూపము చేతను, మహిమచేతను ప్రమాణములకందని వాడు ఇందు్రడు. వృతాసురుని సంహరించడం ద్వారా మహాన్ అనే బిరుదును పొంది మహేందు్రడయ్యాడు. ఋగ్వేదం, తైత్తరీయసంహిత మహేందు్రడు సూర్యుడు వేరుకాదు ఒక్కరే అని చెబుతున్నాయి.

ధర్మరాజుకు అక్షయపాత్ర, సతా్రజిత్తుకు స్యమంతకమణిని ఇచ్చినవాడు కుబేరుడు కాక మరెవ్వడవుతాడు.
ధనమనగా చైతన్యము. అందరకూ చైతన్యము నిచ్చు సూర్యభగవానుడే ధనదుడు.

కుబేరుడంటే బాగానే ఉంది కానీ, కాలః,యమః అంటారు-చూడండి- సూర్యుణ్ణి కాల స్వరూపంగా చెబుతారు. ప్రతిసెకనుకు నిముషాలు, గంటలు,రోజులు,నెలలూ , సంవత్సరాలంటూ సూర్యుడు కొలుచుకొంటూ వెళ్ళిపోతోంటే ఈజగత్తే కాలానికి వశమయిపోలేదా చెప్పండి.

కాలం కలయతామహం-ఈకాలం నాస్వరూపమని ఆభగవంతుడన్నాడు- అంటే ఈసూర్యభగవానుడే కాదా ఆపరమాత్మ? «అనాదిర్భగవాన్ కాలః» అన్నారు పరాశర మహర్షి.

సూర్యరధగమనము చేతనే ఈకాలమేర్పడుతోంది.. కాలాత్మకమైన సూర్యరధము విలక్షణంగా ఉంటుంది. ఆరధానికి ఒకేచక్రం ఉంటుంది(సంవత్సరమనే చక్రం).పాములచే కట్టబడిన ఏడు గుఱ్ఱాలతో లాగబడుతుంది(రాతి్రంబవళ్ళనే వారాలు ఏడు ), ఆచక్రానికి మూడు ఇరుసులుంటాయి(భూత, భవిష్యద్వర్తమానాలు). ఆ రధం మిక్కిలి ధృడమైనది కాబట్టి అవినాశి అంటారు. దీని గురించి ముందు ముందు మరింత తెలుసుకొందాం.

కాలం యొక్క కొలమానం చేస్తూ మన జీవితాన్ని హరించి వేస్తూ యముడయ్యాడు. క్షణక్షణం గడుస్తూంటే మన జీవితకాలం తరిగి పోయి మరణానికి దగ్గరగా తీసుకొనిపోతున్నాడు కనుక ఇతడే యముడు.

«సూతే అమృతమితి సోమః» ఇక్కడ అమృతమంటే మోక్షమని చెప్పుకోవాలి. మోక్షాన్నిస్తాడు కాబట్టి సూర్యుడు సోముడయ్యాడు.(కాంతినిచ్చు చందు్రడయ్యాడు)

ఆషాఢమాసం వర్షఋతువులో మొదటి నెల. ఆషాఢమాసానికి అధిపతి అయిన సూర్యునకు వరుణుడని పేరు. 
సూర్యుడు సముద్రం నుంచి జలాన్ని తీసుకొని వరుణరూపంలో వర్షం ద్వారా తిరిగి భూమికి ఇస్తూంటాడు కనుక (అపాంపతిః)వరుణుడయ్యాడు.

ముందు ముందు ఈప్రభాకరుడే పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వనీకుమారులు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని ఋతుకర్త కూడా అంటున్నారు. అది వచ్చేవారంకదా. చూద్దాం.
6. ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

  2. ఆదిత్యహృదయం -9శ్లోకం: ....తరువాయి భాగం:

పితరౌ వసవసాధ్యాహ్యశ్వినౌ మరుతోమనుః
వాయుర్వహ్ని ప్రజాపా్రణ ఋతుకర్తాప్రభాకరః!!
పితరులు, వసువులు, సాధ్యులు, అశ్వనీదేవతలు అయ్యాక ఇప్పుడు మరుత్తులు:

మరుతః= మరుద్గణములు(49 మరుత్తులు)
మి్రయన్తేనకదాచిదితి మరుతః- ఎప్పుడూ మరణించని వారు కాబట్టి వాళ్ళని మరుత్తులన్నారు. వాళ్ళు శుక్రజ్యోతిమొదలగు 49 మరుత్తులని వాయుపురాణం చెబుతూంది. వాళ్ళలో ముఖ్యులేడుగురు. ఆవహము, ప్రవహము, సంవహము, ఉద్వహము, వివహము, పరివహము మరియు పరావహము అనువారి స్వరూపమే సూర్యుడు.
ధ్యానబిందూపనిషత్తులో 
యధైవోత్పలనాళేన తోయమాకర్షయేన్నరః
తధైవోత్కర్షయేద్వాయుం యోగీయోగపదేస్తితః!! అన్నారు.
యోగి అయినవాడు యోగపదంలో స్తిరపడి ముందుకు సాగాలంటే, యధైవోత్పలనాళేన-  మధ్యలో రంధ్రమున్న కలువకాడతో మానవుడు జలాన్ని ఎలాగయితే లోపలికి పీల్చుకొంటాడో అదేవిధంగా 
తధైవోత్కర్షయేద్వాయుం -శరీరమంతటా వ్యాపించి ఉన్న 49మరుత్తులను (ఆకర్షించి)పీల్చిపా్రణాయామముద్వారా ఆయామములోఉంచాలి.( మన శరీరంలో 49 ప్రదేశాలలో వాయువు మరుత్తులు పేరుతో ఉన్నాయి. వాని కదలిక వల్లే మన శరీరం, కండరాలు ఏ శ్రమ లేకుండా పనిచేస్తూన్నాయి).

మనుః-మనము ఆచరింపవలసిన ధర్మాన్ని నిర్ణయించడం ద్యారా ఆయన మనువయ్యాడు. మననము చేసేవాడు మనువు. నాన్యతోస్తిమంతాః- అనే సృతి ప్రమాణం చేత సూర్యుడే మనువయ్యాడు.

వాయుః- భూమిని జలాన్ని వాయువు పరుగెత్తుతూ పవిత్రం చేస్తుంది. వాయువు యొక్క శక్తిని వేగాన్ని యెదుర్కొనే శక్తి యెవ్వరికి లేదు. వాయువంటే జ్ఞానం, జ్ఞాపకశక్తి. శరీరంలో ఉండే పా్రణ, అపాన, వ్యాన ఉదాన, సమాన వాయు లంటేనే పా్రణ శక్తి. పా్రణాద్వాయురజాయతే- ఈ పా్రణ శక్తి నుంచే వాయువు పుట్టింది. అందుకే శంన్నో మిత్రః అనే శాంతి మంత్రంలో- నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి! త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి! అని నొక్కి వక్కాణించడంద్వారా అంతటి వాయుపద సామర్ధ్యం సూర్యుడు కాక మరెవ్వరు?

వహ్నిః - అగ్ని రూపంలో యజ్ఞయాగాది క్రతువుల ఫలితమైన హవిస్సును మోయువాడు ఈ సూర్యుడే.
ప్రజాపా్రణః- పా్రణులు జీవించుటకు కారణమైన వాడు.

ఋతు కర్తా-వసంతాది ఋతువులను కల్పించువాడు- సూర్యుని నుంచి పుట్టిన ఏడు కిరణాలలోను ఏడవ కిరణం ప్రత్యేకంగా జనించినదని మిగిలి ఆరు కిరణాలు మిక్కిలి కాంతితోపుట్టి ఋతువులేర్పడటానికి కారణమయ్యేయి కాబట్టి ఇతడే ఋతుకర్త.

ప్రభాకరః- ప్రభా అంటే భగవత్ పా్రప్తికి సాధనమైన జ్ఞానమును కలగజేయువాడు ప్రభాకరుడు అంటూ సర్వదేవతా స్వరూపునిగా ఆదిత్యుని మహాత్మ్యం నిరూపింప బడింది.

ఈ స్తోత్ర మహాత్మ్యం అయిన తర్వాత
ఇక్కడనుంచి 12 మంతా్రలు ద్వాదశాదిత్యుల స్తోత్రం అనబడుతుంది. వచ్చే వారం నుంచి హృదయం లోకి చొచ్చుకొనిపోయే సూర్యకిరణాల రహస్యాన్ని తెలుసకొంటాము.
7. ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

ఆదిత్య హృదయం 10 శ్లోకం:

ఆదిత్యః స్సవితాసూర్యః! ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణ సదృశో భానుః హిరణ్య రేతా దివాకరః!!

ఆదిత్యః= ఆదిత్యుడు_అదితి కశ్యపులకు పుతు్రడైనందున ఆదిత్యుడయ్యాడు. «ఆదిత్యేన వావ సర్వేలోకా మహీయంతే » అనే శు్రతి వచనం -లోకాలను ప్రకాశింప జేయువాడయినందున అతడు ఆదిత్యుడు.
సవితా= ధ్యానించు వారికి సకల శే్రయస్సులనిచ్చేవారైనందున సవిత అనే నామము సార్ధకమైంది. మహా సౌరంలో పా్రర్ధన ఏమంటుందంటే సవితృ దేవత మాకు ముందు వెనుకల, పైన కి్రంద, అన్ని చోట్లనుండి అన్ని సుఖములను, ఆయుర్దాయమును ఇచ్చు గాక అని.

సూర్యః=సమస్త ప్రజలను తమ తమ కర్మల యందు ప్రవర్తింప జేయు వాడు కనుక సూర్యుడు అన్నారు.  «గచ్ఛతి ఆకాశే ఇతి సూర్యః» ఆకాశంలో ప్రయాణం చేయువాడైనందున అతను సూర్యుడు - సూర్య సిద్ధాంత శ్లోకంలో ఆదిత్యః సవితా సూర్యః అనే మూడు పదాల విశిష్టతను చాలా గొప్పగా తెలుప బడింది. 
ఖగః= లోకోపకారానికై ఆకాశంలో సంచరించేవాడు గనుక ఖగుడని పేరు.-(ఖం=పరమాకాశం-అంటే హృదయాకాశం. ఆహృదయాకాశంలో ఉండే పరమాత్మ).
పూషా= పూషుడు; జగత్తును పోషించువాడు కనుక ఇతడు పూషుడయ్యాడు. ఆశ్వయుజమాసానికి అధిపతి. ఈమాసంలో సూర్యుడు సశ్యవర్గాన్ని పోషిస్తాడు కాబట్టి పూషుడయ్యాడు.
గభస్తిమాన్=కిరణములు గలవాడు- దిక్కులను వెలిగింప జేసెడి కాంతి యనెడి లక్ష్మి కలవాడు సూర్యుడు కాబట్టి గభస్తిమాన్ అన్నారు.
సువర్ణసదృశః=బంగారంవంటి వాడు- మానవునకు ఆత్మ లాభమే (సువర్ణ నిధి)అన్నింటికి మిన్న. దానిని కలుగజేయు సూర్యభగవానుడు సువర్ణ సదృశుడు.
భానుః= ప్రకాశమునిచ్చు వాడయినందున భానుమూర్తి.
హిరణ్యరేతాః= బంగారము రేతస్సుగా గలవాడు- హిరణ్మయము ప్రజ్ఞారూపముగా గలవాడు కనుక హిరణ్యరేసుడయ్యాడు.
దివాకరః= పగటిని కలుగ చేయువాడు. సూర్యతేజస్సుతో అగ్నియొక్క ఉష్ణం కలియుటచేత పగలు ఏర్పడుతోంది.

ఓ సూర్యభగవానుడా! నీవాది దేవుడవు కనుక నిన్నాదిత్యుడందురు. జగత్తు నందు గల పా్రణులను వారివారి కర్మలందు ప్రవర్తంప చేస్తున్నందున సవితా అంటారు. నీ కిరణాలు ఎవ్వరూ చొరరాని చోట్లకు చొచ్చుకొని పోవడంవల్ల నిన్ను సూర్యడన్నారు. ఆకాశ మార్గంలోపయనిస్తావు కనుక ఖగుని గా, పా్రణులను పోషించే వాడవు కనుక పూషునిగా, కిరణాలవల్ల ప్రకాశిస్తావు కనుక గభస్తిమంతుడని, బంగారంవలే వెలుగుతావు కాబట్టి హిరణ్య రేతసుడవని పగటిని కలుగచేస్తావు కనుక దివాకరుడనీ పిలువ బడుతున్నావు.

రాబోయే మంత్రంలో ఆకుపచ్చని గుఱ్ఱాలపై వేవెలుగుల దొర రాజఠీవితో విహరిస్తాడుట.
8. ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

ఆదిత్య హృదయం 11శ్లోకం: మొదటి భాగం:

హరిదశ్వస్సహసా్రర్చి స్సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మధనశ్శంభు స్త్వష్టామార్తాండ అంశుమాన్!!

హరిదశ్వః= ఆకుపచ్చ రంగుగల గుఱ్ఱములు గలవాడు
సప్తసప్తిః= సప్తాశ్వములు వాహనముగా గలవాడు, ఆ ఆకుపచ్చని గుర్రములు ఏడు. వాని పేర్లు- జయము, అజయము, విజయము, జితపా్రణము, జితశ్రమము, మనోజవము, జితకో్రధము.  

-సప్త ఛందస్సులు రధరూపం ధరిస్తే ఆ ఛందోరధముపై నిత్యము గగన మార్గంలో సంచరిస్తున్నవాడు ఆ ఆదిత్యుడు.

సహసా్రర్చిః= వేయి కిరణములు కలవాడు(ఇక్కడ సహస్రం అంటే అనంత కోటి కిరణాలని చెప్పుకోవాలి) వాటిలో-ఏడు ముఖ్యమైన కిరణములు కలవాడు: సుషుమ్నా, సురాదనా, ఉదన్వసు-(సంయద్వసు),విశ్వకర్మా, ఉదావసు, విశ్వవ్యచా(అస్వరాట్), హరికేశ అనునవి. 

ఈ సూర్యకిరణముల పా్రశస్త్యం కొంచెం చూద్దాం.
1.సుషుమ్నా అనే కిరణం చందు్రణ్ణి రూప సంపన్నునిగా చేస్తూంటుందిట. సూర్యుని యొక్క ఈకిరణం చేత రూప సంపన్నుడైన చందు్రడు లోకానికంతకీ అమృతాన్ని పంచుతున్నాడు. 

ఇక్కడ విచిత్రమేమంటే స్వయంప్రకాశుడైన సూర్యభగవానుడు తన యొక్క ఒక్కొక్క కిరణంతో ఒక్కొక్క గ్రహాన్నిఆవిర్భవింపచేసి ప్రకాశించేట్లు చేస్తున్నాడు.

2. «సురాదనా» అనే కిరణం నుంచి చందు్రడావిర్భవించాడు. చందు్రని యొక్క చల్లని వెన్నెల, శీతల కిరణాలు కూడా పరావర్తనంచెందిన సూర్యకిరణాలే కదా!

3.«ఉదన్వసు» అనేకిరణం నుంచి కుజ గ్రహం ఆవిర్భవించింది. ఈ కుజ గ్రహం నుంచి వచ్చే కిరణాలు పా్రణులందరిలోనూ రక్త ప్రసారాన్ని కలుగ జేస్తాయి. పా్రణు లందర్నీ రక్త దోషముల నుండి రక్షించి వారికి ఆరోగ్యము, తేజస్సు ఐశ్వర్యములను వృద్ధి చేస్తాయి.

4.«విశ్వకర్మా» అనే కిరణం బుధగ్రహం ఆవిర్భావానికి కారణం. బుధగ్రహం మానవులకు శుభాన్నిస్తుంది. ఈ బుధ రశ్మి మానవుల మానసిక ఆందోళనను తొలగించి శాంతిని ప్రసాదిస్తుంది.

5. «ఉదావసు» అనే రశ్మి బృహస్పతి గ్రహాన్ని ప్రకాశించేట్లు చేస్తుంది. ఈ గురు రశ్మి పా్రణి మాతు్రలకు భోగ మోక్షాలను ప్రసాదిస్తుంది. ఈ రశ్మి ని సేవించడం వల్ల ప్రతికూల వాతావరణం తొలగి అనుకూల వాతావరణం కలుగుతుంది.

6. «విశ్వవ్యచా» అనే కిరణం నుంచి శుక్ర- శని గ్రహాలు ప్రకాశిస్తున్నాయి. శుక్రగ్రహం వీర్యానికి అధిష్ఠాన దేవత. మానవ జీవితం, జాతి అభివృద్ధి అవుతుంది. శనిగ్రహం మృత్యువునకు అధిష్ఠానము. అంటే మానవుల యొక్క జనన మరణాలు ఈ రశ్మి వల్లే జరుగుతాయి కాబట్టి ఈ రశ్మి సేవనం వల్ల మానవులకు పూర్ణాయువు కలుగుతుంది.

7. «హరికేశ» అనే రశ్మి వల్ల ఆకాశంలో ఉన్న నక్షతా్రలన్నీ వెలుగుతున్నాయి. ఈ భూమిమీద ఉన్న పా్రణుల శరీరాలనుండి బలము, వీర్యము, తేజస్సు నష్టము కాకుండా రక్షిస్తూంటాయి కాబట్టి వాటిని నక్షతా్రలన్నారు.

ఏ గ్రహం నుంచి ఏ సమయంలో రశ్ములను పొందగలమో, వాటి వల్ల మనకు ఏ ఏ లాభాలు కలుగుతాయో తెలిపే భాగం వేరే ఉంది.

అంతే కాకుండా ఈ సూర్యకాంతి లో ఏడువన్నెలున్నాయని మనకు తెలుసుకదా! వాటి గురించి తెలుసుకొందాం. 

ఆరవ మంత్రం లో «చిత్రందేవానాముదగాదనీకం» అనే ఋగ్వేదమంత్రం లో ఉదయించే సూర్యుని రూపాన్ని ఏంతో అందంగా వర్ణించేరని చెప్పుకొన్నాము. అదేమిటంటే ఉదయించే సూర్యకిరణాలలో రక్త శ్వేతాది సప్త వర్ణాలు నిగూఢంగా ఉండి దీప్తిమంతాలై లోకాలను ప్రకాశింప చేసే కిరణ సముదాయం మహాసైన్యంలా ఒక్కసారిగా చిత్రంగా ఉదయించిందని వర్ణిచారు.

ఆ సప్త వర్ణాలు ఎఱుపు, నీలము, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నారింజ, తెలుపు మరియు గులాబి. ఈ సప్త వర్ణాలే సూర్యుని సప్తాశ్వాలు అంటారు. ఈ ఏడు రంగులు వర్షాకాలంలో మేఘాలలో ఇంద్రధనస్సు గా కనపడుతోంది.

ఈసప్త వర్ణాలు సమస్త రోగ హరములంటారు. ఈ ఏడు రంగులతో చేసే వైద్యాన్ని «కో్రమోపతి» అంటారు. వచ్చే వారం ఆ వివరాలన్నీ సవివరంగా పరిశీలిద్దాం.

ఒక్కసారి మొదటి మంత్రం నుంచి ఇప్పటి వరకు అయిన మంతా్రలన్నీ అర్ధం తో సహా చదవమని నా విన్నపం.

.......సశేషం. 
8. ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

ఆదిత్య హృదయం 11శ్లోకం: రెండవ భాగం

హరిదశ్వస్సహసా్రర్చి స్సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మధనశ్శంభు స్త్వష్టామార్తాండ అంశుమాన్!!

కి్రతం వారం మనం సప్త కిరణాలగురించి తెలుసుకొన్నాం. సప్త వర్ణాల గురించి:
ఉదయాన్నే స్నానంచేసి సూర్యభగవానునికి అర్ఘ్యంఇవ్వాలనే నియమం ఉంది. ఒక నదిలో కాని చెఱువులో కాని స్నానం చేసి సూర్యునకెదురుగా నిలబడి అర్ఘ్యం ఇస్తాం. అప్పుడా జల ధార మీదుగా ప్రసరించే సూర్యకిరణాలు పరావర్తనం చెంది మన శరీరంపై ప్రసరించడం వల్ల మన శరీరంలోని రోగకరములైన కి్రములన్నీ నశిస్తాయి. అతే కాకుండా మన శరీరం పా్రణ శక్తి సంపన్న మవుతుంది.

అధర్వణ వేదం ఏమి చెబుతోందంటే
సూర్యముదయతాం హృద్యోతో హరిమాచతే!
గోరోహితస్య వర్ణేన తేనత్వా పరి దధ్మసి!!

పాండురోగం, హృదో్రగం(గుండెలలో మంట) సూర్యోదయ కాలమందు ఎఱ్ఱని కాంతిని(కిరణముల యొక్త రంగు చేత) సేవించుట వల్ల పూర్తిగా తొలగి పోయి ఆరోగ్యము కలుతోంది.

అధర్వణం ఇంకా ఏమి చెబుతోందంటే, 

ఎఱుపు రంగు కల సూర్యకిరణాలను సేవిస్తూ, ఎఱ్ఱని ఆవు యొక్క పాలు తాగుతూ వుంటే ఆయుష్షు పెరుగుతుంది. 

ఎఱుపు రంగు కిరణాలనుంచి సమస్త వ్యాధులు తగ్గుతాయి.
అందమైన రూపం కలుగుతుంది. ఆరోగ్యం వృద్ధి అవుతుంది.

ఈశ్లోకం మొదలులోనే హరిదశ్వ అంటూ ఆకుపచ్చని కిరణాలు కలిగిన సూర్యభగవానుడు మానవులందలి పాండురోగాన్ని(శరీరం పచ్చగా అయిపోవడం), హృదో్రగాన్ని పారదో్రలుతాడు అని చెబుతున్నారు.

పసుపు పచ్చకిరణాలవల్ల ఉదర సంబంధమైన రోగములు తగ్గుతాయి.

సూర్యునిలో ఉండే ఏడు రంగులను ఒక క్రమ పద్ధతి లో సేవించడం వల్ల మానవులకు ఉండే చాలా రోగాలు నివారింపబడతాయి.

ఈ చికిత్సలో ఉదాహరణకు, నీలిరంగు ఉపయోగించడం వల్ల జ్వరము, జిగట విరేచనములు, అతిసారము, శ్వాసకోశ వ్యాధులు, శిరోరోగము, మూత్ర రోగము, బోదకాలు మొదలయిన వ్యాధులు తగ్గుతున్నాయి.

రంగుల వరుస లో చివరిదైన గులాబి రంగు లో అల్టా్రవైలెట్ రేస్ ఉంటాయి. అవి తగినంత మోతాదు మించకుండా ఉండి మన చర్మము పై ప్రసరించినప్పుడు, చర్మము మధ్యగల పదార్ధము «డి» విటమిన్ను తయారు చేసుకొంటుంది. ఆ డి విటమిన్ మన శరీరానికి అవసరమైన «క్యాల్షియం» «ఫాస్పరస్» అనేవాటిని తయారుచేసుకొంటుంది. దీని ద్వారా ఎముకలు, దంతాలు పుష్టిని పొందుతాయి.

ప్రతి రంగులోను ఒక ప్రత్యేక గుణం ఉంది. మన శరీరంలో ప్రతి అవయవం లోనూ ఒక ప్రత్యేక రంగు ఉంది. ఉదాహరణకు, చర్మంలో -గోధుమ రంగు, తల వెంటు్రకలలో నలుపు రంగు, నేత్రగోళాలలో దంతములలో తెలుపు రంగు మొదలయినవి.

ఈ వర్ణ చికిత్సా సిద్ధాంతానుసారం, మన శరీరంలో నియమిత మోతాదులో ఉండవలసిన రంగులు తగ్గుట వలన మనకు అనారోగ్యం కలుగుతోంది అంటారు.  దీనికి దృష్టాంతము ఏమిటంటే రక్తాల్పత వల్ల ముఖం కాంతివిహీనం అవటం; నీలిరంగులో ఉన్నచో మిక్కిలి ఆరోగ్యం; ఎఱుపు రంగు లో ఉన్న ఉత్తేజవంతముగా ఉండుట మొదలయినవి. 

శరీర అనారోగ్యాన్ననుసరించి వైద్యుడు శరీరంలో ఏ రంగు తగ్గడంవల్ల ఆ అనారోగ్యం వచ్చిందో ఆరంగును శరీరంలో భర్తీ చేస్తాడు.   దీనికి పద్ధతి చాలా సులభం.
ఏరంగయితే తగ్గిందో ఆ రంగు సీసాలో స్వచ్ఛమైన నీరు పోసి సూర్యుని యందుకల వర్ణములను ఈ సీసాలగుండా జలములోకి ఆకర్షించి వానిని ఔషధ రూపంలో రోగులకు ఉపయోగిస్తారు.

సూర్యరశ్ములనుండి తైలమును, జలమును తయారు చేసుకొనే విధానం:
దీనికి చైత్రము నుండి జ్యేష్ఠము వరకు అనుకూలమైన కాలము. ఈ కాలంలోసూర్యకిరణాలు యధేష్టగా లభిస్తాయి కాబట్టి తైలం జలములను తయారు చేసుకోవచ్చు. ముందుగా తైలము: శిరోరోగములు తగ్గడానికి, తలలో చల్లదనాన్ని పెంచి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. 

విధానము: నీలి రంగు సీసా లో శుద్ధమైన నువ్వుల నూనె గాని కొబ్బరి నూనె గాని, బాదంనూనె గాని తీసుకోవాలి. సీసా మూతికి రెండంగుళాలు తక్కువగా ఉండేటట్లు పోసి ఒక కార్కును గాని, దూదిని గాని మూత పెట్టి  ఎండలో పెట్టాలి. దూది కనుక మూత లా వాడితే ప్రతి రోజూ మార్చి కొత్త దూది పెట్టాలి. ఈసీసాను నేల మీద ఉంచకూడదు. ఒక చెక్క పై పెట్టి ఎండ బాగా తగిలేచోట ఉదయం సుమారు పది గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఉంచాలి. ఈ సమయంలో ఆసీసాలమీద దేని నీడ పడకూడదు. సూర్యుడస్తమించడానికి ముందే ఆ సీసాలను ఏదయినా చెక్కబీరువా లో భద్ర పరచాలి. తిరిగి మరునాటి ఉదయం యధావిధి గా ఎండలో ఉంచాలి. అలా 90 రోజులు చేసిన తరువాత మనకు పరిపూర్ణమైన నీలి రంగు రశ్మి తో కూడిన తైలం తయారవుతుంది. దీనిని తలకు, మిగిలిన మెడభుజములు మొదలయిన అవయవాలకు వాడ వచ్చును. ఈనూనెను తిరిగి సూర్యరశ్మి సోకకుండా ఉంచుకోవాలి. అలాగె రాతి్ర కిటికీ ద్వారా చంద్ర కాంతి గాని నక్షత్ర కాంతిగాని ఈసీసాపై పడకుండా బద్రపరచు కొంటే నూనె యొక్క ఫలితాన్ని పూర్తిగా పొంద గలుగుతారు.

సూర్యరశ్మి తో కూడిన జలము: సర్వరోగ నివారిణి- తెల్లని సీసాలో తయారయిన జలాన్ని ప్రతిదినము ఉదయము, సాయంత్రము సేవించినట్లయితే శరీరాన్ని నిరోగంగా ఉంచుతుంది. శరీరంలో రంగుల సమతుల్యత కలుగుతుంది. మానసిక శరీరక శాంతి దొరుకుతుంది. తైలం అయితే 90 రోజుల ప్రయత్నమైతే జలానికి ఒక రోజే చాలు. ఒక రంగు సీసాలో తయారయిన జలం వెంటనే తెల్ల రంగు సీసా లోకి మార్చుకొని తరువాతి మూడురోజులు మాత్రము వాడ వచ్చును.

ఇక్కడ ఈ వివరాలు ఇవ్వడంలో ఉండే ఉద్దేశ్యం ఏమిటంటే, సూర్యరశ్ములతో చేసే వైద్య విధానం మన దేశం లో పూర్వ కాలంలో చాలా విరివిగా వాడుక లో ఉండేది అని చెప్పడానికి. ఈ విధానాన్ని ఎవరయినా సిద్ధహస్తులైన వైద్యులద్వారా ప్రయత్నంచడం మంచిది.
9. ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

ఆదిత్య హృదయం 11శ్లోకం: మూడవ భాగం

హరిదశ్వస్సహసా్రర్చి స్సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మధనశ్శంభు స్త్వష్టామార్తాండ అంశుమాన్!!

మరీచిమాన్= కిరణములు కల వాడు
మరీచి అంటే సుదర్శన చక్రం. అంతే కాకుండా శంఖ చక్ర గదా ధారిని మరీచిమంతుడు అంటారు. 

తిమిరోన్మధనః= చీకట్లను పెకలించు వాడవు- మా మనస్సులలోకి చొచ్చుకొని పోయే కిరణాలతో మా యందలి తమస్సును తొలగించ గల సమర్ధుడవు.

శంభుః= సుఖమును కలిగించు వాడు-ఇహ పర సుఖములనే కాక మోక్ష సుఖమును కూడా ప్రసాదించ గల సమర్ధుడవు.

త్వష్టా= సమస్త రూపములను తగ్గించు వాడవు.
మాఘమాసమునకు అధిపతియైన సూర్యనకు త్వష్ట అని పేరు. 

త్వష్ట అంటే శిల్పి అని అర్ధం. 

6వ పాఠంలో మనం త్వష్ట ప్రజాపతి సంజ్ఞా దేవినిచ్చి వివాహం చేసేడని ఆమె ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత సూర్యుని తేజస్సుకు తట్టుకోలేక తన స్తానం లో ఛాయాదేవి ని ఉంచి మేరు పర్వతపా్రంతానికి వెళ్ళిపోయిందని చెప్పుకున్నాముకదా!  

అసలు విషయం తెలిసేక సూర్యుడు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి మామా నీ కూతురు చేసిన పని న్యాయమా అని నిల దీస్తే నాయనా నీ తేజస్సుకు తట్టుకోలేక అల్లా చేసింది కానీ నీ మీద పే్రమ లేక కాదు అని ప్రభాకరుని యొక్కపదునైన అంచులను సాన బెట్టి 15% తేజస్సు తగ్గేట్లుగా చేస్తాడు. (అంటే మనం జిమ్ కి వెళ్ళి సిక్స్ పేక్ తెచ్చుకొన్నట్టు) అలా తగ్గించుకొన్న తేజస్సుతో సకల భువన మోహనాకారంతో అశ్వరూపంలో ఉన్న సంజ్ఞాదేవి ని మేరు పర్వతపా్రంతంలో అశ్వ రూపంతోనే జత గూడుతాడు. అప్పుడే అశ్వనీ దేవతల జననం జరుగుతుంది. ఆరూపంగా సూర్య భగవానుడు శిల్పి (త్వష్ట) అయ్యాడు. 

అలా తగ్గించిన సూర్యతేజస్సు తోవిష్ణుమూర్తికి విష్ణు చక్రం ఈశ్వరునికి తి్రశూలం, యమునకు యమదండం,కుమార స్వామికి శక్తా్యయుధమును నిర్మించి ఇచ్చేడు ఆదిత్యుడు.

మార్తాండః = మరణించిన అండము నుండి పుట్టిన వాడు- «మృతే అండో జాతో మార్తాండః» మార్తాండుడి కధ మార్కండేయ పురాణంలో ఈరకం గా ఉంది- దేవతలకు రాక్షసులకు ఒకప్పుడు జరిగిన యుద్ధంలో దేవతలు ఓడిపోతే దేవమాతయైన అదితి దేవతలవిజయం గురించి సూర్యారాధన చేసిందిట. సూర్యడామె భక్తికి మెచ్చి తన సహసా్రంశముతో ఆమె గర్భంలో చేరి ఆమె కుమారుడుగా అవతరిస్తానని వరమిచ్చేడు. వేయి కిరణాలతో సమా నమైన సుషుమ్నా కిరణాన్ని ఆమె గర్భంలో ప్రవేశ పెట్టేడు.
అదితి ఆ దివ్యగర్భాన్ని ధరించి గర్భస్త శిశువు మరింత శక్తి తో పుట్టడానికి చాందా్రయణ వ్రతాన్ని మొదలు పెట్టింది. ఆమె భర్త అయిన కశ్యప మహర్షి ఆగ్రహముతో « దేవీ నీవు నిత్యము నిరాహారివై యీ దివ్య గర్భమును మరణించునట్లు చేయుచున్నావు» అని తీవ్రముగా మందలించేడు. దానికి అదితి చాలా కోపముతో « నేనీ గర్భాన్ని నష్టం చేయటం లేదు, మరింత శక్తివంతమయి దివ్యతేజస్సు పొందడానికే యీ వ్రతాలు చేస్తున్నాను» అని ఆ దివ్య తేజో పుంజాన్ని బయటకు వదలి వేసింది. అప్పుడు ఆ అండము పద్మము యొక్క మొగ్గ లా ఉందిట. అప్పుడు కశ్యప ప్రజాపతి ఋదగ్వేదసూక్తముల స్తుతి చేయగా సూర్యభగవానుడు అచేతనంగాపడి ఉన్న ఆ అండములో ప్రవేశించి దానిని జీవింప చేయడం వల్ల మార్తాండుడయ్యాడు.

అంశుమాన్= కిరణములు కలవాడు. « మార్గశిరమాసానికి అధిపతి అయిన సూర్యునకు అంశుమంతుడని పేరు» సూర్యుడు తన వేడి రశ్ములతోమార్గశిరంలో ఉండే అధికమైన చలిని పోగొట్టేవాడని అర్ధం.

పచ్చని గుఱ్ఱములు గల్గి సహస్రకిరణములతో ఒప్పిన వాడు, సప్తనామక అశ్వములు కలవాడు, శంఖ చక్ర గదా పద్మములు ధరించువాడు, చీకటిని పోగొట్టువాడు, సుఖములను కల్గించువాడు, సమస్త రూపములను కృశింప చేయువాడు, మరణించిన అండమునుండి పుట్టిన వాడు ససప్త వర్ణముల కిరణములతోఒప్పు ఆసూర్యభగవానుడవు నీవు.
 
వచ్చే మంత్రంలో ఈసూర్యభగవానుడే శిశ్శిఋతువులో ఉండే చల్లదనాన్ని కలుగచేసేవాడు అని చెబుతున్నాడు అగస్త్యమహర్షి.
10.ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

ఆదిత్యహృదయం- 12 శ్లోకం

హిరణ్య గర్భశ్శిశిర స్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోదితేపుత్రఃశంఖశ్శిశిర నాశనః!!

హిరణ్య గర్భః= హిరణ్యము గర్భమున కలవాడు; 
«భగవతే హిరణ్య గర్భాయనమః» అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఆదిత్యహృదయ రహస్యమని చెబుతారు. 
సర్వ జగానికి హితాన్నికలిగించేరమణీయమైన మనస్సు కలవాడు కనక హిరణ్యగర్భుడయ్యాడు.
శిశిరః= చల్లనైన వాడు- సుఖస్వభావము కలవాడు
తపనః= తపింప చేయువాడు- వేడిని ఉత్పత్తి చేయువాడు.
భాస్కరః= ప్రకాశింప జేయువాడు-పగటిని కలుగచేయువాడు భాస్కరుడు.
రవిః= రవి- సమస్త జనుల చేత స్తుతింప బడేవాడు కాబట్టి రవి అయ్యాడు.
అగ్ని గర్భః=అగ్ని గర్భమునందు కలవాడు
అదితేఃపుత్రః= అదితికి పుతు్రడు
శంఖః= శంఖుడు-హృదయాకాశంలోసుఖాన్ని పొందిఉన్న వాళ్ళని శంఖుడు అంటారు.
శిశిర నాశనః= మంచును పోగొట్టి చల్లదనమును ఇచ్చువాడు
శిశిరమంటే -జాడ్యం- మందబుద్ధిని నశింపచేయువాడు కాబట్టి శిశిరనాశనుడయ్యాడు. కి్రతం మంత్రంలో తన వేడిరశ్ములతో శిశిరాన్ని(మంచును) కరిగిస్తున్నాడని  చెప్పుకొన్నాము కదా.

సూర్యోదయంతో మనస్సు ఆనందంతో పొంగుతుంది. ఆశాలతలు చిగురిస్తాయి. ప్రకృతంతా బంగారుకాంతితో పొంగిపొరలుతూంటుంది. శిశిరంలో ఉండే చల్లదనం మెత్తదనం సూర్యునివల్లే లభిస్తాయి. ఒకప్పుడు తేజస్సు నిచ్చే భాస్కరుడు మరొకప్పుడు చైతన్యాన్నిప్రసాదించి తేజస్సును వెదజల్లగలిగే రవి అవుతున్నాడు. సర్వజనులచేత స్తుతింపబడుతున్నాడు. అతని కడుపులో బంగారమున్నట్లే అగ్ని కూడా ఉంది. అదితి కి అల్లారు ముద్దు బిడ్డ కనుక అతను సంచరించిన ప్రదేశమంతా పవిత్రమవుతూ ఉంటుంది. సాయం సంధ్యాసమయానికి తనంత తానే శాంతుడయి ఆకాశానికి పావనత్వాన్ని ప్రసాదించే శంఖు డీతడే. మంచును హరించి మంచిని పెంచే మహనీయుడీ సూర్యభగవానుడే.

వచ్చే మంత్రంలో సూర్యభగవానుడు దక్షిణాయణంలో వింధ్యపర్వతమార్గంలో వేగంగా ప్రయాణిస్తాడని చెబుతున్నారు- చూద్దాం
11. ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః

ఆదిత్యహృదయం- 13 వ శ్లోకం

వ్యోమనాధస్తమోభేదీ ఋగ్యజుస్సామపారగః
ఘనవృష్టి రపాంమితో్ర వింధ్యవీధీప్లవంగమః!!

వ్యోమనాధః= ఆకాశానికి పతి
ఆకాశానికి అధిపతి అవడం వల్ల అతనికి వ్యోమనాధుడని పేర వచ్చింది.
తమోభేదీ= చీకటిని బోగొట్టువాడు
సూర్యుని పేరు వింటే చీకటి ఛిన్నా భిన్నమైపోతుందిట. సూర్యుని భక్తుడొకడు ఆదిత్యుని అష్టోత్తరశత నామములలో తిమిరారయేనమః అని పూజించేడుట. అది విన్న సూర్యుడు ఆచీకటి అనే శతృవు ఎలా ఉంటాడో చూడాలనే కుతూహలంతో రధమెక్కి చీకటి వైపు వేగంగా ఎంత ప్రయాణించినా ఆశతృవు కనపడ లేదు సరికదా చీకటిని చిలికి వెలుతురునిచ్చేవాడు కాబట్టి తమోభేదుడయ్యాడు.

ఋగ్యజుస్సామ పారగః= ఋగ్వేదము, యజుర్వేదము సామవేదము పూర్తిగా చూచిన వాడు- వేదాలను ముందుగా ఋజ్యగుస్సామ వేదాలుగా మూడు భాగాలుగానే చేసేరు. అధర్వణ వేదానికి వేద ప్రతిపత్తి చాలాకాలానికి గానీ ఇవ్వలేదుట. సూర్యమండలం త్రయీమయమని నారాయణోపనిషత్తు తెలుపుతోంది. యాజ్ఞవల్క్య మహర్షికి ప్రత్యేకించి శుక్ల యజుర్వేదాన్ని మిగిలిన వేదాలను నేర్పించిన వాడీ సూర్యుడు.

ఘనవృష్టిః= గొప్ప వర్షము నిచ్చువాడు- ద్వాదశాదిత్యులు సకాలంలో వర్షమును కలగ జేయుటవల్ల సర్వసస్యములు ఫలించి సర్వ పా్రణులు సుఖిస్తున్నారు.

అపాం మిత్రః=జలములకు మితు్రడు- ఈ ప్రకాశించే సూర్యుడు ఉదకములను ఆకర్షించే జగన్మోహనాకారుడు.

వింధ్యవీధీ ప్లవంగమః= దక్షిణాయనములో వింధ్యమార్గములో సంచరించువాడు- దక్షిణాయనం లో వింధ్య పర్వత పా్రంతంలో తెప్ప వలే వేగంగా సాగేవాడు కనుక వింధ్యవీధీ ప్లవంగముడయ్యాడు.

పా్రణాయామము ద్వారా పా్రణ శక్తిని ఉద్దీపన చేసి  వెన్నెముకను ఆధారముగా చేసుకొని సాగే నాడులద్వారా మూర్ధ్నమునందు ధారణ చేయ గలిగిన వాడు కాబట్టి ఆదిత్యుడు వింధ్యవీధీ ప్లవంగముడ య్యాడు. 
జ్యోతి దర్శనము ద్వారా మాత్రమే సమాధి స్తితికి తీసుకొని పోదగిన శక్తిని కలిగించెడి పరంధాముడీ సూర్య భగవానుడు. 

సాధన యొక్క చరమాంకం దక్షిణాయన పుణ్యకాలంలో ఫలించే దశకు వస్తుంది. ఉత్తరాయణంలో సాధన ఫలితాలు దొరుకుతాయి.

ఆకాశానికి అధిపతి అయిన వ్యోమనాధుడు చీకటిని చీల్చుకొని వేదత్రయీనాదాన్నిలోకాలకంతకూ వినిపిస్తూ మేఘాలను మెరిపిస్తూ వర్షాలను కురిపించే అపాంమితు్రడు.
వింధ్యవీధిలో వేగంగా పయనించి తనను సేవించేవారిని పరమపదానికి తీసుకొని పోగలిగిన శక్తిమంతుడు అని ఆ ఆదిత్యుని ప్రస్తుతిస్తున్నాడు అగస్త్య మహర్షి.

రాబోయే శ్లోకంలో ఈ ఆదిత్యునికి కోపం వస్తే కాలగ్ని వలె మండి పడతాడు. చతుర్విధ మృత్యువులతో సర్వాన్ని హరించే వాడే వృత్తాకార బింబము కల పింగళుడ ని చెబుతున్నారు
12. ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

ఆదిత్య హృదయం - 14వ శ్లోకం

ఆతపీమండలీ మృత్యుః  పింగళస్సర్వతాపనః
కవిర్విశ్వో మహా తేజాః  రక్త స్సర్వ భవోద్భవః!!

ఆతపీ= ఎండ కాయించు వాడు- యస్యజ్ఞానమయం తపః - అనే శృతి ఏమి చెబుతోందంటే పరిపూర్ణమైన జగన్నిర్మాణ సంకల్పము తో తపిస్తున్నవాడు కనుక ఆతపీ అన్నారు. 

మండలీ= వృత్తాకార బింబము కలవాడు- కిరణముల సమూహము తో వెలుగొందువాడు- సహస్ర విధములైన  కిరణములతో రంజిల్లువాడు;

మృత్యుః=మృత్యు స్వరూపుడు - మనం ఇంతకు ముందు కాలుడు అంటే కాల రూపంలో మన జీవితాలను హరిస్తున్నాడు అని చెప్పు కొన్నాము కదా!
ఈమృత్యువు ఉత్తమము, మధ్యమము, అధమము, అధమాధమము అని నాల్గు విధములుట.
1.అముమాహుః పరం మృత్యుం- ఈ ప్రత్యక్షంగా కనిపించే సూర్యుడే ఉత్తమమైన మృత్యువు- ఆరోగ్యంతో జీవిస్తున్నా బాల్యం, కౌమారం, యవ్వనము, వార్ధక్యం కాలంతోపాటు వచ్చి మనలను మరణం ద్వారా ఈభూగ్రహం నుంచి నిష్ర్కమించేటట్టు చేసే వాడు.
2.పవమానంతు మధ్యమం- వాయువు మధ్యమ మృత్యువు ఎలా అయ్యింది అంటే- ప్రతి పా్రణి ప్రతి దినం ఇన్ని శ్వాసలు తీసుకోవాలి అని నియమం(నియమిత శ్వాసలతో పరిమిత జీవితం)- కోపము, ఆవేదన, ధుఃఖము, ఉద్వేగము, ఈర్ష్య, అసూయ, ద్వేషం మొదలయిన సమయాలలో అవసరానికి మించి ఎక్కువ శ్వాసలు ఖర్చు చేస్తాము- అంత మొత్తంలో మన జీవిత ప్రమాణం తగ్గి పోతుంది.- ఇది మనచేతిలో ఉంది.  జపంలో శాంతిగతిలో ఎక్కువ సమయం సాగుతూ మన ఆవేశకావేశాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా మన జీవిత కాలాన్ని పదిలపరచుకోవచ్చు.
3.అగ్నిరేవావమో మృత్యుః- అగ్నిని అధమ మృత్యువు అన్నారు.- ఈ అగ్ని ఎవరంటే- అహం వైశ్వానరో భూత్వా పా్రణినాం దేహమాశి్రతః- ఙఠరాగ్ని రూపంలో మన శరీరంలో ఉండి మనం తిన్న ఆహారం పచనమయి రక్తముగా మారి శరీరానికి శక్తిని అందాన్ని ప్రకాశాన్ని ఇస్తూ మన నియమిత జీవన కాలాన్ని తగ్గ కుండా చూస్తుంది.  కానీ వేళ కాని వేళల్లో తినరానివి తింటూ అవసరానికి మించి భుజించడం వల్ల జీర్ణ శక్తి తగ్గి అజీర్ణ వ్యాధి ద్వారా మృత్యువు ను ఆహ్వానిస్తున్నాము.  నియమిత అహార సేవనం, ఔషధ శేవనం వల్ల ఈ మృత్యువును దూరముగా ఉంచొచ్చు కాబట్టి ఇది అధమ మృత్యువు.
4.చంద్రమాశ్చతురుచ్యతే- శోముడు(చందు్రడు) ఓషధీశుడైనందున జలస్వరూపుడై సశ్య రక్షణ కావిస్తూ ఉంటాడు. నియమిత కాలంలో ఋతువులు వాటి క్రమం తప్పనంత వరకూ అంతా సశ్యశ్యామలంగానే ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే ప్రజలు ఆహార కొరత వల్ల, ఓషధుల లేమి వల్ల అనారోగ్యంతో మృత్యువాత పడుతూంటారు,  కనుక చందు్రని నాల్గవ మృత్యువు అన్నారు.

పింగళః= తేనె వంటి పచ్చని రంగుతో వెలుగువాడు- పింగళా నాడి అంటే సూర్య నాడి. శ్వాస సూర్యనాడి లో ఉండగా చేసే ప్రాణాయామ ప్రకి్రయ మనలను సమాధి స్తితికి అతి శీ్రఘ్రంగా తీసుకొని పోతుంది.
(జపంలో కూర్చోగానే ఒకటి రెండుఉఛ్వాస నిశ్వాసాలతో మనలో సూర్యనాడి నడుస్తోందా చంద్రనాడి నడుస్తోందా అనే విషయం స్పష్ఠంగా తెలిసి పోతుంది.  అది సూర్యనాడి అని నిర్ణయమవగానే ఆరోజు మధ్యగతి ఎక్కువగా చేసినట్లయితే శరీరంలో ఉష్ణశక్తి అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. పా్రణ శక్తి ఉరకలు వేస్తూ సహసా్రరంవేపు దూసుకొని పోతుంది. ఈ విధంగా జరిగిన రోజు పరమానందమైన శాంతి ని సాధకుడు అనుభవిస్తాడు.)
సర్వ తాపనః= అందరినీ తపింప చేయువాడు- సమస్త బ్రహ్మాండములను ఒకేసారి సంహరింప గలిగిన వాడు.
కవిః= విద్వాంసుడు- సకల వేద పారంగతుడు- తన కిరణ సమూహాన్ని ప్రసరింప చేయడం ద్వారా ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క గుణముతో రంజిల్లేట్టు గా సృష్టి చేస్తున్న ఆదిత్యుణ్ణి కవి అనే కదా మనం పిలవాలి.
విశ్వః=ప్రపంచ స్వరూపుడు- విశ్వమే తన రూపం గా గలవాడు.
మహా తేజాః= గొప్ప తేజశ్శాలి- పరాక్రమ శాలి.
రక్తః= ఎఱ్ఱని వర్ణము కలవాడు-సూర్య ధ్యానం లో -రక్త వర్ణం రక్త గంధం రక్త పుష్పం రక్త మాల్యాంబరధరం-అని పా్రర్ధిస్తారు. అందరి యందు అనురాగము కలవాడు.
సర్వ భవోద్భవః= సమస్త కార్యముల యొక్క ఉత్పత్తికి కారణమైనవాడు.

సూర్య మండలానికి ప్రభువైన ఆ ఆదిత్యుడు అప్పుడప్పుడు కాలాగ్ని వలె మండి పడినా ఉదయ సమయాన పింగళుడై ప్రజలకు పా్రణాలను పోస్తాడు, అవసరమైనప్పుడు పా్రణులందరనూ తపింప జేస్తాడు. వృత్తాకార బింబముతో సహసా్రధిక కిరణ సమూహంతో నూతనంగా గ్రహాలనే సృష్టించ గలిగే ఈ కవి యొక్క దివ్య తేజస్సులో రంజిల్లని భువనము భావనము లేవి ఉంటాయి చెప్పండి.

వచ్చే మంత్రంలో కదిలే గ్రహాలకు కదలుతున్నట్టు కడా కనపడని సుదూర నక్షతా్రలకు ప్రభువైన ఈ ఆదిత్యుడు ద్వాదశ విశ్వాలలో ఉండే సూర్యులందరిలోనూ ఆది సూర్యుడు అని ఆ  ద్వాదశాత్మునకు నమస్కు్రతులుతో  స్తుతి భాగం ముగుస్తుంది.
13. ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః 

ఆదిత్యహృదయం 15వ శ్లోకము.

నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఁస్తుతే!!

నక్షత్ర= అశ్వనీ మొదలగు నక్షత్రములకు
గ్రహ= చంద్రుడు మొదలగు గ్రహములకు
తారాణాం= సుదూర నక్షత్రములకు
అధిపః=ప్రభువును
విశ్వభావనః=విశ్వ స్తితికి మూలమైనవాడు
తేజసామపి= తేజస్సు కలవానికి కూడ-సహస్ర సూర్యులు ఉన్నారు అని అరుణం లో కూడా వివరించేరు. కాని వారికి భూమి లాంటి గ్రహాన్ని సృష్ఠి చేయగలిగిన శక్తి లేకపోవడం వల్ల ఆసూర్యులందరిలోకి మన ఆదిత్యుడే అథిక తేజస్సు కలవాడయ్యాడు.
తేజస్వీ= గొప్ప తేజస్సు కలవాడవగు
ద్వాదశాత్మన్= పన్నెండు మూర్తులు గల సూర్యభగవానుడవు.- ద్వాదశ సూర్యులు-ఇంద్రుడు(మన ఇంద్ర పదవిలోఉన్న ఇంద్రుడు కాదు, ఈతడు ఆదిత్య నామము వాడు); ధాత; భగుడు; పూషుడు; మితృడు; వరుణుడు; ఆర్యముడు; అంశుమంతుడు; వివస్వంతుడు; త్వష్ట; సవిత; విష్ణువు (ఈవిష్ణువు త్రిమూర్తుల లో విష్ణువు వేరు) ధాత అంటే వ్రజావతి; భగుడు అంటే మానవుల లో ఉండే వంటివాడు; పూషుడు- అన్న రూపంలోప్రజాపోషణ చేయువాడు; మితృడు- లోకములకెల్ల మైత్రి గలుపువాడు; వరుణుడు
- వర్షమునిచ్చువాడు; ఆర్యముడు- వాయు రూపములో దేవతల లో ఉండేటటువంటివాడు; అంశుమంతుడు- వాయురూపంలో మానవులందరనూ రక్షించువాడు; వివస్వంతుడు- అగ్ని రూపంలో మనం తినే ఆహారాన్ని పచనము చేయువాడు;త్వష్ట-శిల్పి,కవి,

ఈ ద్వాదశాదిత్యులు పన్నెండు మాసాలకు అధిపతులయి . ఈ భూగ్రహానికి, ఈ విశ్వానికి రక్షణకై ఒక్కొక్క ఆదిత్యుడు ఒక్కొక్క కార్యాన్ని చేస్తు.న్నారుట.

సూర్యుని ద్వాదశ మూర్తులతో పాటు, ద్వాదశ కళలను తెలుసుకొందాం. 
తపనీ,తాపిని, ధూమ్రా, మరీచి, జ్వాలిని, రుచి, సుధూమ్రా( సుషుమ్నా), భోగదా, విశ్వా, బోధిని, ధారిణి, క్షమా, అనే ద్వాదశ కళలు.

సాధనలో జ్యోతి దర్శనం చేసుకొన్న సాధకుడు సూర్యభగవానుని ద్వాదశ ఆదిత్యులనుండి ద్వాదశ కళల తేజస్సు పొంది స్వీయతేజస్సుగా ప్రకాశిస్తాడు అని అరుణం చెబుతోంది.
తే= నీకు
నమః= నమస్కారము
అస్తు= అగుగాక

సూర్యుని చుట్టూ తిరుగుతున్న నవ గ్రహాలకు అశ్వని మొదలైన ఇరువదిఏడు పనక్షత్రాలకు కదులుతున్నట్టుగా కూడా కనపడని సుదూర నక్షత్రాలకు ఆదిత్యుడే అందరి ప్రభువు. సమస్త లోకములకు ఏకైక తేజోమూర్తి అయిన ద్వాదశ కళాయుక్తుడైన ఆదిత్యునకు నమస్కరించుచున్నాను.

వచ్చే మంత్రం నుంచి నమకం ప్రారంభమౌతుంది. 

14. ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః 

ఆదిత్యహృదయం 16వ శ్లోకం.

నమః పూర్వాయగిరయే పశ్చిమేగిరయేనమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయేనమః!!

పూర్వాయ= తూర్పు దిక్కులో ఉన్న 
గిరయే= పర్వతమునకు
నమః= నమస్కారము
పశ్చిమే= పడమరలో ఉన్న
గిరయే= పర్వతానికి
నమః= నమస్కారము
జ్యోతిర్గణానాం= తేజస్సమూహములకు
పతయే= ప్రభువైన నీకు
నమః= నమస్కారము
దినాధిపతయే= పగటి పూటకు అధిపతియైన ఆ సూర్యునకు
నమః= నమస్కృతులు.

తూర్పు దిక్కున ఉదయాద్రిపై ఉదయించి పడమట దిక్కున పశ్చిమాద్రి యందస్తమిస్తూండడం వల్ల ఉదయాద్రి పశ్చిమాద్రి వందనీయాలయ్యాయి. వెలుతురు కే వేలుపై, జ్యోతిర్గణాల తేజస్సు కే కారణభూతుడవైన ఓ వేవెలుగుల దొరా ఆదిత్యా నీకు ఇవే మా నమస్కారములు.

ఆదిత్య హృదయం 17వ శ్లోకం.

జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమోనమః
నమో నమస్సహస్రాంశో
ఆదిత్యాయ నమోనమః!!

జయాయ= సర్వకాల సర్వావస్తలలోనూ జయమును కలుగ జేయు 
నమః= నమస్కారము. 
జయభద్రాయ= జయమును మంగళమును ఇచ్చు ఆ సూర్యునకు- ఉపాసకుల రోగములను పాపములను నశింపజేసి కల్యాణమును ఇచ్చు వాడైనందున జయభద్రుడయ్యాడు.
నమః= నమస్కారము. 
హర్యశ్వాయ = పసుపు పచ్చ ని గుఱ్ఱాలుగలవాడైన సూర్యునకు కొరకు
నమోనమః = కోటి కోటి నమస్కారములు. 
సహస్రాంశో = వేయి కిరణములు కలిగిన ఓ అపాంమితృడా
ఆదిత్యాయ= దేవతలగెలుపునకై అదితిచే ప్రేరేపింప బడి ఆమెకు పుతృనిగా జన్మ మెత్తిన ఆదిత్యుడా
నమోనమః= నీకు సహస్రాధిక నమస్కృతులు.

అప్రతిహత పరాక్రమముతో ఎదురు లేని వీరుడవై నిన్ను ఉపాసనతో కొలిచే వారికి కొంగు బంగారమై హరిత అశ్వాలతో కూర్చ బడిన రధములో సహస్ర, శతసహస్రాధిక కిరణాలతో వెలుగొందుతూ ఆకాశవీధిలో అలరారుతున్న ఓ ఆదిత్యా నీకు
కోటానుకోట్ల నమస్కృతులయ్యా స్వామీ!

రాబోయే శ్లోకాలలో వీరుడు, ఉగ్రుడు, సారంగుడు మరియు త్రిమూర్తులయొక్క స్వరూపమై సర్వ పాపములను హరించగలిగిన శక్తిమంతుడా అని కీర్తిస్తూ చెబుతున్నారు.
15. ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః 

ఆదిత్యహృదయం 18వ శ్లోకం

నమఉగ్రాయ వీరాయ సారంగాయ నమోనమః 
నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమోస్తుతే!!

ఉగ్రాయ = క్రోధమూర్తి కి,ఇంద్రియములను పనచేసేటట్లు జేయగలిగిన స్వతంత్రుడు,
నమః= నమస్కారము
వీరాయ= వీరుని కొరకు, ప్రాణులను వివిధ రకములుగా ప్రేరణ చేసి చలించేటట్లు జేయువాడు, 
నమః= నమస్కారము
సారంగాయ= వేగంగా ప్రయాణము చేయు సూర్యునకు,  (ఏకేన నిమిషార్ధేన శతే ద్వేద్వేచ యోజనే- అర్ధ నిముషంలో రెండువేల రెండు వందల రెండు యోజనముల దూరము ప్రయాణము చేయగలిగిన వాడు కనుక సారంగుడు అయ్యాడు)సారమును గ్రహించేవాడు అయినందున సారంగుడు,
నమః= నమస్కారము
పద్మప్రబోధాయ = తామర పూలను వికసింపజేయు, మనలోని హృదయకమలాన్ని వికసింపచేసేవాడైన ఆ ఆదిత్యునికి,
నమః= నమస్కారము
ప్రచండాయ= సర్వ సమర్ధుడవైన, -లయమైన బ్రహ్మాండమును పునః సృష్టించి ఉద్భవించువాడు.
తే= నీకు
నమః= నమస్కారము

దుష్టులకు ఉగ్రుడు, శిష్టులకు ఉత్తేజకుడు,వీరుడైన ఉగ్రమూర్తికి నమస్కారము. మహా వేగము కలవాడును, ముకుళిత కమలాలను (బుద్ధిని)తన ఉదయ కిరణ స్పర్శ చేత వికసింపజేయు చిన్మయమూర్తికి నమస్కారము. ఈ బ్రహ్మాండమును పునః సృష్టించ కలిగిన సర్వ సమర్ధుడైన ఆ ప్రచండ భానునకు నమస్కారము.

ఆదిత్య హృదయం 19వ శ్లోకము:

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే
భాస్వతే సర్వభక్షాయ 
రౌద్రాయ వపుషేనమః!!

బ్రహ్మ= బ్రహ్మకు
ఈశాన= ఈశ్వరునకును
అచ్యుత= విష్ణుమూర్తికి
ఈశాయ= ప్రభువైనవాడు
ఆదిత్యవర్చసే= ఆదిత్యరూపమైన వర్చస్సుతో
భాస్వతే= ప్రకాశించెడివాడు
సర్వభక్షాయ= సమస్త విషయములను భక్షించు వాడు
రౌద్రాయ= భయంకరమైన(రాగ ద్వేషములు, దుఃఖములకు ఆలవాలమైన అజ్ఞానాన్ని నసింప జేయగలిగిన)
వపుషే= దేహముగల(నృశింహమూర్తి)
సూర్యాయ= సూర్యునికి
నమః= నమస్కారము.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతి రూపమైన సూరనార్యునకు నమస్కారము. ఎంత ప్రసరించినా తరుగని కాంతితో ప్రకాశించే జ్యోతిరాదిత్యునకు నమస్కారము. భగ భగ మండే ప్రచండ కిరణాలతో ఇది భక్షింప దగినది, ఇది రక్షింపదగినదనే బేధము లేకుండా సర్వాన్ని హరించగలిగిన, రాగద్వేషములు దుఃఖములకు ఆలవాలమైన అజ్ఞానాన్ని భస్మీపటలం చేయగలిగిన రౌద్రమైన దేహాన్ని ధరించిన ఆ సూర్యభగవానులకు అనంతానంత నమస్కారములు.
16. ఓం శ్రీఆదిదేవాయ అచ్యుతాయనమః

ఆదిత్య హృదయం 20 వ శ్లోకం

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయేనమః।।

తమోఘ్నాయ = చీకటిని నశింప జేయువాడు-అందరి తమస్సు, అజ్ఞానములు ఎవరి జ్ఞానము ద్వారా నిర్మూలింప బడి అందరికి జ్ఞానోదయమై సమ్యక్ దృష్టి అలవడుతుందో ఆ జ్ఞాన స్వరూపుడే సూర్యభగవానుడు.

హిమఘ్నాయ = మంచును, జడత్వాన్ని పోగొట్టువాడు,'

శతృఘ్నాయ= శతృవులను (మనలో ఉండే అరిషడ్వర్గా లను) సంహరించుటకు భయంకర రూపాన్ని ధరించిన వాడు- ఇక్కడ హిరణ్య కశిపుని సంహరించడానికి సభా స్తంభమునుండి అవతారమెత్తిన నృసింహావతారాన్ని తెలుపుతున్నారా అనిపిస్తూంది.

అమితాత్మనే= సర్వవ్యాపకుడును- సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేని వాడే సర్వ వ్యాపకుడు- అమితాత్ముడు,

కృతఘ్నఘ్నాయ = చేసిన మేలును మఱచు వారిని చంపు వాడు,

మానవుడు దేవుడికి చేసే కృతఘ్నత ఏమిటి? అంటే

"కుర్వన్నే వేహకర్మాణి జిజీవిశేత్ శతం సమాః" -శాస్త్ర విహితములైన స్థూల, సూక్ష్మ కర్మలు(ప్రణవోపాసన, యోగాభ్యాసం సూక్ష్మ కర్మలయితే స్ధూల కర్మలు భౌతిక జీవితానికి సంబంధించినవి) చేస్తూ నూరు సంవత్సరములు జీవించి
( శ్రీ యోగి అచ్యుతుల భాషలో నూట ఇరవై సంవత్సరాలు-అంటే రెండు ఆ వృత్తాలు- అరవై సంవత్సరాలు ఈ విశ్వానికి ఒక పరిభ్రమణ అయితే రెండవ పరిభ్రమణం లో మానవుని లో పరిపూర్ణత ఏర్పడి పునర్జన్మ లేని వాడవుతాడు)
ఆదిభౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అనుభవాలను పొందుతూ అనంత సిద్ధుల ద్వారా ప్రకృతితో తాదాత్మ్యం చెందమని, ఈ జీవితాన్ని ప్రసాదించాడు ఆ భగవంతుడు.

కాని మనం అజ్ఞానం తో కర్మ భ్రష్టత్వం చెంది ప్రాణుని యొక్క ఉనికినే తెలుసుకోలేని స్తితి లోకి జారుకోవడాన్నే కృతఘ్నత అంటారు.

అటువంటి అనాత్మ స్తితి లో ఉన్న ప్రాణులు ఆదిత్యుని యొక్క కృపను అందుకొని లాభం పొందలేక మరణిస్తున్నారు.

కర్మణైవహి సంసిద్ధిమ్ ఆస్ధితా జనకాదయః- ఆసక్తి రహితముగా శాస్త్ర విహితమైన కర్మలనాచరించుట వలననే జనకుడు మొదలగు(జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు) జ్ఞానులు పరమసిద్ధిని పొందేరు.

దేవాయ= తనంతట తానే ప్రకాశించు వాడయిన, జ్యోతిషాం= వెలుగులకు- అవినాశి యగు తేజస్సును, ఓజస్సును వెదజల్లు తున్న,
పతయే= ప్రభువుకు,
నమః= నమస్కారము.

తమస్సనెడి చీకటిని నశింపజేసి, జడత్వమనెడి మంచును విడదీసి, అజ్ఞానమును జ్ఞానము ద్వారా నిర్మూలించే జ్ఞాన భాస్కరునకు నమస్కారము.

అరిషడ్వర్గాలను నశింపజేసి సర్వాత్మకత్వాన్ని కలుగజేసి ఈ మనుష్యకోటికి దైవత్వాన్ని ప్రసాదించేందుకు కంకణం కట్టుకొన్న ఆ ఆది దేవునకు నమస్కారములు.

వెలుగులకే వెలుగై, అవినాశియై, ఓజస్సు, తేజస్సులను వెదజల్లుతున్న ఆ అమితాత్మునకు, సర్వ వ్యాపకునకు ఆ జ్యోతిర్మయునకు నమస్సుమాంజలులు.

10వ మంత్రం నుంచి మొదలయిన ద్వాదశాదిత్యుల స్తోత్రం రాబోయే 21 వ మంత్రంతో పూర్తవుతుంది.

రాబోయే శ్లోకంలో -సర్వ కర్మలకు కారణభూతుడైన అగ్ని స్వరూపుడు, అపరంజి వర్ణము కలిగి అంధకారమును పటాపంచలు చేయగలిగిన వాడు, విశ్వమునకే దర్పణమై సర్వమునకు సాక్షీభూతమైన ఆదిత్యునకు నమస్కృతులు చెబుతున్నారు అగస్త్యులు.
17. ఓం శ్రీఆదిదేవాయ అచ్యుతాయనమః

ఆదిత్యహృదయం - 21 శ్లోకం
Adityahridayam -21st sloka

తప్త చామీకరాభాయ
వహ్నయే విశ్వకర్మణే!
నమస్తమోఽభినిఘ్నాయ
రుచయే లోక సాక్షిణే ।।

Tapta chameeka rabhaya
Vahnaye viswakarmane!
namastamo bhinighnaya
Ruchaye Lola sakshne !!

తప్త చామీకరాభాయ = కాచిన బంగారం వంటి కాంతి తో కళకళలాడుతూ మానవుల అజ్ఞానాన్ని పోగొట్టు చున్నాడు,

Tapta chameeka rabhaya-
shining in the melted and boiling gold color, Aditya is removing ignorance (ajnaana)of the entire mankind.

వహ్నయే = అగ్ని స్వరూపుడు-హవిస్సును మోయువాడు; వహతి హవ్యమితి వహ్నిః- అగ్ని రూపముతో హవిస్సును దేవతల భాగములను వారికి అందజేయు వాడు;

Vahnaye-
the very word Vahni denotes that he is not simply burning every thing into ashes but the energy developed in the burning will be delivered to the devatas.(brahmedrias, and karmendrias)

విశ్వకర్మణే= జగత్కర్తయు, సర్వ కర్మలకు కర్త (కారణభూతుడు)అయిన వాడు,
Viswakarmane-
One who designed the entire universe and the one who is responsible for the entire activity;
తమోఽభినిఘ్నాయ= ప్రపంచములో ఉండే చీకటిని నశింప జేయువాడు,
Tamobhinighnaya-
he, who can remove the entire darkness on the surface of the world with his enormous lighting;
హృదయ కుహరములో ఉండే అజ్ఞానాన్ని తొలగించువాడు, సంసార సాగరంలో ఉండే దుఃఖములను ఉపశమింప చేయువాడు,
The rays of Jnana will eradicate the Misconceptions, indifferences, misunderstandings in the heart of hearts and the miseries in the daily life.
రుచయే= కాంతి స్వరూపుడును,
Ruchaye-
Embodiment of lighting;
లోక సాక్షిణే=లోక సాక్షియైన ఆదిత్యునకు,
లోక్యత ఇతి లోకః- చూడబడేది కాబట్టి లోకము అన్నారు. జనులకు అంతర్యామి గా ఉండి వారియొక్క ప్రతి కదలికను సాక్షియై చూచేవాడు. అంతేకాదుట- చూడడం అనేది కళ్ళ యొక్క స్వభావము కనుక ప్రపంచంలోని ప్రాణుల కళ్ళకు ప్రకాశాన్నిచ్చే వాడవడం వల్ల జగచ్చక్షు వయ్యాడు.
Lokasakshine-
He, who is the only direct witness in the universe because he is the only God who grants vision to the naked eye through his Ray's of light.
నమః= నమస్కారము.
Namah-
Salutations to you o my lord.

కాచిన బంగారం లాగ కళ కళలాడుతూ జగత్తు లో సర్వ కర్మలకు కారణభూతుడైన అగ్ని స్వరూపునకు నమస్కారము.
Gold will loose its lust when you shower your kindness on the entire world. when you become the cause where will be the shape for fire oh lord these are our salutations to you.

అపరంజి వర్ణము కలిగి అంధకారమును పటాపంచలు చేయగలిగిన కాంతి స్వరూపునకు జోహార్లు.
Where will be the darkness in the universe when you take over the east with golden coloured sahsra Aruna kiranalu. We bow down before you with gratitude.
విశ్వమునకే దర్పణమై సర్వమునకు సాక్షీభూతమైన జగచ్చక్షు వైన ఆ ఆదిత్యునకు మనఃపూర్వక నమస్కృతులు.
Oh aditya! None but you who can become the witness to the entire activity of humankind, it will not be an exaggeration if we say that you are the God almighty.
సకల కార్య దక్షు డైన ఆ విశ్వకర్మకు నా నమస్కారములు.
Salutations to thee oh! Omnipotent, the creator of the universe.

ఈ శ్లోకంతో నమకం పూర్తిఅయింది.
With this mantra namakam part of adityahridayam completed.
ఈ ద్వాదశాదిత్యుల లో, నవగ్రహాలతో కూడుకొని మహోత్కృష్టమైనటువంటి మానవజాతి ని ఉద్భవింపజేసిన ఆదిత్యుడే కొనియాడ దగినవాడు అంటున్నాడు అగస్త్య మహర్షి.
In the last twelve slokas, the twelve Suns of twelve universes were described. Sri. Agustya mahrshi says further that with the creation of nine planets along with the earth, the combination of life on Earth and creation of mankind here aditya of this universe is great among all the twelve universes.
రాబోయే 22,23,24 మంత్రాలు లో సూర్య భగవానుని సర్వ వ్యాపకత్వాన్ని, మహిమను మరొక్క సారి వర్ణించేరు అగస్త్యులు.
In the coming 22,23,24 mantras sage Agustya once again praised the aditya's multi faceted greatness.
18 . ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

ఆదిత్య హృదయం. 22 వ శ్లోకం.

నాశయత్యేష వైభూతం
తదేవ సృజతి ప్రభుః ।
పాయత్యేష తపత్యేష
వర్షత్యేష గభస్తిభిః ।।

ప్రభుః - పరిపాలకుడు నిగ్రహానుగ్రహ సమర్ధుడు.
ఏషః-ఇతడే -ఈ ఆదిత్యుడే
భూతం- ప్రాణి కోటిని
నాశయతి- నశింప జేయు చున్నాడు.కాల రూపేణ,
తదేవ- ఆ ప్రాణి కోటిని
సృజతి- తిరిగి సృష్టి చేస్తున్నాడు.
ఏషః- ఇతడే
గభస్తిభిః- కిరణముల చేత
పాయతి- రక్షించు చున్నాడు.
ఏషః- ఇతడే
తపతి- ఎండలు కాయించుచున్నాడు.
ఏషః- ఇతడే
వర్షతి- వర్షములను ఇచ్చుచున్నాడు.
సృష్టి స్తితి లయ కారకుడు ఈ ఆదిత్యుడు.

ఇతడే కాలుని రూపంలో(కాలం) సృష్టించ బడిన ప్రతి ప్రాణికి లయ కారకుడు.

తన కిరణ తాపాలతో పునః సృష్టించి రక్షించేదీ ఇతడే.

ఎండలు కాయించువాడు ఇతడే వర్షాలను అనుగ్రహించేది కూడా ఈ ఆదిత్యుడే.

నిగ్రహానుగ్రహ సమర్ధుడు ప్రభువు కాక మరెవరవుతారు.

వచ్చే మంత్రంలో అగస్త్య మహర్షి త్రేతాగ్నులను విశదీకరిస్తున్నారు.
19.ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః

ఆదిత్య హృదయం 23 వ శ్లోకం

ఏష సుప్తేషు జాగర్తి

భూతేషు పరినిష్ఠితః

ఏష ఏవాగ్నిహోత్రంచ

ఫలంచైవాగ్ని హోత్రిణాం।।
ఏషః=ఈ ఆదిత్యుడే

భూతేషు= ప్రాణులు

సుప్తేషు= నిదురించు చుండగా

జాగర్తి= మేలుకొని యుండును.

అగ్నిహోత్రంచ= త్రేతాగ్ని స్వరూపుడు

అగ్నిహోత్రం అంటే- దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము లకు త్రేతాగ్నులని పేరు. ఈ అగ్నులను నిత్యము ప్రాతఃకాలము, సాయంత్రము శ్రద్ధగా ఆరాధించడాన్నే అగ్నిహోత్రం అంటారు.

ఏషః= ఇతడే

అగ్నిహోత్రాణాం = అగ్ని హోత్రమును అనుష్ఠించువారైన దీక్షితులకు కలిగెడి

ఫలంచ= ఫలస్వరూపము గూడ

ఏష ఏవ= ఇతడే
సూర్యుడస్త మించేప్పుడు, సూర్యుని తేజస్సు అగ్నిలో ప్రవేశిస్తోంది. అందువల్ల రాత్రులు అగ్ని సాయంతో చూడగలుగు తున్నాము.
అల్లాగే సూర్య తేజస్సు తో అగ్ని యొక్క ఉష్ణం కలుయడం వల్ల పగటి ఎండలో తీక్షణత ఏర్పడుతోంది.
మనము నిద్ర పోతున్నప్పుడు కూడా ఈ సూర్యుడు మనలో అంతర్యామిగా (అహం వైశ్వానరో భూత్వా) సర్వకాల సర్వావస్తలలోనూ మనకు తోడుగా మేలుకొని ఉంటాడు.
దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము అను మూడు అగ్నులకు త్రేతాగ్నులని పేరు. ఈ త్రేతాగ్నులను శ్రద్ధగాను నిష్కామం గాను ఆరాధించే వారికి సర్వ సంపదలు, స్వర్గ ఫలం, మోక్షం సిద్ధిస్తాయని వేదమాత చెబుతూంది.
అంటే సూర్యభగవానుని ప్రత్యక్ష రూపమైన త్రేతాగ్నులను ఆరాధించే వారికి సూర్యభగవానుడే (జ్యోతి స్వరూపంలో) ఫలస్వరూపము గా దొరుకుతాడు అని ఆదిత్య హృదయం ఘోషిస్తోంది.
ఇక్కడ త్రేతాగ్నులను వివరించేరు.
ఆహవనీయము అనే అగ్నిని గురువు అంటారు. మన శరీరంలో ఉండే వైశ్వానరాగ్నిని వృద్ధి చేసుకొని అశనోత్పత్తి చేసుకొనేటందుకు ఉపయోగపడుతుంది.
గార్హపత్యము (పిత) అంటే గృహస్తాశ్రమంలో ఉంటూ గృహస్త ధర్మాలను పాటిస్తూ ప్రతి దినము గృహస్తు అనుష్టింప వలసిన అగ్ని కార్యం-
ప్రతిదినము మనం చేసే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా జనించిన ఉష్ణశక్తి (అశనము), దీనినే మరొక మాటలో చెప్పాలంటే గృహస్తు తన స్వధర్మం (ప్రాణాయామము)తో జనింప చేసుకొనే తేజోబలం. దీని నుంచి తేజస్సు ద్విగుణీకృతమవుతుంది.
దక్షిణాగ్ని (మాత) యజ్ఞహవిస్సులను పితృదేవతలకు, ఇతర దేవతలకు (ఇంద్రియాలకు) అంద చేసే అగ్ని అన్నమాట. చితి మంటగా దేహాల్ని దహించి వేసే చరమ అగ్ని.
నిత్యాగ్నిహోత్రులైన వాళ్ళు ఈ అగ్నిని అరణుల (అగ్నిని రాపాడించే కర్రలు) రాపిడి ద్వారా ప్రజ్వలింప జేస్తారు.
మనం చేసే ప్రాణ యజ్ఞం లో
ఆత్మానమరణిం కృత్వా

ప్రణవంచోత్తరారణిం

జ్ఞాన నిర్మధ నాభ్యాసా

త్వాశం దహతి పండితః।।
ఆత్మను (ఇక్కడ మనస్సు)అధరారణి గాను, ప్రణవాన్ని ఉత్తరారణి గాను చేసుకొని విచారణ అనే మథనం చేస్తే జ్ఞానమనే అగ్ని పుడుతుంది. దాని వల్ల తాను వేరు వస్తువు వేరు అనే అజ్ఞాన పాశం దహింప బడి తను తాను గా మిగులుతాడు. అదే ముక్తి అదే మోక్షం.
వచ్చే శ్లోకం తో ఆదిత్య హృదయం పూర్తి అవుతుంది. మిగిలిన ఆరు శ్లోకాలు ఫల శృతి మొదలైన విషయాలను చెబుతాయి
ఈ చివరి మహిమా మంత్రం లో వేదాలు, క్రతువులు, ప్రాణ యజ్ఞాలు మొదలయిన సమస్త కృత్యాల కు ఫలము ఈ ఆదిత్యుడే అని చెబుతున్నారు.
20.ఓంశ్రీ ఆదిదేవాయఅచ్యుతాయనమః

ఆదిత్య హృదయం 24వ శ్లోకం
వేదాశ్చ క్రతువశ్చైవ

క్రతూనాం ఫలమేవచ

యాని కృత్యాని లోకేషు

సర్వ ఏషరవిః ప్రభుః।।
వేదాశ్చ= వేదములను

క్రతువశ్చైవ= క్రతువులు

క్రతూనాం= ఆ క్రతువుల యొక్క

ఫలమేవచ= ఫలము కూడ

సః= అతడే

లోకేషు= పదునాలుగు లోకములందును

యాని= ఏ, యే

కృత్యాని= పనులు గలవో

సర్వః=అవన్నియు

ఏషః= ఈ

ప్రభుః= పరిపాలకుడైన

రవిః= సూర్య భగవానుడే.
ఇహపర సుఖములనివ్వ గల యజ్ఞములు, ఆ యజ్ఞముల స్వరూపము, విధానము, ఫలము మొదలగు వానిని తెలిపే వేదములు, పదునాలుగు లోకములందు సమస్త ప్రాణులు తమ తమ మనుగడకై జరుపుకొనే సకల కార్యములకు ఫలప్రదాత ఈ రవియే।
వేదములు:
వేదములు అపౌరుషేయములు అని మన విశ్వాసము.
మహర్షులు ధ్యానం లో ఉన్నప్పుడు భగవంతుని అనుగ్రహం వల్ల వాళ్ళకు స్పురించిన విజ్ఞాన రాశే వేద వాజ్మయం.
వేదము అనే పదము 'విద్' అనే ధాతువు నుంచి పుట్టింది. దాని అర్ధం జ్ఞానము అని.

వేదయతీతి వేదః- అంటే సత్య స్వరూపాన్ని దర్శింప చేసేదే వేదము.
ఆవిర్భావం నాటికి వేదరాశి అంతా ఒక్కటిగా నే ఉండేదిట. ( సుమారు ఐదు వేల సంవత్సరాల కు ముందు)
స్వాధ్యయనానికి, ప్రవచనానికి శులభం అయ్యేట్లా వ్యాసులవారు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అని విభజించేరు.
అధర్వణ వేదానికి మొదట్లో వేద ప్రతిపత్తి లేదుట.
అన్నింటిలో ముఖ్యమైనది ఋగ్వేదము. అందులో ఉండే మంత్రాలు అన్నీ ఇతర వేదాలలో కనపడతాయి. సామవేదమంతా ఋగ్వేదము లోనిదే. (75 మంత్రాలు తప్ప).
వేదాలను నాలుగు గా విభజించిన తర్వాత మళ్ళీ ప్రతి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు.
మొదటి భాగాన్ని "సంహిత" అంటారు. ఇందులోయజ్ఞాలలోను మరి ఇతర వైదిక కర్మలలోను ఉపయోగించే మంత్రాలు స్వరయుక్తం గా ఉంటాయి.
రెండవ భాగం "బ్రాహ్మణాలు". ఇందులో యజ్ఞయాగాదులు మొదలైన కర్మలు చేసే పద్ధతి, ప్రక్రియ వివరించ బడింది.
మూడవది "అరణ్యకాలు." వీటిలో యజ్ఞయాగాదులు చేయలేక అరణ్యాలకు వెళ్ళి వానప్రస్థ ఆశ్రమం తీసుకొన్న వృద్ధులు ధ్యానం చేసుకొనే పద్ధతులు వివరించ బడ్డాయి.
నాల్గవది "ఉపనిషత్తులు." ఒక విధంగా చూస్తే ఉపనిషత్తులు అరణ్యకాలు లో భాగమేనని గాని, వాటినుండే పుట్టాయని గాని అనవచ్చు.
సంహిత బ్రాహ్మణాలను కర్మకాండ అని, అరణ్యకాలు ఉపనిషత్తులను జ్ఞానకాండ అని అంటారు.
వేదాలలో చివరి భాగం కనుక ఉపనిషత్తులను "వేదాంతం" అని కూడా అంటారు.
అంటే ఆధ్యాత్మిక భావాల పరిణామ క్రమంలో కర్మకాండ నుంచి సాధకుల దృష్టి క్రమంగా జ్ఞాన సముపార్జన వైపు సాగింది.
ఉపనిషత్తులు బ్రహ్మవిద్య ద్వారా ఆత్మావలోకానికి దారి చూపించాయి.
ఉపనిషత్తు అంటే సమీపంలో కూర్చొని గురుముఖముగా అభ్యసించునది. గురు శిష్యుల మనస్సుల సంయోగం తో జరిగే సత్యసోధన అని అర్ధం.
సంహిత, బ్రాహ్మణాలు- యజ్ఞయాగాది క్రతువుల యొక్క పద్ధతి, ఫలితాలను చెబుతున్నాయి. మానవుడు వేటిని ఆశించి ఆయజ్ఞ యాగాది క్రతువులు చేసేవాడో వాటన్నిటి ఫలితము ఈ సూర్య భగవానుడే కలుగ చేయగల సమర్ధుడు.
అర్ధకామములకు వశులై సంసార చక్రంలో పరిభ్రమిస్తున్న జీవులను ఉద్ధరించి ప్రవృత్తి నివృత్తి రూప ధర్మాన్ని ఉపదేశించుటకై అవతరించిందే వేదము.
హేతు వాదం ఎన్ని వెఱ్ఱి తలలు వేసినా, ఆత్మజ్ఞానం కొట్టి పడేస్తే పోయేది కాదు.
మానవుడికి దివ్యత్వం సిద్ధింపజేసే ప్రవృత్తి ధర్మాన్ని, మోక్షాన్ని సిద్ధింపజేసే నివృత్తి ధర్మాన్ని ఉపదేశించే సనాతన

శాస్త్రము వేదము.
ఆదిత్య హృదయం ఆరవ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకూ నిత్యపారాయణకు చాలు. ప్రతి పదము స్పష్ఠముగా నిదానము గా పలుకుతూ, పలుకు తున్నప్పుడు వాటి అర్ధాన్ని మననం చేసుకొంటూ పారాయణ చేస్తే సూర్య భగవానుని సర్వ వ్యాపకత్వము అర్ధమయి సత్వర ఫలితాలు పొందగలుగుతారు.
శ్రీ శ్రీ కాళిదాసు రామచంద్ర శాస్త్రి గారి "ఆదిత్య హృదయ వ్యాఖ్యానం" నుంచే ఈ విషయాలు, తాత్పర్యాలు తీసుకొని శృతులు, స్మృతులనుంచి అచ్యుత యోగ విద్య కు అన్వయించడానికి ప్రయత్నం చేసేను.
1960 సంవత్సరానికే శ్రీ శాస్త్రి గారు రామాయణ పురాణ ప్రవచనాలతో తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో ప్రాచుర్యం పొందేరు. ఇతిహాసాల ద్రష్ఠ గా పురాణాలను -శ్రావ్య కావ్యాన్ని దృశ్య కావ్యంగా మలిచి చూపించిన మహామనీషి అంటారు.

         ఆదిత్య హృదయం సమాప్తము.

శుభం స్వస్తి
ఉదయ భాస్కర్ దువ్వూరి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Japa Sadhana – Blog

%d bloggers like this: