ఉపనిషద్విచారణ

– శ్రీ ఉదయభాస్కర్ దువ్వూరి

Last updated: Oct 19th 2018

Click here to download ఉపనిషద్విచారణ in PDF format

సాధక బంధువులకు,

ఉపనిషద్విచారణ మొదలుపెడదాము. విషయాలను వివరించడం, విషయాలను రాయడం అనేది నిజంగా విజ్ఞానాత్మకమైన పనే అయినా ఒకసారి చెప్పిన తర్వాత దానిని ఆచరించడంలో అశ్రద్ధ చేస్తే రాయడం కాని చెప్పడం కాని అనవసర కాలయాపన లా అనిపిస్తుంది. ఆ సమయాన్ని ధ్యానానికి ఉపయోగించు కోవచ్చు కదా అని అని పిస్తూంటుంది.

సాధ్యమైనంతవరకు స్వామి గారి తత్వానికి అనుగుణంగా వివరించడానికి ప్రయత్నిస్తాను.

ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః

1. ఉపనిషత్తులు

ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనే ఈ మూడింటిని కలిపీ ప్రస్తానత్రయం అంటారు.
వేద వాగ్మయాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు వేదాలుగా విభజించేరు. ఈ నాలుగు వేదాలకు 1131శాఖలు ఉండేవిట. కానీ ఈనాడు మొత్తం 13 శాఖలు మాత్రమే లభిస్తూండగా వాటిలో ఏడు వేద శాఖలుమాత్రమే గురుముఖత అధ్యయనానికి లభిస్తున్నాయిట.

ప్రతి వేద శాఖ లోను నాలుగు అంతర్భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని సంహిత అంటారు.
రెండవ భాగాన్ని బ్రాహ్మణం, మూడవ భాగాన్ని ఆరణ్యకము, నాల్గవ భాగాన్ని ఉపనిషత్తులు అంటారు. మొదటి రెండు భాగాల్లో ( సంహిత, బ్రాహ్మణం) యజ్ఞయాగాది కర్మకాండ గురించిన వివరాలు ఎక్కువగా ఉన్నాయి. మూడవ భాగమైన ఆరణ్యకాలలో వానప్రస్ధాశ్రమ ధర్మాలకు చెందిన వివరాలు ఉన్నాయి. ఇక నాల్గవదైన ఉపనిషత్తులలో ఆత్మ, పరమాత్మల విషయాలకుచెందిన జ్ఞాన విశేషాలు ప్రస్తావించారు.
వేదాలలో చివరవి కాబట్టి వీటిని వేదాంతం అనికూడా అంటారు.

ఉపనిషత్తులు అంటే:

– వ్యక్తులలో అవిద్య అనే సంసార బీజమును నాశనము చేస్తుంది కాబట్టి ఉపనిషత్తులు అని అర్ధం.

– మోక్షాన్ని ఆకాంక్షించేవారిని పరమాత్మ దగ్గరకు జేర్చేవి కాబట్టి ఉపనిషత్తులు అని అర్ధం.
– జన్మ వార్ధక్యం మొదలైన ఉపద్రవములను శిధిలము చేస్తాయి కాబట్టి ఉపనిషత్తులు అని అర్ధం.

– అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే గ్రంధం అని అర్ధం.- ఆ గ్రంథం ద్వారా అందించబడిన విద్య అని అర్ధం.

అనేక వేల సంవత్సరాల క్రితం మహర్షులు తాము దర్శించి కారుణ్య దృష్టితో లోకానికి అందించిన ఉపనిషత్తులు – భౌతిక స్ధాయి దాటి, జీవిత పరమార్ధం ఏమిటని ఆలోచించే వారికి ఈ ఉపనిషత్తులు షడ్రసోపేత విందు భోజనం, అమృత రసాస్వాదనం.

ఉపనిషత్తులు లౌకిక సుఖాలను పరిత్యజించి వైరాగ్యంతో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని చెప్పకుండా గృహస్త జీవితాన్ని ప్రోత్సహించి దాన్ని అర్ధవంతం, ఫలవంతం చెయ్యడానికే ప్రయత్నించేయి.

ఏ సుఖాలను పరిత్యజించమని చెప్ప లేదు. ఏ ఏ సుఖాలు మొదట సుఖంగా కనిపించి తర్వాత దుఃఖం గా మారుతాయో వాటిని మాత్రమే వదలమని చెబుతున్నాయి.

2. ఉపనిషత్తులు (Continuation)

ఉపనిషత్తు అంటే సమీపములో ఉండి గురుముఖముగా అభ్యసించేది అని అర్ధము.

సామీప్యత అనేది కేవలం భౌతికం కాదు. గురు శిష్యుల మనస్సుల సంయోగం తో జరిగే సత్యశోధన. ఇక్కడ గురువు సత్యాన్ని స్వయంగా దర్శించి ఆ సత్య స్వరూపాన్ని శిష్యుని చేత దర్శింపచేసేటందుకు గురువు ఇచ్చే శిక్షణాక్రమం. గురువు ఇచ్చే మార్గదర్శకత్వం ఈ ఉపనిషత్తులు.

ఉపనిషత్తులలోని భాష అతి క్లుప్తంగా కేవలం సూచనా ప్రాయంగా ఉంటుంది. దానివల్లే ఉపనిషత్తులకు ఎన్నో ఎన్నెన్నో భాష్యాలు.

ఉపనిషత్తుల ప్రాతిపదికగా గల వేదాంతం అత్యంత బుద్ధికుశలత తో కూడిన దర్శనం. అది వ్యక్తికి అతీతమైన అధ్యాత్మిక తత్వమైన పరబ్రహ్మ స్వరూపం మీదే దృష్ఠి సారించింది.

శాస్త్రవిజ్ఞానాన్ని ఉపనిషత్తులు ఎప్పుడూ కాదనలేదు. దానికి నైతిక విలువలు చేర్చమని చెప్తాయి. శరీరం స్ధూలమైనది. దాని నుండి నైతిక విలువలు రావు. నైతిక విలువలు మన సంస్కారం నుండి ఆధ్యాత్మిక చింతన నుండి వస్తాయి. సమాజంలో శాంతియుత సహజీవనానికి దోహదం చేస్తాయి. వ్యక్తిత్వాన్ని వికసింపచేయడానికి, తద్వారా సమాజ వికాసానికి తోడ్పడేవే ఉపనిషత్తులు.

శ్రీ ఆదిశంకరులు మొదటగా ఉపనిషత్తులను వేదాలనుండి విడదీసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించి వాటికి భాష్యాలు రచించారు. తద్వారా వీటి ప్రాముఖ్యం గమనించి అందరూ అధ్యయనం చేయడం మొదలుపెట్టారు.

ఈ ఉపనిషత్తులు రెండువందలకు మించి ఉంటాయని అంటారు. అయితే శ్రీ ఆదిశంకరులు వ్యాఖ్యానించిన ‘దశోపనిషత్తులు’ ప్రామాణిక మైనవని పండితుల అభిప్రాయం.

అవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు.

ఈ పది కాక శ్వేతాశ్వతరోపనిషత్తు మీదకూడా ఆదిశంకరులు భాష్యం వ్రాశారని కొందరి అభిప్రాయం.

వీటితోపాటు కౌశీతకి, జాబాల, మహానారాయణ, సుబాల ఉపనిషత్తులకు కూడా చాలా ప్రాముఖ్యం ఉంది.

వచ్చే మూడవ భాగంలో పనిషత్తులను ద్వైత పరంగాను అద్వైతపరంగానూ కూడా వైరుధ్య వ్యాఖ్యానాలు వచ్చినా తత్వశాస్త్ర మౌలిఖ సూత్రాలు ఏరకంగానూ మారకుండ ఉన్న వైనాన్ని తెలుసుకొందాం

3. ఉపనిషత్తులు (Continuation)

ఆత్మజ్ఞానం అనేది వ్యక్తిగతమయితే, మానవతావాదం సామాజికమైనది. ఈ రెండింటిని ఉపనిషత్తులు వివరించాయి.

విశ్వం యొక్క రహస్యాన్ని ఛేదించాయి. ఆత్మయొక్క అమృతత్వాన్ని కూడా సమర్ధవంతంగా ఆవిష్కరించాయి.

శ్రీ ఆదిశంకరులు ఉపనిషత్తులను అద్వైతపరంగా వ్యాఖ్యానించేరు.

వైష్ణవ మతస్తులు శ్రీ మద్రామానుజ సిద్ధాంతాల ననుసరించి విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానించేరు.

మధ్వమతస్తులు శ్రీ మధ్వాచార్యులు ద్వైత పరంగా వ్యాఖ్యానించేరు.

ఈ వ్యాఖ్యలలో జీవాత్మ పరమాత్మలు భేదమని ఒకరంటే జీవాత్మ పరమాత్మలు వేరుకాదని మరొకరన్నారు.

విశ్వం అసత్యమని ఒక సిద్ధాంత మంటే విశ్వంసత్యమేనని ఇంకొక సిద్ధాంతం ప్రతిపాదించింది.

పరమాత్మ నిరాకార నిర్గుణము అని ఒకరంటే ఇంకొకరు సాకార సగుణమని అన్నారు.

ముక్తి ని ప్రతి ఒక్కరు వేరు వేరుగా వ్యాఖ్యానించేరు.

ఈ సిద్ధాంతాలలోని వైరుధ్యాలు వాదోపవాదాలకు ఖండన మండనాలకు దారితీశాయి.

(తాత్విక వైరుధ్యాల పరిష్కారానికి పండిత సభలు ఏర్పాటు చేసి ప్రత్యర్ధుల మధ్య జరిగిన వాదోపవాదాలలో ఎవరు జయిస్తే వారికి జయ పత్రిక నిచ్చేవారు.)

కానీ మౌలిక మైన అంశాలు -దేహాత్మల భేదం, దైవభక్తి, పునర్జన్మ, ఇంద్రియ నిగ్రహం యొక్క ఆవశ్యకతల విషయంలో అన్ని సిద్ధాంతాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచేయి.

లింగవివక్షత, జాతి,కులవివక్షత, వయోవివక్షత లేకుండా అందరు సత్యాన్వేషణలో పాల్గొని ఉపనిషత్తులు ఆవిర్భావానికి పాటుపడ్డారు.

ఉదాహరణకు జనకుని వంటి రాజులు, యాజ్ఞవల్క్యుడు వంటి బ్రహ్మజ్ఞులు, నారదునివంటి దేవ ఋషులు, ఇంద్రుని వంటి దేవతలు, విరోచనుని వంటి దానవులు, నచికేతుడు, శ్వేతకేతువు, సౌమ్యుడు వంటి చిన్న పిల్లలు, ఏకులానికి చెందినవాడో తెలియని సత్యకాముడు, గార్గి, మైత్రేయి లాంటి స్త్రీలు స్వానుభవం చేత సంభాషణారూపం లో పొందుపరచారు.

ఉపనిషత్తులలోని భాష, భావాలు, కధలూ అన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. అత్యంత తార్కికంగా అవసరమైన చోట్ల అత్యద్భుతమైన ఉపమానాలతో, దృష్టాంతాలతో కధలతో సాగుతాయి.

ఇంక కాలయాపన చేయకుండా ఉపనిషత్తుల వివరణలోకి వెడదాము.

ముందుగా విహంగవీక్షణంలో క్లుప్తంగా ఏ ఉపనిషత్తు ఏరకంగా ఆవిర్భవించింది, ఏ ఏవిషయాలను ప్రతిపాదించింది అనే విషయాలు తెలుసుకొని తరువాత వివరంగా ఒక్కొక్క ఉపనిషత్తు చదువుకొందాం.

4. ఉపనిషత్తులు – ఈశావాస్యోపనిషత్తు

ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులే దశోపనిషత్తులు.

వీటిలో మొదటిదైన ఈశావాస్యోపనిషత్తు మంత్రోపనిషత్తులకు చూడామణి అని చెప్పవచ్చు.

ఇది శుక్ల యజుర్వేద సంహిత లోని ఆఖరు అధ్యాయం.

18 మంత్రాలతో ఉన్న ఈ ఉపనిషత్తు అత్యంత విఖ్యాతమైన ఉపనిషత్తు.

దీనికి కారణం ఇందులో జ్ఞాన కర్మలకు రెండింటికి ప్రాముఖ్యత ఇవ్వబడింది.

అంతే కాకుండా సత్తు అసత్తు వీటికి అవతల ఉండే దేవుని గురించి కూడా చెప్పబడింది.

దేవుని లో ఐక్యమై జన్మరాహిత్యాన్ని( మోక్షాన్ని) పొందే మార్గం చెప్పబడింది. ముముక్షువులకు అవసరమైన విషయాలు అన్నీ ఇందులో ఉన్నాయంటే అతిశయోక్తి లేదు.

మహత్తరమైన ఆధ్యాత్మిక సత్యాలు దీనిలో ఉన్నాయి.

సంహిత లో అంతర్గతంగా ఉన్న ఉపనిషత్తు ఇది ఒక్కటే కావడం వల్ల ఉపనిషత్తులన్నిటిలో ఈశావాశ్యోపనిషత్తు ప్రధమస్తానాన్ని ఆక్రమించు కొంది.

అందుకే దీనికి “వాజసనేయ సంహితోపనిషత్తు” అనే పేరు కూడా ఉంది.

జ్ఞాన మార్గంలో సాగేవారికి, ఈ ఉపనిషత్తులోని మొదటి మంత్రము, 4వ మంత్రం నుండి 8వ మంత్రం వరకూ అంటే (1+4)ఐదు మంత్రాలు ఉద్దేశింపబడ్డాయి.

పారమార్థిక సాక్షాత్కారం పొందినవారికి జీవితం ఎలా కనపడుతుందో తెలియచేప్పింది.
ఆత్మను సాక్షాత్కరించుకొన్న వ్యక్తి సర్వ భూతాలలోను ఆత్మను దర్శిస్తాడని నొక్కి వక్కాణించింది.

యజుర్వేదానికి చెందిన ఈ ఉపనిషత్తు “పూర్ణమదః పూర్ణమిదం” అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది.

ఈ ఉపనిషత్తులోని ప్రతి మంత్రము ఒక ప్రత్యేకమైన ఉపనిషత్తనే చెప్పాలి.

మొదటి మంత్రం “ఈశావాశ్య మిదగ్ం సర్వం” అతి ప్రసిద్ధమైన మంత్రం – ఈ జగమంతా ఈశుని (భగవంతుడు లేదా సమస్తంలో వ్యాపించిఉన్నప్రాణ వాయువు) చే నిండిఉంది అనే భావంద్వారా ప్రాణ వాయువు యొక్క ఉనికి, సర్వవ్యాపకత్వాన్ని నిరూపిస్తూంది.

రెండవమంత్రం “కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ సమాః” అంటూ విహిత కర్మల( ఏకర్మల వల్ల నీకు కర్మ ఫలం అంటదో- అంటే జ్ఞానోత్తర కర్మలు) నాచరిస్తూ నూరు సంవత్సరాలు( శ్రీ యోగి అచ్యుతుల ప్రకారం 120 సంవత్సరాలు) జీవించడంద్వారా ముక్తిని పొందవచ్చు.

వచ్చే భాగంలో మరింత లోతుగా ఈశావాశ్యం- విద్య, అవిద్యలను, సంభూతి అసంభూతులను వివరిస్తూ “హిరణ్మయేన పాత్రేణ…. అనే మంత్రం ద్వారా ఈసమస్త విశ్వాన్ని పెంచి పోషిస్తున్న ఆ పూషుని ప్రార్ధిస్తున్న వైనాన్ని గమనిద్దాం.

5. ఉపనిషత్తులు – ఈశావాస్యోపనిషత్తు (Continuation)

ఈ జగత్తు అనేది పాంచ భౌతికమని, అట్టి ఈజగత్తును సృష్టించి, పోషించి, ధరించేందుకు మూలం ప్రాణ శక్తి, అలాంటి మూల శక్తిని ఆశ్రయించి మాత్రమే ఆత్మను దర్శించడం సాధ్యమౌతుంది అని తెలుపుతోందీ ఉపనిషత్తు.

సర్వ భూతాలు తన ఆత్మయే అని తెలుసుకొని, ఏకత్వాన్ని మాత్రమే దర్శించే వ్యక్తికి, అంటే తనను తాను తెలుసుకొన్న జ్ఞానికి

“తత్ర కోమోహః కః శోకః ఏకత్వమనుపశ్యత”
సమదృష్టి వస్తుంది, సహజత్వం అబ్బుతుంది. అని చెబుతూందీ ఉపనిషత్తు.

ఆ ఆత్మ గురించి. చెబుతూ

తర్వాతి మంత్రం లో ” కవిర్మనీషీ పరిభూస్స్వయం భూ…”
అతడు సర్వ వ్యాపి, జ్యోతిర్మయుడు, శుద్ధుడు, పాపరహితుడు, కవి, మనీషి(బుద్ధిమంతుడు), సర్వోత్తముడు, స్వయంభువు.
సర్వవ్యాప్తమైన అతని చైతన్యం ఇంద్రియ గోచరంకాని నిరాకార శక్తి.

ఆ ఆదిపురుషుణ్ణి పురుషుడు అని, పరమాత్మ అని పరమేశ్వరుడని, పరబ్రహ్మ అని ఆదిదేవుడని జ్ఞానులు వర్ణించారు.

9నుంచి 14వ మంత్రం వరకూ విద్య అవిద్య ల గురించి, సంభూతి(అవ్యక్తం) అసంభూతి (వ్యక్తం) ల గురించి వివరిస్తూ ఎవడైతే విద్యను అవిద్యను ఏక కాలంలో గ్రహిస్తాడో ఆవ్యక్తి అవిద్య ద్వారా మృత్యువును దాటి, విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతాడు అని చెప్ప బడింది.

వ్యక్తోపాసన(అసంభూతి) యొక్క ఫలం- పాప పుణ్యాలు, తదనుగుణమైన లోకం, జన్మాదుల ప్రాప్తి.
అవ్యక్తోపాసన (సంభూతి) ఫలం- మృత్యువు నుండి విముక్తి(కర్మ ఫలాలయిన జనన మరణాల చక్రం)

సారాంశం ఏమిటంటే, కేవలం జ్ఞానం లభిస్తే మోక్షం లభించినట్లు కాదు, తర్వాత కర్మ( లోకోపకారం) చేయడం అవసరము అని బోధపడుతుంది.

స్వరూప జ్ఞానాన్ని పొందిన ఋషి ఆత్యంతికమైన సత్యాన్ని దర్శించడానికి, వినయము, భక్తి, సమర్పణ బుద్ధి అవసరమని నిరూపించే విషయాన్ని, ఆ శాశ్వతుడైన దేవుణ్ణి దర్శించాక అతనికృపాకటాక్షంతో జ్ఞానమోక్షాలకు అర్హుడైన వ్యకి తనవిగా చెప్పిన ఈ ఉపనిషత్తు ముగింపు వాక్యాలతో వచ్చేభాగం లో ఈశావాశ్యోపనిషత్తు పరిచయాన్ని ముగిద్దాం. తిరిగి దశోపనిషత్తుల పరిచయం అయ్యాక, వివరంగా చదువుకొందాం.

6. ఉపనిషత్తులు – ఈశావాశ్యోపనిషత్తు (Continuation)

ఈవారం రోజులు పనుల ఒత్తిడి వల్ల కలిగిన ఆలస్యానికి, అంతరాయానికి క్షంతవ్యుడను.

ఇంతకుముందు రెండు భాగాల్లోనూ 1వ మంత్రం నుంచి 14వ మంత్రం వరకూ చెప్పుకొన్నాము. ఇప్పుడు మిగిలిన నాలుగు మంత్రాల కు (15 నుంచి 18వరకూ) వ్యాఖ్యానం లో వైవిధ్యమైన అభిప్రాయాలు ఉన్నాయి.

మా గురువులు శ్రీ యోగి అచ్యుతుల అభిప్రాయాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.

15వ మంత్రం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం.

తీవ్రమైన తపస్సు లో ఋషికి స్వరూప సందర్శనం అయినా ఆరూపం యొక్క జ్ఞానం తెలియాలంటే సత్యం యొక్క జ్ఞానం అవగతమవ్వాలి. ఆ జ్ఞానం అవగతమవ్వాలి అంటే ఆ పరమేశ్వరుని కృప అనుగ్రహం వల్ల తప్ప ఇతరత్రా కాదు.

సాధనలోఉన్న వ్యక్తి భక్తి, సమర్పణ భావాలతో ఈవిధంగా ప్రార్ధిస్తూ మిరుమిట్లు గొలిపే ఆ దివ్య జ్యోతి దర్శన భాగ్యం పొందినా బంగారు మూకుడుతో కప్పబడి వృత్తాకారంలో వెదజల్ల బడుతున్న కాంతిపుంజాలను దాటుకొని సత్యయొక్క రూపాన్ని దర్శించలేక- ఓపూషా! విశ్వాన్నంతనూ పెంచిపోషించే సర్వ శక్తి స్వరూపుడా! నీతేజో కిరణాలే కదా ఈ సమస్త ప్రజల ఉత్పత్తికి కారణం. ప్రజాపతి సుతులైన నీ కిరణావళిని ఉపసంహరించుకొని నీ సత్య స్వరూపాన్ని నాకవగతమయ్యేలా చేయి తండ్రీ అని ఆ పరాత్పరుని శరణాగతి వేడితేతప్ప జ్ఞానం, మోక్షం సాధ్యం కావు.

అలా అతని కృపాకటాక్షంతో జ్ఞాన మోక్షాలకు అర్హుడైన వ్యక్తి తనకు తానుగా ఈవిధంగా సాధనాక్రమాన్ని వివరిస్తున్నాడు 17వ మంత్రంలో.

ఓం వాయురనిల మమృత మధేదం భస్మాంతం శరీరం
ఓం క్రతోస్మర కృతంస్మర క్రతోస్మర కృతంస్మర||

వాయువు మరియు అనిలం ( ప్రాణవాయువు, బయటి గాలిలోని ఆక్సిజన్ తోకూడిన వాయువు లను ప్రాణాయామ క్రియ ద్వారా మధించినప్పుడు పుట్టిన ఉష్ణంలో మన శరీరంలోని పంచభూతాలు శుద్ధి కాబడతాయి. తల్లి గర్భం నుండి తెచ్చుకొన్న పంచభూతాత్మకమైన శరీరం అగ్నిలో పుటం పెట్టబడుతుంది.అదే ప్రాణ యజ్ఞం. నువ్వు ఏవిద్యోపాసనతో ఈస్ధితిని పొందగలిగేవో దానిని స్మరించు. తిరిగి ప్రాణ యజ్ఞం చేయి, చేసినదానిని స్మరించు.

ఎంత అందంగా వివరించాడీ ముముక్షువు.

ఈ ప్రాణయజ్ఞం ద్వారా యుగయుగాలనుంచి జన్మజన్మల నుంచి మనతో మోసుకొనిపోతున్న కర్మలను భస్మం చేసి నన్ను మంచి మార్గం లో నడిపించవయ్యా పరాత్పరా, ఆ పరమాత్మకు మరోరూపమయిన ఓ అగ్ని దేవా అంటూ ఈ ఉపనిషత్తును ముగిస్తాడు.

ఇంతటి పరిశీలనాత్మకమయిన సాధనాపరమైన ఉపనిషత్తు కేవలం మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకు దొరికింది.

వచ్చే భాగంలో, దేవతల అహంకారాన్ని నిర్మూలించటానికి బ్రహ్మ యక్ష రూపం లో ప్రకటింప బడ్డాడనే కధతో “కేనోపనిషత్తు” సమస్తానికి ఆభగవంతుడే ఆశ్రయం కావడం వల్ల అతనికి సంబంధించిన జ్ఞానం అతనిదయవల్ల మాత్రమే లభ్యమౌతుంది అని నిరూపించడాన్ని చూద్దాం.

7. ఉపనిషత్తులు – కేనోపనిషత్తు

కేనోపనిషత్తు జ్ఞానియైన గురువు శ్రద్ధాళువైన శిష్యుడి మధ్య జరిగిన సంవాద రూపంలో ఉంటుంది.

ప్రశ్నించడం సత్యాన్వేషణలో ఒకప్రధాన భాగమని దాని ద్వారానే సత్య శోధన జరుగుతుందని ఉపనిషత్తుల ఆవిర్భావం నాటినుండే గుర్తించారు.

భగవద్గీతలో ప్రతిఅధ్యాయం చివర శ్రీ కృష్ణార్జున సంవాదే అని చెప్పడం ద్వారా అది ఏక పక్షంగా చెప్పిన గ్రంధం కాదని ప్రశ్నోత్తరాల ద్వారా సత్యావిష్కరణ చేసిన గ్రంధం అని తెలుస్తోంది.

‘కేన’ అంటే “ఎవనిచేత?” అనే ప్రశ్నతో మొదలవటంవల్ల ఈ ఉపనిషత్తు కేనోపనిషత్తు గా ప్రసిద్ధమైంది.

చాందోగ్య, కేన ఉపనిషత్తులు సామవేదానికి అతి ముఖ్యమైన పరిశిష్టాలు.

కేనోపనిషత్తు సామవేదం లోని తలవకార బ్రాహ్మణంలో అంతర్భాగంగా ఉంది కనుక దీనికి తలవకారోపనిషత్తు గా కూడా నామాంతరం ఉంది.

కేనోపనిషత్తులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది చేసిన సూక్ష్మమైన మానసిక విచారణ.

ఈ విచారణ ఎంతో స్పూర్తిదాయకంగా సాగి, శ్రద్ధ గా దానిని అనుసరించినవారిని చివరకు తురీయపు సింహద్వారానికి చేరేటట్లు చేసింది.

చిన్నదే అయినా ఈ ఉపనిషత్తు విలువ అపారం.

ఈ ఉపనిషత్తు నాలుగు భాగాలుగా విభజింప బడింది.

మొదటి రెండుభాగాలు సంవాద రూపంలో ఇంద్రియ దర్శనా విచారణ ద్వారా ఆత్మతత్వాన్ని ఎలా చేరుకోవాలో వివరించాయి.

మనస్సును ఇంద్రియాల కార్యకలాపాలనుండి వివక్షించి వేరుపరచడం ద్వారా ఆత్మను లేదా శుద్ధ చైతన్యాన్ని ఎలాగ సాక్షాత్కరించు కోవడమో ఇవి రెండూ వివరించాయి.

ఇంద్రియాలు ఆత్మను దర్శించడానికి బొత్తిగా సామర్థ్యం లేనివి కాబట్టి ఈ సాక్షాత్కారం ఆత్మ స్వయం స్పురణ శక్తి ద్వారానే సాధ్యం.

మూడవ భాగంలో దేవతలే ఇంద్రియాలు అని, నాల్గవ భాగంలో కర్తృపక్షంగా, కర్మ పక్షంగా బ్రహ్మను గూర్చిన ధ్యానము దాని ఫలితాలు చెప్పబడ్డాయి.

వచ్చే భాగంలో “ఓం ఆప్యాయంతు మమాంగాని ….” అనే శాంతిమంత్రం తో మొదలయిన కేనోపనిషత్తు లోని మరిన్ని విశేషాలను తెలుసుకొందాం.

8. ఉపనిషత్తులు – కేనోపనిషత్తు (Continuation)

34 మంత్రాలతో ఉన్న ఈ కేనోపనిషత్తు
“ఆప్యాయంతు మమాంగాని……” అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది.

సామవేదం లో ఉన్న చాందోగ్య, కేన ఉపనిషత్తులు ఇదే శాంతి మంత్రం తో మొదలవుతాయి.

ఓం ఆప్యాయంతు మమాంగాని, వాక్ ప్రాణశ్చక్షుః
శ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి
సర్వం బ్రహ్మౌపనిషదం| మాహం బ్రహ్మ నిరాకుర్యాం
మామా బ్రహ్మ నిరాకరోదనిరాకరణమస్త్వ నిరాకరణమేస్తు
తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే
మయిసంతు తే మయిసంతు.
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఈ శాంతిమంత్రంలో ఉపనిషత్కారులు బ్రహ్మజ్ఞానం ఎలా సాధ్యమౌతుంది అనే విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు.

కర్మేంద్రియాలను నిగ్రహించి ఇంద్రియవృత్తులను నిరోధించి మనస్సు మరియు ప్రాణము ల సహకారంతో బ్రహ్మత్వాన్ని గ్రహించేందుకు ఊర్ధ్వగాములు కావాలి.

నా యొక్క వాక్కు, ప్రాణం, కన్నులు, చెవులు తృప్తి చెందనీ. ఇవన్నీ బ్రహ్మత్వానికి అతి సమీపంలో ఉన్నాయి.

మనస్సు(నేను) బ్రహ్మత్వాన్ని నిరాకరించకుండా ఉండాలి.

అంటే తెలుసుకోవాలనే ఆకాంక్ష కలిగి ఉండాలి.

అది లేకుంటే ఈ మానవ జన్మే వ్యర్ధమని అర్ధం.

బ్రహ్మ జ్ఞానాకాంక్ష పూర్తి అయ్యేందుకు ఆపరమాత్మ యొక్క కృప చాలా అవసరం.

అందుకే “బ్రహ్మత్వం నన్ను నిరాకరించకుండా ఉండనీ.” అనేది మన ప్రార్ధన.

జ్ఞాన ప్రాప్తి అయ్యాక మనస్సునకు తృప్తి; ప్రాణుని ద్వారా కర్మేంద్రియాలకు, బ్రహ్మేంద్రియాలకు అమృతప్రాప్తి జరిగి పుష్టి లభిస్తుంది. ఇంద్రియ వృత్తులకు నిర్వికారత్వము ఏర్పడుతుంది.

ఇంత జరిగినా బహిర్ముఖ స్థితికి వచ్చేక లౌఖిక వ్యవహారాలలో మోహాది ద్వంద్వాలలో చిక్కుకొని
ఆ బ్రహ్మత్వాన్ని మరచిపోవడం జరుగుతుంది.

ఇది సహజం అని అనుభవంతో గ్రహించిన జ్ఞానులు “నేను బ్రహ్మత్వాన్ని నిరాకరించకుండా ఉందును గాక.” అన్నారు.

ఆత్మరతుడై ఆ ఉన్నత స్తితి లో తెలుసుకొన్న ధర్మానికి అనుగుణంగా జీవించేందుకు అవసరమైన పద్ధతి మన నిజ జీవితంలో నిరంతరము స్ధిరంగా నిలిచిపోవాలని, దానికి విరుద్ధంగా మన జీవనం ఉండకుండా ఉండాలనీ సాధకుడు సర్వదా కోరుకొంటున్నాడు.

ఆత్మరతుడిగా అయిన తర్వాత, సత్యాన్ని అర్ధం చేసుకొని సత్యాన్ని దర్శించడం (ఋతం)వల్ల ధర్మం
నాలో చిరకాలం నిలువనీ! నాలోనిరంతరం ధర్మం ఉండేటట్లు అనుగ్రహించు.

ఈ శాంతి మంత్రం యొక్క అర్ధాన్ని ఒకటి రెండు సార్లు చదివి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

తమయొక్క మానసిక చంచలత్వం వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సత్పురుషులు కూడా మాయలో పడి సాధారణస్తితి కన్న కింద స్ధాయికి జారిపోయినవారు ఉన్నారు.

అందువల్ల ఆ భగవంతుని కృపవల్ల
“నేను బ్రహ్మత్వాన్ని నిరాకరించకుండా ఉందును గాక. నన్ను బ్రహ్మత్వం నిరాకరించకుండా ఉండు గాక”
అని సాధకులు ఎల్ల వేళల ప్రార్ధిస్తూ ఉంటారు.

మహత్తరమైన శాంతి మంత్రాన్ని తెలుసుకొన్నాం ఈ భాగంలో.

వచ్చే భాగంలో కేనోపనిషత్తు లోని విశేషాలను తెలుసుకొందాం.

9. ఉపనిషత్తులు – కేనోపనిషత్తు (Continuation)

సుమారు అయిదు వేల సంవత్సరాల క్రితం, అంటే చదవడం, రాయడం, పుస్తకం రూపంలో నిక్షిప్త పరచడం తెలియని రోజుల్లోనే హిందూ దేశంలోని మహర్షులు ఈ సృష్టి ఎలా పుట్టింది? ఈమానవ ఇంద్రియాలు ఎవరి ప్రేరణ తో నియంత్రించబడి వాటిపనులు చేసుకొని పోతున్నాయి? అనే విషయాలపై తపించారు. ఆ క్రమం లో
కేనోపనిషత్తు మొదటి మంత్రం: ఏమి తెలుసుకోవాలను కొంటోందంటే-

ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణః ప్రధమః ప్రైతియుక్తః
కేనషితాం వాచమిమాం వదంతి
చక్షుః శ్రోత్రం క ఉదేవోయునక్తి.

మనస్సు అనేక విషయాలను గురించి ఆలోచిస్తోంది కదా- ఎవ్వరి ప్రేరణ వల్ల మనస్సు ఆయా ఆలోచనలు చేయ గలుగుతోంది?
సృష్టి లో ఆది వస్తువు ప్రాణశక్తి.

ఎవరి ఆజ్ఞ వల్ల ప్రాణం తన క్రియను తాను చేసుకొని పోతోంది?

ఎవరి ఇచ్చతో వాక్కు పలుకుతోంది?

కన్నులు చెవులు-వీటిని నియంత్రించేది ఎవరు?

పైన చెప్పినవన్నీ మన అనుభవైకవేద్యాలు.

కాని వాటి మూలాలు అనుభవానికి రాని క్లిష్టాలు.

వీటిని గూర్చిన జిజ్ఞాస యే ఈ ఉపనిషత్తు.

కేనోపనిషత్తు మన ఇంద్రియ రహస్యాలను ఛేదించదలచు కొంటే

శ్వేతాశ్వతరోపనిషత్తు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి

కిం కారణం బ్రహ్మ? కుతస్మజాత? జీవామకేన? క్వచ సంప్రతిష్టితా? …

అంటూ ఈవిశ్వం ఆవిర్భవించడానికి బ్రహ్మ కారణమా?

ఈసృష్టికి ఉపాదాన కారణం ఎవరు?

మనము దేనివల్ల జన్మించాము?

దేనివల్ల జీవిస్తున్నాము?

మనము అనుభవిస్తున్న ఈ సుఖదుఃఖాలకు అధికారి ఎవరు?..

అంటూ
సృష్టి స్థితి లయములకు కారకుల గురించీ విచారణ మొదలు పెట్టింది.

మనకున్న చిన్నజీవితకాలంలో అనంతమైన విషయాలను తెలుసుకోగలగడం సాధ్యమైన విషయమా?

మరి దీనికి పరిష్కారం ఏమిటి?
అని ఆలోచిస్తూ

ముండకోపనిషత్తులో ఉపనిషత్కారులు

కస్మిన్ను భగవో విజ్ఞాతే
సర్వమిదం విజ్ఞాతం భవతీతి.

ఓ భగవాన్! దేనిని తెలుసుకోవడం ద్వారా సర్వమూ తెలుసుకోబడుతుంది?

అని ఎంతో ఉత్సుకతతో ప్రశ్నించారు.

అంటే అప్పటికే ఈ సృష్టి అనే చిక్కుముడి ని విప్పడానికి –

సర్వ సృష్టి ఒక మూల సూత్రాన్న నుసరించే జరుగుతోందని దానిని ఛేదించ వలసి ఉందని అభిప్రాయానికి వచ్చేసేరు.

వీటన్నిటికీ సమగ్రమైన జవాబు బృహదారణ్య కోపనిషత్ లో యాజ్ఞ్యవల్క్య మహర్షి ఇస్తాడు.

ఆత్మవారే ద్రష్టవ్య శ్రోత్రవ్యో మంతనవ్యో
నిధి ధ్యాసితవః మైత్రేయీ! ఆత్మనో వారే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానే నేదమ్ సర్వమిదం

ఓ మైత్రేయీ! దానిని ఆత్మ అంటారు. దాని దర్శనం చేసుకోవాలి. వినాలి. మరియు దానినే ధ్యానం చేయాలి.

నిజానికి ఆత్మను చూచుట చేతను, వినుట చేతను, ఆత్మ గురించి ఆలోచించుట చేతను సర్వమూ తెలియగలదు.

ఒక్క ఆత్మ దర్శనము ద్వారానే సమస్తాన్ని అర్ధం చేసుకోగలిగే విజ్ఞానమే యోగ విజ్ఞానము.

చూడండి ..ఒక ఉపనిషత్తులోని సందేహాన్ని అందిపుచ్చుకొని మహర్షులు తపించగా మరొక ఉపనిషత్తు ఉద్భవించింది
అలా సమిష్టిగా యోగ విజ్ఞానాన్ని పెంపొందించేరు.

వచ్చే భాగంలో
మనం తిరిగి కేనోపనిషత్తులోకి ప్రవేశిద్దాం.

10. ఉపనిషత్తులు – కేనోపనిషత్తు (Continuation)

కేనోపనిషత్తు లో ప్రధమ, ద్వితీయ ఖండాలలో

మనము దేనినైతే బ్రహ్మము(ఆత్మ) అనుకొని ఉపాసిస్తున్నామో అది బ్రహ్మము కాదు.

పరబ్రహ్మమును నేత్రములతో చూచుటకు వీలుకాదు. వాక్కుతో చెప్పుటకు వీలు కాదు. మనస్సుతో చింతించుటకు వీలు కాదు. అట్టి ఆత్మ గురించ బోధించడం ఎలాగో మాకు తెలియడంలేదు.

ఆత్మ అనేది మనకు తెలుసున్న వాటికి తెలియబడని వాటికి కూడా అతీతంగా ఉంది. మా గురువులు ఈవిధంగా చెప్పడం విన్నాము. అని మహర్షులు వినమ్రంగా విన్నవించారు.

ఎవరైతే బ్రహ్మమును తెలుసుకొన్నామని భావిస్తున్నారో వాళ్ళు చాలా తక్కువ మోతాదులో గ్రహించిన వాళ్ళు అని ఉపనిషత్ మహర్షులు అభిప్రాయ పడ్డారు.

ఆత్మ శక్తియే అన్ని చోట్ల వ్యాపించి ఉంది. లోక లోకాంతరాలతో కూడిన బ్రహ్మాండము, అందులోని వస్తువులు, ధాన్యాలు, ప్రాణులు, పక్షులు, మృగాలు, కీటకాలు, మనుష్యులు, దేవతలు – ఇలా రకరకాలుగా ఉండే సమస్తంలో బ్రహ్మ శక్తియే ఉంది.

వీటన్నిటిలోనూ కొంచెం హెచ్చుతగ్గులైన ప్రమాణంలో ఉంటుంది.

ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అర్ధం చేసుకోండి.

ఆత్మకు ఇచ్ఛాశక్తి, సంకల్పం ఉండవు. ఫలానా పని చేయాలనే ఇచ్ఛ ఉండదు. నిష్క్రియత్వంగా ఉంటుంది.

ఇంద్రియాలు, ఆత్మ ఒకే శరీరంలో ఉన్నాయి కాబట్టి ఆత్మయొక్క తేజస్సు నుంచి ఇంద్రియాలు శక్తిని గ్రహించి తమతమ వ్యాపారాలు నిర్వర్తిస్తాయి.
దీని వల్ల ఆత్మయొక్క నిష్క్రియత్వానికి ఏమీ భంగం కలగదు.

ఎలా అంటే,

సూర్యుడు ఉదయిస్తున్నాడు, ప్రకాశిస్తున్నాడు. లోకంలో ఉండే వస్తువులన్నీటిమీద సూర్యకాంతి పడి వెలుతురులో కనపడుతున్నాయి. సూర్యకాంతి యొక్క శక్తిని తీసుకొని వాటి వాటి కార్యక్రమాలు జరుపుకొని, జీవిస్తున్నాయి. పెరుగు తున్నాయి.

కానీ సూర్యునికి, ఈ వస్తువు లన్నింటినీ ప్రకాశింపజేయాలని, పెంచి పోషించాలనే ఇచ్ఛ లేదు కదా!

అదే విధంగా ఆత్మ నుంచి ఇంద్రియాలు శక్తిని సమీకరించు కొంటాయి. అయితే ఆ ఇంద్రియాల ప్రవర్తన పూర్వ జన్మ వాసనల మీద, సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది.

ద్వితీయ ఖండం చివరి మంత్రంలో

ఈ ఈజన్మలోనే పరమాత్మను తెలుసుకొన్నచో బ్రహ్మానందం సిద్ధిస్తుంది. తెలుసు కొనలేకపోతే గొప్ప వినాశం సంభవిస్తుంది. ధీరులైన వాళ్ళు సమస్త భూతకోటి లోనూ ఆత్మ తత్వాన్ని తెలుసుకొని ఈ లోకము నుండి వేరై జనన మరణ రహితులవుతున్నారు. అని పూర్తి చేసేరు.

వచ్చే భాగంలో, తృతీయ, చతుర్ధ ఖండాలలోని విషయాలు ఆకళింపు చేసుకొందాం.

11. ఉపనిషత్తులు – కేనోపనిషత్తు (Continuation)

మూడు నాల్గు అధ్యాయాలలో దేవాసుర యుద్ధం, అంటే మంచి చెడులకు మధ్య జరిగే పోరాటాన్ని వర్ణించారు.

కధా రూపంగా తత్వోపదేశం చేస్తే సామాన్యులకు కూడా అర్ధం అవుతుందనే ఉద్దేశం తో ఉపనిషత్కారులు ఆ కధల ద్వారా వాటి వెనుక ఉండే నిగూఢమైన ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించేరు.

బ్రహ్మ దేవుడు దేవతల పక్షాన యుద్ధం చేసి విజయం సాధిస్తాడు.

ఇక్కడ విజయం సాధించినది బ్రహ్మే అయినా దేవతలు మా మూలంగానే గెలుపు వచ్చింది, మాదే ఈ గొప్పతనమంతా అని తెగ సంబర పడిపోతున్నారు.

దేవతలు జ్ఞానానికి ప్రతీకలు. గెలుపు ద్వారా అహంకారం అనే అజ్ఞానంలో కొట్టుకొని పోతున్నారు.

ఈవిషయాన్ని గ్రహించి బ్రహ్మ వీళ్ళకు కళ్ళు తెరిపించాలి అనుకొని ఒక బ్రహ్మాండమైన యక్షరూపం ధరించి వారి ముందర ప్రత్యక్ష మయ్యాడు.

ఆరూపాన్ని చూసి దేవతలు నివ్వెరపోయారు.

దేవతలకు ఏ ఆపద వచ్చినా ముందు నిలబడేది వాళ్ళ ప్రభువు ఇంద్రుడు, అగ్ని, వాయువు.
ఇంద్రుడు అగ్నితో నువ్వు సర్వజ్ఞుడవు ( జాతవేదుడవు) కనుక ముందుగా నీవు వెళ్ళి ఆ యక్షుడెవరో తెలుసుకొనిరా అని పంపగా అగ్ని యక్షుడి ముందు నిలబడి ప్రశ్నించే లోగా యక్షుడే నువ్వెవరు అని అడిగేడు.

నేను అగ్ని దేవుడను. సర్వజ్ఞుడను. అన్నాడు.

అయితే నీశక్తి ఏమిటి?

నేను ఈ లోకంలో దేనినైనా కాల్చి బూడిదగా మార్చగలను.

అలాగా, అయితే ఈ గడ్డి పరకను కాల్చు

అని ఒక గడ్డిపరకను ముందరికి తోశాడు యక్షుడు.

అగ్ని వేగంగా ఆ గడ్డిపరక మీదకు వెళ్ళాడు. కానీ అది కాలలేదు.

ఖిన్నుడై వెనుదిరిగి ఇంద్రుడికి వాయువుకి తన అశక్తతను తెలియబరిచాడు.

అప్పుడు వాళ్ళు వాయుదేవుడిని పంపారు.

వాయువును ఆయక్షుడు నువ్వెవరవు? అని అడిగాడు.

నేను వాయుదేవుడను. సర్వజ్ఞుడను. ఆకాశంలో కూడా సంచరిస్తాను. అని పరిచయం చేసుకొన్నాడు.

నీ శక్తీ సామర్ధ్యాలు ఏమిటి? అని యక్షుడు అడిగాడు.

ఈ లోకంలో దేనినైనా ఎగరగొట్టగలను. అన్నాడు వాయువు.

అలాగా! అయితే ఈ గడ్డిపరకను ఎగరగొట్టు అన్నాడు యక్షుడు.

వెంటనే వాయువు అతి వేగంగా ఆ గడ్డిపరక మీద వీచాడు. కానీ గడ్డిపరక కదలలేదు.

ఇలా భంగపడి వెనుదిరిగి వచ్చి నేను అశక్తుడను. ఆ యక్షుడెవరో నేను తెలుసుకోలేక పోయాను. అన్నాడు.

అప్పుడు దేవతల ప్రభువు ఇంద్రుడే ఆ యక్షుడుండే స్ధలం దగ్గరకు వెళ్ళాడు.

కానీ అత్యాశ్చర్యకరంగా ఆ యక్షుడు మాయమయ్యాడు.

అదే స్ధలంలో అతిలోక సౌందర్యవతియైన ఉమాదేవి (పార్వతి) ప్రత్యక్షమైంది…..

12. ఉపనిషత్తులు – కేనోపనిషత్తు (Continuation)

అతిలోక సౌందర్యవతి అయిన ఉమాదేవి ప్రత్యక్షమైంది.

ఆమెను చూచి ఇంద్రుడు అంజలి ఘటించి అమ్మా ఆ అద్భుతమైన యక్షుడు ఎవరు?అని అడిగేడు.

“అదే బ్రహ్మము. దానివల్లే కదా మీరు విజయం పొంది మహిమాన్వితులయ్యారు.” అని పల్కింది.

ఆ శక్తికి(బ్రహ్మమునకు) అత్యంత సమీపముగా ముందర వెళ్ళిన వాడు, ఆ శక్తి బ్రహ్మము అని తెలుసుకొన్న వాడు ఇంద్రుడు. అందుచేత ఇంద్రుడు అత్యంత మహిమాన్వితుడయ్యాడు.

తరువాత ఇంద్రుడి ద్వారా ఆ శక్తి బ్రహ్మము అని తెలుసుకొన్న అగ్ని, వాయువు కూడా మహిమాన్వి తులయ్యారు.

బ్రహ్మాన్ని తెలుసుకోవడం వల్ల వారు ముగ్గురూ దేవతలందరకూ పూజ్యనీయులయ్యారు.

ఈ కధలో అగ్ని వాక్కుకు అధిష్ఠాన దేవత,

వాయువు మనస్సుకు, బుద్ధికి అధిష్ఠానదేవత. వీరిద్దరూ ఇంద్రియాలకు ప్రతీకలు.

యక్షుడు బ్రహ్మము.

ఇంద్రియాల ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే భంగపాటే తప్ప బ్రహ్మ జ్ఞానం కలుగదు.

బ్రహ్మం అతీంద్రీయం అనే మొదటి అంశాన్ని ప్రస్తావించిందీ కధ.

తరువాత ఇంద్రుడు ఆత్మకు సంకేతం.

జీవాత్మకు పరమాత్మకు తేడా లేదు.

జీవులలో విడివిడిగా ఉన్నప్పుడు జీవాత్మ అంటారు.

విశ్వవ్యాప్తంగా ఉండి విశ్వానికంతా చైతన్యానిచ్చేదానిని పరమాత్మ అని అంటారు.

ఇక్కడ ఇంద్రుడు (జీవాత్మ) యక్షుడు (పరమాత్మ) దగ్గరకు వెళ్ళే సరికి యక్షుడు మాయమయ్యాడంటే అర్ధం జీవాత్మ పరమాత్మ లో లీనమైనప్పుడు రెండు ఉండేటందుకు వీలు లేదు.

ఇంద్రుడికి ఆ అద్వైత జ్ఞానం కలిగింది కనుక యక్షుడు కనిపించలేదు.

తానే ఆ బ్రహ్మం అని తెలుసు కొన్నాడన్న మాట.

“ఈలాంటి జ్ఞానం పరిశుద్ధమైన మనస్సు, బుద్ధి గలిగివాడు పరమాత్మ తప్ప ఇంకెవరూ లేరు” అనే జ్ఞానం కలిగినప్పుడే కలుగుతుంది.

అంటే అద్వైతసిద్ధి కలుగుతుంది. అది ఇంద్రుని కి కలిగింది.

ఉమాదేవి విజ్ఞానానికి దైవ శక్తికి ప్రతీక.

దైవానుగ్రహము లేనిదే బ్రహ్మ జ్ఞానం పొందడం అసాధ్యమని తెలుస్తోంది.

ఈ కధ ఉపదేశాత్మకమై నది.

దేవతలకు కూడామనలాగే ఎక్కువ భోగలాలసత్వం ఉంది. వారు దేహేంద్రి యాభిమానంతో పరమాత్మను ఉపేక్షంచినప్పుడు వారికి “దేహేంద్రయాలకు అతిరిక్తమైన బ్రహ్మం ఉందని” నిరూపించి వారి అహంకారాన్ని పటాపంచలు చేయడమే ఈ కధ సారాంశము.

ఇటుపైన సోమ, బుధ, శుక్రవారాలు ఉపనిషత్తులు చదువుకొందాం.(వారంలో మూడు రోజులు)

13. ఉపనిషత్తులు – కేనోపనిషత్తు (Continuation)

దేహేంద్రియాలకు అతిరిక్తమైన బ్రహ్మము ఉందన్న ఉపదేశానికి తరువాత బాహ్యంగా క్షణమాత్రం లో ఏ విధంగా బ్రహ్మం మెరుపులా అభివ్యక్తం అవుతుందో చెప్పేరు.

తదనంతరం దేహంతర్గత విషయం చెప్పబడుతోంది.

ఈ మనస్సు – అంతఃకరణము బ్రహ్మమునకు అతి సమీపముగా వెళ్ళుచున్నట్లు ధ్యానము చేయాలి.

ఆ సామీప్యం వల్ల మనస్సుకు ధ్యానము ద్వారా ఆత్మను గురించిన చింతన క్రమక్రమంగా కలిగి ఆత్మావలోకనానికి దారి తీస్తుంది.

ఇది అంతర దృష్టితో బ్రహ్మ జ్ఞానం పొందే పద్ధతి.

“తద్ద తద్వనం నామ తద్వన మిత్యుపాసితవ్యం”

వనం అనే శబ్దంలో సర్వానికి ఆనంద స్వరూపమనే అర్ధం ఉంది. ఆ ఆనంద స్వరూపాన్ని( ఆత్మను) ఉపాసించాలి.

ఇలాంటి బ్రహ్మజ్ఞానముండే వ్యక్తి యొక్క కృపను పొందాలని “సర్వాణి భూతాని సం వాంఛతి” సమస్త ప్రజలు కోరుకొంటారు.

తపస్సు, దమం,కర్మ- వీటి పైనే జ్ఞానం ప్రతిష్టితమై ఉంది.

అంటే జ్ఞాన ప్రాప్తికి ఇవే ఆధారాలు.

“ప్రతిష్టా వేదాః సర్వాంగాని| సత్యమాయతనం….”

ఎంతో మంది జ్ఞానుల ద్వారా ప్రకటింపబడిన సకల వేదాలు ఆ జ్ఞానపు అంగాలే. శాశ్వతమైనట్టి బ్రహ్మమేవాటికి ఆశ్రయ స్తానం.

అంటూ గురుదేవులు

“నాయనా! ఉపనిషత్తును నీకు పూర్తిగా ఉపదేశించాను.

నీ ధర్మాన్ని నీవు విధిగా పాటించాలి.

పాండిత్యం ముఖ్యం కాదు, ప్రవర్తన ముఖ్యం.

నైతిక జీవనం, ఆధ్యాత్మిక భావాలు అనే రెండింటి తో నీ మార్గం సుగమము అవుతుంది.

ఇలా తెలుసుకొన్న వ్యక్తి (జీవాత్మ)పాపాల నన్నింటినీ అంతం చేసుకొని పరమాత్మలో ఐక్యమవుతాడు. అదే జీవన గమ్యం. బ్రహ్మావలోకనం కంటే మానవుడు సాధించ వలసిన ఉత్తమ స్థితి మరొకటి లేదు”.అంటూ కేనోపనిషత్తును ముగిస్తాడు.

ఈ ఉపనిషత్తును ఈశావాశ్యోపనిషత్తు తో కలిపి మరొక్కసారి చదవండి. ఎంతటి మహత్తరమైన సందేశమో అర్ధం అవుతుంది.

సాధన చతుష్టయాన్ని ఆచరణలో పెడుతూ  ఈ ఉపనిషద్విచారణను మానసికంగా చింతనలో తపింపజేయండి. తప్పక ఉపయోగం ఉంటుంది. బుధవారం కఠోపనిషత్తు లోకి ప్రవేశిద్దాం.

14. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు

ఇప్పటి వరకూ మనం ఈశ, కేనోపనిషత్తుల పరిచయం చూశాము.

ఈశోపనిషత్తు జ్ఞాన కర్మలకు రెండికి ప్రాధాన్యం ఇస్తూ సత్తు- అసత్తు లకు అవతల ఉండేదేవుని గురించి, ఆ దేవునిలో ఐక్యమై జన్మరాహిత్యాన్ని పొందే మార్గాలను వివరించింది.

కేనోపనిషత్తు ఇంద్రియాలుకాని, మనస్సుకాని, బుద్ధి కాని, ప్రాణం కానీ ఆ బ్రహ్మాన్ని గ్రహించలేవు. వీటన్నిటికీ భగవంతుడే ఆశ్రయం కావటం వల్ల అతనికి సంబంధించిన జ్ఞానం మనకు అతని దయవల్ల మాత్రమే లభించాలి అని తెలియ పరచింది.

కృష్ణ యజుర్వేదానికి చెందిన కఠసంహిత ఇది. కొందరు ఇది సామవేదానికి సంబంధించి నదని, మరికొందరు అధర్వవేదానికి సంబంధించిన దని, ఋగ్వేదంలోని దశమ మండలంలో ముందుగా నచికేతోపాఖ్యానంగా చెప్పేరని రకరకాలుగా అంటారు.

ఏ వేదమునకు చెందినదో కూడా స్పష్టంగా నిర్ధారణ చేయలేక పోయారు. తైత్తరీయ బ్రాహ్మణం లో కూడా ఇదే ఉపాఖ్యానం చెప్పబడింది.

తక్కిన ఉపనిషత్తులతో పోల్చితే, కఠోపనిషత్తు ఒక ప్రత్యేక తరహాగా ఉండి విశేషంగా ప్రకాశిస్తుంది.

రమణీయమైన కావ్యశైలి, పటుతర తత్వం, నిగూఢ రహస్యం చక్కగాసమ్మిళితమై ఉంటాయి.

మరి యే ఇతర ఉపనిషత్తులోను లేనంత చక్కగా వేదాంత పరిజ్ఞానం ఈ ఉపనిషత్తులో వివరించ బడింది.

ఇది బ్రహ్మవిద్య. మహత్తర చర్చనీయాశం. జీవాత్మ పరమాత్మల గురించి చెప్పే శాస్త్రం.

ఈ ఉపనిషత్తులోఆరు అధ్యాయాలు న్నాయి.

మొదటి అధ్యాయంలో మిగిలిన ఐదు అధ్యాయాలలో వివరింపబడిన తత్వానికి ఉపోధ్గాతం ఉంది.

వీటిలో సావధిక స్థితి నుండి అనంతత్వం వైపు; అజ్ఞానంధకారం నుండి జ్ఞానప్రకాశంవైపు; మృత్యువు నుంచి అమృతత్వం వైపు మానవుడు సాగించే ప్రయాణాన్ని వివరించారు.

కృష్ణయజుర్వేదం లోని కఠ, తైత్తరీయ ఉపనిషత్తులు
“ఓం సహనావవతు సహనౌ భునక్తు…” అనే శాంతి మంత్రంతోమొదలవుతాయి.

వచ్చే భాగంలో ఈ శాంతిమంత్రంగురించి తెలుసుకొందాం.

15. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

కఠోపనిషత్తు ఈ శాంతిపాఠంతో మొదలవుతుంది.

ఓం సహనావవతు
సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు
మా విద్విషావహై||

అతడు మా ఇద్దరినీ రక్షించనీ. ఇద్దరం కలసి వీర్యాన్ని పొందుదాం. మా అధ్యయనం తేజోవంతము అగు గాక.(సత్యజ్ఞానాన్ని పొందటానికి, గ్రహిచడానికి బుద్ధి బాగా చురుకుగా అవనీ). మాలో వైషమ్యాలు లేకుండా ఉండనీ.

ఇక్కడ భాష్యకారులంతా గురు శిష్యులిద్దరినీ బ్రహ్మ కాపాడాలని, వారిద్దరూ సహ వీర్యవంతులై- అంటే- బ్రహ్మజ్ఞాన సమూపార్జనలో అవసరమైన గ్రహణశక్తి తీక్షణమయ్యేటందుకు కావలసిన శక్తే వీర్యము – దానిని ఇద్దరు కలసి పొందాలని ఆకాంక్షగా చెప్పారు.

మన అధ్యయనం – స్వాధ్యాయం ఏకాగ్రతను, సమగ్రతను పొంది ఫలప్రదమగు గాక!

మనమిద్దరం (గురుశిష్యులిద్దరు)పరస్పరం ద్వేషించు కొనకుండా ఉందుము గాక!

ఈ సందర్భంలో శ్రీ యోగి అచ్యుతులు సూక్ష్మానికి అన్వయించిన విధానం చూద్దాం:

సూక్ష్మంగా వ్యక్తి యొక్క దేహంలోని- (ధ్యానానికి కావలసిన సహకారాన్ని అందించే) ప్రాణశక్తిని, మనస్సును గురుశిష్యుల తో సమన్వయించారు.

జ్ఞానాన్ని అవగతం చేసుకోవాలంటే తీక్షణమైన గ్రహణశక్తి కావాలి. గ్రహణశక్తికి అవసరమైనది వీర్యశక్తి.

ప్రాణము మనస్సులు మిలనమయ్యే యోగ స్థితి వీర్యోత్పత్తికి మూల స్తానము.

ఆ వీర్యాన్ని ప్రాణము మనస్సు కలిసి పొందాలని భావము.

అధ్యయనం అంటే – ఎక్కువ గ్రంథాలు చదవడం ద్వారా వచ్చేది అవిద్య మాత్రమే కాని జ్ఞాన ప్రాప్తి కాదు.

అధ్యయనం అనేది అంతర్ముఖ స్ధితిలో సత్యాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం అని అర్ధం చేసుకోవాలి.

ప్రాణ మనోమిలనమే ఆ అధ్యయనానికి సాధనం.

ఆ యోగ స్తితికి ఇంద్రియ వృత్తుల వల్ల కలిగే మనశ్చాంచల్యం, దేహంలోని మలినాలవల్ల ప్రాణగతిలో వచ్చే అవరోధాలను అంతరింప జేయాలన్నదే ప్రార్ధన. (మావిద్విషావహై)

(ప్రాణ మనోమిలనము ఎలాజరుగుతుంది? ఆ సంయోగము తర్వాత సాధకుని మనస్తత్వం ఎలాఉంటుందో మరొకసారి సందర్భం వచ్చినప్పుడు చర్చించుకొందాం.

ఈ శాంతి మంత్రంతో మొదలయిన నచికేతోపాఖ్యానమనే కఠోపనిషత్తును వచ్చే భాగంలో మొదలు పెడదాం.

16. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

కృష్ణ యజుర్వేదం లోని కఠ బ్రాహ్మణానికి చెందిన ఈ కఠోపనిషత్తు ఒక చక్కని కధతో మొదలవుతుంది.

అరుణి మహర్షి కి జన్మించిన ఆరుణి నిత్య అన్నదానం చేయడంద్వారా వాజశ్ర్రవసుడని పేరుపొందేడు. ఇతనికే ఉద్దాలకుడని పేరు కూడా ఉంది.

ఈ మహర్షికి శ్వేతకేతు, నచికేతు అని ఇద్దరు కొడుకులున్నారు.

వాజశ్రవసుడు విశ్వజిద్యాగం మొదలు పెట్టాడు. ఈ యాగాంతం లో తనకు గల సమస్త సంపదలనూ దానం చేయాలి. ఆ క్రమం లో తన వద్ద నున్న గోవులను కూడా దానం చేస్తున్నాడు.

అందులో అనేకం ఉపయోగం కాని ముసలి ఆవులు, వట్టిపోయినవి, అవిటి ఆవులు ఉన్నాయి.

ఆవిప్రుని చిన్న కొడుకు నచికేతుడు(నచికేతసుడు), సుమారు ఆరు సంవత్సరాల వయస్సు వాడు, అట్టి గోవుల దానం వల్ల తన తండ్రికి దుర్గతి కలుగుతుందని, జన్మాంతంలో సుఖం లేని లోకాలు ప్రాప్తిస్తాయని తలచి తండ్రికి హితం చేయాలనే ఉద్దేశంతో తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రీ! ఈ యాగం లో నీకున్న సర్వస్వం దానం చేయాలి కదా! మరి నన్నెవరికిస్తావు? అని సూఠిగా అడిగాడు.

వాజశ్రవసుడు నిర్ఘాంతపోయాడు. తన దారాపుత్రాదులు కూడా తన సర్వస్వం లోనే అనే కోణంలో ఎన్నడూ ఆలోచించలేదు.

చిన్న పిల్లవాడైన నచికేతుణ్ణి అదిలించి పెద్ద మాటలు వద్దు పోయి నీపని చూసుకో అని పంపేస్తాడు.

రెండవసారి మళ్ళీ వచ్చి నాయనా! మరి నన్నెవరికిస్తావు? అని రెట్టిస్తాడు. తిరిగి విసుగుకొని పంపేస్తాడు.

అయినా నచికేతుడు ఊరుకోకుండా మూడవ సారి తండ్రిని సమీపించి తిరిగి అదే ప్రశ్నను అడుగుతాడు.

తన పుత్రుడు తనని పరిహాసం చేస్తున్నాడని ఉద్దాలకుడు అసహనంతో “ఫో! నిన్ను ఆ మృత్యువుకిస్తున్నాను” అంటాడు.

తర్వాత క్రోధం తగ్గి పశ్చాత్తాపంతో చింతిస్తాడు.

అయినా తండ్రికి అసత్య దోషం రాకూడదని, తనను యముని వద్దకు పంపాలని, మానవజన్మ శాశ్వతంకాదనీ, ఈవిషయంలో చింతించకూడదని తండ్రిని ఓదారుస్తాడు.

అప్పుడే నచికేతునికి ఒక అశరీరవాణి వినిపిస్తుంది.

“నచికేతా! మృత్యువు ఇంటలేనివేళ మృత్యు నిలయానికి చేరి నిరాహారుడవై మూడు రాత్రులు గడుపు.

ఎన్ని రాత్రులు ఇక్కడ ఉన్నావు? అని మృత్యువు ప్రశ్నిస్తే మూడని చెప్పు.

మొదటి రాత్రి ఏమి తిన్నావు? అనడిగితే నీ సంతతిని అని చెప్పు.

రెండవ రాత్రి ఏమి తిన్నావు? అంటే నీ పశువులను అని చెప్పు.

మూడవ రాత్రి ఏమి భుజించితివి అనడిగితే నీ కర్మలను అని చెప్పు.

నీకు శుభమగుగాక” అని పలికింది.

17. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

అశరీరవాణి మాటలు విన్నాక, నచికేతుడు బయలుదేరి యముడు ఇంట లేని సమయంలో యమసదనాన్నిచేరి నిరాహారిగా మూడు రాత్రులు గడుపుతాడు.

యముడు ఇల్లు చేరేసరికి యముని ఇంట్లోని వాళ్ళు చెబుతారు – భగ భగ మండుతున్న అగ్ని శిఖలా ప్రకాశిస్తున్న బ్రాహ్మణుడు మూడు దినాలనుంచి నిరాహారుడై నీ రాక గురించి ఎదురు చూస్తున్నాడు. – అని.

అగ్నిని సరిగ్గా గమనించకపోతే ఇంటినంతనీ ఏరకంగా తగలపెడుతుందో, అదే విధంగా బ్రాహ్మణుని కోపం గృహస్థు యొక్క సౌఖ్యాన్ని నశింపజేస్తుంది. – అని.

నిరాహారుడై బ్రాహ్మణుడు ఏ ఇంట్లో ఉంటాడో అక్కడ ఆశలు, ప్రతీక్ష, సత్సాంగత్య ఫలం, సూనృతవాక్ఫలం, శుభ కర్మలు, పుత్రులు, పశువులు సమస్తము నశించిపోతాయి.- అని శాస్త్రం.

ఈ విషయాలన్నీ తెలుసున్న యమధర్మరాజు తన పుత్రులను పాదోదకం తీసుకొని రమ్మని, నచికేతుని సమీపించి ” ఓ బ్రాహ్మణుడా! పూజింపదగిన అతిధివై మూడురాత్రులు నిరాహారిగా నాఇంట ఉన్నావు. కనుక నీకు మూడు వరాలు అనుగ్రహిస్తున్నాను. కోరుకో. నీకు నా నమస్కారం. నాకు శుభము కలుగు గాక.

ఓ యమధర్మరాజా! శాంత సంకల్పుడు, చక్కని మనస్సు కలవాడు, నశించిన క్రోధము గలవాడు అగునట్లుగా గౌతముని(వాజస్రవసుని) చేయ వలసింది.

నీ యొక్క అనుగ్రహం పొంది ఇంటికి జేరబోతున్న నన్ను నా తండ్రి గుర్తించి స్వీకరించునట్లు చేయుము.

ఇది నాకు మొదటి వరముగా అనుగ్రహించుము.

తధాస్తు. నీ తండ్రియగు ఔద్దాలక ఆరుణి నాచే పంపబడిన నిన్ను చూచి గుర్తించి, వెనుకటివలె ఆదరించునని, గతించిన క్రోధము గలవాడై రాత్రులందు సుఖముగా నిద్రింపగలడని శాసించు చున్నాను.

అని మొదటివరాన్ని అనుగ్రహించాడు యముడు.

తర్వాత స్వర్గలోక ప్రాప్తికి సాధనమైన అగ్ని ఉపాసనా విధానాన్ని తెలుపమని రెండవ వరంగా అడిగాడు.

ఏ భయములేని ముసలితనం, ఆకలిదప్పులు, శోకము లేని, యముని ఊసే తెలియని ఆనందమయమైన స్వర్గ లోక ప్రాప్తికి మూల కారణమైన అగ్నికి సంబంధించిన యాజ్ఞిక శాస్త్రాన్ని నా కనుగ్ర హించుము.

(స్వర్గకాములకు లభింపగల అమృతత్వము దేవతల అమృతత్వము తో సమానమైనది. కల్పాంతము వరకూ వారు స్వర్గం లోవసింపగలరు.) అనే రెండవ వరాన్ని కోరుకొంటాడు.

నచికేతుని మేధస్సుకు ఆశ్చర్యపడి మెచ్చుకొని ఇకపై ఆ యజ్ఞపు అగ్ని “నచికేతాగ్ని” గా పిలవబడుతుందని చెప్పి రెండవ వరాన్ని కూడా ప్రసాదించేడు యముడు.

వచ్చే భాగంలో మూడవ వరం గురించి, మిగిలిన వివరాలను తెలుసుకొందాం.

18. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

బుద్ధి అనే గుహలో నిక్షప్తమైన ఆ స్వర్గలోక ప్రాప్తికి సాధనమైన అగ్ని విద్యను తెలుసుకొని, పునర్జన్మ లేని స్థితిని పొందమని, ఆ అగ్నివిద్యను సాంగోపాంగం గా నచికేతునికి ఉపదేశించాడు. ఆ అగ్ని నచికేతాగ్నిగా పిలవబడుతుంది అని వరాన్ని ప్రసాదించాడు.

అయితే పై రెండు వరాలు నచికేతుని ఆధ్యాత్మిక జిజ్ఞాసను తృప్తి పరచలేక పోయాయి.

అప్పుడు మూడవ వరంగా, ఆత్మ తత్వాన్ని తెలియజేసే బ్రహ్మ విద్యా విషయాన్ని కోరాడు

-ఓ యమధర్మరాజా! మానవుడు చనిపోయాక ఆత్మ ఉంటుంది అని కొందరు, ఉండదు అని కొందరు అంటున్నారు.

నీ ఉపదేశమును విని, ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోదలచాను. అన్నాడు నచికేతుడు.

అప్పుడు యమధర్మరాజు
‘ఈ విషయంలో పూర్వము దేవతలు కూడా సందేహాన్ని వెలుబుచ్చారు. ఈ విషయం అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనది. సరిగా అర్ధంకానిది కూడాను. అందుచేత మరొక వరాన్ని కోరుకో.’ అన్నాడు.

‘దేవతలు సహితం ఈ విషయంలో సందేహం వెలిబుచ్చారని, ఇది సులభముగా తెలుసుకొనబడ జాలనిది అని నీవే అంటున్నావు కదా!

ఓ మృత్యుదేవతా! ఈ విషయాన్ని వివరించడానికి నీ వంటి ఇంకొక గురువు లేడు-

ఈ వరము తో సమానమైన వరం ఇంకొకటి లేదు.’ అన్నాడు నచికేతుడు.

మరణానంతర స్థితిని గురించి మృత్యుదేవత తప్ప ఇంకెవ్వరు చెప్పగలరు?

మృత్యువు తో మీమాంస జరిపితే ఆధ్యాత్మిక తత్వం అభివ్యక్తం కాక తప్పదు కదా!

అప్పుడు యమధర్మరాజు అంటున్నాడు:

“పశు సమూహము, ఏనుగులు, గుర్రాలు, బంగారము కలిగి నూరు సంవత్సరాలు జీవించే పుత్ర పౌత్రులను కోరుకో. నీకు కావలసినన్ని సంవత్సరాలు జీవించు.

ఈవరము తో ఏది సమానమని అనుకొంటావో దానిని కోరుకో. ధనాన్ని, చిరంజీవత్వాన్ని కోరుకో.

ఓనచికేతా! ఈ మహా భూమి నంతనీ తీసుకో. ఈ మర్త్యలోకంలో మానవులు వాంఛించే విషయాలు ఏవేవి దుర్లభాలో, వాటినన్నింటినీ నీ ఇచ్ఛానుసారం కోరుకో.

రధాలు, సంగీత వాయిద్యాలు, వాటి వెంట వచ్చే సుందరమైన స్త్రీలు మనుష్యులకు లభించరు. నేను నీకు ప్రసాదిస్తాను. వారితో సుఖంగా ఉండు.

కానీ ఓ నచికేతా! మృత్యువు గురించి మాత్రం మరల ప్రార్ధించొద్దు.”

“ఓ మృత్యుదేవతా! నీవు చెప్పినవన్నీ నశ్వరములు. పైగా మానవుని సర్వేంద్రియాలలో గల తేజస్సును జీర్ణింపజేస్తాయి. మానవుని జీవితము స్వల్పమే కదా!

వినాశము లేని అమృత జీవుల సమక్షములో జేరి, వారివద్దనుండి ఉత్కృష్టమైన ప్రయోజనం పొందవచ్చని తెలుసుకొన్న ఏమానవుడు ఈనృత్యగీత సుఖాలలో ఆసక్తుడౌతాడు?”

అంటూ నచికేతుడు వినమ్రతతో ప్రార్ధిస్తాడు.

“యస్మి న్నిదం విచికిత్సంతి మృత్యో
యత్సాంపరాయే మహతి బ్రూహినస్తత్”

“ఓ మృత్యువా! శరీర పాతానంతరం ఉండే ఏ జీవితం గురించి అందరూ సంశయము కలిగి ఉన్నారో ఆ మహా జీవితం గురించి నాకు వివరంగా చెప్పు. ఈ అతి గూఢమైన వరాన్ని తప్ప వేరొకదానిని నచికేతుడు కోరలేడు.”

19. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

పరావిద్యను కోరగోరే వాడికి, దానిని చక్కగా అర్ధం చేసుకోవడానికి సుశిక్షితమైన, స్వచ్ఛమైన, పరిపుష్టమైన మనస్సు అవసరం.

అతడు సాధనచతుష్టయ సంపన్నుడు కానిదే ఆత్మవిద్యను పొందలేడని అర్ధం అవుతూంది.

నిత్యానిత్యవస్తువివేకము, ఇహాముత్రఫల భోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి మరియు ముముక్షుత్వము అనే సాధన చతుష్టయ సంపద నచికేతునకు ఉందా, ఆత్మ విద్యను సరిగ్గా గ్రహించే సామర్ధ్యం ఉన్నదా అని తేల్చుకొనేటందుకు రకరకాలుగా పరీక్షిస్తున్నాడు యముడు.

సుఖ మార్గాలు రెండు. ఒకటి శ్రేయో మార్గం. రెండవది ప్రేయోమార్గం.

దేవుని దయతో మాత్రమే లభ్యమయ్యే జ్ఞాన మోక్షాలే శాశ్వత సుఖమన ి(అమృతత్వము అని) గ్రహించి యోగమార్గము ద్వారా జ్ఞాన ప్రాప్తి కోసం ప్రయత్నించడమే శ్రేయోమార్గం.

ఇహ లోకంలో సుఖం, అలాగే చనిపోయాక స్వర్గాది సుఖాలనో, ముందరి జన్మలో సుఖానుభవాన్నో కోరుకొంటూ చేసే కర్మ, పూజ వ్రతం, యజ్ఞం- ఇవన్నీ కలిపితే అదే ప్రేయోమార్గం.

జ్ఞానమనేది తర్కంతో కాని, వినడం ద్వారా గాని లభించదు. సూక్ష్మాతిసూక్ష్మము, అత్యంత శక్తివంతము అయిన ప్రణవమే దాని మూలం.

ప్రణవోపాసనలో కల్గే ఆత్మ ప్రసన్నత వల్లనే జ్ఞాన ప్రాప్తి ఔతుంది.

దాన్ని కోరుకొనే వాడు ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకొని, బుద్ధిని నిర్వికారం చేసి, పరమాత్మ ధ్యానంలో లీనం కావాలి.

ధ్యాన యోగంతో అతణ్ణి దర్శించి, తీక్ష్ణ బుద్ధితో అతన్ని తెలుసుకోవాలి.

మనస్సు యొక్క చాంచల్యం లేని స్ధితే ధ్యానం.

దీని సాధనకు అవసరమైన ఆత్మతత్వం అతి సూక్ష్మ పరిమాణంలో ప్రతి జీవిలోనూ ఉంది.

అందువల్ల, ఆత్మజ్ఞానం తనలోనే కలుగుతుంది. బయట కలుగదు. అంటే బహిర్ముఖ స్ధితిలో కలుగదు.

ఆత్మ జ్ఞానం పూర్ణంగా లభించడమనేది మానవ జన్మలోనే సాధ్యం.

దేవ పితృలోకాల్లో ఇది సాధ్యంకాదు.

అందువల్ల, దేవుని ఉనికిపై స్ధిరమైన నమ్మకం కలిగి, సాధన ద్వారా యోగస్ధితిని పొందాలి.

హృదయం నుండి వివిధ దిక్కులకు 101నాడులు వెడుతున్నాయి.

వాటిలో సుషుమ్నా అనే నాడి ఊర్ధ్వగమనాన్ని సాధిస్తేనే యోగ స్థితి సాధ్యం.

జ్ఞానప్రాప్తి తో ఇంద్రియ సుఖాధి సర్వ మోహాలు నశించి పూర్ణ సత్య సాక్షాత్కారమై ఆ వ్యక్తి జీవన్ముక్తుడౌతాడు.

ఇదీ ఈ ఉపనిషత్తు యొక్క సమగ్ర సారాంశము.

20. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

ఇప్పుడు నచికేతుడు రెండవ వరంగా కోరిన నచకేతాగ్ని గురించి తెలుసుకొందాం.

స్వర్గ ప్రాప్తికి సాధనమైన అగ్ని ఉపాసనా క్రమాన్ని తెలపాలని నచికేతుడు అడిగాడు.

ఆ అగ్ని గురించి చెబుతూ అగ్నియొక్క ఉపాసనతో జనన మరణ చక్రం నుండి జనులకు విముక్తి లభిస్తుంది అంటాడు యమధర్మరాజు.

త్రిణాచికేత స్త్రిభిరేత్య సంధిం
త్రికర్మకృత్త రతి జన్మమృత్యూ
బ్రహ్మజజ్ఞం దేవమీడ్యం విదిత్వా నిచాయ్యే మాం శాంతి మత్యంతమేతి!!

జన్మ మృత్యువులను దాటటమే కాదు ఆ అగ్ని గురించి తెలుసుకొని పరమ శాంతిని (మోక్షాన్ని) పొందుతాడని చెబుతాడు.

ఇక్కడ యముడు అగ్నిపూజ తో ” నిచాయ్యే మాం శాంతి మత్యంత మేతి” అని చెప్పడం వల్ల మోక్షాన్ని పొందుతాడని పల్కడం చూస్తే నచికేతుని అభిప్రాయం లో స్వర్గం అంటే మోక్షమని, జనన మరణాలలో పడవేసే మామూలు స్వర్గం కాదని అర్ధమవుతోంది.

మూడు రకాల అగ్నులను ( అహవనీయ, అన్వాహార్య, గార్హపత్య) స్థాపించి, అగ్నిహోత్రి దానికి సంబంధించిన మూడు కర్మల (జ్ఞానం, అధ్యయనం, అనుష్ఠానం) గురించి తెలుసుకొని యజ్ఞ దాన కర్మలలో నిమగ్నమై పోయేవాడే జన్మ మృత్యువులను గెలవ గలుగుతాడు. అనే అర్ధము కనబడుతుంది.

అనంత లోకాప్తి మధో ప్రతిష్ఠాం
విద్ధిత్వమేతం నిహితం గుహాయామ్!!

హృదయ కుహరంలోని గుహలో అగ్ని నిగూఢంగా ఉంది. హృదయం లో సుప్త స్థితిలో ఉండటంవల్ల జనసామాన్యానికి తెలియని రీతిలో ఉంది. దీనిని బట్టి చూస్తే నచికేతునికి తన దేహంలోనే చేయవలసిన అగ్ని ఉపాసనాక్రమాన్ని తెలియ చేస్తున్నాడని స్పష్టమౌతోంది.

శ్రీ యోగి అచ్యుతుల ఉద్దేశ్యంలో

స్థూలాగ్ని పూజతో కాని, యజ్ఞ, దాన, కర్మలతో కాని, గ్రంథాలతో కాని, జ్ఞానం లేకుండా అనుష్ఠానమని చేసే వ్రతం, పూజ, మంత్ర తంత్రాలతో జన్మ మృత్యువులను దాటే సామర్ధ్యం పొందడం, పరమశాంతిని పొందడం సాధ్యమే కాదు.

అందువల్ల, ఇక్కడ ” త్రిణాచికేత స్త్రిభిరైక్య సంధిం” అనే దానికి, మన దేహంలో ఉపాసించాల్సిన విద్య యొక్క క్రమాన్ని ఇలా చెప్పేరు-

మూడు అగ్నులంటే – ప్రాణాయామ ప్రక్రియలో మొదట వాయు మధనం వల్ల పుట్టే అగ్ని(వేడి),

రెండవ స్థితిలో ఆ వేడే ఊర్ధ్వముఖమై, తీవ్రమై విద్యుత్తుగా వివిధ రూపాలను ధరించే విద్యుదగ్ని,

మూడవ స్థితిలో ఈ వాయువుకు అగ్నికి( వేడి, విద్యుత్తులకు) మూలమైన ప్రాణాగ్ని యొక్క ఊర్ధ్వ గమనం.

ఈ ప్రాణాగ్ని శిరస్సులో చేరేక మృత్యువు నుండి దాటే ఇచ్ఛామరణ స్థితి లభిస్తుంది.

ఈ మూడింటిని సరయిన నిష్పత్తిలో, సముచిత రీతిలో ఉపాసిస్తే ప్రాణం బ్రహ్మరంధ్రం లో చేరాక జీవాత్మల ఐక్య స్థితి కలుగుతుంది.

దానినుంచి మనలో కలిగే జ్ఞానాగ్ని ద్వారా పరమ శాంతిని అంటే మోక్షాన్ని పొందడం సాధ్యమౌతుంది.

నచికేతమనే అగ్నిష్టోమాన్ని మూడు సార్లు(త్రికాల సంధ్యల లోనూ) చేస్తూ ఉండాలి.

మూడు గతులను ఉపదేశము పొంది ఉండాలి. మూడు గతులలోనూ, అంటే రుద్ర, విష్ణు, బ్రహ్మ గతులలో ఋక్ యజు స్సామ విధానంలో బ్రహ్మ విద్యోపాసన అభ్యసించాలి.

ఇలా క్రమాన్ని తెలుసుకొని తగిన ఆహార విహార నియమాలను (ఇష్టకా) అనుసరిస్తే సాధకుడు ఇచ్ఛా మరణాన్ని పొంద గలుగుతాడు.

ఇలా నచికేతాగ్నితో (ప్రాణోపాసనతో) మృత్యువు నుండి బయటపడి, మహర్లోకం, అచటినుంచి తపోలోకం చేరి ఆత్మయొక్క అనుగ్రహంతో బ్రహ్మ లోకం చేరుకొంటారు.

ఆ కల్పాంతం వరకూ వాళ్ళకూ బ్రహ్మ తో తాత్కాలిక మోక్షం.

ఆ బ్రహ్మ లోకానికి కూడా ఆశపడక, మరింత తపించి దేవుని కృపకు పాత్రులైన వాళ్ళు అమృతత్వాన్ని పొంది అజరామరులౌ తారు.

21. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

నచికేతుడు అడిగిన మూడవ ప్రశ్న-

మరణం తర్వాత ఆత్మ యొక్క ఉనికి ఉందో? లేదో?

అనే ప్రశ్న లో మరణం అంటే కేవలం దేహాన్ని విడవడం కాదు.

ఎందుకంటే దేహత్యాగం తరువాత పునర్జన్మ, స్వర్గం, నరకం మొదలైనవి ఉన్నాయని నచికేతునికి తెలుసు.

అందువల్ల ఇక్కడ మరణం అంటే మోక్షం, అంటే సాయుజ్యం, విదేహముక్తి, దేవునిలో కలిసి పోవడం అనే అర్ధం.

ఇలాంటి స్థితిని పొందినవాళ్ళు అక్కడ ఆత్మ అస్తిత్వం ఉందో లేదో అనే అంశాన్ని చెప్పడానికి ప్రయత్నించరు.

అందుకనే ఈ నిగూఢమైన విషయం పై దేవతలు కూడా తర్క వితర్కాలు చేస్తున్నారు అని చెబుతూ యమధర్మరాజు ఇలా అంటున్నాడు.

ముక్తి సాధనా మార్గం బాలబుద్ధికి స్పురించదు.

ఉండేది ఇహం ఒక్కటే. పరం అనేది లేదని భ్రమలో ఉంటారు.

ధనాదుల మోహానికి బలై మళ్ళీ మళ్ళీ జనన మరణాల పాశానికి బలైపోతారు.

శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః
శ్రుణ్వంతో పి బహవో యం న విద్యుః
ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా
శ్చర్యో జ్ఞాతా కుశలాను శిష్టః

ఆత్మను గూర్చి వినడానికి కూడా చాలామందికి లభ్యం కాదు.

ఒకవేళ విన్నా కూడా దానిని అవగాహన చేసికోలేరు.

ఆత్మను గురించి చెప్పేవాడు ఆశ్చర్యప్రదుడే.(ఆత్మ జ్ఞాని దొరకడమే ఆశ్చర్యకరమైనది).

దానిని విని చక్కగా అవగాహన చేసుకొనే అతి సూక్ష్మ బుద్ధిగల శిష్యుడు కూడా ఆశ్చర్యప్రదుడే.

తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం
గుహాహితం గహ్వరేష్ఠం పురాణం
ఆధ్యాత్మయోగాధిగమేన దేవం
మత్వా ధీరో హర్షశోకౌ జహాతి.

అనాదిసిద్ధము, దేవతాస్వరూపము, చూడటానికి సాధ్యంకానిది. రహస్యమైనది.

దుర్గమ మార్గంలోఅత్యున్నత స్ధానంలో హృదయమనే గుహలో ఉన్నది.

అంతర్యామి మరియు శాశ్వతుడు అయిన ఆ పరమాత్మను ఆధ్యాత్మ యోగంతో చేరి ధీరులైన వాళ్ళు హర్ష శోకాలనే ద్వంద్వాలను దాటుతారు.

అని యమధర్మరాజు చెప్పగా

నచికేతుడు “ధర్మాధర్మములకన్నా, కార్య కారణములకన్నా, జరిగినదానికన్నా, జరుగబోయే దానికన్నా విలక్షణముగా దేనినైతే చూస్తున్నావో దానిని నాకు చెప్పు” అని అడిగేడు.

యముడీవిధంగా సమాధానమిచ్చేడు.

సర్వే వేదా యత్పద మామనన్తి
తపాంసి సర్వాణి చ యద్వదంతి!
యదిచ్చంతో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్!!

సకల వేదములు దేనిని పరమావధిగా చెప్పుతున్నాయో,

ఏది సమస్త తపస్సులకు పరమావధి అని పిలవబడుతోందో,

దేనిని కోరి ప్రజలు బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంభిస్తున్నారో

దానిని సంగ్రహంగా ‘ ఓం’ అని నీకు చెబుతున్నాను.

ఏతద్ద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరం పరం
ఏతద్ధ్ఞ్యేవాక్షరం జ్ఞాత్వాయో యదిచ్ఛతి తస్యతత్!

ఇదే అక్షర బ్రహ్మం. నాశరహితమైన ఆత్మ. పరతత్వం అంటే ఇదే.

ఈ అక్షరమే అన్నిటికన్నా శ్రేష్ఠమైనది.

ఈ అక్షర జ్ఞానాన్ని పొందిన వ్యక్తి తాను ఏం కాదలిచాడో అదే అవుతాడు.

అంటే అతడు ఆ బ్రహ్మ లో ఐక్యమై ముక్తుడు కావచ్చు. లేదా

దేహంలో ఉంటూనే జీవన్ముక్తుడై జగత్తుకు సేవ చేస్తూ ఉండిపోవచ్చు. అది అతని ఇష్టం.

వచ్చే భాగంలో :
కేనోపనిషత్తులో “మీరు దేనిని బ్రహ్మము అనుకొని పూజిస్తున్నారో అది బ్రహ్మము కాదు అంటూ దేనిని బ్రహ్మం అంటారని చెప్పేరో

దానిని ఒకసారి మననం చేసుకొని

ఈ ఉపనిషత్తులో ఇదమిత్థమని చెప్పిన
“ఏత ద్వైతత్” అంటూ ఆత్మను ప్రతిపాదించిన మంత్రాలను చూద్దాం.

22. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

ఆత్మ మాటలకందదని, శ్రవణానికి మనస్సుకూ అతీతమని చెబుతూ

తెలిసిన వాటికంటే భిన్నం, తెలియని వాటిని అధిగమించింది అంటూ

కేనోపనిషత్తు లో 4వ మంత్రంనుంచి 9వ మంత్రం వరకూ ఆత్మయొక్క అనంత స్వరూపాన్ని వర్ణించారు.

యద్వాచా నభ్యుదితం యేన వాగభ్యుద్యతే!
తదేవ బ్రహ్మత్వం విద్ది నేదం యదిదం ఉపాసతే!!

దేనిని వాక్కు తెలుపలేదో, దేనిచే వాక్కు ప్రకటితమౌతుందో అదే బ్రహ్మమని తెలుసుకో.

“యన్మనసా నమనుతే యేనాహుర్మనోమతమ్”

దేనిని మనస్సు చేత భావించడానికి సాధ్యం కాదో, దేని వల్ల మనస్సు పని చేస్తోందో అదే బ్రహ్మము.

“య చక్షుషా న పశ్యతి యేన చక్షూగ్ షి పశ్యతి”

దేనిని కళ్ళు చూడలేవో దేనిచేత కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడగలుగు తున్నాయో అదే బ్రహ్మ.

“యత్ శ్రోత్రేణ న శృణోతి యేన శ్రోత్ర మిదం శ్రుతమ్”

దేనిని చెవులు వినలేవో దేని శక్తి వల్ల ఈ శ్రవణేంద్రియం పని చేస్తూ ఉందో అదే బ్రహ్మ

“యత్ ప్రాణేన నప్రాణితి యేనప్రాణం ప్రణీయతే”
తదేవ బ్రహ్మత్వమ్

దేనిని ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమగు ప్రాణశక్తి చే తెలుసుకొనలేవో,

దేని ఇచ్ఛవల్ల ఈదేహమున ప్రాణము తన నిజ కర్మము నడపగలుగు చున్నదో అదియే బ్రహ్మము.

“త్వం విద్ది నేదం యదిద ముపాసతే”

కాని జనులందరూ భేద బుద్ధితో దేనిని బ్రహ్మమని పూజిస్తున్నారో అది బ్రహ్మము కాదు.

అంటే ఆలోచనా శక్తికి అందని, కనులతో చూడ శక్యం కాని, చెవులతో ఆలకించ శక్యంకాని వస్తువు ఏదయితే ప్రాణుని వల్ల జీవించి ఉందో అదేదీ బ్రహ్మం కాదు.

ఈ పైన చెప్పిన ఐదు మంత్రాలు పరబ్రహ్మ స్వరూపాన్ని ఘోషిస్తున్నాయి. అదే ఆ మహత్తరమైన ఆత్మ.

దానిని మనస్సు కాని మిగిలిన ఇంద్రియాలు కాని ప్రకటింపలేవు.

ఈ విధంగా కేనోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదిస్తే

కఠోపనిషత్తు లో మూడవ వల్లి నుంచి ఆరవ వల్లి చివర వరకూ ఆత్మ యొక్క మహత్ తత్వాన్ని అత్యంత సూక్మంగా ఎంతో వివరణాత్మకంగా యమధర్మరాజు బోధిస్తూంటే

భగవద్గీతనే సమగ్రంగా కఠోపనిషత్తులో ఇమిడ్చి మనకు అంద జేసేడా అనిపిస్తుంది.

నజాయతే మ్రియతే వా విపశ్చి
న్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్!
అజో నిత్యః శాశ్వతోయం పురాణో
న హన్యతే హన్యమానో శరీరే!!

జ్ఞానమయమైన ఆత్మ జన్మించదు, మరణించదు. ఇది దేనినుంచి ఉత్పన్నమవదు,

దీని నుంచి ఏదీ ఆవిర్భవించదు కూడా.

అజము, నిత్యము, శాశ్వతము అనాదిసిద్దము అయిన ఆత్మ, శరీరం నశించేటప్పుడు కూడా నాశనాన్ని పొందదు.

అణోరణీయాన్మహితో మహీయా
నాత్మాస్య జంతోర్నిహితో గుహాయాం!
తమక్రతుః పశ్యతి వీతశోకో
ధాతుప్రసాదాన్మహిమానమాత్మనః!!

ఆత్మ తత్వము:

అణువు కంటె సూక్ష్మమైనది, బ్రహ్మాండానికంటే ఘనమైనది అయిన ఆత్మ ప్రాణుల హృదయ కుహరంలో నివసిస్తూంది.

మనో బుద్ధి ఇంద్రియముల యొక్క కరుణ చే ఎవడు సంకల్ప వికల్పములనుండి విముక్తుడౌ తున్నాడో

అట్టి వాడు ఆత్మ యొక్క మహిమను సాక్షాత్క రించుకొని సర్వ శోకముల నుండి రక్షింప బడు తున్నాడు.

శరీర రహితము, సర్వవ్యాపి అయిన పరమాత్మను, అశాశ్వతమైన శరీరాలలో ఉన్న ఆ ఆత్మను
నిత్యునిగా, మహదాత్మ గా తెలుసుకొనిన ప్రజ్ఞావంతుడు శోకము నుండి విముక్తుడౌతాడు.

నాయమాత్మాప్రవచనేన లభ్యో….

వేదాధ్యయనం చేత కాని, బుద్ధి కుశలత చేతకాని, పాండిత్యము చేత కాని ఈ ఆత్మను పొందుట సాధ్యము కాదు.

ఆత్మను తప్ప మరి ఏ ఇతరాన్ని కోరని సాధకుని మాత్రమే ఆ ఆత్మ కరుణిస్తుంది.

అట్టి వానికే ఆత్మ లభ్యమౌతుంది.

ఆ ఆత్మే తన నిజ స్వరూపాన్ని అతనికి వెల్లడిస్తుంది.

(ఆత్మ తత్వాన్ని వివరించే అధ్యాయం అవడం వల్ల కేనోపనిషత్తు లోని ఆత్మ వివరణ కూడా ఇక్కడ ఇవ్వడమైంది.

రాబోయే రెండు భాగాల్లో కూడా ఆత్మ యొక్క సమగ్ర స్వరూపాన్ని సాక్షాత్తూ యమధర్మరాజు మాటలలో చదువుకొందాం)

దయ వుంచి ప్రతి వాక్యము ఒకటి రెండు సార్లు చదివి అర్ధం చేసుకోండి. ఇప్పటి వరకూ అయిన భాగాలను పునర్విచారణ చేసి అనుసంధానించు కొమ్మని నా మనవి.

23. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

దుష్ప్రవర్తన నుండి విరమించని వాళ్ళు, ఇంద్రియ లోలత్వాన్ని నిగ్రహించుకో లేని వాళ్ళు, శాంతి లేనివారు, సమాహిత చిత్తము లేనివారు, అశాంత మానసులు జ్ఞానముద్వారా( బౌద్ధికమైన జ్ఞానం) అయినా ఈ ఆత్మను పొందలేరు.

ఋతం పిబంతౌ సుకృతస్య లోకే
గుహాం ప్రవిష్టౌ పరమే పదార్ధే
ఛాయాతపౌ బ్రహ్మ విదో వదంతి
పంచాగ్నయో యే చ త్రిణాచికేతా!!

తమ పుణ్య కర్మ ఫలాన్ని అనుభవిస్తూ పవిత్రమైన హృదయాకాశంలోని బుద్ధిలో ప్రవేశించినవారు ఈ లోకంలో ఇద్దరున్నారు.

బ్రహ్మవిదులు వానిని వెలుగునీడలు అంటారు.

సత్య కర్మాచరణ కల్గిన వ్యక్తి దేహంలో, ఋతాన్నే(ధర్మాన్నే) త్రాగుతూ ( ఆహారంగా చేసుకొని), శ్రేష్ట స్థానంలో, అత్యున్నత స్థానంలో వెలుగు నీడల్లా ఇద్దరు(జీవాత్మ పరమాత్మలు) ప్రవేశించి ఉంటారని అంటారు.

మనిషికి, మనిషి నీడకు; దీపానికి, దీపపు వెలుతురుకు; వస్తువుకు, వస్తు గుణానికి మధ్య బాంధవ్యమే జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉంటుంది అని బ్రహ్మవాదం.

ఇక్కడ జీవాత్మను ఎండతో పోల్చారు. మండిపోయే స్వభావం కలది ఎండ. తపించే వ్యక్తి జీవాత్మ.

అతని తపస్సుకు నీడ చల్లదనాన్ని అందిస్తుంది. పరమాత్మ స్మరణ, దాని ద్వారా లభించే భగవత్కృపను నీడతో పోల్చడం జరిగింది.

ఆత్మయే (జీవాత్మ)రధికుడు. శరీరమే రధం. బుద్ధే సారధి. మనస్సే కళ్ళెము-ఇంద్రియాలే గుర్రాలు, ఇంద్రియ విషయాలే అవి సాగే మార్గాలు.

విజ్ఞానవంతుడై, మనస్సులో శ్రద్ధతో కూడినవాడై, శుద్ధాచార విచారవంతుడైన వ్యక్తి మోక్ష పదవిని పొందుతాడు.

అటువంటివానికి మళ్ళీ జన్మించట మనేది ఉండదు.

ప్రాజ్ఞుడు వాక్కును మనస్సునందు, మనస్సును బుద్ధిలోను, బుద్ధిని మహదాత్మయందు, ఈ ఆత్మను శాంతమగు ఆత్మయందు నిమగ్నము చేస్తాడు.

ఇంద్రియాల సంయమనాన్ని సాధించాలి. ఇంద్రియోపరతిని సాధించాలి;
ప్రవృత్తిని మనస్సులోకి తీసుకొని రావాలి.

తర్వాత మనో వ్యాపారాన్నికూడా ప్రశాంత స్థితిలోకి తీసుకొనివచ్చి బుద్ధిని వ్యాప్తి చేసే విధంగా అహంకారాన్ని కూడాప్రశాంత స్థితిలోకి తెచ్చి ఆత్మావలోకనానికి ప్రయత్నించాలి.

ప్రధమాధ్యాయం తృతీయ వల్లి లో అతి ముఖ్యమైన మంత్రం

ఉత్తిష్ఠత! జాగృత!
ప్రాప్య వరాన్నిబోధత!
క్షురస్య ధారా నిశితా దురత్యయా
దుర్గం పధస్తత్కవయో వదన్తి!!

లేవండి! మేల్కొనండి! శ్రేష్ఠులైన గురువులను ఆశ్రయించండి! ఆత్మ సాక్షాత్కారాన్ని పొందండి!
ఆ దారి పదునైన కత్తి అంచుపై నడకలా తీక్ష్ణమైనది. దాని ననుసరించి పోవడం అతి ప్రయాస తో కూడినది. ఈ మార్గం ఎంత కఠినమైనదో చెబుతూ, ఈ మార్గంలో గమ్యం చేరడానికి అత్యంత అప్రమత్తత, చాకచక్యం అవసరమని సూచిస్తూంది.
యముని శంఖారావం ప్రతి ఒక్కరికీ – సాహసికులకు, సంశయాత్ములకు, దుర్బలులకు, బలవంతులకు ఆహ్వానం. సాక్షాత్కార సిద్ధికి కావలసిన శక్తి ప్రతి ఒక్కరిలోనూ అంతర్గతమై ఉంటుంది. పరాధీనం కాని సహజ దివ్యత్వం ప్రతి ఒక్కరి సంపద.

(స్వామి వివేకానందులు ప్రపంచయువతను మేల్కొలిపి వెన్ను తట్టి కార్యోన్ముఖులను చేయడానిక ఇచ్చిన సింహ గర్ఝన ఇది.

“arise, awake, stop not
till the goal is reached”.

అనే సందేశంతో యావత్ప్రపంచమూ ఉలిక్కిపడి లేచి ప్రగతి బాటవైపు పయనం ఆరంభించింది.

చూడండి. మన ఉపనిషత్తులు ఎంతటి మహత్తరమైన సందేశ తరంగాలను దేశ కాలావధులను దాటి ప్రసరింపజేసి యావత్ మానవాళిని ఉత్తేజపరచగలవో.)

శబ్ద రహితం, స్పర్శరహితం, రూపరహితం, అక్షయం; అలాగే రసరహితం, నిత్యం, గంధరహితం, ఆద్యంతాలు లేనిది, మహత్తుకు అతీతం, నిర్వికారం అయిన ఆత్మను సాక్షాత్కరించుకొన్నవాడు మృత్యు ముఖం నుంచి విడుదల పొందుతాడు. అంటే సంసార చక్రం నుంచి బయటపడతాడు.

24. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

ప్రధమాధ్యాయం లో ఆత్మ స్వభావ స్వరూపాదులను వివరించేరు.

ద్వితీయ అధ్యాయంలోని నాల్గవ వల్లి, ఐదవ వల్లి లు ఆత్మను చేరుకొని అమృతత్వాన్ని పొందగలిగే మార్గాన్ని విశదీకరించాయి.

ఇందులోని ప్రతి మంత్రమూ ఏతత్ ద్వైతత్ – ఇదే నీవు తెలుసుకోగోరిన ఆత్మ అంటూ ప్రతి మంత్రాన్ని నొక్కి చెప్పేడు యమధర్మ రాజు.

పరమాత్మ ఇంద్రియాలను బాహ్య విషయాలలోనే ప్రవర్తించేలా సృష్టించాడు.

అందుచేత మానవుడు బాహ్య విషయాలను మాత్రమే చూడ గలుగు తున్నాడు కాని, ఆంతరంగికమైన సత్యాలను దర్శించలేక పోతున్నాడు.

అమృతత్వాన్ని వాంఛించే ధీరులు మాత్రమే తన రెండు కన్నులను (సంప్రేక్ష నాశికాగ్రం- నాశిక యొక్క అగ్రభాగం ద్వారా) అంతర్ముఖం చేసుకొని తన నిజ స్వరూపమైన అంతరాత్మను తెలుసుకో గలుగు తున్నారు.

ఇక్కడ కఠోపనిషత్తు ఆత్మను పొందడం ఎలాగో ప్రత్యక్షంగా చూపు తోంది. ఆత్మతత్వం అత్యంత శక్తివంత మైనది. సర్వవ్యాపక మైనది. అని నిరూపిస్తోంది.

యేన రూపం రసం గన్ధం
శబ్దాన్ స్పర్శామ్ శ్చ మైథునాన్!
ఏతేనైవ విజానాతి
కిమత్ర పరిశిష్యతే; ఏతద్వైతత్!!

రూప రస గంధాదులు మరియు సర్వ శారీరిక సుఖాలు ఆత్మ వల్లనే తెలియ బడుతున్నాయి.

జాగ్రదావస్థలోను స్వప్నావస్థలోను జాగృతంగా ఉండి ఏమి జరుగుతోందో వాటన్నిటినీ ఎప్పటికప్పుడు గ్రహించి తిరిగి జ్ఞప్తికి తీసుకొని రాగలిగే చేతన శక్తే హృదయ కుహరంలో ఉన్న ఆత్మ.

నిజానికి ఆత్మ ఏ పని చేయదు. ఆత్మ యొక్క ప్రకాశం నుంచి ఇంద్రియాలు, మనస్సు శక్తిని గ్రహించి వాటి వాటి వృత్తులను చేసుకొంటూ ఉంటాయి అని ఇదివరకే చెప్పుకొన్నాము.

ఆ సర్వ వ్యాపియైన విభుమాత్మను తెలుసుకొన్న ధీరుడు శోకించడు.

భూత భవ్యములకు అధిపతి, తపోజ్ఞానము నుండి ఉత్పన్నమైనది భౌతికమైన శరీరంలోని హృదయ కుహరంలో ఉండేది దేవతామయి ప్రాణ రూపమున అభివ్యక్తమైనది ఆ ఆత్మయే.

అజ్ఞ్గుష్ఠమాత్రః పురుషో జ్యోతిరివాధూమకః!
ఈశానో భూతభవ్యస్య సఏవాద్య స ఉశ్వః ఏతద్వైతత్!!

బొటనివ్రేలి పరిమాణము గలిగి, భూత భవ్యముల కధిపతి యైన పురుషుడు, పొగ బారని తేజో మయమైన జ్యోతి వంటి వాడు.

వర్తమానము లోను, భూత భవిష్యత్తులలోను కూడా భేద రహితుడైన అతడే ఆత్మ.

ఆతని అస్తిత్వం నిత్యమైనది, మార్పు లేనిది. ఆయనే విశ్వంలోని చైతన్య తత్వం.

ఆయన కంటే అతిరిక్తుడు లేడు. ఆ ఆత్మను తెలుసు కొన్నవాడు నిర్భయుడౌతాడు.

యధోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి!..

శుద్ధోదకం, శుద్ధోదకంతో కలుస్తే అది అంతా శుద్ధోదకమే అవుతుంది.

అలాగే సాధకుడు సద్గురువు శిక్షణలో దేహాత్మ భావాన్ని పరిత్యజిస్తే పరిశుద్ధమైన అతని జీవాత్మ పరమాత్మతో ఐక్యం అవుతుంది. బ్రహ్మమే అవుతోంది.

నచికేతుడు యముణ్ణి అర్ధించింది ఈ ఆత్మజ్ఞానాన్నే.

వచ్చే భాగంలో ఏకోవశీ సర్వ భూతాంతరాత్మ అని తెలుసు కోగలిగిన ప్రాజ్ఞులదే శాశ్వతమైన ఆనందమంటూ చెప్పిన వైనాన్ని తెలుసుకొందాం.

25. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

ఈ ఐదవ వల్లి లో యమధర్మరాజు అద్వైత దర్శనం గురించి మానవ జీవితంలో దాని ప్రాముఖ్యత గురించి ఈ విధంగా చెబుతున్నాడు.

పురమేకాదశ ద్వార
మజస్యావక్ర చేతసః
అనుష్ఠాయ న శోచతి
విముక్తశ్చ విముచ్యతే!!

క్షీణించని చేతస్సుగల పుట్టుక లేని వాని( ఆత్మ) పురానికిపదకొండు ద్వారాలు ఉన్నాయి. ఆ అజుని ధ్యానించిన వానికి శోకము లేదు. అజ్ఞాన బంధనముల నుండి విముక్తుడై ముక్తిని పొందుతాడు.

బ్రహ్మను ఎక్కడ వెదకాలనే ప్రశ్నకు ఏకాదశ ద్వారాలున్న ఈపురమునకు అధిపతియైన మానవుని శరీరం లోనే అని.

ఏకాదశ ద్వారాలు అంటే రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రాలు, నోరు, జననేంద్రియము, విసర్జనేంద్రియము, నాభి, నడి నెత్తిన ఉండే బ్రహ్మరంధ్రం.

ఆత్మ ఈ శరీరానికి రాజు. ఆయన అందులో ఉండాలనుకొన్ననాళ్ళు ఉంటాడు. తన ఇష్టప్రకారం ఎప్పుడు నిష్క్రమించాలను కొంటే అప్పుడు నిష్క్రమిస్తాడు.

అందువల్ల అతను జనన మరణాలకు అతీతుడు. జ్ఞాన స్వరూపుడు.

స్వర్గ సీమలలో ఉన్న సూర్యుడు, యజ్ఞ వేదికపై ఉండే అగ్ని, అంతరిక్షములోభూమ్యాకాశాల మధ్య సంచరించే వాయువు, అతిధి రూపములో కలశములో ఉండే సోమరసం, సమస్తం ఆ యాత్మయే.

ఆ ఆత్మ యే మానవులలోను, శ్రేష్ఠులైన దేవతల యందును, ఋతము నందు, ఆకాశంలోనూ ఉంది.

అదే ఆత్మ ఉదకములలో జలచరముల రూపములోను, భూమిలో పండే ధాన్యరూపం లోను, పర్వతాలనుండి జాలువారే నదీరూపములోను దర్శనమిస్తుంది.

మన శరీరంలో ప్రాణ అపాన గతులను నిర్దేశిస్తూ మధ్యలో ఆసీనమై ఉన్న ఆత్మను సకల దేవతలూ ఉపాసిస్తారు.

నప్రాణేన నపానేన మర్త్యో జీవతి కశ్చన
ఇతరేణ తు జీవంతియస్మిన్నే తావుపాశ్రితౌ!!

శరీరంలో ప్రాణంవల్లే మనం జీవిస్తున్నామనే వాదనని ఉపనిషత్తు తిరస్కరించింది. శరీరం నుంచి ఆత్మ నిష్క్రమిస్తే శరీరం పతన మౌతుంది.

మరణానంతరం వారు వారు గావించిన కర్మల ననుసరించి, మరియు వారి వారి జ్ఞానమున కనుగుణముగా కొన్ని ఆత్మలు దేహ ధారణకు గర్భమందు ప్రవేశిస్తే, మరికొన్ని ఆత్మలు మొక్కలలో ప్రవేశిస్తున్నాయి.

శరీరంలో ప్రవేశించిన ఆత్మ మనో బుద్ధుల ప్రభావం తో జీవాత్మ గా మారి స్వప్నావస్థ లో తన కిష్టమైన విషయ ప్రపంచాన్ని సృష్టించుకొని భోగాలలో రమిస్తుంది.

తాను దహించు వివిధ వస్తువుల ఆకారముల కనుగుణంగా అగ్ని ఆయా రూపములు ధరించునట్లు,

ఆయా భిన్నవస్తువుల ఆకారముల కనుగుణంగా వివిధరూపాలను వాయువు ధరిస్తున్నట్లు,

సర్వ ప్రాణుల హృదయాలలో ఉన్న ఒకే ఒక ఆత్మ ఆయా ప్రాణుల రూపముల కనుగుణముగా కనబడుతోంది.

సర్వ లోక చక్షువైన సూర్య భగవానుడు బాహ్య దోషముళచే కలుషితము కాని విధంగా

సకల ప్రాణులలో ఉన్న ఒకే ఆత్మ బాహ్యమగు ఈ లోక సుఖ దుఃఖములచే కలుషితం కాకుండా ఉంటుంది.

వచ్చే భాగంలో ఏకోవశీ సర్వ భూతాంత రాత్మ…గురించి తెలుసుకొందాం.

26. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

ఏది మనిషి నిద్రించినప్పుడు కూడా మేల్కొని ఉండి కామాదులను సృష్టిస్తుందో అదే శుద్ధం, అదే బ్రహ్మం.

దానినే అమృతమంటారు. దానిలోనే లోకాలన్నీ ఉంటాయి. దానిని ఎవ్వరూ అతిక్రమించలేరు.

జాగ్రత్, స్వప్న, సుషుప్తి స్థితులలో శుద్ధ చైతన్యమే సాక్షీ భూతము. ఏతత్ ద్వైతత్- అదే ఆ ఆత్మ.

చూడండి! నచికేతుని మూడవ ప్రశ్నకు –

మృత్యువు గురించి తెలుసు కోవాలన్నప్పుడు మానవుడు తన అన్వేషణను బాహ్య ప్రకృతి నుంచి అంతరంగం వైపు మరలించాలని స్పష్టంగా తెలియపరచేడు యముడు.

అగ్ని ఒక్కటే అయినా, తాను దహించు వివిధ వస్తువుల ఆకారములను పొందుతుంది.

వాయువు ఒకటే అయినా ఈ లోకంలో వివిధ రూపాలలో ప్రవేశించి వాటి వాటి రూపాలను పొందుతుంది.

సమస్త లోకానికి చక్షువయిన ఆ సూర్య భగవానుడు బాహ్య దోషములచే కలుషితమవటల్లేదు.

అదే విధంగా సకల ప్రాణులలో ఉన్న ఒకే ఆత్మ బాహ్యమైన లోక దుఃఖముల చే కలుషితం కాకుండా ఉంటుంది.

ఏకోవశీ సర్వభూతాన్తరాత్మా
ఏకం రూపం బహుదా యః కరోతి!
తమాత్మస్తం యే అనుపశ్యన్తి ధీరా
స్తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్!!

సర్వ జీవుల అంతరాత్మలలో ఉన్నది ఒకే మూల చేతనము.

ఆ ఏకైక ఆత్మ సమస్తాన్ని తన అధీనములో ఉంచుకొనే, బహు రూపాలుగా ప్రకటితమౌతోంది.

ఏ ధీరులు ఆ ఆత్మ తమలో ఉందని తెలుసుకొని స్థిరచిత్తులై సాక్షాత్కరించు కొంటారో వారికే శాశ్వతమైన సుఖం లభిస్తుంది. ఇతరులకు లభించదు.

అనిత్యులలో నిత్యుడు, చేతనులలో చేతనుడు, ఒక్కడే అయినా బహు కామములు నెరవేర్చువాడు అయిన ఆత్మ తమలోనే ఉందని సాక్షాత్కరించు కొంటారో ఆ ధీరులకు మాత్రమే శాంతి శాశ్వతంగా లభిస్తుంది. ఇతరులకు లభించదు.

(శ్రీ యోగీ అచ్యుతులు వారి ఋష్యమూకాశ్రమము లో ఈ “ఏకోవశీ సర్వభూతాంతరాత్మా..” అనే మంత్రాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి గోడకు పెట్టమన్నారు.

ఆ సందర్భంగా చెబుతూ భారతీయ తత్వశాస్త్ర మంతా నశించి పోయినా, వేదాలన్నీ మాయమయి పోయినా ఈ ఒక్క మంత్రం తో తిరిగి సమస్తాన్ని ఉద్ధరించి మొత్తం తత్వశాస్త్రాన్ని, వేదాలను పునరుద్ధరించొచ్చు. అన్నారు.)

“న తత్ర సూర్యో భాతి న చన్ద్రతారకం…
నేమా విద్యుతో భాన్తి కుతో యమగ్నిః!”

ఈ మంత్రం లోని ఈ వాక్యం తో సమానమైన ఇంకొక వాక్యం మొత్తం వేదవాగ్మయంలోనే లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇది అత్యంత మహనీయ మైనదని చెప్పవచ్చు.

ఇదే మంత్రం ముండకోపనిషత్తు లో ఉంది.

అక్కడ సూర్యుడు ప్రకాశింపడు. చంద్ర తారకలు ప్రకాశింపవు. మెరుపులు మెరియవు. ఇంక అగ్ని సంగతి వేరే చెప్పాలా?

అది ( ఆ ఆత్మ) ప్రకాశించడం వల్ల, దానిని ఆశ్రయించుకొని మిగిలినవన్నీ ప్రకాశిస్తున్నాయి.
దాని కాంతి చే సర్వం కాంతిమయమౌతోంది.

దాని చేతనత్వం తో సమస్తం శక్తిని గ్రహించి తమ తమ కార్యాలు నిర్వర్తించుకొంటున్నాయి.

మిగిలిన ఆరవ వల్లిజీవన వృక్షం వర్ణవ తో మొదలయి, సర్వ భూత మోక్ష ప్రదానం తో కఠోపనిషత్తు ముగుస్తుంది.

27. ఉపనిషత్తులు – కఠోపనిషత్తు (Continuation)

యమధర్మరాజు బ్రహ్మను సంసార వృక్షంతో పోలుస్తున్నాడు.

ఊర్ధ్వమూలో అవాక్ శాఖ ఏషోశ్వత్ధస్సనాతనః
తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే!
తస్మిన్ లోకాశ్శ్రితా స్సర్వే తదు నాత్యేతి కశ్చన, ఏతద్వైతత్!!

ఈ సనాతనమైన అశ్వత్ధవృక్షం మూలం(వేళ్ళు) పైన ఉంది. కొమ్మలు కిందకు వ్యాపించి ఉన్నాయి.

అదే శుద్ధం, అదే బ్రహ్మం, అదే సనాతనము, దానినే అమృతమని అంటారు.

దానిలోనే సమస్త లోకాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. దానినెవరూ అధిగమించలేరు.

అదే మనం అనుకొనే ఆత్మ.

భగవద్గీతలో పదిహేనవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇదే శ్లోకంతో ప్రారంభం అవుతుంది.

ఈ సంసార వృక్షాన్ని త్రిగుణములనే (సత్వరజ స్తమోగుణములు) జలములతో పోషింపబడుతోంది. సహజంగా మానవ శరీరాకృతిని చూస్తే తల్లి గర్భం లో ఉన్నప్పుడు, సహస్రారంలో ఉండే బ్రహ్మ రంధ్రం ద్వారా శరీర పోషణకు కావలసినవన్నీ సమకూర్చ బడి ఈ శరీర నిర్మాణం జరిగింది. అంటే ఊర్ధ్వమూలం సహస్రారంలోనే. జన్మ తీసుకొన్న తర్వాత శరీరంలో ఉండే మనస్సు, ఇంద్రియాలు అధోముఖంగా బాహ్యంగా ప్రవర్తిస్తూ హృదయ కుహరం లో ఉండే ఆ ఆత్మ అడుగు జాడలలో మనః ప్రవృత్తి, త్రిగుణాలు(శాఖలు) పెంపొందుతాయి.

ఇహలోకంలో కనిపించేవన్నీ అంటే ఈ జగత్తంతా ప్రాణం లోనే చలిస్తుంది. ఉత్పత్తి స్ధితి లయాలను పొందుతోంది. వజ్రాయుధం లా చాలా భయం కలిగిస్తుంది. దీనిని తెలుసు కొన్న వాళ్ళు అమరులౌతారు.

వాని భయం వల్ల నిప్పు మండుతుంది. సూర్యుడు వెలుగుతాడు.

వాని భయం వల్ల, ఇంద్రుడు, వాయువు, ఐదవ వాడైన మృత్యువు తమతమ పనులను నిర్వహించడానికి పరుగులు తీస్తారు.

ఈ శరీరాన్ని త్యజించే ముందు జ్ఞానాన్ని పొందాలి. లేకుంటే వేరే లోకాల్లో కర్మానుసారంగా శరీరాల్ని పొందాల్సి ఉంటుంది.

సత్య దర్ధనమనేది ఈ శరీరంలో ఉండగా పొందితే,
అద్దంలో ప్రతిబింబం లా స్పష్టంగా కనబడుతుంది.

పిత్రులోకంలో ఉండగా ఆత్మదర్శనం పొందితే స్వప్నంలో చూచినట్లు ఉంటుంది.

గంధర్వలోకంలో అయితే నీటిలో ప్రతిబింబం లా కనబడుతుంది.

బ్రహ్మ లోకంలో అయితే ఒకసారి వెలుగు ఒకసారి నీడలా ఉంటుంది. ( ఇక్కడ బ్రహ్మ లోకం అంటే త్రిమూర్తులుండే ప్రదేశం.)

అతని రూపం దృష్ఠి గోచరం కాదు. ఈ చర్మ చక్షువులతో ఎవరూ చూడలేరు.

పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు స్ధిరమై బుద్ధి నిశ్చలమయ్యాక పరమగతి ప్రాప్తిస్తుంది.

ఈ శరీరంలోని హృదయ గ్రంధులన్నీ ఛేదింపబడితేనే మర్త్యుడ మర్త్యుడౌతాడు.

శతం చైకా చ హృదయస్య నాడ్య
స్తాసాం మూర్ధానమభి నిస్సృతైకా!
తయోర్ధ్వమాయన్న మృతత్వమేతి
విష్వ జ్ఞన్యా ఉత్క్రమణే భవన్తి!!

హృదయం యొక్క నూటొక్కటి నాడులలో ఒకానొక నాడి సహస్రారం వరకూ వ్యాపించి ఉంటుంది.

దీనినే శుషుమ్నా నాడి అంటారు.

దాని ద్వారా ఆత్మను చేరిన మానవుడు అమృతత్వాన్ని పొందుతాడు.

యమధర్మరాజు నచికేతునకు చేసిన ఉపదేశం ఈ క్రింది మంత్రంతో ముగుస్తుంది.

అజ్ఞ్గుష్ఠమాత్రః పురుషోన్తరాత్మా
సదా జనానాం హృదయే సన్నివిష్టః!
తం స్వాచ్ఛరీరా త్ప్రవృహే
న్ముఞ్జాదివేషీకాం ధైర్యేణ
తం విద్యాచ్ఛుక్ర మమృతం
తం విద్యాచ్ఛుక్ర మమృతమితి!!

బొటన వ్రేలి పరిమాణం లో (వామన) ఉండే అంతరాత్మయైన ఆ పురుషుడు జీవుల హృదయాలలో సదా వశిస్తూ ఉంటాడు.

ముంజ నుంచి ఇషీకమును(ముంజి మధ్యలో ఉండే అతి మెత్తని మధుర పదార్ధం)విడదీసినట్లుగా ఆత్మను శరీరము నుంచి వేరుగా ప్రత్యక్ష పరచుకోవాలి.

అతడే శుద్ధుడు, అమృతుడు అని తెలుసుకొన్న వాళ్ళే అమరత్వాన్ని పొందుతారు.

మృత్యువుద్వారా ఉపదేశింపబడిన ఈ విద్యను తెలుసుకొన్న నచికేతుడు విరాగియై, మృత్యు బంధమునుండి విముక్తుడై బ్రహ్మత్వాన్ని పొందేడు.

ఈ రీతిగా ఆధ్యాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకొన్న ప్రతి ఒక్కరూ బ్రహ్మత్వాన్ని పొందుతారనడంలో అతిశయోక్తి లేదు.

స్వస్తి!!

మాఘ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ యోగి అచ్యుతులు సమాధి ని పొందేరు. ఆ రోజు స్వామిగారి జయంతి గా జరుపుతారు.

యోగి అచ్యుతుల 59వ జయంతి కార్యక్రమం ఈ నెల 10 నాడు అవడం వల్ల తిరిగి 12వ తేదీ మాండూక్యోపనిషత్తుతో పునర్దర్శనం.

28. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు

సర్వోపనిషదోగావః దోగ్ధా గోపాలనందనః
ఉపనిషత్తులన్నీ ఆవులు. పితికే వాడు శ్రీ కృష్ణుడు. అర్జునుడు దూడ. పాలు గీతామృతం. బుద్ధిమంతుడు ఆ పాలు తాగే వాడు.
అటువంటి ఉపనిషత్తులలో మాండూక్య రసాయనమొకటి.

ముక్తిని కోరుకొనే వాళ్ళు ఒక్క మాండూక్యోపనిషత్తు చదివితే చాలు వారికి మార్గం సుగమం అవుతుంది అంటారు.

మాండూక్యోపనిషత్తు అధర్వణ వేదానికి చెందినది.
పరిమాణంలో చిన్నదైనా సత్యావిష్కరణలో చాలా గొప్పది.

కేవలం పన్నెండు మంత్రాలలో అనల్పమైన వివరణ చేయబడింది. అందువల్ల ఈ ఉపనిషత్తును అర్ధం చేసుకోవడం చాలా కష్టం.

ఈ ఉపనిషత్తులో అవస్తాత్రయాన్ని దాటి తురీయం చేరుకొని, ఆత్మ స్వరూపం తెలుసుకోవడం ద్వారా ముక్తిని పొందడం వివరించబడింది.

తురీయం అంటే బ్రహ్మము, ఆనంద స్వరూపం అనే అనుభూతి పొందడమే ముక్తి.

అతి క్లిష్టమైన ఈ ఉపనిషత్తుకు శ్రీ గౌడపాదులు కారికలు వ్రాశారు. శ్రీ గౌడపాదులు ఈ గురు పరంపరలో అతి ప్రాచీనులు. వారి శిష్యులు శ్రీ గోవిందపాదులు. శ్రీ గోవిందపాదుల అనుంగు శిష్యుడు శ్రీ శ్రీ ఆది శంకరులు.

తరువాత, శ్రీ శంకరులు వీటిమీద భాష్యం రాశారు.

ఈ కారికలు ఎంత ప్రాముఖ్యాన్ని సంపాదించు కొన్నాయంటే అవి మాండూకోపనిషత్తులో భాగమే అయిపోయాయి.

ఈ కారికలు సుమారు 1300 ఏండ్ల క్రింద రచించ బడి ఇప్పటికీ భారతీయ తత్వశాస్త్రంలో అద్వితీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నాయి.

ఈ కారికలు మొత్తఙ 215. ఇవి ఆగమ, వైతధ్య, అద్వైత, అలాతశాంత అనే నాలుగు భాగాలు గా విభజింప బడ్డాయి.

ఇవి అధ్యయనం చేయనిదే అద్వైత వేదాంతం మీద చర్చ నేలవిడిచి సాము చేయడం లాంటిదే.

ఇందులో మొదటిదైన “ఆగమ” ప్రకరణంలో(29 కారికలు) ఓంకార తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఈ ఉపనిషత్తులో ని 12 మంత్రాలకు వివరణ ఇవ్వబడింది.

రెండవది “వైతధ్య” ప్రకరణం(38 కారికలు). వితధ అనే శబ్దానికి అర్ధం వాస్తవ రూపానికి భిన్నంగా కనిపించడం.

మరొక విధంగా చూస్తే తధ్యము అంటే నిత్యమైనది, సత్యమైనది అని అర్ధం. వైతిధ్యము అంటే అనిత్యము, అసత్యము అయినది అని అర్ధం.
అనేకత్వంతో కూడిన ఈ కంటికి కనిపించే ప్రపంచం సత్యం కాదని ఇందులో వివరించబడింది.

అద్వైత ప్రకరణం(48 కారికలు) లో అద్వైత సిద్ధాంతం వివరించబడింది.

అలాతశాంత ప్రకరణం(100 కారికలు) లో వేద ప్రమాణ్యాన్ని అంగీకరించని బౌద్ధ మతం, మరి కొన్ని ఇతర సిద్ధాంతాలు నిరాకరించబడ్డాయి.

ఈ ఉపనిషత్తు (అధర్వణ వేదాంతర్గత ఉపనిషత్తులు) “భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః”అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది. వచ్చే భాగంలో ఆ శాంతి మంత్ర వివరణ తెలుసుకొందాం.

29. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

ప్రాపంచికతలో ముంచి వేసే విషయాలు, ఉన్నత జీవితానికి ప్రేరణనిచ్చే విషయాలు మనుష్యులను సమీపిస్తాయి. వాటిలో ఉన్నతమైన వాటిని ఎన్నికోడానికి, మన ఇంద్రియాలకు శిక్షణ నిచ్చే క్రమంలో దేవతల సహాయాన్ని అర్ధిస్తూ చెప్పే మంత్రమిది.

ఆధ్యాత్మిక విద్యను అధ్యయనం చేయడంలో అవరోధాలు కలుగకుండు గాక! అని భగవంతునికో ప్రార్ధన.

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః
భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః
స్ధిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిర్
వ్యశేమ దేవ హితం యదాయుః

స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తినః పూషా విశ్వ వేదాః
స్వస్తినస్తార్ష్యో అరిష్ట నేమిః
స్వసతినో బృహస్పతిర్ధధాతు

ఓం శాంతిః శాంతిః శాంతిః!!

ఓ దేవాధి దేవతలారా!

మా చెవులు ఎల్లప్పుడు శుభాన్నే ( జ్ఞాన ప్రదమైన ఓంకారాన్నే ఎల్లప్పుడు) విను గాక!

మా కళ్ళు ఎల్ల వేళలా శుభాన్నే(ఆ బ్రహ్మత్వాన్నే) చూస్తూ స్ధిరంగా ఉండు గాక!

సర్వఅవయవాలు స్ధిరమై సంతుష్టిని పొంది అభ్యుదయాన్నిచ్చుగాక.

ప్రాచీన గురువులచే శాస్త్రాలలో వర్ణింప బడిన దేవేంద్రుడు( ఇంద్రియములకధిపతి), సర్వజ్ఞుడైన సూర్య భగవానుడు మనకు అభ్యుదయాన్ని కలుగ జేసి, అమృతవృష్ఠిని జరుపనీ!

అరిష్టాలను నివారించే తార్ క్ష్యుడు ( గరుత్మంతుడు) మనకు అభ్యుదయాన్ని కలుగించనీ!

మా బ్రహ్మ వర్చస్సును పాలించే గురువు (బృహస్పతి) మాకు శాస్త్రాధ్యయనంలో, సత్యానుష్ఠానం లో అభ్యుదయాన్నిచ్చి దయ చూచెదరు గాక!

దృఢమైన శరీరంతో ఆరోగ్యంగా ఉందుము గాక!

భగవద్దత్తమైన ఆయుస్సును సంపూర్ణంగా అనుభవింతుము గాక!

అధి భౌతిక, అధి దైవిక, అధ్యాత్మిక తాపములు
(తాపత్రయము) ఉపశమించి శాంతి నెలకొను గాక!

తాపత్రయాలు:

అధి భౌతిక తాపాలు: మన కంటే ఇతరులైన దారా పుత్రులు, ఇరుగుపొరుగు వారు, కుక్కలు, దొంగలు మొదలగు వారి వల్ల కలిగే తాపాలు;

అధి దైవిక తాపములు: భూమి మొదలగు పంచ భూతాల ప్రకోపము చేతను (పిడుగులు, భూకంపములు) వచ్చే తాపాలు;

ఆధ్యాత్మిక తాపములు: మన శరీరం లోపలకలిగే ఆధి వ్యాధుల వలన కలిగే తాపములు.

ఈ మూడు విధములైన తాపములనుంచి ఉపశమనము లభించి శాంతి నెలకొను గాక!

వచ్చే భాగంలో మన కంటికి కనిపించే జగత్తంతా ఓంకారమే. భూత భవిష్యద్వర్తమానాల లో ఉండేదీ ఓంకారమే అంటూ చెప్పే వైనాన్ని చూద్దాం.

30. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

1.ఈశావాశ్యోపనిషత్తు జ్ఞాన కర్మలకు రెండికి ప్రాధాన్యం ఇస్తూ సత్తు- అసత్తు లకు అవతల ఉండేదేవుని గురించి, ఆ దేవునిలో ఐక్యమై జన్మరాహిత్యాన్ని పొందే మార్గాలను వివరించింది.

2.కేనోపనిషత్తు ఇంద్రియాలుకాని, మనస్సుకాని, బుద్ధి కాని, ప్రాణం కానీ ఆ బ్రహ్మాన్ని గ్రహించలేవు. వీటన్నిటికీ భగవంతుడే ఆశ్రయం కావటం వల్ల అతనికి సంబంధించిన జ్ఞానం మనకు అతని దయవల్ల మాత్రమే లభించాలి అని తెలియ పరచింది.

3.కఠోపనిషత్తు లో బ్రహ్మవిద్య యే మహత్తర చర్చనీయాశం. జీవాత్మ పరమాత్మల గురించి చెప్పిందీ శాస్త్రం. దీని లో సావధిక స్థితి నుండి అనంతత్వం వైపు; అజ్ఞానంధకారం నుండి జ్ఞానప్రకాశం వైపు; మృత్యువు నుంచి అమృతత్వం వైపు మానవుడు సాగించే ప్రయాణాన్ని వివరించబడింది.

అంతేకాకుండా,

జ్ఞానమనేది తర్కంతో కాని, వినడం ద్వారా గాని లభించదు. సూక్ష్మాతిసూక్ష్మము, అత్యంత శక్తివంతము అయిన ప్రణవమే దాని మూలం. ప్రణవోపాసనలో కల్గే ఆత్మ ప్రసన్నత వల్లనే జ్ఞాన ప్రాప్తి ఔతుంది.

సర్వే వేదా యత్పద మామనన్తి
తపాంసి సర్వాణి చ యద్వదంతి!
యదిచ్చంతో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్!!

సకల వేదములు దేనిని పరమావధిగా చెప్పుతున్నాయో, ఏది సమస్త తపస్సులకు పరమావధి అని పిలవబడుతోందో, దేనిని కోరి ప్రజలు బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంభిస్తున్నారో
దానిని సంగ్రహంగా ‘ ఓం’ అని నీకు చెబుతున్నాను.

ఏతద్ద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరం పరం
ఏతద్ధ్ఞ్యేవాక్షరం జ్ఞాత్వాయో యదిచ్ఛతి తస్యతత్!

ఇదే అక్షర బ్రహ్మం. నాశరహితమైన ఆత్మ.

పరతత్వం అంటే ఇదే. ఈ అక్షరమే అన్నిటి కన్నా శ్రేష్ఠమైనది. ఈ అక్షర జ్ఞానాన్ని పొందిన వ్యక్తి తాను ఏం కాదలిచాడో అదే అవుతాడు. అంటూ యమధర్మరాజు వివరిస్తే

అదే ఓంకారాన్ని మాండూక్యోపనిషత్తు 12 మంత్రాలలో ఆవిష్కరించింది ఎంతో విపులంగా.

మొదటి మంత్రం ” ఓం” కారమే సర్వం అని వివరిస్తుంది.

రెండవ మంత్రం సర్వం పరబ్రహ్మమే అని చెబుతుంది.

మూడు నుంచి ఆరవ మంత్రం వరకూ “అవస్ధాత్రయ విచారణ” ద్వారా పరమాత్మ యొక్క “సాకార- సగుణ” రూపాన్ని వివరిస్తుంది.

ఏడవ మంత్రం ప్రత్యేకంగా పరమాత్మ యొక్క”నిరాకార నిర్గుణ” రూపాన్ని వివరిస్తే,

ఎనిమిదవ మంత్రం నిశ్శబ్దం లో పుట్టి నిశ్శబ్దం లోనే కలిసిపోతున్న అకార, ఉకార, మకార శబ్దంతో పలికే ఓంకారము మరియు సర్వ వ్యాపియైన పరబ్రహ్మము ఒక్కటే అని చెబుతోంది.

తొమ్మిది నుంచి పన్నెండవ మంత్రం వరకూ పరమాత్మ యొక్క నామమైన “ఓంకార” వివరణ.
శ్రీ శ్రీ గౌడపాదుల 215 కారికలు, వాటి వివరణలు దొరకడమే చాలా కష్టమైన విషయం.

అందువల్ల వచ్చే భాగం నుంచి మాండూక్యో పనిషత్తు లోని మంత్రాల వివరణ తో బాటు గౌడపాదుల కారికలకు శ్రీ ఆది శంకరుల వ్యాఖ్యానం కూడా సంక్షిప్తంగా చదువు కొందాము.

31. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

శ్రీ గౌడపాదుల కారికలు ఆగమ ప్రకరణంలోని మొదటి నాలుగు “ఓం” యొక్క ప్రాశశ్త్యాన్ని వివరించడంతో మొదల వుతుంది.

మాండూక్యోపనిషత్తు లోని మొదటి మంత్రం,

ఓమి త్యేత దక్షర మిదగం సర్వం తస్యోప వ్యాఖ్యానం
భూతం భవత్ భవిష్య దితి సర్వ మోంకార ఏవ
యచ్చాన్య త్త్రికాలా తీతం తద ప్యోంకార ఏవ!!

(ఓం ఇత్యేతత్ అక్షరమ్)
“ఓం” అనేది నాశరహితమైనది.

(తస్యోప వ్యాఖ్యానం)ఈ భూ ప్రపంచంలో దేనిని(ఏ విషయం గురించి) గురించి చెప్పినా అది ఓం అనేదానికి వ్యాఖ్యానమే అవుతుంది.

అంటే ఇంతకు ముందు జరిగింది, ఇపుడు జరుగుతున్నది మరియు ఇకపై జరిగేది అంతా ఓంకారమే.

వీటన్నిటినీ మించి త్రికాలాతీతంగా ఉండేది కూడా ఓంకారమే.

ఓం అని ఉచ్చరించేప్పుడు, స్వరం ఉత్పత్తి అవడానికి కారణమైన వాయువు ఊర్ధ్వముఖంగా సాగి చివరకు దాని ఉత్పత్తి స్ధానంలో(బ్రహ్మ లేక గురు స్ధానంలో) లయమౌతుంది.

ప్రాణం యొక్క ఉపవర్గం వాయువు. శరీరంలోని ప్రాణ వాయువుని వివిధ స్ధానాలలో అది చేసే పనిని బట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేర్లు పెట్టేరు.

ఈఐదు లోనూ అతి ముఖ్యమైన దానిని ప్రాణం అని పిలుస్తారు.

ఆ వాయువు యొక్క ఊర్ధ్వ గమనాన్నే ప్రాణుని యొక్క ఊర్ధ్వ గమనంగా వర్ణించారు. ఆ గమనంలో పుట్టే శబ్దాన్నే “ఓంకారం”(ప్రణవం) అన్నారు.

ఈ ఓంకారాన్నే అక్షరం ( నాశనము లేనిది) అంటాం.

ఈ శబ్దోత్పత్తికి మూల కారణమైనది గాలి. అది మన శరీరంలోని ప్రాణుని యొక్క చైతన్యంనుంచి ఉద్భవించింది.

ఆ ప్రాణుని స్పందనమే ఈ స్వరయుక్తమైన గతి(ఓం) కలిగిన వాయువు.
ఆ ప్రాణ వాయువే మిగిలిన భూతాల(పంచ భూతాలలో) ఉత్పత్తికీ కారణం. ఆపంచ భూతాల కలయిక వల్లనే ఈ జగత్తంతా ఏర్పడడం వల్ల ఈ జగత్తంతా కూడా ఓంకారమే అయ్యింది. అని ఉపనిషదృషులు చెప్పేరు.

ఈ విధంగా మొదటి ఆరు మంత్రాలు అయ్యేక శ్రీ గౌడపాదుల వ్యాఖ్యానం (కారికలు) లో విశ్వ, తైజస, ప్రజ్ఞ, తురీయ స్ధితులను క్రమ క్రమంగా విశదీక రించడం వచ్చే భాగంలో చూద్దాం.

32. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

ఇక్కడ మన ఉపనిషదృషులు రెండవ మంత్రం నుంచి మానసిక తత్వ శాస్త్రాన్ని అత్యద్భుతంగా విశ్లేషించి చెప్పేరు

శ్రీ శ్రీ గౌడపాదులు తనదైన సుందర శైలిలో తార్కికంగా నిరూపించేరు. గౌడపాదుల కారికలన్నీ సంస్కృత శ్లోకాల రూపంలో ఉన్నాయి.

Sigmund Freud మొదలైన మనస్తత్వ శాస్త్రజ్ఞుల పందొమ్మిదవ శతాబ్దపు ఆవిష్కరణలు మన మాండూక్యోపనిషత్తు లోని విషయాలతో పోలిస్తే ఒకవంతు ( నూటికి) గా లెక్కింప వచ్చు.

ఇంక యోగ వాశిష్ఠంలోని మొదటి భాగం( స్వప్న సిద్ధాంతాలు) చదివితే The interpretation of Dreams by Sigmund Freud అతి పేలవంగా కనబడుతుందనడంలో ఏ సందేహము లేదు.

ఇంక పాఠం లోకి వెడదాము.

రెండవ మంత్రం:

సర్వగ్ం హ్యేతద్ బ్రహ్మాయ మాత్మా
బ్రహ్మసో య మాత్మా చతుష్పాత్!!

ఓంకార స్వరూపమైన ఈ సంపూర్ణ జగత్తంతా నిశ్చయంగా బ్రహ్మ స్వరూపమే. మన కంటికి కనిపించేది, కనిపించనిదీ కూడా బ్రహ్మమే.

మనలో వ్యాపించి ఉన్న జీవాత్మ కూడా బ్రహ్మమే.
ఈ ఆత్మ నాలుగు పాదాలతో ఉంటుంది.

ఈ జీవాత్మకు ఉండే అవస్ధాత్రయం( జాగ్రత్, స్వప్న, సుషుప్తి) మూడు పాదాలు కాగా, అవస్ధాత్రయందాటితే ఉండేది తురీయా స్ధితి నాల్గవ పాదమవుతుంది.

మెలుకువగా ఉన్నప్పుడు, అంటే జాగ్రదావస్ధలో ఈ దృశ్యమాన జగత్తులో ప్రవర్తిస్తున్నప్పుడు “విశ్వుడు” అంటారని మూడవ మంత్రంలో వర్ణన.

రాబోయే నాలుగు(3 నుంచి 6 వరకు)మంత్రాల లోనాలుగు పాదాల వర్ణన ఉంది.

మూడవ మంత్రము:

జాగరితస్ధానో బహిః ప్రజ్ఞః సప్తాంగ ఏకోన
వింధతి ముఖః స్ధూల భుక్ వైశ్వానరః ప్రధమ పాదః!!

జాగ్రదావస్ధ స్ధానముగా కలవాడు, బహిః ప్రజ్ఞ కలవాడు, ఏడు అంగములు కలవాడు, పందొమ్మిది ముఖములు కలవాడు, స్ధూల భోక్త అయిన వైశ్వానరుడు ప్రధమ పాదము.

వచ్చే భాగంలో పై మంత్రం యొక్క వివరణ చూద్దాం

33. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

మూడవ మంత్రము:

జాగరితస్ధానో బహిః ప్రజ్ఞః సప్తాంగ ఏకోన
వింధతి ముఖః స్ధూల భుక్ వైశ్వానరః ప్రధమ పాదః!!

జాగ్రదావస్ధయే వైశ్వానరుని యొక్క క్రియాశీల పరిధి. అదే అతని యొక్క బాహ్య ప్రజ్ఞ. జాగ్రదావస్త.

ఛాందోగ్యోపనిషత్తులో సప్తాంగాల వివరణ ఇలా ఉంది.

1.ఆకాశములో ఉపరి భాగం( స్వర్గం) వైశ్వానరుని శిరస్సు.

2.సూర్యుడు ఆతని కన్నులు ( కుడి కన్ను).

3.వాయువు అతనిలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు.

4.ఆకాశంలో క్రింది భాగం అతని శరీరం.

5.ఈ భూమి మీద ఉండే జలమంతా అతని జీర్ణాశయము.

6.భూమి అతని పాదాలు అయితే

7.ఆహవనీయ అగ్ని అతని నోరు.

కొందరు పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేవే అతని సప్తాంగాలు అంటారు.

వైశ్వానరుడు లేక ఈ విశ్వుడు కుడి కన్నుతో కనుగొంటాడు. కంటికి కనిపించే పదార్ధాలను అనుభవిస్తాడు.

దానికి అతని శరీరం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ముదలైనవన్నీ సహకరిస్తాయని చెబుతూ

ఏకోన వింశతి ముఖః అంటే 19 ముఖములతో ప్రపంచానుభూతిని పొందుతాడు అంటాడు.

ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు ప్రాణాది పంచ వాయువులు, మనస్సు, బుద్ధి, చిత్తము అహంకారము అనే ఈ పందొమ్మిది స్ధూల వస్తువులు అతని ఆహారం.

దాన్ని జీర్ణించుకొనే శక్తినే వైశ్వానరుడు అంటారు. అతనియొక్క ఈ స్ధితినే జాగ్రదావస్త అంటారు. విశ్వుడు బహిర్ ప్రజ్ఞ తో ఉంటాడు.

వచ్చే భాగంలో ఆత్మకు చెప్పిన రెండో పాదం అంతర్ముఖంగా ఉండే తైజసుని గురించి తెలుసుకొందాం

34. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

స్వప్నస్ధానోంతః ప్రజ్ఞః సప్తాంగ ఏకోన
వింశతి ముఖః ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయః పాదః!!

ఆత్మకు చెప్పిన రెండవ పాదం తైజసుడు (తేజస్సు). ఇతని చైతన్యం అంతర్ముఖంగా ఉంటుంది.

జాగ్రదావస్ధలో మనస్సుకు సంక్రమించిన వాసనలను జీవుని తేజస్సు వల్ల స్వప్నావస్ధలో అనుభ విస్తున్నాం కనుక ఈ అవస్ధలో జీవుణ్ణి తైజసుడు అని అన్నారు.

ఈ తైజసుడు స్వప్నావస్థ లో మానసిక లోకాల్లో విహరిస్తూ ఉంటాడు.

స్ధూలేంద్రియాల సహాయం లేకుండా లోలోపలే తెలుసుకోగలిగే స్దితిలో ఉండడమే స్వప్న స్ధితి.

స్వప్న స్ధితిలో కూడా అతను సప్తాంగాలు, ఏకోనవింశతి ముఖాలు కలిగి ఉంటాడు.

స్వప్న స్ధితిలో అతనికి తాను స్ధూలేంద్రియాల ద్వారా వ్యవహరిస్తున్నట్లు కనబడినా బహిర్ముఖ స్ధితిలో అతని స్ధూలేంద్రియాలు కదలకుండా ఉంటాయి.

అతని శరీరం, ఇతర ఇంద్రియాలు నిద్రాణ స్ధితిలో ఉంటాయి.

అంటే స్వప్నావస్ధలో దృక్ శక్తి, శ్రవణ శక్తి, ఘ్రాణ శక్తి మొదలైనవి మనస్సుకే సంక్రమిస్తాయి.

స్వప్న స్దితిలోని విషయాలు కూడా బాహ్య ప్రపంచం నుండి ఇంద్రియాల ద్వారా వచ్చినవి కావు. మనస్సు నుండి ఉద్భవించినవే.

ఆ స్ధితిలో అతని ఆహారం స్ధూలమైనది కాకుండా వాటి సూక్ష్మస్ధితి మాత్రమే కనిపిస్తుంది.

ఈ స్ధితిలో ఆత్మ తైజసుడని పిలవబడతాడు.

యత్రసుప్తో న కంచన కామం కామయతే,
న కంచనస్వప్నం పశ్యతి, తత్ సుషుప్తమ్!
సుషుప్త స్ధాన ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యానంద భుక్ చేతోముఖః
ప్రాజ్ఞస్తృతీయ పాదః!!

సుషుప్తి – ప్రజ్ఞానఘనుడు:

ఎక్కడో ఏ సమయంలోనో నిద్రిస్తూ, ఎలాంటి కోరికలు కోరకుండా, ఎలాంటి కలలూ కనకుండా, గాఢమైన సుషుప్తి స్ధితిలో ఉండేవాడు, ఏకీభూతుడు, ప్రజ్ఞానఘనుడు, ఆనందమయుడు, ఆనందాన్ని భుజించేవాడు, అయిన “ప్రాజ్ఞుడు” ఆత్మకి మూడవ పాదం.

ప్రాజ్ఞుడు అంటే అన్నీ బాగా తెలిసిన వాడు.

సుషుప్తి లో జీవుణ్ణి ప్రాజ్ఞుడు అంటారు.

జాగ్రదావస్తలో స్ధూల రూపంలో, స్వప్నావస్ధలో సూక్ష్మరూపంలో జీవుడు విషయాలను కామాలను (కోరికలు) అనుభవిస్తున్నాడు.

కానీ సుషుప్తిలో వైరాగ్యం ఉంటుందని, అందువల్ల జీవుడు ఈ స్ధితి నుంచ ఉన్నత స్ధితి కి వెళ్ళే అవకాశం ఉందని ఉపనిషత్తు చెబుతోంది.

ఈ స్ధితిలో మానసిక వృత్తులు, వాటికి సంబంధించిన వాసనలు మొదలైన వృత్తులన్నీ ప్రజ్ఞానం లో లీనమై పోతాయి గనుక ఈ స్ధితి కి “ప్రజ్ఞాన ఘనం” అని అంటారు.

సుషుప్తిలో మానసిక వృత్తులు గాని, దానికి సంబంధించిన వికారాలు గాని చైతన్య వంతంగా ఉండవు. అందువల్ల జీవుడు కేవలం ఆనందా నుభూతిని పొందుతాడు ( స్వప్న స్ధితిలో ఉన్నంత సేపు).

ఆత్మ స్వరూపమైన ఈ ప్రజ్ఞయే సర్వేశ్వరుడు, అంతర్యామి, భూత భవిష్యద్వర్తమానాలలో ఉండేవాడు, సర్వ నియామకుడు.

అన్నింటికీ సారభూతమైన బ్రహ్మము ఈ ప్రజ్ఞయే.

ఈ అవస్ధాత్రయానికి సంబంధించిన మరిన్ని వివరాలను వచ్చే భాగంలో తెలుసుకొందాం.

35. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంత
ర్యామ్యేషయోనిః సర్వస్య ప్రభవావ్యయౌ హి భూతానాం!!

ఆత్మ స్వరూపమైన ఈ ప్రజ్ఞయే సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, భూత భవిష్యద్వర్తమానాలలో ఉండేవాడు, సర్వ నియామకుడు.

అన్ని వస్తువులకు ఉత్పత్తి స్ధానం. సమస్త ప్రాణులకు ఉద్భవ స్ధానం, నాశనానికి కారణం.

అవస్థా త్రయంలో ఆత్మ యొక్క మూడు పాదాలు_
జాగ్రదవస్థ లో వైశ్వానరుడు లేక విశ్వుడని
స్వప్నావస్థ లో తైజసుడు అని
సుషుప్తి లో ప్రజ్ఞానఘనుడు అని పిలవబడతాయి.

శ్రీ శ్రీ గౌడపాదుల ఆగమ ప్రకరణంలోని కారికలు పై మూడు అవస్ధల గుణగణాలను ఇలా వివరించాయి.

1. వైశ్వానరుడు లేక విశ్వుడు సర్వ శక్తిమంతుడు. బాహ్య ప్రపంచంలోని సమస్త భౌతిక వస్తువులను అనుభవములోకి తెచ్చుకోగలిగిన వాడు.
తైజసుడు అంతరదృష్ఠి కలిగి లోపలి విషయాలను చూడ గలుగుతాడు.
ప్రాజ్ఞుడు సమస్తాన్ని తెలుసుకోగలిగిన ప్రజ్ఞను కలిగి ఉంటాడు.

2. విశ్వుడు కనుల ద్వారా వీక్షించ గలిగితే తైజసుడు మనస్సు ద్వారా అర్ధం చేసుకొంటాడు. ప్రాజ్ఞుడు హృదయాకాశాన్ని ఆక్రమించి సమస్త జ్ఞానానికి ప్రతీక అవుతాడు.

3. విశ్వుడు స్ధూలాన్ని అనుభవిస్తే తైజసుడు కంటికి కనబడని వాటిని మనస్సు ద్వారా మాత్రమే చూడగలిగేవాటిని గ్రహిస్తాడు. మరి ప్రాజ్ఞుడు మాత్రము ఆనందానుభూతిని పొందుతూ ఆనందమయమైన వాటిని దర్శిస్తూంటాడు. ఈ స్ధితినే చేతోముఖం అంటారు.

4. పై కారికనే తిరిగి ఈ రకంగా చెప్పేడు:
స్ధూల అనుభవాలవల్ల విశ్వుడు సంతృప్తుడౌతాడు. మానసిక అనుభూతుల ద్వారా తైజసుడు ఉత్తేజితు డౌతాడు. ఆనందానుభూతి ద్వారా ప్రాజ్ఞుడు కుశలుడౌతాడు.

5. స్ధూల అనుభవాలు, అనుభవాలను కలిగించే వస్తువులతో కూడిన మానసిక అనుభవాలను తెలిపే ఆత్మ యొక్క రెండు స్ధితులు వివరింప బడ్డాయి. ఈ రెండు అవస్ధలను తెలుసుకొన్న ప్రాజ్ఞుడెవ్వడూ వాటన్నిటినీ అనుభవిస్తున్నా వాటి వల్ల వికార మమకారాలు లేకుండా నిర్వికారంగా ఉంటాడు.

ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంత
ర్యామ్యేషయోనిః సర్వస్య ప్రభవావ్యయౌ హి భూతానాం!!

ఈ మంత్రానికి మా ఆశ్రమ స్వామీ జయతీర్ధులు (యోగి అచ్యుతుల అనుంగు శిష్యులు) విశేష వివరణ ఇచ్చారు.

ఇతడే సర్వేశ్వరుడు. సర్వజ్ఞుడు. సర్వాంత ర్యామి. అన్ని వస్తువులకు ఉత్పత్తి స్ధానం. సమస్త ప్రాణులకు ఉద్భవ స్ధానం. నాశానికి కారణం.

ఇక్కడ కొంచెం ఆలోచించడం అవసరం.
జాగ్రదావస్ధలో ఇంద్రియ వృత్తుల కంటుకొని, ఇంద్రియాలద్వారా ఏమేమో చేసేవాడు కూడా ఆత్మే.

స్వప్న స్దితిలో, స్ధూలేంద్రియాలు కదలకుండా పడి ఉన్నా, మానసికంగా కల్పితమైన స్ధూలేంద్రియ వ్యాపారాన్ని చేసినట్లే భావించి, కష్టసుఖాలను అనుభవించే వ్యక్తీ ఆత్మే.

గాఢనిద్రలో (సుషుప్తిలో) స్ధూలేంద్రియాల, ఇంద్రియ వృత్తుల ఆట సాగదు. ఇచ్ఛ ఉండదు.

ఉన్నాను, లేను అనే మెలుకువ లేని నిద్రాణ స్ధితి. దానినే ఆనంద స్ధితిగా అభివర్ణించారు.

అయినా కష్టసుఖాలు తనకపుడు లేవనే స్పృహ ఉండదు.

తనకు(ఆత్మకు) తెలియకుండా నడిచే ప్రాణ వ్యాపారం (శ్వాసక్రియ, రక్త ప్రసరణ మొదలైనవి) అపుడు దేహం లో జరుగుతున్నా, ఆ క్రియ జరుగుతోందనే జ్ఞానం ఆత్మకు ఆ సమయంలో ఉండదు.

అటువంటప్పుడు “ఆనందానుభవం” ఉందని చెప్పడం భ్రాంతే.

ఎందుకంటే – జరిగేదాన్ని తెలుసుకోవడమే అనుభవం.

కానీ ఆ క్రియ జరుగుతోందనే ఎరుక (awareness) లేనప్పుడు అనుభవం అనే ప్రసక్తి ఎక్కడ నుండి వస్తుంది?

ఆస్ధితిలో తన దేహాన్ని ముక్కలుగా నరికినా ఆ విషయం అతనికి(ఆత్మకు) తెలియదు కదా?

ఇలా ఈ రీతిలో, సుషుప్తావస్ధలో స్ధబ్దంగా ఉండే ఆత్మే సర్వజ్ఞుడు కాగలుగుతాడు.

అంటే సర్వాన్ని తెలుసుకొన్న వాడవుతాడు.

ఈ ఆత్మ దేహం లోని ఇచ్ఛాశక్తిలో కాని, బుద్ధిలోకాని, ప్రాణ శక్తిలో కాని లభించదు.

ఆ ఆత్మే అన్ని ప్రాణుల దేహాలలో ఉంది. అది దేహాన్ని, దేహంలో ప్రతి ఒక్క అవయవాన్ని రక్షించు కొంటుంది. అలాగే నశింపజేసు కొంటుంది కూడా.

ఈ దేహానికి ఈ ఆత్మ ఉన్నట్లే ఈ పంచ భూతాల కలయిక వల్ల ఏర్పడిన ఈ జగత్తుకి ఒక ఆత్మ ఉంటుంది. అదే సమస్త ప్రాణులకు ఉత్పత్తి స్ధానం.

అలాగే వాటి ఉత్పత్తి వినాశాలకు ఈ ఆత్మే కారణం.

అయితే ఈ జగత్తును సృష్టించగలిగేది, లయం చేయగలిగేది ఆత్మ కాదు. ఆ ఆత్మ లోని ఒక అంశ మాత్రమే.

సూర్యుని అనంత కిరణాలలో ఒక కిరణమున్నట్లే.

సూర్యుని లక్షణాలన్నీ ఆ కిరణంలో ఉన్నా ఆ కిరణం యొక్క శక్తి పరిమితం.

అందుకనే అనుభవజ్ఞులు, జ్ఞానులు దీన్ని(శరీరంలో ఉన్న దాన్ని) ప్రత్యగాత్మ అన్నారు. జగత్తులో ఉన్నదాన్ని ఆత్మ అన్నారు.

జీవునిలోనిది జీవాత్మ విశ్వంలోనిది పరమాత్మ అని వర్ణించారు.

దీనిని రెండు, మూడు, నాలుగు సార్లు చదివి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.

సాధనలో ఉన్నవారు మరింత సునిశితంగా ఈ విషయంలో ధ్యానిస్తే (తపిస్తే) తప్పక ప్రగతి దొరుకుతుంది.

36. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

ఇది ఏడవ మంత్రం. ఈ మంత్రం ప్రత్యేకంగా పరమాత్మ యొక్క “నిరాకార నిర్గుణ” రూపాన్ని వివరిస్తోంది.

ఇంతవరకూ అవస్ధాత్రయాన్ని వివరించడం జరిగింది. ఈ మూడు అవస్ధలు దాటిన తర్వాత జీవుడు చేరేది తురీయం.

ఆత్మయొక్క నాల్గవ పాదం తురీయం. అదే పరమాత్మ.

ఉపనిషత్తు తురీయాన్ని నాల్గవ అవస్ధ గా చెబుతున్నా నిజానికి ఇది ఒక అవస్ధ కాదు అంటారు.

ఇదమిత్ధమని చెప్పలేని తురీయావస్ధను ఈ ఉపనిషత్తు నేతి- ఇదికాదు, ఇదికాదు అనే నిషేధ వచనాలతోనే వివరించింది.

నాంతః ప్రజ్ఞం న బహి ప్రజ్ఞం, నోభయతః ప్రజ్ఞం, న ప్రజ్ఞాన ఘనం, న ప్రజ్ఞం, నాప్రజ్ఞం, అదృశ్య మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణమచింత్య మవ్యపదేశ్య మేకాత్మ, ప్రత్యయ సారం ప్రపంచోపశమం, శాంతం, శివమద్వైతం, చతుర్ధం మన్యంతే, స ఆత్మా స విజ్ఞేయః!!

అది అంతర్ముఖమైన స్ధితి కాదు. అలా అని బహిర్ముఖ స్ధితికాదు.

రెండూ చేరిన స్ధితి అంతకన్నా కాదు. అది చైతన్యవంతమైన స్ధితి కాదు.

అది ప్రజ్ఞాన ఘనం కాదు. అలా అని ప్రజ్ఞ కాదు.

అప్రజ్ఞ అంతకన్నా కాదు. అది కనుపించనిది, చేతలు లేనిది, గ్రహించ శక్యం కానిది. ఎలాంటి లక్షణాలూ లేనిది. ఊహాతీతమైనది, వర్ణించడానికి వీలు లేనిది.

ఏకాత్మప్రత్యయసారంగా ఉన్నది. ప్రపంచానికి ఉపశమనాన్నిచ్చేది. శాంతమైనది.

మంగళకరమైనది. అద్వైతంగా ఉన్నది.
ఇదే ఆత్మ యొక్క నాలుగోపాదం – తురీయం.

దీన్నే ఆత్మ అని గ్రహించాలి.

ఇక్కడ ఈ దేహంలో ఉండే ఆత్మ తప్ప వేరే ఆత్మ కానీ, సర్వాత్మల మూలమైన విశ్వాత్మ (పరమాత్మ) కానీ లేడు.

ఉండేది ఒక్కటే అని వాదించే వాళ్ళు ఉన్నారు.

ఆత్మ యొక్క నాల్గవ స్ధితికి(తురీయ) మొదటి స్ధితికి(జాగ్రత్) ఉండే భేదం చాలా అధికం.

జాగ్రదావస్ధలో జ్ఞానం ఉండడం మనకు అనుభవమే.

స్వప్నావస్ధలోను, సుషుప్తిలోను జ్ఞానం ఉందని ఋజువు ఏముంది? –

నిద్ర నుంచి లేచిన తర్వాత మనము కలలు కన్నామని, లేదా గాఢ నిద్ర పోయామని తెలుస్తోంది కదా!

అంటే ఆ రెండు అవస్ధలకు సంబంధించిన జ్ఞానం మనకు జాగ్రదవస్ధలో ఉంటోంది అని అర్ధం అవుతోంది.

ఈ తురీయుడు జ్ఞాన కర్మేంద్రియాలకు అతీతుడు. కనుక అతనితో వ్యవహారం చేసే ప్రసక్తి లేదు.

కేవలం జ్ఞానం యొక్క ప్రతీక కనుక రూప రహితుడు, ఊహకు అందడు. భాషతో వర్ణించలేము.

ఇలా వివరణకు సాధ్యం కానివాడవటం వల్ల తురీయుడిగా పేరు పొందేడు.

ఇవి వివరణకు అందని విషయాలు.

నాకు తగినంత శక్తి ఉందని నేను భావించడం లేదు.

కొంచెం సమయం ధ్యానంలో కూర్చొని వీటిని అర్ధం చేసుకొనే శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మను ప్రార్ధించి శ్రద్ధ తో చదివి అర్ధం చేసుకోండి.

37. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

సోయమాత్మా ధ్యక్షర మోంకారో ధి మాత్రం, పాదామాత్రా, మాత్రాశ్చ పాదా,
అకార ఉకారో మకార ఇతి!!

ఈ విధంగా నాలుగు పాదాలతో ఉందని చెప్పిన ఆత్మ శబ్దరూపంలో ఓం కారంగా ఉంది.

ఈ ఆత్మ అక్షర దృష్టి కోణంతో చూస్తే ఓంకారం. ఆ ఓంకారోచ్ఛారణను విభజిస్తే మాత్రా రూపంలో ఉంటుంది.

ఆ ఓం కారం అ కార ఉ కార మ కారాలనే మూడు మాత్రలతో లేదా మూడు పాదాలతో (అక్షరాలతో) రూపొందింది.

జాగరితస్ధానో వైశ్వానరో కారః,
ప్రధమా మాత్రా ఆప్తే రాది
మత్వాద్వాప్నోతిహవై సర్వాన్
కామానాదిశ్చ భవతి, య ఏవం వేద!

జాగ్రదావస్థ యే ఈ జీవాత్మకు అనుభవానికి వచ్చే మొదటి స్ధితి.

ఓం కార మంత్రం లోని మొదటి పాదమైన అ కారం జాగ్రదావస్ధకు చెందిన వైశ్వానరుడితో(అగ్ని) పోల్చబడుతుంది.

అ కారం ఉచ్చరించే వేళ శబ్దతన్మూలక వాయువు యొక్క ఊర్ధ్వగమనం ఫ్రారంభమయ్యే స్ధానము వైశ్వానరుని స్ధానము.

వ్యాపకత్వం వల్ల, ప్రారంభత్వం వల్ల అ కారానికి అగ్నికి సామ్యం వుంది.

ఈ విధంగా గ్రహించి ఓంకారాన్ని ఉపాసించినవాడు అన్ని కోరికలనూ నెరవేర్చు కొంటాడు.

ఆ ఉపాసకుడు అన్నిటిలోనూ ప్రధముడుగా ఉంటాడు

అవస్ధాత్రయం అవిద్య వల్ల సంభవిస్తుంది.

తురియం లో ఈ అవిద్య పూర్తిగా నశించి సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది.

అయితే తురీయం చేరుకోవడం సామాన్యమైన విషయం కాదు. తపోసాధన చేయాలి.

నిరంతర సాధన ద్వారా మాత్రమే సమాథి స్ధితి కలుగుతుంది. ఆస్ధితిలో మాత్రమే తురీయం సాధ్యము.

వచ్చే 10,11,12 మంత్రాలలో ఓంయొక్క వివరణ పూర్తి అయి, ఓం కారాన్ని ఆత్మ గా తెలుసు కొన్నవాడు సస్వరూప సందర్శనాన్ని పొంద గలుగు తాడు అంటూ ఈ ఉపనిషత్తు ముగుస్తుంది.

38. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

స్వప్నావస్ధ:

ప్రపంచంలో అనుభవానికి వచ్చే రెండో అవస్ధ స్వప్నావస్ధ. ఆ స్ధితిలో ఆత్మ తైజసుడనిపించు కొంటాడు. తైజస అంటే తేజస్సును పొందే స్ధితి.

స్వప్న స్ధానస్తై జస ఉకారో ద్వితీయా మాత్రో త్కర్షాదుభయత్వాద్వోత్కర్షతి హవ జ్ఞాన
సంతతిం సమానశ్చ భవతి.
నాస్యాబ్రహ్మ విత్కులే భవతి య ఏవంవేద!!

ఓం కారం లోని రెండో పాదమైన ఉ కారం- స్వప్నావస్ధని ఆధారంగా చేసుకొన్న తైజసుడు అవుతాడు.

అ, మ ల మధ్య ఉండడం వల్ల ఉ కారానికి గొప్పదనం వచ్చింది. ఉకారానికి తేజస్సుకి సామ్యం ఉంది.

ఈ స్వప్నావస్ధ లో మనస్సు క్రియాత్మకంగా ఉన్నా ఇంద్రియాలకు విశ్రాంతి దొరుకుతుంది. జాగ్రదా వస్ధలో నెరవేరని కోరికలు తీరడం వల్ల మనస్సుకి తృప్తి. నిద్ర వల్ల కలిగిన విశ్రాంతి తో ఇంద్రియాలకు తుష్ఠి పుష్ఠి కలుగుతుంది.

ప్రణవోపాసన(ప్రాణ విద్య లేదా యోగవిద్య) తెలుసు కొన్న వాళ్ళు అనుష్ఢానం చేసే వేళ ఉ కార ఉత్పత్తిని గ్రహించ గలుగుతారు.

వాయువు యొక్క ఊర్ధ్వ గమనంలో కఫాది దోషాలు కరుగుతాయి.

ఉకార ఉచ్ఛారణ స్ధానంనుండి గాలి క్రింది దిశలో త్రోయ బడినప్పుడు ఆ కరిగిన కఫాది దోషాలు జఠరాశయం లోకి చేరుతున్నాయి.

అక్కడ అవి జీర్ణమై శుద్ధమై శుక్ల వృద్ధికి కారణమౌతుంది. దీనివల్ల దేహానికి పుష్టి, మనస్సుకు ఉత్సాహము లభిస్తాయి.

ఈ మర్మాన్ని గ్రహించి ఓంకారాన్ని ఉపాసించిన వాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకొని సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటాడు.

అట్టి జ్ఞానియొక్క వంశంలో బ్రహ్మ జ్ఞాని కానివాడు జన్మించడు. అజ్ఞానులైన పిల్లలు అసలే పుట్టరు.

సుషుప్తి:

సుషుప్త స్ధానః ప్రాజ్ఞో మకార స్తృతీయా
మాత్రామితేరపీతే ర్వా! మినోతి హవా
ఇదగం సర్వ మపీతిశ్చ భవతి య ఏవం వేద!!

మూడవ అవస్ధ అయిన సుషుప్త స్ధితిలో జీవాత్మ అస్ధిత్వం మాత్రమే ఉంటుంది.

ప్రాణము యొక్క సహజ క్రియకు మాత్రమే అది పరిమితం.

మనస్సు తన కార్యకలాపాలను పూర్తిగా కట్టిబెట్టి తన మూల చేతనమయిన జీవాత్మ లో ఐక్యమై విశ్రాంతి తీసుకొంటుంది.

అదే విధంగా ప్రాణోపాసన లో నిర్వికల్ప సమాధి అనే స్ధితిలో వాయువు ద్వారా ఉత్పత్తి అయ్యే శబ్దం ఉండదు.

మనస్సు ప్రాణం కలిసి ఆత్మలో లీనమై పోతాయి.

మ్ అనే శబ్దాన్ని ఉచ్చరించే వేళ గాలి బయటకు రాకుండా దేహంలోనే కలిసిపోతుంది.

అందుకే ఈ సుషుప్తి స్ధితిని మకారంతో పోల్చారు.

ప్రయత్నం లేకుంటే సుషుప్తి, దాని తర్వాత తురీయం లభించవు. మళ్ళీ స్వప్న స్ధితోలేక జాగ్రదావస్ధో లభించొచ్చు.

ప్రాణ విద్య యొక్క అనుష్ఠానాన్ని తెలుసుకొని జాగ్రదవస్ధలో అభ్యాసం చేస్తే సుషుప్త స్ధితి కల్గి, తదనంతరం ఆత్మ యొక్క సహజ స్ధితి యైన తురీయావస్ధను పొందగలుగుతాడు.

ఓంకారం లోని మూడవ పాదమైన మ కారం- సుషుప్తిని ఆధారంగా చేసుకొన్నవాడు ప్రాజ్ఞుడౌతాడు.

జీవాత్మకు తురీయావస్ధలో జ్ఞానం, ఆనందం ప్రాప్తిస్తాయి.

ఆ స్ధితి లభించే ముందు భ్రాంతికి లోనయ్యే ఇంద్రియాలు, ఇంద్రియ వృత్తులు, మనస్సు నిశ్చలంగా ఉండేటట్లు చేసుకోగలగాలి.

వీటి వృత్తులన్నీ అణగితే నిర్వికల్ప సమాధి స్ధితికి (సుషుప్తి లాంటిది)చేరుకొనే అవకాశం ఉంటుంది.

దీనిని గ్రహించి సాధన చేసే వ్యక్తి ఈ ప్రపంచంలో అందరియొక్క సామర్ధ్యాలను తెలుసుకో గలుగుతాడు.

దానితో బాటు అంతర్ముఖత పొందిన వాడై సస్వరూపానందాన్ని పొందగలుగుతాడు.

కొలత కొలిచే స్వభావం వల్ల, గ్రహించగలిగే స్వభావం వల్ల మ కారము మరియు ప్రాజ్ఞుడు సమానంగా ఉంటాయి.

ఈ విధంగా తెలుసుకొన్న వాడు ఈ సమస్త విశ్వాన్ని కొలిచివేయ గలిగే సమర్ధుడిగా, అన్నింటినీ గ్రహించే వాడిగా అవుతాడు.

తురీయావస్ధ:

అమాత్రశ్చతుర్ధో వ్యవహార్యః ప్రపంచోపశమః శివో ద్వైత,
ఏవమోంకార ఆత్మైవ, సంవిశత్యాత్మ నాత్మానం
య ఏవం వేద, య ఏవం వేద!!

ఇంక ఓం కారం లోని నాల్గవ పాదాన్ని పాదంగా చెప్పలేము. అ ఉ మ (ఓం లోని మూడు మాత్రలు)తర్వాత తురీయానికి ఏ మాత్రా లేదు.

జీవాత్మ యొక్క నిత్య వ్యవహారంలో అప్రయత్నంగానే లభించే స్ధితి కాదీ తురీయం.

గురు కృపతో మాత్రమే లభ్యమయ్యేది ఈ తురీయావస్ధ.

గురు ముఖతా ప్రాణ విద్యోపదేశాన్ని పొంది శ్రద్ధా భక్తిలతో సాధన చేస్తే మాత్రమే లభిస్తుంది.

ఈ స్ధితిలో ప్రాపంచిక వ్యవహారాల్లో కలిగే నిర్బలత్వము, చాంచల్యం, నైరాశ్యం, దుఃఖం మొదలైన శాంతిస్తాయి. ఇది శ్రేయస్కరమైన స్ధితి.

అది నిర్వికారమైనది. ప్రపంచానికే ఉపశమనాన్ని ఇచ్చేది, మంగళ ప్రదమైనది.

ఇలా చెప్పబడిన ఓంకారమే ఆత్మ.

ఓంకారాన్ని ఆత్మ గా తెలుసుకొన్నవాడు తనలో తాను ప్రవేశిస్తాడు.

అంటే సస్వరూప సందర్శనాన్ని పొందగలుగుతాడు.

ఈ విధంగా మాండూక్యరసాయనం ముగుస్తుంది.

వచ్చే ఒకటి రెండు భాగాలలో శ్రీ గౌడపాదుల నాలుగు ప్రకరణాలలో విషయాలను పరిశీలిద్దాం.

39. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

35వ భాగంలో శ్రీ శ్రీ గౌడపాదుల ఆగమ ప్రకరణం లో వైశ్వానర ప్రాజ్ఞ, తైజసుల లక్షణాలు కొన్ని వివరించాము. ఇప్పుడు మిగిలిన సామ్యాలు, వైవిధ్యాలు కూడా చూద్దాము.

1. కొందరు ఈ సృష్టిని ఈశ్వరేచ్ఛగాను, ఆ పరమాత్ముని క్రీడ గాను లేదా అతని యొక్క శక్తి గాను భావిస్తారు. మరి కొందరు ఈ సృష్టి అంతా ఒక కలగా, ఒక భ్రమగా భావిస్తూంటారు.

2 ఈ సృష్టి అంతా భగవంతుని లీల అని కొందరు, భగవంతుని కోరిక అని కొందరు అంటారు.

ఎవరైతే మన కోరికలన్నిటినీ తీర్చ గల సమర్ధులో అతనికి కోరిక ఉండే సావకాశం ఏమిఉంటుంది?

3. తురీయావస్ధ నిజంగా మన బాధలనన్నిటిని పారద్రోలుతుంది. అన్ని రూపాలను నాశనం చేస్తుంది. నాలుగు పాదాలలోను ఆరోపించబడిన రూపాలు నిజంకానివి. అన్నింటినీ జయించినవాడు, ఊహ కందనివాడు, బుద్ధికి అతీతుడు -ఆ తురీయా వస్ధను పొందినవాడు.

4. విశ్వ, తైజస స్ధితిలు కార్య కారణ సంబంధం తో బంధించబడి ఉంటాయి. ప్రజ్ఞ మాత్రం కారణ భూతమైనది. కాని తురీయాస్ధితి లో కార్యము కాని, కారణము కాని ఉండదు.

5. విశ్వ, తైజస స్ధితులు రెండూ జాగ్రత్ స్వప్నా వస్ధలతో కలుపబడి ఉన్నాయి. ప్రజ్ఞ స్ధితి స్వప్నములు లేని నిద్ర- సుషుప్తావస్ధ తో కలుపబడింది.

అయితే బ్రహ్మత్వ కాంక్షులు జాగ్రద్ స్వప్న సుషుప్తులు లేని తురీయా వస్ధను పొందుతారు.

6. విశ్వం యొక్క స్వరూపాన్ని వివరించవలసి వచ్చినప్పుడు, ఓం లోని మూడు అక్షరాలు, అ ఉ మ అనే ప్రతి అక్షరం దాని పరిధిలో అదే మొట్టమొదటిది. ఎందువల్ల అంటే వాటియొక్క విశ్వ వ్యాపకత్వము వల్లనే.

7. విశ్వ యొక్క స్వరూపానికి అ ఆధారమయితే, తైజస స్ధితికి ఉ అనే అక్షరం యొక్క నైజమే కారణము. ప్రాజ్ఞ స్ధితి, ఓంలో మ రెండూ కూడా లెక్కంప దగినవి(measurable). అంతే కాకుండా రెండూ లయ కారకాలే.

8. ఓంలో అ మీద ధ్యానం చేసి విశ్వ స్ధితిని, ఉ మీద ధ్యానంచేసి తైజస స్ధితిని, మ మీద ధ్యానం చేసి ప్రజ్ఞ స్ధితులను పొంది నిశ్శబ్ద స్ధితిలో ముక్తిని పొందుతున్నారు.

9. ఎవరైతే ఈ అవస్ధా త్రయం లో ఉండే సామ్యత్వాన్ని తెలుసుకొంటారో, ఓం అనే అక్షరాన్ని ప్రత్యక్ష పరచుకొంటారో వారిని అందరూ గొప్ప మహర్షి అని పూజిస్తారు. గౌరవిస్తారు.

10. ఓం అనేది ఆది, మధ్యమము మరియు అంతము కూడా.

నిశ్శబ్దమైనది ఓం.

అనంతమైన శబ్దము తో కూడుకొన్నది ఓం.

ఓం ని ఈశ్వరునిగా తెలుసుకోవాలి.

ఓం అనేది ఎల్లవేళలా అందరి హృదయాలలోను నివశించేది.

ఓం అనేది బ్రహ్మత్వానికి ప్రతి రూపము.

ఎవరు ఓంను నాశనము కాని దానిగా దర్శిస్తారో వాళ్ళు పరబ్రహ్మను దర్శిస్తారు.

ఓం ను తెలుసుకొన్న వాళ్ళు అద్వైత సిద్ధి కలిగి నిజమైన యోగిగా మారుతారు.

వచ్చే భాగంలో వైతధ్య ప్రకరణంలోని ముఖ్యాంశాలను తెలుసుకొందాం.

40. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

ఆగమ ప్రకరణం తర్వాత రెండవది వైతిధ్య ప్రకరణం. ఇది స్వప్నావస్థ ను విశదీకరిస్తూంది

వితధ అంటే వాస్తవ స్వరూపానికి భిన్నంగా ఉండటం.

వైతిధ్యం అంటే అనిత్యము, అసత్యము అని అర్ధం.

ఈ కంటికి అనేకత్వంతో కనిపించే ప్రపంచం సత్యం కాదని ఇందులో వివరించబడింది.

కలలో చూచినవన్నీ అనిత్యాలు. అవన్నీ శరీరంలో నూ, మనస్సులోనుంచి వచ్చినవే.

కలలు కనేవాడు ఆ కలలో కనపడిన వస్తువులను ప్రదేశాలను చూడటానికి శరీరం లోనుండి బయటకు పోలేడు- నిద్ర నుంచి లేచిన తర్వాత కూడా కలలో చూచిన ప్రదేశాలకు వెళ్ళలేడు.

కలలలో మనసుతో చూసిన వివిధ వస్తువులు అవాస్తవాలని జాగ్రదావస్ధలో తెలుసుకో గలుగుతున్నాము.

జాగ్రదావస్థలో మనస్సుతో దేనిని వాస్తవంగా చూస్తామో అది నిజము.

కాని రెండు కూడా అవాస్తవాలే.

జాగ్రదావస్థలో మనము దేనినైతే మనసులో ఊహిస్తామో అది అవాస్తవం.

అలా కాకుండా జాగ్రదావస్థలో బయట వాస్తవంగా దేనినైతే కళ్ళతో చూస్తామో అది నిజము.

కాని వైతిధ్య ప్రకరణం ప్రకారం చూస్తే రెండూ కూడా అవాస్తవాలే.

ఇపుడు జాగ్రదావస్థలోనూ, కలలోను చూసిన వస్తువులు అవాస్తవాలయితే మరి ఎవరు అన్ని వస్తువులను వాస్తవంగా చూస్తున్నారు?

మరి ఎవరు వాటిని ఊహిస్తున్నారు?

అదే ఆత్మ. తన యొక్క మాయా ప్రభావం వల్ల అన్ని వస్తువులను తనలోనే ఊహిస్తుంది. ఆ యా వస్తువులకు సంబంధించిన అనుభవాలను బయట మరియు తన లోపల కూడా ఊహిస్తుంది.

ఆత్మ ఒక్కటే వస్తువుల యొక్క వాస్తవత్వాన్ని తెలుసు కోగలిగేది.

ఈ ఆత్మ తన మనస్సును బహిర్ముఖ స్ధితిలో ఉంచి శాశ్వతమైన భూమి, అశాశ్వతమైన వెలుతురు మొదలైన సమస్త వస్తువులను వివిధ ఆకారాల్లో ఊహిస్తుంది.

ఇవన్నీ వాసనల రూపంలో తన మనస్సులో ఉన్నవే.

అదే విధంగా తన మనస్సును అంతర్ముఖతను చేసి మరెన్నో కోరికలను ఊహిస్తుంది.

వాటి వాసనలు ఉన్నంత వరకూ ఆ యా వస్తువులు (వాటి ఆలోచనలు) లో లోపల వాస్తవాలుగా గుర్తింప బడతాయి.

ప్రతి ఒక్కనిచే వారి వారి విజ్ఞానము, జ్ఞాపక శక్తుల ఆధారంగా జీవుడు ఊహించుకోబడ్డాడు.

ఆ జీవుడికి బహిర్ముఖంగా శబ్దాలు, రూపాలు మొదలైనవి; అంతర్ముఖంగా ప్రాణం, కర్మేంద్రియాలు ఊహించుకో బడ్డాయి.

చీకటిలో ఉన్న తాడుని ఒక పాము గాను లేదా నీటి ధార మొదలైన వాటిగా అనుకొన్న రీతిగా ముందుగా ఆత్మ వివిధ విధాలుగా ఊహించుకోబడింది.

ఒకసారి తాడు యొక్క నిజ స్వరూపాన్ని నిర్ణయించేక అన్ని అపోహలు తొలగి పోయి అది తాడు తప్ప మరేమీ కాదు అని తెలుసుకోబడే విధంగా ఆత్మ యొక్క ఉనికి నిర్ణయింప బడుతుంది.

ప్రాణం గురించి తెలుసున్న వాళ్ళు ఆత్మను ప్రాణము గా ఊహించు కొన్నారు.

పంచతన్మాత్రలు(పృథివ్యాపస్థేజో వాయు రాకాశాత్) తెలుసున్న వాళ్ళు ఆత్మయొక్క నాలుగు పాదాలను పృథివి, జలము, అగ్ని, వాయువులు గా అనుకొన్నారు.

సాంఖ్యులు సత్వరజస్తమో గుణాలుగా భావించారు.

శైవులు ఆత్మను అజ్ఞానం, శివుడు(జ్ఞానం) ల సమ్మేళనం గా భావించేరు.

పౌరాణికులు ఆత్మను పృథివి, ఆకాశం, స్వర్గంల కలయిక గా తలుస్తారు.

సూక్ష్మం తెలుసుకొన్న వాళ్ళు సూక్ష్మంతోను; స్థూలం గురించి తెలిసిన వాళ్ళు స్థూలంతోను పోల్చుకొన్నారు.

ఆత్మ ను కాలం గాను, ఆకాశం గాను, మనస్సు గాను, బుద్ధిగాను, చిత్తము గాను, సృష్టి గాను తలచేరు

కొంతమంది ఆత్మ 25 మాత్రలతో కూడుకొన్నదని, 26 మాత్రలున్నాయని, కాదు 31 సూత్రాలతో కూడుకొని ఉందని, కాదు కాదు అనంతమైన సూత్రాల సముదాయమే ఈ ఆత్మ సుమా అని నిర్ధారించారు.

పైన చెప్పిన వన్నీ విభిన్నంగా లేక పోయినా ఆత్మ మాత్రం వైవిధ్యం గానే చెప్పబడుతుంది. ఈ విషయాన్ని అర్ధం చేసుకొన్న ధీరుడు నిశ్ఛయంగా వేదాలను తెలుసుకోగలడు.

కలలను, అపోహలను, గాలిలో మేడలను చూచినట్లే విజ్ఞులు, వేదాంత విశారదులు ఈ భౌతిక విశ్వాన్ని చూస్తారు.

అద్వైతాన్ని సమగ్రంగా అర్ధం చేసుకొన్న వాళ్ళు చెప్పే దేమంటే:

సృష్ఠి స్థితి, లయాలు లేవు. ఎవరికీ బంధాలు లేవు. క్రమ శిక్షణ అవసరం లేదు. ముక్తిని కోరేవాళ్ళు గాని, ముక్తికై ప్రయత్నించేవాళ్ళు గాని లేరు. అలాగే ముక్తిని పొందినవాళ్ళు కూడా లేరు.

ఇది నగ్న సత్యం.

ఎందుకంటే ఉన్నది ఒక్క ఆత్మే అయినప్పుడు ఇవేవీ ఉండే సావకాశమే లేదు కదా!

అద్వైతము అంటే ఉన్నది ఆత్మ ఒక్కటే.

వైతిధ్య వివరణ ఇంకా ఎంతో ఉన్నా పాఠకులకు సంక్షిప్తంగా ఇచ్చిన విషయాన్ని శ్రద్ధతో గ్రహించమని నా మనవి.

వచ్చే భాగంలో అద్వైత ప్రకరణం గురించి తెలుసుకొందాం.

అద్వైత ప్రకరణానికి వెళ్ళే ముందు, ఆది శంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ఒకసారి అర్ధం చేసుకో వడానికి ప్రయత్నిద్దాం.

అద్వైతమంటే ఏకత్వము. – ఏకైకమైన తత్వము.

అద్వైతము జీవుడని, జగత్తని, ఈశ్వరుడని, ప్రకృతి అనీ అన్ని పదార్దాలను ఒప్పుకోదు.

ఉన్నది ఒకే ఒక తత్వము.

అది నిరాకారము, సర్వ వ్యాపకము అయిన పరిశుద్ధమైన జ్ఞానము.

జ్ఞాన స్వరూపమైన ఆత్మే వాస్తవం.

ఈ ఆత్మ ఆత్మ గా ఉంటూ అనాత్మ గా కూడా భాసిస్తోంది.

అనాత్మ అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు.- ఈ మూడు అనాత్మే.

అద్వైతం ఏమంటోందంటే:

సృష్టి లో ఏపదార్దాన్నయినా చూడండి.

మానవుని మనో భావాల నుంచి బాహ్య ఆకాశం వరకూ ఏదయినా సరే. ప్రతి ఒక్క దానిలోనూ రెండు భాగాలుంటాయి.

అవి రెండూ ఒక దానితో ఒకటి అవినాభావంగా కనిపిస్తాయి. ఒకటి సామాన్యం. మరొకటి విశేషమని అంటారు అద్వైతులు.

ఉదా: ఘటం అనేది ఒకటి కాదు రెండు న్నాయి.- ఒకటి మట్టి. ఘట రూపం ఇంకొకటి. – దీనిలో మట్టి సామాన్యమైతే ఘటరూపం విశేషం.

అలాగే ఒక ఆభరణంలో బంగారం సామాన్యం. ఆభరణ రూపం విశేషం.

ఇవి సామాన్య, విశేషాలకు ఉండే సంబంధం.

ఈ సూత్రాన్ని కొంచెం ముందుకు పోయి చూద్దాం.

ఉదా: ఒక చెట్టు ఉంది. దాని విత్తనముంది.
ఇప్పుడు చెట్టు ముందా విత్తనం ముందా? అనే ప్రశ్న వస్తుంది.

రెండూ కావు. రెండూ విశేషాలే.

ఆ రెండు విశేషాలను వ్యాపించి ఉన్నది పృథివీ తత్వం.

భూమి అనేదే లేకపోతే వృక్షంలేదు, బీజంలేదు. ఆ రెండిటికీ అస్థిత్వమే లేదు. అందుకని భూమి సామాన్యమౌతుంది. చెట్టు, విత్తనం విశేషాలవు తాయి.

ఇంకొంచెం ముందుకి పోతే:

ఈ పృథివి ఎక్కడనుంచి వచ్చింది? -జలం నుంచి.

జలం దానికి కారణమైతే పృథివి కార్యమౌతుంది. కారణం సామాన్యం, కార్యం విశేషం.

జలం గట్టిపడి బాగా ఘనీభవించి భూమి అయ్యింది.

మరి జలం ఎక్కడనుంచి వచ్చింది?

తేజస్సు చల్లబడి జలమయింది.

తేజస్సుకేది మూలం?

కదిలేటటు వంటి వాయువు ఘర్షణ చెంది ఉష్ణ గుణమైన తేజస్సయ్యింది.

వాయువెక్కడిది?

అచలమైన ఆకాశమే చలించి వాయువయింది అంటాడు అద్వైతి.

ఈ ఆకాశమెక్కడిది? – ఇక్కడ అందరూ- సామాన్యులు, శాస్త్రజ్ఞులు కూడా ఆగిపోతారు.

కాని అద్వైతి అంటాడు ఆకాశమే తన సస్వరూపమని. తన జ్ఞానమని, – దానినే ఆత్మ అంటారు అని.

ఆ ఆత్మకు గోచరించేవన్నీ- ఆకాశం నుంచి ఉన్న సమస్త భౌతిక పదార్ధాలు అనాత్మ కిందే వస్తాయి.

మరి ఇక్కడ ఆత్మ అనాత్మ అని రెండు చెబుతున్నప్పుడు ఇది అద్వైతమెలా అవుతుంది?
అద్వైతమంటే ఒకటే ఉండాలి కదా!

ఆత్మ అంటే జ్ఞానము అని మనకు తెలుసు.
జ్ఞానమంటే ప్రమాణం. – జ్ఞేయమైనది ప్రపంచం.

జ్ఞేయమైన ఏ పదార్ధానికి స్వతంత్రమైన అస్థిత్వం లేదు. అందు చేత ఆత్మ ఒక్కటే.

ఇప్పుడు అద్వైత సిద్ధాంతంలో కొన్ని ముఖ్యమైన మౌలిక సూత్రాలను తెలుసుకొన్నాము కనుక మాండూక్యోపనిషత్తు లోని గౌడపాదుల అద్వైత ప్రకరణం మొదలు పెడదాం.

41. ఉపనిషత్తులు – మాండూక్యోపనిషత్తు (Continuation)

అద్వైత ప్రకరణం

ఆత్మ ఆకాశం లాంటిది. కుండలలో నిండి ఉన్న ఆకాశంలా జీవుల రూపంలో ఉద్భవించింది.

కుండలు మొదలయినవి ఆకాశం నుంచి తయారయినట్టే మానవ శరీరాలు ఆత్మ నుంచే పుట్టాయని చెబుతారు.

కుండలన్నిటిలోను ఆకాశం నిండి ఉంది. కుండ పగిలిపోగానే కుండలో ఉండే ఆకాశం వినీలాకాశం లో కలిసిపోతుంది.

మానవ శరీరాలన్నీ ఆత్మను కలిగి ఉన్నాయి. జీవుని మరణం తర్వాత జీవుని లోని ఆత్మ పరమాత్మ లో కలిసి పోతుంది.

కుండ లోని దుమ్ము ధూళి పొగ మొదలైన మలినాలు ఆ కుండనే మలినంచేస్తాయి. అయితే ఇతర కుండలలోని ఆకాశాన్నిమలినం చేయలేవు.

అదే విధంగా ఒక జీవునిలోని ఆవేశకావేశాలు, ఆనందం, దుఃఖం మరొక జీవిని ప్రభావితం చేయలేవు.

ఒక కుండలో ఉండే ఆకాశము కార్యము కాని కారణము కాని కాదు. అలా అని విశాల నిజ ఆకాశం లో భాగమూ కాదు.

అలాగే జీవుని లో ఉండే ఆత్మ ఆ పరమాత్మ లో భాగం కాదు.

ఆకాశం యొక్క విశ్వ వ్యాపక త్వాన్నను సరించి ఆత్మ పంచకోశ దశలతో (అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము) కూడినదని, భౌతికము మరియు ఆత్యంతికము- అది పరమాత్మ తప్ప వేరుకాదు – అంటూ తైత్తరీయోపనిషత్తు లో విపులమైన వర్ణన ఉంది.

అద్వైతమే ఉత్తరోత్తరా నిజమైనది. ద్వైతమనేది దీనియొక్క ప్రతిఫలం.

అజరామరమైన ఆత్మ మాయవల్ల, రెన్నో రూపాలుగా అవుతుంది.

ఈ అనేక రూపాలు నిజమైనవే అయితే, నాశనంకానివన్నీ కూడా నశించేవి అవుతాయి.

నాశనం లేనిది నశించేదానిగా మారదు.

నశించేది నాశనము లేని దానిగా మారదు. ఎందుకంటె ఏవస్తువు తన సహజ స్థితిని, తన మౌలిక సూత్రాలను మార్చుకోవడం ఎన్నటికీ జరుగదు.

వేదాలలో ఇక్కడ వైవిధ్యం లేదని చెప్పబడింది.

మాయ ప్రభావం వల్ల, ఆ పరమాత్మే జన్మ తీసుకోకుండా సమస్త జీవులలోను ప్రతిబింబి స్తున్నాడు.

ఆత్మ యొక్క క్లిష్టతరమైన నిజతత్వాన్ని నేతి, నేతి- ఇది కాదు, ఇది కాదు అనే ప్రతిపాదనల తో నిర్ధారించారు.

అందువల్ల అజరామరమైన ఆత్మ యే తనంతట తాను తెలియబడింది.

ఏదయితే నిజము కాదో అది నిజముగా పుట్టుక తీసుకోలేదు.

గొడ్రాలి పుత్రుడు నిజంగా గాని మాయ ద్వారా గాని పుట్టడు.

నిజానికి అద్వైతంగా ఉండే మనస్సు కలలో ద్వైతిగా కనిపిస్తుంది.

అలాగే జాగ్రదావస్త లో అద్వైతి గా వుండే మనస్సు ద్వైతిగా కనపడుతుంది.

మన అధీనంలో ఉన్న మనస్సు అవాస్తవమైన ఆలోచనలు లేకుండా విచక్షణా జ్ఞానంతో ఉంటుంది.

కాని మంచి నిద్రలో ఉండే మనస్సు యొక్క స్తితి వేరే విధంగా ఉంటుంది.

ఆత్మ జన్మ లేనిది, నిద్ర లేనిది. కలలు రానిది. పేరు లేనిది. రూపము లేనిది.

ఇది ఎల్లప్పుడు చేతనత్వంతో వెలిగిపోతూ ఉంటుంది.

అది సర్వ వ్యాపి. సర్వజ్ఞ.

ఆత్మ క్రియా సూన్యత్వంతో నిండి ఉంటుంది.

ఆత్మ వివరణకు అందనిది.

మనస్సుయొక్క క్రియా కలాపాలకు అతీతంగా ఉంటుంది.

అది ఒక అద్భుతమైన శాంతి.

ఒక రకమైన మహోన్నత కాంతి పుంజము.

అచేతనత్వంతో కూడి నిర్భయంగా ఉండేది ఆత్మ.

బ్రహ్మత్వానికి జ్ఞానం తోడయితే ఆత్మ అజరామరమౌతుంది. సమత్వాన్ని పొందుతుంది.

అద్వైతాన్ని తెలియని యోగులు మనస్సును అదుపులో ఉంచుకొని నిర్భయత్వాన్ని, తిరుగు లేని శాంతిని పొందడానికి, స స్వరూప జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు.

కుశ ధాన్యపు గడ్డి పరకతో సముద్రంలోని నీరును ఒక్కొక్క నీటి బిందువుతీసేస్తూ సముద్రాన్ని ఖాళీ చేస్తున్నట్లే మనస్సు లోని కోరికలను ఒకటొకటి నెమ్మది నెమ్మదిగా తొలగిస్తూ నిరుత్సాహ పడ కుండా అత్యంత సున్నితమైన ప్రయత్నంతో మనస్సును అధీనంలోకి తెచ్చుకోవాలి.

కోరికల మీద ఉండే అనుభూతిని, అనుభవించాలనే కోరికలను వెనుకకు తీసుకొని రావాలి.

ఎందుకంటే అవన్నీ దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తాయి.

ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఆ అజరామరమైన ఆత్మ యే.

మనస్సు కనుక చేతన రహిత స్థితి లోకి పోతే దానిని లయ స్థితి నుండి లేపాలి.

ఒక వేళ ప్రక్క దారులకు పోతే దానిని సమత్వ స్థితి లోకి తేవాలి.

బంధనానికి మొలకలు మనస్సు.

మనస్సులో లౌఖిక బంధనానికి సంబంధించిన మొలకలు ఉన్నప్పుడు దాని స్వభావాన్ని అర్ధం చేసుకోవాలి.

మనస్సు సమత్వ స్థితిలో ఉన్నప్పుడు దానిని కదుపవద్దు.

యోగి సమాధి మత్తులో పడిపోకూడదు. సమాధి స్థితి నుండి బయటకు రావడానికి విచక్షణతో ప్రయత్నించాలి.

సమత్వాన్ని, స్థిరత్వాన్ని పొందిన తర్వాత యోగి యొక్క మనస్సు తిరిగి భౌతిక వస్తువులను కోరినట్లయితే ప్రయత్నంతో వాటన్నిటినీ ఆత్మ గా దర్శించడం నేర్చుకోవాలి.

పరమ శాంతి, ఆత్యంతిక మైన ఆనంద స్థితి తనలోనే ఉంటుంది. అదే శాంతి స్థితి.

అదే ముక్తి. అదే జన్మ రాహిత్యము. దానినే పరంబ్రహ్మ అంటారు ఏదయితే పునర్జన్మ లేని ఆత్మగా అవుతుందో అదే నిజమైన జ్ఞానము యొక్క గని.

ఏ జీవి ఎప్పుడూ పుట్టదు. జీవిని పుట్టించ గలిగిన కార్యం ఏదీ లేదు. ఆత్యంతికమైన సత్యం ఏమిటంటే ఏదీ కూడా ఇప్పటి వరకూ పుట్ట లేదు.

ఈ విధంగా అధ్వైత ప్రకరణం ముగుస్తుంది.

ఇంక మిగిలినది అలాతశాంతి ప్రకరణం వేదాలను అంగీక రించని ఇతర మతాలను ఖండిస్తూ చెప్పేవిషయాలతో ఉంటుంది.

అందుకని వచ్చే భాగంలో ప్రశ్నోపనిషత్తు మొదలు పెడదాం.

42. ఉపనిషత్తులు – ప్రశ్నోపనిషత్తు

ఇప్పటి వరకూ మనం చదివిన ఉపనిషత్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకొందాం.

1. ఈశావాశ్యోపనిషత్తు జ్ఞాన కర్మలకు రెండికి ప్రాధాన్యం ఇస్తూ సత్తు- అసత్తు లకు అవతల ఉండేదేవుని గురించి, ఆ దేవునిలో ఐక్యమై జన్మరాహిత్యాన్ని పొందే మార్గాలను వివరించింది.

2. కేనోపనిషత్తు ఇంద్రియాలుకాని, మనస్సుకాని, బుద్ధి కాని, ప్రాణం కానీ ఆ బ్రహ్మాన్ని గ్రహించలేవు. వీటన్నిటికీ భగవంతుడే ఆశ్రయం కావటం వల్ల అతనికి సంబంధించిన జ్ఞానం మనకు అతని దయవల్ల మాత్రమే లభించాలి అని తెలియ పరచింది.

3. కఠోపనిషత్తు లో బ్రహ్మవిద్య యే మహత్తర చర్చనీయాశం. జీవాత్మ పరమాత్మల గురించి చెప్పిందీ శాస్త్రం. దీని లో సావధిక స్థితి నుండి అనంతత్వం వైపు; అజ్ఞానంధకారం నుండి జ్ఞానప్రకాశం వైపు; మృత్యువు నుంచి అమృతత్వం వైపు మానవుడు సాగించే ప్రయాణం వివరించ బడింది.

4. మాండూక్యోపనిషత్తు: ఈ ఉపనిషత్తులో అవస్తాత్రయాన్ని దాటి తురీయా స్థితిని చేరుకొని, ఆత్మ స్వరూపం తెలుసుకోవడం ద్వారా ముక్తిని పొందడం వివరించబడింది. ఓం కారం 12 మంత్రాలలో ఎంతో విపులంగా వివరింపబడింది. ఆ మంత్రాలకు 215 కారికలతో శ్రీ శ్రీ గౌడపాదులు చక్కటి వివరణ ఇచ్చారు.

ఇప్పుడు ఐదవ ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు.
ఇది అధర్వణ వేదానికి సంబంధించినది. ఈ ఉపనిషత్తు “భద్రం కర్ణేభిః…..” అనే శాంతిమంత్రం తో మొదలవుతోంది. మాండూక్యోపనిషత్తులో ఈ శాంతి మంత్రానికి అర్ధం చెప్పుకొన్నాము.

ఇందులో జిజ్ఞాసువులు ఆరు మంది పిప్పిలాద మహర్షి వద్దకు వచ్చి తత్వరహస్యాలను ఉపదేశించమని అడుగుతారు.

కాత్యాయన వంశజుడైన కబంధుడు,
భృగు వంశజుడైన వైదర్భి,
అశ్వలాయన వంశస్తుడైన కౌసల్యుడు,
గర్గి మహర్షి సంతతికి చెందిన సౌర్యాయణుడు,
శిబి వంశజుడైన సుకేశుడు అనబడే ఆరుగురు ఋషులు ఒక రోజున వారి వారి సందేహ నివృత్తి కోసం పిప్పిలాద మహర్షిని సమిత్పాణులై (చేతియందు సమిధలు ఉన్నవారై)ఆశ్రయించారు.

(రాజుని, గురువును భగవంతుని రిక్త హస్తాలతో దర్శించకోడదు అని నియమం. ఎల్లప్పుడు నిత్యాగ్నిహోత్రులైన గురువులను దర్శించుకొనే టప్పుడు అగ్నిహోత్రంలోకి సమిధలను తీసుకొని వెళ్ళడం పరిపాటి).

వారందరూ అప్పటికే శమదమాది సద్గుణాన్వితులు, ఋషులు అయినా కూడా, పిప్పిలాదుడు వారందరనీ ఒక ఏడాదిపాటు బ్రహ్మచర్యం తో తపస్సు చేస్తూ తన ఆశ్రమంలోనే ఉంటూ గురు శుశ్రూష చేస్తూ ఉండమన్నాడు.

కారణమేమిటంటే నియమ నిష్ఠలతో చేసే ఆశ్రమ వాసం ఇంద్రియాలను బాహ్య ప్రపంచంలో ప్రవర్తించకుండా అంతర్ముఖతను పొంది మనస్సుకి ఏకాగ్రతను చేకూరుస్తుంది. గురు శిష్య అనుబంధం ఏర్పడుతుంది. ఈ వాతావరణంలో చేసిన గురు శిష్య సంవాదంతో సందేహాలన్నీ పటాపంచ లవుతాయి.

ఛాందోగ్యోపనిషత్తులో కూడా- ఇంద్ర విరోచనులిద్దరూ ప్రజాపతిని ఆత్మజ్ఞాన సముపార్జనకై ఆశ్రయించినప్పుడు గురువు యొక్క ఆశ్రమంలో ముప్ఫై సంవత్సరాలు తపస్సు చేసేక గురువు వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేరు.

ఉపనిషత్తులలో ప్రశ్నోపనిషత్తు అత్యంత ప్రాధాన్యమైనది. దీనిని ఎంతో శ్రద్ధగా అర్ధం చేసుకోమని నామనవి.

43. ఉపనిషత్తులు – ప్రశ్నోపనిషత్తు (Continuation)

అధర్వ వేదానికి చెందిన పిప్పలాదశాఖకు సంబంధించినదీ ప్రశ్నోపనిషత్తు.

ఈ ఉపనిషత్తులో అక్షర బ్రహ్మ చక్కగా వర్ణించబడ్డాడు.

ఈ ఆరుగురు అడిగిన ప్రశ్నలు చాలా ముఖ్య మైనవి.

తత్వాన్ని ఆకాంక్షించే వాళ్ళలో చెలరేగే ప్రశ్నలన్నీ ఈ ఆరుగురూ అడిగిన ప్రశ్నలలో వస్తాయని చెప్ప వచ్చు.

ఈ ఉపనిషత్తులో ప్రతి అధ్యాయం ఒక్కొక్క ప్రశ్నతో మొదలవుతుంది

మొదటి ప్రశ్న – సృష్టింపబడిన ప్రాణుల మూలకారణం గురించి.

రెండవ ప్రశ్న మానవ ప్రకృతిని గురించి.

మూడవ ప్రశ్న ప్రాణ స్వభావాన్ని గురించి.

నాల్గవది మానవ ప్రకృతిలోని మానసిక స్థితి ని గురించి,

ఐదవ ప్రశ్న ప్రణవాన్ని గురించి,

ఆరవది మానవునిలోని పారమార్ధిక తత్వాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు.

పిప్పలాద మహర్షి ఈ ప్రశ్నల కందించిన జవాబులు కూడా అత్యద్భుతాలు.

ఉదాహరణలతో కధలతో పాఠకులకు సులభంగా అర్ధమవుతాయి.

తైత్తరీయోపనిషత్తు లాగా ప్రశ్నోపనిషత్తు కూడా జీవితంలోని స్థూల తత్వాల నుండి సూక్ష్మ తత్వాలకు తీసుకొని పోతుంది.

ఒకదాని తర్వాత ఒకటిగా ఆత్మ నావరించి ఉన్న జడపదార్దముల ముసుగులను అన్నింటినీ తెలియ జేస్తుంది.

అంతే గాక పదార్దం (matter) శక్తి (energy) నుండి సృష్ఠి ఉద్భవించిందని స్పష్ఠమైన ఉద్ఘాటన ఈ ఉపనిషత్తులో మాత్రమే చూస్తాము.

ఇక్కడ ఆ పిప్పలాద మహర్షి యొక్క జన్మ వృత్తాంతం, ఆయనయొక్క గొప్పతనాన్ని తెలుసుకొందాము.

సుకన్య, చ్యవనమహర్షిల కుమారుడు దధీచి. దానవుల సంహారం కోసం దేవతలు దధీచి మహర్షిని తన వెన్నెముకను దానం చేయ వలసిందిగా ప్రార్ధిస్తారు.

దానికి సంసిద్ధుడై తన భార్య యైన సువర్చ తో తాను లోక కళ్యాణార్ధం ప్రాణత్యాగం చేయబో తున్నట్లు చెప్పి ధ్యాన స్థితి లో శరీరాన్ని వదలి వెళ్ళిపోయాడు.

దధీచి భార్య అప్పటికే గర్భవతి. ఆమె దుఃఖం ఆపుకోలేక ఒక పిప్పల వృక్షం క్రింద కూర్చొని తన గర్భాన్ని చీల్చుకొంది. మహా తేజస్వి అయిన పుత్రుడు బయటకు వచ్చాడు. ఆ బాలుడిని పిప్పల వృక్షానికే అప్పజెప్పి ఆమె తన భర్తతో సహగమనం చేసింది.

ఆ పిప్పల వృక్షం చంద్రుడి లోని అమృతాన్ని తెచ్చి పాలలో కలిపి శిశువునకు ఇచ్చి ఆకలి దప్పులు లేకుండా పెంచింది.

అలా పిప్పల వృక్షం కింద పుట్టి ఆ వృక్షం చేత రక్షింపబడి పెరిగినవాడవడం వల్ల అతను పిప్పలాదుడయ్యాడు.

తరువాత పిప్పలాదుడు తన తండ్రి మరణ వృత్తాంతం విని దేవతల మీద ఆగ్రహంతో ఘోర తపస్సు చేసి దేవతలను వధించడానికి ఉద్యుక్తుడౌతాడు. కాని పరమేశ్వరుడు వారించి శాంతింప చేస్తాడు. తర్వాత పిప్పలాదుడు తన దివ్యశక్తి తో ఉత్తమ లోకాలలో ఉన్న తన తల్లి దండ్రులను దర్శించుకొని వారి ఉపదేశాను సారం మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చి బ్రహ్మజ్ఞాని అవుతాడు.

పిప్పలాదుడు అనవన్య మహారాజు పుత్రిక పద్మను వివాహమాడాడు. ఆమె మహా పతివ్రత. ఆమె పాతివ్రత్యానికి సంతోషించి యమధర్మరాజు ” నీ పతి ఐశ్వర్యవంతుడు, ఆయుష్మంతుడు అవుతాడని” వరం ప్రసాదించాడు. వాళ్ళిద్దరికీ స్ఫురద్రూపులైన పదిమంది పుత్రులు కలిగారు.

ప్రశ్నోపనిషత్తుతో పాటు గర్భోపనిషత్తు పరబ్రహ్మోపనిషత్తు అనే మరో రెండు ఉపనిషత్తులకు కూడా ద్రష్ఠ ఈ పిప్పలాదుడే.

44. ఉపనిషత్తులు – ప్రశ్నోపనిషత్తు (Continuation)

అంతటి మహోన్నతుడైన పిప్పలాదుడు తన దగ్గరకు వచ్చిన ఆ ఆరుగురు మహర్షుల తో ఎంతో ప్రేమతో అంటాడు’ మీరు ఒక సంవత్సరంపాటు బ్రహ్మ చర్యంపాటిస్తూ శ్రద్ధగా తపస్సు చేస్తూ గురు శుశ్రూష చేస్తూ ఇక్కడే ఉండండి.

ఆ తర్వాత మీరు ఎన్ని ప్రశ్నలైనా అడగొచ్చు. దానికి నాకు తెల్సినంత మేరకు సమాధానమిస్తూ మీకు బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తాను.’ అన్నాడు.

శ్రద్ధావంతులై బ్రహ్మచర్యం తో తపస్సు చేస్తే ఒక సంవత్సర కాలంలో వారికి బుద్ధిలో అనేక సంశయాలకు పరిహారం లభిస్తుంది. జ్ఞాన వికాసానికి శ్రీ కారం చుట్టినట్లవుతుంది. అపుడు తాను తపస్సు ద్వారా పొందిన జ్ఞానాన్ని వివరించి చెబితే వారు దానిని నమ్మడం సాధ్యమౌతుంది.

అలా కాకుండా తమ స్థూల ప్రకృతి దోష పూరితమైన వేళ, జ్ఞాన వివరణలను శబ్దాల ద్వారా చెబితే అన్ని వికారాలు ఆమాటలలో చేరిపోయి ఆ మాటలు నమ్మ శక్యంగా ఉండవు. మన శరీరాలలో ఉండే స్థూల ప్రకృతి దోషాల నివారణకై ఒక ఏడాదిపాటు శ్రద్ధతో బ్రహ్మచర్యం లో ఉండి తపించడం అవసరము.

శ్రీ యోగి అచ్యుతులు అంటూ ఉండేవారుట- ఏకాలం లోనైనా తపస్సుకు సంబంధించిన అనుభవాలు, జ్ఞానం ఒకేరకంగా ఉంటాయి. వాటిని అర్ధం చేసుకోవాలంటే తపస్సే సాధనం కావాలి అని.

ప్రశ్నోపనిషత్తు లోని ముఖ్య విశేషాలు ఏమిటంటే

1. ఆత్మ నుండి ప్రాణ చైతన్యం వచ్చింది. అది వాయువును సృష్టించింది. ఆ వాయువే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులనే పేర్లతోమన శరీరంలో వివిధ భాగాల్లో ఉందని తెలుస్తుంది.

2. స్వప్న స్థితి లో మనస్సే సర్వాన్ని చూసే దేవత అని అర్ధం అవుతుంది.

3. మన దేహం లోని దేవతలందరిలో ప్రాణుడే శ్రేష్ఠుడనే అంశాన్ని సోదాహరణంగా వివరించ బడింది.

4. పదహారు కళలతో కూడిన పురుషుడు మన దేహంలో ఉండే పురుషుడే అని చెబుతాడు.

5. ప్రజాపతి సృష్టి కి మూలమైన జడ, చైతన్యాలను సృష్టించాడనటం ఒక ముఖ్యాంశం.

6. అన్నింటికన్నా విలువైన ముఖ్యమైన ఆత్యంతిక సత్యం గురించి మహర్షి పిప్పలాదుడు శైబ్యసత్యకామునితో వివరిస్తూ ‘చనిపోయే దాకా ప్రణవోపాసన చేయడం వల్ల మనిషి ఏ ఏ లోకాలను జయించగలడో’ చెబుతాడు.

ఇదేవిధంగా ఈ ఉపనిషత్తులో కేవలం సత్యం( దైవం) గురించి, ప్రజాపతి ద్వారా సాగిన సృష్టి, మన దేహం మరియు బాహ్య జగత్తుకు మూలాధారమైన శక్తులు, వస్తువుల గురించి, దేవుణ్ణి దర్శించి అమృతత్వం(ముక్తి) పొందేందుకు సాధనమైన ప్రణవోపాసన గురించి విపులంగా బోధించడం జరిగింది. అందువల్ల ఈ ఉపనిషత్తు చాలా ముఖ్యమైనది.

వచ్వే భాగంలో కత్యాయనుని కొడుకైన కబంధుడు వేసిన ప్రశ్న ” భగవాన్! ఈ ప్రజలంతా ఎక్కడనుంచి పుడతారు? అనేదానికి పిప్పలాదుడిచ్చిన సమాధానం చూద్దాం

45. ఉపనిషత్తులు – ప్రశ్నోపనిషత్తు (Continuation)

అథ కబన్దీ కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ!
భగవన్ కుతో హ వా ఇమాః ప్రజాః ప్రజాయ న్త ఇతి.

గురువు చెప్పిన రీతిలో ఒక సంవత్సరం తపస్సు ముగించిన తరువాత, కత్యుడి కుమారుడైన కబంధి పిప్పలాదుడి దగ్గరకు వెళ్ళి మొదటి ప్రశ్నగా

” హే భగవన్! ఈ మానవాళి అంతా ఎక్కడ నుంచి పుడుతున్నారు? ” అని అడిగాడు.
అంటే ఈ ప్రాణికోటి ఎక్కడనుంచి వచ్చింది అనేదే ప్రశ్న.

అంటే ఈ సృష్టి ఎలా జరిగింది? ఆలోచనా పరుడైన ఏ మానవునికైనా కలిగే సందేహమే ఇది.

అయితే నిర్గుణ పరబ్రహ్మాన్ని అన్వేషిస్తూ ఆ క్రమం లో వచ్చిన సందేహాల నివృత్తి కోసం వచ్చిన ముముక్షువు సృష్టి క్రమం గురించి ఎందుకు ప్రశ్నించి ఉంటాడు?

ఐహిక సుఖాలు, కామ్య కర్మల నుంచి వచ్చే స్వర్గాదిసుఖాలు (ఇహపరాలు) రెండూ బ్రహ్మ జ్ఞానానికి ఆటంకాలే అని నిర్ణయించు కొనేటందుకు ఐహికమైన సృష్టి క్రమం గురించి అడిగిన ప్రశ్న ఇది.

కబంధి యొక్క ప్రశ్నకు పిప్పలాదుడిలా సమాధానమిచ్చాడు.

తస్మై న హో వాచ, ప్రజాకామో వై ప్రజాపతిః
స తపో తప్యత, స తప స్తప్త్యా స మిధున
ముత్వాదయతే, రయిం చ ప్రాణం చేత్యేతౌ
యే బహుధా ప్రజాః కరిష్యత ఇతి!!

ఓ కబంధీ! సకల ప్రాణులను సృష్టించాలని భావించిన ప్రజాపతి (సృష్టికర్త) అందుకోసం తీవ్రంగా తపస్సు చేసాడు.

సృష్టికి కావలసినవి చంద్రరూపమైన (రయి)ద్రవ్యం మరియు సూర్య రూపమైన ప్రాణం కావాలని తపః ప్రభావం వల్ల స్ఫురించాయి.

తరువాత ఆకాశాన్ని ప్రాణాన్ని సృష్టించాడు. అంటే జడ చైతన్యాలను సృష్టించాడు.

తాను సృష్టించిన ఈ రెండూ ఒకదానితో ఇంకొకటి కలసి ఎన్నో రకాల జీవులు సృష్టింపబడతాయని భావించాడు.

లీ ఆదిత్యో హ వై ఫ్రాణో రయిరేవ
చన్ద్రమాః రయిర్వా ఏత! త్సర్వం
యన్మూర్తం చామూర్తం చ
తస్మా న్మూర్తి రేవ రయిః!”

సూర్యుడు ప్రాణశక్తి అయితే చంద్రుడే రయి(రయి అంటే ఆకారమున్న వస్తువు). జడ పదార్ధం. అలాగే స్థూలమైన వస్తువులు, సూక్ష్మమైన వస్తువులు, ఇలా లోకంలో ఉన్న సమస్తం జడ పదార్ధాలే. వస్తువు అంటేనే జడపదార్ధమన్నమాట.

మూర్తామూర్తములతో కూడుకొన్నదే జగత్తంతా. మూర్తములు ఆకారము కలవి (పృథివి, అగ్ని, జలం మొ..) అమూర్తములంటే నిరాకారమైనవి, వాయువు, ఆకాశం మొ..) సూక్ష్మమైనవి.

సూర్య కిరణాల స్పర్శతో కర్మప్రేరణ, చంద్ర కిరణాల స్పర్శతో నిద్రకు ప్రేరణ లభిస్తాయనేది మన అనుభవం.

ఆదిత్యుడే ప్రాణం. ఆదిత్యుడే ఈ విశ్వ రూపుడైన వైశ్వానరుడు. ఒక అగ్ని గోళంలా ఉదయిస్తాడు.

ఇదేవిషయాన్ని ఋగ్వేదంలో ఉదయించే సూర్యుని “చిత్రం దేవానాముదగాదనీకం….” అనేమంత్రంలో ఎంతో అందంగా వర్ణించారు.

ఉదయించే సూర్య కిరణాలలో రక్త శ్వేతాది సప్త వర్ణాలు నిగూఢంగా ఉండి దీప్తిమంతాలై లోకాలను ప్రకాశింపజేసే కిరణ సముదాయం మహాసైన్యంలా ఒక్కసారిగా చిత్రం గా ఉదయించింది అని.

ప్రాణుడే అగ్ని. ప్రజల ప్రాణం సూర్యుడే. సూర్యుడే శక్తి. సూర్య మండలం నుండే అన్ని గ్రహాల్లోని చరాచర ప్రాణికోటికి శక్తి ప్రసరింప బడుతుంది అనే సత్యాన్ని విజ్ఞానులు తెలుసుకొన్నారు. జీవు లందరకీ ప్రాణమైన ఈ సూర్యుడు నిత్యం ఉదయిస్తున్నాడు.

సూర్యుడు అయిదు పాదాలతో వుంటాడు. ఆ పితృదేవుడు (సూర్యుడు) పన్నెండు రూపాలను ధరిస్తాడు. ఏడు చక్రాలు, ఆరు ఆకులతో ఉన్న రధంలో సంచరిస్తాడని కొందరు చెబుతారు. ఆయనే పైనుంచి వర్షాన్ని కురిపిస్తాడని చెబుతారు. ఆ సూర్య భగవానుడే సర్వజ్ఞుడు.

సూర్య చంద్రులను సృష్టించిన ప్రజాపతి కాల స్వరూపుడే కదా! ఈ కింది మంత్రాలలో ఉత్తరాయణ దక్షిణాయనములు సంవత్సరములోను, శుక్ల కృష్ణ పక్షములు మాసములోను, అహోరాత్రములు దినములోను ఏరీతిగా సృష్టికి, మోక్షానికి ఉపయుక్తములో తెలియ చెప్పారు.

సంవత్సరోవై ప్రజాపతిః- ఈ సృష్ఠికర్త, ప్రజాపతి, కాలంలోని భాగమైన సంవత్సర మవుతూంటే, ఆయనకు దక్షిణాయనము (జడము), ఉత్తరాయణము (ప్రాణము) అని రెండు మార్గాలున్నాయి.

సంతానాన్ని కోరుకొనే ఋషులు యాగాలు, సత్కర్మలు, గొప్పవైన కార్యాలు చేసి దక్షిణాయన మార్గాన చంద్రలోకానికి వెడుతున్నారు. వీరు జనన మరణ చక్రానికి బద్ధులై ఉంటారు.

ఆత్మను తెలుసు కోవాలను కొనేవారు తపస్సు, బ్రహ్మచర్యం, నియమనిష్ఠలతో కూడిన జీవితం, ధ్యానం, తపస్సు మొదలగునవి ఆచరించి తద్వారా ఉత్తరాయణ మార్గంలో ప్రవేశించి సూర్యలోకాన్ని చేరుకొంటారు. ఈ మార్గంలో వెళ్ళిన వారు అమరులౌతారు.

మాసోవై ప్రజాపతిః- సంవత్సరంలో ఒక భాగమైన మాసం ఆ ప్రజాపతి (సృష్ఠికర్త) స్వరూపం. మాసంలో రెండు పక్షాలుంటాయి. కృష్ణపక్షం (రయి, జడపదార్ధం) శుక్లపక్షం (ప్రాణం, చైతన్యం). ఋషులుతమ యజ్ఞ యాగాదులను, జపతపాదులను ప్రాణ స్వరూపమైన శుక్ల పక్షంలోనే చేస్తారు.

అహోరాత్రోవై ప్రజాపతిః – రోజులో భాగమైన రాత్రి పగలు కూడా ప్రజాపతి స్వరూపమే. పగలు అంటే సూర్యుని వెలుగు ఉండే వేళ కర్మ కోసం, రాత్రి అంతర్ముఖత్వం(తపస్సు) కోసం అనేది సృష్ఠి నియమమని శ్రీ యోగి అచ్యుతుల బోధన.

ఈ ఉపనిషత్తు నియమబద్ధమైన గృహస్త జీవితానికే ప్రాధాన్యత నిచ్చింది. ఎవరైతే ప్రాణ స్వరూపమైన పగటిపూట స్త్రీ సంభోగాన్ని జరుపుతారో వారు ప్రాణాన్ని నష్టపరచుకొంటారు. రాత్రి సమయంలో స్త్రీ సంగమం బ్రహ్మ చర్యంతో సమానమని స్పష్ఠ పరచింది.

అన్నం వై ప్రజాపతిః- రాత్రి పగలే కాదు అన్నం కూడా ప్రజాపతి రూపమే. ఆహారం గా ఉండే అన్నం నుంచే రేతస్సు(వీర్యం) రూపొందుతుంది.

ఆ రేతస్సు నుండే సకల జీవులు ఉద్భవిస్తాయి.

ఈ విధంగా ప్రజాపతి రూపొందించిన వ్రతాన్ని ఎవరు నియమంగా పాటిస్తారో అలాంటివారే మిథునం ద్వారా జంటని రూపొందిస్తారు.

ఎవరిలో బ్రహ్మచర్యం, తపస్సు, సత్యనిష్ఠ, ప్రతిష్టింపబడి ఉంటాయో అతనికి మాత్రమే బ్రహ్మలోక ప్రాప్తి అనగా స్వర్గం ప్రాప్తిస్తుంది.

కాని వంచన, మోసం, అసత్యం లాంటి దుర్గుణాలు ఉన్నవారికి సాధ్యంకాదు.

వచ్చే భాగంలో విదర్భ రాజ్యానికి చెందిన భార్గవుని ప్రశ్నకు

” భగవన్! ఎంతమంది దేవతలు ప్రజలకు ఆధారంగా ఉన్నారు? ఏ దేవత ఈ శరీరాన్ని ప్రకటింప జేస్తున్నాడు? ఆ దేవతలలో వరిష్ఢులెవరు? ”

పిప్పలాదుని జవాబు తెలుసుకొందాం

46. ఉపనిషత్తులు – ప్రశ్నోపనిషత్తు (Continuation)

రెండవ ప్రశ్న:

అథ హైనం భార్గవో వైదర్భిః పప్రచ్ఛ
భగవన్ కత్యేవ దేవాఃప్రజాం
విధారయన్తే కతర ఏత త్ప్రకాశయన్తే
కః పునరేషాం వరిష్ఠ ఇతి!!

” భగవన్! ఎంతమంది దేవతలు ప్రజలకు ఆధారంగా ఉన్నారు? ఏ దేవత ఈ శరీరాన్ని ప్రకటింప జేస్తున్నాడు? ఆ దేవతలలో వరిష్ఢులెవరు?

ఓ భార్గవా! ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, మాట, మనస్సు, చూపు, వినే స్వభావం అనేవే మానవుణ్ణి భరించే (నడిపించే) దేవతలు.

ఒకసారి ఆ దైవ శక్తులన్నీ( దశేంద్రియాలు) తామే ఈ మానవ శరీరాన్ని ధరించి భరిస్తున్నాం అని చెప్పాయి.

అది విన్న ప్రాణ శక్తి ఆ ధైవశక్తులతో ” మీరు శరీరాన్ని నడిపిస్తున్నామనే భ్రమలో పడకండి. నేను నన్ను ఐదు భాగాలుగా ( ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన) విభాగించుకొని, ఈ శరీరాన్ని సమైక్యం చేసి నడిపిస్తున్నా. అని చెబితే ఆ మాటల్ని దైవీ శక్తులు విశ్వసించలేదు.

అప్పుడు ప్రాణశక్తి తన ఉనికిని చాటి చెప్పడానికని ఒక్కసారి ఈ శరీరం లోనుంచి నిష్క్రమిస్తున్నట్టుగా నటించింది. ప్రాణ శక్తి వెళ్ళిపోవడంతో మిగిలిన ఇంద్రియాలన్నీ చలనరహిత మైపోయాయి.

తిరిగి ప్రాణ శక్తి స్థిరంగా నిల్చోగానే ఆ దైవశక్తులన్నీ (ఇంద్రియాలు) పనిచేయడం ప్రారంభించాయి.

తేనెటీగల రాణి వెళ్ళిపోతే ఆ తేనెపట్టు నుండి మిగిలిన తేనెటీగలన్నీ ఎలా దాని వెంట వెళ్ఖిపోతాయో అలాగే జరిగిందీ సంఘటన.

ప్రాణశక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించిన ఇంద్రియాలన్నీఎంతో సంతోషంతో ప్రాణాన్ని ఘనంగా స్తుతించాయి.

ఓ భార్గవా! ప్రాణమే అగ్నిలా దహిస్తాడు. సూర్యుడిలా ప్రకాశిస్తాడు. మేఘంలా వర్షిస్తాడు.

అంతేకాదు. ఇంద్రుడు, వాయువు, భూమి, ఇతర జడపదార్దాలు వంటి అన్నిటిలో విరాజిల్లేది ప్రాణమే.

ఆ ప్రాణశక్తే స్థూల పదార్ధం గా, సూక్ష్మ పదార్ధం గా అమృతంగా వర్థిల్లుతోంది.

అరా ఇవ రధనాభౌ ప్రాణే సర్వం ప్రతిష్ఠితమ్

రథనాభికి జోడింపబడిన దంతాల్లా వీళ్ళు ప్రాణాన్నే ఆశ్రయించి ఉంటారు.

ఆ దేవతలు ప్రాణునితో – నీవు ప్రజాపతివి. గర్భంలో నీవే సంచరిస్తూ ఉంటావు.

పంచ ప్రాణ సహితుడవైన ప్రాణమే నీవు. దేవతల్లో శ్రేష్ఠుడైన అగ్నివి. పితృదేవతల ప్రధమ ఆహుతి నీవే.

నీవు తేజస్సులో ఇంద్రుడివి. రక్షించే రుద్రుడివి. ప్రకాశించే సూర్యుడివి. అంతా నీవే.

వర్షం కలిగించే వాడివి నీవే. నీవు ఒక్కడివే ఋషివి.( ఋతంలో ఉండేవాడివి. ధారణాశక్తి కల్గిన వాడివి).

నీవే విశ్వస్య సత్పతివి. (ఈ విశ్వంలో ఉన్న సమస్తానికీ నీవే అధినేతవి.)

జగత్తుకు ఈశ్వరుడు. పితాత్వం మాతరిశ్వః నీవు గాలికి తండ్రివి.

వాక్కు, చెవులు, కళ్ళు, మనస్సులలో వ్యాప్తమైన నీ అంశను సదా మంగళకరంగా మార్చుకో. బయటకు వెళ్ళేట్లా చేయొద్దు.

స్వర్గంలో ప్రతిష్టితమైన ఈ ప్రాణం వశంలోనే అంతా ఉంది.

మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీ శ్చ ప్రజ్ఞాం విదేహిన ఇతి.

ఓ ప్రాణమా! ఒక తల్లి తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో నీవు కూడా అలాగే మమ్మల్ని రక్షించు. మాకు సంపదను జ్ఞానాన్ని ప్రసాదించు.

ఈ విధంగా ప్రాణాన్ని శ్లాఘించిన ఇంద్రియాలకు ప్రజాపతే ముఖ్య ప్రాణమని, విరాట్ పురుషుడని
జ్ఞానోదయం అయ్యింది.

జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః అని ప్రాణుడిని శ్లాఘించారు.

ఈ విశ్వంలో నీవే జ్యేష్టుడువి. ముందుగా ఉన్నవాడివి. సృష్టి కి మూలకారకుడవు.
( శ్రీ యోగి అచ్యుతులు ప్రాణునికి జ్యేష్టత్వాన్ని ఆపాదించవచ్చుకాని శ్రేష్ఠత్వం మాత్రం ఆత్మ కే అంటారు. ఎందుకంటే ప్రాణంలో క్రియాశక్తి మాత్రమే ఉంది జ్ఞానము లేదు అంటారు)

ప్రాణమే ఈ శరీరాన్ని నడిపిస్తుందని, ప్రాణమే అందరికన్నా ఉత్కృష్టమైన దైవమని వివరంగా పిప్పలాదుడు రెండవ ప్రశ్నకు సమాధానం చెప్పాడు.

వచ్చే భాగంలో ఈ ప్రాణం ఎక్కడ పుడుతుంది? ఈ దేహంలో ఎలా ప్రవేశిస్తుంది? మొదలైన ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకొందాం.

47. ఉపనిషత్తులు – ప్రశ్నోపనిషత్తు (Continuation)

మూడవ ప్రశ్న:

ప్రాణంయొక్క మూల సూత్రాల గురించి తెలియపరుస్తున్న ఈ భాగాన్ని కొంచెం
సావకాశంగా చదివి అర్ధం చేసుకోండి.

అశ్వలాయనుని కొడుకు కౌసల్యుని ప్రశ్న:

ఈ ప్రాణం ఎక్కడనుంచి వచ్చింది (పుడుతుంది)? ఈ దేహంలో ఎలా ప్రవేశిస్తుంది?
తనను విభజించుకొని దేహంలో ఎలా ఉంటుంది? ఎందుకీ దేహాన్ని వదలి వెడుతుంది?
బయటి వస్తువులను, అంతరంగంలోని ప్రపంచాన్ని ఎలా భరిస్తోంది?

కబంధుడు సృష్టి యొక్క క్రమం గురించి ప్రశ్నించాడు.

వైదర్భి శరీరానికి ఆధారమైన ప్రాణ శక్తి గురించి తెలుసుకొన్నాడు.

ఇప్పుడు కౌసల్యుడు ఆ మంగళకరమైన ప్రాణం పుట్టుక గురించి కుత ఏష ప్రాణో జాయతే? అంటూ తన సందేహాలనన్నిటినీ పిప్పలాదుని ముందు ఉంచాడు.

ఓ కౌసల్యుడా! చాలా కఠినమైన ప్రశ్నలనే అడిగావు. అయితే నీవు భగవంతుడి గురించి తెకుసుకోవాలన్న అభిలాష ఎక్కువగా కలవాడివి కనుక శ్రద్ధగా విను.

ఆత్మన ఏష ప్రాణో జాయతే,
యథైషా పురుషే ఛాయా
ఏతస్మి న్నే తదాతతం
మనో కృతేనా యాత్యస్మిన్ శరీరే!!

ఎంత చక్కగా ఒకే మంత్రంలో ప్రాణం యొక్క పుట్టుక, అది శరీర ధారణ చేసే విధానం అలవోకగా అతిసామాన్యమైన పదాలతో వివరించాడు.

ఆత్మన ఏష ప్రాణో జాయతే- ఆత్మ నుంచి ప్రాణం అనేది పుడుతుంది.
ప్రాణం ఏవిధంగా ఉంటుందిట?

యథైషా పురుషే ఛాయా ఏతస్మిన్నే తదాతతం-
మనిషికి అతని నీడ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఆత్మను వెన్నంటి ప్రాణం నీడలా ఆత్మ కనుసన్నలలో మెలుగుతూ ఉంటుంది.

మరి ఈ శరీరంలోకి ఎలా వస్తూంది?

మనోకృతేనా యాత్యస్మిన్ శరీరే- మనస్సు చేసే చేష్టల వల్ల అంటే మనస్సు ఎల్లప్పుడూ కనే కలలు ఊహలు కోరికలకు (చేసే కర్మలకు) అనుగుణంగా వచ్చే జన్మలో శరీరాన్ని ఎంచుకొని ప్రవేశిస్తుంది అని చెబుతున్నాడు.

మన కోరికలు, మన జ్ఞానం, అజ్ఞానం, మంచి లేదా చెడు ఆలోచనలు, ఇవన్నీ మనస్సుకు చెందినవి. వీటన్నిటి సంఘటిత స్వరూపమే మనోప్రవృత్తి. మనస్సు యొక్క ప్రవృత్తికి అనుగుణమైన శరీరంలోకి ప్రాణం ప్రవేశిస్తుంది.

ఇంక శరీరంలో తన్ను తాను విభాగించుకుని ఎలావుంటోంది?

యథా సమ్రాడేవాధికృతాన్ వినియుంక్తే….

ఏ విధంగా నైతే ఒక సమ్రాట్ అధికారుల్ని నియమించి, ఈ ఈ ప్రాంతాలను మీరు పాలించండి అని చెబుతాడో అదే విధంగా ప్రాణ శక్తి పంచ ప్రాణాలను ఆయా భాగాల్ని పాలించమని విడివిడిగా నియమిస్తుంది.

ముందుగా ప్రాణ అపాన, వ్యాన ఉదాన సమాన అని పంచ ప్రాణాలుగా విభజించింది.

ఈ క్రింది మంత్రాలు మరింత ముఖ్యమైనవి.
పంచ ప్రాణాలు ఎక్కడెక్కడ ఏ యే పనులలో నియమింపబడ్డాయో చెప్పబడింది.

పాయూపస్థే పానం చక్షుఃశ్రోత్రే ముఖ నాసికాభ్యాం ప్రాణః
స్వయం ప్రాతిష్ఠతే మధ్యే తు సమానః ఏష హ్యేత ద్ధుత
మన్నం సమం నయతి తస్మాదేతాః సప్తార్చిషో భవన్తి!

మొదట విసర్జన, జననేంద్రియాలలో అపానాన్ని నియమించింది.

అంటే అపానం మల మూత్ర విసర్జన క్రియ నిర్వహిస్తుంది.

తరువాత కన్ను, చెవి, ముక్కు, నోరు అనే ఇంద్రియాలలో ప్రాణం స్వయం తనే నివసిస్తుంది.

ప్రాణం ముఖమండలంలోనే ఉంటుంది.

శరీర మధ్య భాగంలో అంటే నాభి స్థానం లో సమానప్రాణాన్ని నియమిస్తుంది. శరీరం స్వీకరించే ఆహార సారాన్ని ఆ సమానప్రాణమే శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా తీసుకొని వెళుతుంది.

ఉదరం లో చేరే ఆహారాన్ని జఠరాగ్ని సహాయం తో జీర్ణ క్రియ నిర్వహణను సమానం పర్యవేక్షిస్తుంది. (అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః….)

ఇంక వ్యానమనే ప్రాణ శక్తి నియామకాని గురించి:

తస్మాదేతాః సప్తార్చిషో భవన్తి!-

ప్రాణ శక్తి నుంచి ఏడు రకాల జ్వాలలు ఏర్పడు తున్నాయి.

హృదిహ్యేష ఆత్మా, అత్రైత దేక శతం నాడీనాం తాసాం శతం
శత మేకైకస్యాం ద్వాసప్తతిః ప్రతి శాఖానాడీ
సహస్రాణి భవన్త్యాసు వ్యానశ్చరతి –

ఆత్మ అనేది శరీరంలోని హృదయం లో కొలువై ఉంటుంది. ఆ హృదయం నుంచి101 నాడులు బయలుదేరుతాయి. వాటిలో ఒక్కొక్క నాడికి అదనంగా వందేసి ఉప నాడులున్నాయి. ఆ ఉప నాడులలో ఒక్కొక్క దానికి డెబ్బైరెండు వేల ఉప శాఖా నాడులున్నాయి. ఈ అన్ని నాడులలోను వ్యానం అనే ప్రాణ శక్తి సంచరిస్తూ ఉంటుంది.

ప్రాణుని ఐదవ భాగమైన ఉదానం తదితర విషయాలు వచ్చే భాగంలో చూద్దాం.

చదువరులందరకూ హేవిళంబ ఉగాది శుభాకాంక్షలతో ఉదయ భాస్కర్ దువ్వూరి.

ఇప్పుడు ఉదానం:

అథైక యోర్థ్వ ఉదానః
పుణ్యేన పుణ్య లోకం నయతి
పాపేన పాప ముభాభ్యా
మేవ మనుష్య లోకమ్!!

పైన చెప్పిన 101 నాడులలో పైకి వెళ్ళే ఒక నాడి ద్వారా ఉదానం అనే ప్రాణ శక్తి మానవుణ్ణి పైకి తీసుకొని పోతుంది. పుణ్యం చేసిన వాడిని పుణ్య లోకాలకు, పాపం చేసిన వాడిని నరక లోకానికి, పాపం పుణ్యం రెండూ ఉన్న వాళ్ళను తిరిగి మానవ లోకానికి తీసుకొని వెళ్ళేది ఈ ఉదానమే.

తేజో హవా ఉదాన స్తస్మా దుపశాన్త తేజాః –

దేహ గతమైన తేజస్సు (అగ్ని) ఉదాన ప్రాణానికి తోడుగా ఉంటుంది. ఎవరిలో ఐతే అగ్ని అనే ప్రాణ శక్తి హరించుకు పోతుందో, ఆ మనిషిలో ఉన్న ఇంద్రియాలు అతని మనస్సు లో లీనమై పోతాయి. వీటితో ఉదానం తిరిగి మరోజన్మకు తీసుకు పోవడానికి ప్రయత్నం మొదలవుతుంది.

యచ్ఛిత్థ స్తేనైష ప్రాణమాయాతి ప్రాణస్తేజసా యుక్తః
సహాత్మనా యథా సజ్కల్పితం లోకం నయతి!!

మానవుడు తాను మరణించే సమయంలో ఏ విధమైన సంకల్పం చేస్తున్నాడో ఆ సంకల్పానుసారంగా ముఖ్య ప్రాణవృత్తిని పొందుతాడు.

ఆప్రాణం ఉదానం(తేజస్సే అయినది) అనే ప్రాణ శక్తి సహకారంతో ఆ జీవుణ్ణి అయనను కోరుకొన్న లోకాలకు తీసుకొని వెడుతుంది.

ఇప్పుడు శరీరం కాకుండా విశ్వానికి పంచప్రాణాలను అన్వయిద్దాం:

ఆదిత్యో హవై బాహ్యః ప్రాణ ఉదయత్యేష హేనం చాక్షుషం, ప్రాణమనుగృహ్ణానః” పృథివ్యాం యా దేవతా సైషా పురుషస్యాపానమౌష్టభ్యాన్తరా యదాకాశః స సమానో వాయుర్వ్యానః!!

ఆదిత్యోహవై బాహ్యః ప్రాణ- సూర్యుడే బయటి ప్రాణం (బయట ఉండే బాహ్య ప్రాణశక్తి కేంద్రం).
బయటి వస్తువులన్నిటినీ ధారణ చేస్తాడు ఆదిత్యుడు. జీవుల కళ్ళల్లో ప్రాణంగా నెలకొంటాడు.

పృథ్విలో అధిష్ఠాన మైనది అపానం.

మధ్యలో ( బయట అంతరిక్షం లో-భూ లోకానికి, స్వర్గ లోకానికి మధ్య ఉన్న ఆకాశమే) ఉండేది సమానం.

అలాగే సర్వత్ర వ్యాపించి అన్ని చోట్ల సంచరించేది వ్యానం.

చివరిది అయిదవది అయిన ఉదానం బాహ్య ప్రపంచం లోనున్న అగ్ని లేక తేజస్సుకు అంతరంగిక రూపం.

ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ(ఉపనిషద్ రత్నావళి నుంచి):

ప్రాణం అంటే అధిదైవికం. బయట తత్వాలకి వేరుకాదు. సూర్యుడు ఉదయించి లోకాన్ని ఎలా వెలిగిస్తున్నాడో, అలాగే ఆ సౌరశక్తి అనుగ్రహంతోనే మన చక్షురింద్రియం కూడా మనకి లోకాన్ని దర్శింప జేస్తూంది.

ఇంక అపానం భూమ్యాకర్షణశక్తికి అధ్యాత్మిక రూపం. భూమ్యాకర్షణశక్తితోనే మానవుడు పడిపోకుండా నిలబడగలుగు తున్నాడు. అలా అపానం శరీరానికి నిలకడ ప్రసాదిస్తూంది.

ఆకాశానికి భూమికి మధ్య వాయువు ఉంది. ముఖ్య ప్రాణం, అపాన వాయువుల మధ్య, నాభి ప్రదేశంలో ఉన్న సమానం ఈ భూమ్యాకాశాల మధ్య గల మహావాయువు సూక్ష్మ రూపం.

భూమ్యాకాశాలకి అనేది తీసేస్తే మిగిలేది బాహ్యంగా ఉండే సామాన్య వాయువే వ్యానం.

తేజస్సుకు ప్రతి రూపమైన ఉదానం శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

ఎప్పుడైతే ఉదానం ఈ క్రియ నిర్వహించలేదో అప్పుడు శరీరంలోని వ్యాపారాలన్నీ క్రమంగా సన్నగిల్లుతాయి. మాట పెగలదు.

జ్ఞానేంద్రియాలు తమ తమ వ్యాపారాలు క్షీణించగా మనస్సుతో కలిసిపోతాయి. మనస్సుతోసహ ఉదానం ప్రాణంలో కలిసి ఆత్మతో అతను సంకల్పించిన లోకాలకు పయనమౌతుంది.

శరీరం పూర్తిగా చల్లబడి పోతుంది. అదే మరణం. అప్పుడు జీవాత్మ మరో జన్మ నెత్తుతుంది.
( ఇదే చివరి రెండు ప్రశ్నలకు సమాధానం).

కౌసల్యుడా! ఈ విధంగా ప్రాణ శక్తి గురించి చక్కగా తెల్సుకొన్నవాడి సంతానం పరంపర గా వర్ధిల్లుతూనే ఉంటుంది. ఎప్పటికి నశించదు.

ఎవరైతే ప్రాణం ఉత్పత్తిని, దాని రాకని, అది శరీరంలో ప్రధానంగా నెలకొల్పే స్థానాలని, చేసే ఐదు రకాల కార్యకలాపాలను, దాని స్థూల అభివ్యక్తీకరణను స్పష్ఠంగా తెలుసుకొంటాడో వాడు అమరత్వాన్ని పొందుతాడు.

కొంచెం సావధానంగా చదివి అర్ధం చేసుకోమని నామనవి.

48. ఉపనిషత్తులు – ప్రశ్నోపనిషత్తు (Continuation)

నాల్గవ ప్రశ్న:

సూర్యుని మనుమడైన గార్గ్యుడు పిప్పలాదుణ్ణి తన సందేహాలతో సమీపించి ఈ విధంగా ప్రశ్నించాడు.

తస్మిన్ పురుషే కాని స్వపన్తి, కాన్యస్మిన్ జాగ్రతి, కతర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి, కస్యైత త్సుఖం భవతి, కస్మిన్ను సర్వే సంప్రతిష్ఠితా భవన్తీతి?

ఓ దేవర్షీ! ఈ పురుషుడిలో ఏవేవి నిద్రిస్తున్నాయి? (ఏవేవి హెచ్చరిక లేకుండా ఉన్నాయి),
ఏవేవి మేల్కొని ఉన్నాయి?
ఏ దేవత స్వప్నాలను చూస్తున్నాడు?
( కలలు కనే దేవుడెవరు)
సుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరు?
చివరకు అన్నీ దేనిలో లయమైపోతున్నాయి?

పిప్పలాదుడు గార్గ్యునికి చెబుతున్నాడు:

మరీచయోర్క స్యాస్తం గచ్ఛతః సర్వా ఏతస్మింస్తేజోమణ్డల ఏకీభవన్తి. తా పునః పునరుదయతః ప్రచరన్త్యేవం హవై తత్సర్వం పరే దేవే మనస్యేకీ భవతి. తేన తర్హ్యేష పురుషో నశృణోతి, న పశ్యతి, న జిఘ్రతి, న రసయతే, న స్ప్రుశతే, నాభివదతే నాదత్తే, నానన్దయతే, న విసృజతే, నేయాయతే, స్వపితీ త్యాక్షతే!!

సూర్యుడు అస్తమించే టప్పుడు అతని నుంచి వచ్చిన అన్ని కిరణాలూ జ్యోతిర్మండలంలో ఐక్యమైపోతాయి. ఆయన తిరిగి ఉదయిస్తు న్నప్పుడు అతడిలోని అన్ని కిరణాలు తిరిగి బైటకి వ్యాపిస్తాయి. ఒక మనిషి నిద్ర పోతున్నప్పుడు అతడిలో ఉన్న ఇంద్రియాలన్నీ ప్రధాన ఇంద్రియమైన మనసులో లీనమౌతాయి.

ఆస్థితిలో అతడు మాట్లాడలేడు, వినలేడు, చూడలేడు, వాసన రుచి కూడా చూడలేడు. దేన్నీ తాకలేడు. ఆనందించలేడు, దేన్నీ వదిలేయలేడు, కదలలేడు, అలా ఉన్నప్పుడు ఆ మనిషిని నిద్ర పోతున్నాడు అని అంటారు.

ప్రాణాగ్నయ ఏవైతస్మిన్ పురే జాగ్రతి,
గార్హపత్యో హవా ఏషోపానో, వ్యానో న్వాహార్యపచనో, యద్గార్హ పత్యాత్ ప్రణీయతే
ప్రణయనాదాహవనీయః ప్రాణః!!

మనిషి నిద్రపోతున్నప్పుడు అతని శరీరం అనే నగరంలోని ప్రాణ శక్తులైన అగ్నులు మాత్రం మేలుకొని ఉంటాయి.

ఆ అగ్నులలో అపాన వాయువు గార్హపత్యాగ్ని-దీనిని పిత అంటారు.;

వ్యాన వాయువు అన్వహార్య పచనాగ్ని అంటే దక్షిణాగ్ని- దీనిని మాత అంటారు.;

ఇందులో గార్హపత్యాగ్ని నుంచి రూపొందినదే ఆహవనీయాగ్ని; కనుక ఆహవనీయాగ్ని అంటే ప్రాణమే. దీనినే గురువు అంటారు.

శ్రౌతాగ్నులని త్రేతాగ్నులని ఈ అగ్నులను పిలుస్తారు. యాజ్ఞీకాలలో ఈ అగ్నుల అమరిక ఆహుతుల అర్పణ విధానం ఈ రకంగా ఉంటుంది.

శ్రౌత్ర క్రియలలో నిత్యాగ్నిహోత్రులు అనుసరించే విధానం:

యజ్ఞశాల యందు గార్హపత్య కుండము గుండ్రని ఆకారములో పడమటి వైపున ఉంటుంది. దీనిలో అరుణుల( ఉత్తరారణి, అధరారణి) రాపిడితో అగ్నిని ప్రజ్వలింప జేస్తారు.

గార్హ పత్యాగ్ని నుండి అగ్నిని తీసుకొని మిగిలిన రెండు అగ్నులను ప్రజ్వలింప జేస్తారు.

దక్షణాగ్ని గుండము యజ్ఞశాలలో దక్షిణము వైపున అర్ధ చంద్రాకారములో నిర్మింపబడుతుంది. ముఖ్యము గా దీనిలో పిత్రుదేవతలకు ఆహుతులను చేస్తారు.

ఆహవనీయ గుండము యజ్ఞశాలకు తూర్పున నలుచదరముగా ఏర్పరుస్తారు. మొత్తం అందరి దేవతలకు ఆహుతులను దీనిలోనే వేల్చుతారు హృతము చేస్తారు.

మన యోగ పరి భాషలో:

మన శరీరంలో ఉండే వైశ్వానరాగ్నిని వృద్ధి చేసుకొని అశనోత్పత్తి చేసుకొనేందుకు ఉపయోగపడే అగ్ని ఆహవనీయాగ్ని.

గార్హపత్యాగ్ని ద్వారా తేజస్సు ద్విగుణీకృత మౌతుంది. ప్రతి దినం మనంచేసే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా జనించిన ఉష్ణ శక్తే (అశనము) ఆ తేజస్సు. దీనినే గృహస్తు తన స్వధర్మం అంటే ప్రాణాయామముతో జనింప చేసుకొంటాడు.

వచ్చే భాగంలో ఏ దేవత స్వప్నాలను చూస్తాడు? ఎవరు సుఖాలను అనుభవిస్తున్నాడు? మొదలైన విషయాలు తెలుసుకొందాం.

మనిషి నిద్రిస్తున్నప్పుడు ఇంద్రీయాలన్నీ నిద్రిస్తూ ఉంటాయని, నిద్ర పోయేటప్పుడు మన శరీరంలో త్రేతాగ్నులు మేలుకొని ఉంటాయని తెలుసుకొన్నాం.

యదుచ్ఛ్వాస నిఃశ్వాసా ఏతావాహుతీ సమం నయతీతి స సమానః-

మానవుడు ఉచ్ఛ్వాసం -నిశ్శ్వాసం అనే రెండు ఆహుతుల్ని సమానంగా జరిపించటం వల్ల ఉత్పన్నమయ్యే ప్రాణ శక్తి సమానం అని చెప్పబడుతుంది.

మనోహవావ యజమాన ఇష్టఫల మేవోదానః-

మనస్సే దీనికి యజమాని. యాగం ద్వారా జీవుడు కోరిన ఇష్టఫలమే ఉదానం.

ఏనం యజమాన మహ రహర్బ్రహ్మ గమయతి-

ఎందుకంటే ఈ ఉదానమే సాధకుణ్ణి నిత్యం భగవంతుని దగ్గరకు జేరుస్తుంది గనుక.

ఈ జీవుడు స్వప్నావస్థ లో తన గొప్పతనాన్ని తానే చూస్తాడు.

జాగ్రదావస్థలో తాను చూసిన వాటినే తిరిగి చూస్తాడు. విన్నవే మళ్ళీ మళ్ళీ వింటాడు. వివిధ ప్రాంతాలలో వివిధ దిశలలో తాను అనుభవించినవి మళ్ళీ మళ్ళీ కలలో అనుభవిస్తాడు.

జాగ్రదావస్థలో చూసినవి, చూడనివి, విన్నవి, విననివి అనుభవించినవి, అనుభవించనివి, నిజమైనవి, నిజంకానివి ఇలా అన్నీ తానే అయి కలలో అన్నిటినీ జీవుడు ( ఇక్కడ ఆత్మ కాదు మనస్సే) అనుభవిస్తాడు.

ఒక్కొక్కప్పుడు పూర్వ జన్మలోని ఉపాధిని(శరీరం) వదలి, ప్రస్తుత ఉపాధిలోకి చేరుకొన్న సూక్ష్మశరీరంలో నిక్షిప్తమైన జ్ఞాపకాలు కూడా స్వప్నాలకు కారణాలవు తాయని చెబుతారు.

ఇలాంటి కలలకు జన్మాంతర అనుభవాలే ఆధారం అనుకోవచ్చు.

జాగ్రదవస్త, సుషుప్త్యవస్థల మధ్యలో ఉండేది స్వప్నావస్థ. స్వప్నాన్ని మనస్సే అనుభవిస్తుంది.

స్వప్నావస్థ లో కళ్ళు వాటి పనినుండి నిష్క్రమిస్తాయి. అయినా స్వప్నం కనబడుతుంది. చెవులు పనిచేయవు. అయినా స్వప్నంలోని మాటలు శబ్దాలు విన గలుగుతాము.

కారణం మనస్సే ఇంద్రియాల పని కూడాచేస్తూంది. అందుకే మనస్సుని ఆరవ ఇంద్రియం అన్నారు భగవద్గీత లో( మనషష్ఠానీద్రియాణి…..)

స్వప్నావస్థ లో మనస్సు, పంచప్రాణాలు మాత్రమే పనిచేస్తాయి.

ఆత్మ సాక్షీభూతంగానే ఉంటుంది. అతనికి అవస్థా త్రయంతో సంబంధం లేదు. ఎందుకంటే ఆత్మ శాశ్వతుడు, పరిశుద్ధుడు మరియు జ్ఞాన స్వరూపుడు.

పంచభూతాలు, (పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశము) వాటి తన్మాత్రలు (గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దము); జ్ఞానేంద్రియాలు వాటి క్రియలు, కర్మేంద్రియాలు వాటి క్రియలు; అంతఃకరణం ( మనస్సు,బుద్ధి, అహంకారం, చిత్తం)- వాటి విషయాలు; పంచ ప్రాణాలు, తేజస్సు- ఈ విధంగా ప్రాణంతో సంబంధమున్న తత్వాలన్నీ ఆత్మలోనే లయమైపోతున్నాయి.

పక్షులన్నీ తిరిగి తిరిగి వాటి గూడు ఉన్న వృక్షం దగ్గరకు చేరినట్టే సమస్తం ఎంతో గొప్పదైన ఆత్మలో లీనమైపోతాయి.

నేను అనే స్ఫురణ, ఇంద్రియాలు, పంచప్రాణాలు, పంచ భూతాలు, అన్నీ ఎక్కడ లీనమై పోతున్నాయో ఆ అమరమైన ఆత్మను ఎవరు స్వయంగా అనుభూతి చెందుతాడో వాడే సర్వజ్ఞుడు.

రెండు మూడు సార్లు చదివి అర్ధం చేసుకోండి. దీనిని ఇంత క్రితం భాగాలతో కలిపి చదివండి. ( while explaining- I don’t know whether i made myself clear or not)

సౌర్యాయణి ప్రశ్నకు క్రితం భాగానికి మరింత వివరణ:

1. మానవుని శరీరంలో ఏవి నిద్రిస్తున్నాయి?

ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు అతని యొక్క ఇంద్రియాలన్నీ మనసులో లీనమై పోతున్నాయి- అంటే స్తబ్ధతను పొంది మనసు యొక్క అధీనంలో ఉంటున్నాయి. సూర్యుడు అస్తమిస్తు న్నప్పుడు కిరణాలన్నీ అతనిలోనే లీనమై తిరిగి ఉదయిస్తున్నప్పుడు కిరణాలు ఏ రకంగా బహిర్గతమౌతున్నాయో అలా నిద్ర నుంచి లేచేక ఇంద్రియాలన్నీ తిరిగి చేతనత్వాన్ని పొందుతాయి.

2. ఏవి మెలుకువగా ఉండి తమ తమ వ్యాపారాలు నిర్వర్తిస్తున్నాయి?

ప్రాణం తనను ఐదు భాగాలుగా చేసుకొని, శరీరంలో ఎల్లవేళలా మెలుకువగానే ఉంటుంది. ఇక్కడ ప్రాణాన్ని అగ్నులతో పోల్చేరు.( ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు, నిత్యాగ్నిహోత్రులు లేదా ఆహితాగ్నులు చాలా తగ్గిపోయాయి కాబట్టి వాటి విస్తార వివరణ ఉపయోగము లేదు).

అయితే అహర్నిశలు శరీరంలో మేలుకొని ఉండేవి పంచ ప్రాణాలు.
అపాన వాయువుని గార్హపత్న్యాగ్ని అని
వ్యాన వాయువును దక్షిణాగ్ని అని
ప్రాణ వాయువుని ఆహవనీయాగ్ని అని
సమాన వాయువుని ఉచ్ఛ్వాస- నిశ్వాసాలను సమాన నిష్పత్తిలో జరపగా ఉత్పత్తిఅయ్యే ప్రాణ శక్తి అని
ఉదానమే జీవిని పునర్జన్మకు గాని ముక్తికి గాని తీసుకొని పోయేది అని -ఇవి ఐదు సర్వకాల సర్వావస్తల యందు మెలుకువగానే ఉంటాయని తెలిపాడు పిప్పలాదుడు.

3. స్వప్నాలను అనుభవించే దైవం మనస్సు అని

4. స్వప్న సుఖాన్ని పొందేది కూడా మనస్సేనని

5. ఇవన్నీ ఆత్మలోనే లీనమౌతున్నాయి అని ఇచ్చిన వివరణలు సమగ్రంగా ఉన్నాయి.

49. ఉపనిషత్తులు – ప్రశ్నోపనిషత్తు (Continuation)

ఐదవ ప్రశ్న:

గార్గ్యుడి తర్వాత శిబి కుమారుడైన సత్యకాముడు ” ఓంకారాన్ని గాఢంగా ధ్యానించేవాడు మరణానంతరం ఏ ఏ లోకాలను పొందుతాడు?” అని అడిగాడు.

ప్రత్యక్ష సాధన లేకుండా అనుభవానికి, జ్ఞానానికి అవకాశము లేదు. ముక్తి లేదా మోక్షానికి సాధ్యంకాదు.

ఎన్ని చదివినా, విన్నా, ఎంత విశ్లేషణ చేసినా ఎంత అర్ధం చేసుకొన్నా ప్రణవ సాధన చేయనిదే కించిత్తు కూడా ఉపయోగము లేదు.

ఉదాహరణకు, పంచదార అని ఒక కాగితం మీద రాసి దానిని చప్పరిస్తే పంచదార మాధుర్యం తెలుస్తుందా? దాని గురించి విన్నా, చదివినా ఉపయోగం లేదు. ప్రత్యక్షంగా చక్కెరకు దగ్గరగా చేరాలి. దానిని పొందాలి. దాని రుచిని చూడాలి. అప్పుడు తాదాత్మ్యత కలుగుతుంది.

అదే విధంగా ఓంకార సాధన సమగ్రంగా చేయడం ద్వారా మాత్రమే భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలరని, బ్రహ్మ లోక ప్రాప్తి, ఆ పరాత్పర పురుషుని దర్శనం దొరుకుతాయని ఇక్కడ చెబుతున్నారు.

ఏతద్వై సత్యకామ పరం చాపరం
చ బ్రహ్మ యదోంకారః
తస్మాద్విద్వానేతే నై వాయతనే నాకతరమన్వేతి!

ఓ సత్యకామా! ఈ ఓం కారమనేది పరబ్రహ్మ మరియు అపరబ్రహ్మ అని రెండు స్ధితులలో ఉంది. ఓంకారాన్ని ధ్యానించే సాధకుడు తన సాధనకు తగ్గట్టుగా ఈ రెండింటిలో ఒకదానిని పొందుతాడు.

బ్రహ్మం అవ్యక్తం గా ఉన్నప్పుడు నామ రూపాలుండవు. ఆ స్థితి లో దాన్ని పరబ్రహ్మ అంటారు.

వ్యక్తమైనపుడు నామ రూపాత్మకంగా ఉంటుంది. అదే ఈ విశ్వం. ఈ విశ్వంలో ప్రతి అణువు లోను బ్రహ్మం ఉంటుంది. దీన్ని అపరబ్రహ్మ అంటారు.

ఈ రెండూ వేరు కాదు. పరబ్రహ్మ యొక్క వ్యక్త స్వరుపమే అపరబ్రహ్మం – ఈ విశ్వం.

ఓంకారము యొక్క మూడు మాత్రలు- అ ఉ మ ల సంయోగ ధ్యాన స్థితి గురించిన వివరణ ఇచ్చారు.

ఓంకారం మొదటి మాత్రను (అ- ఋక్- ఊర్ధ్వ గతి) మాత్రమే గాఢంగా అనుష్ఠానం చేస్తే ధ్యానించేవాడు జ్ఞానోదయాన్ని పొందుతాడు.

మరణానంతరం వెంటనే తిరిగి భూలోకానికి వస్తాడు. అలా వచ్చిన మానవుడు ఇక్కడ తపస్సు బ్రహ్మచర్యాలతో కూడిన వాడై శ్రద్ధ మొదలైన గుణాలు కలిగి గొప్ప మహిమలను పొందుతాడు.

అధ యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సోన్తరిక్షం
యజుర్భి రున్నీ యతే స సోమలోకమ్ న సోమలోకే
విభూతి మనుభూయ పునరావర్తతే!

ఎవడైతే ఓం కారం లోని రెండు మాత్రలను (అ,ఉ- ఋక్, యజుర- ఊర్ధ్వ, అధోగతులు) దీక్షగా ధ్యానం చేస్తాడో, అతడు తన మనస్సు తో తాదాత్మ్యం చెందుతాడు. చంద్రలోకానికి పోయి సుఖాలను అనుభవించి తిరిగి భూలోకంలో పుడతాడు.

ఎవరైతే ఓం కార మంత్రం యొక్క మూడు మాత్రలను పట్టుదలతో క్రమం తప్పకుండా ధ్యానిస్తాడో, దానితో పాటు ఉన్నతుడైన భగవంతుణ్ణికూడా ప్రగాఢంగా ధ్యానిస్తారో వాళ్ళు
తేజోవంతుడైన సూర్యుడి లో లయమయిపోతారు.

పాము ఎలాగైతే కుబుసం విడిచి బయటకు వస్తుందో అలాగే జీవుడు కూడా పాపాలనుంచి విముక్తుడై బైట పడతాడు.

సామవేద దేవతల సాయంతో బ్రహ్మ లోకానికి పోయ అక్కడ సకల జీవ రాసులకీ నాయకుడు, సర్వోన్నతుడు, అందరి శరీరాలలోను కొలువుదీరి ఉండే పరమాత్మను దర్శిస్తాడు.

తిస్రో మాత్రా మృత్యుమత్యః ప్రయుక్తా అన్యోన్యసక్తా
అనవిప్రయుక్తాః! క్రియాసు, బాహ్యభ్యన్తర మధ్య మాసు సమ్యక్ప్రయుక్తాసు న కమ్పతే జ్ఞః!

ఈ విధంగా ఓంకార మంత్రం మూడు మాత్రల్ని విడివిడిగా ధ్యానించినా కూడా జీవుడు మరణానికి లోబడినవాడే. మరణాన్ని జయించలేడు. అతనిని మరణంనుంచి కాపాడలేవు.

అయితే మూడు మాత్రలను విడదీయకుండా ( సమ్యక్ప్రయుక్తాసు) బాహ్య, అంతర, మధ్యంతర స్థితుల్లో పని చేసే విధంగా ఓంకారాన్ని ధ్యానించే జ్ఞాని దేనికీ చలించడు. అమృతత్వాన్ని పొందుతాడు.

ఓం కారముయొక్క మూడు మాత్రలు పరస్పర సంబంధము కలవై పరస్పరము విడువక ఉంటాయి.

ధ్యానములో ఉపయోగించు ఓంకారము బాహ్య, అభ్యంతర మరియు మధ్యమ క్రియలలో బాగుగా ఉపయోగించినప్పుడు జీవుడు సుఖదుఃఖాలకు చలించని వాడై ఉంటాడు.

ఋగ్భిరేతం యజుర్భి రన్త రిక్షం ససామభి ర్యత్థ్కవయో వేద
యన్తే, తమోంకారేణై వాయతనేనాన్వేతి విద్వా న్యత్తచ్ఛాన్త
మజర మమృత మభయం పరం చేతి!

సత్యకామా! ఓంకార ధ్యానం వల్ల ఋగ్వేద మార్గం తో భూలోకం, యజుర్వేద మార్గం చేత ఆకాశం, సామవేద మార్గం ద్వారా బ్రహ్మలోకం లభిస్తాయని మహాత్ములు తెలుసుకొన్నారు.

వారందరూ ప్రశాంతమైనది, ముసలితనం లేనిది, మరణం లేనిది, సకల భయాలకు అతీతమైనది అయిన భగవంతుని సన్నిధానం ఓంకార ధ్యానం తోనే చేరుకొంటున్నారు.

ప్రేమ లేని భజన, అర్థం తెలుసుకోకుండా గ్రంధ పఠన, భక్తి లేకుండా దేవుని పూజ, అనుభవం లేని జ్ఞానం వ్యర్ధం.

అందువల్ల, ప్రత్యక్ష సాధనను తెలుసుకొని, గురుముఖతా ఉపదేశం పొంది ఓంకార అనుష్టానాన్ని మూడు మాత్రలు విడదీయకుండా బాహ్య అంతర, మధ్యంతర స్థితుల్లో పని చేసేటట్లుగా సాధన చేసి ముక్తిని పొందండి.

వచ్చే భాగంలో షోడశ కళాప్రపూర్ణుని గురించి ఆరవ ప్రశ్న లో తెలుసుకొందాం.

50. ఉపనిషత్తులు – ప్రశ్నోపనిషత్తు (Continuation)

ఆరవ ప్రశ్న గా భరద్వాజుని కుమారుడైన సుకేశుడు పిప్పలాదుని సమీపించి, ఓ దేవర్షీ! పూర్వం కోసలదేశ యువరాజు, హిరణ్యనాభుడు నా దగ్గరకొచ్చి ” ఓ భరద్వాజ కుమారా! పదహారు కళలతో ఉండే పురుషుడెవరో తెలుసా?” అని నన్ను ప్రశ్నించాడు. నాకు తెలియదని చెప్పేను.

ఓ మహర్షీ! నేను ఆ హిరణ్యనాభుడు నన్నడిగిన ప్రశ్ననే తిరిగి అడుగుతున్నాను. పదహారు అంగాలతో ఉన్న పురుషుడెవరు? అతడు ఎక్కడ ఉంటాడు?

ఓ సౌమ్యుడా! నీవడిగిన మహాపురుషుడు ఎవరోకాదు ఆత్మ. పంచ భూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు తోకలిపిన(16 అంగాలు) షోడశ కళాప్రపూర్ణుడే ఆత్మ.

ఆ ఆత్మ అనేది ఇక్కడ ఈ శరీరంలోనే ఉంది. ఆ ఆత్మ నుంచే పదహారు అంగాలు ఆవిర్భవించాయి.

ఆత్మ ఒకరోజు ఇలా ఆలోచించి

న ఈక్షా ఞ్ఛక్రే కస్మిన్న హ ముత్రాన్త ఉత్ర్కాన్తో
భవిష్యామి, కస్మిన్వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠాస్యామీతి!!

ఈ దేహం తనకు నివాసయోగ్యంగా ఉందో లేదో,
ఎవరు అక్కడ్నుంచి బయటకు వస్తే తాను కూడా బయటకు రావలసి వస్తుందో అలాంటి ప్రాణాన్ని సృష్టించింది.

ఆ ప్రాణంనుంచే బుద్ధి, ఆకాశం, వాయువు, జ్యోతి, నీరు, భూమి, ఇంద్రియాలు, మనస్సు, ఆహారం, వంటివి ఆవిర్భవించాయి. ఆహారం నుంచి శక్తి, తపస్సు, మంత్రాలు, క్రియలు, అన్నిలోకాలు పుట్టాయి. వాటన్నిటికీ పేర్లు సృష్టింపబడ్డాయి. అవే పదహారు అంగాలు.

అంటే ప్రాణం నుంచే ఈ పదహారు కళలు సృష్టించబడ్డాయి.

సముద్రాభిముఖంగా ప్రవహించే నదులు సాగరాన్ని చేరి ఎలా తమ అస్థిత్వాన్ని కోల్పోతాయో, ఎలా సముద్రం గానే తయారవుతాయో, అలాగే పురుషాభిముఖంగా సాగే ప్రాణం దాని పదహారు కళలు పురుషునిలో(ఆత్మలో) చేరి అందులోనే లయమైపోతున్నాయి. ఆత్మ గానే పిలవ బడుతున్నాయి.

ఈ విధంగా ఆత్మ అమరమై పదహారు కళలు గలదానిగా వర్ధిల్లుతోంది.

అరా ఇవ రధనాభౌ కలా యస్మిన్ ప్రతిష్ఠితాః తం వేద్యం
పురుషం వేద యధా మా వో మృత్యుః పరివ్యధా ఇతి!!

రధ చక్రంయొక్క ఇరుసుకు ( మధ్యలో ఉండే గుండ్రని ఆధారానికి బంధింపబడిన ఆకులు లాగా ఈ పదహారు కళలు ఎవరిలో ప్రతిష్టింపబడి ఉన్నాయో ఆ జీవాత్మ కళలే లేని పురుషునిలో చేరి అమృతుడౌతున్నాడు.

ఆపురుషుణ్ణి తెలుసుకోండి. అతని జ్ఞానంకలిగిన తర్వాత మృత్యువు మిమ్మలను బాధించదు.

నాతః పరమస్తీతి!

దీనికన్న పెద్దది ఇంకేమీ లేదు.

తాన్హోవా చైతాపదేవా హ మేతత్వరం బ్రహ్మ వేద

శిష్యులారా! ఎంతో గొప్పదైన ఆ పరబ్రహ్మ గురించి నాకు తెలిసినది ఇదే.

తపో జ్ఞాన సంపన్నుడైన పిప్పలాద మహర్షి ఎంతో నమ్రతగా శిష్యులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించేడు.

ఈ విధంగా ప్రశ్నోపనిషత్తు ముగుస్తుంది.

దీనిలో ఉన్న ఆరు ప్రశ్నలు ఆరు ఉపనిషత్తులతో సమానం.

ప్రశ్నోపనిషత్తులోని ప్రశ్నలకు జవాబులు ఛాందోగ్యో పనిషత్తులోను, బృహదారణ్యకోపనిషత్తు లోను చాలా వివరంగా విశ్లేషింప బడ్డాయి.

ఋక్ యజుర్ సామ గానాలకు ఓంకారానికి ఉండే సంబంధం మరింతగా విశదీకరింప బడింది.

ప్రణవ గానమును ఉద్గీధము అను పేరుతో వివరించారు.

మా స్వామీ జయతీర్ధులు ఏమంటారంటే

“దశోపనిషత్తులలోని ముఖ్యమైన విషయాలన్నీ ఇప్పటి వరకూ మనం చదువుకున్న ఈశ, కేన, కఠ, మాండూక్య, ప్రశ్నోపనిషత్తులనే ఈ ఐదు ఉపనిషత్తులలోనే వచ్చేస్తాయి.

దశోపనిషత్తులలో మిగిలిన ఐదు ఉపనిషత్తులు- ముండక, ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తుల లో ఇవే విషయాలు వేరే శబ్దాలలో వేరే ఉదాహరణలతో వివరింప బడ్డాయి.

ఇకపోతే, వాతావరణ శుద్ధి కోసం, సంసారాల కోసం చేసే యజ్ఞాలు, సంతానోత్పత్తి కొరకై సంసార విషయాలు మరికొన్ని స్థూలమైన, ఐహికమైన విషయాలు వివరింప బడ్డాయి.” అని.

వచ్చే భాగంలో ప్రశ్నోపనిషత్తు లోని ఆరు ప్రశ్నలు, ఓంకారము యొక్క ప్రాశస్త్యము, ఓంకార అనుష్ఠనము లోని కుశలతలు తెలుసుకొందాము.

51. ఉపనిషత్తులు – ప్రశ్నోపనిషత్తు (Continuation)

ప్రశ్నోపనిషత్తు లో మొదటి నాలుగు ప్రశ్నలలో ప్రాణ శక్తి గురించి చెబితే ఐదవ ప్రశ్న ప్రణవాన్ని గురించి చెప్పింది.

సుకేశుడడిగిన ఆరవ ప్రశ్నకు సమాధానం మొదటి ఐదు ప్రశ్నల విషయం వస్తుంది.

ప్రాణ ప్రణవాలు రెండూ స్పందన యొక్క రూపాలే. అవి నాదాత్మకాలే.

ఈ రెండింటికి అంటే ప్రాణానికి ప్రణవానికి మధ్య పధ్నాలుగు తత్వాలు ఇమిడి ఉన్నాయి.

ప్రళయానంతరం సృష్టికి ముందు ఈ విశ్వమంతా ఈశ్ అనే శబ్దం తో నిండి ఉందని అదే ప్రాణ శక్తి అని ఈశావాశ్యో పనుషత్తు లో చదువు కొన్నాము.

సృష్టి అంటేనే అది షోడశ కళల సమాహారం. ఈ పదహారు కళలు ఒకే ఒక ఆత్మ తత్వాన్నుంచి వచ్చాయి. ఇక్కడ కళలు అంటే అంశలు అని అర్ధం.

షోడశ కళా ప్రపూర్ణుడైన పురుషుడు (ఆత్మ) ప్రాణాన్ని సృష్టిస్తే ఆ ప్రాణం నుంచి బుద్ధి, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి, ఇంద్రియాలు, మనస్సు, ఆహారం(అశనం) వంటివి ఉద్భవించాయి. వీటిలో ఆహారం నుంచి శక్తి, తపస్సు, మంత్రాలు, క్రియలు, అన్ని లోకాలు ఉద్భవించాయి. ఆ లోకాలకు పేర్లు సృష్టించ బడ్డాయి.

ప్రాణం ఈ పదునైదు కళలలోను సూత్రంగా ఉంటూ వాటికి కావలసిన చైతన్యాన్ని ఇస్తూంటుంది.

ఐదవ ప్రశ్న లో ప్రణవాన్ని అంటే ఓం కారాన్ని అ ఉ మ గా విశ్లేషణ చేసేరు.

ఈ ప్రణవానుష్టానం చేసే విధానం చాందోగ్య, బృహదారణ్యకో పనిషత్తు లలో ఎంతో వివరంగా చెప్పబడింది.

ఓంకారాన్ని ఎలా ఉచ్ఛరిస్తూ ఉద్గీధము చేయాలి అని దేవతలు ప్రయత్నం మొదలు పెట్టారు.

ముక్కు, వాక్కు(కంఠం), చక్షువు, శ్రోత్రము, మనస్సు ఉపయోగించి ఓంకారాన్ని గానంచేస్తే రాక్షసులు వారిని నశించేటట్లుగా చేసేరు.

అప్పుడు ముఖ్య ప్రాణా న్నాధారంగాచేసుకొని చేసిన ప్రణవ గానానికి (ఉద్గీధానికి) రాక్షసులు నశించి పోయారు.

అంటే నోటితో కాని, ముక్కుతో కాని, లేదా ఏ ఇతర ఇంద్రియములతో చేసే ఓంకారము శరీరానికి రుగ్మత నిస్తుంది తప్ప మోక్షాన్నివ్వదు.

భ్రూమధ్యంని ఆధారంగా చేసుకొని గురుస్థానము నుండి ప్రాణుని యొక్క ఝంకారము తో చేసే ఉద్గీధము సాధకుని బ్రహ్మజ్ఞానిగా చేస్తుంది అని చెబుతున్నారు.

అందుకే యోగ్యుడైన గురువు నుంచి బ్రహ్మవిద్యోపదేశాన్ని పొంది గురువు యొక్క పర్యవేక్షణలోఓంకారాన్ని అనుష్టానము చేయాలి అని తెలుస్తోంది.

ఆ విధంగా చేసే ప్రణవోపాసన వల్ల షోడశ కళలు ఆ పురుషునిలోనే లయమైపోయి బ్రహ్మ సాయజ్యాన్ని పొందుతాడు అని చెబుతూ ప్రశ్నోపనిషత్తు ముగుస్తోంది.

వచ్చే భాగంలో ఇప్పటి వరకూ అయిన ఐదు ఉపనిషత్తులను గుర్తు చేసుకొని ముండకోపనిషత్తుకు వెడదాము.

52. ఉపనిషత్తులు – ప్రశ్నోపనిషత్తు (Continuation)

మనం ఇప్పటి వరకూ పూర్తి చేసిన ఉపనిషత్తులను త్వరిత గతిలో జ్ఞాపకం చేసుకొందాము.

1. ఈశావాశ్యోపనిషత్తు జ్ఞాన కర్మలకు రెండికి ప్రాధాన్యం ఇస్తూ సత్తు- అసత్తు లకు అవతల ఉండేదేవుని గురించి, ఆ దేవునిలో ఐక్యమై జన్మరాహిత్యాన్ని పొందే మార్గాలను వివరించింది.
ముక్తి కి కర్మత్యాగం మార్గం కాదని, నిర్లిప్త రీతిలో కర్మలనాచరిస్తూ నూరేళ్ళకాలం జీవించడమే ముక్తికి మార్గమని బోధిస్తోంది.

ఎందుకంటే జ్ఞానం లేని వాళ్ళకు వేదశాస్త్రాల అధ్యయనం, స్థూల పూజ, కర్మకాండలలో మునిగి తామేదో చేస్తున్నామని ఒక సంతృప్తిని పొందే సావకాశమైనా ఉంది.

వీటన్నిటినీ వదలి కేవలం విద్యనే ఉపాశించే వారికి అలాంటి తృప్తి కలగడం కూడా సాధ్యం కాదు. కర్మత్యాగంచేయడమనేది జ్ఞాన ప్రాప్తికి విరోధం. అందుకని శాస్త్రవిహితమైన కర్మలు చేస్తూ(త్రికాల సంధ్యలలో ప్రణవోపాసన చేస్తూ) నూరేండ్లు జీవించాలి అని కోరుకో అంటాడు.

ఆత్మ దర్శనం పొందిన వ్యక్తికి సత్య (జ్ఞానం) దర్శనాన్ని పొందటానికి :

హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం
తత్వం పూషాన్నపావృణు సత్య ధర్మాయ దృష్టయే!!

అని ప్రార్ధిస్తాడు. ఓ పూషా(సూర్యభగవానుడా) బంగారు మూకుడుతో కప్పబడి మిరుమిట్లు గొలుపుతూ వెలువడుతున్న నీ కిరణ సముదాయాన్ని ఉపసంహరించుకొని శాశ్వతమైన ఆ సత్య స్వరూపాన్ని గోచరమయ్యేట్టుగా చేయి తండ్రీ!

అంటూ చేసే ఆప్రార్ధన ఏమి చెబుతోందంటే ఆ పరాత్పరుని దయతో మాత్రమే ఆయన స్వరుపం చూడగలము తప్ప వేరే మార్గము లేదు అని.

ఇంతటి మహత్తరమైన సత్యాన్ని ఆవిష్కరించిన ఉపనిషత్తు ఈశావాశ్యోపనిషత్తు.

2. కేనోపనిషత్తు ఇంద్రాది దేవతలుకాని, మానవులుకాని ఆ దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేరు. ఇంద్రియాలుకాని,మనస్సు కాని, బుద్ధి కాని, ప్రాణం కానీ ఆ బ్రహ్మాన్ని గ్రహించలేవు.

వీటన్నిటికీ భగవంతుడే ఆశ్రయం కావటం వల్ల అతనికి సంబంధించిన జ్ఞానం మనకు అతని దయవల్ల మాత్రమే లభించాలి అని తెలియ పరచింది.

ఎవరి ప్రేరణ వల్ల మనస్సు పని చేస్తోంది, ప్రాణం తన క్రియను ప్రారంభించడానికి కారకులెవరు, వాక్కు, కన్నులు, చెవులు- వీటిని ఆదేశించే దేవతలెవరు మొదలైన విషయాలను విశదీకరించిందీ ఉపనిషత్తు.

జ్ఞానం సత్య దర్శనం ద్వారానే కలుగుతుంది. దాని వల్లనే అమృతత్వప్రాప్తి కలుగుతుంది. ప్రాణ మనో మిలన యోగ విద్య వల్ల అమృత రసం ఉత్పన్నమై ఇచ్ఛామరణం పొందడం సులభమౌతుంది.

తస్యై తపో దయః కర్మేతి ప్రతిష్టా
వేదాః సర్వాంగాని! సత్యమాయతనం.

తపస్సు, దమం, కర్మ- వీటిపైనే జ్ఞానం ప్రతిష్టితమైంది. అంటే జ్ఞాన ప్రాప్తికి ఇవే ఆధారాలు. అనేక జ్ఞానుల ద్వారా ప్రకటింపబడిన వేదాలు ఆ జ్ఞానపు అంగాలు. శాశ్వత బ్రహ్మమే వాటికి ఆశ్రయస్ధానం. వీటిని తెలుసుకొనిన వ్యక్తి పాపాలన్నింటినీ ప్రక్షాళనం చేసుకొని బ్రహ్మత్వాన్ని పొందుతాడు అని ముగుస్తుంది.

3. కఠోపనిషత్తు లో బ్రహ్మవిద్య యే మహత్తర చర్చనీయాశం. నచికేతోపాఖ్యానం ద్వారా నచికేతాగ్ని, దాని వివరాలు, మరణం తర్వాత ఆత్మ యొక్క ఉనికిని సవివరంగా సోదాహరణంగా వివరించారు.

మహతః పరమవ్యక్తమవ్యక్తా త్పురుషః పరః
పురుషాన్న పరం కించిత్సా కాష్ఠా సా పరాగతిః

ఆత్మ కన్న అవ్యక్తం శ్రేష్ఠం. (నిరాకార చైతన్యం- విరాట్);అవ్యక్తం కన్న పురుషుడు ( నిత్య శరీరి) శ్రేష్ఠుడు. ఆ పురుషుని కన్న శ్రేష్ఠమైనది ఏదీ లేదు. అదే ఆత్యంతికమైన గమ్య స్థానం. అని వివరించింది.

జీవాత్మ పరమాత్మల గురించి చెప్పిందీ శాస్త్రం. దీని లో సావధిక స్థితి నుండి అనంతత్వం వైపు; అజ్ఞానంధకారం నుండి జ్ఞానప్రకాశం వైపు; మృత్యువు నుంచి అమృతత్వం వైపు మానవుడు సాగించే ప్రయాణం వివరించ బడింది.

సత్య దర్శనం (దేవుని దర్శనం) తనలో అద్దంలో ప్రతిబింబం లా స్పష్టంగా కనబడుతుంది. స్వప్నం లో చూచినట్లు పితృలోకం లోను, నీటిలోని ప్రతిబింబంలా గంధర్వ లోకంలోను, ఒకసారి వెలుగు, ఒకసారి నీడలా బ్రహ్మ లోకంలోను జరుగుతుంది. అని చెప్పబడింది.

అంటే ఒక్క భూ లోకంలోనే కాకుండా, పితృ లోకంలోను, గంధర్వ లోకం లోను, బ్రహ్మలోకంలోను కూడా జ్ఞానాన్ని పొందే సావకాశం ఉంది అని తెలియ జేస్తోంది.

ఈ భౌతిక దృష్టికి దైవదర్శనం కాదు. పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సూ స్థిరమై బుద్ధి నిశ్చలమయ్యాక మాత్రమే ఆత్యంతిక సత్య దర్శనం ఔతుంది అని నొక్కి వక్కాణించింది కఠోపనిషత్తు. ఆత్మను ఏతత్ ద్వైతత్ అంటూ అదే ఆత్మ, అది తప్ప వేరు కాదు అంటూ అనేక ఉదాహరణలతో ప్రకటించిందీ ఉపనిషత్తు.

వచ్వే భాగంలో మాండూక్యోపనిషత్తుని కూడా జ్ఞాపకఙ చేసుకొని కొత్త ఉపనిషత్తు ముండకోపనిషత్తు మొదలు పెడదాం.

53. ఉపనిషత్తులు – ముండకోపనిషత్తు (Continuation)

4. మాండూక్యోపనిషత్తు:

ఓం అనేది నాశనం లేనిది. అంతా దాని వివరణే. ఇంతకు ముందు జరిగింది, ఇపుడు జరుగు తున్నది, ఇక ముందు జరిగేది అంతా ఓంకారమే. వీటన్నిటిని మించి త్రికాలాతీతంగా ఉండేది ఓంకారమే అంటూ 12 మంత్రాలలో వివరింపబడింది.
ఆ మంత్రాలకు 215 కారికలతో శ్రీ శ్రీ గౌడపాదులు చక్కటి వివరణ ఇచ్చారు.

ఆ ప్రాణుని స్పందన ద్వారానే మిగిలిన భూతాల ఉత్పత్తి జరగింది. ఆ భూతాల కలయికయే ఈ జగత్తు అయ్యింది. అందుచేత ఈ జగత్తంతా ఓంకారం తో నిండి ఉంది.

ఈ ఓంకారాన్నే అక్షరం అంటారు. ఓం అనే శబ్ద ఉత్పత్తికి గాలి మూలం. ఆ గాలికి మూల చైతన్యం ప్రాణం. ఆ ప్రాణం యొక్క స్పందనమే ఈ స్వర యుక్తమైన గతిని కలిగి ఉండే వాయువు.

ఈ ఉపనిషత్తులో అవస్తాత్రయాన్ని దాటి తురీయా స్థితిని చేరుకొని, ఆత్మ స్వరూపం తెలుసుకోవడం ద్వారా ముక్తిని పొందడం వివరించబడింది.

జాగ్రద్ స్వప్న సుషుప్తావస్థ లను వివరించి వాటికి పైన ఉండే తురీయావస్థ ను-

అది అంతర్ముఖమైన స్ధితి కాదు. అలా అని బహిర్ముఖ స్ధితికాదు. రెండూ చేరిన స్ధితి అంతకన్నా కాదు. అది చైతన్యవంతమైన స్ధితి కాదు. అది ప్రజ్ఞాన ఘనం కాదు. అలా అని ప్రజ్ఞ కాదు. అప్రజ్ఞ అంతకన్నా కాదు. అది కనుపించనిది, చేతలు లేనిది, గ్రహించ శక్యం కానిది. ఎలాంటి లక్షణాలూ లేనిది. ఊహాతీతమైనది, వర్ణించడానికి వీలు లేనిది. ప్రపంచానికి ఉపశమనాన్నిచ్చేది. శాంతమైనది. మంగళకరమైనది. అద్వైతంగా ఉన్నది.
ఇదే ఆత్మ యొక్క నాలుగోపాదం – తురీయం అంటూ ఇచ్చిన వివరణ చాలా విపులంగా ఉంది.

ఇప్పుడు ఐదవ ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు.
ఇది అధర్వణ వేదానికి సంబంధించినది. దీని గురించి విపులంగా చదువుకొన్నాము.

ముండకోపనిషత్తు:

ఆరవ ఉపనిషత్తు ముండకోపనిషత్తు. ఇది కూడా అధర్వణ వేదానికి చెందినదే. ఈ ఉపనిషత్తు కూడా భద్రం కర్ణేభిః…అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది. 29వ భాగంలో ఈ శాంతి మంత్రానికి విపులంగా అర్ధం చెప్పుకొన్నాము.

శిరోజాలు అహంకార మమకారాలకు ప్రతీకలని, శిరోముండనంతో అహంకార మమకారాలను త్యజించిన సన్యాసులకే బ్రహ్మ విద్య నభ్యసించే అర్హత ఉందని సూచనగా ఈ ఉపనిషత్తుకు ముండకోపనిషత్తని పేరు వచ్చిందంటారు.

ఈ ఉపనిషత్తులోని ఆఖరి మంత్రం లో శిరోముండనం చేయించుకొని శిరోవ్రతం చేసేవారే ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేయాలి అని చెప్పేరు.
బహుశా దీని వల్ల కూడా ముండకోపనిషత్తని పేరు వచ్చి ఉండొచ్చు.

ఈ ఉపనిషత్తులో బ్రహ్మవిద్య ఉపదేశింపబడింది.
సృష్టి కర్త బ్రహ్మ తన జ్యేష్టపుత్రుడైన అధర్వునకు ఈ బ్రహ్మ విద్యను ప్రప్రథమంగా ఉపదేశించాడు.

ఆ అధర్వుడు అంగిరునకు, అంగిరుడు భరద్వాజ వంశానికి చెందిన సత్యవాహునకు ఉపదేశించారు. సత్యవాహనుడు అంగీరసునకు ఉపదేశించారని, ఈ గురు పరంపర ముదటి రెండు మంత్రాలలో వివరించారు.

ఈ ఉపనిషత్తులో గురువు అంగిరసుడు బ్రహ్మ మానస పుత్రుడు. మహా తేజస్వి. తపస్వి.

కర్దమ ప్రజాపతి కుమార్తె శ్రద్ధను పెళ్ళి చేసు కొన్నాడు. వీరికి ఏడుగురు కొడుకులు, ఏడుగురు కుమార్తెలు. దేవ గురువైన బృహస్పతి అంగిరసుని కుమారుడే.

ఒకసారి అగ్నిదేవుడికి కోపంవచ్చి తన పదవిని విడచి అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.

అప్పుడు బ్రహ్మదేవుని ఆదేశంతో అంగిరసుడు అగ్నిపదవిని అలంకరించి యజ్ఞాలలోని హవ్యాలను దేవతలకు చేర వేస్తూ అగ్నిదేవుని కార్యాలన్నీ సమర్ధవంతంగా నిర్వహించాడు. దానితో అందరూ అగ్ని దేవుడు లేని లోటు గుర్తించ లేకపోయారు.

అప్పుడు అగ్నిదేవుడికి జ్ఞానోదయమై తన స్థానాన్ని తిరిగి స్వీకరించడానికి వచ్చాడు. కాని అంగిరసుని తేజస్సు చూసి భయపడి వెనుదిరిగి వెళ్ళిపోసాగేడు.

అంగిరసుడు అగ్నిదేవుణ్ణి బ్రతిమాలి అతనిని అతని స్థానంలో ఉంచాడు. అగ్ని దేవుని కోరిక మేరకు అంగిరసుడు ద్వితీయ స్థానాన్ని స్వీకరించాడు.

అటువంటి మహాత్ముడు అంగిరసుడు గురువు, శౌనకుడు శిష్యుడు ఈ ఉపనిషత్తులో.

ఈ శౌనకుడు సంపన్న గృహస్థు. (ఇంకో శౌనకుడు శునక మహర్షి కుమారుడు-అతను కాదు).

54. ఉపనిషత్తులు – ముండకోపనిషత్తు (Continuation)

ముండకోపనిషత్తు లోమూడు ముండకాలు (అధ్యాయాలు) ఉన్నాయి. ప్రతి ముండకం రెండు ఖండాలుగా విభజింపబడి మొత్తం 64 మంత్రాలు ఉన్నాయి.

ఒకటో ముండకం ప్రధమ ఖండంలో: ఆదికాలం నుంచి వచ్చిన బ్రహ్న విద్యా క్రమం, పరా విద్య, అపరా విద్యల లక్షణాలు, బ్రహ్మ తపస్సు వల్ల కలిగిన సృష్టి యొక్క వివరాలు తెలుపబడ్డాయి.

రెండవ ఖండం లో: యజ్ఞాలు యాగాలతో కూడిన కర్మ మార్గం, దాని ఫలాలు, జ్ఞాన మార్గం, దాని శ్రేష్ఠత చెప్పబడ్డాయి.

రెండవ ముండకం, మొదటి ఖండంలో: ఈ విశ్వ సృష్టికి మూలకారణమైన అక్షరాన్ని అవగాహన చేసుకొన్న వ్యక్తి యొక్క సంశయాలన్నీ పటాపంచల వుతాయనే విషయం ఉంది.

రెండవ ఖండంలో: బ్రహ్మ జ్ఞానానికి మార్గమైన ప్రణవం యొక్క వివరాలు, ఏకాగ్రతతో ఉపనిషద్ జ్ఞానంతో కూడి చేసే ఉపాసనా వివరాలున్నాయి..

మూడవ ముండకం, మొదటి ఖండంలో: సంసారపు సహజత్వం ఎలాంటిది? జీవుడు- శివుడు మధ్య సంబంధం ఏమిటో? బ్రహ్మ జ్ఞాని ఎవరు? బ్రహ్మ జ్ఞానుల్లో శ్రేష్ఠులెవరు? ఆ స్థితిని పొందే మార్గం ఏమిటి? ఆ స్థితిని పొందిన వాడి సామర్ధ్యం ఎలాంటిది? మొదలయిన విషయాల యొక్క వివరణ ఉంది.

రెండవ ఖండంలో ఆత్మ జ్ఞానం ఎవరికి లభిస్తుంది? ఎలాంటి వారికి సాధ్యంకాదు? బ్రహ్మజ్ఞానాన్ని ఎలాంటి వారికి ఉపదేశించాలి? అనే విషయాలు ప్రస్తావించారు. భగవత్కృప లేకుంటే జ్ఞాన ప్రాప్తి అసాధ్యం అని, బ్రహ్మజ్ఞానులు అమృతత్వాన్ని పొందుతారు, వాళ్ళకు పునర్జన్మ ఉండదనే విషయం తెలుపబడింది.

ఇంక ఉపనిషత్తు లోకి వెడితే:

ఓం బ్రహ్మదేవానాం ప్రధమః సంబభూవ విశ్వస్యకర్తా భువనస్యగోప్తా…

దేవతలందరికన్నా మొట్టమొదట బ్రహ్మ పుట్టాడనే మాటలతో ఈ ఉపనిషత్తు ప్రారంభమైంది. ఇక్కడ బ్రహ్మ శబ్దం త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మకు సంబంధించినది కాదు అంటారు స్వామి జయతీర్ధులు. ఆదిదేవుడైన హిరణ్యగర్భుడు, పురుషరూపి పరమాత్మను సూచిస్తుంది అంటారు.

ఎందుకంటే, బ్రహ్మను విశ్వస్య కర్తా ( విశ్వాన్ని సృష్టించిన వాడు) అని మాత్రమే కాకుండా భువనస్య గోప్తా – లోకాన్ని రక్షించే వాడు అని చెప్పడం వల్ల ఇతను సృష్టికార్యమొకదానినే చేసే త్రిమూర్తులలోఒకడైన బ్రహ్మ కాదనే అర్ధం స్ఫురిస్తోంది.

ఈ పదునాలుగు లోకాలతో కూడిన బ్రహ్మాండానికి సృష్టికర్య అయిన బ్రహ్మ సత్యలోకం లోను, రక్షకుడైన విష్ణువు వైకుంఠం లోను, లయకారుడైన రుద్రుడు కైలాసం లోనుఉండి తమ తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు.

సౌర కుటుంబం లో ఉండే లోకాలన్నిటికి ప్రాణశక్తి ప్రసారం సూర్యమండలం నుంచి జరుగుతుంది. అలాగే విశ్వంలోని కోటి సూర్యమండలాలకు శక్తిని ప్రసారం చేసే 12 ముఖ్య శక్తి కేంద్రాలున్నాయి.
వాటినే ఆదిత్యమండలాలు అంటారు. ఈ పన్నెండు మండలాల అధిపతులే ద్వాదశాదిత్యులు. ఈ మండలాలకు కూడా శక్తిని ప్రసారం చేసే కేంద్రం సూర్యమండలమే.

ఆ భానుమండలాధిపతే ఆదిత్యుడు. అతడే భువనేశ్వరుడు. ఆ భానుమండలాన్నే హిరణ్మయ లోకమని, దాని అధిపతిని హిరణ్యగర్భుడని- పురుషరూపి పరమాత్మ, పరమేశ్వరుడు, పరబ్రహ్మ అని వర్ణించడం కనిపిస్తుంది. దీనికే పురుష ఖండమని, కుమార సర్గమని పేరు.

త్రిమూర్తుల లోకాలకు పైన క్షీరసాగరం, దాని పైన గోలోకం తర్వాత ఈ పురుష ఖండం లేదా కుమారసర్గమనే స్థానం ఉంటాయి. అక్కడ ఉండే అతణ్ణే బ్రహ్మ, విశ్వకర్త, భువనస్యగోప్తా అని చెబుతారు.

శౌనకుడు సమిత్పాణుడై గురువు అంగీరసుని సమీపించి అడుగుతాడు-

కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి?

55. ఉపనిషత్తులు – ముండకోపనిషత్తు (Continuation)

శౌనకుని ప్రశ్న “దేనిని తెలుసుకోవడం ద్వారా సమస్తాన్ని తెలుసుకో గలుగుతాము?” ఎంత సూటిగా ఉందంటే ఈ ప్రపంచంలో సమస్త జీవజాలం (మనుష్యులు, క్రిమి కీటకాదులు, పశుపక్ష్యాదులు, చెట్లు చేమలు)ఒకే సూత్రం మీద సృష్టించబడి పెరిగి తిరిగి భూమిలో కలసి పోతున్నాయి.

ప్రతి యొక్క వస్తువుయొక్క రహస్యాన్ని తెలుసు కోవాలంటే మనకున్న ఈ చిన్న జీవితం సరిపోదు.

అంతే కాకుండా ఒక నిర్దిష్టమైన కాలగతిలో జరిగే సృష్టి స్థితి లయాలు ఒకే మూలసూత్రాన్న నుసరించి జరుగుతున్నట్టు అవగతమౌతోంది.

బహుశా దీనికి ఒకే ఒక మూలకారణం ఉంటుంది. అది తెలుసుకోవాలంటే మనం ఏమి చేయాలి. అనే తన సంశయాన్ని
కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ణానం భవతీతి?
గురువు ముందర ఉంచాడు.

అంగిరసుడు శౌనకునితో “ద్వేవిద్యే దితవ్యే” పరావిద్య అపరా విద్య అని తెలుసుకో వలసిన రెండు విద్యలున్నాయి అని బ్రహ్మజ్ఞులు చెబుతారు.

తత్రాపరా, ఋగ్వేదో యజుర్వేదః
సామవేదో థర్వవేదః శిక్షాకల్పో
వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరా, యయా తదక్షర మధిగమ్యతే!!

నాలుగు వేదాలు-,ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అధర్వణ వేదము; ఆరు వేదాంగాలు- శిక్షా (శబ్ధ శాస్త్రము), కల్పము(కర్మ విధులకు సంబంధించిన శాస్త్రము), వ్యాకరణము, నిరుక్తము(వేద అర్ధ నిర్ణయ శాస్త్రము), ఛందస్సు, జ్యోతిషము – వీటినన్నిటిని అపరా విద్యలంటారు.

శాశ్వతము, అమరము అక్షరము అయిన తత్వాన్ని అందించే విద్యే పరా విద్య.

నాశ రహితమైన దానిని చేరేందుకు ఉపయోగపడేది పరా విద్య అని, ఆ అక్షరం చాలా సూక్ష్మమని, బుద్ధితో గ్రాహ్యం కాదని, కనుపించనిది, సర్వ వ్యాపి, సర్వ భూతాల వుత్పత్తి స్థానం అనీ వర్ణించాడు.

ఒక సాలెపురుగు ఎలా తన గూడును తానే అల్లుతుందో, తిరిగి దాన్ని తనలోకే ఉపసంహరించు కొంటుందో; భూమిలోని ఈ ఓషధులన్నీ ఎలా ఉద్భవిస్తున్నాయో, మనిషి తలమీద, శరీరం మీద ఏ ప్రయత్నం లేకుండానే వెంట్రుకలు ఎలా పెరుగు తున్నాయో అదే విధంగా ఆ అక్షర పరబ్రహ్మ నుంచి ఈ సమస్త విశ్వము ఉద్భవిస్తూంది.

తపసా చీయతే బ్రహ్మ తతోన్న మభిజాయతే
అన్నాత్ప్రాణో మనః సత్యం లోకాః కర్మసు చామృతమ్!!

య సర్వజ్ఞః సర్వ విద్యస్య జ్ఞానమయం తపః
తస్మాదేత ద్బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే!!

తపస్సు చేయడం వల్ల బ్రహ్మ జ్ఞానం పెరుగుతుంది. ఆ బ్రహ్మం నుంచి అన్నం పుడుతుంది. అన్నం లోంచి ప్రాణం, మనస్సు, సత్యం, లోకాలు, కర్మ, దాని ద్వారా అమృతత్వం పుడతాయి. ఇక్కడ సత్యం అంటే సత్తు యొక్క ప్రత్యక్షీకరణం (ప్రాణుల ఉత్పత్తి.)

సర్వ విద్యలను, సర్వస్వాన్ని తెలుసుకోవడం ద్వారా అతని తపస్సు జ్ఞానపూర్ణమౌతుంది. అతని నుండే ఈ జీవాత్మ, నామ రూపాలు అన్నం- ఇవన్నీ పుట్టాయి.

ద్వితీయ ఖండం లో యజ్ఞ క్రమాన్ని వివరిస్తూ క్రమాన్ని వదలి చేసే యాగం వల్ల కల్గే అనర్ధాలను వివరించారు. సప్త జిహ్వుడైన అగ్నిహోత్రుడి గురించిన వివరణ ఉంది.

56. ఉపనిషత్తులు – ముండకోపనిషత్తు (Continuation)

ఋషులందరూ వేద మంత్రాలలో ఎలాంటి యజ్ఞకర్మల్ని చూసేరో అవన్నీ కూడా సత్యమే అంటూ ప్రధమ ముండకంలోని ద్వితీయ ఖండం మొదలవుతుంది.

మూడు వేదాలలో చాలా వివరంగా వర్ణించబడిన యజ్ఞకర్మలను విధిగా నిరంతరం ఆచరించమని, పుణ్యలోకాలకు చేరుకొనే మార్గం ఇదే అని వివరించబడింది.

యదా లేలాయతే హ్యర్చి స్సమిద్ధే హవ్యవాహనే, త దాజ్యభాగా
వంతరేణాహుతీః ప్రతి పాదయే చ్చ్రద్దయా హుతమ్!

హోమాగ్ని చక్కగా మండుతూ జ్వాలలు లేస్తూ ఉన్నప్పుడు అగ్నికి రెండు భాగాల నడుమ శ్రద్ధతో ఆహుతులను సమర్పించాలి.

ఈ మంత్రం ఆహుతులను చక్కగా ప్రజ్వలించే జ్వాలలలో ఇవ్వాలి అని చెబుతోంది.

జ్వాల లేకుండా అగ్ని మగ్గుతూ ఉన్నప్పుడు ఆహుతులు ఇవ్వకూడదు. జ్వాల అగ్నికి నాలుక వంటిది. ఆహుతులన్నీ అగ్ని దేవుడి నోటికే అందించినట్లు భావిస్తారు.

ఇక్కడ శ్రద్ధగా అనడంలో క్రమాన్ని వదలి అస్తవ్యస్తంగా చేసే యజ్ఞం వలన కలిగే అనర్ధాలను ఈ కింది మంత్రంలో వివరించారు.

యస్యాగ్ని హోత్రమదర్శ
మపౌర్ణమాస మచాతుర్యాస
మనాగ్రయణ మతిధివర్జితం చ,
అహుత మవైశ్యదేవ మవిధినా
హుత మాసప్తమాం స్తస్యలోకాన్ హినస్తి!!

ఎవరు చేస్తున్న అగ్నిహోత్ర యజ్ఞంలో:
అమావాస్య, పౌర్ణమి, చాతుర్మాస్యం, పంటనూర్పిడి సమయాలలో చేయవలసిన విధులు చేయక పోయినా,
యజ్ఞం చేసే సమయంలో అతిధులు లేకపోయినా,
విశ్వేదేవతలకు ఆహుతులు ఇవ్వకఫోయినా,
పశుపక్ష్యాదులకు తగిన ఆహారం అందించక పోయినా,
శాస్త్ర విరుద్ధకర్మలను ఆచరించినా,

అలాంటి వారు చేసిన అగ్నిహోత్ర యజ్ఞం వారికి( చేసినవారికి) వాళ్ళయొక్క ఏడు తరాల వారి ఉత్తమగతుల్ని నాశనం చేస్తుంది. ఏడు లోకాలలోదేనినీకూడా పొందలేరు. (ఏడు లోకాలు అంటే భూలోకం, భువర్లోకం, స్వర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపో లోకం, సత్యలోకం.)

అగ్నిహోత్రుడు ఏడు నాలుకలతో సప్తజిహ్వుడుగా పేరు పొందేడు.

కాళి, కరాళి, మనోజవా, సులోహితా, సుధూమ్రవర్ణా, స్పులింగినీ, విశ్వ రచీ అనేవి ఏడు నాలుకలు.

వాటిలో మధ్యమజ్వాల యైన సులోహిత నుండే ధూమము(పొగ) వస్తుంది.

దేదీప్యమానంగా జ్వలించే ఈ ఏడు జ్వాలలలో సరయిన సమయంలో ఇచ్చిన ఆహుతులు సూర్యకిరణాలుగా మారి దేవతలకు ప్రభువైన ఇంద్రుని దగ్గరకి తీసుకొనివెడతాయి.

ఎంతో వర్చస్సుతో ప్రకాశించే ఆ యజ్ఞ ఆహుతులు యజ్ఞం చేసిన వాళ్ళని రండి రండి అని ఆహ్వానిస్తూ సూర్యకిరణాల ద్వారా ఊర్ధ్వ లోకాలకు తీసుకొని వెడతాయి.

ఆ యజ్ఞకర్త తో ఎంతో మధురంగా మాట్లటడుతూ అభినందన పూర్వకంగా మీరు మీ పుణ్య కర్మలతో సంపాదించుకొన్న బ్రహ్మ లోకం ఇదే అని చెబుతాయి.

ఇలా పద్దెనిమిది అంగాలతో చేసే యజ్ఞకర్మలు, ఇలా యజ్ఞం చేయడమే జీవిత పరమార్ధం అనుకొని ఆచరించే వాళ్ళు నిస్సందేహంగా జరామృత్యు చక్రం లోపడి తిరుగుతూ ఉంటారు.

అవిద్యయా మన్తరే వర్తమానాః
స్వయం ధీరాః పణ్డితంమన్యమానాః
జజ్ఘ న్యమానాః పరియన్తి మూఢా
అన్ధేనైవ నీయమానా యధాన్ధాః!!

అజ్ఞానమనే సుడిగుండం లో మునిగిన మందబుద్ధులు తామేగొప్ప జ్ఞానులమని అన్నీ తెలిసిన వాళ్ళమని ఆత్మ స్థుతి చేసుకొంటూ ఉంటారు.

వాళ్ళు రోగం, ముసలితనం, మృత్యువు లాంటి దుఃఖాల పరంపరలో మళ్ళీ మళ్ళీ పీడించబడుతూ గుడ్డవాని వెనుక నడిచే గుడ్డివాళ్ళలాగ అనేక జన్మలు ఎత్తుతూ దారితెలియక తిరుగుతూ ఉంటారు.

మంద బుద్ధులైన ఈ అవివేకులు యజ్ఞయాగాది పుణ్యకర్మలు మాత్రమే అన్నింటికన్నా ఉత్తమ మైనవని అనుకొంటారు. వారంతా సకల సుఖభోగాలకీ నిలయమైన స్వర్గాది లోకాలు చేరి తమ పుణ్య ఫలమంతా అనుభవించి, తరిగి హీనమైన లోకాలలో జన్మ ఎత్తుతారు.

శాంత చిత్తులు, పండితులు బిక్షాటన వృత్తిని స్వీకరించి అడవిలో ఏకాంతంగా ఎంతో శ్రద్ధతో తపోజీవితాన్ని గడిపే సత్పురుషులు తమ ఆచరణ ద్వారా పాపాలను నిర్మూలించుకొని సూర్య మార్గం ద్వారా అక్షయం, శాశ్వతం అయిన దివ్య తత్వం ఉండే చోటుకు చేరుకొంటారు. ముక్తిని పొందుతారు.

గురువు బ్రహ్మజ్ఞానియై ఉండాలి. సత్వగుణసంపన్నుడై ఉండాలి.
సదాచారపరుడయి ఉండాలి.
కోపము ఈర్ష్య, అసూయ, దంభం లాంటి దుర్గుణాలు లేనివాడై ఉండాలి.

అలాగే శిష్యుడు కూడా వినయము, గురుభక్తి కలిగి గురువు మీద ప్రగాఢమైన విశ్వాసము కలిగి ఉండాలి.

సద్గుణాలతో మంచి సాధనా సంపదను కలిగి, నిశ్చలమైన మనస్సుతో యధావిధిగా తనను సమీపించిన శిష్యుని గురువు ప్రేమగా చూచుకొంటూ బ్రహ్మవిద్యను సంపూర్ణంగా, సవివరంగా బోధించాలి.

57. ఉపనిషత్తులు – ముండకోపనిషత్తు (Continuation)

ద్వితీయ ముండకం ప్రధమ ఖండం లో

విశ్వ సృష్టికి మూల కారణమైన అక్షరాన్ని అవగాహన చేసుకొన్న వ్యక్తి యొక్క సంశయాలన్నీ పటా పంచలవుతాయనే వివరణ ఉంది.

ఓం తదేత త్సత్యం యధా
సుదీప్తాత్ పావ కాద్విస్పులింగాః
సహస్రశః ప్రభవన్తే సరూపాః తధాక్షరాద్వివిధాః
సోమ్య భావాః ప్రజాయన్తే తత్ర చైవాపి యన్తి!!

ఇదే ఆ సత్యం. ఇదే సత్యస్య సత్యం. గొప్పగా పెద్ద జ్వాలలతో పైకి లేస్తున్న మంటల నుంచి వేలాది నిప్పు రవ్వలు పైకెగసి పడతాయి. జ్వలించే అగ్నికి, ఆ నిప్పు రవ్వలకి ఏమి తేడా లేదుకదా. నిప్పు రవ్వలకు కాంతి ఉంది. ఆ నిప్పు రవ్వ చేతిమీద పడితే కాలుతుంది. అంటే దహన శక్తి లేదా ఉష్ణము ఉంది.

కాబట్టి జ్వలించే అగ్ని, ఈ నిప్పు రవ్వ రెండూ ఒకటే.

అదే విధంగా ఆ నాశరహితుడైన పరబ్రహ్మ నుంచి వివిధ రకాలయిన జీవులు వేలకొలది పుట్టుకొని వస్తాయి.

తిరిగి ఆ పరబ్రహ్మ లోనే లీనమైపోతాయి. ఇక్కడ పరబ్రహ్మ, జీవుడు- రెండూ చైతన్యాలే.

జీవుడు శరీరం అనే ఉపాధిలో ఉన్నప్పుడు కూడా చైతన్య స్వరూపమే.

ఈ చైతన్య రూపమైన ఆత్మను సాక్షాత్కరించు కోవడమే ముక్తి.

ఈ అక్షర రూపాన్ని స్వయం జ్యోతిగా నిరాకారుడుగా, లోపలా బయటా వ్యాపించిన వాడుగా జన్మలేనిది, ప్రాణం మనస్సు లేని వాడుగా, నిర్మలమైనది, పవిత్రమైనది గా అభివర్ణించారు. అదే పరబ్రహ్మ తత్వం.

పరబ్రహ్మతత్వం నుంచే జీవం, మనస్సు, అన్ని ఇంద్రియాలు, గాలి, నిప్పు, సకలానికి ఆధారమైన భూమి అనే పంచ భూతాలు పుట్డాయి.

పరబ్రహ్మ తత్వాన్ని విరాట్ స్వరూపం గా ఊహించుకొంటే:
దేవలోకం శిరస్సు; సూర్యచంద్రులు నేత్రాలు; చెవులు దిక్కులు; నాలుగు వేదాలు తెరిచిన నోరు; గాలి ఆయనకు ఊపిరి; ఈ జగత్తు గుండె. ఈ భూమి ఆయన పాదాలనుంచే పుడుతుంది. ఆ పరబ్రహ్మ తత్వమే సకల జీవులలో ఉన్న ఆత్మ.

ఇదే విషయం భగవద్గీత లోని విశ్వరూప సందర్శనయోగం(11వఅధ్యాయంలో) చాలా వివరంగా వర్ణింపబడింది

ఈ క్రింది మంత్రంలో సర్వ వ్యాపి అయిన ఆ పరబ్రహ్మ నుంచి జీవరాసుల ఆవిర్భావం ఎలా జరుగుతోందనేది వివరింపబడింది.

తస్మదగ్నిః సమిధో యస్య సూర్యః సోమా
త్పర్జన్య ఓషధయః పృథివ్యామ్
పుమాన్ రేతః సించతియోషితాయాం
బహ్వీః ప్రజాః పురుషాత్సం ప్రసూతాః

దీనినే పంచాగ్ని విద్య అంటారు.
ఇదే పునర్జన్మ క్రమంకూడా.

ఆ దివ్య పరబ్రహ్మ తత్వం నుండి సూర్యుడు ఇంధనంగా గల దేవ లోకం పుట్టింది. దీనిని ప్రధమాగ్ని అంటారు.
దేవలోకంలో ఉన్న చంద్రుడి నుంచి వర్షమేఘాలు ఉద్భవించాయి. ఇవి ద్వితీయాగ్ని.
పొఆ మేఘాల ద్వారా కురిసిన వర్షం వల్ల ఓషధులు మొలకెత్తుతాయి. ఇది తృతీయాగ్ని.
ఆ ఓషధులు తినడం ద్వారా పురుషునిలో వీర్యం ఉత్పత్తి అవుతుంది. అదే చతుర్ధగ్ని.
ఈ వీర్యాన్ని స్త్రీ లో వదలడం ద్వారా జీవులు ఆవిర్భవించారు.

పంచాగ్నిఅంటే దేవలోకం, చంద్రుడు, ఓషధులు, పురుషుడు, స్త్రీ అనేవి పంచాగ్నులు.

ఈ రీతిగా సమస్త ప్రజలు, అన్ని జీవరాశులు ఆవిర్భవించాయి.

ఒక మూల తత్వం నుంచి సకల జీవులు ఉత్పన్నమైన క్రమాన్ని వివరించారు. ఆ పర తత్వం నుంచి స్వర్గాది లోకాలు ఉద్భవించాయి. అక్కడ ఉన్న చంద్రుడి వల్ల మబ్బులు ఏర్పడ్డాయి. అవి కురిసిన వానవలన భూమిపై చెట్లూ మొక్కలు మొలిచాయి.

మానవులు కర్మలు చేసి దేహ త్యాగం చేసేక, చేసిన కర్మలను అనుభవించి పుణ్యకర్మ క్షయం అయిన తర్వాత వర్షం ద్వారా భూపతనం చెంది ఓషధులుగా మొలకెత్తుతారు. అవి పురుషులు తిన్నప్పుడు వారిలో రేతస్సుగా మారి స్త్రీ సంగమం ద్వారా శుక్ల శోణితాలు కలిసి పునర్జన్మను పొందుతారు. దీనినే పంచాగ్ని విద్య అంటారు.

ఈ రోజు ఒకే విషయం రెండుమూడు సార్లు పునరావృత్తమయ్యింది. శ్రద్ధగా చదివి అర్ధం చేసుకోమని మనవి.

అంగిరసుడు బ్రహ్మానికి జ్ఞానేంద్రియాలు, కర్మేద్రియాలు లేవని చెప్పాడు. మరి ఏ ఇంద్రియాలు లేకుండా సృష్టినెలాచేసిందీ బ్రహ్మం?

సాలెపురుగు నుండి దారం ఎలా వస్తూంది, మళ్ళీ ఆ దారం ఎలా సాలెపురుగు లోపలికే వెళ్ళిపోతోంది – ఈ క్రియ ఇంద్రియ ప్రమేయం లేకుండా దానంతట అదే జరుగు తున్నట్లుగా బ్రహ్మం యొక్క ఇచ్ఛామాత్రం చేతనే సృష్టి జరుగుతుంది.

తస్మాదృచః సామ యజూంషి దీక్షా యజ్ఞాశ్చ సర్వే క్రతవో దక్షిణాశ్చ
సంవత్సరశ్చ యజమానశ్చ లోకాః సోమోయత్ర పవతే యత్ర సూర్యః!!

ఆ దివ్య పరబ్రహ్మ తత్వం (అక్షర పరబ్రహ్మ) నుంచి వేద ఋక్కులు, సామవేద గానాలు, యజ్ఞ విధులు, వ్రతదీక్షలు, పుణ్య క్రతువులు, దక్షిణలు, కాలం(సంవత్సరం, మాసం, వారం…) యజ్ఞ కర్త, సూర్యచంద్రులు పవిత్రం చేసే అన్ని లోకాలు ఆవిర్భవించాయి.

ఆ పరబ్రహ్మం నుంచే వివిధ లోకాలలో ఉన్న దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మానవులు, జంతువులు, పక్షులు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, వరి యువ వంటి ఆహార ధాన్యాలు, తపస్సు, బ్రహ్మ చర్యం, శ్రద్ధ, విధి నిషేధాలు వంటివి పుట్టాయి.

సప్త ప్రాణాః ప్రభవన్తి తస్మాత్ సప్తార్చిషః సమిధః సప్త హోమాః
సప్త ఇమే లోకే యేషు చరన్తి ప్రాణా గుహాశయా నిహితాః సప్తసప్త!!

ఆ పరతత్వం నుంచి ఏడు ప్రాణాలు, ఏడు జ్వాలలు, ఏడు సమిధలు, ఏడు హోమాలు, తన హృదయగుహ లో ప్రాణంలా సంచరించే ఏడు లోకాలూ ఆవిర్భవించాయి. ఇలా ఏడు ఏడుసంఖ్యలో ఉండేలా పరబ్రహ్మ సృష్టించాడు.

ఆ పరమాత్మ నుంచే అన్ని సముద్రాలు, పర్వతాలు ఆవిర్భవిస్తాయి. అన్ని నదులూ ఆయననుంచే ప్రవహిస్తాయి. ఏ మూలికలు, రసాలు చేత పంచ భూతాత్మకమయిన సూక్ష్మ శరీరం పోషించబడి ఉంటుందో, ఆ పోషించే మూలికలు రసాలు కూడా పరమాత్మ నుంచే ఆవిర్భవించాయి.

పురుష ఏ వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతమ్
ఏతద్యోవేద నిహితం గుహాయాం సో విద్యాగ్రన్ధిం వికిరతీహ సోమ్య

ఈ విశ్వం, తపస్సు, యజ్ఞకర్మలు, అన్నీ ఆ పురుషుడే. అమృతమైన ఆ పరబ్రహ్మమే ఈ సమస్తంలో ఉన్నది. ఎవరైతే సర్వ శ్రేష్ఠమైన పరబ్రహ్మం తన హృదయమనే గుహలో నివసిస్తున్నాడని తెలుసుకొంటాడో అతడు ఈ లోకంలోనే అవిద్య అనే గ్రంధిని తెంచుకొని ఈ జన్మలోనే ముక్తిని పొందుతాడు.

ఈ చరాచర ప్రపంచానికంతా ఆ విరాట్ పురుషుడే కారణ భూతుడని తెలుసుకొన్న వాళ్ళకు ముక్తి తధ్యం.

ఈ విరాట్ పురుషుని వర్ణన పఠించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని అందరు భగవద్గీతలో ని పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం పారాయణ చేస్తారు.

58. ఉపనిషత్తులు – ముండకోపనిషత్తు (Continuation)

ద్వితీయ ముండకే ద్వితీయ ఖండః:
దేనిని తెలుసుకొంటే సర్వస్వాన్ని తెలుసుకో గలుగుతాము అని శౌనకుడు వేసిన ప్రశ్నకు ఆ బ్రహ్మవిద్యను ఉపదేశించడమే ఈ ఉపనిషత్తు యొక్క లక్ష్యము.

ఈ సృష్డిలో ఉన్నదంతా బ్రహ్మమే, అది విశ్వవ్యాప్తం, అద్వితీయం, ఇంద్రియములకు అగ్రాహ్యం అని వివరించబడింది.

అన్ని అనుభవాలలోను ప్రత్యక్షమయ్యేది, స్వయం జ్యోతి స్వరూపం, అత్యంత ప్రకాశవంతమైనది అత్యంత సమీపంలో ఉన్నది, హృదయ కుహరంలో సంచరించేది అయిన ఈ బ్రహ్మమే అన్నింటికి ఆశ్రయం. ఆ బ్రహ్మమే ప్రాణం, వాక్కు, మనస్సు, సద్వస్తువు, అమరత్వం కూడాను.

ధ్యానం యొక్క ప్రాశశ్త్యాన్ని వివరిస్తున్నారు.

ఉపనిషత్తులు అందించే మహాస్త్రాన్ని ధనుస్సుగా తీసుకొ. నియమానుసారం నిత్యం చేసే ఉపాసన వల్ల తీక్ష్ణమైన బాణాన్ని ఎక్కుబెట్టు. ఎటూ చెదరకుండా బ్రహ్మచింతనలోనే కేంద్రీకృతమైన మనస్సు చేత వింటినారిని చెవి దాకా లాగు. నాశనం లేని బ్రహ్మమే లక్ష్యం. ఆబ్రహ్మాన్ని భేదించు. అంటూ ఆవిల్లూ, బాణం ఏవో ఇక్కడ వివరిస్తున్నాడు.

ప్రణవో ధనుః శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్

ప్రణవము అంటే ప్రాణాపాన గతాగతిలో పైకి కిందకు సంచరించే ఝేంకార శబ్దమును ధనుస్సు గాను, మనస్సు(మనో నిష్ఠ)ను బాణము గాను చేసుకొని బ్రహ్మ స్థానమును గురిగా చెసుకొని అప్రమత్తుడై వింటినుండి విడువబడిన బాణము విచలితము గాక గురి వైపు సాగునట్లు ప్రాణునితో కూడిన మనస్సు బ్రహ్మ స్థానం వైపు సాగనివ్వాలి.

యస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షమోతం
మనః సహ ప్రాణైశ్చ సర్వైః
తమే వైకం జానథ ఆత్మానమన్యా
వాచో విముఞ్చథామృతస్యైష సేతుః

ఇక్కడ తెలుసుకోవలసినది ఆత్మనే. అది ద్యులోకము(స్వర్గలోకము), పృథ్విల మథ్య మనస్సు ప్రాణునితో కూడి వ్యాప్తమై సర్వమును తెలియజేయును. ప్రాణ మనోమిలనము అయిన తర్వాతనే ఆ ఆత్మ జ్ఞానము సాథ్యము. మనో చాంచల్యాన్ని నిర్మూలించగల ప్రాణమే అమృతత్వమునకు సహాయకారి. ఇది కాకుండా మరి ఏ ఇతర మార్గము ద్వారా ఆత్మజ్ఞానము దొరకదు. ఆత్మ జ్ఞానము కానిదే అమృతత్వము సాథ్యము కాదు.

అరా ఇవ రథనాభౌ సంహతా యత్ర నాడ్యః
స ఏషోన్తశ్చరతే బహుదాజాయ మానః
ఓమిత్యేవం ధ్యాయథ ఆత్మానం
స్వస్తి వః పారాయ తమసః పరస్తాత్!!

రథ చక్రము యొక్క ఇరుసునందు ఆకులన్నీ ఒకటిగా చేరి ఉండునట్లు దేహములోని సమస్త నాడులు కలిసే కేంద్రంము వైపు ప్రాణుడు పై గతిలో సంచరి స్తున్నపుడు ఎన్నో విషయాలు అర్ధం అవుతాయి. శరీరాన్ని అదుపులో పెట్టేదే ప్రాణుడు. ఆ ప్రాణుని యొక్క కేంద్రం మెదడులో ఉండే బ్రహ్మపురి. ఈ విజ్ఞానాన్ని తెలుసు కొన్నవాళ్ళు ఆత్మానందాన్ని అనుభవించి అంధకారాన్ని దాటి అమృతత్వాన్ని పొందుతారు.

యః సర్వజ్ఞః సర్వవిద్యస్యైష మహిమాభువిః
దివ్యే బ్రహ్మపురే హ్యేషవ్యోమ్న్యాత్మా ప్రతిష్డితః

ఈ ఆత్మయే సర్వజ్ఞుడు. సర్వ విద్యా పారంగతుడు. మహిమాన్వితుడు. అట్టి ఆత్మ భూమిపై ఉన్నా కూడా దాని మూలము దివ్యమైన బ్రహ్మపురియే అయి ఉంది.

మనో మయః ప్రాణ శరీరనియతా
ప్రతిష్టితోన్నే హృదయం సన్నిధాయ
తద్వజ్ఞానేన పరిపశ్యన్తి ధీరాః
ఆనందరూప మమృతం యద్విభాతి

ఈ ఆత్మ మనోమయమై, ప్రాణుని, శరీరమును నియంత్రించు కొనుచూ, బ్రహ్మ పురిలో ప్రతిష్ఠితమై ఉంది. ఈ ఆత్మ విజ్ఞానాన్ని ఏ ధీరులు సమగ్రముగా, అనుభవపూర్వకంగా తెలుసుకొంటారో అటువంటి వారికి ఆనంద రూపమైన అమృతత్వము ప్రాప్తిస్తుంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ముండకోపనిషత్తులోని ప్రతి చిన్నమంత్రం అతి ముఖ్యమైన సందేశాన్నిచ్చేదే.

ఎంతో నిగూఢమైన ఆత్మ తత్వాన్ని అతి సరళమైన మాటలలో పొందుపరచి సమస్త మానవాళి ఆత్మ సందర్శనానికి అర్హులే అంటూ ఆ విధానాన్ని మనముందు ఉంచారు.

భిద్యతే హృదయగ్రంథిః ఛిద్యంతే సర్వ సంశయాః
క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే!!

ఆ పరాత్పరుడైన దేవదేవుని దర్శనంతో, ఆత్మ సాక్షాత్కారంతో, అతని హృదయ గ్రంథులు విడివడి సర్వ సంశయాలు(చీల్చివేయబడతాయి) నాశనమై అన్ని కర్మలు క్షయించిపోతాయి.

ఇక్కడ హృదయగ్రంధి అంటే అజ్ఞానవశాత్తు బుద్ధికి పట్టి ఉండే కోరికలు, సంస్కారాలు- గ్రంధి అంటే ముడి అని అర్ధం. అంటే హృదయం కామనా రహితంగా అవుతుంది. కోరికలు పోయి, అక్షర పరబ్రహ్మాన్ని గురించిన అనేక సంశయాలు పటాపంచలై కర్మ రాహిత్యం పొందడం వల్ల జన్మరాహిత్యం కలిగి మోక్షం సిద్ధిస్తుంది.

క్షీయంతే చాస్య కర్మాణి- మూడు రకాల కర్మలు- ప్రారబ్ధకర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ;

గతించిన జన్మలలో చేసిన కర్మలు, ఈ జన్మ లో చేసిన కర్మలు ఈ జన్మలో ఫలిస్తోంటే వాటికి ప్రారబ్ధకర్మలని పేరు.

మరుసటి జన్మలో(వచ్చే జన్మలో) ఫలించనున్న వాటికి సంచిత కర్మలని పేరు.

ఈ జన్మ లో చేస్తున్న, చేయబోయే కర్మలన్నీ ఆగామి కర్మలు అంటారు.

వాటిని ఈ జన్మ లోనే అనుభవించవచ్చు. ఈ జన్మ లో అనుభవిస్తే వాటిని ప్రారబ్ద కర్మలు అంటారు.

అనుభవించని పక్షంలో వచ్చే జన్మకు సంచిత కర్మలుగా బదిలీ అవుతాయి.

ఆత్మ సాక్షాత్కారం తర్వాత సంచిత ఆగామి కర్మలే నశిస్తాయి. ప్రారబ్ద కర్మ మాత్రం మిగిలే ఉంటుంది.

ముక్తపురుషుని ప్రస్తుత జీవితంలో ప్రారబ్ద కర్మ అనుభవించి తన జీవితం చాలిస్తాడు.

హిరణ్మయే పరేకోశే విరజం బ్రహ్మ నిష్కలం
తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిః తద్ యదాత్మవిదో విదుః!!

కళాతీతుడైన, శ్రేష్టుడైన ఆ బ్రహ్మ( దైవం) స్వర్ణ వర్ణ ప్రకాశకోశంలో నిగుఢంగా ఉన్నాడు. అతడే అన్ని ప్రకాశ మండలాలకు ప్రకాశాన్ని అందించే పరమజ్యోతి. ఆత్మజ్ఞానులు అతనిని తెలుసుకొంటారు.

నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతో యమగ్నిః
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్యభాసా సర్వమిదం విభాతి!!

(ఈ మంత్రం కఠోపనిషత్తులోను, శ్వేతాశ్వతరోపనిషత్తులోనూ కూడా వస్తుంది.)

అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రతారకలు వెలుతురు నీయవు. మెరుపులు కాంతినీయవు. ఇంక అగ్ని మాట చెప్పడమెందుకు. ఆ ఆత్మ తేజస్సును ప్రతిఫలిస్తూ సర్వమూ కాంతులీనుతూ ఉంటుంది. ఈ యావద్విశ్వమూ ఆ ఆత్మ జ్యోతివల్లనే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.

బ్రహ్మైవేదమమృతం పురస్తాద్ బ్రహ్మ
పశ్చాద్ బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ
అధశ్చోర్ధ్వం చ ప్రసృతం
బ్రహ్మైవేదం విశ్వముదం వరిష్ఠమ్!”

అంగిరస మహర్షి అంటున్నాడు ” నిజంగా ఇదంతా శాశ్వతమైన బ్రహ్మమే. కింద, పైన, ఈపక్క, ఆపక్క, ముందు వెనుక సర్వత్రా ఆ బ్రహ్మం విరాజమానమై ఉంది. చెప్పాలంటే ఈ యావద్విశ్వం సర్వోత్కృష్టమైన ఆ బ్రహ్మమే.

59. ఉపనిషత్తులు – ముండకోపనిషత్తు (Continuation)

తృతీయ ముండకే ప్రధమ ఖండః

అంగీరసుడు మోక్షం ప్రాప్తికై చేయవలసిన సాధనా క్రమాన్ని చెబుతున్నాడు.

ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్వ
నశ్నన్నన్యో అభిచాకశీతి!!

ప్రాణ స్నేహితులై ఎంతో అన్యోన్యంగా ఎప్పుడూ కలసి ఉండే రెండు పక్షులు ఒకే చెట్టుపైన కూర్చొని ఉన్నాయి.
వాటిలో ఒకటి రుచి గల ఆ చెట్టు పండ్లను ఆసక్తితో తింటూంది. మరొకటి ఏమీ తినకుండా నిర్లిప్తంగా చూస్తోంది.

దీనిలో ఒక తాత్విక వివరణ కనబడుతుంది.

ఇందులో ఒక పక్షి జీవాత్మ. మరొకటి పరమాత్మ.

ఇక్కడ శరీరాన్ని చెట్టుతో పోల్చేరు. ఒక పక్షి పండు తింటూంది అంటే జీవాత్మ తన కర్మ ఫలాన్ని అనుభవిస్తూంది అని అర్ధం. మరొక పక్షి కేవలం నిర్లిప్తంగా చూస్తూంది అంటే పరమాత్మకు కర్మ చేయడం కాని, దాని ఫలితం అనుభ వించడం గాని ఉండవు అని భావము.

సమానే వృక్షే పురుషో నిమగ్నీ
నీశయా శోచతి ముహ్యమానః
జుష్టం యదా పశ్యత్యన్యమీశ
మస్య మహిమానమితి వీత శోకః!!

ఒకే చెట్టు మీద కూర్చొన్న ఆ రెండింటిలో ఒక్టి జీవత్మ. అజ్ఞానంలో, భ్రమలో మునిగి తన దౌర్బల్యానికి దుఃఖిస్తూంది. కానీ ఆరాధనీయమైన పరమాత్మను చూడగానే దాని దుఃఖమంతా తరిగి పోతూంది. ఆయన కేవలం సాక్షి మాత్రమే.

రెండూ ఒకే చెట్టు మీద ఉన్నాయంటే ఒకే శరీరంలో ఉన్నాయని అర్ధం.

ఈ మంత్రంలో జీవాత్మ పరమాత్మలను రెండు పక్షులుగా విడివిడిగా చెప్పడం వల్ల జీవాత్మ పరమాత్మలు వేరే వేరేనని విశిష్ఠాద్వైతులు ద్వైతులూ వివరిస్తారు. అద్వైతులు జీవాత్మ లింగ శరీరం ఉపాధిగా ఉన్నంత కాలం తన స్వ స్వరూపం తెలుసుకోలేక తాను పరమాత్మ కన్నావేరని అనుకొంటాడు. అదే అవిద్య. ఆ అవిద్య తొలగిన తర్వాత అంతా పరమాత్మే అనే జ్ఞానంకలుగుతుందని అంటారు.

జీవుడు శరీరంలో ఉంటూ, కర్మలు చేస్తూ కర్మ ఫలాల ననుభవిస్తూ, ఏం చేయాలో తెలియని అజ్ఞాన స్థితిలో జ్ఞాని అయిన గురువు ద్వారా తన స్వస్వరూపాన్ని తెలుసుకొని భవబంధాల నుండి విముక్తిని పొందుతాడు. బ్రహ్మజ్ఞానం వల్ల పాప పుణ్యాల క్షయంజరిగి జీవన్ముక్తు డవ్వాలంటే సాధన అవసరం.

ఆత్మ నిగ్రహం గల సన్యాసులు తమలో పాప కల్మషం లేశమైనా లేకుండా చేసుకొని జ్యోతిర్మయం పరిశుద్ధం అయిన ఆత్మను సాక్షాత్క రించుకొంటారు.

సత్యం తపస్సు, ధ్యానం, జ్ఞానం బ్రహ్మచర్యం చక్కగా నిరంతరాయంగా అభ్యసించడం వల్ల ఆ ఆత్మ ఈ శరీరంలోనే లభ్యమౌతుందికదా.

ఆత్మను సాక్షాత్కరించు కొన్నవాడు వట్టి మాటలు వల్లించే పగటి వేషగాడు కాకుండా, నిజమైన విద్వాంసుడౌతాడు.

అతడు నిత్యం ఆత్మయందే విహరిస్తూ, ఆత్మయందే ఆనందిస్తూ పుణ్య కర్మలను చేస్తూ బ్రహ్మ జ్ఞానులలో అగ్రగణ్యుడిగా ఉంటాడు.

ఆత్మావలోకనానికి సత్శీలం ముఖ్యం. శీలంలో ప్రధానాంశం సత్యసంధత.

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పంధా వితతో దేవయానః
యేనాక్రమన్తి ఋషయో హ్యాప్తకామా
యత్ర తత్ సత్యస్య పరమం నిధానమ్

సత్య నిష్ఠులే గెలుస్తారు. అసత్య వాదులు నెగ్గరు.

పరమార్ధ తత్వం అవగత మవ్వాలంటే సత్య సంధతని వ్రతంగా స్వీకరించాల్సిందే.

ఏ విషయాసక్తి లేని యోగులు, ఋషులు తమ తమ సత్యవ్రత ప్రభావం వల్ల దేవమార్గంలో ప్రయాణించి సత్యలోకంలో పరమాత్మను దర్శించుకొంటారు.

జీవులు సత్యవ్రతం ద్వారా మాత్రమే పరమాత్మను చేరగలరని చెబుతోందీ మంత్రం.

స్వస్వరూపజ్ఞానాన్ని పొందిన జ్ఞాని పరమాత్మను గురించి తప్ప ఇంకే విషయాన్ని ప్రస్తావించడు, ఆలోచించడు.

ఆత్మరతః ఆత్మ క్రీడః క్రియావానేష
బ్రహ్మవిదాం వరిష్ఠః

ఆత్మ యొక్క సహజ స్థితి అయిన ఆనందానుభావాన్ని పొందుతూ తనలో తాను క్రీడిస్తూ( జ్ఞాన వికాశాన్ని పొందుతూ) లోక కల్యాణం గురించి కర్మలను చేసే వ్యక్తి బ్రహ్మజ్ఞానుల్లో శ్రేష్ఠుడు. అతడే యోగి అనబడతాడు.

ఎల్లప్పుడూ పరమాత్మయందే మనస్సు లగ్నం చేసుకొని ఆనందిస్తూ ఉంటాడు. అదే బ్రహ్మానందం.

అలాంటివాడే ఉత్తముడు, బ్రహ్మవేత్త, నిజమైన తత్వ వేత్త.

సత్యమే జయిస్తుందంటూ సత్యమార్గం ద్వారా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెబుతూ అంగిరసుడు ఇంకా ఈ విధంగా అంటున్నారు.

బృహచ్చ తద్దివ్యమచిన్త్య రూపం
సూక్ష్మాచ్చ తత్సూక్ష్మతరం విభాతి
దూరాత్సుదూరే తదిహాన్తికే
పశ్యత్స్విహైవ నిహితం గుహాయామ్!!

పరమాత్మ జ్యోతి స్వరూపంగా, అపరిమితంగా, ఊహాతీతంగా ప్రకాశిస్తుంది.

అది సూక్ష్మం కన్నా సూక్ష్మంగా ఉంటుంది. దూరమైన దానికన్నా ఎక్కువ దూరంలో ఉంటుంది.

ఆ పరమాత్మ ఇక్కడే ఈ శరీరంలోనే ఉన్నాడు.

ఋషులైన వారు తమ హృదయంలో ఉన్న ఆపరమాత్మను ఈ జన్మలోనే దర్శిస్తారు.

దివ్యమైన ఆ ఆత్మను మాటలతో వర్ణించలేము.

దాన్ని కళ్ళు చూడలేవు. ఇంద్రియాలు ఏమాత్రం గ్రహించలేవు. సత్కర్మలతో దాన్ని తెలుసు కోలేము.

జీవుడు ప్రశాంతమైన, పరిశుద్ధమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం, మనస్సు, శరీరం అన్నీ శుద్ధిఅవుతాయి.

ఆ సమయంలో ధ్యాన నిమగ్నుడైన వాడు తప్పక ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు.

ఏషోణురాత్మా చేతసా వేదితవ్యో
యస్మిన్ ప్రాణః పఞ్చధా సంవేశ
ఫ్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం
యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా!!

ప్రాణం ఐదు రూపాలుగా వ్యాపించి ఉన్న శరీరంలో, సూక్ష్మంగా వున్న ఆత్మ తత్వాన్ని మనసు ద్వారా తెలుసుకోవాలి

మనిషియొక్క మనస్సుని ఇంద్రియాలు దట్టంగా ఆవహించి ప్రభావితం చేస్తూ ఉంటాయి. శరీరం స్థూలం గనుక ఇంద్రియగోచరం.

ఇంద్రియ నిగ్రహంద్వారా అతడి మనస్సు స్వచ్ఛము, పవిత్రము అవగానే ఆ మనస్సులోనే ఆత్మ ప్రకటితమౌతుంది.

ఆత్మావలోకనం చేసుకోవాలంటే హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.

అద్దం మీద మాలిన్యాన్ని తొలగిస్తే ప్రతిబింబం స్పష్టంగా కనిపించినట్లే శరీరంలోని(మానసిక) మాలిన్యాన్ని తొలగిస్తే ఆత్మ కూడా ప్రకాశమవుతుంది.

యం యం లోకం మనసా సంవిభాతి
విశుద్ధ సత్త్వః కామయతే యాంశ్చ కామాన్
తం తం లోకే జయతే తాంశ్చ కామాం
స్తస్మా దాత్మజ్ఞం హ్యర్చయేద్ భూతికామః

మనస్సును పరిశుద్ధం చేసుకొన్న ఆత్మవేత్త ఏ ఏ లోకాలు కావాలని కోరుకొంటాడో ఆయా లోకాలను పొందుతాడు.

అతను ఏ ఏ కోరికలు కోరుకొన్నా అవన్నీ అతడికి వెంటనే సిద్ధిస్తాయి.

కనుక ఈ లోకంలో ఎవరు సంపదలు కావాలని కోరుకొంటారో వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన మహాత్ములను ఆరాధించాలి.

ఆత్మ సందర్శన మార్గాన్ని వివిధ రీతుల్లో వివరించారు.

మనోనిర్మలత్వము, ఇంద్రియ నిగ్రహము వాటి ఆవశ్యకతలను నొక్కి వక్కాణించారు.

60. ఉపనిషత్తులు – ముండకోపనిషత్తు (Continuation)

తృతీయ ముండకే ద్వితీయ ఖండః

ముండకోపనిషత్తుకి ముగింపు వాక్యాలలో-

ఎవరికి బ్రహ్మ విద్యోపదేశం చేయొచ్చు,
బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడు,
ఎలాంటి వారికి బ్రహ్మజ్ఞానం ఒంటబట్టదు

అనే విషయాలను రకరకాలుగా ఎన్నో సార్లు తిరిగి తిరిగి జ్ఞాపకం ఉండేట్లుగా చెప్పేరు.

నిజంగా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొన్నవాడు దివ్యంగా ప్రకాశించేది, సకల సృష్టి కి ఆధారమైనది అయిన పరబ్రహ్మాన్ని తెలుసుకొంటాడు. అటువంటి ఆత్మజ్ఞానిని ఎలాంటి కోరికలు కోరకుండా నిష్కామంగా శ్రద్ధతో సేవించేవారు పునర్జన్మ బాధను తొలగించు కొంటారు.

ఇంతకు ముందు సంపదల నాశించి(సకామంగా) బ్రహ్మజ్ఞానిని సేవిస్తే సంపదలు దొరుకుతాయి. అని చెప్పేరు.

ఇప్పుడు అదే నిష్కామంగా శ్రద్ధతో సేవించేవారు పునర్జన్మ నుండి విముక్తులౌతారు. అని చెబుతున్నారు.

అమాన్యః కామయతే మన్యమానః
స కామభి ర్జాయతే తత్ర తత్ర
పర్యప్తకామస్య కృతాత్మనస్తు
ఇహైవ సర్వే ప్రవిలీయన్తి కామాః!!

ఎవరైతే ఇంద్రియ సుఖాలను మాటి మాటికి తలచుకొంటూ, వాటికోసం ఆరాట పడతారో అట్టివాళ్ళు ఆ కోరికలు తీరడానికి ఆయాప్రదేశాలలో తిరిగి మళ్ళీ జన్మలెత్తుతారు.

కానీ ఎవరైతే ఆత్మ తత్వాన్ని తెలుసుకొని అన్ని కోరికలనూ ఆత్మ లోనే లయం చేస్తారో అలాంటి వారి కోరికలు ఇక్కడే నశించిపోతాయి.

ఉపన్యాసాలతో కాని, శాస్త్రాధ్యయనంతో కాని ఆత్మసాక్షాత్కారం సాధ్యం కాదు. అలాగే బలహీనులకి, శాస్త్ర విరుద్ధంగా తపస్సు చేసే వారికి ఆత్మ దర్శనం దుర్లభం అంటూన్నాయి ఈ క్రింది రెండు మంత్రాలు;

నాయమాత్మా ప్రవచనేనలభ్యో
న మేధయా న బహూనా శ్రుతేన
యమేవైష వృణుతే తేన లభ్య స్తస్యైష
ఆత్మా వివృణుతే తనూంస్వామ్!!

ఈ ఆత్మను ప్రవచనం ద్వారా, మేధస్సుద్వారా, పాండిత్యం ద్వారా పొందలేము.

ఆ ఆత్మ కోసం హృదయపూర్వకంగా ఆరాటపడిన వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది.

ఆత్మ ఎవరినైతే వరిస్తుందో అతనికి మాత్రమే లభ్యమౌతుంది.

అలాంటి వ్యక్తికి మాత్రమే ఆత్మ తన వివరాలనన్నింటినీ అందిస్తుంది.

నయమాత్మా బలహీనేన లభ్యో
న చ ప్రమాదా త్తపసో వాప్యలింగాత్
ఏతై రూపాయై ర్యతతే యస్తు
స్తస్యైష ఆత్మా విశతే బ్రహ్మదామ!!

మనోబలం లేనివారికి, బలహీనులకి, అజాగ్రత్తగా ఉండే వారికి, శాస్త్ర విరుద్ధంగా తపస్సు చేసే వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగదు.

ఎవరైతే దృఢంగా శ్రద్ధాభక్తులతో మనః పూర్వకంగా ఆత్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడో అలాంటివాడి ఆత్మే పరబ్రహ్మలో ఐక్యమౌతుంది.

సంప్రాప్యైన మృషయో జ్ఞాన తృప్తాః
కృతాత్మానో వీతరాగాః ప్రశాన్తా
తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరా
యుక్తాత్మనః సర్వమేవా విశన్తి!!

జ్ఞాన ప్రాప్తిఅయిన ఋషులు తృప్తులు, శుద్ధులు, మోహరహితులు, ప్రశాంతచిత్తులై పరబ్రహ్మ సామీప్యాన్నిఅన్ని చోట్ల అనుభవిస్తారు.

భగవంతుని దర్శనానందం సర్వత్రా అనుభవిస్తూ యోగ్యులై అందరి కల్యాణం కోసం శ్రమిస్తారు.

వైరాగ్యమయమైన జీవనం గడుపుతూ నిరంతరాభ్యాసం ద్వారా పవిత్ర స్వభావులై వేదవేదాంతాలు నిశ్చయించిన ఆ పరమాత్మ యందే సుస్థిరులైన సాధకులు సాక్షాత్కార సమయంలో మోక్షాన్ని పొంది బ్రహ్మీభూతులౌతారు.

ప్రశ్నోపనిషత్తులో చెప్పినట్లుగా మోక్షాన్ని పొందే సమయంలో ఆ పదిహేను కళలు వాటి వాటి స్థానాల్లో చేరిపోయి వాటి వాటి అధి దేవతలలో లీనమైపోతాయి

ప్రవహించే నదులన్నీ వాటి పేర్లని ఆకారాల్ని కోల్పోయి సముద్రంలో ఎలా ఏకమైపోతాయో అలాగే ఆత్మజ్ఞాని యైనవాడు కూడా తన నామ రూపాలనుంచి ముక్తుడై సర్వోత్కృష్టము దేదీప్యమానము అయిన ఆ పరబ్రహ్మ తత్వంలో లీనమైపోతాడు.

పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొన్న ప్రతీవాడు పరబ్రహ్మే అవుతాడు.

అతని వంశంలో బ్రహ్మజ్ఞానం లేనివాడు జన్మించడు.

బ్రహ్మజ్ఞాన ప్రాప్తి వల్ల అతడు తన హృదయంలో ఉన్న అజ్ఞాన గ్రంధులను తెంచుకొని, శోకాలనుంచి, పాపాలనుంచి విముక్తుడై అమృత స్వరూపుడౌతున్నాడు.

ఈ బ్రహ్మ విద్యను కర్మ నిరతులకు, వేదవేదాంగ పారంగతులకు, బ్రహ్మ విద్య తెలుసుకోవాలనుకొనే జిజ్ఞాసువులకు, ఏకర్షి అనే అగ్నికి ఆహుతు లిచ్చేవారికి, శాస్త్రబద్ధంగా శిరోవ్రతాన్ని అనుష్ఠించే వారికి మాత్రమే ఉపదేశించాలి అని ఈ ఉపనిషత్తు ఘోషిస్తూంది.

ఓ మహర్షులారా మీకు నమస్కారం.

అచీర్ణవ్రతః ఏతత్ న అధీతే – అంటూ

“ఎలాంటి వ్రతాన్ని ఆచరించని వాడు ఈ ఉపనిషత్తు అధ్యనం చేయకూడదు” అని అంగిరసుడు చెబుతూ ముండకోపనిషత్తు ను ముగించాడు.

ఈ విధంగా అధ్యయనానికే ఆంక్ష విధించాడు.

అందుకని ప్రతి ఒక్కరూ సద్గురువుని ఆశ్రయించండి. సాధనచతుష్టయాన్ని ఆచరించి వ్రత నిష్ఠతో ఉపనిషద్పఠనం చేసి, సాధన చేసి అసాధ్య మనుకొనే బ్రహ్మతత్వాన్ని (సుసాధ్యం) ప్రత్యక్షపరచుకోండి.

61. ఉపనిషత్తులు – ఐతరేయోపనిషత్తు (Continuation)

ఇప్పటి వరకూ మనం ఈశావాశ్య, కఠ, కేన, మాండూక్య, ప్రశ్న, ముండకోపనిషత్తులు ముగించుకొని ఐతరేయ ఉపనిషత్తులో అడుగు పెడుతున్నాము.

ఋగ్వేదాంతర్గతమైనదీ ఉపనిషత్తు. ఋగ్వేదంలోని రెండవ ఆరణ్యకంలో కర్మకాండకు సంబంధించిన భాగాలను వదలి, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన నాల్గు, ఐదు, ఆరు అధ్యాయాలు ఐతరేయోపనిషత్తు గా చెప్పబడింది.

ఈ బ్రాహ్మణానికి ద్రష్ఠ మహీపాల ఐతరేయుడు. అతని తండ్రి బ్రాహ్మణుడు.

తల్లి ఇతర అంటే ఇతర (కుమ్మరి) కులానికి చెందినది.

తండ్రి యజ్ఞం చేస్తున్నప్పుడు ఐదేళ్ళ మహీపాలుడు తండ్రి ఒడిలో కూర్చోబోతే అతని మిగిలిన భార్యలు అడ్డు కొన్నారుట.

కారణం అతని తల్లి బ్రాహ్మణ కులానికి చెందకపోవడం.

మహీపాలుని తల్లి తన ఇష్టదేవత భూదేవిని ప్రార్ధించగా ఆమె ప్రత్యక్షమై మహీపాలుణ్ణి బ్రహ్మ జ్ఞానిగా చేసి ఆశీర్వదించింది అని చెబుతారు.

ఆ మహీపాలుడే ఇతరకు పుట్టినవాడవడం వల్ల ఐతరేయుడయ్యాడు. ఈ ఉపనిషత్తుకు ఐతరేయ ఆరణ్యకంగా ప్రసిద్ధి గాంచింది.

పునర్జన్మ రహిత శాశ్వత పరమపదాన్ని చేర్చే ఆత్మ జ్ఞానం యొక్క వివరణ రెండవ ఆరణ్యకం లోని నాల్గు, ఐదు, ఆరు అధ్యాయాలలో గల అయిదు ఖండాలలో ఉంది.

ఈ అయిదు, శాంతి పాఠంతో కలిపి ఆత్మషట్కం అని ఆదిశంకరులు అన్నారు.

ఈ ఉపనిషత్తులో సృష్టిక్రమాన్ని గూర్చి వివరంగా చెప్పేరు.

ఈ ఉపనిషత్తులో “ప్రజ్ఞానం బ్రహ్మ” అనే మహా వాక్యం ప్రస్తావించబడింది.

ఐతరేయ ఉపనిషత్తు ఈ శాంతి మంత్రపాఠంతో మొదలవుతుంది.

ఈ ఉపనిషత్తు ప్రారంభం లో ఎల్లప్పుడూ సత్యాన్నే పలికే తమలో ఆ పరమాత్మను ప్రత్యక్షం అవమని ప్రార్ధిస్తున్నారు.

ఓం వాజ్గ్మే మనసి ప్రతిష్ఠితా మనోమే వాచి ప్రతిష్ఠిత!
మావిరావీర్మ ఏధి! వేదస్యమ ఆణీస్థః శ్రుతం మేమా
ప్రహాసీర నేనాధీతే నాహోరాత్రాన్ సందధామి
ఋతం వదిష్యామి! సత్యం వదిష్యామి! తన్మావతు
తద్వక్తారమవతు! అవతుమామ్
అవతు వక్తారమవతు వక్తారమ్
ఓం శాంతిః శాంతిః శాంతిః

నా వాక్కు, అంటే, ప్రాణాయా ప్రక్రియలో జనించే శబ్దం మనస్సులో ప్రతిష్టితమగు గాక! అదే విధంగా మనస్సు కూడా ఆ వాక్కు(శబ్దం)లో ప్రతిష్టితమవనీ! (ఒక్క శబ్దానికి మాత్రమే మనస్సు ఆకర్షించ బడుతుంది.)

ఆ శబ్దము మరియు మనస్సు ఏకమై, సత్య జ్ఞానములను పొందుగాక!

ప్రకాశమానమైన ఓ పరమాత్మా! నాలో జ్ఞాన జ్యోతివై ప్రకాశించెదవు గాక!

నేను తత్వకాంక్షినై తపస్సుతో అహోరాత్రములను (రాత్రి పగలు లను కలుపుతూ ధ్యానములో ఉంటాను) అనుసంధానము చేస్తాను.

బుద్ధికి గోచరమైన ఋతమునే (కన్నులతో చూచిన సత్యమునే) పలుకుతాను.

యావత్తు సృష్టికి వెనుకనున్న సూత్రమును ఆంతర్యములో తెలుసుకొని సత్యమునే పలుకుతాను.

ఆ సత్యమే నన్ను కాపాడు గాక! నా గురువును కాపాడు గాక! నా గురువులను నన్ను సదా కాపాడు గాక!

ఈ శాంతిమంత్రం ఎంత మహత్తరమైనది అంటే ఋతానికి, సత్యానికి వ్యత్యాసాన్ని వివరిస్తూ వాటి వాటి మహత్తును తెలియ జెప్పింది.

62. ఉపనిషత్తులు – ఐతరేయోపనిషత్తు (Continuation)

ఐతరేయోపనిషత్తు మొదలవుతూనే మొదటి మంత్రంలో సృష్టికి పూర్వం ఉన్న మూడు విషయాలను ప్రస్తావించింది.

ఓం ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్
నాన్యత్ కించన మిషత్!
స ఈక్షిత లోకా న్ను సృజాయితి!!

సృష్టి ఆరంభం లో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. కనురెప్పలు అల్లార్చే (స్పందించే శక్తి) మరే ఇతర ప్రాణి ఆ సమయంలో లేదు. అప్పుడు ఆ పరమాత్మ నేను అన్ని లోకాలను సృష్టిస్తాను అని సంకల్పించాడు. అంటే

ఆత్మవా ఇదమేక ఏవాగ్ర ఆసీత్- సృష్టికి పూర్వం ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే.

నాన్యత్కించన మిషత్- కనురెప్పలార్పుతూ కార్యకలాపాలు చేసే ఏ ఇతర వస్తువు లేదు.

స ఈక్షత లోకాన్ను సృజాయితి – విశ్వ సృష్టి రచన చేస్తాను అని ఆ ఆత్మ సంకల్పించాడు.

అవయవ రహితుడే కాకుండా నిష్క్రియుడైన (ఇచ్ఛారహితుడు) పరమాత్మ సృష్టి కార్యానికై సంకల్పించడమంటే పరమాత్మ మాయను ఉపాధిగా చేసుకొన్నాడు.

మాయ ఎల్లప్పుడూ పరమాత్మ అధీనంలోనే ఉండడం వల్ల సృష్టి మాయా ప్రేరితమైన కార్యంగా కనబడుతుంది.

చైతన్యం లేనిదే సృష్టి జరగదు అంటే పరమాత్మ యొక్క చైతన్యం మాయలో ప్రవేశించి సృష్టి కార్యానికి దోహదపడుతూంది.

స ఇమాన్ లోకా నసృజతాంభో! మరీచీ
మరమాపో దోంభః పరేణ దివం
ద్యౌః ప్రతిష్ఠాంతరిక్షం మరీచయః! పృథివీ
ఇమరో యా అధస్తాత్తా ఆపః!!

అంభోలోకం (ప్రాణం), మరీచీలోకం లేదా ద్యులోకం (విద్యుత్తు), మృత్యులోకం లేదా మరలోకం (పృథివి), ఆపలోకం (ఆపః- జలం) నీటిని సృష్టించాడు.

అంభోలోకం అంటే స్వర్గలోకం, ద్యులోకం కన్నా పైన ఉంది. అంటే సూర్యుని నుండి పైగా ఉండే నక్షత్రాదులుండే లోకం. ఈ అంభో లోకానికి ద్యులోకం ఆధారంగా ఉంది.

మరీచికలంటే కిరణాలు. దీనిలో సూర్య, చంద్ర, నక్షత్రాదులు కిరణాలు ప్రయాణం చేస్తూఉంటాయి. కనుక అది మరీచీ లోకం.

మనం నివసించే ఈ భూమి మరలోకము. దీనిలో పుట్టిన ప్రాణులు మరణిస్తూ ఉంటాయి కనుక దీనికి మరలోకమని పెట్టారు.

ఇక్కడ ఆత్మ(దేవుని) నుంచి బయటకి వచ్చిన ప్రాణశక్తినే (ఆ శక్తి మాత్రముండే ఆకాశం) అంభోలోకమనీ, దాని స్పందనలోంచి ఉత్పత్తి అయిన వాయు ఘర్షణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తునే ద్యులోకమని, అక్కణ్ణుంచి ఉత్పత్తి అయిన జలాన్నే ఆపలోకం అనీ మరియు పృథ్వినే మృత్యులోకమని అన్నారు.

ప్రధానమైన విద్యుత్తు, జలం వేరే భూతాలతో చేరి ఏర్పడిన మండలాల్ని మరీచాది లోకాలు అన్నారు. వీటన్నిటి కన్నా పైన ఉంటూ అన్నిటికీ ఆధారమైన ప్రాణ శక్తి తో కూడిన ఆకాశమే దివం అనిపించుకొంది. ఈ లోకాల మధ్య ఉండే ఖాళీ స్థలమే అంతరిక్షం.

ఈ నాలుగు లోకాలు సృష్టింపబడ్డాక వాటికి పాలకుడుగా నీటి నుండి పురుషుణ్ణి సృష్టించాడు.

నీటినుండి పురుషాకారం ఏర్పడిందని చెప్పడంలో కేవలం జలతత్వం నుండే ఏర్పడినట్టు కాదు. జల తత్వం ప్రధానమై మిగిలిన తత్వాలతో కలిసి మాత్రమే పురుషాకారం ఏర్పడినట్టు గ్రహించాలి.

63. ఉపనిషత్తులు – ఐతరేయోపనిషత్తు (Continuation)

నాలుగు లోకాలు సృష్టించేక జలం నుంచి పురుషుణ్ణి సృష్టించినట్లుగా చెప్పు కొన్నాము.

ఆపురుషుడి గురించి పరమాత్మ ఒకసారి చింతన చేశాడు. అలా ఆలోచించిన వెంటనే ఆ విరాట్ పురుషుడి నోరు ఒక గుడ్డు వికసించినట్టుగా తెరుచుకొంది.

ఆయన నోటి నుంచి వాక్కు వెలువడింది. ఆ వాక్కు నుంచి అగ్ని వచ్చింది.

తరువాత ముక్కు పుట్టింది. ఆ ముక్కు పగిలి నాశిక రంధ్రాలనుంచి శ్వాస ఆవిర్భవించింది.

అప్పుడు కళ్ళు పుట్టాయి. అవి విచ్చుకొని వాటి నుంచి చూపు ప్రసరించింది. ఆ చూపునుంచి సూర్యుడు ఆవిర్భవించాడు.

చెవులు పుట్టుకొని వచ్చాయి. ఆ చెవులు విచ్చుకొని వాటికి శబ్దగ్రహణ శక్తి వచ్చింది. వాటి నుంచి దిక్కులు పుట్టుకొచ్చాయి.

తర్వాత చర్మం వికసించింది. ఆ చర్మం నుండి వెంట్రుకలు, వాటినుండి ఓషధులు మహావృక్షాలు జన్మించాయి.

ఆతర్వాత హృదయం వికసించింది. ఆహృదయం నుంచి మనసు, ఆ మనసు నుంచి చంద్రుడు ఆవిర్భవించారు.

నాభి వికసించగా, నాభి నుండి అపానం, ఆ అపానం నుండి మృత్యువు జన్మించాయి.

చివరగా జననేంద్రియం పుట్టింది. ఆ జననేంద్రియం నుంచి రేతస్సు(వీర్యము), ఆ రేతస్సు నుంచి జలము పుట్డాయి.

ఈ రీతిగా విరాట్ పురుషుని అవయవముల నుండి ఇంద్రియాలు వాటి అభిమాన దేవతలు జన్మించాయి.

ఈ విధంగా జన్మించిన దేవతలందరూ మహాసముద్రం లాంటి ఈ విశాలమైన విశ్వంలో ప్రకాశిస్తూ ఉన్నారు.

పరమాత్మ ఈ ఇంద్రియాలకు వాటి అభిమాన దేవతలకు ఆకలి దప్పికలు కలిగేలా చేసేడు.

ఆ విరాట్ పురుషుని శరీరం నుంచి బయల్వెడలిన ఈ దేవతలందరూ ఆకలి దప్పికలకు గురై నివసించడానికి తగిన ప్రదేశం తినటానికి తగిన ఆహారం చూపించమని ఆ పరమాత్మను వేడుకొన్నారు.

వారి ప్రార్ధననంగీకరించి బ్రహ్మ దేవుడు ఒక వృషభాన్ని చూపించి దీనిని ఉపాధిగా చేసుకోండి అన్నాడు. ఇది భౌతిక స్థాయిలో జీవించేది. జ్ఞానం లేనిది. అందుకని ఇది మాకనువైన శరీరం కాదు అని తిరస్కరించారు.

అప్పుడు ఒక అశ్వాన్ని చూపి దీనిని ఉపాధిగా చేసుకోండి అంటే వృషభాన్ని తిరస్కరించిన కారణాలతోనే అశ్వాన్ని కూడా తిరస్కరించారు.

అప్పుడు ఆ పరమాత్మ పూర్వము జలము నుండి పుట్టిన మూలభూతుడైన ఆ పురుషుని చూపించి దీనిలో ప్రవేశించండి అన్నాడు.

64. ఉపనిషత్తులు – ఐతరేయోపనిషత్తు (Continuation)

ఆత్మ యొక్క తపస్సుతో విరాట్ పురుషుడి నోటినుంచి అన్ని ఇంద్రియాలు వాటి వాటి అభిమాన దేవతలు పుట్టాయని చెప్పేరు.

వాళ్ళకు ఆకలిదప్పులు కలగడంతో తమకు ఆశ్రయ స్థానంగా మానవ శరీరాన్ని ఎంచుకొన్నాయని తెలుసుకొన్నాము.

ఆ మానవ శరీరంలో

పరమాత్మ ఆజ్ఞతో వెంటనే అగ్ని వాక్కుగా మారి నోటిలో ప్రవేశించింది.

వాయువు ప్రాణంగా మారి ముక్కులోకి ప్రవేశించింది.

సూర్యుడు చూపుగామారి కళ్ళలోకి ప్రవేశించాడు.

దిక్కులన్నీ శబ్దగ్రహణ శక్తిగా మారి చెవుల్లోకి ప్రవేశించాయి.

మూలికలు, చెట్లు,చేమలు వెంట్రుకలుగా మారి చర్మంలోకి చేరాయి.

చంద్రుడు మనస్సుగా మారి హృదయంలోకి ప్రవేశించాడు.

మృత్యువు అపానమై బొడ్డులోకి చేరింది.

నీరు వీర్యంగా మారి పురుషుడి జనేంద్రియంలోకి ప్రవేశించింది.

ఈ ఇంద్రియాలతో ఉన్న ఆకలిదప్పులు పరమాత్మను మాకు ఈ మానవ శరీరంలో నివశించడానికి సరయిన ప్రదేశం చూపమని కోరాయి.

మీరు ఈ ఇంద్రియ అధి దేవతలవద్దే నివాసం ఉండండి. వారు తినే ఆహారంలో మీకు భాగస్వామ్యం కల్పిస్తున్నాను అన్నాడు ఆ పరమాత్మ. అంటే దేవతలకు లభించే హవిస్సుల ద్వారా ఆకలిదప్పులు ఉపశమిస్తాయని అర్ధం.

తమ దేహంలో ఇంద్రియవృత్తులకు లభించే తృప్తి అంటే ఇంద్రియ భోగాల వల్ల ఆకలి దప్పులు ఉపశమిస్తాయని అర్ధం.

స ఈక్షత ఇమే ను లోకాశ్చ లోకపాలాశ్చ అన్నమేభ్యః సృజా ఇతి!!

ఈ లోకాలను లోక పాలకులను సృష్టించడం జరిగింది. ఆకలిదప్పులను సృష్టించాను. ఇక వీరికి ఆహారాన్ని సృష్టించాలి అని ఆ పరమాత్మ సంకల్పించాడు.

సోపోభ్యపత్, తాభ్యోభి తప్తాభ్యో మూర్తిరజాయత
యా వైసా మూర్తిరజాయత, అన్నం వైతత్!!

ఆ విరాట్ పురుషుడు తపించగా నీటి నుంచి అన్నం ఉత్పన్నమైంది అని ఉపనిషత్కారులు చెప్పేరు.

ఘనీభవించిన అప్ – జలం పృథ్వి కావడం వల్ల జలమనేది పృథ్వీసారమయింది. ఆ జలం యొక్క సూక్ష్మ సారమే అన్నం (అశనం). ఇదే మన శరీరంలోని ప్రాణునికి ఆహారం.

యోగ విద్యాభ్యాసం చేసే సాధకులకు మొదటగా దేహంలో లాలాజలం అధికంగా పుట్టి తర్వాత అశనోత్పత్తి జరగడమనేది సర్వదా అనుభవైక వేద్యమే.

అదే విధంగా స్థూల వస్తువుల్లో అన్నం ఉత్పత్తి కావడానికి జలమే ముఖ్యమైన ఆధారం.

పరమాత్మ సంకల్పంతో సృష్టింపబడ్డ ఆహారం పుట్టీ పుట్టగానే బయటకు వచ్చిన వెంటనే వెను తిరిగి పరుగెత్తడం మొదలు పెట్టింది.

అలా పారిపోతున్న ఆహారం ఏ రకంగా ఈ మానవ శరీరానికి చిక్కిందో వచ్చే భాగంలో చూద్దాం.

65. ఉపనిషత్తులు – ఐతరేయోపనిషత్తు (Continuation)

పరమాత్మ సంకల్పంతో సృష్టించబడ్డ ఆహారం పైకి వచ్చిన వెంటనే వెనక్కి పరుగెత్తడం మొదలు పెట్టింది.

అప్పుడు మనిషి తన వాక్కుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు. సాధ్యంకాలేదు.

వాక్కుతోనే కనుక ఆహారాన్ని పట్టుకోగలిగి ఉంటే మనిషి ఆహారం అని నోటితో అనగానే అతను సంతృప్తి చెందేవాడు. ఆహారం తినవలసిన అవసరం ఉండేది కాదు.

తర్వాత అలా పరుగెడుతున్న ఆహారాన్ని మనిషి తన శ్వాస తో పట్టుకోబోయాడు. సాధ్యం కాలేదు.

శ్వాసతోనేకనుక ఆహారాన్ని గ్రహించగలిగి ఉంటే, కేవలం ఆహారాన్ని వాసన చూడడంతోనే తృప్తి చెందే వాడు. ఆహారం తినవలసిన అవసరం ఉండేదికాదు.

అలా పరుగెడుతున్న, ఆహారాన్ని తన చూపుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి. సాధ్యం కాలేదు.

చూపుతోనే ఆహారాన్ని పట్టుకొన్నట్లయితే కేవలం ఆహారాన్ని చూడడంతోనే సంతృప్తి చెందేవాడు.

సృష్టి లోనే చూపుద్వారా ఆహారాన్ని ఇవ్వగలిగిన ప్రాణి ఒక్క తాబేలు మాత్రమే. తాబేలు పిల్లలు నది అవతలి ఒడ్డున ఉంటాయి. తల్లి నది ఇవతలి ఒడ్డున ఉంటుంది. అక్కడనుంచి పిల్లలు ఆహారానికై ఆక్రందన చేస్తాయి. తల్లి ఇవతలి ఒడ్డునుంచి సూటిగా పిల్లల కళ్ళలోకి చూస్తుంది. రెండవ ఒడ్డున ఉన్న పిల్లలకు ఆకలి తీరి హాయిగా నిద్రపోతాయి. మానవులు, ఇతర జంతుజాలం తమ పిల్లలకు ఆహారం స్థనాల ద్వారా పాలరూపంలో ఇస్తోంటే తాబేలు చూపుద్వారానే ఆహారాన్ని పిల్లలకు అందిస్తోంది.

ఆ ఆహారాన్ని తన వినికిడితో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి. అతని వల్ల కాలేదు.

వినడంద్వారా ఆహారాన్ని గ్రహించగలిగి ఉంటే కేవలం ఆహారం గురించి వినగానే సంతృప్తి చెంది ఉండేవాడు.

ఆ విధంగా పరుగెడుతున్న ఆహారాన్ని తన స్పర్శతో పట్టుకోవాలని ప్రయత్నించేడు కాని సాధ్యంకాలేదు.

ఇది సాధ్యమయి ఉంటే కేవలం ఆహారాన్ని తాకడం ద్వారా సంతృప్తి చెందేవాడు. తిన వలసిన అవసరం ఉండేది కాదు.

నీటిలో ఉండే చేప తన పిల్లలకు ఆహారాన్ని స్పర్శద్వారా సరఫరా చేస్తుందని మీకు తెలుసా.
పిల్లలు ఆకలి అయినప్పుడు తల్లి దగ్గరకు చేరుతాయి. తల్లి ఆప్యాయంగా తన శరీరంతో తాకగానే వాటి ఆకలి తీరిపోయి హాయిగా ఉంటాయి.

తనకు అందకుండా పరుగెత్తి పోతున్న ఆహారాన్ని మనస్సుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు కాని సాధ్యంకాలేదు.

అదే జరిగినట్లయితే కేవలం ఆహారం గురించి తలుచుకోగానే సంతృప్తి పడేవాడు.

పరుగెత్తపోతున్న ఆహారాన్ని తన జననేంద్రియంతో పట్టుకోవాలనుకొన్నాడు కాని సాధ్యంకాలేదు. అదే వీలయితే ఆహారాన్ని విసర్జన చేయడం తోనే సంతృప్తి చెందేవాడు.

తదపానేనా జిఘృక్షత్, తదావయత్ స ఏషో న్నస్య
గ్రహో యద్వాయుః అన్నమాయుర్వ ఏష యద్వాయుః

పరుగెత్తి పోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని అపానంతో పట్టుకోబోతే వెంటనే ఆహారం అతని స్వాధీనం అయ్యింది. దానితో అపానంద్వారా
మాత్రమే ఆహారాన్ని గ్రహించగలమని తెలుసుకొన్నాడు.

కాబట్టి అపానమే ఆహారం ద్వారా ప్రాణ ధారణ చేయగలుగుతోంది ఈ శరీరంలో.

దేహానికి అవసరమైన ఈ స్థూలాహారాన్ని గ్రహించేందుకు, జఠరాశయానికి పంపి జీర్ణమయ్యేట్లా చేసేందుకు అపాన వాయు క్రియ చాలా అవసరం.

ఇది లేకుండా కేవలం ప్రాణం, మనస్సు, మిగిలిన ఇంద్రియాల ద్వారా సాధ్యంకాదని నిరూపించి వాయువు ద్వారానే అన్న గ్రహణం సాధ్యమని నిరూపించ బడింది.

అపాన వాయు సంచారం నోరు దగ్గర మొదలయి అపానం ద్వారానిష్క్రమిస్తుంది. దానికి మాత్రమే ఆహారాన్ని స్వీకరించి, నమిలి, జీర్ణం చేసి, వ్యర్ధాన్ని అపానం ద్వారా బయటకు పంపే శక్తి ఉంది.

అందుచేత, “వాయువే అన్నం లేదా వాయువే ఆయువు (ఆయుష్షు)” అన్నారు ఉపనిషత్కారులు.

ఈ విధంగా సమస్త ఇంద్రియాలు, ఆకలిదప్పులు, ఆహారాలతో అలరారుతూ తయారయిన మానవ శరీరానికి ఒక అధిష్ఠాన చేతనాన్ని ఏరకంగా సమకూర్చేరో వచ్చే భాగంలో తెలుసుకొందాం.

66. ఉపనిషత్తులు – ఐతరేయోపనిషత్తు (Continuation)

శరీర సృష్టి జరిగింది. ఇంద్రియాలు సంఘటితంగా పనిచేయడం మొదలుపెట్టాయి. ఆకలిదప్పులు శరీరంలో ప్రవేశించాయి. అన్నం దొరికింది.

మరి ఈ ఇంద్రియాలలో వాగీద్రియం ఎవరిగురించి మాట్లాడాలి? కళ్ళు ఎవరి గురించి చూడాలి? ఈ ఇంద్రియాలన్నీ ఎవరి గురించి పనిచేయాలి?

ఈ పిండ శరీరం పరమాత్మ లేకుండా నిలవలేద నేది యదార్ధం.

పరమాత్మ ప్రమేయం లేకుండా ఈ మనిషి వాక్కుతో మాట్లాడటం, ముక్కుతో శ్వాసించడం, మనస్సుతో ఆలోచించడం, అపానంతో జీర్ణించు కోవడం మొదలైనవి ఎలా సాధ్యమౌతాయి? ఇంతవరకూ ఆ చైతన్య శక్తి (పరమాత్మ) శరీరంలో ప్రవేశపెట్ట బడలేదు

అందుచేత పరమాత్మ శరీరంలో ప్రవేశిద్దామను కొన్నాడు. అన్ని అవయవాలు ఇంద్రియాలచే ఆక్రమింప బడ్డాయి.

మరి ఈ శరీరంలో కపాల మార్గమే తను ప్రవేశించడానికి సరయిన మార్గంగా ఎంచుకొన్నాడు.

స ఏతమేవ సీమానం విదార్యైతయా ద్వారా ప్రాపద్యత
సైషా విదృతిర్నామ ద్వాః తదేతన్నానందం
తస్యత్రయ అవసధాస్త్రయః స్వప్నాః! అయమా వసధో యమావసధో యమావసధ ఇతి!

ఇలా ఆలోచించిన పరమాత్మ పురుషుడి నడినెత్తిని చీల్చుకొని ఆ రంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశించాడు. దానినే బ్రహ్మరంధ్రం అంటారు.

ఆయన ప్రవేశించిన ద్వారం పేరు “విదృతి” అని పేరు. అది ఆనందమయిమైన స్థానం.

ఆ పరమాత్మ నివసించే స్థానాలు (కార్యక్షేత్రాలు) హృదయం, కంఠం, బ్రహ్మరంధ్రాలనే మూడు స్థానాలు.

స్థితులు మూడు. జాగ్రత్, స్వప్న, సుషుప్త స్థితులు.

శరీరంలో ప్రవేశించిన పరమాత్మకు జాగ్రదావస్థలో కుడి కన్ను, స్వప్నావస్థలో మనస్సు, సుషుప్తిలో హృదయం స్థానాలని ఈ ఉపనిషత్తు చెబుతోంది.

అల్లా ప్రవేశించిన పరమాత్మ ఆ దేహంలో వేరే ఎవరున్నారని పరిశీలించాడు. తరువాత ఇక్కడ నేను తప్ప వేరే ఏది లేదే! అని అనుకొని శరీరంలో కొలువైన తానే సర్వత్రా వ్యాపించి పరమాత్మ గా ఉండటాన్ని చూశాడు.

అందువల్ల అతణ్ణి జీవాత్మ అన్నారు. అతణ్ణే ఇదంద్ర (సాక్షి) అంటారు.

తర్వాత శరీరం అంతా బ్రహ్మ చే (ఇక్కడ బ్రహ్మ అంటే ప్రాణ శక్తే) ఆవరించి ఉండటాన్ని చూశాడు పరమాత్మ.

నా యీ అపారమైన వైభవాన్ని, అపూర్వమైన శక్తిని, నా మాయా లీల నంతటినీ గ్రహించగలిగే కుశాగ్రబుద్ధి కల ప్రాణిని సృష్టించనంతవరకూ నా కార్యం ముమ్మాటికీ నిష్ఫలం అని తలచి ఆ జగదీశ్వరుడు తన సామర్ధ్యాన్ని, సృష్టిలోని సౌందర్యాన్ని విచక్షణాబుద్ధితో గ్రహించగలిగిన ఈ మానవ రూపాన్ని సృష్టించాడు. ఇంతటి సృష్టి కార్యం వ్యర్ధం కాకూడదు కదా!

ఇలా రూపొందింపబడిన మానవుడు మర్త్యలోకంలో జన్మను పొందే విధానాన్ని వచ్చే భాగంలో చూద్దాం.

67. ఉపనిషత్తులు – ఐతరేయోపనిషత్తు (Continuation)

ఇప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకొందాం.

అనేక పుణ్యకార్యాలు చేసి దేహం చాలించిన తరువాత ధూమ మార్గంలో చంద్రలోకం చేరి, పుణ్యాలననుభవిస్తాడు.

పుణ్య క్షయమయిన పిదప ఆత్మ పర్జన్యుణ్ణాశ్రయించి వర్షంద్వారా సస్యకేదారాల రూపంలో ధాన్యం గా మారుతుంది.

ఆ ధాన్యం అన్నరూపంలో మానవుల శరీరాల్లో ప్రవేశించి జీర్ణమై పురుషులలో శుక్లంగా రూపొందుతుంది. అంటూ పునర్జన్మ విషయంలో తెలుసుకొన్నాము.

అదే విషయం ఇక్కడ ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశ వర్షం ద్వారా సస్య రూపంలో ధాన్యం, అన్నంగా మారి పురుషుని శరీరంలో రేతస్సు గా మారుతుంది.

ఓం పురుషే హ వా అయమాదితో గర్భో భవతి!
యదేత ద్రేత స్తదేతత్ సర్వేభ్యోంగేభ్య స్తేజః!
సంభూత మాత్మన్యేవాత్మానం బిభర్తి!
తద్యదాస్త్రియాం సించత్యథైన జ్జనయతి!
తదస్య ప్రథమం జన్మ!!

అందువల్ల,

“ఓం పురుషే హవా అయమాదితో గర్భో భవతి” – యదార్ధంగా చెప్పాలంటే పురుషుడిలో నే ముందుగా గర్భము కలుగుతోంది.

పురుషునిలో ప్రారంభ దశలోని మనిషి రేతస్సు (వీర్యం లేదా శుక్లం)రూపంలో ఉంటాడు.

ఈ రేతస్సు అన్ని అవయవాల యొక్క శక్తి సారంగా ఉంటుంది.

ఈ విధంగా మనిషి తన శరీరంలో తాను పుట్టించబోయే జీవిని మొదట రేతస్సు (వీర్యం) రూపంలో భరిస్తున్నాడు.

ఈ రేతస్సుని స్త్రీ లో ప్రవేశ పెట్టడం ద్వారా తనని తాను శిశువు గా జన్మింప జేసుకొంటాడు.

పురుషుని శరీరం నుండి వీర్యం స్త్రీ శరీరంలోకి జేరడమే ప్రధమ జన్మ.

స్త్రీ కి తన అవయవములు తన శరీర భాగంగా ఉన్నట్లే ఆ వీర్యం కూడా ఒక భాగమై స్త్రీ తో తాదాత్మ్యం చెందుతోంది.

రేతస్సు ఆమెలోకి ప్రవేశించగానే అది ఆమెకు సోంతమైపోతుంది. అందువల్ల ఆ రేతస్సు ఆమెను బాధించదు.

భర్త రేతస్సును పతియొక్క ఆత్మ రూపుడైన శిశువుని ప్రేమతో పెంచుతుంది.

గర్భాన్ని చక్కగా సంరక్షించే స్త్రీ ని విశేష రీతిలో సంరక్షించాలి.

శిశువు జన్మించడానికి ముందు, ఆ గర్భస్థ పిండాన్ని స్త్రీ తన గర్భంలో సంరక్షిస్తుంది.

ఆ గర్భస్త శిశువు యొక్క తండ్రి ఆ శిశువు జననానికి ముందు, తర్వాత కూడా అతన్ని సంరక్షిస్తాడు. ఆ శిశువుని తన స్వరూపం గానే భావిస్తూ అతన్ని సంరక్షిస్తాడు.

ఆత్మానమేన తద్భావయత్యేషాం లోకానాం సంతత్యా!
ఏవం సంతతా హిమే తదస్య ద్వితీయం జన్మ!!

ప్రజాసంతతి వృద్ధి కొరకు ఈ రీతిగా చేస్తున్నాడు. లోకాల సంబంధం ఇలా పెంపొందుతుంది.
మనిషి యొక్క ద్వితీయ జన్మ తల్లి కడుపునుండి శిశువుగా జన్మించడమే.

68. ఉపనిషత్తులు – ఐతరేయోపనిషత్తు (Continuation)

పుత్రుని రూపములో జన్మ తీసుకొన్న ఆ తండ్రి యొక్క ఆత్మ సత్కర్మానుష్ఢానముల నిమిత్తము తన ఇంట్లో తండ్రి యొక్క స్థానంలో ప్రతినిధిగా ప్రతిష్ఠింప బడుతున్నాడు.

ఆ పుత్రునిగా పుట్టిన వాడు కాలక్రమంలో పెరుగుతూ తాను చేయవలసిన కర్మలనన్నీ చేసి చివరకు వృద్ధాప్యాన్ని పొంది మరణం సంభవించగా ఈ శరీరాన్ని వదలి తిరిగి జన్మెత్తుతున్నాడు. ఇది మూడవ జన్మ. అని వామదేవ మహర్షి చెబుతున్నాడు.

గర్భేను సన్న న్వేషామవేదమహం దేవానాం జనిమాని విశ్వా
శతం మాపుర ఆయసీరరక్షన్నధః శ్యేనో జవసా నిరదీయమ్
ఇతి, గర్భ ఏవై తచ్చయానో వామదేవ ఏవ మువాచ!!

గర్భం లోనే శయనించి ఉన్న వామ దేవ మహర్షి గర్భంకోశం లో జరిగే విషయాలను ఈ విధంగా వివరించి చెప్పాడు.

నేను ఈ సకల దేవతల యొక్క జన్మ వృత్తాంతములు తెలుసుకొన్నాను.

ఇక్కడ దేవతలంటే ఇంద్రియాలు, తన్మాత్రలు, వృత్తులు, తదభిమాన దేవతలు, భూతాలయొక్క జనన క్రమాన్ని గర్భంలో ఉన్నప్పుడే తెలుసు కొన్నాను అని వామదేవ మహర్షి చెబుతున్నాడు.

అప్పుడు వంద లోహమయములైన కోటలు నన్ను సంరక్షించాయి.

సంపూర్ణ తత్వజ్ఞానమైన తర్వాత డేగలాగ వేగముగా ఆ ఇనుప కోటలు ఛేదించుకొని తిరుగుతూ బయటకు వచ్చాను. అని వామదేవ మహర్షి వివరించాడు.

ఈ సత్యాలన్నీ తెలుసుకొని జన్మ తీసుకొన్న తర్వాత తన శరీరం నశించగానే స్వ్గర్గలోకం చేరాడు. అక్కడ సకల సుఖాలను పొంది చివరకు అమరత్వ స్థితికి చేరుకొన్నాడు వామదేవ మహర్షి.

ఇంతటి మహత్తరమైన శరీర రచన చేసి దానిలో నివాస మేర్పరచుకొన్న ఆ ఆత్మ ఎలాంటిది? ఎవరిని ఈ ఆత్మ అని మనం ఉపాసిస్తున్నామో వచ్చే భాగంలో తెలుసుకొందాం.

69. ఉపనిషత్తులు – ఐతరేయోపనిషత్తు (Continuation)

అప్పటి సాంఘిక ఆచారాలు, దేశ కాలమాన పరిస్థితులలో ఇంతకుముందు చదివిన రెండవ అధ్యాయం (అవక్రామంతు గర్భిణ్యః)గర్భిణులు వినకూడదని వచించారు.

ఈ మూడవ అధ్యాయంలో “యధాస్థానంతు గర్భిణ్యః”గర్భిణులు కూడా వినవచ్చు అని చెబుతూ ఈ అధ్యాయం మొదలవుతుంది.

కోయమాత్మేతి వయముపాస్మ హే,
కతరః స ఆత్మా యేన వారూపం పశ్యతి,
యేన వా శబ్దం శృణోతి, యేన వా గంధా నాజిఘ్రతి, యేన వా వాచం వ్యాకరోతి,
యేన వా స్వాదు చాస్వాదు చ విజానాతి!!
కోయమాత్మేతి వయముపాస్మహే-

ఆత్మ యని మనం ఎవరిని ఉపాశిస్తున్నాము?

కతరః స ఆత్మా- ఆత్మ ఎలాంటిది?

మనం ఎవరి వల్ల చూస్తున్నామో! ఎవరి వల్ల వింటున్నామో! ఎవరి వల్ల వాసన చూడగల్గు తున్నామో! ఎవరి వల్ల నోటితో మాట్లాడ గల్గు తున్నామో! ఎవరి వల్ల రుచులను తెలుసుగోగల్గు తున్నామో ఆయనే ఆత్మ అంటే.

ఇక్కడ ‘సర్వాణ్యేవై తాని ప్రజ్ఞానస్య నామధేయాని భవన్తి’అంటూ ప్రజ్ఞానఘనాన్ని విశదీకరించారు.

యదేతద్ధృదయం మనశ్చైతత్! సంజ్ఞానమాజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధాదృష్టి ర్ధృతి ర్మతి ర్మనీషా జూతిః స్మృతిః సంకల్పః క్రతురసుః కామో వశ ఇతి! సర్వాణ్యేవై తాని ప్రజ్ఞస్య నామధేయాని భవంతి!!

ఈ ఆత్మే – హృదయంగా, మనస్సుగా, చైతన్యం గా, విజ్ఞానంగా, ప్రజ్ఞానంగా, మేధస్సుగా, అంతర్దృష్టి గా, ధృతిగా, మతిగా, ధైర్యం గా, జ్ఞాపకం గా, జాతిగా, సంకల్పంగా, మనస్తాపంగా, తీర్మానంగా, ప్రాణశక్తిగా, విషయ సుఖవాంఛగా ఉండడం వల్ల ఇవన్నీ ప్రజ్ఞానం యొక్క నామాలే అవుతున్నాయి.

సృష్టి ప్రారంభం లో పరమాత్మ అంభో లోకం, మరీచీలోకం, మరలోకం, ఆపలోకం అనే నాలుగు లోకాలను సృష్టించాడు. ఆయా లోకాలను రక్షించే నిమిత్తం నీటి నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించాడు.

ఆ విరాట్ పురుషుని నుండి పంచభూతాలు, ఇంద్రియాలు, వాటియొక్క క్రియాశక్తులు(వినికిడి, చూపు మొదలయినవి), ఆకలిదప్పులు ఆ తర్వాత ఆహారం సృష్టించ బడ్డాయి.

వీటన్నిటికీ ఆలంబన కొరకు మానవ శరీరాన్ని సృష్టించాడు. ఆ సమిష్టి రూపంగా సృష్టించబడ్డ రూపంతో సంతృప్తి చెందిన పరమాత్మ ఈ భూమి మీద బుద్ధి జీవులను సృష్టించాడు.

అలా సృష్టించబడ్డ మానవులు భౌతికమైన ప్రపంచ వ్యవహారాల్లో మునిగి తేలుతూ, జనన మరణాలతో విసిగి ఆలోచించడం మొదలు పెట్టారు. ఈ నామ రూపాత్మకమైన జగత్తు నిజంగా దేనిలో ప్రతిష్టింపబడింది? అని ఆలోచించడం మొదలు పెట్టారు.

ఇంద్రియాలకు, ప్రాణశక్తికి అతిరిక్తంగా ఉంటూ, సృష్టి స్థితి లయాలకు అతీతంగా ఉంటూ విశ్వానికంతా చైతన్యాన్ని ప్రసాదించే జ్ఞానరూపమైన పరబ్రహ్మాన్ని ఉపాసించాలి అని తెలుసుకొన్నారు.

70. ఉపనిషత్తులు – ఐతరేయోపనిషత్తు (Continuation)

ఏష బ్రహ్మైష ఇంద్ర ఏష ప్రజాపతిరేతే సర్వే దేవా ఇమాని చ పంచమహాభూతాని పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతీంషీత్యేతానీమాని చక్షుద్రమిశ్రాణీవ!

సృష్టి కర్తగా ఇంద్రుడుగా, ప్రజాపతిగా మిగిలిన దేవతలుగా ఉన్నది ఆ బ్రహ్మే.

భూమి, గాలి, ఆకాశం, నీరు, నిప్పు అనే పంచ భూతాలుగా ఉన్నదీ ఆ బ్రహ్మమే.

బీజానీతరాణి చేతరాణి చాండజాని చ జరాయుజాని చ స్వేదజాని చోద్భిజాని చాశ్వా గావః పురుషా హస్తినో యత్ కిం చేదంప్రాణి జంగమం చ!

అల్పప్రాణులుగా, బీజాలుగాఉన్నది ఆ పరమాత్మే.

అండజములు (గ్రుడ్డు నుండి పుట్టే సర్పాలు, పక్షులు);

జరాయుజములు (మావి నుండి పుట్టిన మనుజులు గర్భకోశములోని మావి నుండి పుట్టినవి);

స్వేదజములు (చమట నుండి పుట్టిన పేలు మొదలగునవి);

ఉద్భిజములు (భూమిని ఛేదించుకొని పుట్టిన వృక్షములు, విత్తనాలనుండి మొలకెత్తేవి);

అలాగే నడిచేవి, ఎగిరేవి, స్థావర జంగమాలయిన ప్రాణులన్నీ ప్రజ్ఞాన జనితమైన ఆత్మే.

పతత్రి చ యచ్చ స్థావరం సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్టితత్!

నామరూపాత్మకమైన ఈ జగత్తును నడిపే నేత్రమే ప్రజ్ఞానము.

ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠాః ప్రజ్ఞానం బ్రహ్మ!!

ఈ జగత్తు ప్రజ్ఞానము లోనే ప్రతిష్టితమై ఉంది.

ఈ లోకమంతా ప్రజ్ఞాన నేత్రం. ఆ ప్రజ్ఞే ప్రతిష్టింప బడింది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ.

ఈ విధంగా ప్రజ్ఞాన రూపుడైన పరమాత్మను తెలుసుకొన్నవాడు తన శరీరం పతనం చెందేక (మరణించిన తర్వాత) సర్గలోకానికి వెళ్ళి అక్కడ అన్ని సుఖాలూ అనుభవించి అమరుడౌతాడు.

అంటూ ఐతరేయోపనిషత్తు ముగుస్తోంది.

వచ్చే భాగంలో తైత్తిరీయోపనిషత్తు మొదలు పెడదాము.

71. ఉపనిషత్తులు – ఐతరేయోపనిషత్తు (Continuation)

తైత్తిరీయ ఉపనిషత్తు

గంగానదీ తీరంలో చమత్కార పురంలో సకల సద్గుణ సంపన్నుడైన యజ్ఞవల్క్యుడనే బ్రాహ్మణుని కుమారుడే యాజ్ఞవల్క్యుడు.

యజ్ఞవల్క్యుడు, అతని భార్య సునందలకు కార్తీక శుద్ధ ద్వాదశి, భానువారం, ధనుర్లగ్నంలో సాక్షాత్తు ఆ బ్రహ్మ దేవుడే జన్మించాడా అన్నట్లుగా ఒక కుమారుడు కలిగాడు. అతనికి యాజ్ఞవల్క్యుడని నామకరణం చేశారు.

అయిదో ఏట అక్షరాభ్యాసం, ఎనిమిదో ఏట ఉపనయనం జరిగిన పిమ్మట, ఋగ్వేదాన్ని పాష్కలుడి వద్ద; సామవేదాన్ని జైమిని వద్ద, అధర్వణ వేదాన్ని ఆరుణి వద్ద నేర్చుకొన్నాడు.

వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు వైశంపాయనుడు.

యజుర్వేదాన్ని శిష్యులకు చెప్పే వైశంపాయనుడు ఈ కుర్రవాడిలో ఉత్తమ లక్షణాలున్నాయని గ్రహించి శిష్యునిగా అంగీకరించాడు.

గురు శుశ్రూషలో అంకితభావం కలిగిన యాజ్ఞవల్క్యుడు గురుహృదయాన్ని మెప్పించి అనతి కాలంలోనే అనంత విద్యా వైభవాన్ని పొంద గలిగాడు.

ఒకసారి వైశంపాయనుడికి కోపం వచ్చి తన మేనల్లుడిని కాలుతో తన్నాడు. అతను సద్బ్రాహ్మణుడు. బ్రాహ్మణున్ని తన్నడం చేత బ్రహ్మ హత్యా పాపం వచ్చిందని శిష్యులను నివారణోపాయం ఆలోచించమన్నాడు.

అప్పుడు యాజ్ఞవల్క్యుడు ‘ఇదేమంత పని, నేనొక్కడినే మీ పాపాన్ని బాపుతాను.’ అన్నాడు.

బ్రహ్మతేజోదీప్తి చే వెలుగొందే యాజ్ఞవల్క్యునిలో విధివశాత్తూ సాత్వికాహంకారం కలిగి గురువుని ధిక్కరించే విధంగా మాట్లాడించింది.

ఆ కారణంచేత అతని అహంకారానికి వైశంపాయనుడు ఆగ్రహించి “అహంకరిస్తున్ననీకు ఈ విద్య తగనిది, దానిని నాకు తిరిగి ఇచ్చి వెళ్ళిపొమ్మని” కఠినంగా పలికాడు.

అందుకు పశ్చాత్తాపపడిన యాజ్ఞవల్క్యుడు రక్త రూపంలో తాను నేర్చిన యజుర్వేద విద్యను వెడలగక్కి వెళ్ళిపోగా వైశంపాయన మహర్షి శిష్యులు తిత్తిర పక్షుల రూపంలో ఈ మంత్రాలను స్వీకరించడం మూలంగా ఏర్పడినదే తైత్తరీయశాఖ

అందులోని ఉపనిషత్తును తైత్తరీయోపనిషత్తు అని అంటారు.

యాజ్ఞవల్క్యుడు తన గురువు వద్ద వదిలేసిన దానిని కృష్ణయజుర్వేదము అంటారు.

72. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation)

ఆ విధంగా ఏర్పడిన తైత్తిరీయ ఉపనిషత్తు లోకంలో బహుళ ప్రచారం లోకి వచ్చింది.
కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయ ఆరణ్యకం యొక్క 7,8,9 భాగాలే తైత్తిరీయ ఉపనిషత్తు.

(యాజ్ఞవల్క్యుడి తదుపరి విద్యాభ్యాసం మొదలయినవి మనం బృహదారణ్య కోపనిషత్తులో చదువుకొందాం.

ఈ తైత్తిరీయోపనిషత్తును శుభకార్యాలలోను, యజ్ఞ యాగాదులలోను ఎక్కువగా ప్రవచనం చేస్తూంటారు.
స్వర యుక్తంగా, శ్రావ్యంగా గానం చేస్తారు.

ఈ ఉపనిషత్తుకు ముందుగా ఆదిశంకరులు వ్యాఖ్యానం వ్రాశారు.

తైత్తిరీయోపనిషత్తు మూడు అధ్యాయాలు గా విభజించబడింది.

అవి శిక్షావల్లి (జీవనవిద్య); ఆనందవల్లి (మనిషి-పంచకోశ వివరణ); భృగువల్లి (భగవంతుడు).

మొదటి అధ్యాయం శిక్షావల్లి మనం ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి అనే అంశాన్ని విచారణ చేస్తూంది. ఈ వల్లిలో గృహస్త ధర్మాలను నిర్వహిస్తూ తను నేర్చుకొన్న విద్యను వల్లె వేయడం, ఇతరులకు భోధించడం అత్యావశ్యకమని సందేశం ఇవ్వబడింది. పదకొండవ అనువాకంలో వేదాధ్యయనం పూర్తి చేసుకొన్న వారికి స్నాతకోపన్యాసం – ఆశ్రమాన్ని వదలి వెళ్ళే సమయంలో గురువు ఇచ్చే అద్భుత సందేశం చాలా ప్రాధాన్యతను సంతరించుకొంది.

రెండవ అధ్యాయం ఆనందవల్లి మనిషి అనేవాడు ఎవరు అన్న విషయాన్ని ఒక అద్భుతమైన వర్ణనని ఇస్తుంది. దీనిలో పంచకోశ వివరణ ముఖ్యమైనది. బ్రహ్మం యొక్క లక్షణాలు, బ్రహ్మమే సత్పదార్ధం అనే విషయాలు, ఆనందంలో ఉండే తరతమ బేధాలు మొదలయినవి వివరింపబడ్డాయి.
బ్రహ్మం తో తాదాత్మ్యం చెందడమే బ్రహ్మానందం అంటూ జీవిత పరమార్ధాన్ని వివరించింది.

భగవంతుని గురించిన చింతన మూడవ అధ్యాయం భృగువల్లి లో వివరించ బడింది. భృగువు తన తండ్రి ద్వారా తెలుసుకొన్న వారుణీ విద్య చెప్పబడింది.

జీవితాన్ని ద్వేషించడమో, జీవితం నుండి వైదొలగి పారిపోవడమో చేయకూడదని ఈ ఉపనిషత్తు హెచ్చరిస్తోంది. ఆనంద దాయకమైన పరిపుష్టితో కూడిన జీవితాన్ని గడపడం అంటే భగవంతుని మహత్వాన్ని వ్యక్తపరచడమే అని సూచిస్తూంది.

ఈ ఉపనిషత్తులో ప్రతి అధ్యాయానికి ఒక శాంతి మంత్రం ఉంది.

శిక్షావల్లికి ఉన్న “ఓమ్ శంన్నోమిత్రః శం వరుణః…” అనే శాంతి మంత్రాన్ని వచ్చే భాగంలో చదువుకొందాం.

73. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation)

తైత్తిరీయోపనిషత్తులోని ప్రధమవల్లి శిక్షావల్లి ‘శంనో మిత్రః…’ అనే శాంతిమంత్రంతో మొదలవుతుంది.

ఈ శాంతిమంత్రంలో విభిన్న దేవతలను మానవాళికి మేలు చేకూర్చమని ప్రార్ధన చేస్తారు..

ఇందులో ప్రతి దేవతా బహిర్గతంగా ఈ విశ్వంలో ఒక శక్తిని మనిషిలో అంతర్గతంగా ఒక శక్తిని ఉత్తేజపరచి క్రియా శీలకంగా పని చేయిస్తున్నాయని చెప్పేరు. ఈ దైవీ శక్తులన్నీ ఏకీకృతమై ఒకే దిశలో పనిచేస్తే ప్రపంచం అంతా అనుకూలంగాను ఆనంద దాయకం గాను ఉంటుంది. సమస్త జగత్తులలోను కల్యాణప్రదంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు మనలో అంతర్గత శాంతి ఉచ్చస్థితిలో ఉంటుంది.

ఓం శంనో మిత్రః శం వరుణః శంనో భవత్వర్యమా!
శంన ఇంద్రో బృహస్పతిః! శంనో విష్ణురురుక్రమః
నమో బ్రహ్మణే! నమస్తేవాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి!
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి!
ఋతం వదిష్యామి! సత్యం వదిష్యామి! తన్మామవతు! తద్వక్తారమవతు!
అవతుమాం! అవతు వక్తారం!!
ఓం శాంతిః శాంతిః శాంతిః!!

ప్రాణానికి, పగటికి అభిమానదేవత యైన మిత్రుడు మనకు మేలుజేయు గాక.

అపానానికి, రాత్రికి అధిపతియైన వరుణుడు మనకు సమస్త శుభములను కలుగ జేయుగ గాక!

కళ్ళకు, సూర్యునికి అభిమాన దేవత ఆర్యముడు మనకు శుభాన్ని కలుగ జేయు గాక!

చేతులకు, బలానికి అభిమాన దేవత ఇంద్రుడు మనకు మేలుజేయుగాక!

వాక్కుకు, బుద్ధికి అభిమాన దేవత బృహస్పతి మనకు సమస్త శుభములని ఒసగు గాక!

పాదాలకు, ఆకాశ తత్వమునకు అభిమాన దేవత మరియు విశాల వ్యాప్తి యైన విష్ణువు మనలోని ప్రాణశక్తిని ఉద్దీపింప జేయుగాక!

ఓ వాయుదేవా! నీకివే మా నమస్కారములు.
నీ ఉనికితోనే మానవుని మనుగడ ముడివడి ఉంది. నీవే ప్రత్యక్ష బ్రహ్మవు. ఆత్మ, ప్రాణం – ఈ రెండూ స్థూలమునకు గోచరము కానివి. కాని ఆ రెండింటి సాక్షాత్కారానికి స్థూలంలో గోచరమయ్యే నీవే (వాయువే) మాకు ప్రత్యక్ష బ్రహ్మ.

నిన్ను ఆధారముగా చేసుకొని మాత్రమే ప్రాణశక్తిని పెంపొందించుకొని ఆత్మ దర్శనం చేసుకోవడం సాధ్యం. అంతటి నువ్వు వినా మాకు ప్రత్యక్ష బ్రహ్మ లేరనేది ముమ్మాటికి నిజము. నేను ఋతాన్నే చెబుతున్నాను. సత్యాన్నే చెబుతున్నాను.

(ఓ వాయుదేవా! నేను ఎల్లప్పుడూ బుద్ధికి గోచరమైన ఆ ఋతమే నీవని పలుకుతున్నాను. యావత్ సృష్టికి వెనుకనున్న సూత్రాన్ని ఆంతర్యంలో తెలుసుకొని ఎల్లప్పుడూ నీవు ఆ సత్యం అని చెబుతున్నాను. – అని కొందరు వ్యాఖ్యానిస్తారు).

(ఇక్కడ ఋతం, సత్యం అనేవి రెండూ సత్యాన్నే సూచిస్తున్నా వాటిలో వైవిధ్యం ఉంది. ఋతం అనేది వ్యవహారిక సత్యం అయితే సత్యం అనేది పారమార్ధిక సత్యం. ఉదాహరణకు సూర్యుడు తూర్పున ఉదయించడం, పశ్చిమాన అస్తమించడ మనం నిత్యం చూసే సత్యం. మనంకన్నులతో చూచే సత్యం ఋతం అనిపించ బడుతుంది. అలాగే భూగోళము దాని కదలికలు కూడా వ్యవహారిక సత్యం, లేదా ఋతం అనబడుతుంది.

ఈ సృష్టి లోని సమస్తానికి వెనుకనున్న సూత్రం- ఆ భగవంతుడే అదృశ్యం గా ఉండి నడిపిస్తున్నాడన్నది పారమార్ధిక సత్యం. అంటే మనం సత్యం వచిస్తున్నామని చెప్పేదంతా సత్యం.)

(ఇప్పటివరకూ ఎవరినైతే పరబ్రహ్మమని అంటున్నామో) ఆపరబ్రహ్మ నన్ను రక్షించు గాక! ఆ పరబ్రహ్మ ఆచార్యుని రక్షించుగాక! ఆ పరబ్రహ్మ నన్ను, మా ఆచార్యుని రక్షించుగాక!

వచ్చే భాగంలో శిక్షావల్లి మొదటి అనువాకం మొదలు పెడదాం.

74. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation)

శిక్షణ గురించి చెప్పేదే శిక్షావల్లి.

శీక్షాం వ్యాఖ్యాస్యామః! వర్ణస్స్వరః మాయ్రా బలమ్! సామ సన్తానః! ఇత్యుక్తశ్ధీక్షాధ్యాయః!

వర్ణములు, స్వరములు, మాత్రలు, బలము, సామము, సంతానము అనేవి వేదాధ్యయనంలో ముఖ్యమైన ఆరు అంశాలను ఈ శిక్షాధ్యాయం లో వివరించారు.

సహనౌ యశః! సహనౌ బ్రహ్మవర్చసమ్! అధాతస్సగ్ం హితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః!!

మనకు (గురుశిష్యులిద్దరకూ) యశస్సు, బ్రహ్మవర్చస్సు ప్రాప్తించాలని శిష్యులు కోరుకొంటూంటే గురువు మహా సంహితలను (సంయోగాలు) వివరించడానికి ప్రారంభిస్తున్నాడు.

పంచస్వధికరణేషు! అధిలోకమధిజ్యౌతిష మధివిద్య మధిప్రజ మధ్యాత్మమ్! తామహాసగ్ంహితా ఇత్యాచక్షతే!!

గురు శిష్యుల సంయోగం ఎంతటి ఆనందదాయకం, విజ్ఞానమయం మరియు సుఖప్రదంగా ఉండాలో అన్నదానిని ప్రాతిపదికగా చేసుకొని జగతిలో సంయోగానికి శిక్షణ ఐదు విధాలుగా వివరింప బడింది.

పృథివి(ప్రపంచం), తేజస్సు, విద్య, సంతతి, శరీరం(ఆధ్యాత్మం) అనే ఐదింటిని ప్రగాఢంగా ఆలోచన చేయడమే ముఖ్యమైన శిక్షణలు గా చెప్పబడు తున్నాయి.

అధాధిలోకమ్! పృథివీ పూర్వరూపమ్! ద్యౌరుత్తర రూపమ్! ఆకాశస్సంధిః! వాయస్సంధానమ్! ఇత్యధిలోకమ్!!

ఇంక ప్రపంచం విషయానికొస్తే, పృథివి పూర్వ రూపం, ద్యులోకం ఉత్తర రూపం, ఆకాశం (అంతరిక్షం) సంధి. వాయువు సంధానం.

అంటే దిగువ భాగమైన భూమి, పై భాగమైన ఆకాశం రెండూ కలుసుకొనే ప్రదేశం (సంధి)అంతరిక్షం. ఈ రెండిటినీ సంధానం చేస్తున్నది వాయువు. దీనిని లోక సంహిత అంటారు.

ప్రకృతిలోని అందాలను ఆరాధించడం, ప్రకృతి యొక్క మహత్వాన్ని తెలుసుకొనే ప్రయత్నాన్ని చేయడం కూడా ఆధ్యాత్మ చింతనే.

అథాధిజ్యౌతిషమ్! అగ్నిః పూర్వరూపమ్! ఆదిత్య ఉత్తరరూపమ్! ఆపస్సంధిః! వైద్యుతస్సంధానమ్! ఇత్యధిజ్యౌతిషమ్!!

తేజస్సు విషయానికొస్తే అగ్ని పూర్వ రూపం; ఆదిత్యుడు ఉత్తర రూపం; జలం సంధి; విద్యుత్తు లేదా తేజస్సు సంధానం.

అథాధివిద్యమ్! ఆచార్యః పూర్వరూపమ్! అన్తేవాస్యుత్తరరూపమ్! విద్యా సన్ధిః! ప్రవచనగ్ం సన్ధానమ్! ఇత్యధివిద్యమ్!!

విద్యకు- ఆచార్యుడు మొదటి రూపం; శిష్యుడు రెండవ రూపం. విద్య సంధి; బోధన సంధానం.

అథాధిప్రజమ్” మాతాపూర్వరూపమ్! పితోత్తరరూపమ్! ప్రజననగ్ం సన్థానమ్! ఇత్యధిప్రజమ్!!

ప్రజ లేక సంతతికి- తల్లి పూర్వ రూపం; తండ్రి ఉత్తర రూపం; ప్రజ లేక సంతతి సంధి. జననమే సంధానం.

తల్లి తండ్రి కలుసుకోవడం వలన ప్రాణం జనిస్తుంది. ఇద్దరిని సంధాన పరచేది శారీరిక సంబంధం. ప్రాణుల ఉత్పత్తి లేదా సంతతి ఉత్పత్తుల గురించిన భావన ఇలా చేయబడుతుంది.

ఇదేవిధంగా శరీరం గూర్చిన భావనను పరికిస్తే: క్రింది పెదవి (దవుడ)మొదటి రూపం; పై పెదవి (దవడ) రెండవ రూపం; వాటిద్వారా ఏర్పడే వాణి లేదా వాక్కు సంధి. పై దవడ క్రింది దవడ కలుసు కొన్నప్పుడు సంధానించే వస్తువుగా నాలుక ఉంటుంది.

వాక్కును నియంత్రించడమే ఆధ్యాత్మ జీవితానికి మొదటి మెట్టుగా పేర్కొన్నారు ఆదిశంకరులు.

ఇవి మహా సంహితలు. వీటిని తెలుసుకొన్న వ్యక్తి సంతతిని, గోసంపద, బ్రహ్మవర్చస్సు, అన్నాదికాలతో కూడినవాడై ఈ దేహాన్ని త్యజించిన తర్వాత ఉత్తమ లోకాలను పొందు తాడు.

International day of yoga సందర్భంగా 22nd తారీఖు వరకూ హంపిలోని మా ఆశ్రమం (అచ్యుతాశ్రమం) లో ఉంటుండడం వల్ల ఉపనిషత్తులకు కొంచెం అంతరాయం ఏర్పడుతోంది. తిరిగి 23 నుంచి సక్రమంగా ఉంటాయి.

75. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation)

క్రితం భాగం లో శిక్షావల్లి లో ఐదు మహా సంహితల గురించి వివరించబడ్డాయి. ఇప్పుడు. ఋషభుడనే ఋషి చేసిన ప్రార్ధన ఇలా ఉంది.

యశ్చంద సామృషభో విశ్వ రూపః ఛందో భ్యోధ్యమృతాత్సంబభూవ।।

అమృతం లోంచి, నాశరహిత శక్తి అంటే ప్రాణశక్తి యొక్క స్పందన లోంచి పుట్టిన భూతాదులే ఛందస్సులు. ఆ ఛందస్సులతో భూతధాతువుల సమ్మేళనంతో ఉద్భవించిన వాళ్ళు ముందుగా తత్వాభిమాన దేవతలు. వాళ్ళలో ఋషభుడు చాలా శ్రేష్ఠుడు.

ఆ తత్వాభిమాన దేవతలందరికన్నా ముందే పుట్టి వాళ్ళ సృష్టికే కారణమైన వాడు, వాళ్ళందరకూ యజమానియైన వాడు ఇంద్రుడు. అతనినే విరాట్ పురుషుడు అని అంటారు. ఉపనిషత్కారులు ఆ ఇంద్రుడు అంటే విశ్వ కర్మ లేదా విరాట్ పురుషుడిని అదృశ్యుడైన బ్రహ్మ చేత రచించబడిన కోశానివి నీవు అంటూ వర్ణిస్తూ అతనిని ఇలా ప్రార్ధించేడు.

ఆ విరాట్ పురుషుడు మమ్మల్ని మేధా సంపన్నులుగా, అమృతత్వాన్ని పొందిన వారుగా తీర్చి దిద్దాలని, దేహశక్తి, బ్రహ్మ జ్ఞానం గురించి వినే అవకాశం, ఆ మధురవాక్యాలను కరుణించాలని ప్రార్ధించేడు.

ఆ మంత్రాలలో ఏ దివ్య నాదం వేదాలకు ఎంతో ప్రధానమైనదో, ఏ నాదం సమస్త స్వరూపంగా ఉందో, ఏ మహానాదం అమృతమయమైన వేదాలనుంచి ఆవిర్భవించిందో ఆ దివ్య ఓంకార నాదం మాకు మంచి మేధస్సును ఇచ్చుగాక। ఓ దేవా। మాకు బ్రహ్మజ్ఞానం లభించుగాక। నా శరీరం సంపూర్ణ ఆరోగ్యం తో ఉండుగాక। నా నాలుక మధురంగా సంభాషించుగాక। నా చెవులు మంచి మాటలనే వినుగాక। ఓ ఓంకారమా। నీవు సాక్షాత్తూ ఆ భగవంతుని నివాస స్థానానివి.

నేను నేర్చుకొన్న విద్యనంతా మరచిపోకుండా నన్ను అనుగ్రహించు.

నా విద్యార్ధులకు అనుకూలంగా ఉండే సమస్త సంపద ప్రసాదించు. బ్రహ్మచారులు (మంచి కర్మ శిక్షణ కలిగిన శిష్యులు) అన్ని దిక్కులనుండి ఎక్కువ సంఖ్యలో నాదగ్గరకు వచ్చేట్లా అనుగ్రహించు.

ఓ భగవాన్। నేను నీలో ఐక్యమవుతాను గాక। అలాగే నీవు కూడా నాలో ఐక్యమవుగాక. నీవే నాకు

అభయాన్ని ప్రసాదించేవాడివి. నాకు చైతన్యాన్ని వెలుగును ప్రసాదించు. నన్ను నీ వాడిగా స్వీకరించు. అంటూ ఋషభుడు ప్రార్ధించేడు.

వచ్చే భాగంలో భూః, భువః, సువః అనే వ్యాహృతులనే కాకుండా మహః అనే వ్యాహృతిని మహా చమస్యుడనే ఋషి వివరించిన వైనం చూద్దాం।

76. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – శిక్షావల్లి

భూర్భువః సువరితి వా ఏతాస్తి స్రోవ్యాహృతయః తాసాము హ స్మైతాం చతుర్ధీం మహా చమస్య ప్రవేదయతే। మహ ఇతి తత్బ్రహ్మ। స ఆత్మా అంగాన్యన్యా దేవతాః భూరితి వా అయం లోకః భువ ఇత్యంతరిక్షం। సువరిత్యసౌ లోకః।।

భూః, భువః, సువః అనే పదాలు (వ్యాహృతులు) పదునారు భువన భాండమ్ములు లోనివి. -ఏడు ఊర్ధ్వలోకాలు, ఏడు అధో లోకాలు ఉన్నాయని, ఈ జీవుడు దేహం విడిచిన తర్వాత ఓతప్రోతముగా ఒక లోకం నుండి మరో లోకానికి పయనిస్తూ ఉంటాడని మనం చెప్పుకొన్నాం. భూః అంటే భూమి. మనం జీవించే లోకం. భువః అంటే పితృలోకం. మరణించిన మన పూర్వులు నివసించే లోకం. సువః అంటే స్వర్గలోకం. దేవతలు నివసించే లోకం. ఇవి ఒకదానికన్న మరొకటి సూక్ష్మమైనవి.

ఇవి వివిధ చైతన్య స్తితులలో ఉన్న లోకాలు. ఈ మూడు చైతన్య స్తితులతో బాటు మహః అనే నాల్గవ స్తితిని మహా చమస్య ఋషి గుర్తించాడు. ఆ ఋషి అభిప్రాయం ప్రకారం మహః అనే నాల్గవ చైతన్య స్తితి, పై మూడు స్ధితులను తనలో ఇముడ్చుకో గలిగినది.

మహః అంటే భగవంతుడు. పరబ్రహ్మ. అదే బ్రహ్మం. సూర్య భగవానుడు. అతని వల్లే లోకాలన్నీ జీవిస్తున్నాయి.

ఆ బ్రహ్మకు, మన దేహంలో జీవాత్మకు వేర్వేరు అవయవాలున్నట్లే, ఈ కనుపించే దంతా భూః – వీటి మధ్యనుండే అంతరిక్షం భువః; అగోచరంగా ఉండేదే సువః; ఆదిత్యుడే మహః. అతని ద్వారానే అన్ని లోకాలకు అస్థిత్వం.

ఇంకో భావంలో భూః అంటే అగ్ని; భువః అంటే వాయువు; సువః అంటే సూర్యుడు; మహః అంటే చంద్రుడు. ఈ చంద్రుడి వల్లే సకల జీవరాశులు వృద్ధి చెందుతున్నాయి.

మరొక భావంలో భూః అంటే ఋగ్వేదం; భువః అంటే సామవేదం; సువః అంటే యజుర్వేదం. మహః అంటే ఓం కారం. ఈ ఓం కారం వల్లే సకల వేదాలు గొప్పతనాన్ని పొందుతున్నాయి.

అలాగే భూః అంటే ప్రాణం; భువః అంటే అపానం; సువః అంటే వ్యానం. మహః అంటే ఆహారం. ఈ ఆహారం వల్లే సకల ప్రాణులూ వర్ధిల్ల గలుగుతున్నాయి.

అంతర్ హృదయమే ఆకాశం. అక్కడ ఉండే పురుషుడు మనోమయుడై ఉన్నాడు. అతడు ఇచ్ఛా జ్ఞాన శక్తులతో కూడినవాడు. చావు లేని వాడు. హిరణ్మయమే శరీరంగా కలవాడు. అంటే తేజోవంత మైన శరీరం కలవాడు.

ఈ నాలుగు రకాల కలయికలను చింతన చేస్తూ పదహారు16 రకాల భావనలను తెలుసుకొన్న వ్యక్తి ఆ భగవంతుని తెలుసుకొన్న వాడవుతాడు. సకల దేవతలు అతనికి ఎన్నో కానుకలను సమర్పిస్తారు. అంటూ పంచమ అనువాకం ముగుస్తుంది.

వచ్చే అనువాకంలో గురుస్ధానాన్ని, దాని మార్గాన్ని, గమ్యస్థానాన్ని సూచిస్తూ చక్కటి ధ్యానమే గమ్యానికి మనలను చేర్చగలిగేది అంటూ చెబుతున్నారు.

77. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – శిక్షావల్లి

గురుస్థానం దొరకకపోతే గమ్యస్థానం చేరలేము.

ఓంకారానుష్ఠానం గురుస్ధానాన్ని ఆధారంగా చేసుకొని చేయాలి.

ఓంకారాన్ని నోటితో కాని, కంఠంతో కాని, ముక్కుతో కాని, మనసుతో కాని మరే ఇంద్రియ సహకారంతో ఉచ్ఛరించడం ద్వారా పరమాత్మను దర్శించడం దుర్లభం.

ప్రాణుని తో చేసే ఓంకార అనుష్ఠానం మాత్రమే మోక్షదాయకమని చాందోగ్యోపనిషత్తు నొక్కి చెబుతోంది.

గురు స్ధానాన్ని ఆధారంగాచేసుకొని (pivotal point) ప్రాణునితో చేసే ఓంకారమే మనలను పరమపదానికి తీసుకొని పోగలుగుతుంది అని చెబుతుందీ మంత్రం.

స య ఏషోన్త ర్హృదయ ఆకాశ్న తస్మిన్నయం పురుషోత్తం మనోమయః।
అమృతో హిరణ్మయః ।।

ఏ పరమాత్మ అయితే ఉందో, అది జీవుల హృదయం అనే ఆకాశంలో విరాజిల్లుతోంది. ఆ ఆత్మ ఎంతో
చైతన్యవంతమైంది. ఆ పురుషోత్తముడు మనోమయుడై ఉన్నాడు. నాశనం లేనిది. జ్యోతి స్వరూపంగా ప్రకాశించేది.

అన్తరేణ తాలుకే।
య ఏష స్తన ఇవావలమ్బతే।
సేన్ద్రయోనిః యత్రాసౌ కేశన్తో వివర్తతే।
వ్యపోహ్యశీర్ష కపాలే।

నోటి లోపల అంగుటిలో (స్ధనాగ్రం లాగ) చిన్న కొండనాలుక అనేది వ్రేలాడుతూ ఉంటుంది. దాని పై భాగాన్నే గురుస్ధానము అంటారు. ఆ ప్రదేశము అత్యంత ప్రాముఖ్యమైనది.

భ్రూమధ్యానికి సరిగ్గా వెనుకగా నోట్లో గంటను పోలిన స్ధానములో వ్రేలాడుతూ ఉండే కొండ నాలుక పై భాగమే మనలను భగవంతుని దరి చేర్చడానికి ఉన్న మార్గము. దానినే ఇంద్రుని ద్వారం అంటారు. గురు స్థానం అంటారు.

ఇక్కణ్ణుంచి శిరస్సులోని కేశ మూలాల వరకూ ఆ మార్గం వ్యాపించి ఉంది.

ఆ మార్గంలో వెళ్ళే వాడి శరీరంలోని ఇంద్రుడు (ఇక్కడ ప్రాణ శక్తి)అతని తలలోని వెంట్రుకల మొదళ్ళు ఉండే చోటుకు అంటే కపాలాన్ని చొచ్చుకొని పోతుంది. అగ్నిలోను వాయువులోను ఉండేది ఆశక్తే.

రాబోయే ఉపనిషత్తులలో సహస్రారానికి దగ్గరగా గుహలో ప్రతిష్టితమైన ఆత్మ యొక్క ఉనికిని కూడా తెలుపుతారు ఉపనిషదృషులు.

భూరిత్యగ్నౌ ప్రతితిష్టతి।।….
భువ ఇతి వాయౌ। సువరి త్యాదిత్యే। మహ

ఇతి బ్రహ్మణి।

సాధకుడు భూః, భువః, సువః, మహః అనే నాలుగు వ్యాహుతులను నిష్టగా ధ్యానించడం వల్ల క్రమంగా అగ్ని, వాయువు, సూర్యుడు, భగవంతునితో తాదాత్మ్య స్థితి ని పొందుతాడు.

ఆప్నోతి స్వారాజ్యమ్। ఆప్నోతి మనసస్పతిమ్, వాక్పతి శ్చక్షుష్పతిః। శ్రోత్రపతి ర్విజ్ఞాన పతిః। ఏతత్తతో భవతి।”

స్వరాజ్యాన్ని పొందుతాడు అంటే ఇంద్రియ దాశ్యం నుంచి

మనస్సుకు విముక్తినివ్వ గలుగుతాడు-మనస్సున కధిపతి అవుతాడు.
(మనస్సు యొక్క చాంచల్య స్ధితి తొలగింప బడుతుంది).

వాక్పతే కాకుండా సమస్త ఇంద్రియాలకు బలమందించే వాడు కనుక వాక్ చక్షు, శ్రోత్రములకధిపతి.

జ్ఞాన ప్రాప్తికి సాధనం శక్తి కావడం వల్ల విజ్ఞానపతి అయ్యాడు. ఈ విధంగా తనకు తానే అధిపతి అయ్యాడు.

విశ్వంలో సర్వ భూతధాతువుల ఉత్పత్తి అతనినుంచే కావడం వల్ల అన్నింటికీ అతీతమైన శక్తి బ్రహ్మ అతడే.

ఆకాశ శరీరం బ్రహ్మ। సత్యాత్మ ప్రాణారామం మన ఆనన్దమ్। శాన్తి సమృద్ధ మమృతమ్। ఇతి ప్రాచీనయోగ్యో పాస్స్వ (వాయా వ మృతమేకంచ।।)

ఆకాశమే అతని ఆవరణం. అకాశాన్ని శరీరంగా, సత్యాన్ని ఆత్మగా, ఆనందాన్ని మనసుగా చేసుకొని శాంతితో అమృతుడైన, పరిపూర్ణమైన పరబ్రహ్మ గా మారిపోతాడు.

ఇలా నీవు మారాలంటే అందుకు తగిన యోగ్యత కలిగేందుకు చక్కగా ఓంకారానుష్టానంతో ధ్యానం చేయి.

గురువు గరుడాసనములో కూర్చొని హస్తమస్తక సంయోగం ద్వారా, సాధకుని దక్షిణ కర్ణములో గురువు చేసే ప్రణవనాదమే అచ్యుతయోగ విద్యోపదేశం అనబడుతుంది.

పైన చెప్పిన గురుస్ధానం నుండి ప్రాణుని ఆధారంగా చేసే ఓంకార అనుష్ఠానము మాత్రమే ప్రణవనాదం అనబడుతుంది.

78. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – శిక్షావల్లి

ఆకాశాన్ని శరీరంగా, సత్యాన్ని ఆత్మగా, ఆనందాన్ని మనసుగా చేసుకొని, శాంతితో అమృతుడైన, పరిపూర్ణమైన బ్రహ్మగా మారాలంటే చక్కగా ఓంకారాను ష్టానంతో ధ్యానం చేయి అన్నాడు.

ఓంకారమే భగవంతుడు. ఈ సమస్తం ఓంకారమే. తన సమ్మతిని తెలుపడానికి “ఓం”అంటున్నారు.

విను అని చెప్పడానికి, వింటున్నాను అని సమాధానం ఇవ్వడానికి కూడా “ఓం” అంటున్నారు.

ఓం అంటూ సామగానాన్ని పాడుతున్నారు. ఓం శోం అంటూ ఋగ్వేద మంత్రాలు పఠిస్తున్నారు.

యాగకర్త అడిగి నప్పుడు యాగం చేస్తున్న వాడు ఓం అని స్పందిస్తున్నాడు. ప్రధాన పురోహితుడు కూడా ఓం అనే అనుజ్ఞ నిస్తున్నాడు. ఓం అని అంటూనే అగ్నిహోత్రం చేయడాన్కి అనుమతి నిస్తున్నాడు.

ఓం అని బ్రాహ్మణులు వేదపాఠం చెప్పుకొనే ముందు అంటున్నారు.

ఇలా ఓంకారాన్ని జపిస్తూ పరబ్రహ్మను పొందాలని గ్రహించి ఆ పరబ్రహ్మ నే పొందుతున్నారు.

ఒక వ్యక్తి సత్ప్రవర్తనా నియమావళులతో జీవిస్తున్నప్పుడు, అతని చుట్టూరా మంచి సమాజం రూపొందుతుంది.

విద్యార్ధి దశ లోనే ఈ క్రింది నియమాలను అలవాటు చేయాలని శిక్షావల్లి సూచిస్తూంది.

మానవులకు నేర్చుకోవడం నేర్పించడం అనేవి ముఖ్యమైన కర్తవ్యాలు.

ముద్గల మహర్షి కుమారుడైన నాకుడు అనే ముని నేర్చుకోవడం, నేర్పించడం అనేవాటినే తపస్సు అంటారని చెప్పాడు.

వాటిని నిర్వహించడంతో బాటు ఋతం, సత్యం, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, ప్రశాంత తత్వం కలిగి ఉండాలి.

యాగాలు, అగ్నిహోత్రాలు నిర్వహించాలి. యాగానికి నిర్వచనం ఏమిటంటే ఈ లోకంనుంచి మనం
పొందినవి తిరిగి సమాజానికి ఇచ్చివేసే పద్ధతిలో (giving back to the society) మన జీవితాన్ని అమర్చుకోవడమే యాగం అనబడుతుంది.

అతిధులను ఆదరంగా చూడాలి. మానవులందరకూ మంచి కలిగించే పనులను చేయాలి. మంచి సంతానాన్ని కనాలి.

పూర్వం రాధీతర వంశం లో జన్మించిన సత్యవచనుడనే మహర్షి సత్యమే గొప్పదని చెప్పాడు.

తరువాత దీర్ఘ తపస్సు చేసిన పౌరుశిష్టి అనే మహర్షి తపస్సే ముఖ్యమైనదని అన్నాడు.

ఇక్కడ త్రిశంకుడనే ముని (ఆ త్రిశంకుడు కాదు) అన్ని నియమావళులను సక్రమంగా పాటించి, తను ఎంత శక్తిమంతుడయ్యాడో ప్రకటిస్తున్నాడు.

“నేను సంసారమనే వృక్షానికి బలాన్ని చేకూర్చేవాడిని. పర్వత శిఖరం అంత ఉన్నతంగా నా కీర్తి ఘనతకెక్కింది. అది పవిత్రమైనది. సూర్యుడిలా నేను అమరుడిలా ఉంటున్నాను. ఎన్నో సంపదలతో ప్రకాశిస్తున్నాను. జాగృతి చెందిన చైతన్యంతో ఉంటున్నాను. మరణం లేని వాడను. నేను అవ్యయుడిని. ఇది నా అనుభవము.”

(ఒక రకంగా చూస్తే ఇది ఒక self suggestion- after completing the entire learning process in Gurukula.)

ఒక్కసారి తైత్తిరీయోపనిషత్తుని మొదటి నుంచి పరికించి చూస్తే యాజ్ఞవల్క్యుని లోని అహంకారము, గురుధిక్కార ధోరణి అతనిని గురువు యొక్క ఆగ్రహానికి గురి అయ్యేటట్లు చేసాయి. దాని పర్యవసానంగానే తైత్తిరీయోపనిషత్తు ఉద్భవించింది.

ఆ కారణం వల్ల, ఈ శిక్షావల్లిలో, నేర్చుకొనే చదువు ఎంత గొప్పదో, నేర్పించే గురువు అంతకంటే ఎంత ఘనుడో అనే విషయం వివరింపబడింది. నేర్చుకొన్న విద్య శోభించాలంటే విద్యార్ధికి వినయం, నమ్రత, గురు భక్తి ఎంత ముఖ్యమో తెలుపబడ్డాయి.

ఏకాదశఅనువాకం, ద్వాదశ అనువాకాలలో విద్యాభ్యాసం ముగించుకొని లౌకిక ప్రపంచంలో అడుగుపెట్టే ప్రతి విద్యార్ధికి తనను తాను సంఘానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చి దిద్దుకోడానికి అవసరమైన అనేక కర్తవ్యాలను గురువు బోధించాడు.

ఈ పద్ధతి స్నాతకోపన్యాసాన్ని తలపిస్తోంది.

ఆ విషయాలన్నీ వచ్చే భాగంలో…

79. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – శిక్షావల్లి…। ఏకాదశ అనువాకం

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు చెందిన అన్ని కార్యక్రమాల ప్రారంభం లోనూ ఈ ఏకాదశ అనువాకాన్ని పఠించి కార్యక్రమం మెదలు పెట్టడం ఆనవాయితీ.

వేదశాస్త్రాధ్యనం సంపూర్ణంగా పూర్తి చేసుకొని గురుకులాన్ని వదలి తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులకు గురువు ఇచ్చే అద్భుతమైన సందేశమే స్నాతకోపన్యాసంగా ఈ అనువాకంలో చెప్పబడింది.

వేదమనూచ్యాచార్యో న్తేవాసినమనుశాస్తి –
వేదాలను నేర్పించిన తరువాత ఆచార్యుడు అన్తేవాసులకు (విద్యార్ధులకు) ఇలా ఉపదేశిస్తున్నాడు.

సత్యం వద।
సత్యాన్నే పలకండి. సత్యసంధతతో జీవించండి.

ధర్మం చర।
ధర్మాన్ని అనుష్ఠించండి.

స్వాధ్యాయాన్మా ప్రమదః।
చదువుకొన్న విద్యను చేజార్చుకోకండి. పునశ్చరణ

చేసుకొంటూ శిష్యులకు బోధించడంద్వారా పరిరక్షించుకొని అభివృద్ధి చేసుకోండి.

ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య –
ఆచార్యునికి ఇష్టమైన గురుదక్షిణ సమర్పించండి. గురు కృపను పొందండి.

ప్రజాతన్తుం మా వ్యవచ్ఛేత్సీః।।-
వివాహం చేసుకొని సంతాన పరంపరను కొనసాగిస్తూ వంశం విచ్ఛిన్నం కాకుండా చూచుకోండి.

సత్యాన్న ప్రమదితవ్యమ్।
నాయనా సత్య

మార్గం నుండి వైదొలగవద్దు.

ధర్మాన్న ప్రమదితవ్యమ్।
ఎట్టి పరిస్తితుల్లోను ధర్మ మార్గం నుంచి తొలగిపోవద్దు.

కుశలాన్న ప్రమదితవ్యమ్।
మానవజాతికి, మనకి మేలును చేకూర్చే పనులనుంచి తొలగి పక్కకు పోవద్దు.

భూత్యైన ప్రమదితవ్యమ్।
సత్కార్యాలు చేసే మార్గం నుంచి తొలగి పోవద్దు.

స్వాధ్యాయప్రవచనాభ్యాం న ప్రమదితవ్యమ్। నేర్చుకోవడం, నేర్పించడం అనే పనులనుండి తొలగి వెళ్లకండి.

దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యమ్।। దేవతలకు, పితృదేవతలకు చేయవలసిన కర్తవ్యాలనుండి ఏమాత్రం పక్కకు తొలగి వెళ్ళకండి.

మాతృదేవోభవ।
తల్లిని దైవంగా పూజించండి.

పితృదేవోభవ।
తండ్రిని దైవంగా స్తుతించండి.

ఆచార్యదేవో భవ।
మీకు విద్య నేర్పిన గురువును దైవంగా అర్చించండి.

అతిధిదేవో భవ।।
అతిధిని దైవముగా గౌరవించండి.

యాన్యనవద్యాని కర్మాణి। కాని సేవితవ్యాని।
నింద్యారహితములైన పనులనే చేయండి.

నో ఇతరాణి।
మిగిలిన నిందనీయమైన చెడ్డ పనులను చేయకండి.

యాన్యస్మాకగ్ం సుచరితాని।
మనకు సద్గుణాలను పెంపొందించే పనులే

తాని త్యయోపాస్యాని।
మీచే చేయబడాలి. కాని

నో ఇతరాణి।
ఇతర పనులను చేయరాదు.

యేకే చాస్మచ్ఛృేయాగ్ంసో బ్రాహ్మణాః।
ఎవరు మనకన్న శ్రేష్ఠులైన వారో, పునీతులో (పవిత్రులో) అటువంటి వారు వచ్చినప్పుడు లేచి నిలబడి

తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యమ్।।
వారికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి వారి శ్రమని దూరంచేసే పరిచర్యలు చేయాలి.

శ్రద్ధయా దేయమ్।
శ్రద్ధతో దానం ఇవ్వాలి.

అశ్రద్ధయా దేయమ్।
చులకన భావంతో అశ్రద్ధగా ఉదాసీన వైఖరితో దానం చేయకూడదు. పాత్రమెరిగి దానం చేయాలి.

శ్రియా దేయమ్।
శక్తివంచన లేకుండా దానం చేయాలి. శక్తి మేరకు దానం చేయాలి.

హ్రియా దేయమ్।
వినమ్రతతో దానం ఇవ్వాలి. ఇక్కడ ధన్యత దాతకే కాని దానం పుచ్చుకున్న వాడికి కాదు. దాన గ్రహీత ఉండడం ద్వారా నీ ఔదార్యాన్ని, నీ దయాగుణాన్ని చూపడానికి తద్వారా నీవు పవిత్రుడు అవడానికి అవకాశం లభించిందని కృతజ్ఞుడిగా ఉండాలి.

భియా దేయమ్।
గౌరవ పూర్వకంగా దానం ఇవ్వాలి.

సంవిదా దేయమ్।।
సౌహార్దంతో దానం చేయాలి.

అధ యది తే కర్మవిచికిత్సా వా వృత్తవిచికిత్సా వా స్యాత్।
అసలు చేయ వలసిన కర్తవ్యం ఏమిటి? క్లిష్ట పరిస్తితులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి? అనే విషయాల గురించి మీకు సందేహం తలెత్తినప్పుడు

యే తత్ర బ్రాహ్మణాస్సమ్మర్శినః। యుక్తా ఆయుక్తాః।
అలూక్షా

ధర్మకామ్యాస్స్యుః। యధాతే తత్ర వర్తేరన్।
తథా తత్ర వర్తేథాః।।

మహాత్ములను అనుసరించాలి. ప్రగాఢ చింతనాశీలురు, మనో ఏకాగ్రతను పొందిన వారు, సర్వ స్వతంత్రులు, క్రూరగుణం లేని వారు, సన్మార్గులు అయిన బ్రహ్మ వేత్తలు ఆ యా విషయాలలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరుకూడా అలాగే వ్యవహరించండి.

అథాభ్యాఖ్యాతేషు। యే తత్ర

బ్రాహ్మణాస్సమ్మర్శినః। యుక్తా ఆయుక్తాః। అలూక్షా ధర్మకామాస్స్యుః। యథాతథం క్షుద్ర వర్తేరన్।,తథా తేషు వర్తేథాః।।

దోషులుగా సమాజం పరిగణించే వారి విషయంలో, సమాజంలోచెడ్డవాళ్ళు తారస పడినప్పుడు వారి విషయంలో – స్వతంత్రంగాను, దయతోను యుక్తాయుక్త విచారణా సమర్ధులైన యోగ్యులైన పెద్దలు ఎలా వ్యవహరిస్తారో నువ్వూ అలాగే వ్యవహరించు.

ఏష ఆదేశః। ఏష ఉపదేశః। ఏషా వేదోపనిషత్। ఏతదనుశాసనమ్। ఏవముపాసితవ్యమ్। ఏవముచైత దుపాస్యమ్।।

ఇది ఆదేశం. ఇదే ఉపదేశం. ఇదే వేదరహస్యం. (దేవ రహస్యం). దైవాజ్ఞ కూడా ఇదే. ఇదే అనుసరణీయ మార్గం. దీనిని ఈ విధంగానే చేయాలి.

80. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – శిక్షావల్లి

క్రితం భాగంలో స్నాతకోపన్యాసంలో గురువు శిష్యునితో

నాయనా। నువ్వు సత్య సంధతతో జీవించు. ధర్మాన్ని అనుష్ఠించు. నేర్చుకొన్న విద్యను నిర్లక్ష్యం చేయకుండా మననంచేసుకొంటూ శిష్యులకు విద్యాదానం చేయి. ఆచార్యుడికి ఇష్ట మైన గురు దక్షిణ నివ్వు. వివాహం చేసుకొని పిల్లలను కని వంశం విచ్ఛిన్నం కాకుండా కొనసాగించు. సత్యాన్ని ధర్మాన్ని
వీడకు. మంగళకరమైన కర్మలను తప్పకుండా ఆచరించు. దేవతలకు, పితృదేవతలకు చేయవలసిన కార్యాలను అప్రమత్తతతో నిర్వహించు.

తల్లిని, తండ్రిని, గురువును, అతిధిని దైవాలుగా భావించు. దానం చేసే విషయంలోను, శ్రద్ధతో తమ శక్తి మేరకు వినయంగా మనస్పూర్తిగా ఇవ్వాలనే వివరణ ఇచ్చారు.

ఇదే విధంగా శిక్షావల్లి లో అంతా గురుశిష్య సంబంధాన్ని మెరుగు పరచే విషయాలే చర్చించబడ్డాయి.

ఈ శిక్షావల్లి శంనో మిత్రః శం వరుణః అనే శాంతి మంత్రం తో మొదలయింది. చివరి మంత్రం మళ్ళీ శంనో మిత్రః తో ముగుస్తోంది.

ఈ ముగింపులో, తమ తమ ప్రార్ధనలు మన్నింపబడ్డాయి, నెరవేరబడ్డాయి అని కృతజ్ఞతలు తెలుపుతూ విశ్వాసాన్ని వ్యక్త పరిచారు.

ఇంక ఆనందవల్లి సహనావవతు సహనౌ భునక్తు… అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది.

వచ్చేభాగంలో.

81. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – ఆనందవల్లి – బ్రహ్మానందవల్లి

ఈ ఉపనిషత్తులోని ప్రతి అధ్యాయాయం ఒక శాంతి మంత్రం తో మొదలవుతుందని చెప్పుకొన్నాము కదా। ఈ అధ్యాయాయం క్రింది శాంతిమంత్రం తో మొదలవుతోంది.

కఠోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు, మహానారాయణోపనిషత్తు లకు కూడా ఇదే శాంతిమంత్రం గా ఉంది.

ఓం సహనావవతు। సహనౌ భునక్తు।
సహవీర్యం కరవావహై।

తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై।।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।

గురువు వద్ద శిష్యుడు విద్యాభ్యాసం ప్రారంభించే సమయంలో ప్రతిబంధకాలు లేకుండా విద్యాభ్యాసం పూర్తిఅవడానికి ఇద్దరూ ప్రార్ధించే మంత్రం ఇది.

గురు శిష్యులమైన మన ఇద్దరనూ భగవంతుడు రక్షించుగాక। ఇద్దరనూ పోషించు గాక। ఇద్దరూ కలసి వీర్యాన్ని పొందుదాం.మా అధ్యయనం తేజస్వి

కానీ। (సత్య జ్ఞానాన్ని గ్రహించేందుకు బుద్ధి చురుకుగా పనిచేయనీ). మాలో వైషమ్యాలు లేకుండా ఉండనీ।

గురుశిష్యులిద్దరినీ బ్రహ్మ కాపాడాలనే అర్ధాన్నే చాలామంది రాశారు.

సూక్ష్మంలో చూస్తే వ్యక్తి దేహంలోని మనస్సు, ప్రాణశక్తి ల యొక్క సహకారం ధ్యానానికి చాలా అవసరమైనవి. అందువల్ల మా ఇద్దరనూ అనే చోట, మనస్సు ప్రాణశక్తులకు అన్వయించుకోవచ్చు.

జ్ఞానాన్ని గ్రహించడానికి అవసరమైన శక్తి తీక్షణం అయ్యేటందుకు కావలసిన శక్తే వీర్యం. దాన్ని మనస్సు ప్రాణం కలిసి పొందాలని భావం.

మన శరీరంలో వీర్య శక్తి యొక్క ఉత్పత్తి ప్రాణము మనస్సుల సంయోగ స్తితి లోనే బాగా జరుగుతుందని అనిపిస్తూంది.

అలాగే అంతటా అధ్యయనం అంటే గ్రంధావలోకనమనే చెబుతున్నారు.

కాని ధ్యానంలో అధ్యయనం అనేది అంతర్ముఖ స్థితిలో దొరికే సత్యాన్ని గ్రహించే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.

ప్రాణం మనస్సుల సంయోగంలో అధ్యయనం మొదలయ్యి ఇంద్రియవృత్తులలోని చాంచల్యం తొలగిపోవాలనీ, దేహంలోని మలినాలవల్ల ప్రాణుని గతిలో కలిగే అవరోధాలన్నీ అంతరించా లన్నదే ఈ ప్రార్ధన.

ఆనందవల్లి “బ్రహ్మ విద్యాప్నోతి పరమ్” అనే ఋగ్వేద మంత్రంతో మొదలవుతుంది.

ఎవరైతే సత్యం జ్ఞానం అనంతం అని బ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలను తెలుసుకొంటాడో అతను బ్రహ్మ జ్ఞాని అవుతాడంటూ చెప్పడం చూద్దాం.

82. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – ఆనందవల్లి – బ్రహ్మానందవల్లి

ఈ బ్రహ్మానందవల్లిలో బ్రహ్మము శుద్ధ చైతన్య స్వరూపుడు అంటూ బ్రహ్మము యొక్క లక్షణాలు, బ్రహ్మము యొక్క అస్థిత్వం, బ్రహ్మం నుండే విశ్వం ఆవిర్భవించిందని వివరించబడ్డాయి.

పంచకోశ వివరణ తో పాటు ఆత్మానంద స్ధితిని పొందే వివరణ ఉంది. ఆనందంలోని స్ధాయీ భేదాలు వాటి వివరాలు నిర్వచింపబడ్డాయి. అనేక రకాల దేవతల వివరాలు చెప్పబడ్డాయి.

చివరగా “యతోవాచా నివర్తన్తే అప్రాప్య మనసాసహ…”. అంటూ ఆత్మ జ్ఞానం తెలుసుకొనే విధానాన్ని చెబుతూ బ్రహ్మానందవల్లి ముగుస్తుంది.

“బ్రహ్మవిదాప్నోతిపరమ్” అనేది ఇక్కడ సత్య వాక్కు.

ఈ ఋగ్వేద మంత్రం ఏమి చెబుతోందంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకొన్నవాడు ఎంతో గొప్ప స్ధితిని పొందుతాడు అని.

బ్రహ్మమును తెలుసుకోవడం అంటే జనన మరణ వలయం నుంచి ముక్తిని పొందడమే.

సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మ।

ఆ పరమాత్మను సత్యం, జ్ఞానం, అనంతం అని ఈ ఉపనిషత్తు అభివర్ణించింది.

సత్యం యొక్క ప్రధాన లక్షణం మార్పుకు లోను కాకుండా ఉండడం. అంటే కాలం వల్ల ప్రభావితం కాకపోవడం.

జ్ఞానం అంటే చైతన్యం, ఎరుక, తెలివి. తెలుసుకోబడేది జ్ఞేయం.

తెలుసుకొనేవాడు జ్ఞాత. ఈ మూడింటి కలయికయే జ్ఞానాన్ని కలుగ జేస్తుంది.

అనంతం అంటే ఆదిమధ్యాంత రహితమైనది. అంటే భగవంతుడు సత్యస్వరూపుడు, చైతన్య స్వరూపుడు మరియు అనంతుడు.

యోవేద నిహితం గుహాయాం పరమ వ్యోమన్।
సమస్తానికి అతీతుడై బయట విశ్వ వ్యాప్తంగాను, హృదయ గుహలోను ఆ బ్రహ్మ కొలువై ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకొన్న వాడు

సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ।
అన్ని కోర్కెలను సఫలం చేసుకొన్నవాడవుతాడు.

ఇక్కడ అన్ని కోరికలు అంటే వస్తువులను అనుభవించాలనే కోరిక, పదవులు పొందాలనే కోరిక వంటి ఆశలు నెరవేరతాయని అర్ధం కాదు. ఈ రకమైన కోరికలు ఉన్న వ్యక్తిని భగవ దనుభూతికి దగ్గరగా పోనీయవు.

భగవదనుభూతి పొందిన వ్యక్తిలో ఆ అనుభూతి అతనిలో మరే కోరిక తలెత్తనటువంటి ఆనందాన్ని నింపివేస్తుంది. ఆ తర్వాత లోక కల్యాణానికి అవసరమైన కోరికలు తప్ప సాధారణమైన కోరికలేవీ అతనిలో తలత్తవు.

బ్రహ్మణా విపశ్చితేతి।।
ఈ సత్యాన్ని తెలుసుకొన్న వ్యక్తి సర్వజ్ఞుడైన ఆ భగవంతుని పొందుతాడు.

అంటే అతడు తన జీవిత పరమార్ధాన్ని సాధించినవాడే అవుతాడు.

83. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – ఆనందవల్లి – బ్రహ్మానందవల్లి

ఇప్పుడు సృష్టి క్రమాన్ని వివరిస్తున్నారు.

హృదయాకాశంలో ఉండే ఆత్మ స్ధూలమైన శరీరం కంటే విలక్షణమైనది. అయితే ఈ ఆత్మ అయిదు కోశాలతో కప్పబడి ఉంది అంటూ వాటిని వివరిస్తున్నారు.

మానవులమైన మనలో ఆత్మగా ప్రకాశిస్తున్న ఆ పరమాత్మ నుంచి ఆకాశం ఆవిర్భవించింది. ఆ ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, ఆ నీటినుంచి భూమి ఉద్భవించాయి. తిరిగి భూమిలోనుంచి చెట్లు చేమలు, వీటినుండి ఆహారం ఉద్భవించింది. ఆ ఆహారం నుంచి మానవుడు లేదా సమస్త జీవజాలం ఆవిర్భవించాయి.

ఈ సమస్తం ఆహారం వల్లే జీవించ గలుగుతున్నాయి, వృద్ధిచెందుతున్నాయి. చివరకు అన్నీ ఆ ఆహారంలోనే కలసిపోతున్నాయి.

అంటే మొదట ఆహారాన్ని ప్రాణులు తింటున్నాయి. చివరకు ఆ ఆహారమే ప్రాణులను భక్షిస్తోంది. కనుక ఆహారం అన్నం అని పిలవబడుతోంది. ఇది అన్నమయ ఆత్మ.

అందుకే ఆహారం అనేది అన్నిటికీ ఔషధం అని చెబుతున్నారు. ఎవరైతే ఆహారాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ గా ఉపాసిస్తారో వారికి అన్న సమృద్ధి ఉంటుందని , అన్నం సర్వౌషధమని అభివర్ణించిదీ ఉపనిషత్తు.

ఇతి తస్మాద్వా
ఏతస్మా జనన రసమయాత్ అన్యోంతర ఆత్మా ప్రాణమయః।

ఇలా ఆహారం వల్ల ఏర్పడే బాహ్య శరీరమే కాకుండా మరొక శరీరంకూడా ఉంది. అది మానవ శరీరం లోపల ఉంది. అది ప్రాణ శక్తులతో రూపొందించ బడింది.

లోపల ఉన్న సూక్ష్మ శరీరం వల్లనే బైట ఉన్న స్ధూల శరీరం పరిపూర్ణమౌతుంది. లోపల ఉన్న ఈ సూక్ష్మ శరీరం కూడా బయటి శరీరం లాంటిదే. బయట శరీరం లాగానే సూక్ష్మ శరీరం కూడా రూపాన్ని కలిగి ఉంటుంది.

లోపల ఉన్న సూక్ష్మ శరీరానికి తల భాగం ప్రాణం, కుడి భాగం వ్యానం, ఎడమ భాగం అపానం, దీని శరీరం ఆకాశం, దీని దిగువ భాగం భూమి అంటూ వర్ణించారు.

ఇదే అన్నమయ ఆత్మ లో ఉండే ప్రాణమయ ఆత్మ.

84. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation)- ఆనందవల్లి – బ్రహ్మానందవల్లి

(వేద భారతి వారి ఉపనిషద్ రత్నావళి నుండి ఈ నాటి విషయాలు వివరింప బడ్డాయి.)

కత్తిని ఒర కప్పినట్లే ఈ కోశాలు ఆత్మను కప్పుతున్నాయి. అందు చేత మనం మన స్వరూపాన్ని తెలుసుకోలేక పోతున్నాము.

వరుసగా అన్నమయ కోశం, ప్రాణమయకోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం ఒక దానిలో మరొకటి ఉన్నాయి. (ఉల్లి పాయ లోని పొరలులాగ).

ఆత్మ ఆనందమయ కోశంలో ప్రతిష్ఠితమై ఉంది అంటారు.

మొదటిదైన అన్నమయ కోశం అన్నంతో నిర్మించబడిన శరీరం. దీని శక్తి స్ధూలమైనది.
అన్నం అనే పదం అద్ ధాతువు నుండి వచ్చింది. అద్ అంటే తినడం అని అర్ధం. తినబడడం వల్ల, తినడం వల్ల దానిని అన్నం అంటున్నారు.

పై కోశం కంటే లోపలి కోశం సూక్ష్మం గా ఉంటుంది. దేహము లేదా కోశము అని సూచించడానికి శరీరం అనే పదాన్ని వాడకుండా ఆత్మ అనే పదాన్ని ఉపయోగించారు.

రెండవది ప్రాణమయ కోశం. శరీర వ్యాపారాన్ని నిర్వహించే పంచ ప్రాణాలు ఈ కోశంలోనే ఉంటాయి. ప్రాణమయ కోశం అన్నమయకోశానికి ఆత్మ.

ఈ ఉపనిషత్తు ప్రాణానికి ప్రాముఖ్యత నిచ్చింది. శరీర వ్యాపారానికి ప్రాణమే ఆధారం.

అందుచేత ప్రాణం మీద ధ్యానం చేసే వారు వేదవిహితమైన నూరేళ్ళు (అంటే రెండు భ్రమణాల కాలం నూట ఇరవై అని చెప్పాలి.) ఆయుర్దాయాన్ని పొందు తారు కాని ముక్తిని పొందలేరు.

మూడవది మనోమయ కోశం. జ్ఞానేంద్రియాల నుంచి పొందిన సమాచారం వల్ల సంకల్ప వికల్పాలు చేస్తుంది. కాని ఏ నిర్ణయం తీసుకోలేదు. మనోమయ కోశం ప్రాణమయ కోశానికి ఆత్మ.

మనోమయ కోశానికి మానవాకారం ఉందని చెప్పింది. యజ్ఞ యాగాదులలో అత్యంత ప్రాధాన్యం కల యజుర్వేదం దాని శిరస్సని, ఋగ్వేదం దాని దక్షిణ హస్తమని, సామవేదం ఉత్తర హస్తమని, అధర్వణ వేద మంత్రాలు ప్రతిష్టావహాలని, వర్ణించింది.

ఈ ఉపనిషత్తు మొదట ప్రాణం మీద, తరువాత మనస్సు మీద, ఆతరువాత బుద్ధి(విజ్ఞానం) మీద ఉపాసనలను చెప్పింది.

నాల్గవది విజ్ఞానమయ కోశం. దీనిలో ఉండేది బుద్ధి. మనస్సు నివేదించిన విషయం మీద నిర్ణయం చేస్తుంది. నిర్ణయాత్మక శక్తి బుద్ధి. బుద్ధిని జాగృతంచేసి తద్వారా కార్యకలాపాలు చేస్తున్నప్పుడు చేసే ప్రతి సాధారణ పని కూడా ఒక యజ్ఞమౌతుంది.

ఐదవది, చివరది ఆనందమయ ఆత్మ. దీనిలో ఉండేదే ఆనందం. మనం సుషుప్తిలో అనుభవించే ఆనందం ఇదే. అన్ని కోశాలకన్నా సూక్ష్మాతి సూక్ష్మమైన కోశం ఆనందమయ కోశం.

ప్రియం దీని తల. మోదం దీని కుడి భాగం. ప్రమోదం దీని ఎడమ భాగం. ఆనందం దీని దేహంగా ఉంది. ఆత్మ దీని దిగువ భాగామైన ఆధారంగా ఉంది.

అయితే ఆనందమయ కోశం కేవలం కోశమే కాని ఆత్మ కాదు. ఆ కోశం దాటిన తర్వాతే ఆత్మానందం. అది కలగాలంటే నియమ బద్ధమైన, నీతివంతమైన జీవితం, బ్రహ్మచర్యం, ధ్యానం మాత్రమే మార్గాలు.

ఇష్టమైన వస్తువునో, వ్యక్తినో చూసినందువల్ల కలిగే ఆనందాన్ని ప్రియం అంటారు. ఇష్టమైన దానిని పొందినందు వల్ల కలిగే ఆనందాన్ని మోదం అంటారు. ఇష్టమైన దానిని అనుభవించడంతో పొందే ఆనందాన్ని ప్రమోదం అంటారు.

పై కోశం నుండి లోపలు కోశాలకు పోతున్నకొద్దీ, స్థూలం నుండి సూక్ష్మానికి, సూక్ష్మ తరానికి, సూక్ష్మ తమానికి అక్కడనుంచి సూక్ష్మాతి సూక్ష్మానికి వెడతాము.

ఆత్మ ఎల్ల వేళలా మనలో ఉన్నా, ఈ పైన చెప్పిన కోశాలు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని మనకు తెలియనీయటం లేదు. దాని వల్ల దేహాభిమానం, దానినుంచి దేహమే ఆత్మ అనే అభిప్రాయాన్ని మనకు కలుగ జేస్తున్నాయి. అందువల్ల మన ఆలోచనలన్నీ దేహం యొక్క స్ధాయి లోనే ఉండిపోతున్నాయి.

ఆత్మ లేదు అని వాదించే వాడు ఏదీ లేనివాడుగా అయిపోతాడు. తను ఎక్కడి నుండి వచ్చాడనే దానికే ఆధారం లేకుండా అవుతుంది. సూన్యం లోంచి ఏమీ రాదుకదా।

ఏదయినా ఉద్భవించా లంటే ఏదో ఒక ఉత్పత్తి స్ధానం ఉండాలి కదా।
అందుచేత తప్పక బ్రహ్మం ఉందని ఒప్పుకోవాలి.

బ్రహ్మం ఉందని తెలుసుకొన్నవాడు సమస్తం ఉన్న వాడుగా అయిపోతాడు.

అటువంటి వాడు మహాత్ముడిగా పరిగణింప బడతాడు.

మంచిగా అర్ధం చేసుకోడానికి పంచ కోశ వివరణ అంతా ఈ భాగంలోనే ఇవ్వడం జరిగింది. కొంచెం ఓపికతో చదివి అర్ధం చేసుకోమని మనవి.

85. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation)- ఆనందవల్లి –
బ్రహ్మానందవల్లి

క్రితం భాగంలో ఈ పంచకోశాలలో ప్రతి దేహం స్ధూల దేహం లాగే ఉంటుంది. ప్రతి దేహంలోను తరువాత దేహం చోటు చేసుకొని ఉంటుంది. అలా అని ఒకదానిలో ఇంకొకటి ఉన్నట్లు కాదు.
ఒకదాని కన్న ఇంకొకటి సూక్ష్మమైనదని తెలుసుకున్నాం.

అధాతో నుప్రశ్నాః – ఇప్పుడు శిష్యనికి ఈ క్రింది సందేహాలు కలుగు తున్నాయి

ఉతావిద్యానముం లోకం ప్రేత్య
కశ్చన గచ్ఛతీ। అహో విద్వానముం లోకం ప్రేత్య। కశ్చిత్సమస్నుతా।।

మనిషి మరణించే సమయానికి అవిద్వాంసుడు గా ఉన్నవాడు అంటే బ్రహ్మజ్ఞానం లేని వాడు బ్రహ్మత్వాన్ని పొందగలడా లేక ఆత్మను అర్ధం చేసుకొన్న గ్రహించినవాడే బ్రహ్మత్వాన్ని పొందుతాడా?

అనే ప్రశ్నలకు బదులిచ్చి సంశయ నివృత్తి చేయాలంటే బ్రహ్మము యొక్క నిజ లక్షణాలు, నామరూపాలు గల ఈ విశ్వంగా ఆయన వ్యక్తం అవడం అనే విషయాలమీద గురువు ఇలా విశద పరిచాడు.

భగవంతుడు లోకాన్ని ఎలా సృష్టించాడు?

నేను జన్మిస్తాను గాక। నేను అనేకం అవుతాను గాక। అనే సంకల్పం తో భగవంతుడు తపస్సు చేశాడు. ఈ లోకం అద్భుతమైనది. కోమలమైనది. అలాంటి అద్భుతమైనవి, కోమలమైనవి సృష్టించాలంటే తపస్సు తప్ప మరో మార్గం లేదని ఈ మంత్రం సూచిస్తోంది.

తపస్సు చేసి ఈ సమస్తాన్ని సృష్టించాడు. తపస్సంటే భగవంతుని ఇచ్ఛ లేదా లీల అనుకోవాలి. సృష్టించిన తర్వాత సృష్టిలో ఆయనే సర్వాంతర్యామి అయ్యాడు. అలా ఆయన నిరాకారుడు-సాకారుడు, అనిర్వచనీయుడు-నిర్వచనీయుడు, ఆశ్రయుడు-నిరాశ్రయుడు, విద్య-అవిద్య, సత్యం -అసత్యం అంటూ సమస్తం తానే అయ్యాడు.

అసద్వా ఇదమగ్ర ఆసీత్। తతోవై సదజాయత।
తదాత్మానగ్గ్ం స్వయమకురుత। తస్మాత్తత్సుకృత ముచ్యత ఇతి।।

ప్రారంభంలో ఏదీ లేదు. ఆతర్వాత సృష్టి అభివ్యక్తమైంది. భగవంతుడు తనను తానే సృజించుకొన్నాడు. అందుకే స్వయం కర్తృకమని ఆయన పేర్కొన బడ్డాడు. అంటే “ఏకమేవ అద్వితీయం”- ఆయన అద్వితీయుడు. ఇంకొక విధంగా చెప్పాలంటే మాయతో కూడుకొన్న బ్రహ్మం. విశ్వంగా వ్యాపించాడు.

86. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – ఆనందవల్లి బ్రహ్మానందవల్లి

అసద్వా ఇదమగ్ర ఆసీత్। తతో వై స దజాయత తదాత్మనగ్ం స్వయ మకురుత।

ప్రారంభం లో ఏమీ లేదు. ఆ తర్వాత సృష్టి ప్రారంభమయింది. సృష్టి ప్రారంభం లో మొదట పరమాత్మ తనని తానే సృష్టించుకొన్నాడు.

రసోవై సః । రసగ్ం హ్యేవాయం లబ్ద్వానందీ భవతి।

ఆ పరమాత్మ ఆనందమయుడు. ఆతని నుంచి ఆనందం పొందడం వల్లే మానవుడు కూడా ఆనందాన్ని అనుభవించ గలుగుతున్నాడు. హృదయాకాశంలో ఆనందం అనేది లేకపోతే ఎవరూ జీవించలేరు. ఆ పరమాత్మే అందరకీ ఆనందాన్ని ఇచ్చేవాడు. (ఏష హ్యేవానన్దయాతి).

ఆయన శరీరం లేని వాడవడం వల్ల ఎవరికీ కనిపించడు. ఎలాంటి నిర్వచనాలకీ అందడు. ఆధారం లేనివాడు. భయం అంటే తెలియని వాడు.

యదా హ్యేవైష
ఏతస్మిన్నదృశ్యే నాత్మ్యే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టాం విన్దతే। అథ సో భయం గతి భవతి।।

ఇలా అదృశ్యంగా, నిరాకారంగా, అనిర్వచనీయంగా ఉండే బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడు నిర్భయుడవుతున్నాడు.

తన నుంచి బ్రహ్మము వేరనుకొనే వాడికి భయం తప్పదు. మంచి ఆలోచనలు చేయని వాడికి పరమాత్మే భయ కారకుడౌతాడు.

భీషా స్మాద్వాతః పవతే। భీషోదేతి
సూర్యః। భీషా స్మాదగ్నిశ్చేంద్రశ్చ। మృత్యుర్ధావతి పంచమ ఇతి।।

పరమాత్మ అంటే ఉన్న భయం వల్లే వాయువు వీస్తోంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. అగ్ని ప్రజ్వరిల్లుతోంది. ఇంద్రుడు సక్రమంగా తన విధులను (వర్షాలు కురిపించడం) నిర్వర్తిస్తున్నాడు. మృత్యువు కూడా పరమాత్మ అంటే భయం తోనే సంభవిస్తోంది.

వచ్చే భాగంలో ఆనందం యొక్క వివరణతో బాటు ఆనందం లోని భేదాలు చూద్దాం.

87. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – ఆనందవల్లి బ్రహ్మానందవల్లి

తైతితిరూయోపనిషత్తు చెప్పే రెండు విద్యలలోను బ్రహ్మానందవల్లిలో చెప్పబడిన దానిని ఆనందమయ విద్య అంటారు.

ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ – ఆనందమే బ్రహ్మం అంటూందీ ఉపనిషత్తు. ఆనందానుభూతి వచ్చేదే ఆ బ్రహ్మ నుంచి. మనలను ఆ స్థితికి తీసుకొని పోయేది, తీసుకొని వెళ్ళగలిగేదీ ఆ పరబ్రహ్మే. బ్రహ్మ సాక్షాత్కారం

పొందిన వారు ఎల్లవేళలా ఆనంద డోలికల్లో మునిగి తేలుతూ ఉంటారు. అందువల్ల బ్రహ్మంయొక్క స్వరూపం ఆనందమే.

సైషానన్దస్య మీమాగ్ంసా భవతి।
ఆ ఆనందం కొలత ఎంత ఉంటుందో విచారిద్దాం.

యువా స్యాత్వాదు యువాధ్యాయకః ఆశిష్ఠో ద్రడిష్ఠో బలిష్ఠః తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణాస్యాత్। స ఏకో మానుష ఆనన్దః।।

మంచి యవ్వనం లో ఉన్నవాడు,

వేదాధ్యయన సంపన్నుడు, శాసించే వ్యక్తిత్వం కలిగిన వాడు, ధృఢమైన సంకల్పుడు, బలశాలి అయిన ఒక యువకుడు ఉన్నాడనుకోండి. అతనికి సకల సంపదలతో నిండిన ఈ భూమిలభిస్తే, అతడికి కలిగే ఆనందం ఒక మానుష ఆనందం.

తేయే శతం మానుషానన్దాః స ఏకో మనుష్య గన్ధర్వాణామానన్దః

అలాంటి ఒక వంద మానుషానందాలు కలిస్తే అది మానుష గాంధర్వానందం అవుతుంది.
ఎటువంటి కోరికలు లేని బ్రహ్మ జ్ఞాని అలాంటి మానుష గాంధర్వ ఆనందాన్ని పొందుతాడు.

తేయే శతం మనుష్యగన్ధర్వాణామానన్దః। స ఏకో దేవగన్ధర్వాణామానన్దః।।

అటువంటి వంద మానుష గాంధర్వానందాలు కలిస్తే ఒక దేవగంధర్వానందం అవుతుంది. ఎలాంటి కోరికలు లేని బ్రహ్మజ్ఞాని ఈ దేవ గంధర్వానందాన్ని అనుభవిస్తాడు.

తేయే శతం దేవగన్ధర్వాణామానన్దః। స ఏకః పితృూణాం చిర లోకలోకానామానన్దః।।

అలాంటి వంద దేవగంధర్వానందాలు కలిస్తే ఒక దీర్ఘాయువు కలిగిన పితృదేవతల ఆనందానికి సమానం. ఏవిధమైన కోరికలు లేని స్థితిలో ఉన్న బ్రహ్మ జ్ఞానికి ఈ పితృదేవతల ఆనందం కలుగుతుంది.

ఒక వంద పితృదేవతల ఆనందాలు కలిస్తే అది దేవలోకం లో దేవతలు అనుభవించే ఒక దేవ ఆనందానికి సమానం. ఒక్క బ్రహ్మ జ్ఞాని మాత్రమే ఆ దేవ ఆనందాన్ని పొందగలుగుతాడు.

నూరు దేవ ఆనందాలు కలిస్తే అది ఒక కర్మదేవ ఆనందంతో సమానమౌతుంది.
(కర్మల వల్ల దేవతా స్థితిని పొందిన వారిని కర్మ దేవతలు అంటారు).

వంద కర్మ దేవానందాలు ఒక ముఖ్య దేవానందంతో సమానం.

వంద ముఖ్యదేవ ఆనందాలు ఒక ఇంద్ర ఆనందంతో సమానం.

అలాంటి వంద ఇంద్ర ఆనందాలు ఒక బృహస్పతి ఆనందంతో సమానం.

వంద బృహస్పతి ఆనందాలు కలిస్తే ఒక ప్రజాపతి ఆనందానికి సమానం.

అలాంటి వంద ప్రజాపతి ఆనందాలు ఒక బ్రహ్మానందానికి సమానం.

కామనా రహితుడైన బ్రహ్మవేత్త ఇటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ ఆనందాలన్నీ మనలోనుండే ఉద్భవిస్తాయి.

కోరికలను తగ్గించుకోవడం, ఆత్మను సమీపించాలనే గట్టి ఆకాంక్ష అనేవి రెండూ ఆనందానుభవానికి మార్గాలు.

యోగాభ్యాసం ద్వారా, ధ్యానం ద్వారా ఆంతరంగిక జగత్తులో శాంతి ప్రతిష్టించబడి ప్రాణ మనో మిలనం జరుగుతుంది.

ప్రాణం మనస్సు తో కలిసి ఆత్మను సమీపిస్తున్నప్పుడు ఈ ఆనందపు కొలమానం మొదలవుతుంది.

కామనారహితమైన స్ధితి లో బ్రహ్మ వేత్త ఆత్మను సమీపిస్తున్న కొద్దీ పెరుగుతున్న ఆనందాలను అనుభ విస్తున్నాడని ఉపనిషత్తు తెలుపుతోంది.

క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన ఆనందం భగవదనుభూతిలో దీని పరాకాష్టను చేరు కొంటూంది.

భగవదనుభూతి యొక్క అత్యున్నతమైన స్థితిని తెలపడానికి, సూర్యుని ఒక ప్రతీక గా తీసుకొన్నారు.

ఈ మనిషిలో ఉన్నవాడు, ఆ సూర్యునిలో ఉన్నవాడు. ఒక్కరే. ఈ మనిషి, ప్రకృతి అనే రెండింటి లోనూ అంటే సర్వత్రా ఉన్నవాడు ఒక్కడే ( ఆ బ్రహ్మత్వమే) అనే విషయాన్ని గ్రహించిన వ్యక్తి ఆనందం యొక్క అంచులను చేరి లౌకిక చైతన్యం నుంచి విడివడతాడు.

అట్టి బ్రహ్మవేత్త అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను దాటి వెడతాడు అని ఈ ఉపనిషత్తు చెబుతోంది.

వచ్చే భాగంలో బ్రహ్మానందవల్లికి ముగింపు వాక్యాలలో ఆత్మ జ్ఞానిని దృఢతరం చేసే విషయాలు చెప్పుకొందాం.

88. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – ఆనందవల్లి బ్రహ్మానందవల్లి

మానవుడి నుండి ప్రజాపతి వరకూ అనుభవించే ఆనందాలను వివరిస్తూ అనేక దేవతలను పేర్కొందీ ఉపనిషత్తు.

ముందుగా మనుష్య గంధర్వులు, దేవ గంధర్వులు అన్నారు.

సత్కర్మాచరణ వల్ల మానవులు మనుష్య గంధర్వులు అవుతారు.

సృష్ట్యాదిలోనే గంధర్వులు గా ఉద్భవించిన వారు దేవ గంధర్వులు. వీరికి ఆకాశ సంచారం చేయ గల శక్తి, ఇతర మానవాతీత శక్తులు ఉంటాయి.

దేహం చాలించిన మన వంశ పెద్దలను పితృదేవతలంటారు. వీరు నివశించే లోకాన్ని పితృ లోకం అంటారు.

నిత్యకర్మానుష్టానం చేసి దేహ త్యాగం చేసిన ఉత్తములను కర్మ దేవతలు అంటారు. వీరు పుణ్యఫలాన్ని స్వర్గం లో అనుభవించి మళ్ళీ జన్మ ను ఎత్తుతారు.

ఇక దేవతలు మానవాతీత శక్తులు కలిగి దేవలోకంలో స్థిర నివాసం ఉంటారు. మానవులు చేసే యజ్ఞ యాగాదులలోని హవ్యాలతో వీరు వర్ధిల్లుతారు.

ఇంద్రుడు దేవతలకు ప్రభువు. బృహస్పతి దేవగురువు. ప్రజాపతి బ్రహ్మము చేత సృష్టించబడిన విరాట్ స్వరూపుడు. ఇంక హిరణ్య గర్భుడంటే శరీరులలో ప్రథముడని చెబుతారు.

వీరందరూ అనుభవించే ఆనందాన్ని క్రింది స్ధాయి నుంచి హిరణ్యగర్భుని ఆనందం వరకూ ఈ
అనువాకంలో వర్ణించారు. హిరణ్య గర్భుని ఆనందం తర్వాత బ్రహ్మానందమే. అది వర్ణనాతీతం. కారణం బ్రహ్మమే ఆనందం. ఆనందమే బ్రహ్మం.

మరొక్కసారి చెప్పుకొనేదేమిటంటే, సాధకునికి ప్రాణమనో మిలనమయ్యిన తరువాత, ప్రాణము మనస్సు కలిసి ఆత్మను చేరే ప్రయత్నంలో అంచలంచలుగా ఈ ఆనందాలను అనుభవిస్తూ అధిగమిస్తూ బ్రహ్మానందస్ధితిని పొందుతారు ఆత్మ దర్శనంతో.

యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసాసహ। ఆనన్దం బ్రహ్మణో విద్వాన్। న బిభేతి కుతశ్చనేతి। ఏతగ్ం హవావ న తపతి।

ఎవరిని చేరటం సాధ్యం కాక మనసు, వాక్కు తిరిగి వెనక్కి వెళ్ళి పోతున్నాయో ఆయనే పరబ్రహ్మ. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొంటాడో అతను తనను తాను తెలుసుకొన్నవాడవుతాడు.

ఆత్మజ్ఞాని చేసే ప్రతి పని నిష్కామకర్మ అవుతుంది. దీనినే జ్ఞానోత్తర కర్మ అంటారు. అట్టి వాడు ఎవరికీ, దేనికీ భయపడడు.

నేను అందరకీ మంచి ఎందుకు చేయలేదు? చెడు ఎందుకు చేశాను. అనేటటువంటి భావాలు అతనిని బాధించవు.

భయరాహిత్యమే భగవద్దర్శనం యొక్క పర్యవసానం. సుఖ దుఃఖాలు, పాప పుణ్యాలు మొదలైన దంద్వాలకు అతీతమైన స్థితిని పొందుతాడు.

సర్వత్రా, సర్వ వస్తువులలోను ఆ భగవంతుని చైతన్యాన్నే చూడగలుగుతాడు.

కర్మఫలత్యాగి అవడం వల్ల, అతను పాప పుణ్యాలను ఆత్మభావంతోనే చూస్తాడు. అందువల్ల అంత్య కాలంలో ఇవేమీ అతనిని బాధించవు. అంటూ ఇలా ఆనంద వల్లి ముగుస్తుంది.

వచ్చే భాగంలో పైన చెప్పిన బ్రహ్మానందాన్ని పొందడానికి మార్గనిర్దేశం భృగువల్లిలో ఏ విధంగా చేయబడిందో చూద్దాం.

89. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – భృగువల్లి – భార్గవీ- వారుణీ విద్య

వేదాల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. ఉపనిషత్తులలోని కొన్ని మంత్రాలు యధాతథం గాను, మరికొన్ని మంత్రాలలోని మొదటి పాదాలు భగవద్గీతలో శ్లోకాలు గా తీసుకోబడ్డాయి.

అందుకే ప్రతి అధ్యాయం చివర ” భగవద్గీతాసు, ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగ శాస్త్రే…..।।”
అంటూ… భగవద్గీత అనేది ఒక ఉపనిషత్తు. ఒక యోగ శాస్త్రము. బ్రహ్మ విద్యను ( ఆత్మ జ్ఞానాన్ని) బోధించే శాస్త్రము.

ఇది కృష్ణార్జున సంవాద రూపము లో వివరింప బడింది. అన్ని రకాల సందేహాలను పటా పంచలు చేస్తూ , అర్జునుని ద్వారా ప్రశ్నల రూపంలో ప్రతి చిన్న సందేహాన్ని లేవనెత్తి వాటిని నివృత్తి చేస్తూ విశద పరచిన ప్రత్యక్ష బ్రహ్మవిద్యా సాధన గ్రంధము.

అనుభవ పూర్వకంగానే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలని తెలిపే శాస్త్రం ఈ భగవద్గీత .

మనం మన ఉపనిషత్తులోకి వద్దాం.

తైత్తిరీయోపనిషత్తులో ఆనందవల్లి బ్రహ్మం తో తాదాత్మ్యం చెందడమే బ్రహ్మానందమని అదే జీవిత పరమార్థమని వివరించింది. ఆత్మను కప్పుతూ ఉన్న పంచకోశాల స్వభావ స్వరూపాలను చెప్పింది. ఇంతవరకూ తత్వబోధ చేసి, భృగువల్లి లో ఆత్మ సాక్షాత్కారానికి మార్గాన్ని నిర్దేశించి చూపుతోంది.

ఈ అధ్యాయం “సహనావవతు… ” అనే శాంతి మంత్రం తో మొదలయి గురువయిన వరుణుని శిక్షణలో శిష్యుడు భృగువు క్రమ పద్ధతిలో నేర్చుకున్న భార్గవీ – వారుణీ విద్యను వివరిస్తుంది.
క్రితం అధ్యాయంలో ఈ శాంతిమంత్ర వివరణ ఇవ్వడం జరిగింది.

భృగుర్వై వారుణిః। వరుణం పితర ముపససార। అధీహి భగవో బ్రహ్మేతి।

వరుణ మహర్షి యొక్క పుత్రుడు భృగువు. ఒకరోజు తన తండ్రిని సమీపించి తనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు.

తస్మా ఏతత్ ప్రోవాచ। అన్నం ప్రాణం చక్షుః శ్రోత్రం మనో వాచమితి।।

అతనితో భృగువు ఇలా చెప్పేడు. అన్నం, ప్రాణం, చక్షువు, శ్రోత్రం, మనస్సు మరియు వాక్కు- ఇవే పరమాత్మ అంటే.

బ్రహ్మ తత్వాన్ని తెలుసు కోవాలంటే మనస్సు బ్రహ్మలో లీనం కావాలి. మనస్సు యొక్క ఏకాగ్రతకు ప్రాణమే ఆధారం.

ప్రాణం శక్తిమంతమై ఊర్ధ్వముఖం గా సాగాలంటే అశన (అన్నం) ప్రాప్తి కావాలి. బ్రహ్మ నిష్ఠలో జ్ఞాన ప్రాప్తి, దర్శనం అనేవి వాక్కు ద్వారా జరుగుతాయి.

అందువల్ల చక్షు శ్శ్రోత్రాలు ( కళ్ళు, చెవులు) అనే ఇంద్రియాలు మనస్సుతో కలిసి బ్రహ్మ లో లీనం కావాలనే రహస్యాన్ని బోధించాడు.

దేని వల్ల ఈ జీవాల ఉత్పత్తి జరిగిందో, దేని ఆధారంతో ఇవి అన్నీ జీవిస్తున్నాయో, మరణానంతరం దేనిలో ఇవన్నీ లయమౌతాయో దానిని తెలుసుకోవాలి.

ఆయనే బ్రహ్మ. ఆయనను తెలుసుకోవడానికి తపస్సు చేసి తెలుసుకో. తపస్సే బ్రహ్మం. తపస్సుతోనే బ్రహ్మజ్ఞానం లభ్యమౌతుంది.

తపస్సంటే ” మనసశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం తపముచ్యతే” అని. మనస్సును ఇంద్రియాలను ఆత్మ మీదనే కేంద్రీకరించడం అని అర్ధం.

90. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – భృగువల్లి – భార్గవీ- వారుణీ విద్య

తండ్రి ఉపదేశాన్ని విన్న తరువాత భృగువు అపరోక్ష జ్ఞానం తపస్సు ద్వారానే లభిస్తుందని తపస్సు చేశాడు.

అన్నం బ్రహ్మేతి వ్యజానాత్। అన్నాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయన్తే। అన్నేన జాతాని జీవన్తి। అన్నం ప్రయన్త్యభిసంవిశంతీతి।

భృగువు తపస్సు చేసి అన్నంతోనే భూతాల ఉత్పత్తి, జీవనం మరియు లయం జరుగుతున్నాయని తెలుసుకొన్నాడు.

ఆహారమే పరమాత్మ. ఎందుకంటే ఆహారం నుంచే సకల జీవజాలం ఆవిర్భవిస్తోంది. అలా పుట్టిన జీవజాలం అంతా ఆహారం వల్లనే జీవిస్తున్నాయి. మరణానంతరం తిరిగి ఇవి ఆహారంలోనే లీనమైపోతున్నాయి. అందువల్ల ఆహారమే బ్రహ్మ అనే నిర్ణయానికి వచ్చేడు.

కానీ యతోవా ఇమాని…(ఎక్కడనుంచి ఈ భూతజాలమంతా) అనే బ్రహ్మ లక్షణానికి సంపూర్ణ సమాధానం దొరకకపోవడం తో తన తండ్రి ని చేరి భగవన్। ఆ బ్రహ్మ స్వరూపాన్ని నాకు విశదపరచండి. అని అడిగాడు.

సృష్టి స్థితి లయాలు చేయగల సామర్ధ్యం ఎవరికుందో వాడే బ్రహ్మమని ముందుగా చెప్పేడు. మరి అన్నానికి ఈ శక్తి ఉందా? మరి ఆ శక్తి లేనప్పుడు అది బ్రహ్మము కాదుగదా।

అందుచేత వరుణుడు.

తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ।
తపో బ్రహ్మేతి సతపో తప్యత సతపస్తప్త్వా।

తపస్సు ద్వారా బ్రహ్మను తెలుసుకో। తపస్సే బ్రహ్మ. అంటే తపస్సుతోనే బ్రహ్మజ్ఞానం లభ్యం అవుతుంది. ఈ ఉపదేశం వినగానే భృగువు తిరిగి తపస్సు కొనసాగించాడు.

ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్। ప్రాణాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయన్తే। ప్రాణేన జాతాని జీవన్తి।

తపస్సు ద్వారా ” ప్రాణమే పరమాత్మ. ఎందుకంటే, ప్రాణం నుంచే సకల జీవకోటి ఆవిర్భవిస్తోంది. ప్రాణం వల్లనే ఆ జీవకోటి అంతా జీవిస్తోంది. మరణానంతరం ఈ జీవకోటి మొత్తం తిరిగి ఆ ప్రాణంలోనే లయమైపోతోంది.” అని తెలుసుకొన్నాడు. ప్రాణము అశనప్రాప్తి తోనే తన అస్థిత్వాన్ని తెలపుకో గలడు.

తిరిగి తన తండ్రి దగ్గరకుపోయి తను గ్రహించినది చెబుతాడు. అప్పుడు ఆయన నాయనా। తపస్సే పరమాత్మ. ఆతపస్సు చేయడం ద్వారానే ఆ పరమాత్మను దర్శించ గలుగు తావు అన్నాడు. తిరిగి భృగువు తపస్సులో నిమగ్నమవుతాడు.

మనో బ్రహ్మేతి వ్యజానాత్। మనసో హ్యేవ ఖల్విమాని భూతాని జాయన్తే। మనసా జాతాని జీవన్తి।

భృగువు తన తపస్సు ద్వారా ” మనసే పరమాత్మ. మనస్సు నుండే సమస్త భూతములు పుట్టి ఆ పుట్టిన జీవకోటి మొత్తం మనస్సు వల్లే జీవిస్తోంది. అంతములో ఆ జీవకోటి అంతా ఆ మనస్సులోనే లయమైపోతూంది.” అని గ్రహించాడు.

ప్రాణము మనస్సు యొక్క ఆదేశానుసారము ఈ శరీరంలో చలిస్తుంది. మనస్సు ననుసరించి మానవుడు ఈ శరీరం లో మనగలుగు తున్నాడు. వచ్చే జన్మ కూడా దేహ త్యాగ సమయంలో చేసే సంకల్పానికి అనుగుణంగా లభిస్తుంది. బ్రహ్మ లో ఐక్యం కావాలన్నా మనస్సే కారణమవుతుంది. అందు చేత మనస్సు యొక్క ఆధారంతోనే జీవుల పుట్టుక, అస్థిత్వం, లయం అని మనస్సే బ్రహ్మ అని తలచాడు.

కాని అతని తండ్రి తపస్తప్త్వ। తపస్తప్త్వ। అంటూ మరింత లోతుగా సృష్టి క్రమాన్ని తపించడం ద్వారా బ్రహ్మత్వాన్ని తెలుసుకోమని చెబుతాడు.

అప్పుడు బుద్ధి అంటే విజ్ఞానమే పరమాత్మ అని; ఆ విజ్ఞానం వల్లే సమస్త జీవుల ఆవిర్భావం జరిగి, విజ్ఞానం వల్లే జీవించి, విజ్ఞానంలోనే కలిసిపోతున్నాయని తెలుసుకొన్నాడు భృగువు.

ఇలా అనిపించడానికి కారణమేమిటంటే ముక్తుడు కావాలనే కోరిక ఉన్నంత మాత్రాన ఎవరూ బ్రహ్మ లో ఐక్యం కాలేరు. అలా కావడాన్కి బ్రహ్మ ఉండే స్ధానమే అతనికి గోచరం కాదు. బ్రహ్మ ఉండే స్థానాన్ని చేరాలంటే ఈ విశ్వపు అంచుల్ని దాటి పోవాలి.

అలా దాటాక, పై పైకి పోయే దారిలో తనతో పాటు చేరిన వివిధ భూత ధాతువుల అంశలను ఏ ఏ విధంగా విడుదల చేసుకోవాలనే విషయాన్ని గ్రహించి, అదేవిధం గా వాటిని విడుదల చేసుకొంటూ పోతేనే సాధ్యం.

అలా చేసుకొంటూ పోవడానికి ఈ భూత ధాతువుల సమ్మేళనం, ఉత్పత్తి ఎలా జరిగాయనే విషయం తెలియాలి. అదే విజ్ఞానం. కేవలం బుద్ధి శక్తికి అందేది కాదీ విజ్ఞానం. గ్రహించేది బుద్ధే అయినా, గ్రహించాలనే కోరిక ఉన్నా, కేవలం ఈ మనస్సు, బుద్ధిల ప్రయత్నంతోనే ఈ విజ్ఞానం ప్రాప్తించదు. దానికి తపస్సు చాలా అవసరం.

తపస్సంటే ఈ ఇచ్ఛాశక్తి, గ్రహణ శక్తి మొదలయిన సర్వ భూతాల ఉత్పత్తి కి కారణమైన ప్రాణశక్తి ని ఆశ్రయించి ఏకాత్మ స్థితి లో పరితపించడం.

అప్పుడు ఆ అంతర్ముఖ స్థితిలో విశ్వం యొక్క విజ్ఞానం తెలుస్తుంది. ఆ విజ్ఞానంతో మాత్రమే
ఇచ్ఛామరణుడయ్యేందుకు, దేహత్యాగం చేసి ఆ బ్రహ్మ లో లీనమవడానికి సాధ్యమౌతుంది.

అందువల్ల విజ్ఞానమే బ్రహ్మమని భృగువు నిశ్చయించాడు.

తాను విశ్వ సృష్టి రహస్యాన్నే తెలుసుకున్నానని చెప్పినా అతని తండ్రి “మళ్ళీ తపించు. తపస్సే బ్రహ్మ” అని ఆదేశించాక భృగువుకు తాను తెలుసుకున్నాననే అహంకారం తొలగి పోయింది.

బ్రహ్మ అంటే ఏమిటి? అనే జ్ఞానం తనకు కలగనే లేదు. అది బుద్ధికి గోచరించదు. ఆ పరమాత్మ యొక్క దయతోనే కావాలనే వినమ్ర భావం పుట్టింది.

తండ్రి యొక్క ఉపదేశంతో ఆ బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి కోసం భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ తపించాడు.

తపస్సు ద్వారా ఆనందమే పరమాత్మ. ఎందుకంటే ఆనందం వల్లే సకల జీవకోటి ఆవిర్భవించి జీవిస్తోంది. తిరిగి ఆ జీవకోటి అంతా మరణానంతరం ఆనందంలోనే లయమయి పోతోంది అని తెలుసుకున్నాడు.

అతనికి తనలో ఆనందానుభవం కలిగి సదానంద, అఖండానందుడయిన బ్రహ్మ దేవుని దర్శనం అయింది.

ఆ ఆనందం వల్లనే అతనిలోని చైతన్యం స్పందించి, దాంట్లోంచి పుట్టిన శక్తే బయటకు వెలువడి, ఆకాశం లో స్పందించాక, దానివల్ల సర్వ భూత ధాతువుల ఉత్పత్తి అయింది.

ఆ భూత ధాతువుల కలయిక వల్ల ఈ లోకాలు వస్తువులు రూపొందాయనే జ్ఞానం కలిగింది. తద్వారా భూత ధాతువుల నుండి విడివడడం తెలుసుకో గలిగాడు.

“పరమే వ్యోమ్ని ప్రతిష్ఠితా” – ఆ ఆనందమయుడైన బ్రహ్మ పరమ వ్యోమం లో అంటే ఆకాశం లో అత్యున్నతమైన స్థానంలో ఉంటాడనే విషయాన్ని గ్రహించాడు.

ఈ ఆనందం గొప్పదైన హృదయం అనే ఆకాశంలో దివ్యంగా ప్రకాశించే ఆత్మలో నెలకొని ఉంటుంది. ఈ విద్యనే భార్గవీ- వారుణీ విద్య అంటారు.

“యతోవా ఇమాని…..” అన్నదానికి ఇప్పుడు “సయ ఏవం విత్…” ఎవ్వడైతే ఈ విధంగా తెలిసికొనుచున్నాడో అతడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ స్థితులను వరుసగా ప్రత్యక్ష పరచుకొని చివరగా ఆనందమయ స్థితిని పొందడంతో బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడయ్యాడు.

ఇక్కడ భృగువు బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వాడయ్యాడు. అతడు తన హృదయాకాశంలో దివ్యంగా ప్రకాశించే ఆత్మలో కొలువుంటాడు. అట్టి బ్రహ్మజ్ఞాని సమృద్ధిగా ఆహారాన్ని పొంది, దాన్ని భుజిస్తూ ఆనందంగా ఉంటాడు.

ప్రాణుని ఆహారమైన అశనం అతనిలో తనంతట తానే ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అతడు అన్నాదుడౌతాడు. మంచి సంతాన భాగ్యాన్ని, గోసంపత్తిని పొంది బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఎంతో కీర్తిని పొందుతాడు.

ఈ భాగం అత్యంత కీలకమైనది.

తపస్సంటే ఏమిటి?
తపస్సు లో సాధించ వలసినదేమిటి?

ప్రతిసారి తన తండ్రి, గురువు అయిన వరుణుడు తపస్సే బ్రహ్మ అనడం, భృగువు తపించడం జరిగింది. తపస్సు ద్వారా ఏ విజ్ఞానాన్ని తెలుసుకున్నాడు భృగువు?

అనే విషయాలు ఎంతో సూక్ష్మంగా వివరింప బడ్డాయి.

ఈ భాగాన్ని కనీసం ఐదు ఆరు సార్లు చదివి అర్ధం చేసుకోమని నా మనవి.

91. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – భృగువల్లి

వరుణుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని బోధించాడు.

అన్నం ననింద్యాత్। తద్వ్రతమ్। ప్రాణోవా అన్నమ్। శరీరమన్నాదమ్। ప్రాణే శరీరం ప్రతిష్ఠితమ్। శరీరే ప్రాణః ప్రతిష్ఠితః। తదేతదన్న మన్నే ప్రతిష్ఠితమ్।।

ప్రతి జీవియొక్క శరీరాన్ని శక్తివంతం చేసేది అన్నం. ప్రాణం మన శరీరం లో నిక్షిప్తంగా ఉండి నడిపిస్తోంది. ప్రాణం వినా శరీరం మన లేదు.

అందువల్ల ఈ శరీరానికి అన్నం ప్రాణమే.

అలాగే శరీరం ప్రాణానికి ఆధార భూతం కనుక, ప్రాణం శరీరం లేకుండా ఉండలేదు. కనుక ప్రాణానికి శరీరమే అన్నం.

అన్నం, అన్నాదమ్(అన్నమును తినునది) అనేవి రెండూ శరీరానికి ప్రాణానికి అన్వయిస్తే ప్రాణం అన్నమయినప్పుడు శరీరం అన్నాదమౌతోంది. అలాగే శరీరం అన్నమయినప్పుడు ప్రాణం అన్నాదమౌతోంది.

రెండూ పరస్పరం ఒకదానికొకటి అన్నం గా ఉంటున్నాయి.

(ఇక్కడ శ్రీ యోగి అచ్యుతులు ఏమని వివరణ ఇచ్చారంటే: మన శరీరానికి స్థూలమైన ఆహారం శక్తిని ఇస్తూంటే మరి ప్రాణశక్తి ఎలా పటిష్ట మౌతుంది? ప్రాణం సూక్ష్మం కాబట్టి దాని సూక్ష్మ రూపంలో అన్నం (అశనం) బలాన్ని సమకూర్చాలి.

స్థూల శరీరానికి స్థూలాహారం ఎంత అవసరమో, ప్రాణానికి అశనం, సూక్ష్మాహారం, అంతే అవసరము.

ప్రతి రోజూ ఈ స్థూల శరీరానికి స్థూలాహారం బలాన్ని ఇస్తోంది. అలాగే మనం నిద్రపోయినప్పుడు ఒక సన్నని గురక వస్తుంది కదా। ఆ సమయంలో ప్రాణం మనస్సు తో కలసి ఆత్మ ఉండే స్థానానికి చేరుతుంది. అక్కడినుంచి తనకు కావలసిన అశనాన్ని తెచ్చుకొంటుంది. తద్వారా ప్రాణం బలిష్టమౌతుంది. అప్పుడు అలసట తీరి తిరిగి ఉత్సాహవంతం గా తయారవుతుంది.

ఈ విశ్వంలో సూర్యుడి కాంతి (కిరణాలు)నుంచి సమస్త జీవరాశులు శక్తిని తీసుకొని వాటి ఆహారాన్ని తయారు చేసుకొంటున్నట్టే, ఆత్మనుంచి వచ్చే శక్తి నుంచి ప్రాణం అశనాన్ని తయారు చేసుకొంటుంది. దానిని స్వీకరించడం ద్వారా బలిష్ఠమౌతుంది. అంటారు.

ఇదే అశనాన్ని ప్రాణాయామం ద్వారా,ఓజోన్ తో సరిసమానమైన దాన్ని, తయారు చేసుకొని శరీరం లోని ప్రాణ శక్తి పటిష్ఠమౌతుంది. శక్తివంతమైన ప్రాణశక్తి మనస్సును ఆకర్షిస్తుంది. అప్పుడు ఇంద్రియాల ద్వారా అధోముఖంగా పని చేసే మనస్సు ఊర్థ్వగామియై ప్రాణశక్తి ని చేరి స్థబ్దతను పొందుతుంది. మనస్సు మానస స్థితిని పొందుతుంది. అక్కడినుంచి ధ్యానం నిశ్చలంగా సాగుతుంది అని యోగి అచ్యుతులు వివరిస్తారు.)

92. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – భృగువల్లి

అన్నం న పరిచక్షీత। తద్వ్రతమ్। ఆపోవా అన్నమ్। జ్యోతిరన్నాదమ్। అప్సుజ్యోతిః ప్రతిష్టితమ్। జ్యోతిష్యాపః ప్రతిష్టితాః। తదేతదన్న మన్నే ప్రతిష్టితమ్।

సృష్ట్యాది లో అన్నం నీటి నుండి పుట్టింది. ఇప్పటికైనా యోగవిద్య లో కొనసాగేవాళ్ళు మొదట దేహంలో జలోత్పత్తి అధికమవడం ఆ తర్వాత అశనోత్పత్తి కావడం తెలుసుకొని ఉంటారు.

ఆ అన్నాన్ని తేజస్సు ( విద్యుత్తు) గ్రహించి ప్రాణంలో చేరుతుంది. అందువల్ల జ్యోతి లో అన్నం ప్రతిష్టించబడింది అన్నారు ఉపనిషత్కారులు.

అగ్ని నుండి జల తత్వం పుట్టడం వల్ల జ్యోతి లో జలం ప్రతిష్టితమైంది అన్నారు. ఇలా పరస్పరా శ్రితాలయిన ఇవన్నీ అన్నానికి (ప్రాణునికి) అన్నాలే.

అన్నం న పరిచక్షీత। – ఆహారాన్ని ఉపేక్షించ కూడదు. దేహాన్ని పోషించేది ఆహారమే.

అలా అని మిత పరిమాణంలోతీసుకోవాలి. సాత్వికాహారం వారి వారి శరీర తత్వాలకు అనుగుణంగా తీసుకోవాలి.

అన్నం బహు కుర్వీత। తద్వ్రతమ్। పృథివీ వా అన్నమ్। ఆకాశో న్నాధః। పృథివ్యామాకాశః ప్రతిష్టితం ఆకాశే పృథివీ ప్రతిష్టితా। తదేతదన్న మన్నే ప్రతిష్టితమ్।।

అలాగే పృథ్వినే అన్నం అన్నారు.
ఆకాశం ఆన్నాదమయ్యింది.(అన్నం తినునది).

ఆకాశం లో పృథ్వి ప్రతిష్ట్తమైంది.
ఆకాశం లో పుట్టిన సూక్ష్మాంశాలు అంతటా వ్యాపించి పృథ్వి అయ్యింది.
అందువల్ల ఆకాశం పృధ్విలో ప్రతిష్టితమైనట్లే. పృథివికి ఆకాశం అన్నం, ఆకాశానికి పృథివి అన్నం.
దీనినుంచి అన్నం అన్నం లో ప్రతిష్టితమైనట్లు కాదా।

ఈ పరస్పర సంబంధాన్ని గ్రహించిన వ్యక్తి సర్వ సంపద్భరితుడూ, శ్రేష్ఠుడూ అవుతాడు.

అన్నం బహు కుర్వీత।

తద్వ్రతమ్ । – ప్రాణానికి సూక్ష్మ రూపంలో అశనాన్ని, స్థూలాహారం స్థూల శరీరానికి ఎక్కువగా ఉత్పత్తి చేయ వలసిన అవసరం ఉంది.

సూక్ష్మ కర్మ – శాస్త్ర విహితమైన ప్రాణాయామాది అనుష్ఠానం త్రికాల సంధ్యల లోను చేసి అశనోత్పత్తిని చేసి ప్రాణాన్ని పటిష్ఠ పరచడం.

స్థూల కర్మలు – స్థూల కర్మలలో వ్యవసాయం ఉత్తమమైనదిగా వేదాలు చెబుతున్నాయి.

ప్రతి ఒక్కరు కాయకష్టం చేసి భూమిని దున్ని విస్తారంగా ఆహార ధాన్యాలు పండించాలి.

ఋష్యమూక ఆశ్రమంలో యోగి అచ్యుతులు స్వహస్తాలతో ఋష్యమూక పర్వతాలలోని అడవులను పంటభూములుగా మార్చి వ్యవసాయం చేసి ఆహార ధాన్యాలు, కూరగాయలు పండించేవారు.

ఈ విధంగా స్థూల సూక్ష్మకర్మలు సమసామ్యం లో చేయడమనేది ఒక వ్రతం లా ఆచరించాలి అని

ప్రత్యక్షంగా చేసి చూపించారు.

92A. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – భృగువల్లి

అన్నం బహు కుర్వీత। – యోగి అచ్యుతుల వ్యవసాయపద్ధతి

అన్నం న నింద్యాత్। మన దేహం పెరగడానికి ఉపయోగపడే అన్నాన్ని తన నైజ గుణం, పరిపుష్టి గుణాలు కోల్పోకుండా చూడాలి.

అన్నం న వరిచక్షీత। ఆహారాన్ని ఉపేక్షించ రాదు.

అన్నం బహు కుర్వీత। ఆహారాన్ని విస్తారంగా ఉత్పత్తి చేయాలి.

తద్వ్రతమ్।

ప్రధమావసరం అయిన ఆహారం గురించి సరయిన జ్ఞానం లేకపోవడమే ఇప్పటి ప్రజల అధోగతికి మూల కారణమంటారు యోగి అచ్యుతులు.

దేహ పోషణ ఆహారం తోనే జరుగుతోంది కదా।

ఆత్మ, మనస్సు, దాని వివిధ స్థితులు, పంచ ప్రాణాల గతులు, వాయుసంచారం అన్నీ ఈ దేహం లోనే జరుగుతున్నాయి.

మనిషి తను తిన్న ఆహారంతో పెరుగుతున్న ఈ దేహం లో నివసిస్తున్నాడు. ఆ ఆహారం లో తయారయ్యే రక్తం; ఆ రక్తం తయారయ్యే క్రమంలో తయారయిన వీర్యం పుట్టబోయే సంతానానికి బీజం అవుతోంది.

అలాగే ఆ యా ఆహారపదార్థాలను తినడం వల్ల ప్రచోదితమయ్యేది ఈ దేహం లోని మనస్సు.

అటువంటి ఆహారం వల్ల తయారయిన వీర్యం, మనస్సులతో కలిసి సంసారం చేస్తే అలాంటి సంతానమే పుడతారు.

ఆహారాది దోషాలను తొలగించుకుంటూ పోవడానికే ప్రాణాయామ ప్రక్రియ ఉపయోగ పడుతుంది.

సాధకులు త్వరగా ఉన్నతగతి ని పొందాలంటే. ఆహార విజ్ఞానం ఎంతో మేలు చేస్తుంది.

స్వామీ విజయీంద్రుల (యోగి అచ్యుతుల ప్రధమ శిష్యులు) డైరీ నుంచి ఇక్కడ కొన్ని విషయాల ను వివరిస్తున్నాము.

(కన్నడ మూలానికి శ్రీ K సుధాకరరావు, దూరదర్శన్, గారి తెలుగు అనువాదము):

ఋష్యమూక ఆశ్రమాన్ని ఆనుకొని ఉన్న కాయగూరల తోట చాలా అందంగా ఉంది. దాని అందం నిజంగా శ్రమించిన ఆఆశ్రమ వాసులకే తెలుసు. సమస్త కూరగాయలు పండుతున్నాయి.

వంకాయ, మిరప కాయ, దోసకాయ, ఆనపకాయ, గుమ్మడికాయ, సొరకాయ, నేతిబీరకాయ, బీరకాయ, పాలక్, ఆలుగడ్డలు, బీట్రూట్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, టమొటాలు మొదలైనవన్నీ ఎంతో సొగసుగా నవ నవ లాడుతూ పెరుగుతుంటే ఆ అందం వేరే చోట కనిపించదు.

నేతి బీరకాయ తీగలు కుటీరం చుట్టూ ఉండే చెట్లకు చుట్టబడి, చెట్టునే మింగేసేంత స్థితికి చేరుకుంది. చెట్టు నిండా పూలే. కాయలు మూడు మూరల కన్న పొడుగుగా పెరిగాయి.

మొక్క లోనుంచి, తీగలోంచి కాయని కోయడమే ఒక శ్రద్ధతో కూడిన పని. ఆ మొక్కకి ఏమాత్రం నొప్పికలగకూడదు. ఆ కాయ పక్వ స్థితికి వచ్చిందా లేదా అనే విషయం లో తగిన శ్రద్ధ తీసుకోక పోతే ఊరుకోరు అచ్యుతులు.

నాయనా। మొక్కలకు, చెట్లకు అస్థిత్వం ఉంటుంది. సృష్టిలోని మహాశక్తులలో తగిన భాగం వాటికి లభించింది. వాటికి తగిన గౌరవం లభించాలి.

ప్రకృతి పూజ అన్నా సౌందర్యారాధన అన్నా ఇదే.

ప్రకృతిలో సృష్టింపబడిన ప్రతి వస్తువు తోను సంబంధాన్ని, బాంధవ్యాన్ని పెంపొందించు కోవాలి.

తపస్వులైన వాళ్ళు నిరంతరం అంతర్ముఖత లోనే ఉంటారు. అందు వల్ల వారికి అన్నిటితోను సమ సంబంధ బాంధవ్యం అర్ధమవుతుంది.

కేవలం ఇంద్రియ ప్రధానంగా వ్యవహరించే పశు పక్ష్యాదులకు, మానసిక ఆహ్లాదం పొందగల్గిన మనుష్యులకు, మనస్సు యొక్క ఉన్నత లక్ష్యమైన ఆత్మ సామీప్యంలో ఆనందాన్ని పొందగలిగే సత్పురుషులకు అందరకీ స్నేహమయంగా సుఖమందించేది సస్యజీవి, వనలక్ష్మి.

దీని సాంగత్యం ఎందువల్ల ఆహ్లాదకరంగా ఉంటుందంటే మానవులమైన మనం, ఆ సస్యవర్గం – రెండూ వాయువు యొక్క చైతన్యం వల్లనే జీవిస్తూన్నాము కాబట్టి.

అందుకే మన మహర్షులు ఆహార ధాన్యాలతోను, కాయగూరలతోను ఎంతో ప్రేమను పెంపొందించు కున్నారు.

ఆ రోజు లేతఎండగా ఉంది. నిన్న మొన్న వర్షం కురిసింది. మొక్కలు లతలు అన్నీ పచ్చదనాన్ని సంతరించుకొన్నాయి. ఒకవైపు విరిసిన మొగ్గ; వికసించిన పూవు;,బయటకు వచ్చి శరీరాన్ని ప్రదర్శించే కాయ; పండుగా మారిన కొన్ని కాయలు; ఇలా ఎంతో అందంగా ఉంది ఆ ఆశ్రమ తోట.

ఆ కూరగాయల మడుల మధ్యమధ్యలో కలుపు తీసేవాళ్ళు కొందరు; మడులను సరిదిద్దే వాళ్ళు కొందరు; కొందరు లతల్ని కంచలపైకి ప్రాకించేందుకు ప్రయత్నాలు చేస్తూ అందరు శిష్యులు పని చేస్తూంటే గురువుగారు కూడా వీరందరితో సమానంగా పొలంలో పని చేస్తున్నారు.

ఉన్నట్టుండి గురువుగారు రిజిష్టర్ తెచ్చేవా గుండప్పా అన్నారు. లేదు స్వామీ అంటూ విజయీంద్రులు ఒక్క ఉదుటన కుటీరం వైపు పరుగెత్తేరు.

రేపటి భాగం లో మొక్కలు పెంచడంలోని వైజ్ఞానికతను తెలుసుకొని తిరిగి భృగువల్లి ఆఖరు మంత్రాలలోకి వెడదాము.

92B. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – భృగువల్లి

అలా వరుసలుగా బారులుగా సాగి పోతున్నాం. కొన్ని కొన్ని మొక్కలలో విచిత్రమైన పెరుగుదల కనిపించేది. గరువు గారు ఒక చోట నిలబడ్డారు.

వంకాయలు మిరపకాయలు అవే వరసలు. మొదటి రెండువరసలు, తరువాతి వరుసలు ఒకేలా లేవు. వెంటనే గురువు గారు రిజిష్టర్ తెచ్చేవా గుండప్పా। (స్వామీ విజయీంద్రుల ముద్దు పేరు) అన్నారు. లేదు స్వామీ అని ఒక్క పరుగున కుటీరానికి వెళ్ళి ఆ రిజిష్టర్ తెచ్చారు.

అది ఆ మొత్తం తోటకు సంబంధించిన రికార్డు.
అందులో మనం తోట గా మలుచుకొన్న
భూమి-ఆకాశాల మాదిరిగా ఉంది.
ఆ మట్టి రంగు ఉంది.
అక్కడ నాటిన వివిధ జాతుల మొక్కల, తీగల సంఖ్య ఉంది. మట్టి గట్టితనం వివరాలు ఉన్నాయి. చుట్టూ వేసిన కంచె వివరాలు ఉన్నాయి.

ఆయా విత్తనాలు నాటిన స్థలం, ఆ నేలలోని మట్టి రంగు, మట్టి గుణం ఉన్నాయి. విశేషంగా మొక్కలను నాటడం జరిగింది.

ఒక్కొక్క వరుసలో ఒక్కో రకం మడులను చేయించారు. ఆ మడులలో నీరు నిలిచే కోణాకృతికి, అక్కడ ఎదిగే మొక్కల పెరుగుదలకు సంబంధం చూడమంటారు.

ఏ రోజు ఏ విత్తనం వేశారు? వాన ఏ రోజు వచ్చింది? విత్తనం నాటే సమయంలో టైము ఎంత అయ్యింది? సూర్యుడు ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు? ప్రతి రోజూ ఎండ ఏ ఏ దిక్కులో మొదట ప్రసరిస్తూంది? మళ్ళీ ఎలా అంతరిస్తోంది?

ఆ ఎండ తో పాటు గాలి ఎన్ని రోజుల దాకా ఏ మూలనుంచి ఆ పొలానికి లభిస్తోంది?

అనే విషయాలన్నీ రికార్డు చేయ బడ్డాయి.

మొక్క పెట్టిన ఎన్ని రోజులకు వర్షం కురిసింది? పూలు పూసే ముందా? మళ్ళీ కాయగా మారే వేళలోనా? లేక కాయగా అయిన తర్వాతా?

ఆ వాన కురిసే రోజుల్లో అప్పటి వాతావరణం లో ఏ ఏ గుణాలు ఉండేవి?

మంచు ఎంత కురిసింది? అసలు కురవనే లేదా? నువ్వు నీటిని అదనంగా బిందె తో చిలకరించి పోసినదెంత? అలా అదనంగా పోసిన నీటి రుచి ఎలా ఉంది? నీరు చిక్కగా ఉందా? పలుచగా ఉందా?

ఆ మొక్కలకు రంగు ఎలా ఎలా ఎప్పుడెప్పుడు మారుతోంది?

(ఒక చిన్న మొక్క పెంపకంలోనే అంతటి శ్రద్ధ, పరిశీలన అవసరమైతే బ్రహ్మత్వాన్ని ఆకాంక్షించే సాధకుని పరిశీలనా కుశలత ఏ స్తాయి లో ఉండాలో ఆలోచించండి.)

ఇలాంటి వివరాలలో వాళ్ళు నిల్చున్న వరస యొక్క వివరాలు పుస్తకం నుంచి చదివారు.
-వీటి విత్తనాల్లో తేడాలున్నాయి.
ఈ వరస మొక్కల్ని నాటే వేళ వాన కురవనే లేదు.
మొదటి ఎనిమిది రోజులు వాన లేదు. నీరు చిలకరించి, నేలను తడిపి ఆ మొక్కలు నాటారు. తర్వాత ఆలస్యంగా వాన వచ్చింది.

ఇదిగో। ఈ వరుసకు ఆదివారం వాన. అదీ ప్రొద్దున్నే వచ్చింది. ఆ రోజేమో ఎండ ఉంది. లేత సూర్యునినుండి లభించే ఆదివారపు శక్తివంతమైన వాన. అదీ ఎండతో కూడిన వాన. అందువల్ల దీని బలమే వేరు. ఈ మొక్కకు కాసిన పండు గుణమే వేరు. దీన్లో ప్రాణశక్తి అధికంగా ఉంటుంది. అని వివరిస్తారు. ఇదీ ఆ రిజిస్టర్. ఇలాంటి పరిశీలనతో జీవనం సాగిస్తే అదే పరిపూర్ణ జీవితం అంటారు.

ఇలాంటి రికార్డు దాదాపు మూడు సంవత్సరాలు పాటు నిర్వహించిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద అనుభ వాలని పొందుతారని గురువు గారంటారు. వానల గురించి, పంటలగురించి; ఆ వానలో పెరిగిన పంటల భవిష్యత్తు పరిమితుల్ని చూచి చెప్పవచ్చు అంటారు.

ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేస్తే, ఈ రికార్డ్ ఆధారంగా వైజ్ఞానికంగా అప్పటి మనుషుల చిత్తప్రవృత్తి, దాని ద్వారా ఆనాటి సామాజిక, రాజకీయ సంఘటనల్ని నిర్ణయించడం సాధ్యమంటారు.

గురుదేవులు ప్రతి మనిషి తన మానవ దేహం తో కష్టపడాల్సిందే అంటారు. కొద్ది మంది జనుల శారీరిక శ్రమతో చాలా మంది భోజనం చేయడమనేది తత్వ విరుద్ధం అంటారు. ప్రతి ఒక్కరూ శ్రమ జీవనం చేసి విస్తృతంగా వైజ్ఞానికం గా ఆహార ధాన్యాలను పండించాలి అంటారు.

జీవితమంతా ప్రేమతో నింపాలి. ప్రీతితో, శ్రద్ధతో, బాంధవ్యంతో జీవితాన్ని గడపాలి. ఇక్కడ నీరస పడడానికిఅవకాశమే లేదు.

ఉదాత్తమైన, ఉద్రేక రహితమైన జీవితం ఎల్లప్పుడు అభ్యుదయ కాంక్ష తోనే సాగుతుంది.

వరి, గోధుమ, జొన్న మొదలైన ఆహార ధాన్యాలను పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లతో కలిపి ఏరకంగా వాడాలి? వాటిలోని జీవచైతన్యం సడలిపోకుండా వాటిని తయారు చేసుకొని తిని శక్తిగా మార్చే ప్రక్రియలు – అదంతా ఒక రకమైన శ్రద్ధ భక్తి ల తో కూడిన పదార్ధ విజ్ఞానం – యోగి అచ్యుతుల మాటలలో మరొక సమయం వచ్చినప్పుడు తెలుసుకుందాము.

వచ్చే భాగం లో తిరిగి భృగువల్లి లో ప్రవేశిద్దాం.

ఆహారాన్ని సంపద అనే విస్తృతమైన అర్ధంలో వాడిన విధానం, ఆశ్రయించి వచ్చిన ఎవరినీ రిక్త హస్తాలతో తిప్పి పంపకూడదు. అంటూ చెప్పిన పద్ధతి గురించి తెలుసుకుందాం.

93. ఉపనిషత్తులు – తైత్తిరీయోపనిషత్తు (Continuation) – భృగువల్లి

న కంచన వసతౌ ప్రత్యాచక్షీత। తద్వ్రతమ్।

ఎవరైనా అతిధిని కాని, బాటసారిని కాని ఆశ్రయం ఆశించి వచ్చిన వారిని తృణీకరించి తిప్పి పంపకూడదు. ఆదరించి వారిని తృప్తి పరచడం మీ కర్తవ్యం.

తస్మాద్యయా కయా చ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్।

కాబట్టి ఎలాగయినా సరే అనేక మార్గాలలో విస్తారంగా ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి.

ఆరాధ్యస్మా అన్నమిత్యచక్షతే।

ఎవరు ఎప్పుడు వచ్చినా వాళ్ళకు ఆహారం సిద్ధం గా ఉంది అని చెప్పగలగాలి. అంటూ ఆహారాన్ని శ్రద్ధగా చక్కని పద్ధతిలో తయారుచేసి పెట్టే వాళ్ళకు ఆహారం అదే రీతిలో దొరుకుతుంది.

ఆహారాన్ని మధ్య రకంగా సామాన్యంగా తయారు చేసి పెట్టే వ్యక్తికి సంపద మధ్యరకం గానే లభిస్తుంది.

మరీ సాధారణ రీతిలో ఆహారాన్ని తయారుచేసి అతిధి మర్యాదలు చేసే వారికి అదేరీతిలోనే సంప్రాప్తిస్తాయి సంపదలు.

పై విధంగా ఆహార సంపద యొక్క ప్రాధాన్యతని, అన్నదాన ఫలితాన్ని తెలుసుకుని అతిధి మర్యాదలు చేసే గృహస్తు దాని నిజ ఫలితాలను పొందుతాడు.

యోగక్షేమాలు బ్రహ్మము లోనే నెలకొని ఉన్నాయి. బ్రహ్మమును చేతులలో కర్మగా, పాదములలో గతిగా, పాయువు నందు విసర్జనాత్మకముగా ఉపాసించాలి. (ఆధ్యాత్మిక ఉపాసనలు).

వర్షంలో తృప్తి రూపంగాను, విద్యుల్లతలలో బల రూపం గా, పశు సంపదలో కీర్తి రూపంగా, తారలలో జ్యోతి రూపంగా, జననేంద్రియాల లో ఆనంద రూపంగా, ఆకాశం లో సమస్తం గాను ఆ పరమాత్మే ఉన్నాడు. (అధి దైవిక ఉపాసనలు).

మనం మంచి మాటలతో, మంగళ కరమైన పనులు చేస్తున్నప్పుడు ఆ మాటలు, పనుల రూపం లో ఆభగవంతుడు అభివ్యక్తమౌతాడు.

పరబ్రహ్మే సమస్తానికి ఆధారభూతునిగా స్తుతించే వాడు తనలోనే ఆ పరబ్రహ్మను నెలకొని ఉన్నవాడుగా అవుతాడు.

మహత్వ గుణం గా ఉపాసిస్తే మహత్తు గాను, చింతనగా స్తుతిస్తే చింతనా సమర్ధత లభిస్తాయి.

అనేక వాటిల్లో ఉంటూ వాటి వ్యాపారాలు నడుపు తున్నప్పటికీ వాటన్నిటిలోను ఉన్నది అద్వితీయమైన బ్రహ్మమే అనితెలుసుకున్న వాడు నిజంగా బ్రహ్మ జ్ఞానే అవుతాడు.

బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వ్యక్తి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే సామగాన రూపం లో వెలువడతాయి.

అహం బ్రహ్మాస్మి అనే స్థితిని చేరుకున్న వ్యక్తి సమస్త వేళలలోను బ్రహ్మత్వం లోనే ఉంటాడు. ఆ సమత్వ స్థితే అతని లో సామగానాన్ని పలికిస్తుంది. ఆ ఆనందానుభవం తో ఈ ఉపనిషత్తు సమాప్తమౌతుంది.

వచ్చే భాగంలో ఇప్పటి వరకూ అయిన ఎనిమిది ఉపనిషత్తులలో చెప్పిన ముఖ్యమైన విషయాలను ఒక్క సారి తిరిగి తలుచుకొని చాందోగ్యోపనిషత్తు మొదలు పెడదాము.

93A. ఉపనిషత్తులు – విహంగ వీక్షణం

దశోపనిషత్తులలో ఈశ, కేన, కఠ, మాండూక్య, ప్రశ్నోపనిషత్తులు ఐదింటినీ క్షుణ్ణం గాలపరిశీలిస్తే బ్రహ్మ విద్యకు సంబంధించిన అన్ని విషయాలు వచ్చేస్తాయి అంటారు స్వామీ జయతీర్ధులు (యోగి అచ్యుతుల శిష్యులు).

ఇంక మిగిలిన ఐదు ఉపనిషత్తుల లోను ఇవే విషయాలు తిరిగి ప్రస్తావింప బడుతూ వాతావరణ శుద్ధి కోసం, సంసారం గురించి చేసే యజ్ఞ యాగాదులు, సంతానోత్పత్తి కి, సమాజ పునరుద్ధరణకూ అవసరమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి.

ముందుగా 1. ఈశావాశ్యోపనిషత్తు:

ప్రతి వేదము సంహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అని నాలుగు భాగాలుగా విభజింపబడిందని చెప్పుకున్నాము కదా।

ఈ ఉపనిషత్తు యజుర్వేదం యొక్క వాజసనేయ సంహిత లో ఉన్నటువంటి ఉపనిషత్తు. దీనిని ‘వాజసనేయ సంహితోపనిషత్తు’ అని కూడా అంటారు. ఈ ఉపనిషత్తు పూర్ణమదః పూర్ణమిదం… అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది. ఉన్నవి 18 మంత్రాలయినా ఇది అత్యంత విఖ్యాతమైన ఉపనిషత్తు.

దీనిలో జ్ఞాన కర్మలు రెండింటికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. సత్తు – అసత్తు, వీటికి అవతల ఉండే దేవుని గురించి కూడా ఇందులో చెప్పబడింది. దేవునిలో ఐక్యమై జన్మరాహిత్యాన్ని పొందే మోక్ష మార్గం చెప్పబడింది.

అంధం తమః ప్రవిశంతియేఽ …। అంటూ. అవిద్యోపాసకులు అజ్ఞానాంధకారంలో ప్రవేశిస్తారు. విద్యను (యోగవిద్య-ప్రాణోపాసన) ఉపాసించే వాళ్ళు దానికన్న అధికమైన అంధకారం లో ప్రవేశిస్తారు అంటారు ఋషులు.

ఎందుకంటే (అవిద్యను ఉపాశించేవాళ్ళు) జ్ఞానం లేని వాళ్ళకు వేద శాస్త్రాదుల అధ్యయనం, స్థూలపూజ, కర్మకాండల లో మునిగి తామేదో చేస్తున్నామని ఒక సంతృప్తిని పొందే అవకాశమైనా ఉంది.

విద్య అంటే బ్రహ్మవిద్యను ఉపాసించేవారికి అలాంటి తృప్తిని కలిగించడం సాధ్యం కాదు. జ్ఞాన ప్రాప్తి అంత తొందరగా సాధ్యం కాదు.

ఎందుకంటే కర్మ త్యాగం వల్ల జ్ఞాన ప్రాప్తికి విరోధం కలుగుతుంది. అందువల్ల కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః… వేదవిహితమైన కర్మలు చేస్తూ నూరేళ్ళు జీవించాలని కోరుకో. అన్నారు.

అసంభూతిని, వినాశాన్ని ఏక కాలం లో ఎవడైతే గ్రహిస్తాడో, అతడు వినాశం ద్వారా మృత్యువు ను దాటి అసంభూతి (నాశ రహితమైన బ్రహ్మం) ద్వారా అమృతత్వాన్ని పొందుతాడు.

తర్వాత “హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం….।” స్వరూప సందర్శనం అయిన వ్యక్తి
జ్యోతి దర్శనం తో మిరుమిట్లుగొలిపే ఆ కాంతి పుంజాలను దాటి జ్ఞానం యొక్క అసలు స్వరూపాన్ని దర్శించలేక పై విధం గా ప్రార్ధిస్తున్నాడు.

ఓ దయామయుడా। బంగారు మూకుడు తో నీ కాంతి సముదాయం కప్పబడి చుట్టూరా కాంతి కిరణాలతో నీ దర్శనం అసాధ్యమౌతోంది. ఆ మూతను తొలగించి, నీ కిరణాలను ఉపసంహ రించుకొని నీయొక్క సత్య స్వరూప దర్శనాన్ని నాకు ప్రసాదించవయ్యా। అని.

శాశ్వతుడైన ఆ దేవుణ్ణి దర్శించి అతని కృపా కటాక్షం తో జ్ఞాన మోక్షాలకు అర్హుడై ప్రార్ధిస్తున్నాడు.

“ఓ పూషుడా। నేనెలాంటి జ్ఞాని అయినా ప్రకృతి ఆవరణలో నిరంతరం నాకు వ్యక్తమౌతున్న అజ్ఞానం, అలాగే దాని వల్ల కలిగే పాప దోషాలను భస్మం చేసి నన్ను మంచి మార్గం లో నడిపించు”
ఈ విధం గా ఈశావాశ్యోపనిషత్తు ముగుస్తుంది.

వచ్చే భాగం లో కేనోపనిషత్తు సత్వర విహంగ వీక్షణం (క్విక్ రివిజన్ ) చేద్దాం.

93B. ఉపనిషత్తులు – విహంగ వీక్షణం

2 కేనోపనిషత్తు:

కేనోపనిషత్తు సామ వేదం లోని తలవకార బ్రాహ్మణం లో అంతర్భాగంగా ఉంది. అందుచేత దీనిని తలవకారోపనిషత్తు అని కూడా అంటారు.

(ఈశోపనిషత్తు యజుర్వేద సంహిత లోనిదయితే, కేనోపనిషత్తు సామవేదం లో బ్రాహ్మణం లోనిది)

కేన అంటే ఎవని చేత అనే ప్రశ్న తో ప్రారంభం అవుతుంది కనుక కేనోపనిషత్తు అని పేరు వచ్చింది.

ఇది నాలుగు భాగాలు గా విభజింపబడింది. మొత్తం 35 మంత్రాలు ఉన్నాయి.

ఈ ఉపనిషత్తు “ఓం ఆప్యాయంతు మమాంగాని.” అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది. ఈ శాంతిమంత్రం లోనే ఉపనిషత్కారులు బ్రహ్మజ్ఞానం ఎలా సాధ్యం అవుతుందనే విషయాన్ని సూత్రప్రాయంగా చెప్పేరు.

ఈ ఉపనిషత్తు యొక్క ముఖ్య సారాంశ మేమంటే ఇంద్రాది దేవతలే కాని, మానవులే కాని, ఎవరూ దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేరు.

ఇంద్రియాలు కాని, మనస్సు కాని, బుద్ధి కాని, ప్రాణం కాని బ్రహ్మత్వాన్ని తెలుసుకోలేవు.

ఈ సృష్టి అంతా అతనినుండి ఉద్భవించినదే కనుక అతని దయ వల్లే వీటి జ్ఞానం మనకు లభించాలి.

ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణః ప్రధమః ప్రైతియుక్తః….

అనే ప్రధానమైన ప్రశ్న తో ఈ ఉపనిషత్తు మొదలవుతోంది.

ఎవరి ప్రేరణతో మనస్సు ఆ యా విషయాలలో ప్రవృత్తమౌతోంది?
ఎవరి వల్ల మొట్టమొదట ప్రాణం తన క్రియ ను ప్రారంభించింది?
ఎవరి ఇచ్ఛ తో వాక్కు పలుకుతుంది?
కన్నులు, చెవులు-వీటిని ఆదేశించే దేవతలెవరు?

ఈ ఉపనిషన్మంత్రం లోని ప్రశ్న ఏమిటి అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనస్సు అన్నీ జడ పదార్దాలే. కనుక నశించేవే. ఈ నశించే వాటన్నిటికీ మూలాధారమైన ప్రాణ శక్తి తన క్రియను ఎవరి ఇచ్ఛ తో ప్రారంభించింది?

ఉపనిషద్ మహర్షులు ఇలా సమాధానం ఇచ్చారు.

శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో
యద్ వాచోహవాచం స ఉ ప్రాణస్య ప్రాణః…

చూడండి. ఆత్మ ను వివరిస్తున్నారు.

ఏది చెవులకే చెవియో, కన్ను కే కన్నో, మనస్సుకే మనస్సో, వాక్కు కే వాక్కో అది ప్రాణాని కే ప్రాణం. అన్నిటికీ మూలాధారమైన ఆత్మ నుంచే వీటన్నిటికీ శక్తి వస్తుంది.

ఆ పరబ్రహ్మను కళ్ళతో చూడడానికి, నోటితో చెప్పడానికి, మనస్సుతో చింతించుటకు వీలుకాదు. ఆ ఆత్మను గురించి బోధించడానికి దాని గురించిన జ్ఞానం మాకు తెలియదు.

అంటూ ఆ పరబ్రహ్మ గురించి ఎంతో వినయంగా మా గురువులు మాకు ఈ విధంగా చెప్పడం మేము విన్నాము అన్నారు.

యద్వాచా నభ్యుదితం, యేన వా గభ్యుద్యతే…

ఏ ఆత్మ వాగీంద్రియం చేత తెలుసుకో బడదో, దేని యొక్క శక్తి చేత వాగీంద్రియం పని చేస్తూందో;

ఏ ఆత్మ అయితే మనసు చేత, కళ్ళ చేత, చెవుల చేత, ప్రాణం చేత తెలుసుకో బడదో; దేని శక్తి చేత ఇవన్నీ పని చేయ గలుగుతున్నాయో అదే బ్రహ్మత్వం. తదేవ బ్రహ్మత్వం – అదే బ్రహ్మత్వం.

విద్ధి నేదం యదిద ముపాసతే। – కానీ మీరు తెలియకుండా దేనినైతే బ్రహ్మం అనుకొని ఉపాసిస్తున్నారో అది బ్రహ్మం కాదు.

ఇక్కడ ఒక చక్కని కథ ద్వారా బ్రహ్మజ్ఞానా కాంక్షి ఉండవలసిన విధానాన్ని చెప్పేరు.

దేవతలకు రాక్షసులకు మధ్య ఒకసారి పెద్ద యుద్ధం జరిగి దేవతలు ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు పరమాత్మ దేవతల వైపు నిలబడి రాక్షసులను ఓడించి తరిమేశాడు.
దేవతలు ఆ విజయమంతా తమ స్వశక్తి వలననే జరిగిందని అహంకారంతో విఱ్ఱవీగారు.

ఈ విషయం గ్రహించి ఆ పరబ్రహ్మ దేవతల కళ్ళు తెరిపించడానికై ఒక బ్రహ్మాండమైన యక్షుని రూపం ధరించి వారి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపం చూసి దేవతలు నివ్వెర పోయారు.

దేవతలకు ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకొనేవాళ్ళు ఇంద్రుడు, అగ్ని, వాయువు.

ఇంద్రుడు ముందుగా అగ్ని, వాయువులను యక్షుని గురించి తెలుసుకొమ్మని పంపితే వాళ్ళు అశక్తులమని వెనుదిరిగి వచ్చేశారు.

అప్పుడు ఇంద్రుడే స్వయంగా ఆ యక్షుడుండే స్థలానికి వెళ్లాడు. అత్యాశ్చకరం గా ఆ యక్షుడు మాయమయి అదే స్థలం లో ఉమాదేవి ( పార్వతి) ప్రత్యక్షమైంది. ఆమె ద్వారా ఆ యక్షుడే బ్రహ్మం అని తెలుసుకున్నాడు.

ఉమాదేవి విజ్ఞానానికి, దైవీశక్తి కి ప్రతీక. దైవానుగ్రహం లేనిదే బ్రహ్మజ్ఞానం పొందడం అసాధ్యం.

ఇంద్రియాలకు ప్రతీకలైన అగ్ని(వాక్కు), వాయువు ల (మనస్సునకు అధిష్ఠాన దేవత) ద్వారా పరబ్రహ్మ ను తెలుసుకోవడం దుర్లభం.

ఇంద్రుడు ఆత్మకు సంకేతం. యక్షుడు పరమాత్మ. ఇంద్రుడు (జీవాత్మ) యక్షుడి (పరమాత్మ) దగ్గరకు చేరగానే జీవాత్మ పరమాత్మ లో లీనమై పోవడంతో యక్షుడు మాయమై పోవడం జరిగింది. దానితో ఇంద్రునికి ఆ అద్వైత జ్ఞానం కలిగింది.

బ్రహ్మమును తెలుసుకొన్న ఇంద్రుడు ఉత్తముడయ్యాడు. ఇంద్రుని ద్వారా బ్రహ్మ గురించి తెలుసుకొన్న అగ్ని, వాయువు కూడా ఇతర దేవతల కన్నా ఉత్తములయ్యారు.

ఈ పరబ్రహ్మానికే తద్వనము అనే పేరు కూడా ఉంది. తద్వనము అంటే అందరకీ పూజనీయము, సర్వానికి ఆనంద స్వరూపము అని అర్ధం.

తస్యై తపో దయః కర్మేతి
ప్రతిష్టా వేదాః సర్వాంగాని । సత్యమాయతనం.

తపస్సు, దమం, కర్మ – వీటి పైనే జ్ఞానం ప్రతిష్టితమైంది. జ్ఞాన ప్రాప్తికి ఇవే ఆధారాలు.
సకల వేదాలు, ఆ జ్ఞానం యొక్క అంగాలు సత్యమే.

యోవా ఏతా మేవం వేద అపహత్య పాప్మాన మనంతే…..

పైన చెప్పిన విధం గా కేవోపనిషత్తును తెలుసుకొన్న విద్వాంసుడు జన్మ జన్మాంతరముల నుండి సంచితమయిన కర్మలను నశింపజేసికొని, స్వస్వరూపమగు బ్రహ్మానంద స్థితిని పొంది ఆత్మానందుడవుతాడు. జనన మరణ బంధము నుండి విడివడుతాడు. అంటూ కేనోపనిషత్తు ముగుస్తోంది.

వచ్చే భాగం లో కఠోపనిషత్తు త్వరిత మననం చేద్దాం.

93C. ఉపనిషత్తులు – విహంగ వీక్షణం

3. కఠోపనిషత్తు:

కృష్ణ యజుర్వేదం లోని కఠశాఖా బ్రాహ్మణానికి సంబంధించినదీ ఉపనిషత్తు. అందుచేత ఈ ఉపనిషత్తుకు కఠోపనిషత్తని పేరు వచ్చింది.

ఓం సహనావవతు సహనౌ భునక్తు….అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది.
ఈ మంత్రానికి గురు శిష్యులిద్దరినీ బ్రహ్మ కాపాడాలనే అర్ధాన్నే చాలా మంది చెబుతారు.

శ్రీ యోగి అచ్యుతులు సూక్ష్మం గా వ్యక్తి యొక్క ధ్యానానికి మనస్సు, ప్రాణశక్తి ల యొక్క సహకారం అవసరం కాబట్టి మా ఇద్దరనీ అనేదాన్ని మనస్సు ప్రాణాలకు అన్వయించుకోమంటారు.

సహవీర్యం కరవావహై –
జ్ఞాన ప్రాప్తి కావాలంటే మన గ్రహణ శక్తి తీక్షణం కావాలి. దానికి తగినంత వీర్య శక్తి మన శరీరం లో ఉత్పత్తి కావాలి. ప్రాణ మనో మిలన స్థితే వీర్యోత్పత్తికి సహాయకారి. (ఇద్దరం కలిసి వీర్యాన్ని శ్వీకరిద్దాం అంటే ప్రాణ మనో మిలన స్థితి లోనే వీర్యోత్పత్తి జరిగి శక్తి మంతులవుదాం అని)

తేజస్వినా వధీతమస్తు.-
అంతర్ముఖ స్థితిలో జరిగే అధ్యయనం ( సత్యాన్ని గ్రహంచే ప్రయత్నం) ప్రాణ మనో మిలన స్థితి లోనే జరుగుతుంది. ఆ స్థితి లో మనశ్చాంచల్యం లేకుండా ఉండాలనీ, దేహం లో ఉండే మలినాల వల్ల ప్రాణ గతి లో కలిగే అవరోధాలన్నీ అంతరించాలన్నదే ఈ ప్రార్ధన అంటారు.

ఈ ఉపనిషత్తులో తత్వజ్ఞానం ఒక కధ ద్వారా చెప్పబడింది. ప్రాచీన కాలం లో వాజశ్రవసుడనే ఋషి తాను మహా త్యాగి అనిపించుకోవాలని “విశ్వజిత్ యాగం” చేశాడు. పేరుకు తగ్గట్లే విశ్వన్నే జయించిన చక్రవర్తి చేసే యాగమిది. యాగ కర్త తన సర్వస్వాన్ని దానం చేసి తీరాలి.

కాని వాజశ్రవసుని దగ్గర బక్కచిక్కిన ఆవులు, కాస్తో కూస్తో ధాన్యం తప్ప ఇంకేమీ లేవు. వీటిని దానం చేసి, తను కాబట్టి ఇంత త్యాగం చేయ గలిగానని అంతరంగంలో ఎంతో గర్వాన్ని పొందుతున్నాడు.

దీనిని గమనించిన అతని 6 సంవత్సరాల వయసు కల చిన్న కొడుకు నచికేతుడు తన తండ్రి చేసే ఈ దానాల వల్ల తన తండ్రి కి నరకప్రాప్తి తథ్యమని, దానిని తప్పించ దలచి తండ్రి తో ఇలా అన్నాడు. తన సర్వస్వాన్ని దానం చేయాలి కదా, మరి నన్నెవరికి దానం చేస్తావు? అని తన తండ్రిని నిలదీశాడు. ఒకసారి కాదు, మూడుసార్లు అడిగేడు. తండ్రి కృద్ధుడై విసుగుతో నిన్ను ఆ యమునికి దానం చేస్తున్నాను అన్నాడు.

నచికేతుడు యముడు ఇంట లేని సమయంలో యమపురి కి చేరి మూడు రాత్రులు నిరాహారియై యముని ఇంట వేచి ఉన్నాడు. అప్పుడు యముడు మూడు వరాలు అనుగ్రహించేడు.

మొదటి వరంగా తన తండ్రి కోపం శాంతించి, తాను ఇంటికి తిరిగి వెళ్ళేక తనను గుర్తించి తనను ప్రేమతో చూచుకోవాలి అని.

రెండవ వరంగా స్వర్గలోక ప్రాప్తికి సాధనమైన అగ్ని ఉపాసనా క్రమాన్ని తెలుపమని కోరాడు.
ఆ చిన్న బాలుడి మేధస్సుకు ఆశ్చర్యపడి మెచ్చుకొని ఆ అగ్ని విధి విధానాలను చెబుతూ ఇకపై ఆ యజ్ఞాగ్నిని నచికేతాగ్నిగా పిలవ బడుతుందని వరాన్ని ప్రసాదించాడు.

నచికేతాగ్ని ఉపాసన తో జనన మరణ చక్రం నుంచి జనులకు ముక్తి లభిస్తుందని చెప్పడం ద్వారా నచికేతుడడిగిన స్వర్గలోక ప్రాప్తి అంటే మోక్షమని అర్ధం అవుతుంది. (నిచాయ్యేమాం శాంతి మత్యంతమేతి).

అనంత లోకాప్తి మథో ప్రతిష్ఠాం
విద్ధిత్వమేతం నిహితం గుహాయామ్

అనంత లోకం అన్నప్పుడు అంతం లేని లోకమనేది భావం. అగ్ని గుహలో గూఢంగా ఉందని అంటే హృదయంలో షుప్తస్థితిలో ఉంది అనడాన్ని చూస్తే –

నచికేతుడు అడిగింది, యముడతనికి ఉపదేశించింది యజ్ఞ యాగాదులలో, వైదిక కర్మల లోను చేసే అగ్ని స్థూల పూజాక్రమం కాదు. ముక్తిని పొందేందుకు తన దేహంలో చేయ వలసిన అగ్ని ఉపాసనా క్రమం. అదే ప్రాణాగ్ని ఉపాసనా క్రమం. అదే యోగవిద్య అనేది స్పష్టం అంటారు స్వామి జయతీర్ధులు.

మూడవ వరంగా నచికేతుడు ఆత్మజ్ఞానాన్ని కోరాడు.
యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే
అస్తీ త్యేకే నాయ మస్తీతిచైకే।।
మానవుడు మరణించిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడని కొందరు, లేదని కొందరు అంటారు. నా సందేహం నివృత్తి చేయి

యమధర్మరాజు ఇది అతి గుహ్యమైన విషయం. దానికి బదులుగా సమస్త భోగ ఐశ్వర్యాలు, దీర్ఘ ఆయువు, పుత్ర పౌత్ర కళత్ర రాజ్యాధికారాలను ప్రలోభాలుగా చూపినా నచికేతుడు బ్రహ్మ విద్యనే కోరుకొన్నాడు. అతని సత్యాకాంక్ష, స్థిర సంకల్పాలకు మెచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు.

ఇక్కడ నుంచి ఆత్మ స్వభావ స్వరూపాదుల గురించిన వివరణ ఉంటుంది.

1. లోకం లో శ్రేయోమార్గం, ప్రేయోమార్గం అని రెండున్నాయి. ప్రేయోమార్గం ఇంద్రియ సుఖాలతో భౌతిక స్థాయిలోనే ఉంటుంది. శ్రేయోమార్గం పరతత్వం, తత్వజ్ఞానం – మానవుడికి ముక్తినిచ్చే మార్గం.

2. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః… ఆత్మ గురించి వినడం కూడా ఎంతో మందికి సాధ్యం కాదు. దాని గురించి విన్నవాళ్ళు కూడా చాలామంది దానిని అర్ధం చేసుకోలేరు. దానిని ఉపదేశించే ఆచార్యుడు అద్భుతమైన వాడు. సమర్ధుడైన ఆచార్యుడు ఉపదేశించగా దాన్ని గ్రహించగలిగే బుద్ధి తీక్ష్ణత గల శిష్యుడు నిజంగా మరింత అద్భుతమైనవాడు.

3. సర్వే వేదా యత్పదమామనంతి…అన్ని వేదాలు ఘోషించే గమ్యం, అన్ని తపస్సులు ఉద్ఘాటించే గమ్యము, దేనిని కోరి సాధువులుబ్రహ్మ చర్య జీవితాన్ని గడుపుతున్నారో అదే ఓం… ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యే వీక్షణం పరమ్….ఈ అక్షరమే బ్రహ్మ. ఈ అక్షరమే సర్వోత్తమం. ఈ అక్షరాన్ని తెలుసుకొన్న వారికి ఏది కోరితే అదే సిద్ధిస్తుంది.

4. నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం… జ్ఞాత యైన ఆత్మ పుట్టదు, చావదు. శరీరం నశిస్తున్నప్పుడుకూడా ఆత్మ జన్మ రహితము, అనశ్వరము, శాశ్వతము అయి ఉంటుంది.

5. అణోరణీయాన్ మహతో మహీయా… సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు కంటే చిన్నది, బ్రహ్మాండం కంటే పెద్దది అయిన ఆత్మ ప్రాణుల హృదయాలలోనే ఉంది. కామనా రహితుడు, శోక రహితుడై, ఇంద్రియములు, మనస్సును పవిత్రం చేసుకోవడం ద్వారా ఆత్మను సాక్షాత్కరించు కుంటాడు.

6. నయమాత్మా ప్రవచనేన లభ్యో… వేదాధ్యయన చేతగానీ బుద్ధి కుశలత చేతకాని అపారమైన పాండిత్యం చేతకాని ఈ ఆత్మ పొంద బడదు. అది ఎవరిని ఎన్నుకుంటుందో అతనికి ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని వెల్లడిస్తుంది.

7. ఆత్మానం రధినం విద్ధి శరీరం రధమేవతు।.. ఆత్మ రధ మధిరోహించిన యజమాని అయితే శరీరము రధము, బుద్ధే సారధి, మనస్సే కళ్ళెము, ఇంద్రియాలే గుర్రాలు, ఇంద్రియ విషయాలే అవి పయనించే మార్గాలు.

8. ఏషసర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే. అన్ని జీవులలోను గుప్తమై ఉన్న ఈ ఆత్మ అందరకీ ప్రకటితం కాదు. బుద్ధి సూక్ష్మత కలిగిన ఋషులు మాత్రమే ఏకాగ్రమైన తమ బుద్ధి ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరు.

9. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధిత… స్వామి వివేకానంద “arise, awake, stop not till the goal is reached…” ఈ slogan తో నిద్రాణ స్థితిలో ఉన్న ప్రపంచ యువతను మేలుకొలిపి కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దేడు. లేవండి మేల్కొనండి ఉత్తమమైన గురువులనాశ్రయించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందండి. ఆ దారి ఎంతో ప్రయాస తో కూడినది. కత్తి యొక్క పదునైన అంచుమీద నడక లాంటిది.

ఏతద్వైతత్ అంటూ ఆత్మ అంటే ఇదే, “అది ఇదే,” అంటూ ఎన్నో ఉదాహరణలతో చెప్పేరు.

మన ఇంద్రియాలు బహిర్ముఖం గా మాత్రమే పనిచేస్తాయి కాని అంతరంగం లోని ప్రత్యగాత్మను చూడలేవు. ఎవరో ఒక ధీరుడు మాత్రం అమృతత్వాన్ని కోరి తన కళ్ళను అంతర్ముఖం చేసి అంతరాత్మను దర్శిస్తాడు.

రంగు రుచి వాసన, శబ్ద స్పర్శలు, మైధున సంయోగాలను ఏ ఆత్మ చేత తెలుసుకుంటున్నాడో ఆ ఆత్మకు తెలియనిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు.

మనస్సు ద్వారానే ఆత్మను దర్శించుకోవాలి. అంగుష్ఠ పరిమాణం గల ఆత్మ భూత భవిష్యత్తులకు ఆధార భూతుడు, పొగ లేని కాంతి పుంజం లాంటి వాడు.

శుభ్రమైన నీరు శుభ్రమైన నీటిలో కలిసి ఎలా శుభ్రంగానే ఉంటుందో అద్వితీయమైన ఆత్మను తెలుసుకొన్న ఋషి ఆత్మ కూడా పరమాత్మ వలే ఉంటుంది. (అహం బ్రహ్మాస్మి).

జన్మ రహితుడు, అశేష ప్రజ్ఞావంతుడు అయిన ఆ ఆత్మకు ఏకాదశ ద్వారాలు కల పురం ఉంది.

ఆకాశం లో ఉండే సూర్యుడిలో, అంతరాళం లో సంచరించే వాయువు లో, యజ్ఞ వేదిక లోని అగ్ని లో, సోమరసంలో, మానవులలో, దేవతలలో ఉండేది ఈ ఆత్మే.

అబ్జా(నీటిలో), గోజా(భూమిపై), ఋతజా (యజ్ఞంలో), అద్రిజా (పర్వతంపై) పుట్టిన వాటన్నిటి లోను ఉండేది ఆ ఆత్మ యే.

ఇక్కడ మరణానంతరం ఆత్మ ఏమవుతుందో చెబుతున్నాడు.

యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః… వారి వారి కర్మలు, జ్ఞానాన్ని అనుసరించి కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భం లో ప్రవేశిస్తాయి. మరి కొన్ని జీవాత్మలు చెట్టూ చేమల నాశ్రయిస్తాయి.

అగ్ని తను మండించే పదార్ధాన్ని పోలిన రూపాలనే ధరించినట్లు, ఒకే ఒక ఆత్మ తాను ప్రవేశించిన జీవుల రూపాలనే ధరించి కనిపిస్తుంది.

ఏకోవశీ సర్వభూతాంతరాత్మా
ఏకం రూపం బహుధాయః కరోతి
తమాత్మస్తం యేను పశ్యంతి ధీరా
స్తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్।।

యోగి అచ్యుతులు ఋష్యమూక ఆశ్రమం ప్రారంభం రోజున ఈ కఠోపనిషత్తు మంత్రాన్ని పెద్ద పెద్ద అక్షాలతో రాసి గోడకు అతికించమన్నారు. భారత దేశం లోని తత్వశాస్త్రాలన్నీ నాశనమై పోయినా ఈ ఒక్క మంత్రంతో తిరిగి మొత్తం తత్వాన్ని పునరుద్ధరించొచ్చు అన్నారు.

సకల జీవులలో అంతరాత్మగా ఉన్న ఆ పరమాత్మ (ఒకే మూల చేతనము) సమస్తాన్ని తన వశం లో ఉంచుకొని, తన ఒకే రూపాన్ని ఎన్నో రూపాలుగా వ్యక్త పరుస్తున్నాడు. ఎవరు ఆత్మ యందు స్థిర చిత్తులై దీనిని తెలుసుకుంటారో, ఆ ధీరులకు శాశ్వతమైన సుఖము లభిస్తుంది. ఇతరులకు ఆ అవకాశం లేదు.

ఋషులు ఆ అనిర్వచనీయ మైన ఆత్మను ఆనందంగా దర్శించ గలరు. దానిని నేను ఎలా తెలుసుకో గలను? అది తన స్వయం కాంతి తో ప్రకాశిస్తుందా? అన్న నచికేతుని ప్రశ్నకు యమధర్మరాజు ఇలా బదులిచ్చేడు.

నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం
నేమా విద్యుతో భాన్తి కుతో యమగ్నిః…
అక్కడ సూర్యుడు చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశించవు. మెరుపులు మెరవ లేవు. ఇంక అగ్ని విషయం చెప్పేదేముంది. ఆ ఆత్మ ప్రకాశిస్తూంటే దాన్ని అనుసరించి అన్నీ ప్రకాశిస్తాయి.

ఊర్ధ్వములోవాక్శాఖ ఏషోశ్వస్థః సనాతనః…
సనాతనమైన అశ్వత్థవృక్షానికి వేర్లు పైకి వ్యాపించి ఉంటాయి. దాని కొమ్మలు కిందకి విస్తరించి ఉంటాయి. ఇదే పవిత్రమైనది. ఇదే పరబ్రహ్మం. దీన్నే అమృతం అంటారు. అన్ని లోకాలు అందులోనే వున్నాయి. ఎవరూ దీన్ని అతిక్ర మించలేరు. ఆత్మ అంటే ఇదే.

మానవుడు తన హృదయం లో దాగి ఉన్న సకల కోరికలు నశింప చేసుకుంటే అతడు మరణ సమీపానికి చేరుకున్నప్పటికీ అమరుడౌతాడు.

ఎక్కడ మనిషి జీవించి వుండగానే అతడి హృదయ గ్రంధులు ఛేదింప బడతాయో అప్పుడు అతను అమరుడౌతాడని సకల ఉపనిషత్తులు చెబుతున్నాయి.

శతంచైకా చ హృదయస్య నాడ్యస్తాసాం మూర్ధాన మభి నిఃసృతైకా।
హృదయం యొక్క నాడులు నూట ఒకటి. వీటిలో ఒకటి సుషుమ్న తల పై దాకా వ్యాపించి ఉంది. దీనితో పైవరకూ వెళ్ళ గలిగిన వాడు అమృతత్వాన్ని పొంద గలుగుతాడు.

బొటనవేలంత పరిమాణం లోఉన్న అంతరాత్మ అయిన పురుషుడు ఎల్లప్పుడు ప్రాణుల హృదయాలలో నివసిస్తూ ఉంటాడు. వివేకవంతుడైన వాడు ఆ పురుషుణ్ణి ముంజు నుంచి ఇషీకాన్ని వేరు చేసినట్లే వేరు చేయాలి. ఆ పురుషుడే పరిశుద్ధుడూ, అమరుడు అని గ్రహించాలి. అంటూ యమధర్మరాజు బోధించాడు.

సమగ్రంగా ఉపదేశం పొందిన నచికేతుడు అన్ని రకాల మాలిన్యాల నుండి ప్రక్షాలితుడై మృత్యువుని జయించి బ్రహ్మప్రాప్తిని పొందాడు.

ఈ రోజు కఠోపనిషత్తు కొంచెం విపులంగా మననం చేయడం వల్ల విస్తారమయ్యింది. కొంచెం ఓపిక తో చదివి అర్ధం చేసుకోగలరని మనవి.

వచ్చే భాగం లో మాండూక్యోపనిషత్తు మననం చేసుకుందాం.

93D. ఉపనిషత్తులు – విహంగ వీక్షణం

4. మాండూక్యోపనిషత్తు:

అధర్వణ వేదానికి చెందినమాండూక్యోపనిషత్తు ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః.. అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది.

ఈ ఉపనిషత్తు పరిమాణం లో చిన్నదైనా కేవలం 12 మంత్రాలలో ఎన్నో గొప్ప సత్యాలను ఆవిష్క రించింది. దీనిని చదివి అర్ధం చేసుకోవడమనేది అత్యంత కష్టం అంటారు. ముక్తిని కోరుకునే వారు ఒక్క మాండూక్యోపనిషత్తు చదివితే చాలు సమస్తం అర్ధం అవుతాయి అని నమ్మకం.

వీటికి ఆది శంకరుల గురువులకు గురువులు శ్రీ శ్రీ గౌడ పాదులు 215 కారికలు రాశారు.- ఆ కారికలు ఆగమ, వైతథ్య, అద్వైత, అలాతశాంత ప్రకరణాలుగా విభజింప బడ్డాయి.

ఆగమ ప్రకరణం లో ఓంకార తత్వాన్ని వివరించడం తో బాటు ఈ ఉపనిషత్తు లోని 12 మంత్రాలలో ఓం కారం యొక్క వివరణ ఇవ్వబడింది. వైతిథ్య ప్రకరణం లో(వితధ అంటే వాస్తవానికి భిన్నం గా అని అర్ధం) అనేకత్వంతో ఉంటూ ఈ కంటికి కనిపించే ప్రపంచం సత్యం కాదని నిరూపించ బడింది.

అద్వైత ప్రకరణం లో అద్వైత సిద్ధాంతాన్ని వివరిస్తే, అలాతశాంత ప్రకరణం లో వేద ప్రమాణాన్ని అంగీకరించని బౌద్ధమతం లాంటి ఇతర సిద్ధాంతాలు నిరాకరించబడ్డాయి.

ఈ ఉపనిషత్తు లో అవస్తాత్రయాన్ని దాటి తురీయం (తనను తాను బ్రహ్మముగా, ఆనంద స్వరూపంగా అనుభూతి పొందడం) చేరుకొని తన స్వస్వరూప జ్ఞానం తెలుసుకోవడం ద్వారా ముక్తిని పొందడం వివరింపబడింది.

మొదటి మంత్రం ”ఓం” కారమే సర్వం అని వివరిస్తుంది.

ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోప వ్యాఖ్యానం…

ఓం అనేది నాశం లేనిది. జ్ఞానులు చెప్పేదంతా దాని వివరణే. ఇంతకు ముందు జరిగింది, ఇపుడు జరుగుతున్నది, ఇక ముందు జరిగేది అంతా ఓంకారమే. వీటన్నిటినీ మించి త్రికాలాతీతంగా ఉండేది ఓంకారమే.

ఓం అన్నప్పుడు ఉత్పత్తి అయిన స్వరానికి కారణమైన వాయువు (ప్రాణ వాయువు) ఊర్ధ్వముఖం గా సాగి దాని ఉత్పత్తి స్థానము లో లయమౌతోంది.

పంచప్రాణాలలో ముఖ్యమైన ప్రాణ వాయువు యొక్క ఊర్ధ్వగమనంలో పుట్టే శబ్దాన్నే ఓంకారం (ప్రణవం) అంటారు. ఆ ప్రాణుని స్పందన నుంచి పుట్టిన స్వర యుక్తమైన ఓం కారమే మిగిలిన భూతాల ఉత్పత్తికి కారణమయ్యింది. అందువల్ల ఆ భూతాల కలయిక వల్ల కల్గిన, కలుగుతున్న, కలిగే ఈ జగత్తంతా ఓంకారమే అని చెప్పేరు ఋషులు.

ఇక్కడ మన ఉపనిషదృషులు రెండవ మంత్రం నుంచి మానసిక తత్వ శాస్త్రాన్ని అత్యద్భుతంగా విశ్లేషించి చెప్పేరు

రెండవ మంత్రం సర్వం పరబ్రహ్మమే అని చెబుతుంది.

సర్వం హ్యేతద్బ్రహ్మాయమాత్మా
బ్రహ్మ సోయ మాత్మా చతుష్పాద్

అంతా బ్రహ్మమే. బ్రహ్మం నుండి వచ్చినదే. బ్రహ్మం వల్ల ఉద్భవించినదే. అటువంటి ఆత్మకు నాలుగు అవస్థలు ఉన్నాయి.

మూడు నుంచి ఆరవ మంత్రం వరకూ “అవస్ధాత్రయ విచారణ” ద్వారా పరమాత్మ యొక్క “సాకార- సగుణ” రూపాన్ని వివరిస్తుంది.

జాగరిత స్థానో బహిః ప్రజ్ఞ సప్తాంగ
ఏకోన వింశతి ముఖఃస్థూల భూగ్వైశ్వానరః
(ప్రధమ పాదః) -3వ మంత్రం

తన బయటి ప్రజ్ఞ ఉండే వేళ అతనికి 7 అంగాలు (పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి); 14 ముఖాలు ఉంటాయి. (పంచ కర్మేంద్రియాలు,పంచ బ్రహ్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తు, అహంకారం). స్థూల వస్తువులు అతని ఆహారం. దాన్ని జీర్ణించుకునే శక్తే వైశ్వానరుడు. ఈ స్థితి నే జాగ్రదావస్థ అంటారు.

4వ మంత్రం లో స్వప్న స్థితి. స్థూలేంద్రియాల సహాయం లేకుండా లో లోపలే తెలుసు కో గలిగే స్థితిలో ఉండటమే స్వప్న స్థితి. అతనికి 7 అంగాలు, 19 ముఖాలు. ఆ స్థితి లో అతని స్థూలేంద్రియాలు కదలకుండా ఉన్నా తాను స్థూలేంద్రియాల ద్వారా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థితి లో అతని ఆహారం స్థూలమైనది కాకపోయినా స్థూలం లాగానే కన్పిస్తాయి. ఈ స్థితి లో ఆత్మ తైజసుడు అని పిలవ బడతాడు. ఇది రెండవ అవస్థ.

నిద్రా స్థితి లో ఏ కోరికలు ఉండవు. స్వప్నమూ కనుపించదు. అతని ఉనికి ఘనీభూతమైన స్థితి లో ఉంటుంది. ఆ స్థితి లో ఆనందమయుడై ఉంటాడు. అతనికి ఆనందమే ఆహారం. అసంకల్పిత రీతిలో శ్వాస క్రియను నడిపిస్తూ దేహంలో చైతన్యపు ఉనికి మాత్రమే కనిపిస్తూ చైతన్యమే అతని ముఖంగా ఉంటుంది.

ఈ సుషుప్త స్థితి లో అతణ్ని ప్రాజ్ఞుడు అంటారు. ఇదే మూడవ అవస్థ. ఈ సుషుప్త స్థితి లో వైరాగ్యం ఉంటుందని, అందుచేత ఈ స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉందని ఉపనిషత్తు చెబుతోంది. (5వ మంత్రం).

(6వ మంత్రం లో) ఇతడే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, అన్ని వస్తువులకు ఉత్పత్తి స్థానం. సమస్త ప్రాణులకు ఉద్భవ స్థానం. నాశనానికి కారణం.సుషుప్త స్థితి లో షుప్తం గా ఉండే ఆత్మే సర్వజ్ఞుడు కాగలుగు తాడు.

ఈ దేహానికి ఆత్మ ఉన్నట్లే పంచభూతాల కలయిక తో కూడిన ఈ జగత్తుకీ ఒక ఆత్మ ఉంది. అదే సమస్త ప్రాణుల ఉత్పత్తి వినాశాలకు కారణం. జ్ఞానులు మన దేహం లో ఉన్నదాన్ని జీవాత్మ అనీ జగత్తు లో ఉన్నదాన్ని పరమాత్మ అనీ అన్నారు.

ఏడవ మంత్రం ప్రత్యేకంగా పరమాత్మ యొక్క”నిరాకార నిర్గుణ” రూపాన్ని (తురీయావస్థ) వివరించింది.

నాంతః ప్రజ్ఞం న బహిప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం
నప్రజ్ఞాన ఘనం న ప్రజ్ఞం అదృష్టమవ్యవహార్య

తన లోని శారీరక, మానసిక క్రియల స్పృహే లేదు. అలాగే ఇంద్రియాల ద్వారా పొందే బయటి ప్రజ్ఞ కూడ లేదు. ఎందుకంటే ఇంద్రియ వృత్తులు ఉండవు. బయటి దాన్ని, లోపలి దాన్ని ఒకే సమయం లో గమనించే స్థితి కూడా లేదు. ఘనీభూతమైన ప్రజ్ఞాస్థితి లో (సుషుప్త స్థితి లో) జ్ఞానమూ లేదు, అజ్ఞానమూ లేదు. సర్వ దుఃఖాలకు ఉపశమనం కల్గించే శాంతి తో కూడిన శ్రేయస్కరమైన తన ఎరుక మాత్రమే ఉండే స్థితి నాల్గవ స్థితి తురీయావస్థ. ఇదే ఆత్మ యొక్క సహజ స్థితి.

ఎనిమిదవ మంత్రం నిశ్శబ్దం లో పుట్టి నిశ్శబ్దం లోనే కలిసిపోతున్న అకార, ఉకార, మకార శబ్దంతో పలికే ఓంకారము మరియు సర్వ వ్యాపియైన పరబ్రహ్మము ఒక్కటే అని చెబుతోంది.
ఓంకారోచ్ఛారణను విభజిస్తే మాత్రా రూపం లో ఉంటుంది. ఆ మాత్రలే అ కారం ఉ కారం మ కారం.

ఆత్మ స్థితి ఎలా ఉందనే అంశాన్ని గమనించి దాని పాదం లోని మాత్రల ఉచ్ఛారణ లోని శబ్దాల అంతరాలను విభిన్న మాత్రలుగా చెప్పారు. అవే అకార ఉకార మకారాలు.

తొమ్మిది నుంచి పన్నెండవ మంత్రం వరకూ పరమాత్మ యొక్క నామమైన “ఓంకార” వివరణ.

జాగ్రదావస్థయే జీవాత్మ అనుభవానికి వచ్చే మొదటి స్థితి. ఇంద్రియాల ద్వారా విశ్వానికి సంబంధించిన జ్ఞానం, సంబంధం ఉంటాయని ఆ స్థితి లో ఆత్మ వైశ్వానరుడౌతాడు. అందువల్ల అ కారం.

ప్రపంచం లో అనుభవానికి వచ్చే రెండో అవస్థ స్వప్నావస్థ. ఆ స్థితి లో తైజసుడౌతాడు. ఈ స్థితి లో జాగ్రదావస్థ లో నెరవేరని కోరికలు పూర్తి కావడం వల్ల మనస్సుకు తృప్తి. ప్రణవోపాసనను తెలుసుకున్న వాళ్ళు అనుష్ఠానం చేసే వేళ ఉకారం ఉత్పత్తిని గ్రహించ వచ్చు.

మూడో అవస్థ అయిన సుషుప్త స్థితి లో జీవాత్మ అస్థిత్వం మాత్రమే ఉంటుంది. మనస్సు ఏ రకమైన వ్యాపకత్వం లేకుండా మూల చైతన్యమైన జీవాత్మ లో ఐక్యమై విశ్రాంతి తీసుకుంటుంది. ఈ సుషుప్త స్థితిని మ కారం తో పోల్చారు.

ప్రయత్నం లేకుంటే సుషుప్తి తర్వాత తురీయం లభించదు. మళ్ళీ స్వప్న స్థితో, జాగ్రదావస్తో లభిస్తుంది.

జీవాత్మ కు తురీయావస్థ లో జ్ఞానం, ఆనందాల ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు నిర్వికల్ప సమాధికే ప్రాధాన్యం. దీన్ని గ్రహించి అనుష్ఠానం చేసే వాడికి ప్రపంచం లో ఉండే వాళ్ళందర పరిమితి అర్ధమౌతుంది.

నాల్గవ దయిన తురీయ స్థితి లో మాత్ర లేదు. ఈ స్థితి గురు కృపతో మాత్రమే లభ్యమయ్యేది. ఈ స్థితి లో ప్రాపంచక వ్యవహారాల్లో కల్గే నిర్బలత్వం, చాంచల్యం, నైరాశ్యం, దుఃఖం మొదలైనవన్నీ శాంతిస్తాయి. ఇది శ్ర్యేయస్కరమైన స్థితి. ముక్తికి సాధనం. ఈ స్థితి లో తన అస్థిత్వం తన మూలం తెలుస్తుంది. దీనివల్ల అద్వైతానుభవం లభిస్తుంది.

ఇలా ఆత్మ సాక్షాత్కారానికి స్థానమైన ప్రణవాన్నే, ఓం కారాన్నే ఆత్మ అన్నారు. దీని మర్మం తెలుసుకొని ధ్యానం చేసే వ్యక్తి తన ఇచ్ఛానుసారం ఆ ఆత్మను చేరుకుంటాడు. అంటూ మాండూక్యో పనిషత్తు ముగుస్తుంది.

శ్రీ శ్రీ గౌడపాదుల 215 కారికలు, వాటి వివరణలు దొరకడమే చాలా కష్టమైన విషయం.

శ్రీ శ్రీ గౌడపాదుల ఆగమ ప్రకరణంలోని కారికలు, పై మూడు అవస్ధల గుణగణాలను ఇలా వివరించాయి.

1. వైశ్వానరుడు లేక విశ్వుడు సర్వ శక్తిమంతుడు. బాహ్య ప్రపంచంలోని సమస్త భౌతిక వస్తువులను అనుభవములోకి తెచ్చుకోగలిగిన వాడు.
తైజసుడు అంతరదృష్ఠి కలిగి లోపలి విషయాలను చూడ గలుగుతాడు.
ప్రాజ్ఞుడు సమస్తాన్ని తెలుసుకోగలిగిన ప్రజ్ఞను కలిగి ఉంటాడు.

2. విశ్వుడు కనుల ద్వారా వీక్షించ గలిగితే తైజసుడు మనస్సు ద్వారా అర్ధం చేసుకొంటాడు. ప్రాజ్ఞుడు హృదయాకాశాన్ని ఆక్రమించి సమస్త జ్ఞానానికి ప్రతీక అవుతాడు.

3. విశ్వుడు స్ధూలాన్ని అనుభవిస్తే తైజసుడు కంటికి కనబడని వాటిని మనస్సు ద్వారా మాత్రమే చూడగలిగేవాటిని గ్రహిస్తాడు. మరి ప్రాజ్ఞుడు మాత్రము ఆనందానుభూతిని పొందుతూ ఆనందమయమైన వాటిని దర్శిస్తూంటాడు. ఈ స్ధితినే చేతోముఖం అంటారు.

4. పై కారికనే తిరిగి ఈ రకంగా చెప్పేడు:
స్ధూల అనుభవాలవల్ల విశ్వుడు సంతృప్తుడౌతాడు. మానసిక అనుభూతుల ద్వారా తైజసుడు ఉత్తేజితు డౌతాడు. ఆనందానుభూతి ద్వారా ప్రాజ్ఞుడు కుశలుడౌతాడు.

5. స్ధూల అనుభవాలు, అనుభవాలను కలిగించే వస్తువులతో కూడిన మానసిక అనుభవాలను తెలిపే ఆత్మ యొక్క రెండు స్ధితులు వివరింప బడ్డాయి. ఈ రెండు అవస్ధలను తెలుసుకొన్న ప్రాజ్ఞుడెవ్వడైనా వాటన్నిటినీ అనుభవిస్తున్నా వాటి వల్ల వికార మమకారాలు లేకుండా నిర్వికారంగా ఉంటాడు.

కారికలు ఎలా ఉంటాయనేదానికి పై వివరాలు ఇచ్చేను.

వచ్చే భాగం లో ప్రశ్నోపనిషత్తు త్వరిత మననం చేద్దాం.

93E. ఉపనిషత్తులు – విహంగ వీక్షణం

5. ప్రశ్నోపనిషత్తు:

ఉపనిషత్తులలో అత్యంత ప్రధానమైనదీ ప్రశ్నోపనిషత్తు. ఇందులో జిజ్ఞాసువులు ఆరుగురు పిప్పలాద మహర్షి వద్దకు వచ్చి తత్వ రహస్యాన్ని ఉపదేశించమని అడుగుతారు. ఈ ఆరుగురు అడిగే ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. తత్వాన్ని ఆకాంక్షించే వాళ్ళందరిలో ఉదయించే ప్రశ్నలన్నీ ఈ ఆరుగురు అడిగిన ప్రశ్నలలో వచ్చేస్తాయి.

అధర్వణ వేదానికి చెందిన ఈ ఉపనిషత్తు ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః… అంటూ తత్వ జిజ్ఞాసకు అవసరమైన బాహ్య, అంతరంగిక శాంతిని ప్రసాదించమని కోరుతూ సత్యశోధన మొదలవుతుంది.

కాత్యాయన వంశజుడైన కబంధుడు, భృగు వంశజుడైన వైదర్భి, అశ్వలాయన వంశస్తుడైన కౌశల్యుడు, గర్గమహర్షి సంతతికి చెందిన సౌర్యాయణుడు, శిబి వంశజుడైన సత్యకాముడు, భరద్వాజ వంశజుడైన సుకేశుడు అనే ఆరుగురు ఋషులు వారి వారి సందేహ నివృత్తికై పిప్పలాద మహర్షిని సమిత్పాణులై ఆశ్రయించారు.

అప్పటికే ఆ ఆరుగురు ఋషులూ శమదమాది సద్గుణ సంపన్నులు అయినా పిప్పలాదుడు వారందరనీ ఒక ఏడాదిపాటు శ్రద్ధావంతులై బ్రహ్మచర్యం తో తపస్సు చేసుకుంటూ తన ఆశ్రమంలోనే ఉండి గురుశుశ్రూష చేస్తూ ఉండమన్నాడు. అటువంటి ఆశ్రమ వాసం శిష్యుల మనస్సులను కుదుట పరచి గురువు తో అనుబంధం ఏర్పరుస్తుంది.

సుకన్యా చ్యవనుల కుమారుడు దధీచి. దధీచి దేవతలకు దానవ సంహారం చేయడానికి కావలసిన వజ్రాయుధం గురించి తన వెన్నెముక ను ఇవ్వడానికి సంసిద్ధుడై తన భార్యను సమాధాన పరచి యోగం ద్వారా ప్రాణ త్యాగం చేస్తాడు. అప్పటికే అతని భార్య సువర్చ గర్భవతి.

దుఃఖం ఆపుకోలేక ఒక పిప్పల వృక్షం క్రింద కూర్చుని గర్భాన్ని చీల్చుకుంది. పుట్టిన ఆ మహా తేజస్వియైన పుత్రుడిని పిప్పల వృక్షానికి అప్పజెప్పి తను పతితో సహగమనం చేసింది. పిప్పల వృక్షం క్రింద పెరిగి పిప్పలాదుడ నబడ్డాడు.

తన తల్లిదండ్రుల మరణ వృత్తాంతం విని దేవతల మీద ఆగ్రహంతో ఘోర తపస్సాచరించాడు. పరమేశ్వరుని అనుగ్రహం తో ఉత్తమ లోకాలలో ఉన్న తన తల్లితండ్రులను దర్శించుకొని వారి ఉపదేశాను సారం తన ఆశ్రమానికి తిరిగి వచ్చి బ్రహ్మజ్ఞాని అయ్యాడు. గర్భోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు లకు ద్రష్ట ఈయనే.

1.కత్యాయనుని కొడుకైన కబంధుడు
” భగవన్। ఈ ప్రజలంతా ఎక్కడనుంచి పుడతారు?” అని అడిగాడు.

ప్రజలను కోరుకున్న ప్రజాపతి తపస్సు చేసి అనేక ప్రజల ఉత్పత్తి కోసం ” రయించ ప్రాణంచ” జడ చైతన్యాలను సృష్టించాడు. ఆదిత్యుడే ప్రాణం. చంద్రుడే రయి (రయి అంటే ఆకారమున్న వస్తువు). ప్రాణుడే అగ్ని. ప్రజల ప్రాణం సూర్యుడే. సూర్య కిరణాల స్పర్శ తో కర్మకు ప్రేరణ, చంద్ర కిరణాల స్పర్శ తో నిద్రకు ప్రేరణ లభిస్తాయి.

రయి ప్రాణ మిథునమే సంవత్సర రూప కాలముగా కనపడుతోంది. చంద్రుని వల్ల తిథులు, సూర్యుడి వల్ల అహోరాత్రాలు కలుగుతున్నాయి. మాసములు ప్రజాపతి అయితే శుక్ల పక్షమే ప్రాణము, ఆదిత్యుడు, కృష్ణ పక్షమే రయి, చంద్రుడు.

పరిశుద్ధమైన బ్రహ్మలోకం జిహ్వచాపల్యం, అసత్యము, మోసము లేని వారికి ప్రాప్తిస్తుంది.

2.భృగు వంశజుడగు భార్గవుడు
” భగవన్ ఎంతమంది దేవతలు ప్రజలకు ఆధారంగా తమ గఉన్నారు? వాళ్ళలో దీనిని ప్రకాశింప జేసేదెవ్వరు? వారిలో వరిష్ఠులెవ్వరు?” అని రెండవ ప్రశ్నగా అడిగేడు.

పిప్పలాదుడిలా ఉత్తరమిచ్చాడు. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి, వాక్కు, మనస్సు, కళ్ళు చెవులు అనేవే దేవతలు.

పంచభూతాదులు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ మేమే ఈ శరీరాన్ని నిలబెడు తున్నాము అంటూ గర్వంగా చెప్పుకొంటున్నాయి. అప్పుడు ప్రాణము తనను తాను ఐదు భాగములు గా చేసుకొని రక్షిస్తూ ఈ శరీరం పడిపోకుండా నిలబెట్టు చున్నానని చెబితే ఆకాశాదులు విశ్వసింపలేదు. అప్పుడు ప్రాణము బైటకు పోయినట్లభినయిస్తే ఇంద్రియములన్నీ నిస్తేజముగా అయిపోయాయి.

అప్పుడా దేవతలు ప్రాణునితో ” నీవు ప్రజాపతివి. దేవతలలో శ్రేష్ఠుడైన అగ్ని, పితృదేవతల ప్రధమ ఆహుతి నీవే. నీవు తేజస్సు లో ఇంద్రుడివి. రక్షించే రుద్రుడివి. ప్రకాశించే సూర్యుడివి. అంతా నీవే. వర్షం కలిగించే వాడివి నీవే. నీవు ఒక్కడే ఋషి. ఈ జగత్తుకు ఈశ్వరుడివి. వాయువుకు తండ్రిని. వాక్కు, చెవులు, కళ్ళు, మనస్సులలో వ్యాప్తమైన నీ అంశను సదా మంగళకరంగా మార్చుకో. మాతేన పుత్రాన్ రక్షస్వ…. తల్లి పిల్లలను కాపాడినట్లు మమ్మల్ని రక్షించు. నాకు సంపదను జ్ఞానాన్నినప్రసాదించు.

3.అశ్వలాయనుని కొడుకు కౌసల్యుని ప్రశ్న- ఈ ప్రాణం ఎక్కడ పుడుతుంది? ఈ దేహం లో ఎలా ప్రవేశిస్తుంది? తనను విభజించుకొని దేహం లో ఎలా ఉంటుంది?” ఎందుకీ దేహాన్ని వదలి వెడుతుంది? బయటి అంతర జ్ఞానాలను ఎలా ధరిస్తుంది?

పిప్పలాదుడు కౌసల్యుడడిగిన ప్రశ్నలకు సంతసించి నీవు జ్ఞానవంతుడవని మెచ్చుకొంటూ ఇలా జవాబిచ్చేడు.

ఆత్నన ఏష ప్రాణో జాయతే, యథైషా పురుషే ఛాయా ఏతస్మి న్నేతదాతతమ్ మనోకృతేనా యాత్యస్మిన్ శరీరే।

ఆత్మనుంచి ఈ ప్రాణం పుడుతోంది. ఇది ఆత్మకు నీడలా ఉంటుంది. మానసికములైన ఆలోచనల వల్ల ఏర్పడే కర్మల కనుగుణంగా ఈ దేహం లో ప్రవేశిస్తుంది.

చక్రవర్తి వేరే వేరే అధికారుల్ని నియమించినట్లు, ముఖ్య ప్రాణం పాయు ఉపస్థల యందు అపానాన్ని నియమిస్తూ , తాను స్వయము గా నాసిక నుండి వెలువడుచు చక్షువులు, శ్రోత్రములందు సంచరిస్తుంది.

ఈ ప్రాణాపానముల మధ్య సమానముంటుంది. ఈ సమాన వాయువు జఠరాగ్ని లో పచనం చేయబడిన అన్నముయొక్క సారాన్ని సమానము గా అన్ని అవయవములకు పంపుతుంది. ఈ జఠరాగ్ని నుండే సప్త జ్వాలలు వెలువడు తున్నాయి.

ఈ జీవాత్మ యొక్క హృదయం లో నూటొక్క ప్రధాన నాడులున్నాయి. వాటిలో ఊర్థ్వాభి ముఖంగా పోయే సుషుమ్నా నాడి ద్వారా ఉదాన వాయువు నాభికి పైన సంచరిస్తుంది. ఉదానం పుణ్య వంతులను పుణ్య లోకాలకు, పాపులను పాపలోకానికి, పాప పుణ్యాలు రెండూ కల వాళ్ళను మానవ లోకానికి తీసుకొని వెడుతుంది.

దేహగతమైన తేజస్సు ఉదాన వాయువుకు తోడుగా ఉంటుంది. మరణ సమయం లో జీవుడు ఎట్టి సంకల్పము చేస్తున్నాడో అదే సంకల్పాను సారం గా శరీరమును పొందుచున్నాడు.
విజ్ఞాయామృతమశ్నుతే- ఈ పై విజ్ఞానాన్ని తెలుసుకున్న వాడు అమరత్వాన్ని అనుభ విస్తాడు.

సూర్యుని ప్రపౌత్రుడు, గర్గ గోత్రుడునగు సౌర్యాయణి పిప్పలాదునివఅడిగేడు.

4.పురుషునిలో ఏవేవి నిద్రిస్తూ ఉంటాయి? ఏవేవి హెచ్చరిక కల్గినఉంటాయి? ఏ దేవత స్వప్నాన్ని చూస్తాడు? ఎవరికి సుఖం కలుగుతుంది? దేంట్లో అంతా జేరతాయి? కస్మిన్ సర్వే సంప్రతిష్టితా భవంతి?

అస్తమించే సూర్యకిరణాలు ఆ మండలం లో చేరి సూర్యుడు ఉదయించేక మళ్ళీ బయటకు వస్తాయి. అలాగే ఇంద్రియవృత్తులన్నీ మనస్సు లో లీనమౌతాయి. ప్రాణాగ్నులు మాత్రమే జాగృతం గా ఉంటాయి.

గార్హపత్యమే అపానం. వ్యానం అన్వాహార్యం. ఆహవనీయం ప్రాణం. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని నడిపించే క్రియ సమానం. మనస్సే యజమాని. ఇష్టఫలాన్ని లభింపజేసేది ఉదానం. ఇది ప్రతి దినమూ మనస్సును బ్రహ్మస్థానం వైపు తీసుకొని పోతుంది.

మనస్సే స్వప్నంలో చూసేది, అడిగేది, అనుభవించేది. జ్ఞానాన్ని సముపార్జించేక మనస్సు స్వప్నాన్ని దర్శించదు. ఈ శరీరం లో అది సుఖం అనుభవిస్తూ ఉండిపోతుంది.

పక్షులు తమ గూళ్ళుండే చెట్టునే ఆశ్రయించినట్లుగా ఇవన్నీ శ్రేష్టమైన ఆత్మ లో చేరుతాయి. భూతాలూ, తన్మాత్రలూ, ఇంద్రియాలూ, ఇంద్రియ వృత్తులు, మనస్సు, ప్రాణం ఇవన్నీ ఆత్మ లో చేరుతాయి.

5.శిబి కుమారుడైన శైబ్యకాముడు అడుగు తున్నాడు- ప్రాణోత్క్రమణ వరకూ ఓంకారాన్ని ధ్యానించే వ్యక్తి ఏ ఏ లోకాలను జయిస్తాడు?

ఇక్కడ ఓం కారమే పరబ్రహ్మ అపరబ్రహ్మ కూడాను. అందువల్ల విద్వాంసులు దీని ఆధారం తో ఈ రెండింటిలో ఒకదాన్ని పొందుతారు.

ఇందులో ఒక మాత్రను మాత్రమే అనుష్ఠానం చేస్తే తపస్సు బ్రహ్మచర్యాలతో కూడినవాడై మహిమల్ని పొందుతాడు.

మనఃపూర్వకం గా రెండు మాత్రల అనుష్ఠానం చేస్తే (ఋక్ యజుర్- ఊర్ధ్వ, అధోగతులు) చంద్ర లోకానికి వెళ్ళి సుఖాలనుభవించి మళ్ళీ పుడతాడు.

మూడు మాత్రలతో కూడిన ఓం కారాన్ని (ఋక్ యజుర్ సామ- ఊర్ధ్వ అధో రుద్ర గతులు, బాహ్యాభ్యంతర మధ్యమ క్రియలు)సూక్ష్మాతి సూక్ష్మమగు ఆ పరబ్రహ్మ ధ్యానం తో పాటు అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తి సూర్యలోకానికి పోయి స్థూల శరీరం, పాపాల నుండి ముక్తుడై అక్కడ నుండి సామవేద బలం తో బ్రహ్మ లోకం చేరతాడు. అతడు ఆ పరాత్పర పురుషుని దర్శిస్తాడు.

6.భరద్వాజుని కొడుకైన సుకేశుడడిగాడు: పదహారు కళలుండే పురుషుడెవరు? అతడు ఎక్కడుంటాడు?

షోడశ కళలతో కూడిన పురుషుడు ఈ శరీరం లోనే ఉంటాడు. అతడు ఆ దేహం తనకు నివాస యోగ్యం గా ఉందో లేదో ఆలోచించి, ఎవరు ఈ దేహం నుంచి బయటకు వస్తే తానుకూడా బయటకు రావలసి వస్తుందో అలాంటి ప్రాణాన్ని సృష్టించాడు.

ప్రాణం లోంచి శ్రద్ధ, ఆకాశం, వాయువు, జ్యోతి, నీరు, భూమి, ఇంద్రియాలు, మనస్సు, అన్నం, అన్నం లోంచి వీర్యం, తపస్సు, మంత్రం, కర్మ, లోకం, పదార్దాలు ఇలా సృష్టించబడ్డాయి.

రధచక్రం లోని ఆకులలాగ సమస్తకళలు ఏ పురుషుడిలో ప్రతిష్ఠను పెంపొందిస్తున్నాయో ఆ ఆత్మను తెలుసుకోవాలి.

చివరగా పిప్పలాదుడు ఆరుగురు శిష్యుల నుద్దేశించి నేను పరబ్రహ్మను ఎరుగుదును, ఇంతకు మించిన సూక్ష్మవస్తువు మరియొకటి లేదు అని చెబుతూ ఈ ఉపనిషత్తును ముగించాడు.

వచ్చే భాగం లో ముండకోపనిషత్తు త్వరిత గతిలో మననం చేద్దాం.

93F. ఉపనిషత్తులు – విహంగ వీక్షణం

6. ముండకోపనిషత్తు:

ముండకోపనిషత్తు “ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః..” అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది.

ఈ ఉపనిషత్తు అధర్వణ వేదానికి చెందినది. మంగలికత్తి శిరోజాలను తీసివేసినట్టే ఈ ఉపనిషత్తు అజ్ఞానాన్ని అంతం చేస్తుంది కనుక దీనికి ముండకోపనిషత్తు అని పేరు వచ్చిందని; జుట్టు అనేది అహంకార మమకారాలకు ప్రతీకలని అందుచేత శిరోముండనం తో ఆరెంటినీ త్యజించిన సన్యాసులకేబ్రహ్మ విద్య నభ్యసించే అర్హత ఉందని అందుకే ముండకోపనిషత్తు అని పేరు వచ్చింది అంటారు.

దీనిలో మూడు ముండకాలు (అధ్యాయాలు) ఉన్నాయి. ప్రతి ముండకం రెండు ఖండాలు (భాగాలు). గా విభజింపబడ్డాయి. మొత్తం మంత్రాలు 64.

1. ఒకటో ముండకం, ప్రధమఖండం లో బ్రహ్మ విద్య ఆదికాలం నుంచి వచ్చిన క్రమం, పరావిద్య, అపరా విద్యల లక్షణాలు, బ్రహ్మ తపస్సు వల్ల కల్గిన సృష్టి యొక్క వివరాలు వివరించ బడ్డాయి.

సృష్టికర్త అయిన బ్రహ్మ సకల విద్యలకు మూలాధారమైన బ్రహ్మ విద్యను తన జ్యేష్ఠపుత్రుడైన అధర్వునకు ఉపదేశించేడు.

అధర్వుడు అంగిరునకు, ఆ అంగిరుడు భరద్వాజ గోత్రీకుడగు సత్యవహునకు, సత్యవసుడు అంగిరసునకు ఉపదేశించేరు.

గృహస్తు అయిన శౌనకుడు అంగిరసుని సమీపించి పూజించి ఇలా అడిగేడు.
” కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి? ” – హే భగవన్। దేనిని తెలుసుకొన్నట్లయితే సర్వం తెలుసుకొన్నట్లవు తుంది?

దానికి అంగిరసుడు పరవిద్య, అపరావిద్య అని రెండు విద్యలు తెలుసుకొ దగినవి అని బ్రహ్మ జ్ఞానులు చెబుతున్నారు.

అపరావిద్య అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం, శిక్ష, కల్పము, వ్యాకరణం, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషం మొదలయినవి.

ఏ విద్యవల్ల అక్షరుడగు పరమాత్మ యొక్క స్వరూపం ప్రాప్తిస్తుందో అదే పరవిద్య. అంటే బ్రహ్మ విద్య. ఈ పరబ్రహ్మ తత్వము దర్శించుటకు గాని, గ్రహించుటకు గాని వీలుకానిది. ఏ సంబంధము లేనిది. రంగు రూపము గాని, నేత్రములు శ్రోత్రములు గాని, హస్తములు పాదములు గాని లేనిది. నిత్యమైనది. సర్వ వ్యాపకమైనది. అత్యంత సూక్ష్మము, అవ్యయము, సమస్త భూతముల యొక్క ఉత్పత్తి స్థానమైనఉన్నది. దీనిని తెలుసుకొన్న బ్రహ్మ జ్ఞానులు సర్వత్ర ఈ ఆత్మనే దర్శించు చుందురు.

సాలెపురుగు ఏ రీతిగా దారములను సృష్టించు కుంటూందో, తిరిగి లోపలకు ఏ రీతిగా తీసుకొంటూందో, అదే రీతిగా భూమియందు ఓషధులు పుడుతున్నాయి. పురుషులకు కేశములు (తలపై ఉండేవి), రోమములు( మిగిలిన దేహము పై ఉండేవి) పుడుతున్నాయి. అదే రీతిగా అక్షర బ్రహ్మము నుంచి ఈ సర్వ జగత్తు పుడుతోంది.

తపసా చీయతే బ్రహ్మ…. అక్షరబ్రహ్మము జ్ఞాన తపస్సుతో అభివృద్ధి అవుతోంది.
అన్నాత్ప్రాణో మనః సత్యం లోకాః… అన్నం (అవ్యాకృతం) నుండి ప్రాణం (హిరణ్యగర్భుడు), మనస్సు, ఆకాశాది పంచభూతాలు, సప్త లోకాలు, కర్మలు, కర్మఫలాలు జనిస్తున్నాయి.

య స్సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః.. స్వీయ సంకల్పమే జ్ఞాన స్వరూపమైంది. ఎవరు సమస్త జగత్తు యొక్క ప్రవర్తనను తెలుసుకొంటూ ప్రతి క్షణము జరుగుతున్న ప్రతి విషయం గ్రహిస్తున్నాడో అట్టి పరమాత్మ నుండే ఈ సృష్టికర్త యైన బ్రహ్మ, నామరూపాత్మకమైన సమస్త విశ్వం, అన్నారు ఆహారాలు అన్నీ ఉద్భవించాయి.

2. రెండవ ఖండం లో యజ్ఞ యాగాలతో కూడిన కర్మ మార్గం, దాని ఫలాలు, జ్ఞాన మార్గం శ్రేష్ఠత మరియు జ్ఞాన మార్గం వివరాలు చెప్పబడ్డాయి.

మహా విద్వాంసులగు వసిష్ఠాదులు ఋగ్వేదాది మంత్రాలలో దర్శించిన యజ్ఞ కర్మలన్నీ సత్యాలే.

సమిధలతో జ్వలింపజేయబడిన అగ్ని లో ఎప్పుడు మంటలు ప్రజ్వలిస్తాయో అప్పుడు ఆజ్యభాగముల మధ్య లో ఆహుతులను హోమం చేసే విధానాన్ని ” ప్రతిపాదయే చ్ఛ్రద్ధయా హుతమ్” శ్రద్ధతో హోమం చేయడం అంటారు.

కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, కాంతివంతమైన విశ్వరుచి అనే అగ్ని యొక్క సప్త జిహ్వలు హవిస్సులను ఆహుతులను స్వీకరిస్తాయి.

ఏ యజమాని ప్రకాశిస్తున్నటు వంటి అగ్ని జ్వాలల లో సకాలములో హోమం చేస్తాడో అతని ఆహుతులు గ్రహించ బడినవై సూర్యరశ్మి రూపము లతో స్వర్గము నందు దేవేంద్రుడు నివసించు స్థానమునకు చేర్చును.

ఇదియే నీ పుణ్య కర్మ వల్లప్రాప్తమైన బ్రహ్మ లోకం అంటూ ఆ యజమానిని స్తోత్రం చేసి ఈ ఆహుతులు ఇటురండి ఇటురండి అని ఆ యజమానిని సూర్యరశ్మి ద్వారా ఆ లోకములకు తీసుకొని పోతున్నాయి.

అట్టి యజ్ఞ రూపమైన ఈ నావ దృఢమైనది కాదు. నమ్మదగినది కాదు. మూఢులు దీనినే పరమాధారముగా నమ్మి మరల మరల ఈ జనన మరణ రూప సంసార సాగరం లో పడి పోతున్నారు.

ఏ విద్వాంసులు బిక్షాటనను చేయుచున్న వారై తపస్సంపన్నులై అరణ్యముల యందు నివశిస్తున్నారో అట్టి వానప్రస్థులు, సన్యాసులు, శాంత చిత్తులు పుణ్యపాప విముక్తులై సూర్యుని ద్వారా అమృతుడు అవ్యయుడు అయిన హిరణ్యగర్భుని లోకమునకు చేరుతున్నారు.

కర్మల చే మోక్షము లభించదని గ్రహించిన వ్యక్తి వైరాగ్యమును పొంది బ్రహ్మము నెరుంగుటకై బ్రహ్మ నిష్ఠుడగు గురువును ఆశ్రయించాలి.

3. రెండవ ముండకం, ఒకటో ఖండం లో విశ్వ సృష్టి కి మూలకారణమైన అక్షరాన్ని అవగాహన చేసుకొన్న వ్యక్తి యొక్క సంశయాలన్నీ పటాపంచలవుతాయనే సందేశం ఉంది.

ఓ శౌనకా। ఓం తదేతత్సత్యం- ఈ పరవిద్యకు సంబంధించినదే పరమార్ధిక సత్యం.

భగభగ ప్రజ్వలిస్తూ మండుతు న్నటువంటి అగ్ని నుండి ఆ అగ్ని తో సమాన రూపములు గల వేలకొలది నిప్పు రవ్వలు ఏ రీతిగా పుడుతున్నా యో అదే విధం గా అక్షరము నుండి అనేక విధాలైన జీవులు జన్మిస్తున్నారు. ఆ అక్షర పరబ్రహ్మం నందే లీనమైపోతున్నారు.

ఆ అక్షర పరబ్రహ్మం జన్మలేనిదై, బాహ్యాభ్యంతరా లలో నిండినదై సమస్త రూప రహితమై పరిపూర్ణమై ప్రకాశిస్తోంది. అందుచేత ప్రాణం, మనస్సు లేనిదై సర్వ వికారముల కంటే భిన్నమై నామరూపముల కంటే విలక్షణమై, ఉపాధి లేనిదై పరిపూర్ణం గా ప్రకాశిస్తోంది.

పురుషుడే ఈ విశ్వం. అంటే ఈ విశ్వమంతా పురుషుని శక్తి లోంచే పుట్టింది. కర్మ, తపస్సు, బ్రహ్మత్వం, అమృతత్వం వీటన్నిటి లోనూ అతడే. అతని ద్వారానే గూఢమైన ఈ జ్ఞానాన్ని పొందితే అజ్ఞాన గ్రంధిని ఛేదించి ముక్తుడౌతాడు.

4. రెండవ ముండకం, రెండవ ఖండం లో బ్రహ్మ స్వరూపం, బ్రహ్మ ప్రాప్తి కి మార్గమైన ప్రణవం వివరాలు చెబుతూ ఏకాగ్రతతో, ఉపనిషత్ జ్ఞానంద్వారా బ్రహ్మను ఉపాశిస్తూ బ్రహ్మ తాదాత్మ్యాన్ని పొందాలని బోధించబడింది.

ఓం అవిః సన్నిహితం గురుచరన్నామ… మన హృదయం లో సంచరించే మహాశక్తియే అన్ని ప్రాణులకు ఆధారం. ప్రజలలో దీన్ని తెలుసుకున్న వాడు సత్తు అసత్తుల కన్న శ్రేష్ఠుడైన పరమాత్మను తెలుసుకుంటాడు.

అది అన్నింటికీ వెలుగో, అణువు కన్న అణువో, అన్ని లోకాల ప్రజలు దేనితో జీవిస్తారో అదే అక్షర బ్రహ్మ. అదే ప్రాణం, వాక్కు, మనస్సు. దీని సాక్షాత్కారమే సత్యం. అదే అమృతం.

ఉపనిషత్తనే వింటిని పట్టుకొని ఉపాసన అనే చూపైన బాణం సంధించి, సంచరించే ఆ భగవంతుని చైతన్యం పై గురి పెట్టి ఆ అక్షరాన్ని తెలుసుకో.

ప్రణవోధనుః…. ప్రణవమే విల్లు. మనస్సే బాణం. బ్రహ్మమే లక్ష్యం.(జీవాత్మ ఉండే బ్రహ్మ రంధ్రం). వింటినుండి వదలబడిన బాణం లా ఒకే లక్ష్యాన్ని ఉంచుకొని ప్రణవం తో తన్మయత్వం కావాలి.

దేవ లోకం, అంతరిక్షం, పృధివి, ఇవి అన్నీ ఎవరినుంచి పుడతాయో, మనః ప్రాణాల కలయిక ఎవరిలో ఉంటుందో ఆ విశ్వాత్మను తెలుసు కోవాలి. ఇదే అమృతత్వానికి సేతువు. మిగిలిన విషయాలన్నీ వదిలి వేయాలి.

రధచక్రం మధ్యలో అన్ని ఆకులు ఎలా చేరుతాయో అలాగే ఈ దేహం లోని నాడులన్నీ చేరే స్థానాన్ని ప్రాణశక్తి సంచరించే స్థానంగా చెబుతారు. ప్రణవం తో ఏకాగ్ర చిత్తాన్ని పొందాలి. అప్పుడు అనంత జ్ఞానప్రాప్తి జరిగి అంధకారం నుంచి బయట పడతావు.

యః సర్వజ్ఞః సర్వ విద్యస్యేష మహిమా భువి… అపుడతడు సర్వజ్ఞుడౌతాడు. సర్వ విద్యలను గ్రహించి ఈ భూమిలో మహిమాన్వితుడనిపించు కుంటాడు. ఆ ఆత్మ దివ్యమైన బ్రహ్మపురి లో (బ్రహ్మ రంధ్రం) ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఆ ప్రాణం ద్వారా ఆత్మను తెలుసుకొని ఆనందమే తమ సహజత్వం గా పొందిన వారై అమృతులై సర్వత్ర విరాజిల్లుతుంటారు.

ఆ పరాత్పరుడైన దేవుని దర్శనమైతే అతని హృదయ గ్రంధులు ఛేదింప బడి సర్వ సంశయాలు నాశమై కర్మ నాశనమౌతుంది.

5. మూడో ముండకం ఒకటో ఖండం లో సంసారపు సహజత్వం ఎలాంటిది? జీవుడు-శివుడు వీళ్ళ సంబంధం ఏమిటి? బ్రహ్మ జ్ఞాని ఎవరు? బ్రహ్మ జ్ఞానుల్లోశ్రేష్ఠులెవరు? ఆ స్థితి ని పొందేమార్గమేది? ఆ స్థితిని పొందే మార్గమేమిటి? ఆస్థితి ని పొందిన వాడి సామర్థ్యం ఎలాంటిది? మొదలైన విషయాల వివరణ ఉంది.

ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం…

ఎంతో అన్యోన్యం గా మెలిగే రెండు పక్షులు ఒకే చెట్టు కొమ్మ మీద కూర్చొన్నాయి. అందులో ఒక పక్షి రుచి గల ఆ చెట్టు ఫలాన్ని తింటూంది. రెండవ పక్షి కేవలం నిర్లిప్తం గా చూస్తూంది.

ఇందులో ఒక పక్షి జీవాత్మ. మరొకటి పరమాత్మ. ఇక్కడ శరీరాన్ని చెట్టు తో పోల్చారు. ఒక పక్షి పండు తింటోంది అంటే జీవాత్మ తన కర్మ ఫలాన్ని అనుభవిస్తూంది అని అర్ధం. మరొక పక్షి. నిర్లిప్తం గా చూస్తోంది అంటే పరమాత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవని అర్ధం.

బంగారు రంగు కలిగిన సర్వానికి కర్త అయిన పరమాత్మను, నాశరహితమైన ప్రాణశక్తికి మూలకారణమైన పురుషుణ్ణి చూచిన విద్యావంతుడు పాప పుణ్యాలనుండి విముక్తుడై, నిర్లిప్తుడై పరమ సామ్య స్థితిని పొందుతాడు.

ఆత్మ రతః ఆత్మక్రీడః క్రియావానేష బ్రహ్మవిదాం వరిష్ఠః….
ఆత్మ యొక్క సహజ స్థితి అయిన ఆనందాను భవాన్ని పొందుతూ, తనలో తాను క్రీడిస్తూ ( జ్ఞాన వికాసాన్ని పొందుతూ) లోక కల్యాణం కోసం కర్మలను చేసే వ్యక్తి బ్రహ్మ జ్ఞానుల్లో వరిష్ఠుడు. అతనేనయోగి అనిపించుకుంటాడు.

ఆ పరమపురుషుని (దేవుని) రూపం చాలా పెద్దది. మన ఊహలకందనిది.సర్వ లోకాలకు అవతల చాలా దూరంలో ఉండేది. అయినా చాలా దగ్గర లోనే ఉంది. ఎందుకంటే అంతర్ముఖ స్థితి లో అది మన లోనే ఉన్నట్లు కన్పిస్తుంది.

ఆత్మ కనులకు కనుపించేది కాదు.మాటల ద్వారా గ్రహించ లేం. కర్మలతో కాని, కేవలం ఇచ్ఛాశక్తి తో కాని, ఇతర దేవతల సాయం తో కాని లభించదు. జ్ఞానాన్ని పొంది శుద్ధుడైన వ్యక్తికి ధ్యాన స్థితి లో కళాతీతుడైన ఆత్మ కనిపిస్తుంది.

6. మూడో ముండకం రెండో ఖండం లో ఆత్మ జ్ఞానం ఎవరికి లభిస్తుంది? ఎలాంటి వారికి దొరకదు? బ్రహ్మ జ్ఞానాన్ని ఎలాంటి వారికి ఉపదేశించాలి? అనే విషయాలు వివరింప బడ్డాయి.

నాయమాత్మా ప్రవచనేన లభ్యో
నమేధయా న బహునా శ్రుతేన
(కఠోపనిషత్తులోఈ మంత్రం చదివేము)

ఈ ఆత్మను ప్రవచనం ద్వారా, మేధస్సు ద్వారా, పాండిత్యం ద్వారా పొందలేము. ఆత్మ ఎవరినైతే వరిస్తుందో అతనికి మాత్రమే లభ్యమౌతుంది. అలాంటి వ్యక్తికి మాత్రమే ఆత్మ తన వివరాల న్నిటినీ అందిస్తుంది.

జ్ఞాన ప్రాప్తి అయిన ఋషులు, తృప్తులు, మోహ రహితులు ప్రశాంతులై సర్వవ్యాపకమగు పరబ్రహ్మమును అన్ని చోట్ల అనుభవిస్తూ యోగ్యులై అందరి కళ్యాణం కోసం శ్రమిస్తారు.

భగవత్కృప లేకుంటే జ్ఞాన ప్రాప్తి అసాధ్యము. బ్రహ్మజ్ఞానులు అమృతత్వాన్ని పొందుతారు. వాళ్ళకు పునర్జన్మ లేదు. అంటూ ముండకో పనిషత్తు ముగుస్తుంది.

వచ్చే భాగం లో ఐతరేయోపనిషత్తు మననం చేసుకొందాం.

93G. ఉపనిషత్తులు – విహంగ వీక్షణం

7. ఐతరేయోపనిషత్తు:

ఐతరేయోపనిషత్తు ‘వాజ్ఞ్మే మనసు ప్రతిష్ఠితా మనో మేవాచి ప్రతిష్ఠిత… అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది.

ఋగ్వేదాంతర్గత ఐతరేయ ఆరణ్యకం లోని నాలుగు ఐదు ఆరు అధ్యాయాల లోనిదే ఈ ఉపనిషత్తు. ఈ ఆరణ్యకం లోని కర్మకాండ కు సంబంధించిన భాగాన్ని వదలిపెట్టి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన భాగం మీద మాత్రమే ఆది శంకరులు భాష్యం రాశారు. అదే ఐతరేయోపనిషత్తు గా పేరు పొందింది.

ఈ శరీరం మోక్షమార్గంలో సాగడానికి కావలసిన అన్ని హంగులతోటి రూపు దిద్దుకుంది అని విశదపరచిందీ ఉపనిషత్తు.

ఈ ఉపనిషత్తుకు ద్రష్ట మహీపాల ఐతరేయుడు. ఐతరేయుని తండ్రి బ్రాహ్మణుడు. తల్లి ఇతర అంటే ఇతర కులానికి చెందిందని అంటారు. తండ్రి యజ్ఞం చేస్తున్నప్పుడు ఐదేళ్ళ మహీపాలుడు తండ్రి ఒడి లో కూర్చోబోతే అతని మిగిలిన భార్యలు అడ్డుకున్నారట. కారణం అతని తల్లి బ్రాహ్మణ కులానికి చెందింది కాకపోవడం. అప్పుడా తల్లి ఇతర బాధపడి తన ఇష్ట దేవత భూదేవిని ప్రార్ధించింది. ఆమె ప్రత్యక్షమై మహీపాలుణ్ణి బ్రహ్మజ్ఞానిని చేసి ఆశీర్వదించింది.

ఇతరకు పుట్టినవాడు కనుక ఐతరేయుడయ్యాడు. అతని పేరుమీదే ఈ ఆరణ్యకం ఐతరేయ ఆరణ్యకం అయ్యింది. దీనిలో 33 మంత్రాలు ఉన్నాయి. మూడు అధ్యాయాలుగా విభజింప బడింది.

ఓం ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్। నాన్యత్ కించన మిషత్। స ఈక్షత లోకాన్ను సృజా ఇతి

మొదట ఆత్మ ఒక్కటే ఉంది. తన సంకల్పం తో నాలుగు లోకాల్ని సృష్టించింది. అవి అంభోలోకం (ప్రాణం); మరీచిలోకము (విద్యుత్తు, ద్యులోకం); మరలోకము (పృథ్వి); జలలోకం.

లోకపాలకులను సృష్టించేందుకు జలముల మధ్య లోనుండి విరాట్ పురుషుణ్ణి సృష్టించింది.

ఆ విరాట్ పురుషుని దేహం లో ఇంద్రియాలు, తద్వారా తదభిమాన దేవతలూ ఉత్పన్న మయ్యాయి. ఆత్మ యొక్క తపస్సుతో ఆ విరాట్ పురుషునికి నోరు, నోటినుండి వాగీంద్రియం, వాక్కునుండి అగ్ని; నాసికారంధ్రాలు, వాటినుండి ప్రాణము, వాటి అభిమాన దేవత అయిన వాయువు; తర్వాత కళ్ళు, కళ్ళనుండి చక్షురింద్రియం, తదభిమాన దేవత ఆదిత్యుడు; చెవులు, శ్రోత్రేంద్రియం, వాటి అభిమాన దేవతలు దిక్పాలకులు; చర్మము, చర్మమునుండి వెంట్రుకలు, ఓషధులు, వనస్పతులు; హృదయం, మనస్సు, చంద్రుడు, నాభి, అపానం, మృత్యువు, జననేంద్రియం, రేతస్సు, నీరు పుట్టాయి.

తా ఏతా దేవతాః సృష్టా అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతం స్త మ శనాయా పిపాసాభ్యా మన్వవార్జత్

ఈ దేవతలందరకీ ఆకలి దప్పులను సృష్టించేడా పరమాత్మ. తమ ఆకలిదప్పులను తీర్చుకోడానికి తగిన శరీరాన్నిమ్మని ప్రార్ధించేయి. అప్పుడు ముందుగా వృషభాన్ని, తర్వాత అశ్వాన్ని ఇస్తే దేవతలు తిరస్కరించేరు. అప్పుడా విరాట్ పురుషుడి ని చూపగా దానికి ఒప్పుకొని అందరూ ఆ పురుషుడి లో తమ తమ స్థానాలలో చేరిపోయారు.

అన్నం ఉత్పత్తి కోసం ఆత్మ తపించగా నీటినుంచి అన్నం ఉత్పన్నమైంది. ఘనీభవించిన జలం పృథ్వి కావడం వల్ల జలం పృథ్వీసారం. ఆ జలం యొక్క సూక్ష్మ సారమే అన్నం.
దేహానికి అవసరమైన ఈ స్థూలాహారాన్ని గ్రహించేందుకు, జఠరాశయానికి పంపించేందుకు అపాన వాయు క్రియ చాలా అవసరం. కేవలం ప్రాణం, మనస్సు, మిగిలిన ఇంద్రియాల ద్వారా సాధ్యం కాదని గ్రహించి వాయువు ద్వారా మాత్రమే అన్నగ్రహణం సాధ్యం కావడం వల్ల వాయువే అన్నం లేదా ‘వాయువే ఆయువు’ అన్నారు.

తాను లేకుండా మిగిలిన ఇంద్రియాలు తదభిమాన దేవతలు ఉన్నా నిష్ప్రయోజనం అని తలచి ఆత్మ బ్రహ్మ రంధ్రం ద్వారా దేహం లోకి ప్రవేశించింది. అదే విదృతి. అదే అనంద స్థానం. ఆత్మ ఇదంద్ర (ఇంద్రుడు) అని పిలుస్తారు. ఇతని కార్య క్షేత్రాలు మూడు స్థితులు. జాగ్రద్ స్వప్న సుషుప్తులు. హృదయం, కంఠం, బ్రహ్మరంధ్రాలు.

ద్వితీయాధ్యాయం లో:

ఓం పురుషే హ వా అయమాదితో గర్భో భవతి।

యదార్థం గా పురుషునిలోనే మొట్టమొదట గర్భం కలుగుతోంది. పురుషుడు శుక్ర రూపమైన ఆత్మను అంతరమున ధరిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వీర్య రూపం లో ఉన్న ఆత్మ పురుషుని శరీరం లో నుండి స్త్రీ దేహాన్ని చేరుతోందో అదే ప్రధమ జన్మ.

తత్ స్త్రియా ఆత్మభూయం గచ్ఛతి, యథా। స్వ మంగం తథా।

ఆ స్త్రీకి తన అవయవములు తన శరీర భాగముగా ఉన్నట్లు ఆ వీర్యము కూడా ఒక భాగమై స్త్రీ తో తాదాత్మ్యమును పొందుతోంది. స్త్రీ శరీరం లో ఆ పిండం ధరింపబడి పోషింప బడడం రెండో జన్మ.

పుట్టి పెరిగి వార్ధక్యంతో దేహత్యాగం జరిగి పునర్జన్మ పొందడం మూడో జన్మ.

గర్భం లో ఉండగానే వామదేవ ఋషి తాను దేవతల జన్మలన్నిటినీ గురించి తెలుసు కున్నానని, ఆ విధంగా జ్ఞానాన్ని పొందిన వ్యక్తి స్వర్గ లోకం లో తన కోరికలను సంతృప్తి గావించుకొని అమృతుడౌతాడని చెప్పబడింది.

తృతీయాధ్యాయం లో:

ఆత్మ గురించిన ప్రశ్న తో మొదలవుతుంది.
ఆత్మ యని మనం ఎవరిని ఉపాసిస్తున్నామో ఆ ఆత్మ ఎలాంటిది? ఎవరినుండి పుట్టింది? ఇంద్రియాలు, తన్మాత్రలు, వృత్తులు, తదభిమాన దేవతలు, భూతాలు యొక్క సాయంతో తాను ఉండి దేహం లో అన్ని క్రియలు చేస్తున్నాడో ఆ ఆత్మను ఎలా ఉపాసించాలి? ఆత్మ ఎవరు?

ఈ హృదయం, మనస్సు, ప్రాణశక్తి, అజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, బుద్ధి, దృష్టి, మతి, ఇచ్ఛ, సంకల్పం మొదలైన వన్నీ ప్రజ్ఞానమే.

సర్వం తత్ ప్రజ్ఞా నేత్రం ప్రజ్ఞానే ప్రతిష్టితత్. ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞాప్రతిష్టాః పరిజ్ఞానం బ్రహ్మ..

బ్రహ్మ (ప్రాణం), ఇంద్రుడు, ప్రజాపతి, దేవతలు, భూతాలు, జ్యోతులు, వస్తువులు, ధాన్యాలు, ప్రాణులు, పక్షులు, జంగమ స్థావరాలు మొదలైన వాటి వ్యాప్తి ప్రజ్ఞానం ద్వారా జరుగుతాయి. ప్రజ్ఞకు సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకొనేది ప్రజ్ఞాన నేత్రమే. ఇవన్నీ ప్రజ్ఞానం లోనే ప్రతిష్టితమై ఉన్నాయి. విశ్వం పుట్టేది అక్కడినుండే.

స్థావర జంగమాత్మకమగు ఈ ప్రపంచమంతా బ్రహ్మమే. అందువల్ల ప్రజ్ఞానమే బ్రహ్మ.

ఇలా తెలుసుకున్న వ్యక్తి ఈ లోకం నుండి విముక్తుడై స్వర్గం లో కోరికలను తృప్తి పరచుకొని అమృతత్వాన్ని అనుభవిస్తాడు అంటూ ఐతరేయోపనిషత్తు ముగుస్తుంది.

వచ్చే భాగం లో తైత్తిరీయోపనిషత్తు మననం చేద్దాం.

93H. ఉపనిషత్తులు – విహంగ వీక్షణం

8. తైత్తిరీయోపనిషత్తు:

ఈ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తు. ఓం శం న్నో మిత్రః శం వరుణః….అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది.

వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు వైశంపాయనుడు. అతని శిష్యుడు యాజ్ఞ్యవల్క్యుడు. ఒకసారి వైశంపాయనుడికి కోపం వచ్చి తన మేనల్లుడిని కాలితో తన్నాడు. బ్రాహ్మణుణ్ణి తన్నడం వల్ల బ్రహ్మహత్యా పాపం వచ్చిందని శిష్యులను నివారణోపాయం చెప్పమన్నాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు ‘ ఇదేమంత పని, నేనొక్కడినే మీ పాపాన్ని బాపుతాను’ అన్నాడు. అతని అహంకారానికి కోపించి వైశంపాయనుడు తన దగ్గర నేర్చుకొన్న యజుర్వేదాన్ని తిరిగి ఇచ్చేయమన్నాడు. అప్పుడు తాను నేర్చుకున్న యజుర్వేదాన్ని యాజ్ఞ్యవల్క్యుడు కక్కి వేయగా దానిని తిత్తిరి మహర్షి శిష్యులు తిత్తిరి పక్షుల రూపం లో తిని పలుకగా ఏర్పడినదే తైత్తిరీయ శాఖ.

యాజ్ఞ్యవల్క్యుడు ఎంతో ఉత్తముడైన విద్యార్ధి. సూక్ష్మ గ్రాహి. ఏకసంథా గ్రాహి. అప్పటికే ఈయన బాష్కలుని వద్ద ఋగ్వేదం, జైమిని వద్ద సామవేదం, ఉద్దాలకుని వద్ద అధర్వణ వేదం నేర్చుకుని, వైశంపాయనుడి దగ్గర యజుర్వేదం నేర్చుకోవడానికి వచ్చేడు. అటువంటి వాడు కించిత్ విద్యాగర్వం వల్ల తను నేర్చుకున్న యజుర్వేదమంతా గురువు దగ్గర వదిలేసి రిక్త హస్తాలతో తన ఇంటికి పోవలసిన పరిస్థితి ఏర్పడింది. పూర్వం గురుకులాలలో క్రమశిక్షణా రాహిత్యాన్ని చాలా తీవ్రంగా పరిగణించి దండించేవారని దీనినుంచి అర్ధం అవుతోంది.

ఈ ఉపనిషత్తు మూడు భాగాలుగా విభజింప బడింది. శీక్షా వల్లి, ఆనందవల్లి లేదా బ్రహ్మా నంద వల్లి, భృగువల్లి అని.

ఈ ఉపనిషత్తులో ప్రతి అధ్యాయానికి ఒక శాంతి మంత్రం ఉంటుంది

శీక్షావల్లి:
మొదటి అధ్యాయం పేరు శీక్షా వల్లి అని దానిలో విద్యార్ధి ఉండవలసిన పద్ధతి, నమ్రత తోను శ్రద్ధ తోను విద్య నవలంబించ వలసిన విధానం మొదలైన విషయాలను నొక్కి చెబుతూ గురువు నాకు యోగ్యులైన విద్యార్ధులు కావాలి అని ఆ పరాత్పరుణ్ణి ప్రార్ధించడం ఉంది

ఈ శిక్షావల్లిలో, నేర్చుకొనే చదువు ఎంత గొప్పదో, నేర్పించే గురువు అంతకంటే ఎంత ఘనుడో అనే విషయం వివరింపబడింది. నేర్చుకొన్న విద్య శోభించాలంటే విద్యార్ధికి వినయం, శ్రద్ధ, గురు భక్తి ఎంత ముఖ్యమో తెలుపబడ్డాయి.

ప్రత్యేకంగా, విద్యాభ్యాసం ముగించుకొని తిరిగి వెళ్ళి పోతున్న విద్యార్ధులకు సమాజం లో మెలగవలసిన విధానం, పెద్దలను గౌరవించే విధానం, గృహస్తు ధర్మాలు, సమాజ సేవ మొదలైనవి విపులీకరింప బడ్డాయి.

భూః అంటే భూమి. మనం జీవించే లోకం. భువః అంటే పితృలోకం. మరణించిన మన పూర్వులు నివసించే లోకం. సువః అంటే స్వర్గలోకం. దేవతలు నివసించే లోకం. ఇవి ఒకదానికన్న మరొకటి సూక్ష్మమైనవి. ఇవి వివిధ చైతన్య స్తితులలో ఉన్న లోకాలు.

ఈ మూడు చైతన్య స్తితులతో బాటు మహః అనే నాల్గవ స్తితిని మహా చమస్య ఋషి గుర్తించాడు.

ఆ ఋషి అభిప్రాయం ప్రకారం మహః అనే నాల్గవ చైతన్య స్తితి, పై మూడు స్ధితులను తనలో ఇముడ్చుకో గలిగినది.

ఈ నాలుగు రకాల కలయికలను చింతన చేస్తూ పదహారు16 రకాల భావనలను తెలుసుకొన్న వ్యక్తి ఆ భగవంతుని తెలుసుకొన్న వాడవుతాడు. సకల దేవతలు అతనికి ఎన్నో కానుకలను సమర్పిస్తారు.

ఆకాశాన్ని శరీరంగా, సత్యాన్ని ఆత్మగా, ఆనందాన్ని మనసుగా చేసుకొని, శాంతితో అమృతుడైన, పరిపూర్ణమైన బ్రహ్మగా మారాలంటే చక్కగా ఓంకారాను ష్టానంతో ధ్యానం చేయాలి. ఇలా ఓంకారాన్ని జపిస్తూ పరబ్రహ్మను పొందాలని గ్రహించి ఆ పరబ్రహ్మ నే పొందుతున్నారు.

స్నాతకోపన్యాసంలో గురువు శిష్యునితో

నాయనా। నువ్వు సత్య సంధతతో జీవించు. ధర్మాన్ని అనుష్ఠించు. నేర్చుకొన్న విద్యను నిర్లక్ష్యం చేయకుండా మననంచేసుకొంటూ శిష్యులకు విద్యాదానం చేయి. ఆచార్యుడికి ఇష్ట మైన గురు దక్షిణ నివ్వు. వివాహం చేసుకొని పిల్లలను కని వంశం విచ్ఛిన్నం కాకుండా కొనసాగించు. సత్యాన్ని ధర్మాన్ని వీడకు. మంగళకరమైన కర్మలను తప్పకుండా ఆచరించు. దేవతలకు, పితృదేవతలకు చేయవలసిన కార్యాలను అప్రమత్తతతో నిర్వహించు.

తల్లిని, తండ్రిని, గురువును, అతిధిని దైవాలుగా భావించు. దానం చేసే విషయంలోను, శ్రద్ధతో తమ శక్తి మేరకు వినయంగా మనస్పూర్తిగా ఇవ్వాలనే వివరణ ఇచ్చారు.

ఆనందవల్లి:
ఆనందవల్లి “బ్రహ్మ విద్యాప్నోతి పరమ్” అనే ఋగ్వేద మంత్రంతో మొదలవుతుంది. ఎవరైతే సత్యం జ్ఞానం అనంతం అని బ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలను తెలుసుకొంటాడో అతను బ్రహ్మ జ్ఞాని అవుతాడు.

ఈ బ్రహ్మానందవల్లిలో బ్రహ్మము శుద్ధ చైతన్య స్వరూపుడు అంటూ బ్రహ్మము యొక్క లక్షణాలు, బ్రహ్మము యొక్క అస్థిత్వం, బ్రహ్మం నుండే విశ్వం ఆవిర్భవించిందని వివరించబడ్డాయి.

పంచకోశ వివరణ తో పాటు ఆత్మానంద స్ధితిని పొందే వివరణ ఉంది. ఆనందంలోని స్ధాయీ భేదాలు వాటి వివరాలు నిర్వచింపబడ్డాయి. అనేక రకాల దేవతల వివరాలు చెప్పబడ్డాయి.

చివరగా “యతోవాచా నివర్తన్తే అప్రాప్య మనసా సహ…”. అంటూ ఆత్మ జ్ఞానం తెలుసుకొనే విధానాన్ని చెబుతూంది.

ఆనందవల్లి బ్రహ్మం తో తాదాత్మ్యం చెందడమే బ్రహ్మానందమని అదే జీవిత పరమార్థమని వివరించింది. ఆత్మను కప్పుతూ ఉన్న పంచకోశాల స్వభావ స్వరూపాలను చెప్పింది. ఇంతవరకూ తత్వబోధ చేసి, భృగువల్లి లో ఆత్మ సాక్షాత్కారానికి మార్గాన్ని నిర్దేశించి చూపుతోంది.

భృగువల్లి:
వరుణ మహర్షి యొక్క పుత్రుడు భృగువు. ఒక రోజు తన తండ్రిని సమీపించి తనకు బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు. అతనితో భృగువు ఇలా చెప్పేడు. అన్నం, ప్రాణం, చక్షువు, శ్రోత్రం, మనస్సు మరియు వాక్కు- ఇవే పరమాత్మ అంటే.

బ్రహ్మ తత్వాన్ని తెలుసు కోవాలంటే మనస్సు బ్రహ్మలో లీనం కావాలి. మనస్సు యొక్క ఏకాగ్రతకు ప్రాణమే ఆధారం.

దేని వల్ల ఈ జీవాల ఉత్పత్తి జరిగిందో, దేని ఆధారంతో ఇవి అన్నీ జీవిస్తున్నాయో, మరణానంతరం దేనిలో ఇవన్నీ లయమౌతాయో దానిని తెలుసుకోవాలి. ఆయనే బ్రహ్మ. ఆయనను తెలుసుకోవడానికి తపస్సు చేసి తెలుసుకో. తపస్సే బ్రహ్మం. తపస్సుతోనే బ్రహ్మజ్ఞానం లభ్యమౌతుంది.

తండ్రి ఉపదేశాన్ని విన్న తరువాత భృగువు అపరోక్ష జ్ఞానం తపస్సు ద్వారానే లభిస్తుందని తపస్సు చేశాడు.

అప్పుడు ఆ అంతర్ముఖ స్థితిలో విశ్వం యొక్క విజ్ఞానం తెలుస్తుంది. ఆ విజ్ఞానంతో మాత్రమే ఇచ్ఛామరణుడయ్యేందుకు, దేహత్యాగం చేసి ఆ బ్రహ్మ లో లీనమవడానికి సాధ్యమౌతుంది.

అందువల్ల విజ్ఞానమే బ్రహ్మమని భృగువు నిశ్చయించాడు.

తపస్సు ద్వారా ఆనందమే పరమాత్మ. ఎందుకంటే ఆనందం వల్లే సకల జీవకోటి ఆవిర్భవించి జీవిస్తోంది. తిరిగి ఆ జీవకోటి అంతా మరణానంతరం ఆనందంలోనే లయమయి పోతోంది అని తెలుసుకున్నాడు.

అతనికి తనలో ఆనందానుభవం కలిగి సదానంద, అఖండానందుడయిన బ్రహ్మ దేవుని దర్శనం అయింది.

ఆ ఆనందం వల్లనే అతనిలోని చైతన్యం స్పందించి, దాంట్లోంచి పుట్టిన శక్తే బయటకు వెలువడి, ఆకాశం లో స్పందించాక, దానివల్ల సర్వ భూత ధాతువుల ఉత్పత్తి అయింది.

ఆ భూత ధాతువుల కలయిక వల్ల ఈ లోకాలు
వస్తువులు రూపొందాయనే జ్ఞానం కలిగింది.

వరుణుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని బోధించాడు.

రయి జీవియొక్క శరీరాన్ని శక్తివంతం చేసేది అన్నం. ప్రాణం మన శరీరం లో నిక్షిప్తంగా ఉండి నడిపిస్తోంది. ప్రాణం వినా శరీరం మన లేదు. అందువల్ల ఈ శరీరానికి అన్నం ప్రాణమే.

అలాగే శరీరం ప్రాణానికి ఆధార భూతం కనుక, ప్రాణం శరీరం లేకుండా ఉండలేదు. కనుక ప్రాణానికి శరీరమే అన్నం.

– ఆహారాన్ని ఉపేక్షించ కూడదు. దేహాన్ని పోషించేది ఆహారమే. అలా అని మిత పరిమాణంలోతీసుకోవాలి. సాత్వికాహారం వారి వారి శరీర తత్వాలకు అనుగుణంగా తీసుకోవాలి.

అన్నం బహు కుర్వీత। తద్వ్రతమ్ । – ప్రాణానికి సూక్ష్మ రూపంలో అశనాన్ని, స్థూలాహారం స్థూల శరీరానికి ఎక్కువగా ఉత్పత్తి చేయ వలసిన అవసరం ఉంది.

సూక్ష్మ కర్మ -శాస్త్ర విహితమైన ప్రాణాయామాది అనుష్ఠానం త్రికాల సంధ్యల లోను చేసి అశనోత్పత్తిని చేసి ప్రాణాన్ని పటిష్ఠ పరచడం.

స్థూల కర్మలు -స్థూల కర్మలలో వ్యవసాయం ఉత్తమమైనదిగా వేదాలు చెబుతున్నాయి.
ప్రతి ఒక్కరు కాయకష్టం చేసి భూమిని దున్ని విస్తారంగా ఆహార ధాన్యాలు పండించాలి.

ఎవరైనా అతిధిని కాని, బాటసారిని కాని ఆశ్రయం ఆశించి వచ్చిన వారిని తృణీకరించి తిప్పి పంప కూడదు. ఆదరించి వారిని తృప్తి పరచడం మీ కర్తవ్యం.

ఎవరు ఎప్పుడు వచ్చినా వాళ్ళకు ఆహారం సిద్ధం గా ఉంది అని చెప్పగలగాలి. అంటూ ఆహారాన్ని శ్రద్ధగా చక్కని పద్ధతిలో తయారుచేసి పెట్టే వాళ్ళకు ఆహారం అదే రీతిలో దొరుకుతుంది.

ఆహారాన్ని మధ్య రకంగా సామాన్యంగా తయారు చేసి పెట్టే వ్యక్తికి సంపద మధ్యరకం గానే లభిస్తుంది.

మరీ సాధారణ రీతిలో ఆహారాన్ని తయారుచేసి అతిధి మర్యాదలు చేసే వారికి అదేరీతిలోనే సంప్రాప్తిస్తాయి సంపదలు.

పై విధంగా ఆహార సంపద యొక్క ప్రాధాన్యతని, అన్నదాన ఫలితాన్ని తెలుసుకుని అతిధి మర్యాదలు చేసే గృహస్తు దాని నిజ ఫలితాలను పొందుతాడు.

బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వ్యక్తి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే సామగాన రూపం లో వెలువడతాయి

అహం బ్రహ్మాస్మి అనే స్థితిని చేరుకున్న వ్యక్తి సమస్త వేళలలోను బ్రహ్మత్వం లోనే ఉంటాడు. ఆ సమత్వ స్థితే అతని లో సామగానాన్ని పలికిస్తుంది. ఆ ఆనందానుభవం తో ఈ ఉపనిషత్తు సమాప్తమౌతుంది.

వచ్చే భాగంలో చాందోగ్యోపనిషత్తు మొదలు పెడదాము.

94. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

సామవేదం లో చివరి ఎనిమిది అధ్యాయాలలో చెప్పబడిన చాందోగ్యోపనిషత్తు బృహదారణ్య కోపనిషత్తు తర్వాత అతి పెద్ద ఉపనిషత్తు.

చాందోగ్యోపనిషత్తు లోకి వెళ్ళే ముందు;

ఈ ఉపనిషత్తు ” ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణః చక్షుః…”. అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది. సామవేదాంతర్గతమైన ఉపనిషత్తులు కేనోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు ఇదే మంత్రం తో మొదలవుతాయి.

ఓం ఆప్యాయంతు మమాంగాని, వాక్ ప్రాణశ్చక్షుః
శ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి।
సర్వం బ్రహ్మౌపనిషదం మాహంబ్రహ్మ నిరాకుర్యాం
మా మా బ్రహ్మ నిరాకరోదనిరాకరణమ స్త్వ నిరాకరణం మేస్తు.
తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే।
మయి సంతు తే మయి సంతు।।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।

ఈ శాంతిమంత్రం అర్ధం ఎన్ని సార్లు చదివినా నిత్య నూతనంగానే ఉంటుంది. చూడండి ఈ శాంతిమంత్రం లో ఉపనిషత్కారులు బ్రహ్మజ్ఞానం ఎలా సాధ్యం అనే విషయాన్ని సూత్ర ప్రాయంగా చెప్పేరు.

నా అవయవాలన్నీ, కన్ను చెవి వాక్కు మొదలుగాగల ఇంద్రియాలన్నీ తృప్తి చెందనీ., సర్వం ఆ బ్రహ్మం లోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి.
నేను బ్రహ్మత్వాన్ని నిరాకరించకుండా ఉందును గాక. బ్రహ్మత్వం నన్ను నిరాకరింపకుండును గాక. మా ఇద్దరి యందు పరస్పర నిరాకరణ మనేదే లేకుండా ఉండు గాక. ఆత్మరతుడనైన నాలో ఉపనిషత్తులందు నియుక్తమై ఉన్న ధర్మము నెలకొనును గాక. (కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాః- శాస్త్ర విహితములైన కర్మలనాచరిస్తూ నూరు సంవత్సరములు జీవింతుము గాక.)

బ్రహ్మ నన్ను నిరాకరింపకుండుగాక అని కోరుకోవడం సహజమే. కాని నేను బ్రహ్మత్వాన్ని నిరాకరించ కుండా ఉందును గాక అనేదే విచిత్రంగా అనిపిస్తుంది. బ్రహ్మత్వానుభవాన్ని (ఆత్మ యొక్క సహజమైన ఆనందానుభవం) ఆకాంక్షించి బ్రహ్మనిష్ఠుడై ఆ పరమాత్మను ప్రార్ధించి ఆయన కృపాకటాక్షాల వల్ల జ్ఞాన ప్రాప్తి ని పొంది ఆనందానుభవం పొందిన వ్యక్తి, బహిర్ముఖ స్థితికి వచ్చేక ఈ లౌకిక ప్రపంచ వ్యవహారాలలో తిరిగి ములిగి పోతాడు.

మోహాది ద్వంద్వాలకు తగులుకొని ఇంద్రియ లోలత్వానికి లొంగి పోతాడు. ఈ లోకమోహం తో ఆ బ్రహ్మత్వానుభవం నాకు వద్దు. అది నానుండి దూరంగానే ఉండాలి అనే కోరిక కలుగుతుంది. ఇదే మాయ. ఇది సహజంగా మనస్సుకు కలిగే పరిణామం, అని గ్రహించిన జ్ఞానులు నేను బ్రహ్మత్వాన్ని నిరాకరించకుండా ఉందును గాక। అని ప్రార్ధిస్తున్నారు.

ఆత్మరతుడై ఆ స్థితి లో తెలిసిన ధర్మానికి అనుగుణం గా జీవించేందుకు అవసరమైన క్రమం మన జీవితాలలో నిరంతరం స్థిరమై నిలిచిపోనీ. దానికి విరుద్ధంగా ఉండే జీవితం కాకుండా ఉండనీ. అనే తపన ఈ మంత్రం లో కనబడుతోంది.

వచ్చే భాగం లో చాందోగ్యోపనిషత్తు లోని వివరాలలోకి వెడదాము.

95. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

చాందోగ్యం యొక్క మొదటి అధ్యాయం లో ఓం కారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఋక్ అంటే ఏమిటి, సామం అంటే ఏమిటి, ఉధ్గీథం అంటే ఏమిటి అనే విషయాలను కూలంకషం గా చర్చించారు.

ఓంకార అనుష్ఠానం ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని చేసినప్పుడే ముక్తిని పొందుతాడని మంచి ఉదాహరణతో వివరించారు. పూర్వం ఈ ఉద్గీథోపాసనని అంగీరస మహర్షి చేయడం వల్ల ముఖ్య ప్రాణానికి అంగీరసం అని పిలుస్తారు.

రెండు నుంచి ఐదవ అధ్యాయం వరకూ వివిధ రకాలైన విద్యలు, మధువిద్య, శాండిల్య విద్య, సంవర్గ విద్య, పంచాగ్నివిద్య, వైశ్వానరాత్మ విద్య మొదలైనవాటి గురించి వివరించారు.

సత్యకామ జాబాల యొక్క కధ నాల్గవ అధ్యాయం లో వస్తుంది. జనశ్రుతుని మునిమనుమడైన జానశ్రుతి, రైక్వుల కధలు చెప్పబడ్డాయి.

ఈ బ్రహ్మ విద్యను ఎండిపోయిన చెట్టుకు ఉపదేశించినా అది తిరిగి చిగురిస్తుంది అని ఐదవ అధ్యాయం లో నొక్కి చెప్పారు. ఐదవ అధ్యాయం లో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః అంటూ ప్రాణం యొక్క విశిష్ఠతని శోదాహరణం గా వివరించారు.

ఆరవ అధ్యాయం లో, ఉద్దాలకుని కుమారుడైన శ్వేతకేతు కు బ్రహ్మజ్ఞాన ఉపదేశము ఉన్నాయి. శ్వేతకేతూ తత్వమసి అంటూ నిన్ను నీవు తెలుసుకొనే బ్రహ్మ విద్య అతనికి ఉపదేశింప బడింది.

ఏడవ అధ్యాయం లో నారద మహర్షికి సనత్కుమారుడు జ్ఞానోపదేశం చేయడం, భూమవిద్య ను బోధించడం తెలుపబడ్డాయి.

ఎనిమిదవ అధ్యాయం లో బద్ధ విరోధులైన ఇంద్రుడు, విరోచనుడు ప్రజాపతి సమక్షం లో ముప్ఫైరెండు సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్ష తో తపస్సు చేసి ప్రజాపతినుంచి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వైనం వివరింప బడ్డాయి.

పంచ మహా వాక్యాలలో “తత్వమసి” అనే మహా వాక్యం చాందోగ్యోపనిషత్తు లోనిది.

ఆ పంచ మహా వాక్యాలేమిటంటే,

1. ఋగ్వేదం లోని ఐతరేయోపనిషత్తు ” ప్రజ్ఞానం బ్రహ్మ” అంటోంది. అంటే ఈ అఖండమైన జ్ఞానం ఏదయితే ఉందో అదే బ్రహ్మ అని అర్థం.
2. యజుర్వేదం లోని బృహదారణ్యకోపనిషత్తు “అహం బ్రహ్మాస్మి” అంది. అంటే నేను బ్రహ్మను అయి ఉన్నాను. అని.
3. సామవేదం లోని చాందోగ్యోపనిషత్తు “తత్వమసి” అంది. అంటే నువ్వు బ్రహ్మవు అయి ఉన్నావు అని అర్థం.
4. అధర్వణ వేదం లోని ముండకోపనిషత్తు. “అయమాత్మా బ్రహ్మ” అంటే ఈ ఆత్మే బ్రహ్మ అని అర్థం.
చూడండి. ఈ నాలుగు మహా వాక్యాల సంకలనమే పురుషసూక్తం.

ఈ నాలుగు వాక్యాల సారాన్ని తిరిగి మరొక మహా వాక్యంగా “సర్వం ఖల్విదం బ్రహ్మ” అంటూ ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప ఇంకేమీ లేదు. అని స్పష్ట పరిచింది. నీవు నీ మనసు తో చూడగలిగినదేదయినా బ్రహ్మమే. చైతన్య స్థితి కలిగినదేదయినా బ్రహ్మము తప్ప వేరు కాదు.
నీలో నీవు శోధిస్తే మాత్రమే సమాధానం దొరుకుతుంది.)

వచ్చే భాగం లో ” ఓమ్ ఓమిత్యేతదక్షర ముద్గీథ ముపాసీత, ఓమిత్యుద్గాయతి తస్యోప వ్యాఖ్యానమ్”. అనే మంత్రంతో మొదలు పెట్టి ఋక్ అంటే ఏమిటి? సామం అంటే ఏమిటి? ఉధ్గీథం అంటే ఏమిటి? అనే విషయాలను తెలుసుకొందాం.

96. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

చాందోగ్యోపనిషత్తు ఈ క్రింది మంత్రం తో మొదలవుతోంది.

ఓమ్, ఓమిత్యేతదక్షర ముద్గీథ ముపాసీత, ఓమిత్యుద్గాయతి తస్యోప వ్యాఖ్యానమ్।।

ఓం అనే అక్షరాన్ని అంటే ఓంకారాన్ని ఉద్గీథము అంటారు. ఓం కారాన్ని ఓం అని దీర్ఘముగా గానంచేస్తూ ఉపాసించాలి. ఓం కారము యొక్క వ్యాఖ్యానం (వివరణ) ఈ విధం గా ఉంది.

ఈ సమస్త సృష్టి సారమూ పృథివి. ఈ భూమి రసమయం గా ఉంది. ఆ రసమే అంటే ఆ జలమే భూమి యొక్క సారం. ఆ జలం యొక్క సారం ఓషధులు. ఓషధుల సారం పురుషుడు. ఆ పురుషుడి సారభూతం గా ఉన్నది వాక్కు. ఆ వాక్కుకు సారం గా ఋగ్వేద మంత్రాలు, ఋక్కుల సారం గా సామము లేదా సామవేద మంత్రాలు ఉన్నాయి.

ఆ సామ వేదానికి సారభూతంగా నెలకొని ఉంది ఓం కారము. ఈ ఓం కారమే సర్వానికి సారభూతం గా సర్వోత్కృష్టమై ఉంది.

ఈ విధం గా అన్ని సారాలతో కూడి ఎనిమిదవది గా ఉన్న ఓం కారము పరమాత్మ యందుండుటకు సమర్ధమై ఉంది.

వాగేవ ఋక్ ప్రాణ స్సా మో మిత్యేత దక్షర ముద్గీథ స్తద్వా ఏతన్మిథునం యద్వాక్చ ప్రాణ శ్చర్క్చ సామచ।।

ఋక్ అంటే వాక్కు. సామం అంటే ప్రాణం. ఉద్గీథం అంటే ఓం కారం.

ఋక్ కి స్థానమైన వాక్కు, సామానికి స్థానమైన ప్రాణం, ఈ రెండింటి కలయికనే మిథునం అంటారు.

ఓం కారం లో ఈ రెండూ అంటే ఋక్ సామాల మిథునం అనేది కలసి పోతుంది.

యదావై మిథునౌ సమాగచ్ఛత ఆపయతో వై తా వన్యోన్యస్య కామమ్।।

అది ఎలా అంటే ప్రకృతి పురుషుల సంయోగం లా పరస్పరం ఇష్టపడినట్టు జరుగుతుంది.

ఇంతకు ముందు తైత్తిరీయోపనిషత్తు లో చెప్పినట్లు, లోకంలో దేనికైనా అనుజ్ఞ నిచ్చేప్పుడు ఓం అంటూ అనుమతి నిస్తారు. అందుకే దీనిని అనుజ్ఞాక్షరం అంటారు. ఈ అనుజ్ఞ వల్ల వృద్ధి అవుతుంది. కనుక దీన్ని సంవృద్ధి అంటారు.

ఓం కారం తో త్రయీ విద్య యొక్క ప్రవృత్తి కలుగుతుంది. యజ్ఞ కర్మ లో ఓం అని అధ్వర్యుడు శ్రవణ కర్మ (ఋగ్వేదం) చేస్తాడు. ఓం అని హోత శంశన కర్మను(యజుర్వేదం) చేస్తాడు. ఉద్గాత ఓం అని సామగానాన్ని చేస్తాడు.

ఈ ఓం అనే అక్షరం వల్లే అన్ని కర్మలు ప్రవర్తిస్తున్నాయి. ఓంకార రహస్యాన్ని తెలుసుకొన్న వాడు, తెలుసుకొనని వాడు ఇద్దరూ కర్మలు చేస్తారు.

వీరు చేసే కర్మలను విద్య తో కూడిన కర్మలు, అవిద్యతో కూడిన కర్మలు అంటారు. విద్య తో అంటే జ్ఞానం తో చేసే కర్నలే వీర్యవంతమైనవి అంటారు.

ఈ మొదటి అధ్యాయం లో 13 ఖండాలుగా ఓం కారానికి వివరణ ఇచ్చారు.

వచ్చే భాగం లో ఓంకార అనుష్ఠానం ఎలా చేయాలో తెలుసుకొందాం.

97. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

ప్రజాపతి పుత్రులైన దేవతలు, అసురులు తమలో తాము వైరాన్ని పెంపొందించుకొని పరస్పరం యుద్ధానికి సన్నద్ధులైయారు.

అసురులను జయించాలనే లక్ష్యం తో దేవతలు ఉద్గీథోపాసన (ఓం కారానుష్ఠానము) మొదలు పెట్టారు. దేవతలు ముక్కు లో ఉండే ప్రాణాన్ని అనుసరించి ఓంకారోపాసన చేయగా దానవులు పాపము చేత వేధించారు. దానితో ముక్కు ద్వారా సుగంధ దుర్గంధాల మిశ్రమ కర్మల ఫలితం కల్గింది తప్ప అసురులను జయించే శక్తి ని పొందలేక పోయారు.

అదే విధంగా దేవతలందరూ వాక్కు, కళ్ళు, చెవులు, మనస్సుల ద్వారా ఉద్గీథోపాసన చేయగా అసురులు వాటన్నిటినీ పాపాలతో త్రిప్పి కొట్టారు.

అదెలాగంటే, వాక్కు సత్యాన్ని, పాపమైన అసత్యాన్ని పలుకుతుంది. కళ్ళు అందమైన రూపాన్ని, పాపమైన కురూపాన్ని చూస్తుంది. చెవులు మంచి మాటల్ని, పాపాలు కల్గించే చెడ్డమాటల్ని వింటుంది. మనస్సు పాపాన్ని పుణ్యాన్ని కూడా భావిస్తుంది. దాంతో దేవతలు అసురులను ఏమీ చేయలేక పోయారు.

చివరగా దేవతలు ముఖ్య ప్రాణాన్ని ఆధారం గా చేసుకొని ఉద్గీథోపాసన చేయగా, అసురులు దేవతలను ఏమీ చేయలేక వారే నశించిపోయారు.

ఈ విధం గా ముఖ్య ప్రాణం గురించిన జ్ఞానాన్ని సమృద్ధి గా పొందిన వాడికి ఎలాంటి పాపం అంటదు.

అటువంటి వాడికి అపకారం చేయ తలపెట్టిన వాడు రాతిమీద కొట్టిన మట్టి ముద్ద లా నాశనమవుతాడు.

ఈ కథ లో ప్రణవోపాసన ఇంద్రియాల ద్వారా జరగలేదు. మన దేహంలోని ముఖ్యశక్తి అయిన ప్రాణాన్ని ఆధారం గా చేసుకొనే ప్రణవోపాసన జరిగింది అనేది స్పష్టం గా చెప్పబడింది.

ప్రాణం గురించి తెలుసు కొన్నవాడు ఆత్మానుభవాన్ని పొందిన వాడు కనుక అపాన వ్యానాది ఇతర ప్రాణాలను కూడా రక్షిస్తాడు.

పూర్వం ఈ ఉద్గీథోపాసనను ఆంగీరస మహర్షి చేసాడు. అది ప్రాణం, శరీరం ఈ రెండింటి సారమై ఉండడం తో దాన్ని అంగీరసం అన్నారు.

ఓంకారోపాసనను అర్ధం చేసుకొన్న దేవ గురువు బృహస్పతి ఆ ఉద్గీథోపాసన చేసాడు. ఈ ప్రాణాన్నే బృహస్పతి అంటారు. వాక్కనేది బృహద్రూపం. ఈ వాక్కుకు ప్రాణం భర్త లాంటిది.

ఆయాస్యుడనే ఋషి కూడా ఉద్గీథము చేయడం వల్ల ప్రాణానికి ఆయాస్యం అనే పేరు వచ్చింది.

తరువాత దాల్భ్యుడి కుమారుడైన బకుడు అనే మహర్షి ఉద్గీథం గురించి తెలుసుకొని నైమిశారణ్యానికి వెళ్ళి అక్కడ ఋషులందరి కోరిక మేరకు ఓంకారాన్ని గానం చేశాడు.

ఇదే ఓంకారం యొక్క అధ్యాత్మిక ఉపాసనా విధానం. అంటే ఆత్మను తెలుసుకొనే మార్గం.

పరమాత్మ ఆధారం గా మానవుల శరీరం లో ఉండే ప్రాణమే ఓంకారం అని భావం.

అధిదైవిక ఉపాసనా విధానం లో సూర్యోపాసనకు
తాపాన్ని కలిగించే సూర్యుణ్ణి ఓంకారం గా భావించి ఉపాసించాలి.

మానవ శరీరం లో ఉన్న ప్రాణమే ఓం కారం. లోకాన్ని చూసే సూర్యుడు కూడా ఓంకారమే. ప్రాణానికి స్వరం అని పేరు.

ఆ సూర్యుడికి స్వరప్రత్యాస్వర మని పేరు. అందుకని ఓం కారాన్ని ప్రాణం గా, సూర్యుడు గా భావించి ఉపాసించాలి. అంటే సూర్య మండలాన్ని తదేక దృష్టి తో చూడడం.

దీనికి పూర్తి సాత్వికాహారం కావాలి. విహారం నియమానుసారం గా ఉండాలి. ఉపాసన తర్వాత ముందు నీళ్ళు తర్వాత సస్య సంపద వైపు కొంచెంసేపు దృష్టి ని ఉంచడం అవసరం.

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పేర్లతో శరీరం లో వివిధ కార్యక్రమాల్ని నిర్వర్తిస్తున్న ముఖ్య ప్రాణం ఈ ఐదింటి లోను మొదటిది.

వచ్చే భాగం లో ఉద్గీథం లో వ్యానవాయువు యొక్క గొప్పదనం, వ్యానంతో ఉపాసనా విధానం తెలుసుకొందాం.

98. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

ఈ మంత్రం లో వ్యాన వాయువు యొక్కగొప్పతనం చెప్పబడింది.

అధ ఖలు వ్యానమేవోద్గీథముపాసీత
యద్వై ప్రాణితిస ప్రాణోయ దపానితి
సో పానో ధయః ప్రాణాపానయోః
సంధిఃస వ్యానో యో వ్యానః సావాక్
తస్మాద ప్రాణన్నపాన న్వాచమభివ్యాహరతి।।

ప్రాణం నుండి క్రిందకు వచ్చే గతిని అపానమని, ప్రాణం వైపు వెళ్ళే వాయుగతిని ప్రాణమని వర్ణించారు.

ప్రాణ అపాన గతుల రెండింటి మధ్య దేహమంతట చలించే వాయువు నే వ్యానం అంటారు. వ్యాన వాయువు అంటే మనం మాట్లాడే మాటే.

వ్యానం వల్లనే వాక్కు ఉద్భవిస్తుంది. వ్యానమే వాణి కాబట్టి వాణి ప్రకటమయ్యే వాయువు యొక్క ప్రాణాపాన గతులు లేకుండా పోతాయి. (అంటే ప్రాణాపాన గతులను విబేధిస్తేనే మాట బయటకు వస్తుంది).

కర్మాచరణకూ వ్యానమే సాధనం. వాయువు యొక్క వ్యాప్తి లేకుండా ఏ అవయవము పని చేయ లేదు.

ఖలూద్గీధాక్ష రాణ్యుపాసీతోద్గీథ ఇతి ప్రాణ
ఏవోత్ప్రాణేన హ్యుత్తిష్ఠతి వాగ్గీ ర్వాచోహ
గిరి ఇత్యా చక్షతే న్నంథమన్నే హీదం సర్వం స్థితం

ఉద్గీథమనే దాన్ని శబ్దోత్పత్తి ద్వారా ఇక్కడ వివరించారు.

ఉత్ అనే వేళ మనలో వాయువు పైకి వెళ్ళుతుంది. అందువల్ల ప్రాణం నుండి మానవునికి శ్రేయస్సు.

గీ అనేదాన్ని ఉచ్ఛరించే వేళ వాయువు స్వర యుక్తం గా క్రిందికు వస్తుంది. దాన్నే వాణి అంటే అపాన గతి అంటారు.

వీటి వల్ల ఈ ప్రాణాపాన గతుల్లో జరిగే వాయు మథనం నుండి అశనం ఉద్భవిస్తుంది. అన్నాన్ని (అశనం) థమ్ అన్నారు.

థమ్ అంటే అక్కడే శబ్దం లో గతాగతి తో పుట్టిన అశనాన్ని ప్రాణ చైతన్యం గ్రహిస్తుంది. సర్వం ఈ అన్నం పైనే ఆధారపడి ఉన్నాయి.

ఋక్, యజు, సామవేద మంత్రాలతో దేవతల ప్రీతి కోసం చేసే ఉద్గీథ క్రమాన్ని వివరించి, ఆ తర్వాత దేవతలు మృత్యుభయం నుండి విముక్తులు అయ్యేందుకు ” త్రయీ విద్య ” ను ఆశ్రయించారు.

స్వామీ జయతీర్థులు ఇక్కడ ఏ రకంగా వ్యాఖ్యానించారంటే:

త్రయీ విద్యలని చెప్పబడే ఋగ్వేదం, యజుర్వేద, సామవేద మంత్రాలు, ఛంస్సుల నాశ్రయించారని, వాటితో కర్మానుష్ఠానాల్ని ఆచరించారని చెప్పిన అర్ధాన్ని స్వామి గారు దేవతలాశ్రయించేది మూడు వేదాలను కాదు. అంటూ

ఈ వేద మంత్రాల ద్వారా చెప్పబడ్డ విషయం ఏవిద్య ద్వారా లభిస్తుందో ఆ విద్య నే ఆశ్రయించారు. ప్రాణోపాసనకు ప్రధమ సోపానమైన వాయు మధనమే త్రయీ విద్య. అన్నారు.

దేహం లో అన్ని చోట్లా వ్యాప్తమైన వాయువును (49 ప్రదేశాలలో మరుత్తులనే పేర్లతో దేహం లో వివిధ స్థానాలలో వాయువు ఉంది) ఏక. ముఖమయ్యేటట్లు కేంద్ర స్థానం లో ఋక్ (ఊర్ధ్వగతి- ప్రాణం), యజుర్ (అధోగతి- అపానం), లను గతాగతిలో ఉంచితే శబ్దోత్పత్తి అయ్యే స్థానం లో సామం ( సమంగా) నడిపించే వాయు మథనమే త్రయీ విద్య. తద్వారా తమలోని కొంత అంధకారాన్ని భయాన్ని పోగొట్టుకో గలిగారు.

కానీ చేపల్ని మనం నీళ్ళలో స్పష్టంగా ఎలా చూడ గలుగుతామో అదే విధం గా మృత్యు దేవత దేవతలందరనీ ఋక్ యజు స్సామ వేదాలలో చూచింది. అది (ఆ మృత్యుభయాన్ని) గ్రహించిన దేవతలు ఈ త్రయీ విద్య నుంచి ముందుకు సాగి వేదోక్తమైన కర్మల కంటే కూడా గొప్పదైన ఓం కారాన్ని ఆశ్రయించారు.

ఓంకారోపాసన ఒకటే మనలను బ్రహ్మత్వం వైపు నడిపించ గలదని ఈ ఓం కారమే సర్వ స్వరూపం, నాశనం లేనిది, అమృత మయమైనది, అభయాన్నిచ్చేది అని నమ్మి దేవతలంతా ఓంకారాన్ని ఆశ్రయించి, ఉపాసించి తద్వారా అమృతస్వరూపులు ( చావు లేని వారు) అభయ స్వరూపులు అయ్యారు.

కొంచెం శ్రద్ధతో ఒకటి రెండు సార్లు చదివి అర్ధం చేసుకోమని నా మనవి.

99. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

యదావా ఋచ మాప్నోత్యోమి
త్యేవాతిస్వరత్యేవం సామైవం
యజు రేష ఉ సర్వోయదేత దక్షర
మేత దృమత మభయం తత్ప్ర విశ్య
దేవా అమృతా అభయా భయన్।

శబ్దయుక్తం గా సాగే వాయు మధనం తో అశనం (అన్నం) లభిస్తుంది. ఆ అశనం ప్రాణుని ద్వారా తీసుకోబడుతుందనే అంశాన్ని గ్రహించి ఆ అక్షరాన్ని ఆశ్రయించారు.

ప్రాణం లో ఇంద్రియవృత్తులను లీనం చేశారు. ఆ అక్షరమే (ప్రాణమే) స్వరం. అంటే స్వయం ప్రకటనా సామర్ధ్యం కలది. అది స్వయం ప్రకాశమానం. అది నాశ రహితం.

మనస్సు ప్రాణం లో లీనమైనప్పుడు(మనో ప్రాణ మిలనం జరిగేక అనంతమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది) దీన్ని ఆశ్రయించాక భయ నివారణ కావడం తో దీన్ని అభయాన్నిచ్చేది అన్నారు. అప్పుడు ఆ సాధకునిలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అంటారు. ప్రాణ ప్రతిష్ఠ జరగకుండా సాధకునకు ఆధ్యాత్మిక అనుభవాలు కలగడానికి అవకాశం లేదు. అలాంటి ఈ ఓం కారాన్ని ఆశ్రయించి దేవతలు అమృతులు, అభయులు అయ్యారు.

అదే విధంగా మానవులు కూడా ఈ విద్య నాశ్రయించి అమృతులు, అభయులు కావచ్చనేదే ఉపనిషద్ మహర్షుల అనుభవ పూర్వక ఉపదేశం.

ప్రణవమే ఉద్గీథము. ఉద్గీథమే ప్రణవము. ప్రకాశించే సూర్యుడే ఉద్గీథము (ఓంకారము). సూర్యుడు ఓంకార జపంతోనే సంచరిస్తున్నాడు.

ఓంకార స్వరూపుడైన సూర్యుడు తన కుమారుడైన కౌషీతకి మహర్షికి ” నేను ప్రణవ గానమును ఎలా చేస్తున్నానో అలాగే నీవు కూడా చేయి” అని చెప్పేడు. నా కిరణాలను నీవు ఉద్గీథం గా (ఓం కారం) భావించు. దేవతలంతా చేసే ఓంకార గానం (ధ్యానం) ఇదే.

ఆధ్యాత్మం అంటే శరీరం తో చేసే ఉపాసన. ఈ ఓం కారమే ప్రాణం అని బోధించాడు.!
తండ్రి యొక్క బోధన విన్న కౌషీతకీ మహర్షి ప్రాణాన్ని (ఓం కారాన్ని) పుత్రుడు గా భావించి ప్రణవోపాసన చేశాడు.

జగత్తు లో సూర్యమండలం ప్రాణశక్తి కి కేంద్రం. సూర్యుడి కిరణాల ఉపాసన ద్వారా మానవుల దేహ శక్తి పెరిగి బహుపుత్ర లాభం కలుగుతుందని తెలుసుకొని సూర్య కిరణాలనే ఉద్గీథం గా (ఓం కారం గా) భావించి ఉపాసించాడు.

ఋక్కుని ఆధారం గా చేసుకొని సామగానం ఎలా చేయబడుతోందో ఈ మంత్రం లో చెప్పబడింది.

ఋగ్వేదం భూమి అయితే సామ వేదం అగ్ని. ఈ సామం అనేది ఋక్ మీద ఆధారపడింది. అంటే అగ్ని భూమి మీద ఆధార పడింది.

ఆకాశం ఋక్ అయితే వాయువు సామం – ఈ విధం గా సామం అయిన వాయువు ఋక్ అయిన ఆకాశం మీద ఆధారపడి ఉంది.

ఋక్ అంటే స్వర్గం సామం అంటే సూర్యుడు. ఈ సామం అనే సూర్యుడు ఋక్ అనే స్వర్గం మీద ఆధారపడి ఉన్నాడు.

మరొక భావన లో ఋక్ అంటే నక్షత్రాలు సామం అంటే చంద్రుడు. ఈ చంద్రుడు అనే సామం నక్షత్రాలు అనే ఋక్ మీద ఆధారపడి ఉంటుంది.

అందుకే అన్ని ఉపమానాల్లోనూ ఋక్ ని ఆధారం గా చేసుకొని సామగానం చేయబడుతోంది.

సమస్త విధాలుగా ఓంకారాన్ని గానం చేసి ఫలితాలను ధృవీకరించారు. చాందోగ్యోపనిషత్తు యొక్క మొదటి రెండవ అధ్యాయాలు ఓంకార గానాన్ని బహు విధాల ప్రయత్నించి వాటి ఫలితాలను పరీక్షించారు.

100. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

సామం అనేది మరొక రకంగా కూడా భావించ బడుతోంది. సా అంటే సూర్యుడి తెల్లని కాంతి, మ అంటే సూర్యుడి నల్లని కాంతి (చీకటి). ఈ రెండిటి కలయికయే సామం.

ఆసనం లో కూర్చొని దృష్టి పెట్టి చేసే ఆ ప్రాణాపానాల మధనంవల్ల అగ్ని పుడుతుంది. అప్పుడు ప్రకాశం దర్శన మిస్తుంది.

య ఏషోన్తరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే హిరణ్యశ్మ శ్రు ర్హిరణ్య కేశ ఆ ప్రణఖాత్సర్వ ఏవ సువర్ణః।।

ఆ సూర్యుడి లో ప్రకాశించే పురుషుడే హిరణ్మయుడు.అతడు బంగారు జుట్టుతో, బంగారు గడ్డం తో ప్రకాశిస్తున్నాడు. బంగారు మేని రంగుతో బంగారు గోళ్ళతో బంగారు పక్షి లా కన్పిస్తున్నాడు. ఆయన కళ్ళు ఎర్రగా పుండరీకం (అగ్ని) లా ప్రకాశిస్తాయి. ఆయన పేరు ఉత్.

ఈశావాశ్యోపని షత్తులో ‘హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం’ అంటూ ఆమహర్షులు జ్యోతి దర్శన మయిన తర్వాత ఆ సత్యరూప సందర్శనం చేసుకొంటూ వారి వారి అనుభవాలను చెప్పేరు.

ఆ ఋగ్వేదం సామవేదం అంటే ఆ హిరణ్య గర్భుడే. ఆయనే ఉద్గీథం. ఆ హిరణ్యగర్భుడే సూర్యుడికి పైనున్న లోకాలను అక్కడున్న వారిని కాపాడుతూ వారి వారి కోరికలను తీరుస్తున్నాడు. అందుకే సకల దేవతలు ఆ హిరణ్యగర్భుడి మీదనే ఆధార పడ్డారు. ఆయనే అధిదైవతం.

కన్ను, నేత్రేంద్రియం; చెవి మనస్సు లను కూడా ఋక్ సామాలుగా భావించారు.

ఈ ఉద్గీథ గానాన్ని చాలా చక్కగా చేయగల ముగ్గురు మహర్షులు పూర్వ కాలం లో ఉండేవారు.
1. శాలవత్యుడి కుమారుడు శిలక ముని,
2. చైకితాయ వంశీయుడైన దాల్భ్యముని,
3. ప్రవాహణుడి పుత్రుడైన జైబలి.

ఈ ముగ్గురు మహర్షులు “మేము ముగ్గురం ఉద్గీథాన్ని గానం చేయడం లో ప్రవీణులం. మీరు అంగీకరిస్తే ఈ సామగానం గురించి చర్చిస్తాం” అని మొదలుపెట్టేరు.

దాల్భ్యముని సామవేదాన్ని స్వర్గసారం గా శిలకమునికి చెప్పేడు. శిలకముని దాల్భ్యుని సామగానంలో దోషాన్ని ఎత్తి చూపేడు. దాల్భ్యుడు కోరగా శిలకముని సామాన్ని భూమిసారంగా తెలిపేడు.

భూమి సారమైన ఈ సామగానాన్ని ఈ భూమినుంచి ఎవరూ తీసుకొని పోలేరు. కనుక ఎవరైనా సామగానాన్ని ఈ భూలోకం లోనే చేయాలి. సామగాన సారమే ఈ భూమి అని శిలకముని బోధించాడు.

ఇలా వీరిద్దరి సంభాషణ విన్న జైబలి మహర్షి శలకముని సామగానం లో కూడా తేడాను చూపించి గమనించి హెచ్చరించాడు.

శలకముని జైబలి ని అడుగుతున్నాడు.

అస్య లోకస్య కా గతి? రి త్యాకాశ ఇతిహోవాచ సర్వాణి హవా ఇమాని భూతాన్యకాశా దేవ సముత్పద్యన్త ఆకాశం ప్రత్యస్తం యన్త్యాకాశో హ్యే వైభోజ్యాయా నాకాశః పరాయణం।।

స్వామీ ఈ లోకానికి సారం ఏది? ఈ లోకపు గతి ఏమి? అనే ప్రశ్నకు జైబలి మహర్షి ఒక్క మాటలో “ఆకాశం” అంటూ

ఈ జీవులన్నీ ఆకాశం నుంచే పుడుతున్నాయి. తిరిగి ఆకాశం లోనే లీనమైపోతున్నాయి. ఆ ఆకాశం అనేది పంచభూతాలలో అన్నింటికన్నా విశాలమైనది. అన్నింటికీ ఆధారంగా ఆశ్రయం గా ఉంది. అందువల్ల జ్ఞానులు ఆకాశాన్ని భూతమనకుండా తత్వం అన్నారు. అంటే శాశ్వతమైన సత్ (దేవుడు) నుండిబయటకు వచ్చి సమస్త శక్తియొక్క వ్యాప్తికి ముఖ్యస్థానమయ్యింది.

అయితే ఉద్గీథ గానం వీటన్నిటికన్నా శ్రేష్టమైనది. అనంతమైనది కూడాను. ఈ విషయాన్ని తెలిసిన జ్ఞానులు ఉత్తమోత్తమమైన ఉద్గీథాన్నే ధ్యానిస్తున్నారు.

పూర్వం శునకముని కుమారుడైన అతిధన్వుడనే మహర్షి ఉదర శాండిల్యుడనే మునికి ఇలా చెప్పేడు. మీ శిష్యులందరూ ఉద్గీథగానాన్ని పరంపరగా ఉపాసించినంత కాలం వారి జీవితాలు గొప్పగా ప్రకాశిస్తాయి. స్వర్గం లో కూడా వారి కీర్తి వ్యాపిస్తుంది. ఈ లోకం లోనే కాదు. అన్ని లోకాలలోను కూడా గొప్పవారిగా ప్రసిద్ధి చెందుతారు.

వచ్చే భాగం లో చాక్రాయణుడి కుమారుడైన ఉషస్తి ముని యొక్క కధ, ఉద్గీథాన్ని గురించి తెలుసుకొందాం.

101. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

పూర్వం అతివృష్టి, వరదల కారణంగా కురు దేశం లోని పంటలన్నీ నాశనమైపోయాయి. చాక్రాయణుడి కమారుడైన ఉషస్తిముని తన భార్య తో కలిసి ఆ ప్రాంతం లో నివసిస్తూ ఉండేవాడు.

వారు ఉన్న ప్రాంతం ఒక చిన్న గ్రామం. అది మావటి వాళ్ళు నివశించే ‘ ఇభ్య ‘ అనే ఊరు. అక్కడ అందరూ కటిక దరిద్రులు. అతివృష్టి వల్ల కరువు ఏర్పడింది.

ఒకరోజు ఉషస్తిముని ఆకలికి తట్టుకో లేక ఆ వూళ్ళో ఒక మావటివాడి ఇంటికి వెళ్ళి ఆహారం అర్ధించాడు. ఆ సమయం లో మావటివాడు నాసి రకం ఉలవ గుగ్గిళ్ళు తింటున్నాడు. స్వామీ। నా దగ్గర ఈ ఉలవ గుగ్గిళ్ళు తప్ప ఇంకేమీ లేవు అన్నాడు. సరే అవే కొంచెం ఇవ్వు అని అడిగాడు.

మావటి గుగ్గిళ్ళతో పాటు తాను ఎంగిలి చేసిన నీళ్ళను కూడా త్రాగడానికి ఇచ్చాడు. ఉషస్తిముని గుగ్గిళ్ళు మాత్రం తీసుకొని ఈ నీళ్ళు ఎంగిలివి నేను త్రాగనని నిరాకరించేడు. ఆ మావటి ” స్వామీ। మరి ఈ గుగ్గిళ్ళు మాత్రం ఎంగిలివి కాదా। ” అన్నాడు.

ఓయీ। ఈ గుగ్గిళ్ళు తినక పోతే నా ప్రాణం పోతుంది. నీరు సులభంగానే దొరుకుతుంది కదా అని చెప్పి గుగ్గిళ్ళు తీసుకొని తాను కొంచెం తిని తన భార్య కోసం కొన్ని తీసుకొని వెళ్ళాడు. అప్పటికే ఆయన భార్య బిక్షం ఎత్తి కొంత ఆహారాన్ని తిని ఇంటికి వచ్చింది. భర్త తనకు ఇచ్చిన గుగ్గిళ్ళను దాచిపెట్టింది.

మర్నాడు ఉదయం ఉషస్తిముని నిద్రనుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొని తన భార్య తో ఇలా అన్నాడు. ” అబ్బా। మరికొంచెం ఆహారం ఉంటే నేను కొంత ధనాన్ని సంపాదించ గలను. ఇక్కడకు దగ్గరలో ఒక రాజు గొప్ప యాగాన్ని చేస్తున్నాడు. నేను వెళ్ళి అడిగితే నన్ను కూడా ఒక ఋత్విక్కుగా తీసుకుంటాడు.”

అప్పుడు అతని భార్య జ్ఞాపకంచేసి తాను దాచి పెట్టిన ఉలవ గుగ్గిళ్ళను తెచ్చి ఇచ్చి భర్తను యాగానికి వెళ్ళేటందుకు ప్రోత్సహించింది. ఉషస్తి వాటిని తిని యజ్ఞము చేస్తున్న రాజు దగ్గరకు వెళ్లేడు. అక్కడ వేదపఠనం చేస్తున్న ఋత్విక్కు పక్కన కూర్చున్నాడు. ప్రస్తోత, ఉద్గాథ, ప్రతీహర్త ఋత్విక్కు లను పిలిచి సంబంధిత దేవతల గురించి స్పష్టంగా తెలుసుకోకుండా స్తోత్రగానం చేస్తే మీతలలు తెగి పడతాయి జాగ్రత్త అని హెచ్చరించేడు.

ఉషస్తిముని సామగాన పండితుడు, బ్రహ్మవిద్యా పారంగతుడు. ఆ యజ్ఞ ప్రధాన ఋత్విక్కు కోరిన మీదట ఉషస్తి ఈ విధంగా వివరించాడు.

ప్రధమంగా ప్రస్తోత నుద్దేశించి, ఓ ప్రస్తోతా। ఈ సృష్టిలో ఉన్న సకల జీవులూ ప్రళయకాలం లో ప్రాణం లోనే లయమై పోతున్నాయి. తిరిగి సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు ఆ ప్రాణం నుంచే జన్మిస్తున్నాయి. కనుక ప్రస్తావ గానానికి ప్రాణమే దేవత.

తర్వాత ఉద్గాథ దేవత గురించి, నాయనా ఉద్గీథ దేవత సూర్యభగవానుడు. సూర్యోదయం అయిన వెంటనే ఈ చరాచర ప్రకృతి అంతా ఆయననే కీర్తిస్తుంది.

ప్రతిహర్త అయిన ఋత్విక్కు తో, ఓ భగవన్తా। ఈ సకల జీవరాసులు అన్నం తినడం వల్లనే జీవిస్తున్నాయి. కనుక ప్రతీహార గానానికి దేవత అన్నం. అంటే ఆహారం. ఇక్కడ యజ్ఞ ప్రక్రియను వివరించారు.

ఉద్గీథ గానాన్ని శునకాలు (కుక్కలు) కూడా చక్కగా చేయగలవు అనే దానికి సంబంధించిన ఉపాఖ్యానం ఇది.

ఒకనాడు దాల్భ్యముని, మైత్రేయ మహర్షి వేదాధ్యయనం గురించి వారికి సమీపం లో ఉన్న ఒక గ్రామానికి వెళ్లారు. అక్కడ వారికి శునకాల రూపంలో వేద దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఒక తెల్ల శునకం (ప్రధాన ఋషి) వారిద్దరితో ” మేము ఇప్పటిదాకా గానం చేసి అలసిపోయాం. మాకు ఆహారం తీసుకుని రండి తర్వాత మీకు పాఠం చెబుతాము అంది.

అన్నం తిన్న తర్వాత మానవ ఋత్విక్కుల లాగానే శునకాలు చేతులు తిప్పుతూ ఎంతో మధురంగా సామవేద మంత్రాలను గానం చేసాయి. సామ వేద రాగాలతో ఓం మమ్మల్ని అన్నం తిననివ్వండి. ఓం నీళ్ళని తాగనివ్వండి.

వరుణుడు, ప్రజాపతి, సూర్యుడు మాకు అన్నాన్ని ప్రసాదిస్తారు గాక। ఓం అన్నపూర్ణా। మాకు ఇక్కడ అన్నాన్ని సమకూర్చుము ఓం.

శునక ఋషి ద్వాదశాదిత్యులకు సంబంధించిన సంకేతాల సమూహాన్ని వివరించే ప్రధమ అధ్యాయం లోని చివరిది మరియు పదమూడవ ఖండం చదువుకుందాం వచ్చే భాగం లో.

102. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

ఈ మంత్రం లో సామవేదం లోని స్తోభాక్షరాలు వాటి అధిష్టాన దేవతల గురించి చెప్పబడింది.

ఈ లోకం హా, ‘ఉ ‘కారం; వాయువు హా, ‘ఇ’ ‘కారం. చంద్రుడు ‘అథ’ కారం. ప్రజాపతి ‘హిం’ కారం. ప్రాణం ‘స్వరం’ అన్నం యాకారం; వాణి (వాక్ ) విరాట్; ఆత్మ ‘ఇహ’ కారం; అగ్ని ‘ఈ’ కారం; ఆదిత్యుడు. ‘ఉ’ కారం; నిహవం (పిలిచేది) ‘ఏ’ కారం. జౌ, హౌ, ‘ఇ’ కారం -విశ్వ దేవతలు. హుం కారం – అనిర్వచనీయమైన స్తోభ. (స్తోభాక్షరాలు అంటే వ్యర్ధమైన మాటలు అని అర్ధం. కాని అవే అక్షరాలతో కూడిన మంత్రమైతే దోషం ఉండదు.)

ఈ పదమూడు అక్షరాల అధిష్టాన దేవతల గురించి తెలుసుకొని, సామగానం చేయాలి.

స్వామీ జయతీర్ధుల మాటలలో:
ఈ పైన చెప్పిన అక్షరాలు అర్ధరహితంగా కన్పించినా ఎంతో సాంకేతికమైన అక్షరాలు.

ఈ వర్ణోత్పత్తి రహస్యం (అక్షరాల సాంకేతిక అర్ధం) ఏ గ్రంథం లోను కనిపించదు. బ్రహ్మ విద్యోపాసన లో సాగేవారికి మాత్రం అర్ధమౌతాయి.

హా, ఉ కారాల ఉత్పత్తి శరీరం నుంచి వ్యాన వాయువు బయటకు వెళ్ళడం ద్వారా;

హా, ఇ కారం – బహిర్ వ్యాప్తమైన వాయువు అంతరిక్షం లో కొంచెం క్రింద స్థాయిలో ఉంటుంది అని సూచిస్తుంది.

అక్షరాలు యొక్క ఉచ్ఛారణ ఎక్కడనుంచి మొదలవుతుందో, ఆ మూలస్థానం నుండి బయటకు వచ్చి స్థిరంగా ఉండే దాన్ని అ థ కారం సూచిస్తుంది. దానికి చంద్రుడు అభిమాన దేవత.

హిం కారం లీనం కావడాన్ని సూచిస్తుంది. అదే ప్రజాపతి.

అన్ని వర్ణాల ఉత్పత్తికి మూలమైనటువంటి మరియు స్వయం ప్రకాశమైన ప్రాణం (స్వరం) అన్ని చోట్ల వ్యాపిస్తుంది.

అన్నం యా కారమయితే, వాక్కు అనేది విరాట్ యొక్క మూలమునుండి వచ్చిన జ్ఞానశక్తి.

ఆత్మ ఇ హ కారం.

ఆత్మ యొక్క పని గురించి ఇంకొంచెం క్రిందికి దిగిన శక్తి అగ్ని అనేదే ఈ కారం. దానినే వైశ్వానరుడు అంటారు.

బయటి విశ్వం లో సువిశాలమైన శక్తి కేంద్రం అయిన సూర్యుడు ఊ కారం అవుతుంది.

మానవులు సంబోధించే వేళ అతడు తన కన్న శ్రేష్టమని ఊర్థ్వదిశాభిముఖులై పలకడం అనేదాన్ని ఏ కారం అంటారు. ఇదే నిహవం అనబడుతుంది.

ఆదిత్యుని నుండి క్రింది స్థాయి లో ఉండే విశ్వ దేవతల సంకేతమే ఔ, హో, ఇ కారాలు.
“అనిరుద్ధ స్త్రయోదశ స్తోభః సంచారో హుంకారః ” అన్నారు.
ఇంక పదమూడవ ‘ హుం ‘ అనేది తన లోనే స్థితమై ఉన్న అనిర్వచనీయమైన స్థితికి సంకేతం.

ఈ పైన చెప్పిన 12 సంకేతాలు పన్నెండు దేవతలు అంటే ద్వాదశ ఆదిత్యులను సూచిస్తాయి.

ఈ పన్నెండు ఆదిత్యులు మొదటి నుండీ పుట్టి వున్నరనీ, వీళ్ళందరకీ విశ్వాంతరాళం లో ఉండే ఆది దేవుడే ద్వాదశాత్ముడని అంటూ చాలా చోట్ల ద్వాదశాత్మన్నమోస్తుతే అని జ్ఞానులు స్తుతించారు.

సర్వ సృష్టికి కర్తననిపించుకున్న ప్రజాపతిని భానుమండలాధిపతి అయిన భాస్కరుడని పలికారు.

ఈ ద్వాదశ ఆదిత్య మండలాలకవతల ఏమీ లేని సూన్య స్తానం లో ఉండే (తేజోమండలం) ఆత్మను “సర్వ ఏష రవిః ప్రభుః ” అంటూ అందరకూ ప్రభువు అనగా సమస్త జీవకోటికి ప్రభవాన్ని(శక్తిని) అందించే ముఖ్య వ్యక్తి రవి అని వివరించారు.

సాధనలో సాగుతూ, ప్రాణ మనోమిలనమయ్యిన తర్వాత అనుభవంతో అవగాహనలోకి తెచ్చుకో గలిగే విషయాలు ఇవి. ఊర్థ్వదిశాభి ముఖంగా ధ్యాన స్థితి లో ఉంటూంటే ఇవన్నీ అర్ధం అవుతాయి.

వచ్చే భాగం లో రెండవ అధ్యాయం లోపంచవిధ సామగానము (హింకారము; ప్రస్తావము; ఉద్గీథము; ప్రతిహారము; నిధనము;) గురించి తెలుసుకుందాం.

103. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

ఎనిమిది అధ్యాయాలతో (ప్రపాఠకాలతో) నూట ఏభై ఆరు ఖండాలు గా ఉన్న ఈ ఉపనిషత్తు మొదటి ప్రపాఠకం లో పదమూడు ఖండాలు లో ఓంకారోపాసన, ఉద్గీథోపాసన, దాని విధానం, ఉద్గీథం తో ముక్తిని పొందే విధానం వివరింపబడ్డాయి.

మానవ దేహం లోని అవయవాలు, పంచ ప్రాణాలు, పంచ భూతాలు అన్నీ ఓంకారమయమే అని, ప్రాణులన్నీ తమకు తెలియకుండానే ప్రాణాయామం, ఉద్గీథోపాసన చేస్తున్నాయి అని ఈ ఉపనిషత్తు విశద పరుస్తోంది.

చాందోగ్యోపనిషత్తు ఉపదేశ ప్రధాన మైనది. ఈ ఉపనిషత్తు ఇచ్చే మహత్తరమైన ఉపదేశమే తత్వమసి అనే మహా వాక్యం.

ఇక్కడ ఉపాసనల గురించి కొంత తెలుసు కుందాం. వేదవిహితమైన కర్మలను రెండు విధాలుగా విభజించేరు. అవి కేవల కర్మలు, ఉపాసనలు.

ఉపాసన అంటే వేదం చెప్పిన ఒక ఆలంబనాన్ని ఆధారం గా దాని మీద మనస్సు లగ్నం చేసి మరొక ధ్యాస లేకుండా చింతిస్తూ ఉండడం.

మూఢంగా చేసే కర్మల కన్న జ్ఞానం తో చేసే కర్మకు అంటే నిరంతర చింతనకు అంటే ఉపాసనకు ఫలితం ఎక్కువ ఉంటుంది.

ఈ ఉపాసనలో మూడు స్థాయిలు ఉన్నాయి.
ఒకటి కర్మాంగోపాసన, రెండవది దేవతోపాసన, మూడవది బ్రహ్మోపాసన.

కర్మాంగోపాసన అంటే మనస్సు యొక్క చేష్టల ద్వారా కలిగే కర్మలకు ఒక సమగ్రత ను చేకూర్చే ఉపాసనలు. ఉద్గీథోపాసన మొదలైనవి ఇలాంటివే.

వీటిలో కేవల కర్మ అనేది సాధకుని మనస్సుకు ఒక రకమైన శిక్షణ ఇస్తుంది. కర్మాంగోపాసన సకల విధాలైన పాపాలను ప్రక్షాళన చేస్తుంది.

దేవతోపాసన అంటే ఆదిత్యుడని, హిరణ్యగర్భుడని మొదలైన దేవతామూర్తులను మనస్సు లో ధ్యానిస్తూ మంత్ర పూర్వకంగా హోమాది కర్మలు నిర్వర్తించడం. దేవతోపాసన అభ్యుదయాన్ని చేకూరుస్తుంది.

దేవతలంటే ఎవరో కాదు. ఈశ్వర చైతన్య విభూతులే. అనంత శక్తి సంపన్నమైన ఆ పరమాత్ముని చైతన్య సాగరంలో ఏ ఒక్క శక్తి తరంగాన్ని ఎన్నుకొని ధ్యానించినా ఆ మేరకు ఫలితమిస్తుంది. ఇది దేవతోపాసన.

మూడవది బ్రహ్మోపాసన. ఇది సగుణ సాకార బ్రహ్మోపాసన, నిర్గుణ నిరాకార బ్రహ్మోపాసన అని రెండు విధాలు.

ఈ సగుణ సాకార బ్రహ్మోపాసన క్రమ ముక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడ బ్రహ్మ తత్వమనే దానిని సగుణం, సాకార (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మొదలయిన) గా భావనచేస్తాడు సాధకుడు. గుణాలు లేకపోతే అది ఉపాసకుడి మనస్సున కందదు.

కర్మలన్నింటికీ ప్రయోజనం చిత్తశుద్ధి అయితే ఉపాసనల యొక్క ప్రయోజనం చిత్తం యొక్క ఏకాగ్రత.

కర్మానుష్ఠానం నుంచి సగుణ బ్రహ్మోపాసన వరకూ నెమ్మది నెమ్మది గా సాధకుడి దృష్టి విశాలమవుతూ వ్యష్టి భావన నుంచి సమష్టి భావనగా మారుతుంది.

ఆ సగుణాన్ని కూడా దాటిపోయి నిర్గుణ నిరాకార బ్రహ్మ యొక్క భావన చేసినప్పుడు అది పరిపూర్ణమవుతుంది.

అప్పుడది ఉపాసన కాదు. జ్ఞానమౌతుంది.

ఈ కర్మ, ఉపాసనలను రెండింటినీ మొదటి ఐదు అధ్యాయాలలో వర్ణించి, వాటికి లక్ష్యమైన ఆత్మ జ్ఞానాన్ని 6,7,8అధ్యాయాలలో వివరించారు.

మనం తిరిగి రెండవ ప్రపాఠకానికి వద్దాం. పంచ విధ సామగానాన్ని చదువుకొనే ముందు కొన్ని ఉపాసనా సంబంధ పదజాలాన్ని అర్ధం చేసుకుందాం.

హింకారము: దీర్ఘముతో పాడుట లేక కూయుట.

ప్రస్తావము: ఒక కార్యమును చేయుటకు చేయు ప్రసంగము. ప్రసంగము ద్వారా కొనియాడడం.

ఉద్గీథము: ఓంకార అనుష్ఠానమును (గానమును) ప్రాణమును ఆధారముగా చేసుకొని చేయడం.

ప్రతిహారము: ప్రతీహారము ఎవరయితే వారు నూతనముగా వచ్చిన వానిని అడ్డగిస్తారు.

నిధనము: ధన సంబంధము లేనిది; దీని వలన ధనము పోవును కనుక అది నిధనము.

ఇవే ఐదు విధాలయిన సామగాన పద్ధతులు.

సామగానము తో అర్ధిస్తున్నారని ఎవరైనా చెబితే వాళ్ళు సద్బుద్ధితో గానమును చేస్తున్నారు. ఈ గాన శ్రవణం మనకందరకూ పుణ్యప్రదము అని అర్ధము.

వచ్చే భాగంలో పంచవిధ సామగానాన్ని ఊర్ధ్వ లోకాలు గాను, అధో లోకాలుగాను, వర్షము గాను, జలము గాను, ఋతువులుగాను, పశు సంతతిగాను, ప్రాణులు గాను భావించి ఏరకంగా చేసేరో తెలుసుకుందాం.

104. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

లోకేషు పఞ్చ విధం సామోపాసీత-

ఊర్ధ్వ అధో లోకాలలో సామ గాననాన్ని ఐదు విధాలుగా ఎలా ఉపాసించాలో సాంకేతికంగా చెప్పేరు కాని సాధనా పద్ధతులు మాత్రం ఈ మంత్రాలలో వివరించలేదు.

బహుశా ఆకాలంలో యజ్ఞ యాగాది క్రతువులతో కలిపి చేసే ఈ సాధనలన్నీ విస్తారంగా ప్రాచుర్యంలో ఉండి ఉండొచ్చు.

పృథివీ హింకారః అగ్ని ప్రస్తావోఽన్తరిక్ష ముద్గీథ ఆదిత్యః ప్రతీహారో ద్యౌర్ని ధన మిత్యూర్ధ్యేషు।।

ఊర్ధ్వ లోకాల గురించి శ్రద్ధగా ధ్యానం చేసేప్పుడు పృథివి ని హీంకారముగా; అగ్నిని ప్రస్తావముగా; ఆకాశమును ఉద్గీథముగా; సూర్యుని ప్రతీహారము గా స్వర్గమును నిధనము గా గ్రహించి ధ్యానము చేయాలి.

అధో లోకాల గురించి చేసే ధ్యానము లో స్వర్గము యొక్క స్వరం హీంకారము; సూర్య స్వరం ప్రస్తావము; ఆకాశ స్వరము ఉద్గీథము; అగ్ని యొక్క స్వరం ప్రతీహారము; భూమి యొక్క స్వరం నిధనము గా గుర్తించి ధ్యానించాలి.

పంచవిధ సామాలను వర్షాలుగా భావిస్తూ ఉపాసించేటప్పుడు వాయువును హింకారంగాను; మేఘాలను ప్రస్తావంగా; వర్షాన్ని ఉద్గీథం గా; మెరుపులను పిడుగులను ప్రతిహారం గా; వర్షం విరమించడాన్ని నిధనంగా భావించాలి.

ఇలా పంచవిధ సామాలను గానం చేయడం వల్లనే వర్షాలు కురుస్తున్నాయి. కనుక వర్షాలు కురవడానికి కారణం పంచవిధ సామ గానమే..

ఇలాగే జలాన్ని గురించి, ఋతువులగురించి, పసువుల గురించిచెబుతూ చివరగా అన్నిటి కన్నా శ్రేష్టమని

ప్రాణేషు పఞ్చవిధం పరోవరీయ స్సామోపాసీత
ప్రాణో హింకారో వాక్ ప్రస్తావ శ్చక్షు రుద్గీథః
శ్రోత్రం ప్రతిహారో మనోనిధనం పరోవరీయాంసి వా ఏతాని।।

సర్వ శ్రేష్ఠమైన ప్రాణాల పంచవిధ సామోపాసనలో ప్రాణ వాయువు హింకారం; వాణి ప్రస్తావం; చక్షు ఉద్గీథం; శ్రోత ప్రతిహారం; మనస్సు నిధనం అని చెప్పబడ్డాయి.

హింకారం మూలస్థానాన్ని, అంతర్ముఖత్వాన్ని సూచిస్తుంది. తనలోని భావాలను ప్రాణ వాయువు వాక్కు ద్వారా వ్యక్తీకరిస్తుంది. అందువల్ల వాక్కు ప్రస్తావం. వాణి ప్రస్తావం కన్నుల ద్వారా తెలుసుకుంటుంది.(వస్తువుల రూపం, రంగు, గాత్రం మొదలయినవి). అందువల్ల చక్షు ఉద్గీథం జ్ఞానానికి స్థూల సాధన. ఇంకొక ఇంద్రియం చెవి ద్వారా స్వీకరించే జ్ఞానం కాబట్టి చెవి ప్రతీహారం. ఇవన్నీ కలిసి చేరే స్థానం మనస్సు కావడం వల్ల అది నిధనమౌతుంది.

వచ్చే భాగం లో సప్త విధ సామోపాసన, రథంతర సామోపాసన, వామదేవ సామోపాసన, బృహత్సామోపాసన మొదలైన మరెన్నో సామోపాసనల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.

105. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

ద్వితీయ ప్రపాఠకం, అష్టమ నవమ ఖండాలలో సప్తవిధ సామగానాన్ని వివరించారు.

పంచవిధసామోపాసనలో ఉండే హింకారం, ప్రస్తావం, ఉద్గీథం, ప్రతిహారం, నిధనం అనే ఐదు విధానాలకు ఆది, ఉపద్రవం అనే రెండు పద్ధతులు చేర్చి సప్తవిధ సామగానం అన్నారు.

సప్తవిధ సామోపాసన ను వాక్కు గా భావించి సామగానం చేసేవారికి వాగామృతం లభిస్తుంది. సమృద్ధిగా అన్న సంపద దొరుకుతుంది.

ఇప్పుడు సప్తవిధ సామగానం ప్రకాశించే సూర్యునిగా ధ్యానిస్తారు. ఇక్కడ సప్త విధాల సామాలను ఎలా ధ్యానం చేసేరో వివరిస్తున్నారు.

సూర్యుడే సామగానం. అతను అందరకీ సమానంగా తన ప్రకాశాన్ని అందిస్తున్నాడు. సకల జీవులు ఆయన మీదనే ఆధారపడి ఉన్నాయి.

1. ఉదయించడానికి ముందున్న సూర్యుడు హింకార స్వరూపుడు. జంతువులన్నీ ఆ హింకారము మీదే ఆధారపడి ఉన్నాయి. ఆ జంతువులన్నీ సామం లో ఉన్న హింకార శబ్దాన్ని చేస్తున్నాయి. అదీ సూర్యోదయానికి ముందుగానే చేస్తున్నాయి.

2. సూర్యోదయమయిన తరువాత ప్రకాశించే సూర్యుణ్ణి ప్రస్తావం అంటారు. మానవులందరూ ఈ ఉదయించిన ప్రస్తావ సూర్యుడి మీదే ఆధార పడి ఉన్నారు. ప్రస్తావములో భాగము గా ఉన్న సామగానాన్ని ప్రత్యక్షము గాను, పరోక్షము గాను తమ తమ కోరికలు తీర్చుకోవడం కొరకు చేస్తున్నారు.

3. సూర్యకిరణాలన్నీ పూర్తిగా విజృంభించి ప్రకాశిస్తున్నప్పుడు ఆ సూర్యుణ్ణి ‘ఆది’ అంటారు. అలా ప్రకాశించే సూర్యుడి మీద పక్షులన్నీ ఆధారపడి ఉన్నాయి. ఆ ‘ఆది’ లో భాగంగా ఉన్న సామగాన బలం తో పక్షులన్నీ ఆకాశం లో ఎగర గలుగు తున్నాయి.

4. అథ యత్సంప్రతి మధ్యన్దినే స ఉద్గీథ స్తదస్య దేవా అన్వాయత్తా స్తస్మాత్తే సత్తమాః ప్రజాపత్యానా ముద్గీథభాజినోహ్యేతస్య సామ్నః।।

మధ్యందిన సూర్యుణ్ణి ఉద్గీథం అంటారు. ఈ మధ్యాన్న కాలం లో ప్రకాశించే సూర్యుడి ఆకారం మీద దేవతలంతా ఆధారపడి ఉన్నారు. ఉద్గీథం లోని భాగాలయిన సామాలను గానం చేసి దేవతలందరూ ప్రజాపతి పుత్రులుగా ప్రకాశిస్తున్నారు.

5. మధ్యాహ్నం గడిచిన వెంటనే ప్రకాశించే సూర్యుణ్ణి ప్రతీహారం అంటారు. ఈ ప్రతీహార రూపం లో ఉన్న సూర్యుడి మీద గర్భస్త పిండాలు ఆధారపడి ఉన్నాయి. ప్రతీహారం లో భాగమైన సామాల వల్ల గర్భం లో ఉండే పిండాలు క్రింద పడిపోకుండా రక్షించబడుతున్నాయి.

6. అస్తమించడానికి కొంచెం ముందు ఉండే రూపాన్ని ‘ఉపద్రవం’ అంటారు. ఈ ఉపద్రవ రూపం లో ఉన్న సూర్యుడిమీద క్రూరమృగాలు ఆధారపడి ఉన్నాయి. ఉపద్రవ రూపం లో భాగం గా ఉన్న సామాలవల్ల ఆ క్రూర మృగాలు శక్తిని కలిగి తమని తాము రక్షించు కోగలుగుతున్నాయి.

7. అస్తమయం అయిన వెంటనే ప్రకాశించు సూర్యుడు నిధనము అనబడతాడు. నిధన రూపం లో ఉన్న ఈ సూర్యుడి మీద పితృదేవతలు ఆధారపడి ఉన్నారు. నిధనం లో భాగంగా ఉన్న సామాల వల్ల పిండ రూపం లో పితృదేవతలు పోషింపబడుతున్నారు.

ఇలా వేర్వేరు సమయాల్లో ఆదిత్యోపాసన చేయడం వల్ల పొందే ఫలాలు వేరు వేరు గా ఉంటాయి అని తెలుస్తోంది.

ఈ విధం గా సప్తవిధ సామగానాలకు అధిపతిగా ప్రకాశించే సూర్యుడిగా భావిస్తూ గానం చేస్తున్నారు.

ప్రాణేంద్రియములలో సంచరించేది గాయత్రి సామము. దీనిని తెలుసుకొన్నవారికి సర్వేంద్రియ శక్తి, పూర్ణాయుర్దాయము, సత్కీర్తి కలిగి మంచి సంతానము, పసు సంపద కలుగుతాయి.

అగ్నిలో నుంచి ఉద్భవించేది రథంతర సామము. దీనిని తెలుసుకొన్న వాళ్ళు బుద్ధిబలం తో ప్రకాశిస్తారు. మంచి జీర్ణ శక్తి కలిగి వూర్ణాయుర్దాయము తో జీవిస్తారు.

గాలి నీరు యొక్క మిథునం నుండి పుట్టినది వామ దేవ్యసామము. దీనిని తెలుసుకొన్న వారు ఉత్తమ దంపతులై మంచి సంతానాన్ని పొందుతారు. పరకాంతలను పర ధనములను ఆశించక యుండుటయే వారి వ్రతము.

106. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

వైరూప సామగానము మేఘాలకు సంబంధించినది. ఎవరైతే వర్షము మేఘములకు సంబంధించిన సామగానము వాళ్ళు పసు సంపదను సమృద్ధిగా కలిగి దీర్ఘకాలము జీవిస్తున్నారు. వర్షించే మేఘాలలోదోషాలను ఎంచకుండా ఉండటమే వారి వ్రతం.

మేఘాలు వివిధ రూపాలుగా వర్ణాలుగా కన్పించటం వల్ల దీనిని వైరూప సామము గా వర్ణించి చెప్పేరు.

ఋతువులకు సంబంధించిన సామగానాన్ని వైరాజ సామగానము అంటారు. ఈ సామగాన సాధకులు బుద్ధిబలము తో విజ్ఞానముతో, గొప్ప కీర్తితో ఉంటారు. ఋతు ధర్మములలో దోషము లెంచకుండా ఉండడమే వారి వ్రతం.

లోకాలకు సంబంధించిన సామగానము ను శక్వరీ సామగానం అంటారు. దీనిని సాధన చేసేవాళ్ళు పూర్తి జీవితాన్ని అనుభవిస్తున్నారు. లోకాలలో దోషాల నెంచకుండా ఉండడమే వారి వ్రతము.

పశువులకు సంబంధించిన రేవతీ సామగానాన్ని చేసేవాళ్ళు సుసంతానము తో పశుసంతతి తో గొప్ప కీర్తిని కలిగి ఉంటారు. పశువులలో దోషము లెంచకుండా ఉండడమే వారి వ్రతము.

యజ్ఞాయజ్ఞీయ సామగానం అంటే శరీర అవయవములకు సంబంధించిన సామగానం. ఈ సామగాన వ్రతులు మంచి దేహేంద్రియ బలాన్ని కలిగి ఉంటారు. ఒక సంవత్సరం కాని, జీవితాంతం వరకూ గాని మత్స్య మాంసములను తినకుండా ఉండటమే వారి వ్రతము.

ఇంక దేవతలకు సంబంధించిన రాజన సామగానము (బ్రాహ్మణులలో దోషములనెంచకుండా ఉండడమే వారి వ్రతం);

సర్వ వస్తువులకు సంబంధించిన సామగానము (సర్వము నేనుగా ఉన్నాను అని ధ్యానం చేయడమే వీరి వ్రతము) ల గురించి చెప్పేరు.

ఆ తర్వాత పశువులకు శుభకరమైన వినర్ది గుణము తో కూడిన సామోపాసన ను వివరించేరు.

వినర్ది సామ్నో వృణేపశవ్య మిత్యగ్నే రుద్గీథో నిరుక్తః ప్రజాపతే ర్నిరుక్త స్సోమస్య మృదుశ్లక్ష్ణం వాయో శ్శ్లక్ష్ణం బలవదిన్ద్రస్య క్రౌఞ్చం బృహస్పతే రప ధ్వాన్తం వరుణస్యతా స్సర్వానేవోప సేవేత వారుణం త్వేవ వర్జయేత్।।

అగ్ని గురించి చేసే ఉద్గీథము మన అవయవాలను ఉత్తేజ పరచేదిగాను స్పష్ఠమైన పెద్ద శబ్దము తోను ఉండాలి.

ప్రజాపతి గురించి చేసే సామగాన శబ్దము నిర్దుష్టము గా ఇది అని లేకుండా అనిరుక్త శబ్దము గా సాధన ఉండాలి.

చంద్రుని కొరకు నిర్దిష్టమైన నిరుక్త శబ్దాన్ని సాధన చేయాలి.

మృదువు గాను కఠినము గాను చేసే శబ్దం యొక్క సాధన వాయువును ప్రత్యక్ష పరుస్తుంది.

ఇంద్రుని (శుక్ల స్థానము) మెప్పించడానికి మృదువైన మరియు శక్తిమంతమైన శబ్దాన్ని సాధన చేయాలి.

బృహస్పతి కై క్రౌంచ పక్షి కూతలా శబ్దం సాధన చేయాలి.

పగిలిన కాంస్య పాత్ర నుంచి వచ్చే శబ్దంలా హీనం గా ఉండే శబ్దముతో సామగాన సాధన వరుణుని కొరకు చేయాలి.

నిజంగా చెప్పాలంటే వరుణుని కొరకై చేసే శబ్దాన్ని సాధన చేయక్కర్లేదు.

ప్రాణాయామ ప్రక్రియ లో నిర్దిష్టమైన శబ్ద సాధన ద్వారా ఆ శబ్దానికి అధిపతి అయిన దేవతయొక్క అనుగ్రహ ప్రాప్తి లభిస్తుందని చెబుతున్న ఈ మంత్రం సాధనా ప్రక్రియ లో అత్యంత కీలకమైనది.

దీనిని మరింత లోతు గా అధ్యయనం చేయడంద్వారా త్వరిత గతిలో సాధనలో ప్రగతి దొరుకుతుందనడంలో ఏ సంశయము అక్కరలేదు.

వచ్చే మంత్రములో సర్వే స్వరా ఘోషవంతో బలవంతో వక్తవ్యా ఇంద్రే బలం దదానీతి।।

సర్వ స్వరాలను ఘోషించేందుకు కావలసిన శక్తి కి కారణమైన ఇంద్రునికి (శుక్లానికి) నేను బలాన్ని అందిస్తున్నాను అంటూ సామ గానం లోని సర్వ స్వరాలు దేవేంద్రుని రూపాలే అంటూ చెప్పే విషయాలు తెలుసుకుందాం.

107. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

సర్వే స్వరా ఘోషవంతో బలవంతో వక్తవ్యా ఇంద్రే బలం దదానీతి।।

అన్ని స్వరాలు దేవేంద్రుని రూపాలు. అన్ని ఊష్మాణాలు ప్రజాపతి రూపాలు. అన్ని స్పర్శలు మృత్యుదేవత యొక్క రూపాలు. సర్వ స్వరాలను ఘోషించేందుకు శక్తి కి కారణమైన ఇంద్రునికి (శుక్లం) నేను బలాన్ని అందిస్తున్నాను.

సర్వ ఊష్మాణో గ్రస్తా నిరస్తా వివృత్తా
వక్తవ్యా ప్రజాపతే రాత్మానం పరి దదానీతి।।

అన్ని ఊష్మాణములు అగ్రస్తములుగా, అనిరస్తములుగా, వివృతములుగా భావన చేసి పలకాలి. అంటే అన్ని అచ్చులు ఘోషయుక్తముగా ప్రతిధ్వనించేటట్లుగా బలముగా ఉచ్ఛరించాలి.

ప్రజాపతికి (ప్రాణశక్తి) నేను నన్ను (ఇచ్ఛ – మనస్సు) సమర్పిస్తున్నామని చెబుతున్నారు మహర్షులు. వీటిలో సామగానాన్ని చేసే వివిధ రీతులు, కావలసిన కామ్య సాధన విధానాలు, మంత్ర ఉచ్ఛారణ వివరింపబడ్డాయి.

రెండవ ప్రపాఠకం లో 23 వ ఖండం లో ధర్మం గురించి వివరణ ఇలా ఉంది.

త్రయో ధర్మ స్కంధా యజ్ఞోధ్యయనం
దానమితి ప్రధమ స్తప ఏవ ద్వితీయో
బ్రహ్మ చార్యా చార్యకులవాసీ తృతీయో
త్యంతమాత్మానమాచార్య కులే వసా
దయ న్సర్వ ఏతే పుణ్యలోకా భవంతి
బ్రహ్మ సంస్థో మృతత్వ మేతి।।

ధర్మములు మూడు రూపములుగా ఉన్నాయి. మొదటి ధర్మము యజ్ఞం (కామ్యాదులు), అధ్యయనం (గ్రంథాలు), దానములతో కూడినది మొదటిది. ఇవి ముందుగా చేయవలసినవి.

రెండవ ధర్మము తపస్సు (జ్ఞానం కోసం పరితపించేది). మరియు బ్రహ్మ చర్య వ్రతము.

ఆచార్యుల నుంచి విద్య ను పొంది బ్రహ్మనిష్ఠను అభ్యసిస్తూ గురుసన్నిధిలో ఉండడం మూడవ ధర్మం. అంటే గురుకుల వాసం, గురు శుశ్రూష ఆచరించవలసినవి.

ఈ మూడు ధర్మాలను ఆచరించే వాళ్ళు పుణ్య లోకాలను సత్వరం పొందుతారు. జ్ఞానిగా బ్రహ్మనిష్ఠ లో ఉండేవాడు అమృతత్వాన్ని (మోక్షాన్ని) పొందుతాడు.

ప్రజాపతి కూడా ఓంకార జ్ఞానానికై తపించిన వేళ, ముందుగా ఋక్కు, యజుస్సు, సామాలతో మొదలయి భూః, భువః, సువః అనే అక్షరముల జ్ఞానాన్ని పొంది, వాటియొక్క ఐక్యతనుండే సారవంతమైన ఓం కార జ్ఞానాన్ని పొందగలిగాడు.

రంగు లేదా వర్ణము యొక్క జీవకణాలు వర్ణము నందంతటా వ్యాప్తి చెందినట్లు , అక్షరము లన్నింటిలోను ఓంకారము వ్యాపించి ఉంది. అందుకే ఓం కారమే (ప్రణవమే) అన్నిటికీ ఆధారము, తారకమూ అయి ఉంది అని మహర్షులంటారు.

ద్వితీయ ప్రపాఠకం 24వ ఖండం లో మొదలైన సవన విధులు, త్రేతాగ్నుల ఉపాసనా విధానాల ద్వారా యజ్ఞ కర్త పొంద గలిగే లాభాలు తృతీయ ప్రపాఠకం లో వివరింపబడ్డాయి.

త్రివేణీ సంగమ స్నానం ముగించుకొని, కాశీ విశ్వేశ్వరుని సన్నిధినుంచి వెలువడుతూందీ ఉపనిషత్ భాగం.

108. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

మూడవ ప్రపాఠకం లో సూర్యుడి లో మధువును ఆరోపిస్తూ మధు విద్యను వివరించారు.

ఈ మధు సిద్ధాన్తాన్ని హిరణ్య గర్భుడు ప్రజాపతికి బోధిస్తే ప్రజాపతి మనువుకు, మనువు ప్రజలకు (శిష్యులకు) బోధించేడు. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మ తన ప్రధమ పుత్రుడగు ఉద్దాలక అరుణి కి చెప్పేడు. ఈ మధు విజ్ఞానాన్ని తండ్రి తన ప్రధమ పుత్రునికి గాని, ముఖ్య శిష్యునికి గాని బోధించ వచ్చు.

ప్రకాశించే సూర్యుడే దేవతలకు మధువు. ఆ మధువుతో స్వర్గము నకు చేరవచ్చును. ఆకాశమే మధువునకాధారము. సూర్య కిరణములే మధుపుత్రులు. సూర్యుడి యొక్క తూర్పు కిరణాలే తూర్పులో ఉండే మధునాడులు. ఋక్కులు మధుపములు. ఋగ్వేద యజ్ఞం లోని జలములే అమృతము.

ఋగ్వేదం ఆరంభం లో ఉదయించే సూర్యుణ్ణి వర్ణించిన వైనం అతి మధురం.

ఆ మధుపాలే (ఋక్కులు) ఋగ్వేదాన్ని పలుకుతాయి. అలా పలికేటప్పుడు ఆ మధుపములనుండి రసము, కీర్తి, ప్రకాశము, ఇంద్రియబలం, తినడానికి ఆహారం లభిస్తాయి.

ఆ మధుపాల నుండి జాలువారిన రసం ఆదిత్యుని చుట్టూ పడి అరుణ రూపం లా కనబడుతుంది.

అమృతమంటే పై విధి నుంచి జనించిన కనిపించని ఫలితము. ఈ అదృష్ట ఫలితమే చివరకు మోక్షానికి కారణమవుతుంది.

సూర్యుడి యొక్క ఒక్కొక్క కిరణము ఒక గ్రహము ఆవిర్భావానికి తోడ్పడినట్లు మనం ఆదిత్య హృదయం లో చదువుకున్నాము.

ఇక్కడ ఆదిత్యోపాసనలో ఒక్కొక్క దిక్కు ఒకరకమైన మధునాడులుగా పేర్కొని చేసే ఉపాసనను నర్మగర్భం గా చెప్పేరు.

ఆదిత్యుని దక్షిణ కిరణాలు దక్షిణ మధునాడులు; పశ్చిమ దిక్ కిరణాలు వడమటి మధు నాడులు; ఉత్తర దిక్కు మధు నాడులు ఉదీచీ మధు నాడులు; ఊర్ధ్వ కిరణాలు తేనెతుట్టెలు గా చెబుతూ చేసిన రహస్య బోధలు ప్రణవాన్నే ఆలింగనం చేస్తున్నాయి.

షష్ఠ ఖండం లో

తద్యత్ ప్రధమ మమృతం తద్వసన ఉపజీవ న్త్యగ్ని నా ముఖేన నవై దేవా అశ్నన్తి న పిబ న్త్యేతదేవామృతం దృష్ట్వా తృప్యన్తి।।

సూర్యుడి అరుణ రూపంలో ఉన్నది మొదటి అమృతము. అగ్నిదేవుని నాయకునిగా ఆ అమృతాన్ని వసువులు అనుభవిస్తున్నారు. అందువల్ల ఉదయపు సవనము వసువుల నిమిత్తమై చేయాలన్నారు.

దేవతలు ఈ అమృత పానాన్ని చూసి ఆనందిస్తున్నారు.దేవతలకు ఆకలి దప్పికలు లేవు. వాళ్ళు ఇంద్రియాలతో అనుభవించి తృప్తి పడతారు.

సూర్యుని యొక్క ద్వితీయము మరియు తెల్లని రూపము రెండవ అమృతము. ఈ అమృతాన్ని ఇంద్రుడు నాయకుడుగా రుద్రులు అనుభ విస్తున్నారు.

సూర్యుని యొక్క తృతీయ రూపం మూడవ అమృతము. దానికి వరుణుడు నాయకుడుగా ఆదిత్యులు ఆ అమృతాన్ని అనుభవిస్తున్నారు.

సూర్యుని నాల్గవ మరియు నల్లని రూపము నాల్గవ అమృతము. దానికి సోముడు (చంద్రుడు) నాయకుడుగా మరుత్తులు ఆ అమృతాన్ని అనుభవిస్తున్నారు. ఈ ఖండంలో మరుద్గణముల కు జీవనాశ్రయ భూతమైన చతుర్ధ అమృతో పాసన వివరింప బడింది.

చివరగా సూర్యభగవానుని లోపలనున్న రూపమే అయిదవ అమృతము. దీనికి ప్రణవము నాయకుడు గా సాధ్యులు ఈ అమృతాన్ని అనుభ విస్తున్నారు.

వచ్చే భాగం లో మధు విద్య లోని పంచ అమృతాలలోని వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు మరియు సాధ్యాల గురించి తెలుసుకొని, గాయత్రీ మంత్రం గురించిన వివరణ లోకి వెడదాము.

క్రితం రెండు వారాలలో వారణాసి, గయ, ప్రయాగ మొదలైన తీర్థయాత్ర ల వల్ల ఉపనిషత్తుల వివరణలో వచ్చిన అంతరాయానికి చింతిస్తూ తిరిగి చాందోగ్యోపనిషత్తును కొనసాగిస్తున్నాను.

108.a ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

మధు విద్య లోని పంచ అమృతాలలోని వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు మరియు సాధ్యులు అనే వారి వివరణ ఇలా ఉంది.

వసువులు అంటే ఎల్లప్పుడు ఉండేవారు కనుక వీరికి వసువులు అంటారు. (సదా వసన్తీతి వసవః). వీరు ఎనిమిది మంది. వీరి పేర్లు ధృవుడు, ధరుడు, సోముడు, ఆపుడు, వైశ్వానరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. సూర్యుడే వీరందరకూ అంతరాత్మ.

సాధ్యులు అంటే సిద్ధులు కలవారు అని అర్ధం. వీరు పన్నెండు మంది. వీరందరూ బ్రహ్మ యొక్క ముఖం నుండి పుట్టిన వారు. వీరు మంత్ర శరీరులు, వీరి పేర్లు మనువు, మంత్రుడు, ప్రాణదుడు, చేతయానుడు, వీర్యవంతుడు, విత్తి, జయుడు, నయుడు, హంసుడు, నారాయణుడు, ప్రభువు, విదువు (వాయు పురాణం నుంచి).

రుద్రులు అంటే “రోదయంత్య సురానితి రుద్రాః” – దుష్టులను దుఃఖింప జేయు వారు. వీరు పదకొండు మంది. అజుడు, ఏకపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు అనేవాళ్ళు పదకొండుమంది రుద్రులు.

ఆదిత్యులంటే ఇంద్రుడు, ధాత, భగుడు, పూషా, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, అంశుమంతుడు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు అనే పన్నెండుమంది. వీరినే ద్వాదశాదిత్యులంటారు.

మరుత్తులు అంటే “మ్రియన్తేనకదాచిదితి మరుతః” – ఎన్నడూ మరణించని వారైనందున వారిని మరుత్తులన్నారు. మరుత్తులు ఏడుగురు.
వారి పేర్లు ఆవహము, ప్రవహము, సంవహము, ఉద్వహము, వివహము, పరివహము, పరావహము అనే మారుత స్కంధములు.

కాని వాయు పురాణం శుక్రజ్యోతి మొదలుగాగల మరుత్తులు 49 అంటుంది.

వచ్చే భాగం లో గాయత్రీ మంత్ర వివరణ లోకి వెడదాము.

109. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

తృతీయప్రపాఠకం, ఏకాదశ ఖండం లో:

సూర్యుని కిరణాలన్నీ మధు నాడులు కాగా, సూర్యుడి రూపాలన్నీ అమృత తుల్యాలయ్యాయి.

సూర్యోపాసన లో ఒక్కొక్క కిరణాన్ని విడిగా కేంద్రీకరించి ఉపాసన చేస్తున్నారు. సూర్యుని ఒక్కొక్క రూపాన్ని విడిగా కేంద్రీకరించి సాధన చేస్తున్నారు. సూర్యుడి లోని సప్త వర్ణాలలో ఒక్కొక్క రంగుని విడిగా ఉపాసించి ఫలితాలను పొందుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయం సమయాలలో ఉపాసిస్తున్నారు. అనన్త శక్తి క్షేత్రమైన ఆదిత్యుని ఉపాసన ద్వారా పొందలేనిది లేదనేది తేటతెల్లము.

ఈ మధువిద్యా సాధకులు సాధనలో తమ తమ సూక్ష్మ శరీరాలతో భూకక్ష్యను దాటి విశ్వాంతరాళంలోకి చేరిన వేళ, వారు చూచిన ఆ ఆదిత్యుని రూపాన్ని వర్ణిస్తున్నారు.

అథ తత ఊర్ధ్వ ఉదేత్య నై వోదేతా నాస్త మేతైకల ఏవ మధ్యే స్థాతా త దేశ శ్లోకః ।

తరువాత సూర్యుడు ఊర్ధ్వ దిశగా చాలా దూరం వెళ్ళి అక్కడ ఉదయించ కుండా అస్తమించ కుండా స్థిరం గా ప్రకాశిస్తున్నాడు. అక్కడ మధ్య భాగం లో నివసిస్తున్నాడు. ఆ విషయాన్ని ఈ క్రింది మంత్రాలు చెబుతున్నాయి.

న వైతత్ర న నిమ్లోచ నోదియాయ కదాచన దేవాస్తేనాహం సత్యేనమా విరాధిషి బ్రహ్మణేతి।।

ఓ దేవతలారా। ఆదిత్యుడు అక్కడ ఏమీ చేయడు. అక్కడ ఉదయించడం అస్తమించడం అనే పనులేవీ ఉండవు. నేనీ యదార్ధాన్ని చెప్పినందువల్ల ఆ పరబ్రహ్మము నుండి నేను కిందికి దిగి రాకుండా ఉందును గాక।

సహవా అస్మా ఉదేతి ననిమ్లోచతి సకృద్దివా హైవాస్మై భవతి య ఏతామేవం బ్రహ్మౌపనిషదం వేద।

సూర్యుడు తన కోసం ఉదయించడం లేదు. అస్తమించడం లేదు అనే ఈ వేద రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతనికి రోజంతా ప్రకాశమే. ఇదే మధు సిద్ధాన్తము.

ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాలన్నిటినీ కలిపి గాయత్రి అంటారు. వాక్కు గాయత్రి స్వరూపం. “గాయతి చ త్రాయతే చ” గానం చేయడం వల్ల రక్షించేది గాయత్రి అని వర్ణించారు మహర్షులు.

ద్వాదశ ఖండం:

యావై సా గాయత్రీ యం వా వసాయేయం పృథివ్యస్యాం హీదం సర్వం భూతం ప్రతిష్ఠిత మేతామేవ నాతిశీయతే।

ఈ భూమి మొత్తం గాయత్రియే. ఈ భూమి పైనే సర్వ జీవులు నివసిస్తున్నాయి తప్ప మరెక్కడికీ పోవడం లేదు. ఈ పృథివి సర్వమూ గాయత్రి.

ఈ శరీరం గాయత్రి. ఈ శరీరం లో ఉన్న ఇంద్రియాలన్నీ భూమికి సంబంధించినవే. అవి ఎక్కడకీ పోలేవు.

సైషా చతుష్పదా షడ్విధా గాయత్రీ తదేత దృచాభ్యసూక్తమ్।

ఈ ప్రశస్తమైన గాయత్రి నాలుగు పాదములు గాను, ఆరు అక్షరాలు గాను ఉంది.

గాయత్రీ మంత్రములోని పాదమునకు 6 అక్షరముల చొప్పున నాలుగు పాదములు కలిపి 24 అక్షరములుగా ఉంది.

తావా నస్య మహిమా తతో జ్యాయాంశ్చ పూరుషః

గాయత్రీ బ్రహ్మం ఎంతో గొప్ప మహిమ కలిగి ఉంది.
పురుషుడు(పురుషరూపి పరమాత్మ) అంత కన్నా మహిమ కలవాడు.

పాదోస్య సర్వా భూతాని త్రిపాదస్యామృతం దివీతి।

ఈ సకల జగత్తు ఆ పరమ పురుషునిలో (పరమాత్మలో) నాలుగో వంతయితే, మిగిలిన మూడు భాగాలు ఆ విరాట్ పురుషుడి లోకంలో అమృతమయంగా ఉన్నాయి.

ఇంచుమించు ఇదే మంత్రం పురుషసూక్తం లో చెప్పబడింది.

గాయత్రీ మంత్ర వివరణ ఇలా కొనసాగుతోంది.

110. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

ఆ పరబ్రహ్మమే ఈ శరీరం చుట్టూ వ్యాపించి యున్న ఆకాశంగా ఉంది. పరబ్రహ్మ రూపంలో ఉన్న ఆ ఆకాశం ఈ శరీరం లోపలంతా కూడా వ్యాపించి ఉంది.

శరీరం లో అలా వ్యాపించి ఉన్న బ్రహ్మాకాశమే హృదయంలో కూడా వ్యాపించి ఉంది. అంటే ఈ పరబ్రహ్మం అనేది ఏ మార్పు లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంది.

(ఇక్కడ హృదయమని చెప్పబడే అవయవము మన రక్తప్రసరణకు ఉపయోగపడే గుండె కాదు. మన నాడీ వ్యవస్థకు మూలాధారమైన ఆ మస్తిష్కము నందలి కేంద్రస్థానము.)

ఈ విధం గా చెప్పిన బ్రహ్మ అనే ఆకాశం నివసిస్తున్న ఆ హృదయానికి దేవతలచే రక్షింపబడుతున్న అయిదు ద్వారాలున్నాయి

ఆ ద్వారాలలో తూర్పు ద్వారం లో నివసించేవాడు ప్రాణము. అతడే నేత్రము. అతడే సూర్యుడు. ఈ ప్రాణబ్రహ్మను ప్రకాశం గా ధ్యానించాలి. ఆహారదాతగా ధ్యానించాలి.

హృదయము యొక్క దక్షిణ ద్వారములో నివసించువాడు వ్యానము. అతడే చెవి. అతడే చంద్రుడు. ఈ వ్యాన బ్రహ్మమును ఐశ్వర్యముగా కీర్తిప్రదాతగా థ్యానించాలి.

హృదయము యొక్క పశ్చిమ ద్వారం లో నివసించే వాడు అపానము. ఈతడే వాక్కు. ఈతడే అగ్ని. ఈ అపాన బ్రహ్మము ను వర్చస్సు గాను అన్నదాత గాను ధ్యానించాలి.

హృదయము యొక్క ఉత్తరద్వారము లో నివసించువాడు సమానము. ఈతడే మనస్సు. ఈతడే పర్జన్యుడు. సమాన బ్రహ్మమును కీర్తి గాను అనుగ్రహము గాను ధ్యానించాలి.

హృదయము యొక్క ఊర్ధ్వద్వారము లో నివసించువాడు ఉదానము. ఈతడే వాయువు. ఈతడే ఆకాశము. ఈ ఉదాన బ్రహ్మమును బలము గాను వినయము గాను ఉపాసించాలి.

ఈ ఐదుగురు బ్రహ్మ పురుషులు. స్వర్గలోక ద్వారపాలకులు. ఇక్కడ ప్రాణము కళ్ళు అయితే, వ్యానము చెవి అయ్యింది. అపానము వాక్కు అనబడితే సమానమును మనస్సు అన్నారు. చివరగా ఉదానము ఆకాశమయ్యింది.

ఇక్కడ బ్రహ్మమును వివరిస్తూ. ముందుగా ఆ పరబ్రహ్మమే మన శరీరం చుట్టూ బయట లోపల వ్యాపించి ఉందని చెప్పేరు. హృదయం లో కూడా అదే బ్రహ్మము వ్యాపించి ఉందని చెప్పేరు. ఆ హృదయం లో నలుమూలలా వ్యాపించి ఉన్న పంచ ప్రాణాలను ఐదుగురు బ్రహ్మ పురుషులుగా పేర్కొన్నారు.

ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ మన శరీరంలో ఏ రూపంలో నెలకొని ఉన్నాడు, ఏ పరిమాణం లో వెలుగొందు తున్నాడు అనే విషయాలు ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు.

ఇంతకు ముందు మనం ఆ విశ్వ చైతన్య శక్తి (సూర్యభగవానుడు) ఎల్లవేళల ఊర్ధ్వముగా ఉండి అక్కడ ఉదయ అస్తమయాలు లేకుండా జ్యోతి రూపములో ప్రకాశిస్తున్నట్లు చెప్పుకున్నాము.

ఇప్పుడు ఆ జ్యోతిని మన శరీరమునకు అన్వయిస్తున్నారు.

ఏ బ్రహ్మము యొక్క దివ్యజ్యోతి స్వర్గానికన్నా పైన, అన్ని లోకాలకన్నా పైన, అంటే ఈ విశాల విశ్వానికి పైన ఉత్తమ లోకాలలోను, ఉత్తమంకాని లోకాలలోను అంతటా ప్రకాశిస్తోందో, అదే పరంజ్యోతి ఈ మానవ శరీరం లోనూ ప్రకాశిస్తోంది.

ఆ పరంజ్యోతి మన శరీరం లో ప్రతిష్టితమైనట్లు ఎలా తెలుస్తోందంటే, మన శరీరాన్ని మరొకరు తాకినప్పుడు తెలుస్తోంది. ఈ ప్రకాశం మనం చెవులు మూసుకొన్నప్పుడు కూడా లోపల ఒక మంచి నాదం లా వినబడుతోంది. లేదా అగ్ని జ్వలిస్తున్న శబ్దంలా నైనా వినబడుతోంది.

మనం మన శరీరం లోపల చూసిన లేదా విన్న పరంజ్యోతిని అతి శ్రద్ధతో ధ్యానం చేయాలి.

మనం ప్రతిదినం వింటున్న, మననం చేస్తున్న లేదా జపిస్తున్న గాయత్రి యొక్క యదార్థ స్వరూపాన్ని అంచలంచెలుగా ఆ ఉపనిషదృషులు మన అవగాహన లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

సాధనలో సాగే ముముక్షువులకు అడుగడుగునా దారి చూపిస్తూ ఆత్మ దర్శనానికి, స్వరూప సందర్శనానికి అతి దగ్గరగా తీసుకొని పోతున్నారు.

ఈ ప్రత్యక్ష సాధనా మార్గాన్ని అర్ధం చేసుకొంటూ సాధనలో ముందుకు సాగే వారు నిజంగా ధన్యజీవులే.

కొంచెం శ్రద్ధగా రెండుమూడు సార్లు చదివి అర్ధం చేసుకోమని నా మనవి.

111. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

తృతీయ ప్రపాఠకం లో చతుర్దశ ఖండం:

సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాన్త ఉపాసీత అథఖలు క్రతుమయః పురుషో యధాక్రతు రస్మింల్లోకే పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి స క్రతుం కుర్వీత।।

నామ రూపాత్మకమైన ఈ జగత్తంతా ఆపరబ్రహ్మే అయిఉన్నాడు. సృష్టి, స్థితి లయాలు మూడు ఆ పరబ్రహ్మలోనే కలుగుతున్నాయి. అందువల్ల అందరూ ఎంతో శాంతమైన మనస్సుతో పరబ్రహ్మను ఉపాసించాలి.

ఆ పరమాత్మ సాక్షాత్తూ యజ్ఞ స్వరూపుడు. ఈలోకం లో మానవుడు ఎలాంటి కర్మలు చేస్తాడో అందుకు తగిన పుణ్యలోకాలను మరణానంతరము చేరుకుంటాడు.

మనోమయః ప్రాణ శరీరో భారూప స్సత్యసజ్న్కల్ప ఆకాశాత్మా సర్వకర్మా సర్వ కామ స్సర్వగన్ధ స్సర్వరస స్సర్వమిద మభ్యాత్తో వాక్యనాదరః।।

ఆ పరబ్రహ్మ మనోమయుడు. ప్రాణమే శరీరముగా గలవాడు. గొప్ప వెలుగుతో ప్రకాశించేవాడు. సత్య సంకల్పుడు. ఆకాశమే ఆత్మగా గలవాడు.

సర్వ కర్మలు, సర్వ కామములు, సర్వ రసగంధములు (శబ్ద, స్పర్శ,రూప,రస) అన్నీ ఆ పరబ్రహ్మమే. సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. వాక్కు మొదలైన ఇంద్రియాలు ఉన్నా లేకున్నా సర్వేంద్రియ కార్యములు చేయగలిగిన వాడు.

అందరి క్షేమాలు కోరుకునే ఆప్తకాముడు అవడం చేత ఆగ్రహం లేని వాడు (ఆగ్రహ సూన్యుడు).

(ఇవే విషయాలను ముండకోపనిషత్తులో2-2-4 లో. యః సర్వజ్ఞః సర్వ విద్యస్యైష మహిమా భువి। … మనోమయః ప్రాణ శరీర నేతా ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ.. అని చదువుకున్నాము.)

వచ్చే మంత్రములలో మానవుని హృదయాంతరాళంలో నివసించే పరమాత్మ ఎంత సూక్ష్మంగా ఉన్నాడో శాండిల్యముని వివరిస్తున్నారు. .

ఏష మ ఆత్మా న్తర్హృదయే ణీయాన్ వ్రీహేర్వా యవా ద్వా సర్షపా ద్వా శ్యామాకా ద్వా శ్యామాక తణ్డులా ద్వైషమ ఆత్మాన్తర్హృదయే జ్యాయాన్ పృథివ్యా జ్యాయాన్తరిక్షా జ్జ్యాయా న్దివో జ్యాయా నేభ్యో లోకేభ్యః।।

మానవుని హృదయాంతరాళం లో నివసించే పరమాత్మ నీవార ధాన్యం మొన కన్నా, వడ్లగింజ మొన కన్నా, ఆవాలగింజలో నున్న విత్తనం కంటే అత్యంత సూక్ష్మంగా ఉంటుంది.

నా హృదయమనే కమలం లో నివసించే పరమాత్మ ఈ భూగోళం కన్నా పెద్దది. ఆకాశం కన్నా పెద్దది. దేవలోకం కన్నా పెద్దది.

నా హృదయకమలం లో నివసించే పరమాత్మే ఈ సృష్టకర్త. సర్వ కామములు, సర్వ గంధములు, సర్వ రసములు ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. అతడే పరబ్రహ్మము.

ఇవే విషయాలు నారాయణ సూక్తం లో మరింత వివరంగా చెప్పబడ్డాయి.

పంచదశ ఖండం లో శాండిల్యముని వివరణ ఇలా కొనసాగిస్తున్నాడు.

అన్తరిక్షోదరఃకోశో భూమిబుధ్నో న జీర్యతి దిశో హ్యస్య స్రక్తయోద్యో రస్యోత్తరం బిలం స ఏష కోశో వసుధా న స్తస్మిన్ విశ్వ మిదం శ్రితమ్।।

ఈ విశాల విశ్వమంతా ఆకాశాన్ని ఉదరంగా (కడుపుగా), భూమిని పీఠం గా చేసుకొని వుండడం వల్ల ఇది ఎప్పటికీ నశించదు. ఈ విశ్వానికి దిక్కులు మూలలు.

ఈ విశ్వం యొక్క తూర్పు దిక్కు పేరు జుహూ. దక్షిణ దిక్కు పేరు సహమాన. పడమట దిక్కు పేరు రాజ్ఞీ. ఉత్తర దిక్కు పేరు సుభూత. స్వర్గము పైభాగము. ఈ విధం గా చెప్పబడిన విశ్వం సకల సంపదలకు ఆధారం.

ఈ దిక్కులకు వత్సము( దూడ) వాయువు. వాయువును అమరము గా తెలుసుకున్నవాడు తన పుత్రుని ఆయుర్దాయము కొరకై వాయుదేవుని ఆరాధించుచున్నాడు. తనయొక్క సమస్త కోరికల కొరకై ప్రాణ దేవతను శరణు కోరుచున్నాడు.

సృష్టిలో కనబడే అన్ని ప్రాణులూ ప్రాణమే. అందు వలననే ప్రాణమునే శరణు చెందితినని చెప్పియుంటిని. భూలోకమును ఆకాశమును స్వర్గమును శరణు పొందితిని. భువర్లోకమును అగ్నిని వాయువును సూర్యుని శరణుచెందితిని అని శాండిల్యముని ఉపాసనా విధానాన్ని తెలియ చేశాడు.

వచ్చే షోడశ సప్తదశ ఖండాలలో ఐతరేయ మహిదాసముని యజ్ఞ సిద్ధాంతాన్ని గాయత్రి తో పోల్చిన విధానాన్ని చూద్దాం.

112. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

ఈ రెండు ఖండాలలోను ఐతరేయ మహిదాస ముని మనిషి ఆయుర్దాయం లో మొదటి 24 వసంతాలు ప్రాతఃసవన గాయత్రి అని, తదుపరి 44 సంవత్సరాలు మధ్యాహ్న సవనమని, తరువాతి 48 సంవత్సరాలు సాయంసవనమని వివరించారు. ఈ విధంగా 116 సంవత్సరాలు జీవించి ఉన్నానని అంటారు.

పురుషో వావ యజ్ఞస్తస్య యాని చతుర్వింశతి వర్షాణి తత్ ప్రాత స్సవనం చతుర్వింశత్యక్షరా గాయత్రీ గాయత్రం ప్రాతస్సవనం తదస్య వసవో న్యాయత్తాః ప్రాణా వావ వసవ ఏతేహీదం సర్వం వాసయన్తి।।

యజ్ఞ రూపం గా ఉన్నవాడు పురుషుడు. ఆ పురుషుడు గడిపిన 24 సంవత్సరాలు ప్రాతఃకాల యజ్ఞం. అందుకే గాయత్రి మంత్రము లో 24 అక్షరాలు ఉన్నాయి.

ఈ ఉదయపు సవనం (యజ్ఞం) అనేది గాయత్రి మంత్రానికి సంబంధించినది. గాయత్రి మంత్రముతో వసువులకు కూడా సంబంధ ముంది. అంతటా వ్యాపించి ఉండేవి ప్రాణాలే కనుక ప్రాణాలే వసవులు.
(వసవులంటే ఎల్లప్పుడు ఉండేవి అని ఇంతకు ముందు చదువుకున్నాము.)

యజ్ఞ రూపం లో ఉన్న పురుషుడు తరువాత గడిపిన 44 సంవత్సరాలు మధ్యాహ్నిక సవనం. అందుకే త్రిష్టుప్ ఛందస్సు 44 అక్షరాలతో కూర్చబడి ఉంటుంది. ఈ మధ్యాహ్న సవనం త్రిష్టుప్ చందస్సుకి సంబంధించినది.

ఈ త్రిష్టుప్ చంధస్సుకి రుద్రులకీ అనుబంధం ఉంది. ఈ ప్రపంచానికే రోదనాన్ని కలిగించేవి ప్రాణాలు. కనుక ప్రాణాలే రుద్రులు.

యజ్ఞపురుషుడు తరువాత గడిపిన 48 సంత్సరాలు మూడో సవనం. అందుకే జగతి ఛందస్సుకి 48 అక్షరాలుంటాయి. ఈ జగతి ఛందస్సు ఆదిత్యులకు సంబంధించినది. సర్వాన్నీ గ్రహించే వారు ప్రాణదేవతలు, కనుక ప్రాణ దేవతలనే ఆదిత్యులు అన్నారు.

ఈ యజ్ఞ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొని ఆచరించినవాళ్ళు పూర్తి జీవితం అంటే 116 సంవత్సరాలు జీవిస్తారు. దానికి తానే ఒక నిదర్శనమని ఐతరేయ మహిదాసముని చెప్పేరు.

వేదమనే శరీరానికి, వేదాంగాలలో ఒకటైన ఛందస్సనేది, నడవటానికి పాదముల వంటిది. గాయత్రి తో మొదలయి 26 ఛందస్సులున్నాయి. అవి వరుసగా గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, అష్టి, అత్యష్టి, ధృతి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి, ఉధృతి… మొదలైన 26 ఛందస్సులు.

వీటిలో మొదటిదయిన గాయత్రి లో పాదానికి ఆరు అక్షరాలు చొప్పున నాలుగు పాదాలుంటాయి. మొత్తానికి నాలుగు పాదాలలో కలిపి 24 అక్షరాలుంటాయి. గాయత్రి అంటే గానం చేసే వారిని సర్వదా రక్షించేది అని అర్ధం.

ప్రతి ఛందస్సుకి ఒక్కొక్క అక్షరం చొప్పున పెరుగుతూ వస్తుంది. వరుసలో ఆరవదయిన త్రిష్టుప్ చందస్సులో పాదానికి 11 అక్షరాల చొప్పున నాలుగు పాదాలలో కలిపి 44 అక్షరాలున్నాయి.

అలాగే వరుసక్రమం లో ఏడవదైన జగతి ఛందస్సులో పాదానికి 12 అక్షరాల చొప్పున నాలుగు పాదాలు కలిపి 48 అక్షరాలుంటాయి.

గమ్యతే జనైరితి జగతీ- జనుల చేత బొందబడునది. ప్రళయకాలే గచ్ఛతీతి జగతీ- ప్రళయకాలం లో లయమయిపోయేది జగతి అని అర్ధం. సర్వము దీనిలోనే కనబడుతుంది.

అదేవిధంగా 26 ఛందస్సులలోను ప్రతి ఛందస్సుకు కొన్ని ముఖ్యమైన మంత్రాలు ఉండి ఆ మంత్ర సాధన ద్వారా మానవుడు తన ఆర్థిక, ఆరోగ్య, సామాజిక, రాజకీయ కోరికలను తీర్చుకొంటూంటారు.

ఉదాహరణకు గాయత్రీ ఛందస్సులో ఖడ్గమాలా స్తోత్రం, అనుష్టుప్ ఛందస్సులో లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్ర నామ స్తోత్రం, శ్రీరామ రక్షా స్తోత్రం మొదలైన స్తోత్రాలన్నీ మనం అను నిత్యం కామ్యార్ధసిద్యర్ధం పఠిస్తున్నవే.

113. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

తృతీయ ప్రపాఠకం అష్టాదశ ఖండం లో

మనో బ్రహ్మే త్యుపాసీతే త్యధ్యాత్మ మథాధిదైవతమాకాశో బ్రహ్మే త్యుభయ మాదిష్టం భవత్యధ్యాత్మం చాధిదైవతంచ।।

మానవుడి మనస్సే పరబ్రహ్మ స్వరూపం. అందుచేత దేహంలో ఉన్న మనస్సునే ధ్యానించాలి. ఆతర్వాత ఇతర దేవతల గురించి ధ్యానించాలి. దేవతలంతా సంతోషించేటట్టుగా ఆ దేవతలని, దేహాన్ని కూడా ధ్యానించాలి.

ఈ మనస్సనే పరబ్రహ్మకు నాలుగు పాదాలుంటాయి. వాగీంద్రియం (వాక్కు) అనేది ఒక పాదం. ప్రాణం అనేది రెండో పాదం. నేత్రం (కళ్ళు) అనేవి మూడో పాదం. శ్రోత్రం (చెవి) అనేది నాల్గవ పాదం. ఈ నాలుగు పాదాలు శరీరానికి సంబంధించినవి.

దేవతలకు సంబంధించిన మరొక నాలుగు పాదాలున్నాయి. అవి అగ్ని మొదటి పాదం, వాయువు రెండో పాదం, ఆదిత్యుడు మూడో పాదం, దిక్కులు నాల్గవ పాదం.

ఈ విధం గా దేహానికి దేవతలకు సంబంధించిన రెండు ధ్యానాలు జరుగుతూంటాయి.

పరబ్రహ్మ నాలుగు పాదాలలో మొదటిదైన వాగీంద్రియానికి అగ్ని (దేవతలకు సంబంధించిన పాదం) తన ప్రకాశం తో వెలుగును, వేడిని ప్రసాదిస్తోంది.

రెండవ పాదం ప్రాణానికి వాయువు యొక్క చైతన్యం తో కాంతిని వేడిని ఇస్తోంది. మూడవ పాదం నేత్రానికి సూర్యుని యొక్క తేజస్సుతో ప్రకాశము, చైతన్యను కలుగుతున్నాయి. నాల్గవ పాదం శ్రోత్రం దిక్కుయొక్క చైతన్యం తో ప్రకాశాన్ని పొందుతుంది.

తృతీయ ప్రపాఠకం ఏకోనవింశ ఖండం లో

ఆదిత్యో బ్రహ్మేత్యాదేశ స్తస్యోపవ్యాఖ్యాన మసదే వేదమగ్ర ఆసీత్.

కనిపించే ఆదిత్యుడు సాక్షాత్తు పరబ్రహ్మ అని ఆదేశం. మిగిలిన విషయాలన్నీ కేవలం వ్యాఖ్యానాలే.

త త్సదాసీ త్తత్సమభవ త్తదాణ్ణం నిరవర్తత తత్సంవత్సరస్య మాత్రా మశయత తన్నిరభిద్య తతే ఆణ్డకపాలే రజతం చ సువర్ణం చా భవతామ్।।

సృష్టి ప్రారంభానికి ముందు భూమి అవ్యక్తంగా ఉంది. సృష్టి ప్రారంభమైన తర్వాతే భూమి వెలిసింది.

మొదట ప్రాణం లేని అసత్ ఉందని, అది క్రమంగా సత్ (ప్రాణం) గా మారిందని, చెప్పబడింది. తరువాత నిరాకార శక్తి అంకురించింది.

దానిలోనుంచి అండం వెలువడింది. ఒక ఏడాది తర్వాత ఆ అండం పగిలి రెండై వెండిగా కనిపించేదంతా మొదటిది పృథివి గాను, బంగారంగా ఉన్న రెండవది ద్యులోకం గాను మారిందనే సృష్టి క్రమాన్ని వివరించారు.

ఇక అండం లో బాహ్యంగా కనిపిస్తున్న భాగాలు పర్వతాలు కాగా వాటి మధ్య లో మేఘాలు వ్యాపించాయి. సరస్సులుగా కనిపించే భాగాలన్నీ నదులు. అండం అడుగు భాగమంతా సముద్రం.

అందులోనుంచి ఆదిత్యుడు (పరబ్రహ్మ) ఉత్పన్నుడైయ్యాడు. అందుకే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు అన్ని రకాల శబ్దాలు వినిపిస్తాయి. అతడే బ్రహ్మ అని అతనిని కొలిచిన వారు సుఖపడతారని చెప్పబడింది.

ఈ ప్రపాఠకంలో తెలియ బరచిన విషయాలను తరచి చూస్తే దీన్ని సంపూర్ణ ఆదిత్యోపాసనా పర్వంగా చెప్పుకోవచ్చు. ఈ మధువిద్య కాలక్రమేణా మరుగున పడిపోయి వాటి సమగ్రమైన ఉపాసనా విధానం సాధకులకు అందకుండా పోయింది. అయినా సూర్యకిరణాల ద్వారా సప్తవర్ణ చికిత్సా విధానం ఇప్పటికీ మన దేశం లో కొన్ని కొన్ని ప్రదేశాలలో వాడుకలో ఉంది.

యోగి అచ్యుతులు రెండున్నర సంవత్సరాల పాటు మన దేశ అభ్యున్నతికై సూర్యోపాసన చేసినట్లు ఆశ్రమ రికార్డు లలో ఉంది.

ఈ విధం గా తృతీయ ప్రపాఠకం ముగిసింది.

వచ్చే భాగం లో నాల్గవ ప్రపాఠకంలో చాలా ఉత్సుకత కలిగించే జానాశ్రుతి, రైక్వుడు, రైక్వుడు బోధించిన సంవర్గ విద్య మొదలైన చాలా విషయాలు ఉంటాయి.

114. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

చతుర్ధ ప్రపాఠకం, ప్రధమ ఖండం:

పూర్వం జనశృత వంశానికి చెందిన మునికి మనుమడైన జానశ్రుతి అనే ముని ఎంతో శ్రద్ధగా అన్నదానాలు చేస్తూండేవాడు.

తాను దానము చేసిన అన్నమునే జనులు సర్వత్ర భుజింతురు గాక। అందరూ ఆకలి తీర్చుకొందురు గాక। అనే సద్భుద్ధితో ఎన్నో ధర్మశాలలు, అన్నసత్రాలు కట్టించాడు.

ఒకరోజు రెండు హంసలు అతని ఇంటి పైనుంచి ఎగిరిపోతూ ఇలా సంభాషించు కుంటున్నాయి.

ఒక హంస రెండవ హంస తో “ఓ భల్లాక్షుడా। కళ్ళు సరిగ్గా కనిపించనివాడా। ద్యులోకంలో వెలిగే జ్యోతిలా జానశ్రుతి పౌత్రాయణుడి తేజస్సు అంతా వ్యాపించి ఉంది. దాన్ని తాకొద్దు. అది నిన్ను కాల్చేస్తుంది జాగ్రత్త” అంది.

రెండవ హంస “ఓ అజ్ఞానీ! ఈ జానశ్రుతిముని లో అంత గొప్పతనం ఏముంది? ఈ స్వల్పుని గురించి ఎందుకు ఘనంగా పొగుడుతావు? బండిరైక్వుని పొగిడినట్లు పొగుడుతున్నావేమి? ఈయన ఏమయినా రైక్వుడి కన్నా గొప్పవాడా ఏమిటి?” అంది.

దానికి మొదటి హంస “ఓ భల్లాక్షా! బండి రైక్వుడెవ్వరు? ఆయనకు అంతటి కీర్తి ఎలా లభించింది? చెప్పు ” అని అడిగింది.

దానికి భల్లాక్షుడిల్లా సమాధానమిచ్చేడు.

“జూదంలో ఎన్నో రకాలుంటాయి. వాటిలో కృత అనే ఆట ఒకటుంది. ఆ ఆటలో గెలిచినవాడు, మిగతావారందరూ గెలిచిన అన్ని ఆటలను తాను గెలిచినట్టే అవుతుంది. అదే విధంగా లోకంలో జనులంతా చేసే అన్ని రకాల పుణ్యాలు ఆ రైక్వుడినే చేరుతున్నాయి. ఎందుకంటే ఆ రైక్వుడు గొప్ప ఆత్మజ్ఞాని.”

ఈరకంగా మాట్లాడుకొంటున్న హంసల సంభాషణ విన్న జానశ్రుతి తన రధ సారధిని పిలిచి “ఓ సారధీ! రైక్వుని పిలుచుకొని రా!” అని ఆజ్ఞాపించాడు. “అతడే అందరి కంటెను సుకృతాత్ముడు, జ్ఞానవంతుడు అయి ఉన్నాడు”.

రాజాజ్ఞ ననుసరించి రైక్వుడి కోసం ఎన్నో ప్రదేశాలు వెతికాడు. అతడికి రైక్వుడెక్కడా కనిపించలేదు. బ్రహ్మజ్ఞానులెక్కడ ఉంటారో అక్కడ వెదక మన్నాడు. చివరకి ఒక బండిక్రింద కూర్చుని మూగగజ్జిని రుద్దుకుంటూ ఉన్న రైక్వుడిని కనుగొన్నాడు.

జానశ్రుతి సారధి చెప్పిన మాటలను విని ఆరు వందల పాడి ఆవులను, పలురకాలైన బంగారు హారాలను, మేలుజాతి గుఱ్ఱాలతో కూడిన రధాన్ని గురు దక్షిణ గా తీసుకొని రైక్వుణ్ణి సమీపించి
“ఓ మహానుభావా! రైక్వా ఈ పాడి గోవులను భూషణాలను రథాన్ని తమరు స్వీకరించి, మీరు ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవతకు సంబంధించిన దివ్యజ్ఞానాన్ని నాకు ఉపదేశించండి.” అని ప్రార్ధించాడు. అయితే రైక్వుడు కోపంగా వీటిని తీసుకొని పో అని తిరస్కరించేడు.

జానశ్రుతి తిరిగి వెయ్యి గోవులను, అనేక భూషణాలను రధాలను, వాటితోబాటు తన కుమార్తెను కూడా తీసుకొని రైక్వుని దగ్గరకు వెళ్ళి “స్వామీ! నేను తెచ్చిన వస్తువులతో పాటు నీ భార్యగా నా కుమార్తెను, నీవు నివసించు ఈ గ్రామమును కూడా నీకు సమర్పిస్తున్నాను. దయచేసి వీటిని స్వీకరించి నాకు బ్రహ్మవిద్యను బోధించండి” అని వేడుకొన్నాడు.

అప్పుడు రైక్వుడు జానశ్రుతి యొక్క కుమార్తె నిర్మల మైన ముఖమును చూచి ఆమెది విద్యాముఖమని గ్రహించి ” ఈమె ద్వారా నీకు బ్రహ్మవిద్యోపదేశం చేస్తాను. మహావృషలదేశం లోని నాకు దానం చేసిన ఈ గ్రామం ఇకముందు రైక్వపర్వం గా పిలవబడుతుంది” అని చెప్పేడు. రైక్వుడు ఆ గ్రామం లోనే నివసిస్తూ జానశ్రుతికి ఈ విధంగా బ్రహ్మవిద్యను ప్రబోధించాడు.

రైక్వుడియొక్క ఉపదేశాన్ని సంవర్గ విద్య అంటారు. వాయువు పంచ భూతాలలోని ఇతర భూతాలను తనలో సంవర్గం- అంటే చేర్చుకొని లయం చేసుకొనే శక్తికి సంబంధించిన విద్య అని అర్ధం.

వచ్చే భాగంలో సంవర్గ విద్య గురించి తెలుసుకొందాం.

115. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

చతుర్ధ ప్రపాఠకం, తృతీయ ఖండం:

ఇతర భూతాలను తనలో సంవర్గం చేసుకోవడం అంటే చేర్చుకొని లయం చేసుకొనే శక్తికి సంబంధించిన విద్యకు సంవర్గ విద్య అని పేరు.

వాయు ర్వావ సంవర్గో యదా వా అగ్ని రుద్వాయతి వాయుమే వాప్యేతి యదా సూర్యోస్తమేతి వాయు మేవాప్యేతి యదా చంద్రోస్తమేతి వాయుమే వాప్యేతి।।

సంవర్గం అంటే చివరి ఆశ్రయం. ఇక్కడ వాయువు సంవర్గం. అగ్ని చల్లబడిందంటే అది వాయువును ఆశ్రయించినందువల్లే; సూర్యుడు అస్తమించిన తరువాత వాయువులోనే చేరతాడు. చంద్రుడు అస్తమించేక కూడా వాయువులోనే లీనమౌతాడు. నీరు ఇంకిపోయిందంటే అది వాయువును ఆశ్రయించిందని అర్ధం.

ఇలా వాయువు సమస్తాన్నీ మింగుతుంది. వాయువు ప్రధాన భూతం. నాశరహితమైనది. వాయువు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నీరు అన్నీ దేవతా స్వరూపాలు. వాయువొక్కటే కంటికి కనుపించని సూక్ష్మభూతం.

అందుకే ఈ వాయువు అధిదైవతం (దేవతలకు సంబంధించినది) అని కీర్తించ బడింది.

అథాధ్యాత్మం ప్రాణో వావ సంవర్గః స యదా స్వపితి ప్రాణమేవ వాగప్యేతి ప్రాణం చక్షుః ప్రాణం శ్రోత్రం ప్రాణం మనః ప్రాణోహ్యేవైతా న్సర్వా న్సంవృజ్త్క ఇతి।।

ఆధ్యాత్మం అంటే జీవుడి దగ్గరకు వస్తే ప్రాణమే సంవర్గ తత్వం కలిగినది. ఎందువల్లంటే జీవి సుషుప్తావస్తలో (నిద్రలో) నున్నప్పుడు, వాక్కు, దృష్టి, వినికిడి శక్తి, మనస్సు అన్నీ ప్రాణం లో లయం అవుతాయి. లయం అయి నిద్రాణంగా ఉంటాయి.

జానశ్రుతికి రైక్వుడొక కధ చెప్పేడు. పూర్వం ఒకప్పుడు కాపేయ వంశానికి చెందిన శౌనకుడు, కక్షసేన వంశానికి చెందిన అభిప్రతారి ఇద్దరూ భోజనం చేస్తూండగా వారికి వంటవాడు వడ్డన చేస్తున్నాడు.

అదే సమయం లో విద్యావంతుడు, నియమ నిష్ఠలు కల ఒక బ్రహ్మచారి అక్కడకు వచ్చి బిక్ష కోరాడు. వారతనికి బిక్షనివ్వలేదు.

ఆ బ్రహ్మచారి వారితో. “ఓ శౌనకమునీ। అగ్ని మొదలైన నలుగురు దేవతలను మింగిన భువన రక్షకుడు ప్రజాపతి. ఆయనను మీరు గుర్తించ లేకున్నారు.

(అంటే అగ్ని, నీరు, సూర్యుడు, చంద్రుడు మొదలైన దైవస్వరూపాలకు వాగీంద్రియం, చక్షురింద్రియం, శ్రవణేంద్రియం, మనస్సు మొదలైన జీవులలోని ఇంద్రియాలకు అపూర్వమైన శక్తులున్నాయి. ఆ పరమాత్మే ప్రజాపతి రూపంగా అన్నిచోట్ల వ్యాపించి సర్వభూతాలను నియంత్రిస్తున్నాడు. ఆయనే వాయురూపంలో అధిదైవకాలను, ప్రాణ రూపం లో అధ్యాత్మలను మింగి తనలో లయం చేసుకొంటున్నాడు. ఆయనయొక్క ఆ సమిష్టి స్వరూపాన్ని సంవర్గ అంటారు.)

ఓ అభిప్రతారీ। అనంతరూపుడైన ప్రజాపతికి మానవులంతా నిరంతరం యజ్ఞాలలో అన్నాన్ని తృప్తిగా పెడుతున్నారు. అలాంటి ప్రజాపతి రూపుడనైన నాకు మీరు అన్నం పెట్టలేదు.

ఈ అన్నమంతా ప్రజాపతి ప్రసాదమే. అలాంటి ఆయనకే అన్నం లేదంటున్నారు.” అంటూ నిందించాడు.

ఆ బ్రహ్మచారి మాటలు విన్నాక అతనికి సంవర్గ విద్య తెలుసు అని శౌనకుడుకి అర్ధం అయ్యింది. అతని దగ్గరకు వెళ్ళి ” ఓ బ్రహ్మచారీ। ప్రజాపతి దేవతలకు ఆత్మగా ఉన్నాడు. ఆయన ప్రజలను పుట్టిస్తాడు. ఆయనకు బంగారు దంతాలు ఉంటాయి. సర్వమును భుజించే సామర్ధ్యము గలవాడు,మహా మేధావి అని ఆయనను కీర్తిస్తారు. మేము కూడా నిత్యం ఆయననే పూజిస్తూ ఉంటాము.” అని చెప్పి ఆ బ్రహ్మచారికి బిక్ష పెట్టారు.

ఇక్కడ భుజిస్తున్న వాయువు, అన్న స్వరూపాలైన అగ్ని, సూర్యుడు, చంద్రుడు,జలం అనే నాలుగు కలిపి ఐదు. అలాగే అన్నాన్ని భుజించే ప్రాణం, దీనితోపాటు వాక్కు, నేత్రం, చెవి, మనస్సు అనే అయిదు మొత్తం పది దిక్కులకు ( నాలుగు దిక్కులు, నాలుగు మూలలు, నింగి, నేల కలిపి మొత్తం పది) ఆహారాలు. ఈ అన్నాన్నే కృతం అంటారు.

విరాట్ స్వరూపంలో పరమాత్మే అన్ని దిక్కులకు వ్యాపించి ఆహారాన్ని గ్రహిస్తున్నాడు. ప్రళయ సమయంలో సమస్త సృష్టిని తనలో లయం చేసుకొంటున్నాడు.

వచ్చే చతుర్ధ ప్రపాఠకం, చతుర్ధ ఖండం లో సత్యకామ జాబాల అనే ముని గురించి తెలుసుకుందాం.

116. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

చతుర్ధ ప్రపాఠకం చతుర్ధఖండం:

సత్యకాముడనే కుర్రవాడు తన తోటివారంతా గురుకులాలలో జేరి విద్యాభ్యాసం చేస్తుంటే తానుకూడా గురుకులం లో చేరి చదువుకోవాలని అనుకొన్నాడు. ఆ రోజులలో గురుకులానికి వెడితే ముందుగా అతని గోత్రం అడిగేవారు.

అందుకని సత్యకాముడు తన తల్లి దగ్గరకు వెళ్ళి “అమ్మా నాకు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని గురుకులానికి వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనే కోరిక ఉంది. నాకు మన గోత్రమేదో చెప్పు.” అని అడిగాడు.

ఆమె సత్యకాముడితో “నాయనా। నీది ఏ గోత్రమో నాకు తెలియదు. నేను యౌవనం లో ఉన్నప్పుడు అనేకచోట్ల దాసిగా పని చేసేదాన్ని. అప్పుడు నీవు నాకు జన్మించావు. నా పేరు జాబాల. నీ పేరు సత్యకాముడు. ఇంత వరకే నాకు తెలుసు.” అని చెప్పింది.

అక్కడనుంచి హరిద్రుమత గౌతముడి దగ్గరకు వెళ్ళి “స్వామీ। బ్రహ్మచర్యవ్రతాన్ని అవలంభిస్తూ గురుకుల వాసం చేయాలని వచ్చాను. తమరు నన్ను శిష్యుడుగా స్వీకరిస్తే విద్యాభ్యాసం చేస్తాను”. అని ప్రార్ధించాడు.

సత్యకాముడి ప్రార్ధన విన్న గౌతముడు “నాయనా। నీ గోత్రమేమిటి?” అని ప్రశ్నించాడు.

“నా గోత్రం నాకు తెలియదు స్వామీ. నా తల్లి నాతో ‘కుమారా। నేను యౌవనం లో ఉన్నప్పుడు ఎన్నో చోట్ల దాసిగా పని చేసాను. అప్పుడు నీవు నాకు జన్మించావు. నీ గోత్రం నాకు తెలియదు. నా పేరు జాబాల. నీపేరు సత్యకాముడు.’ అని చెప్పింది. కనుక నాపేరు సత్యకామజాబాల.” అని బదులిచ్చాడు సత్యకాముడు.

గౌతముడు అతని మాటలు విని “ఒక్క బ్రాహ్మణుడు తప్ప ఇతరులెవ్వరూ ఇలా సమాధానం చెప్పరు. ఇలా సత్యం చెప్పిన ఈ బాలుడు తప్పక బ్రాహ్మణుడే అయి వుంటాడని భావించాడు.

సత్యకాముడితో “నాయనా। సమిధలు తీసుకొనిరా. నీకు ఇప్పుడే ఉపనయనం చేస్తాను.నీవు చక్కగా సత్యాన్నే పలికావు ” అని చెప్పి అతనికి ఉపనయనం చేసాడు.

తరువాత బాగా బలహీనంగా ఉన్న నాలుగు వందల గోవులను సత్యకాముడికిచ్చి వాటిని చక్కగా మేపి అవి వెయ్యి గోవులైన తర్వాత తిరిగి రమ్మని చెప్పి పంపాడు గౌతముడు. సత్యకాముడు ఎన్నో ఏళ్ళు అడవిలో వాటిని మేపగా అవి క్రమంగా వెయ్యి సంఖ్యకు చేరాయి.

ఆ విధంగా సత్యకాముడు అడవిలో గోవులను మేపుతూండగా, ఆ గుంపులో ఉన్న వృషభ మొకటి “ఓ సత్యకామా।” అని పిలిచింది. భగవన్ ఏమి పిలిచావు? అని అడిగేడు. అందుకా వృషభం “సత్యకామా। ప్రస్తుతం మేమంతా కలిపి ఒక వెయ్యి దాకా ఉన్నాము. మమ్మల్ని నీ గురువుగారి దగ్గరకు తీసుకొని వెళ్ళు. ఇప్పుడు నీకు పరబ్రహ్మ పాదాల గురించి చెబుతాను విను” అని ఈ విధం గా చెప్పడం ప్రారంభించింది.

ఈ పంచమ ఖండం లో ఇటుపైన ప్రకృతిలోని జంతువులు, పక్షులు, జలచరాలు, అగ్ని సత్యకామునికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించిన వైనం చూద్దాం.

117. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

పంచమ ఖండం నుంచి అష్టమ ఖండం వరకూ:

సత్యకాముడు ఆ వృషభం యొక్క మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు.

తస్మై హోవాచ ప్రాచీ దిక్కలా ప్రతీచీ దిక్కలా దక్షిణా దిక్కలోదీచీ దిక్కలైష వై సోమ్య చతుష్కలః పాదో బ్రహ్మణః ప్రకాశవన్నామ।।

తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే నాలుగు దిక్కులూ నాలుగు కళలు. ఈ నాలుగు కళలు కలిసి పరమాత్మకు ఒక పాదం. ఈ పాదాన్ని బ్రహ్మపాదం “ప్రకాశవాన్” అంటారు.

తరువాత పరబ్రహ్మ రెండో పాదం గురించి అగ్నిదేవుడు నీకు తెలియజేస్తాడు అని వృషభం పలికింది.

ఆ మర్నాడు సత్యకాముడు వెయ్యి గోవులను తీసుకొని గురువుగారి ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో సాయంత్రమయ్యింది. ఒకచోట గోవులను ఆపి అక్కడున్న ఎండు పుల్లలను రాజేసి నిప్పు వెలిగించి తాను తూర్పు ముఖంగా కూర్చున్నాడు.

అప్ప