Last updated: Feb 17th 2017
శ్రీ వేణు గోపాల్
నా గురుదేవులకు వందనములు!
ఎందరో మహానుభావులు గీతకు వ్యాఖ్యానాలు వ్రాశారు. నాకు తగిన అర్హత లేకపోయినా నా గురుదేవులు యోగి శ్రీ అచ్యుతుల వారి శుభాశ్శీస్సులతో, నాకు తెలిసినంత వరకు నా యోగ సాధనానుభవముతో బాటుగా, కొందరు ఋషుల వ్యాఖ్యానాలు విని , అర్థము చేసుకొని, యోగార్థములుగా వ్రాశాను. ఇది వాణిజ్యపరముగా కాకుండా నా స్నేహితులకు, హితులకు, సన్నిహితులకు, జిజ్ఞాసులకు, మరియు యోగ సాధకులకు వీలైనంత వరకుసరళభాషలో చెప్పుటకు ప్రయత్నించినాను. ఈ యోగార్థములు గరూపదేశమును పొంది యోగ సాధన చేయువారికి చాలా సులభముగా అర్థ మగును. గురూపదేశము లేనివారు శ్లోకము యొక్క విశేషార్థముతో సరిపెట్టుకొనవలెనని కోరుతున్నాను.
ఈ యోగార్థములు దోషరహితమై ఇతరులకు మార్గదర్శకముగా ఉండుటకు మీ అందరి సహాయ సహకారములు చాలా అవసరము.కావున ఇందులో ఏవైనా తప్పులున్న ఎడల జ్ఞానులు దయతో నన్ను మన్నించి, నాకు తేలిపిన సదరు తప్పును అందరి సౌకర్యార్థము వెంటనే సరిదిద్దుకొందును.
ఈ యోగార్థములు బాగున్న ఎడల అది నా గురుదేవులు శ్రీ యోగి అచ్యుతులు నాచే పలికించినది. ఏవైనా తప్పులున్న ఎడల అవి ఈ భవదీయునివి. ఎన్ని జన్మల పుణ్యఫలమో, నాకు ఈ జన్మలో అచ్యుత యోగవిద్య ప్రాప్తమైనది. వారి సేవలో తరించ నెంచి, ప్రప్రథమముగా అచ్యుత యోగ తత్త్వమును భగవద్గీతతో అనుసంధాన పరచి మీకు వివరిస్తున్నాను. భావితరముల వారికి ఉపయుక్తమగుట కొరకు మీ నుండి సద్విమర్శలు చాలా అవసరము.
**********************
ఓం శ్రీ అచ్యుత గురు పరబ్రహ్మణే నమః
🌼🌼🌼 భగవద్గీత-విశిష్టత 🌼🌼🌼
**********************
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
వ్యాస భగవానుని వాక్కు నుండి జాలువారిన మహాభారతము నందలి భగవద్గీతను రచించి ఈ జగత్తునకు అందించిన విఘ్న నాయకునికి వందనములు.
వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనమ్,వద్గీత
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్.
నిగూఢ యోగార్థములున్న శ్రీమద్భగవద్గీత గ్రంథరాజమును ఉన్నత ప్రమాణములతో నభూతో నభవిష్యతిగా అందించిన యోగీశ్వరుడు శ్రీకృష్ణునకు వందనములు.
పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతమ్,
అద్వైతామృత వర్షిణీం, భగవతీం అష్టాదశాధ్యాయినీం
అంబ త్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్.
భగవంతుడగు నారాయణునిచే సూక్ష్మాతి సుక్ష్మమైన యోగ విషయములను అర్జునునకు స్వయముగా బోధించినదియూ, మహాభారతములో మధ్యభాగమున, పురాణముని అయిన వ్యాసునిచే కూర్చబడినదియు, 18 అధ్యాయములతో అమృత తత్త్వమును అమృతముగా కురిపించినట్టిదియు, అగు ఓ తల్లీ, భగవద్గీతా, మీకు నేను నమస్కరిస్తున్నాను.
“కృష్ణస్తు భగవాన్ స్వయం” – కృష్ణుడు స్వయముగా భగవానుడే అని అర్థము.
“వృష్ణీనాం వాసుదేవో స్మి” – వృష్ణి వంశస్థుడైన వాసుదేవుడగు శ్రీకృష్ణుడను నేనే అని భగవద్గీతలో భగవంతుడు స్వయముగా చెప్పినపుడు గీతను చెప్పినది భగవంతుడనుటకు సందేహము లేదు.
ఇక ‘ గీ ‘ అనగా గీతను పఠనము చేయువారిని, ‘ త ‘ అనగా తరింప జేయునది అని కొందరు చెప్పెదరు.
గీతా స్తోత్ర కదంబము :–
గీకారం త్యాగరూపం స్యాత్తత్త్వ బోధం తకారమ్,
గీతావాక్య మిదం తత్త్వం జ్ఞేయం సర్వముముక్షుభిః.
అని గీతా మాహత్మ్యము చెప్పుచున్నది. అనగా ‘ గీ ‘ అనగా త్యాగము. మనము చేయు ప్రతి పని యొక్క ఫలములను భగవంతునికి అర్పించుటను సర్వ కర్మఫల త్యాగము అందురు. ‘ త ‘ అనగా తత్త్వ జ్ఞానమును బోధించునది అని ముముకక్షువుల భావన. కుడి చేత్తో చేసే దానధర్మములు ఎడమ చేతికి తెలియ కూడదంటారు పెద్దలు. స్వార్థ బుద్ధితో ” నేను ఈ పుణ్యకార్యములు చేశాను అని పది మందికి తెలియ చెప్పుకోవడము, నేను ఇంత దానము చేశాను కావున నాకు ఈ పుణ్య ఫలములు. కావాలని ” ఆశించడము త్యాగమనిపించుకోదు. గీత అనగా హద్దు, పరిధి అని కూడా అర్థాన్నిస్తుంది. తన్ను చేరగోరు ఆసక్తిగల జిజ్ఞాసులకు భగవంతుడు కొన్ని నియమములను నిర్దేశించాడు. వీటిని తూ- చా తప్పకుండా పాటించిన వారి హృదయాలలో ఎల్లప్పుడూ కొలువై ఉంటాడు.
భగవద్గీత పుట్టుక యెప్పటిదని ఒక సారి పరిశీలిస్తాము. వ్యాసభగవానుని చే విరచితమైన భవిష్యపురాణం ప్రతీసర్గ పర్వం, 4వ అధ్యాయము 10 వ శ్లోకం నుండి 20 శ్లోకములలో “నారాయణం పూజ ఇత్వా మ్లేచః సహ భార్యయా. . . . . . . . సాక్షాధ్భగవన్ భక్తవత్సలః ” అనగా కలిభూపతి మ్లేచ్చ (పాశ్చాత్య నాగరికత) రూపుడై తన భార్యతో కలిసి “తనకు భూలోక రాజ్యమును పరిపాలించుటకు అనుమతిని ఇవ్వవలసినదిగా ” శ్రీమన్నారాయణుని పూజించగా, భక్తవత్సలుడై న సాక్షాత్ భగవంతుడు కలితో ” నీ కోరిక తీరుతుంది ” అనెను.
ఆదమోనామ పురుషః పత్నీ హవ్యవతీ తథా
ఆదాముడనే పేరుగల పురుషుడిని హవ్యవతీ అనే స్త్రీని సృష్టించెదను.
ద్విశతాష్ట సహస్త్రీద్వేశేషేతు ద్వాపర యుగే
మ్లేచ్చదేశస్య యాభూమిర్భవితా
రెండువేల యెనిమిది వందల సంవత్సరాలు (2800) ద్వాపరయుగాంతము ముగియుటకు ముందుగా మ్లేఛ్ఛ దేశములో పై చరిత్ర ఆరంభమగును.
అనగా క్రైస్తవులు, మహమ్మదీయుల మూల పురుషులైన ఆదాము, అవ్వ 2800 సంవత్సరములు క్రీస్తు పుట్టుటకు పూర్వము పుట్టిరని తెలియుచున్నది.
భారత యుధ్ధము మార్గశిర మాస శుధ్ధ ఏకాదశి దినమున ఆరంభమైనట్లు మహాభారత కావ్యము నందున్నది. భారత యుధ్ధము నందు బ్రహ్మాస్త్రము వేసినది 3138 బి.సి. లో అని చరిత్రకారలు నిర్ధారించినారు. అనగా పరీక్షిత్తు జననము, ధర్మరాజు పట్టాభిషేకము కూడా ఆ సంవత్సరములోనే జరిగినది. కనుక ఖురాను మరియూ బైబిలు మత గ్రంథముల యొక్క మూలము భగవద్గీత అగుచున్నది.
పరీక్షిత్తుకు పట్టాభిషేకము, పాండవుల స్వర్గారోహణము 3102 బి.సి.
పరీక్షిత్తు నుండి ప్రద్యోతులు వరకు పాలన 2136 బి.సి.
శిశునాగవంశ పాలన 1998 బి.సి.
నందవంశ పాలన 1636 బి.సి.
మౌర్యవంశ పాలన 1536 బి.సి.
శుంగవంశ పాలన 1220 బి.సి.
ఆంధ్ర శాతవాహనుల పాలన 833 బి.సి.
గుప్తవంశ పాలన 327 బి.సి.
ప్రమరవంశ పాలన 82 బి.సి.
విక్రమాదిత్య శకము ఆరంభము 57 బి.సి.
శాలివాహన శకము ఆరంభము 78 ఏ.డి.
ఘజిని మహమ్మద్ దండయాత్ర 999 ఏ.డి.
ఘోరీ మహమ్మద్ దండయాత్ర 1192 ఏ.డి.
విజయనగర రాజుల పాలన 1336 ఏ .డి.
పోర్చుగీసుల వలస 1505 ఏ.డి.
బాబర్ 1 పనిపట్టు యుద్ధము 1526 ఏ.డి.
ఆంగ్లేయుల పాలన 1608 ఏ.డి.
భారతదేశ స్వాతంత్ర్యము 1947 ఏ.డి.
ఈదినమునకు భగవద్గీతకు 3138+2016=5154 సంవత్సరములు అయినట్లు రుజువగుచున్నది.5154 సంవత్సరము నకు పూర్వము చెప్పబడిన ఈ భగవద్గీత కుల,మత,లింగ బేధ రహితముగా ప్రస్తుత కాలానుగుణమునకు, మానవ మనుగడకు, అభివృద్ధికి దోహదపడుచున్న ఏకైక గ్రంథరాజముగా విలసిల్లు చున్నది.
నాలుగు వేదముల సారాంశము “అహం బ్రహ్మాస్మి , తత్త్వమసి , ప్రజ్ఞానం బ్రహ్మ , అయం ఆత్మా బ్రహ్మ ” అను మహవాక్యములుగా తెలుపబడినవి. ఈ నాలుగు మహవాక్యముల ఎకార్థము, మాయా నుండి విడివడిన జీవాత్మ బ్రహ్మ మగుటయే. మానవుడు ఆశావ్యామోహములతో బంధింపబడి , సంసార సాగరములో మునిగి తేలుతూ మనస్సు యొక్క ఆధీనములోనున్న ఇన్ద్రియములకు ఆధీనుడై సత్యమును దర్శించుటకు సమయము లేక, మాయా యొక్క కబంధ హస్తములలో నలిగి పోవుచున్నడు . ఇటువంటి జీవులు మాయను అధిగమించుట కొరకు భక్తి ,జ్ఞాన , ధ్యాన , వైరాగ్యములను తెలిపి జీవన్ముక్తుడగుటకు గీత ఏకైక సంపూర్ణ గ్రంథరాజమై తన అమృత హస్తములను అందించుచున్నది. భగవద్గీతలో ఉన్నది అన్నిటా ఉన్నవి. గీతలో లేనిది మరెక్కడా లేదు అని పెద్దల ఉవాచ.
గీత యొక్క ప్రతి అధ్యాయము చివర ” ఇతి శ్రీమద్భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మవిద్యాయామ్ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ” అని ఉన్నది . ఇందులో శ్రీమద్భగవద్గీత , ఉపనిషత్తు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రమను ముఖ్యమైన పదములు ఉన్నవి. స్వయముగా భగవంతునిచే చెప్పబడినందున గీతకు భగవద్గీత అను పేరు కలిగెను. గీత యందు ఉపనిషత్తుల సారాంశము ఉన్నదున, ఇది కూడా ఒక ఉపనిషత్తే. నిరాకార, నిర్గుణ, నిరంజనుడైన పరమాత్ముని పరతత్థ్వమును సాక్షాత్కరింపజేయునది కావున ఇది బ్రహ్మవిద్య అయినది. నిష్కామ కర్మ తత్వమును తెలుపుటచే ఇది యోగశాస్త్ర మైనది.
గీత యందు ప్రతి అధ్యాయము యొక్క చివరి శ్లోకము రాబోవు అధ్యాయమునకు పునాది అగుచున్నది. ఉదాహరణకు 1 వ అధ్యాయము చివరి శ్లోకమున అర్జునుడు దుఃఖముతో అస్త్రములను జారవిడువగా 2వ అధ్యాయము ఆత్మ తత్త్వ విచారణ చేసి అర్జునుని దుఃఖమును పోగొట్టుచున్నది.
భగవంతునికి ధర్మాన్ని స్థాపించడ మంటే చాలా ప్రీతి. అందుకే ” ధర్మ సంస్థాపనార్థయా సంభవామి యుగే యుగే ” ధర్మాన్ని స్థాపించుట కొరకు యుగయుగములలో అవతరించు చుందుననెను. ఇంద్రియలోలుడు దుష్ఠుడు అయిన ధృతరాష్ట్రుని నోటి వెంట నుండి కూడా భాగవధ్గీత ప్రారంభములో ధర్మక్షేత్రే అని ధర్మపదమును పలికించాడంటే భగవంతుడు ధర్మమునకు యెంతటి ప్రాముఖ్యత నిచ్చునో గమనించాలి. గీత మొదటి అధ్యాయమందలి మొదటి శ్లోకము ‘ధర్మక్షేత్రే ‘ అను పదము నందు మొదటి అక్షరము ‘ధ’ తో ప్రారంభమై 18 వ అధ్యాయము 78వ శ్లోకము చివర ‘మతిర్మమ’ యందు ‘మ’ అక్షరముతో ముగింపు జరిగినది. ‘ధ’ ‘మ’ అనే ధర్మము యొక్క అంతరార్థము యేమంటే ఆశాశ్వతమైన ఈ శరీరము నందున్న చైతన్యశక్తి స్థూల శరీరమును విడుచుటకు ముందే తాను యెక్కడి నుండి వచ్చెనో, తిరిగి అచ్చటికి పూవు మార్గమును తెలుసుకొనుటయే.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే !!
అని ఈశావాస్యోపనిషత్తు చెప్పుచున్నది. ఆ పరిపూర్ణము నుండి పూర్ణముగా వచ్చిన మనము, తిరిగి ఆ పరిపూర్ణములో కలిసిపోవుట మన ధర్మము. దీనినే గీత యోగము ద్వారా మన విద్యుక్త ధర్మమును నిర్వర్తించుకొను మార్గమును నిర్ధేశించు చుచున్నది.
ఇక గీతను బోధించిన శ్రీకృష్ణుడు, విన్నటువంటి అర్జునుడు, ఆంజనేయుడు, వ్యాసుడు, సంజయుల యొక్క అర్హతలను విచారించిన యెడల , శ్రీకృష్ణుడు భగవంతుని అంశమైన నారాయణుడు. క్రిష్ అనగా భూమి, నః అనగా సుఖాన్ని కలిగించే వాడు. కనుక కృష్ణ అనగా ఈ భూమిపై ఉన్న సకల చరాచర జీవులకు సుఖాన్ని కలిగించే స్థితి కారకుడు. పుట్టుక నుండి యోగా లక్షణములు కలవాడు. శ్రీష్ణుడు వెన్న దొంగ అంటే వెన్నను దొంగలించాడని కాదు. యోగము చేయువారి స్థూల శరీరములు అగ్ని తత్వము వలన కలిగిన వేడిని ఉపశమింప జేయుట కొరకు వెన్నను తినుట చాలా అవసరము. ఈశ్వరుడు కూడా తపస్సు వలన కలిగిన వేడిని చల్లార్చుకొనుట కొరకు గంగను తలపై ధరించాడు కానీ వేరు భావము తో కాదు. శ్రీకృష్ణుడు భక్తియోగముచే కుచేలుని, కుంతిని, విదురుని, పాండవులను, గోపికాలను, జ్ఞాన యోగముచే అర్జునుని ఉద్దరించినవాడు. జరాసంధుని వధ తర్వాత అతని ఆధీనములో ఉండిన 16 వేలమంది గోపికలను విడిపించి వివాహము చేసుకున్నాడని భాగవతము చెప్పుచున్నది. మానవ శరీర శాస్త్ర ప్రకారము మన శరీరములో 72 వేల నాడులున్నవి. వాటిని నియంత్రించుటకు 16 వేల నాడీకేంద్రములు ఉన్నవి. శ్రీకృష్ణుడు 16 వేలమంది గోపికలను వివాహము చేసుకున్నాడంటే 16 వేల నాడీకేంద్రములను తన ఆధీనములో ఉంచుకొని పరమయోగి, జగద్గురువు అయినాడని అర్థము. శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు కావున గీతోపదేశ సమయమున భగవంతుడు తన స్థూల శరీరమును ఆవహించుకొనుటకు అనువుగా అత్యున్నతమైన యోగా సమాధి స్థితిని పొందాడు. గీత యందు ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ ఉవాచ, అర్జున ఉవాచ అని చెప్పినట్లు శ్రీకృష్ణ ఉవాచ అని చెప్పక శ్రీభగవానువాచ అని మాత్రమే చెప్పబడినది.
ఇమమ్ వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్
వివస్వాన్ మనవేప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్ !!
వినాశము లేని ఈ యోగమును నేను పూర్వము సూర్యునికి ఉపదేశించను. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకునికి, బోధించారు అని భగవంతుడు చెప్పెను. మనువు మరియు ఇక్ష్వాకుడు ద్వాపర యుగమునకు ముందువారు.. భారత, భాగవత కావ్యములయందు శ్రీకృష్ణ జననము నుండి కురుక్షేత్ర యుద్ధము వరకు యెక్కడా సూర్యుడు శ్రీకృష్ణుని కలిసినట్లుగా లేదు. అదియును కాక సూర్యుడు,మనువు మరియు ఇక్ష్వాకుడు ద్వాపర యుగమునకు ముందువారు.. నేను ఈ యోగమును ఉపదేశించానంటే అది శ్రీకృష్ణుడు కాదు, స్వయముగా భగవంతుడే అని తెలియుచున్నది.
ఇక గీతను విన్నవారి అర్హతలను గురించి తెలుసుకొందాము. మొదటి శ్రోత ఐన అర్జునుడు నారా నారాయణులలో నరుడు. శివునితో యుద్ధము చేసి పాశుపతాశ్రమును సంపాదించిన ధీరుడు. సకల శస్రాస్త్రకోవిదుడు. యుద్ధములందు అపజయమెరుగని విజయుడు. ఏకాగ్రతలో సాటిలేని మేటి. ‘పాణ్ణ్దవానామ్ ధనుంజయః’ పాండవులలో అర్జునుడను నేనే అని భగవానుడన్నప్పుడు, అర్జునుడు శ్రీకృష్ణునితో సమానమైన వాడని తెలియుచున్నది.
రెండవ శ్రోత ఐన ఆంజనేయుడు అర్జునుని టెక్కముపై నున్నవాడు. ఈశ్వరాంశతో జన్మించిన గొప్ప రామ భక్తుడు. జితేంద్రియుడు. మహావీరుడు.చిరంజీవి. త్రేతాయుగము నందు ఆంజనేయుడు సూర్యునివద్ధ సకల విద్యాలతో బాటుగా ఈ యోగవిద్యను కూడా అభ్యసించాడు. కావున భగవంతుడు, జ్ఞానయోగి ఐన ఆంజనేయునికి గురువు. అదియునుకాక “అంజనాయాః అయం ఆంజనేయః” అంటే సర్వవ్యాపకతత్వమైన ప్రాణవాయువును ఉపాశించేవాడు, ఆంజనేయుడు అని అర్థము. ‘ర’కారము , ‘మ’ కారములు రామ శబ్ధము. ‘ర’ కారము అనగా ఉచ్చ్వాసము, ‘మ’ కారము అనగా నిశ్వాసము అని కొందరి అభిప్రాయము. ” ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ” యోగసాధకుడు ముక్కులోన సంచరించు ప్రాణవాయును అపాన వాయువుతో సమానముగా మర్ధించిన ముక్తుడగునని గీత చెప్పుచున్నది. ‘ముక్కులోన గాలి ముక్తికి త్రోవయా’ అని యోగి వేమన చెప్పాడు. ఇదే రామ శబ్ధమునకు అంతరార్థము. ఆంజనేయుడు చేసినది ఈ రామ అనే యోగా సాధనే. అదే అచ్యుత యోగము. ఆంజనేయుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి తత్వము.
ఇక మూడవ శ్రోత ఇన సంజయుడు సూతకులములో జన్మించినా,పరమ నిష్ట్టాగరిశ్త్తుడైన కర్మ యోగి. సమ్యక్+జయుడు =సంజయుడు. అనగా ఇంద్రియములను జయించినవాడు అని ఒక అర్థము.
అనాద్యంతావ భావాత్మా పరమాత్మైవ విద్యతే
ఇత్యేతన్నిశ్చయం స్ఫారమ్సమ్యగ్జానమ్ విదుర్భుదాహ
అనగా ఆద్యంతములు లేనిదియు, ప్రకాశ స్వరూపమైనదియు నగు పారమాత్మయే కలదు – అను సువిశాలమైన నిశ్చయమునే సమ్యక్ జ్ఞానమని విజ్ఞులు యెరుగుచున్నారు అని అన్నపూర్ణోపనిషత్తు చెప్పుచున్నది. కనుక సంజయుడు పరిపూర్ణమైన పరమాత్మ తత్వమును కలిగిఉన్నాడనుట సుస్పష్టము. కురుక్షేత యుద్ద సమయమున వ్యాసుడు ధృతరాష్ట్రుని చూచుటకు వస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు యుద్ద విషయాలను తెలుసుకోవలెనని కుతూహలముగా ఉన్నదంటాడు. వ్యాసుడు ఈ విషయమును గురించి గురించి ఆలోచించి సంజయుని అర్హునిగా భావించి,అతనికి కురుక్షేత్ర యుద్దము ఆరంభము నుండి పూర్తి అగు వరకు ధృతరాష్ట్రునికి యుద్ద విషయములను తెలుపు నిమిత్తము ” ఇరుపక్షముల వారి ప్రవర్తనలు, రహస్య సంభాషణలు, మనోభావములు తెలియునట్లు, యుద్దరంగము నందు తిరుగునప్పుడు శాస్త్రాస్రములు ఏవియు తాకాకుండు నట్లు” సంజయునికి వరమిచ్చెను. వ్యాసుని వరప్రసాదము వలన యుద్ద విషయములను తిలకించుటతో బాటుగా గీతను విన్న పుణ్యాత్ముడు సంజయుడు. అందులకే సంజయుడు 18వ అధ్యాయముచివర వ్యాస ప్రసాదితమైన దృష్టితో ఈ పరమ రహస్యమైన యోగమును యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుతుంటే నేను ప్రత్యక్షముగా విన్నానని కృత్జ్ఞతాపూర్వకముగా చెప్పుటచే అతడు తత్వజ్ఞానిగా పరిగణించబడినాడు.
తర్వాత నాల్గవ శ్రోత వ్యాసుడు. ‘ వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసరూపాయ విష్ణవే ‘ అని విష్ణుసహస్రనామము చెప్పుచున్నది. విష్ణువు వ్యాసుడు ఇద్దరు ఒక్కరే అని భావము. ” మునీనామప్యహమ్ వ్యాసహ ” అనగా మునులలో వ్యాసుడను నేనే అని గీతలో చెప్పినందున వేదములను వేరుపరచిన వేదవ్యాసుడు తనతో సమానుడని ఆర్థము. వ్యాసుడు చెప్పు మహాభారత కావ్యము యొక్క వేగమును అందుకొని అదే వేగముతో వ్రాయుటకు విఘ్నేశ్వరునికే సాధ్యమైనది. వ్యాసుడు వేదవ్యాస భగవానునిగా గొప్ప స్తానాన్ని పొందాడు. అదియునుగాక ధృతరాష్ట్ర జననమునకు పూర్వము రాచరిక వ్యవస్థ యందు బీజప్రాధాన్యముతో వారసత్వ నిర్ణయము జరుగగా, అంబికా, అంబాలికల ద్వారా వ్యాసుడు క్షేత్ర ప్రాధాన్యముతో ధృతరాష్ట్ర, పాండురాజ, విదురులకు జన్మ నిచ్చి, కురువంశము అంతరించకుండా కాపాడగలిగాడు. ఈ ప్రకారముగా చూచిన గీత మొదటి శ్రోత అర్జునునకు వ్యాసుడు భాంధవ్యరీత్యా తాత అగుచున్నాడు. వ్యాసుడు కురువంశ చరిత్ర ఐన మహాభారత కావ్య రచయిత గానే కాకుండా తన వలన కలిగిన సంతానమునకు తగు సమయముల యందు సరి ఐన సలహాలు ఇస్తూ వారి క్షేమాన్ని కోరుకునేవాడు.
సంజయుని ద్వారా గీతను విన్న మొదటి శ్రోత ఇన ధృతరాష్ట్రునికి గల అర్హత గురించి విచారించిన యెడల, భారతములోని ఆదిపర్వము 5వ ఆశ్వాసము 42వ పద్యము నందు, ధృతరాష్ట్రుడు నూరు అశ్వమేధ యాగములు చేసినట్లుగా చెప్పబడినది. ఆ యాగఫలమే అతనికి గీతను వినుటకు అర్హత కలిగించినది.
భగవానుడు గీతను చెప్పుటకు కురుక్షేతమునే ఎందుకు ఎంపిక చేసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాము. కురువంశ మూలపురుషుడు కురు మహారాజు ఆ స్థలమును దున్నుటచే కురుక్షేత్రమను పేరు కలిగినది. ఇక్కడే బ్రహ్మ, అగ్ని, ఇంద్రాదులు తపస్సు చేశారు. ఈ ప్రవిత స్థలమున తపస్సు చేసినా, మరణించినా ఉత్తమ లోక ప్రాప్తి కలుగును. పరశురాముడు జమదగ్నికి పితృతర్పణము చేసిన స్తలము కూడా ఇదే. ఇటువంటి స్తలము ధర్మక్షేత్రముగా ప్రసిద్ది చెందినది.
శ్రీకృష్ణార్జునులు చిన్నతనము నుండి బంధురీత్యా బావామరుదులే కాక మంచి స్నేహితులు కూడాను. ఖాండవ దహన సమయమున, అరణ్యవాస సమయమున, సుభద్రార్జునుల వివాహము మొదలగు ఎన్నో సందర్భములయందు వారు ఏకాంతముగా గడిపినా వారి మధ్య ఎప్పుడునూ యోగవిద్య విషయములు చర్చకు రాలేదు. ఉత్తరగోగ్రహణ సమయమున భీష్మ, ధ్రోణ,కృపాచార్య, అశ్వతామ, కర్ణులు మరియు సోదర సమేతుడైన దుర్యోధనాదులను ఒంటరిగానే ఢీకొని విజయాన్ని సాధించాడు. కానీ కురుక్షేత్రమందు ఇరు సేనలలోని బంధుమిత్రులను చూచి, మమకార బంధు ప్రీతితో అర్జునుడు కలత చెందాడు. ఎందుకంటే ఈ కురుక్షేత్ర యుద్ధమున కురు పాండవులు తాడో పేడో తేల్చుకొనుటకు ప్రాణములను ఒడ్డి నిలబడ్డారు. ఇక్కడ గమనించ వలసినది ఏమనగా విజయమో, వీరస్వర్గమో అనే భావనతోనే అందరూ యుద్ధరంగమునకు వచ్చియున్నారు. వీరాధి వీరుడగు అర్జునుడు ఈ పరిస్థితిలో ” న కాంక్షే విజయమ్ కృష్ణ, నచ రాజ్యం సుఖానిచ ” అంటూ యుధా విజయము మీద, రాజ్య సుఖల మీద, వైరాగ్యము కలిగి ” యశ్చ్రెయ శ్యాన్నిశ్చితమ్ భ్రూహితన్మే, శిష్యస్తేహమ్ శాధిమామ్ త్వాం ప్రపన్నం ” శిష్యునిగా ఆశ్ర ఇంచిన నాకు ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించమని శ్రీకృష్ణుని గురువుగా భావించి శరణువేడెను. వైరాగ్యముతో శరణాగతి పొందిన శిష్యునకు మాత్రమే అతి రహస్యమైన రాజయోగమును గురువు బోధించవలసి ఉన్నది. అర్జునుని స్థితిని చూచి, అతనిని శిష్యునిగా స్వీకరించుటకు మరియు యోగవిద్యను ఉపదేశించుటకు అదే సరైన సమయమని శ్రీకృష్ణుడు తలచి, అర్జునుని శిష్యునిగా స్వీకరించి, తత్వబోధ చేయుటకు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమే యోగ్యమైనదిగా నిర్ణఇంచెను. గురువైన శ్రీకృష్ణుని యొక్క గీతోపదేశ ఫలితము అర్జునుడు 18వ అధ్యాయము చివర
” నష్టోమోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదన్మయాచ్యుతా
స్థితోస్మిగత సన్దేహహ కరిష్యే వచనం తవ !! అంటాడు.
అనగా, మాధవా నీ అనుగ్రహము వలన నా మోహము నశించినది. ఆత్మతత్వ విచారణా బుద్ధిని పొందాను. సందేహములు తీరిపోయినవి. నీవు చెప్పినట్లే చేస్తాను” అనెను. అజ్ఞాని ఐన శిష్యుడు, జ్ఞాని ఐన గురువు యొక్క ఉపదేశమును పొంది, యోగమాచరించిన, అతని అజ్ఞానము నశించి ఆత్మ జ్ఞాని అగును.
చాలా మందికి ఒక సందేహము కలుగవచ్చును. గీతలో 2వ అధ్యాయము నుండి 18వ అధ్యాయము వరకు యోగమును గురించి భగవంతుడు చెప్పెను. కానీ 1వ అధ్యాయములో భగవంతుని మాటలు గాని, యోగము గురించి గాని ఏ విషయములు లేవు. యుద్ధరంగ వివరణ, అర్జునుని చింతన, అతని వైరాగ్యము మాత్రమే కనబడుచున్నది. యోగమును గురించి చెప్పని ఈ అధ్యాయమును భాగవద్గీతలో ఎందుకు చేర్చారు?. చాలా అందముగా ఉన్న 4 లేక 5 అంతస్తుల భవనము ఒకటి ఉందనుకుందాము. అందరూ దాని నిర్మాణ పనితనమును గురించి గొప్పగా చెప్పుచున్నారు గానీ, ఆ భవనము యొక్క భారమును మోయుచు, భూమిలో ఉన్న పిల్లర్ల గురించి ఎవరు ఠలాచారు, కారణం? అది అందరికీ కనబడదు కనుక. అలాగే యోగము గురించి తెలుసుకోవలెనన్న, లేక ఆచరించ వలెనన్న, వైరాగ్యముతో బాటుగా గురువుకు శరణాగతి చాలా అవసరము. అది మొదటి అధ్యాయములో ఉన్నది. వీరుడైన అర్జునుడు బంధు ప్రీతితో యుద్ధముపైన ,రాజ్యభోగముల పైన విరక్తి చెంది, శ్రీకృష్ణుని శరణువేడెను. ఈ పరిస్థితి వారిద్దరి మధ్య ఎప్పుడు కలగలేదు. భగవద్గీత 2వ అధ్యాయము నుండి 18వ అధ్యాయము వరకు చెప్పిన యోగమునకు ఆధారము మొదటి అధ్యాయము లో అర్జునుని వైరాగ్యము. కావున మొదటి అధ్యాయము భాగవద్గీతలో ప్రముఖ పాత్ర వహించినది.
భగవద్గీతనుబోధించుటకు పట్టిన సమయమును గురించి విచారించిన, ఎవరుకూడా ఇంత సమయము పట్టినట్లు సాపేక్షముగా సిద్ధాంతరీకరించ లేదు. కొందరు చెప్పిన గీత బోధ సమయమును ఇతరులు ఆమోదించుట లేదు. గీతలోని మొత్తము శ్లోకముల సంఖ్య 701. అందులో 659 శ్లోకములు శ్రీకృష్ణార్జునుల సంవాదము. ఇరు సేనల మధ్య యుద్ధ వాతావరణము నెలకొన్నప్పుడు ఎవరికి వారు ఎంతో ఆతృతతో ఉంటారు. అటువంటప్పుడు గీత 659 శ్లోకములు చెప్పుటే కాక విశ్వరూప సందర్శనము వలన కలిగిన అనుభూతి నుండి అర్జునుడు కోలుకొనుటకు చాలా సమయమే పట్టిఉండును. కానీ యుద్ధరంగములో అనవసరమైన ఆలస్యము వలన యుద్ధవీరులలో అసహనము కలుగకూడదు కదా. అదియునుకాక అభిమానధనుడైన ధూర్యోధనుడు శ్రీకృష్ణార్జునుల సంవాదమును చూస్తూ ఊరికే కూర్చోడు. ధర్మము కొరకు పోరాడే పాండవ పక్షము వలన యుద్ధారంభము ఆలస్యమైనదను అపవాదు సాక్షాత్ భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కలుగనీయడు. భీష్మ పర్వము నందు యుద్ధము మొదటి రోజున జరిగిన భీకర యుద్ధము వలన ఇరు సేనలలో అపారమైన జాన నష్ట్టము కలిగినట్లున్నదే కానీ, శ్రీకృష్ణార్జునుల సంవాదము వలన ఆలస్యమైనట్లు చెప్పబడలేదు. భగవంతుడు గీతాయందు ” విష్ఠభ్యాహ మిదం కృత్స్నమ్ ఏకాంశెన స్థితో జగత్ ” అనగా నేనీ జగత్తు అంతయూ ఒక్క అంశము చేతనే వ్యాపించి ఉన్నా ” ననెను. మనము ఉన్న భూమితో పాటు సూర్యుని చుట్టూ పరిభ్రమించే అన్ని గ్రహాలు, నక్షత్రాలు కలిసి ఉన్న సూర్య మండలము ఒక జగత్తుగా చెప్పబడుచున్నది. మనము ఉన్నటువంటి ఈ సూర్య గ్రహ మండలమునకు ‘పాలపుంత’ అని పేరు. ఇంతటి విస్తారమైన జగత్తు భగవంతునికి ఒక అంశము మాత్రమే. ఇటువంటి జగత్తులు చాలా ఉన్నవి. కావున మానవ కాలమునకు అతీతముగా అర్జునునకు మాత్రమే వర్తించునట్లు గీతోపదేశము చేసి ఉండవచ్చును. గీతోపదేశమునకు పట్టిన సమయము 1 1/2 గంట మాత్రమేనని, భగవద్గీతలో చాలా ప్రక్షిప్తములు ఉన్నాయని, భగవంతుడు చెప్పిన గీత శ్లోకములను వేరుపరచి ఇస్తానని మన స్వామిగారు చెప్పినట్లు మన ఆశ్రమ సీనియర్ సాధకులు చెప్పుచున్నారు.
ఇక 18 అంకె గురించి కొంత చెప్పాలి. మహాభారతములోని పర్వములు 18. భగవద్గీత లోని అధ్యాయములు 18. మహాభారత యుద్దము 18 రోజులు జరిగినది. కురుక్షేత్రములో పాల్గొన్న మొత్తము సేనల సంఖ్య 18 అక్షౌహినులు. శక్తిపీఠములు 18. అయ్యప్పస్వామి గుడికి మెట్లు 18. ఇక ఈ కాలములో యువతీ యువకులు 18 సంవత్సరములు నిండిన వారిని మెజార్లుగా పరిగణించ బడుతారు. ఓటు హక్కు 18 సం|| నిండినవారు మాత్రమే వినియోగించుకోవాలి. 1+8 కూడిన 18 వస్తుంది. సంఖ్యాశాస్త్రములో 9 అంకె శుభ సంఖ్యగా చాలా గొప్ప విలువ ఉన్నది. అందువలన మహాభారతము నందు వ్యాసుడు 18 అంకెకు చాలా ప్రాముఖ్యత నిచ్చాడు.
భక్తుని భగవంతునితో కలుపు గీతే భగవద్గీత. భాగవద్గీతలోని 18 అధ్యాయములలో 1 నుండి 6 అధ్యాయములు కర్మ షట్కమని, 7 నుండి 13 అధ్యాయములు భక్తి షట్కమని, 13 నుండి 18 అధ్యాయములు జ్ఞాన షట్కమని కొందరు అంటారు. ఐనా భక్తి, కర్మ, జ్ఞాన యోగములు ఆయా షట్కములకే పరిమితము కాకుండా అన్ని అధ్యాయములను స్పృశించుచున్నవి. మరి కొందరు పెద్దలు ఈ 18 అధ్యాయములను రెండు భాగములుగా, అనగా 1 నుండి 9 అధ్యాయములు ఒక భాగము, మిగిలిన 10 నుండి 18 అధ్యాయములు రెండవ భాగముగా చేశారు.
మొదటి భాగము లోని సమస్యలు, సందేహములకు పరిష్కార సూచకముగా రెండవ భాగము లోని అధ్యాయములన్నారు. 10వ అధ్యాయము 1+0=1వ అధ్యాయమునకు, 11వ అధ్యాయము 1+1=2వ అధ్యాయమునకు, 12వ అధ్యాయము 1+2=3వ అధ్యాయమునకు, ఇలా 1+8=9వ అధ్యాయమునకు పరిష్కారములని చెప్పారు.
1 వ అధ్యాయము అర్జున విషాదయోగము నందు అర్జునుడు అశాశ్వతమైన శరీరమునకు సంబంధించిన బంధు, మిత్రుల ప్రీతితో దుఃఖించి , క్షత్రియ కర్మను వదలి ప్రాపంచిక సుఖములను ఏవగించుకొని వైరాగ్యముతో అస్త్రములను జారవిడిచెను. 10వ అధ్యాయము విభూతియోగము నందు ఈ చరాచర సృష్టి అంతయు శాశ్వతమైన నిరాకార, నిర్గుణ, నిరంజనుడైన భగవంతుని యొక్క వ్యక్తరూప పదార్థము, వ్యక్తుల గురించి వివరించి, అర్జునుని విషాదమును తొలగించుటకు భక్తియోగమును బోధించినది.
2 వ అధ్యాయము సాంఖ్యయోగము ఆత్మతత్వ విశదీకరణము, సకామ నిష్కామల శ్రేష్టత్వము, స్థితప్రజ్ఞుని లక్షణముల స్థిరబుద్ధి సాధనా ఫలములను నిరూపించగా, 11వ అధ్యాయమున సాంఖ్య యోగమును అనుసరించిన వారికి విశ్వరూప దర్శనముతోబాటుగా, భగవంతుని మహిమను అనన్య భక్తి స్వరూపము వివరించబడినది.
3 వ అధ్యాయము కర్మయోగమున, కర్మ యోగనిష్టలు, కర్తవ్యకర్మలు లేని జ్ఞానికి కార్యాచరణావశ్యకత, జ్ఞాని, అజ్ఞానుల లక్షణములు, రాగద్వేష కామస్వరూపముల గురించి విచారించగా, 12వ అధ్యాయము భక్తి యోగము నందు సాకార నిరాకార ఉపాసకుల శ్రేష్టత్వము, భాగవత్ప్రాప్తి పొందిన భక్తుల లక్షణములు తెలుపుచున్నది.
4 వ అధ్యాయము జ్ఞాన యోగము నందు కర్మ యోగా ప్రాచీన పరంపర, మహాపురుషుల మహాత్మ్యము, జ్ఞానుల మహిమా వర్ణనమును, వివరించగా, 13వ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము ద్వారా క్షేత్ర క్షేత్రజ్ఞుల, జ్ఞాన జ్ఞేయముల నిరూపణ, జ్ఞానసహిత ప్రకృతి పురుషుల వర్ణనములున్నవి.
5 వ అధ్యాయము కర్మన్యాస యోగము నందు సాంఖ్య యోగుల, కర్మ యోగుల నిర్వచనము, వారి లక్షణములు, సాంఖ్య కర్మ యోగ నిష్టులకుపయుక్తమగు ధ్యాన యోగములను వర్ణించగా, 14వ అధ్యాయము గుణత్రయ విభాగము నందు జ్ఞానము, ప్రకృతి పురుషుల ద్వారా సృష్టి క్రమము, సత్త్వ రజస్థ్వమో గుణముల వర్ణనము, త్రిగుణా తీత ప్రాప్తికి ఉపాయములు, చెప్పబడినవి.
6 వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము నందు కర్మయోగి ఆత్మోద్ధారణ, భగవత్ప్రాప్తి పొందిన వాని లక్షణములు, ధ్యానయోగ వర్ణన, మనోనిగ్రహమునకు ఉపాయములు,యోగి యొక్క సర్వశ్రేష్టత్వమును చెప్పగా, 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నందు భాగవథ్ప్రాప్తి సాధనములు పరామధామము యొక్క వర్ణన, జీవాత్మ, క్షర, అక్షర పురుషోత్తముల నిరూపణ గావించబడినది.
7 వ అధ్యాయము విజ్ఞాన యోగము నందు జ్ఞానయోగ ప్రశంస, పరా, అపరా ప్రకృతుల స్వభావము, సమస్త భూతముల ఉత్పత్తి, అసురస్వభావ అన్య దేవతోపాసకుల వివరణ,భగవంతుని సమగ్ర స్వరూపము నెరిగిన వారిని గురించి వివరించగా, 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము నందు దైవాసుర సంపదల వర్ణన, అసూరీ సంపత్తి గల వారి లక్షణములు, వారికి పట్టు గతి, కామ క్రోధ లోభ రూప నరక ద్వారములను త్యజించి శాస్త్రానుకూల కర్మాచరణను ప్రేరేపించ బడినవి.
8 వ అధ్యాయము అక్షర పరబ్రహ్మము, కర్మ, ఆదిభూతము,ఆది దైవము, సగుణనిరాకార, నిర్గుణ నిరాకార పరబ్రహ్మమును ఉపాసించు వారి అంత్య గతులు, పరంధామమును ప్రాప్తింపజేయు అనన్య భక్తిరూప సాధన, శుక్ల, కృష్ణ మార్గముల గురించి వర్ణించగా,17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగము నందు త్రివిధ శ్రద్ధల వర్ణన, గుణత్రయమును గురించి ఆహార, యజ్ఞ, తపో, ధ్యానముల బేధములు, ఓమ్ తత్ సత్, అసత్ ప్రయోగ వివరణలు ఇవ్వబడినవి.
9 వ అధ్యాయము రాజగుహ్య రాజా యోగము నందు విజ్ఞాన యుక్తమైన జ్ఞానము,భక్తి యొక్క మహిమా ప్రభావములు, అనన్య భక్తి మహిమల గురించి వివరించగా 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము నందు కర్మహేతువుల నిరూపణ, గుణత్రయానుసారముగా జ్ఞాన, కర్మ, కర్త, బుద్ధి, భేదము, ఫలసహితముగా వర్ణ ధర్మములు, జ్ఞాననిష్ఠ, భక్తి సహిత కర్మయోగ వర్ణన, శరణాగతి మహిమల గురించి వర్ణించ బడినది.
యోగము అను మాటకు అర్థం ఇప్పుడు తెలుసుకుందాము. ” జంతునామ్ నరజన్మ దుర్లభం ” అని గరుడ పురాణము చెప్పుచున్నది. ఈ జగత్తు నందు వున్న 84 లక్షల జీవరాశులు రెండు రకములుగా విభజింపబడినవి.
- వెన్నెముక గల జంతువులు
- వెన్నెముక లేని జంతువులు
వెన్నెముక లేని జంతువులు జపము చేయునపుడు స్థిర ఆసనమున వుండుటకు అవకాశము లేదు కావున వాటితో మనకు పని లేదు.
ఇక వెన్నెముక గల జంతువులు తిరిగీ రెండుగా విభజింప బడినవి.
- అడ్డు వెన్నెముక గల జంతువులు
- నిలువు వెన్నెముక గల జంతువులు
భగవధ్గీత ” సమంకాయం శిరోగ్రీవం . . . (6-13) అని చెప్పుచున్నది. అనగా శరీరము, శిరస్సు, కంఠము సమముగా నిలిపి కదలక, స్ధిరముగానున్నవాడై, దిక్కులుచూడక భ్రూమధ్యమును చూడవలెనని అర్ధము.
అడ్డు వెన్నెముక గల జంతువులు ఆసనము మరియూ దృష్టిని సరైన రీతిలో వుంచవు.
అదియును కాక అశనమును గ్రోలి త్రాణుడై పరిపుష్టుడై, ఊర్ధ్వాభి ముఖుడై అనగా పైకి ఎగబ్రాకుట ప్రాణుని గుణము. కావున సమంకాయ శిరోగ్రీవము,, స్ధిరాసనము, మరియూ దృష్టి తో బాటుగా, ప్రాణుడు పైకి ఎగబ్రాకుటకు నిలువు వెన్నెముక కలిగివున్న మానవుడే అచ్యుత యోగ విద్యను సాధన చేయుటకు అర్హుడు.
ఈ 84 లక్షల రకాల జీవరాశులకు ఆరు గుణములు సమానముగా ఉండును. అవి జననము, మరణము, నిద్ర, ఆకలి, మైథునము, భయము. కానీ మానవ జాతికి మాత్రము ఈ ఆరు గుణములతో బాటుగా తెలివి (బుద్ధి) ఆలోచనలు (మనస్సు) అను రెండు విశేష గుణములను అదనముగా ఆపాదించబడినవి. కనుకనే మానవులు ఉత్తమజాతి వారలుగా పరిగణింపబడుచున్నారు. తల్లి గర్భములో నుండి మరణము వరకు రాత్రింబగళ్ళు ప్రతి ప్రాణి తన ప్రేమేయము లేకనే ప్రతి క్షణము కర్మలను ఆచరిస్తూ ఉండవలసినదే. జన్మ జన్మల జీవన విధానము ననుసరించి ఈ కర్మఫలములు ఆధారపడి ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి కర్మ, ఊపిరి పీల్చుట మరియు వదలుట. ఊపిరి ఆడితే శివం, లేకుంటే శవం. శరీరములోని అన్నీ శరీర భాగములు శవముగా మారక మునుపు కూడా ఉండినవే. మరి లేనిది ఏమిటి? అదే శరీరమును కదలించే కంటికి కనిపించని చైతన్యశక్తి. ఈ చైతన్యశక్తితో బాటుగా పరమాత్మ అంశమైన ఆత్మ, ప్రతి చరాచరములలోనూ ఉంటుంది. చైతన్య శక్తి, ఆత్మల యొక్క కలయికనే యోగమందురు. గీతలో ఆత్మ గురించి 2వ అధ్యాయము సంఖ్య యోగము నందు చాలా విపులముగా చెప్పబడినది. కర్మానుసారము కర్మబంధముతో జనన మరణ చక్రము నందు కొట్టుమిట్టాడుచున్న చైతన్య శక్తి, మాయ ఆవరణమును దాటి జ్ఞానాగ్నిచే సమస్త కర్మలను దహించి వేసి, పూర్ణుడై, శుద్ధ అనంతమైన పరిపూర్ణమును చేరుటఏ జ్ఞానయోగుల యొక్క ధ్యేయము. గీత యందు చైతన్య శక్తి, ఆత్మల కలయిక మార్గములను, వాటి గుణములను విభాగములుగా చేసి చెప్పబడినందున ప్రతి అధ్యాయము యొక్క పేరు చివర యోగమను పదము చేర్చబడినది.
యతో ఇమాని భూతాని జాయన్తే ఏన జాతాని
జీవంతియత్ ప్రయన్త్య భి సంవిశన్తి ఇతి శ్రుతెహే
అనగా ఏ ఆత్మరూప బ్రహ్మము నుండి ఈ సమస్త భూతములు ఉత్పన్నమగుచున్నావో,ఏ ఆత్మ సత్త వలన జీవించుచున్నవో, మరలా దేని యందు లయించు చున్నవో, దానినే నీవు ఆత్మగా తెలుసుకొనుము అని శ్రుతి చెప్పుచున్నది.
ధ్యానబిందోపనిషత్తులో
తిలానాంతు యథాతైలం పుష్పగంధే ఇవాశ్రితః
పురుస్య శరీరేతు సబాహ్యాభ్యత్తరే స్థితః
నువ్వుల యొక్క సర్వాంగములలో తైలమును, పుష్పము యొక్క సర్వావయవములలో గంధము ఎలాగున వ్యాపకమై బెధములేక వ్యాపించి ఉన్నదో, అలాగే ఆత్మ జీవుల యొక్క అంతర మందునూబాహ్యమందును, సమానముగా వ్యాపకమై ఉండును. షట్+ఊర్మి= షడూర్మి – ఆరు గుణములను రహితము చేసిన, సత్య దర్శనమగును. ఆకలి దప్పికలు ప్రాణ ధర్మములు, శోకమొహములు మనో ధర్మములు, జాయతే, ఆస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే – అనగా పుట్టుట, జీవించుట, వృద్ధిచెందుట, బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య స్థితులుగా పరిణామము చెందుట, క్షీణించుట, నశించుట అనునవి స్థూల ధర్మములు.
“చిత్తవృత్త నిరోధః యోగః” అని పతంజలి మహర్షి చెప్పారు. చిత్తము అనగా మనస్సని, వృత్తులు అనగా ఇంద్రియములు అని వారి భావన. ఇంద్రియములను అదుపులో ఉంచుకొనుట జీవునకు అసాధ్యయము కాకపోయినా, అది అనుకున్నంత సులభము కాదు. అందుకే భగవానుడు గీతలో
యతతో హ్యాపీ కౌన్తేయ పురుషస్య విపస్థితః !
ఇంద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభాం మనః !
అని చెప్పాడు. అనగా ఆత్మ నిగ్రహము కొరకు ప్రయత్నించే విద్వాంసుని సైతము ఇంద్రియములు తమ వైపునకు బలవంతముగా లాగుకుంటాయని అర్థము. ఇంద్రియములను అదుపులో ఉంచుకొని ఆత్మలో కలియుటకు యోగసాధన చాలా అవసరము. మనలోని ఆలోచనల ప్రవాహమును సృష్టించునది మనస్సు. జాగ్రదావస్థలో, నిద్రావస్థలో మనస్సు విఛ్చలవిడిగా ప్రవర్తిస్తుంది. అనగా జాగ్రదావస్థలో మాయ పూర్తిగా ఉంటుంది. నిద్రావస్థలో ఇంద్రియములు అణగారినట్లనిపిస్తుంది. అది నిజము కాదు. కలలో లడ్డు తిన్నట్లుంటే, మేల్కొన్న తర్వాత ఆ లడ్డును తిన్నాట్లా? లేక తిననట్లా? ఇది ఒక భావనా మాత్రమే. జాగ్రదవస్థలో విజృంభించిన ఇంద్రియాలు నిద్రావస్థలో అణగి ఉండుటకు కొంత సమయము పడుతుంది. మనము పడుకుంటూనే నిద్ర రాదు కదా. ఎలాగంటే తాడు విడిచిన బొంగరము నిశ్చల స్థితికి వచ్చుటకు కొంత సమయము ఔతుంది. ఇదియును అంతే. ఇంద్రియాలు పూర్తిగా అణిగిందంటే అదే సుషుప్తి. ఈ సుషుప్తిలో ఇంద్రియములు కానీ, మాయ కానీ, ఉండదు. సుషుప్తిలో నిశ్చలమైన మనస్సు యొక్క అదుపులోనే ఇంద్రియగుణములైన శబ్ధ, స్పర్శ, రూప, రస, గాంధాదులు ఉంటాయి. ఈ విషయాన్నే యోగి వేమన
ఏ వంక మనస్సు కలిగిన
నావంకకు ఇంద్రియంబులన్నియు జేరును
నీ వంకకు మనస్సు కలిగిన
నే వంకకు ఇంద్రియంబు లేగవు వేమా— అని అన్నాడు.
మనస్సు యొక్క ఆలోచనలు ఎటువైపు వెళుతుందో ఇంద్రియములన్నియు మనస్సుతో బాటే ఉంటుంది. ఎందుకంటే, మనస్సు ఇంద్రియములకు రాజు. కావున భగవంతుని వైపు మనస్సును మరల్చగలిగితే, మనస్సుతో బాటుగా ఇంద్రియములన్నియు, సూర్యుని యెదుట దీపము వలే, వాటి సహజ గుణములను కోల్పోవును. అప్పుడు ఆత్మ తప్ప మిగిలిన 24 అనాత్మ తత్వములు చలన రహితమై నిశ్చలముగా ఉంటాయి. దీనినే అమనస్కస్థితి అందురు. ఆత్మానాత్మ విచారణ చేయు జ్ఞానులకు తప్ప మిగిలిన వారికి అమనస్క స్థితి గురించి తెలియదు. ఎప్పుడైతే మనస్సు నిశ్చలముగా ఉంటుందో, అప్పుడు వారు యోగా సాధనలో మొదటి మెట్టును అధిగమించినట్లుగా భావించాలి. యోగవిద్యలో తర్వాత స్థాయిని అందుకొనుటకు తీవ్రమైన సాధన చేయవలసి ఉంటుంది.
పరమాత్మ యొక్క ఒక కిరణమే ప్రతి జీవియందున్న ఆత్మ. భగవంతుడు పరిశుద్ధుడు కనుక ఆత్మ కూడా పరిశుద్ధమే. కానీ ఆత్మ మానవ ఊహలకు అందని భగవంతుని అత్యున్నత స్థానము నుండి క్రిందకు దిగివస్తూ, పంచభూతముల ఆవరణము లోనికి రాగానే, వాటి మాలిన్యములచే ఆవరింపబడి, అపరిశుభ్రమై ఒక జీవి యందు ప్రవేశించును. తాను ఎక్కడి నుండి వచ్చేనో, తన స్వస్వరూప మేమిటో మరచిపోయి, క్రియాశక్తి అయిన చైతన్య శక్తితో పనులను అనగా కర్మలను చేయిస్తు, మాయా వలన శరీర బంధములను పెంచుకొని, చేసిన పనుల ఫలితములను అనుభవించుటకు జనన మరణ చక్రములో తిరుగు చుండును. ఆత్మ తన స్వరూప జ్ఞానమును తెలుసుకొనుటకొరకు మాయా యొక్క పొరను ఛేదించ వలసి ఉంటుంది. అది యోగసాధన ద్వారా మాత్రమే సాధ్యము.
ఒక కాకి ఒక ఓడ పైభాగమున కూర్చొని ఆదమరచి నిద్రపోయింది. ఓడ బయలుదేరి సముద్రములో చాలా దూరము ప్రయాణమైన తర్వాత, కాకికి మెలకువ వచ్చింది. ఎంతసేపు ఎగురుతూ పోయినా, తీరము కనబడక తిరిగి వచ్చి ఒడపై కూర్చోనెను. తీరమునకు వెళ్లుటకు చాలా సార్లు ప్రయత్నించి, విఫలమై, అలసి పోయి తిరిగి ఒడను చేరెను. దీనినే ” నౌకాగ్ర కాక న్యాయము ” అనెదరు. సాధన ద్వారా ఇంద్రియములను నిగ్రహించుటకు తీవ్రముగా ప్రయత్నించినచో, కాకిలాగా బాహ్య విషయముల నుండి విడిపోయి, వాటి గుణములన్నియు అణగారిపోతుంది.
గీతావాశిష్ట్యము ” అభ్యాసేనవినా సాధ్యోన సిద్ధి ముపగచ్ఛతి ” అని చెప్పుచున్నది. అనగా అభ్యాసము ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానము సిద్ధించును. కావున స్వప్రయత్నము చేయవలెనని అర్థము. అందువలననే భాగవద్గీతలోని 18 అధ్యాయములన్నియు యోగసాధనా మార్గములే.
ఒక కావ్యము యొక్క కథా ప్రారంభమును ఉపక్రమమని,ముగింపును ఉపసంహారమని అంటారు. ఉపక్రమమము, ఉపసంహారములకు సంబంధము ఉన్న యెడల ఆ కావ్యము ముఖ్య లక్షణములు గల ఉత్తమ కావ్యముగా పరిగణించబడును. భగవద్గీత మహాభారతము మధ్యన ఉన్నా, దానికి ఉత్తమమైన కావ్యలక్షణములు కల్పించుట కావ్యకర్త అయిన వ్యాసునికే చెల్లినది. గీత ఉపక్రమముగా, మొదటి అధ్యాయము 1వ శ్లోకము, ధృతరాష్ట్ర ఉవాచ ” ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవహ మామకాః పాణ్డవాచ్చైవ కిమకుర్వత సంజయ “ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు యుద్ధసన్నద్ధులైన నావారు, మరియు పాండవులు ఏమిచేశారు సంజయా అని ధృతరాష్ట్రుడు అడిగాడు. గీత 18వ అధ్యాయములతో 701 శ్లోకములు జరిగినా, సంజయుడు ధృతరాష్ట్రుని ప్రశ్నకు జవాబుగా 18వ అధ్యాయము చివరి శ్లోకములో
యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర పార్ఠో ధనుర్ధరః
తత్రశ్రీర్విజయో భూతిః ధ్రువా నీతి మతిర్మమ
అని బదులిస్తాడు. అనగా ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో, అక్కడ సంపద, విజౌయము, ఇశ్వర్యము, నీతి ఉండునని నా మతికి ధృఢముగా తోచు చున్నదనెను. ధర్మము, అధర్మమునకు మధ్య జరుగు యుద్ధమునందు శ్రీకృష్ణార్జునులు ఉన్నవైపు విజయము కలుగునను అర్థముతో చెప్పెను. అంటే ప్రకాశమును చూడలేని, చీకటిణే ఆశ్ర ఇంచిన అజ్ఞాని ధృతరాష్ట్రునితో ప్రారంభమైన భగవద్గీత, చీకటిని పారద్రోలు ప్రకాశవంతమైన జ్ఞాని, భగవంతుని విశ్వరూపమును దర్శించిన పుణ్యాత్ముడు, కర్మయోగి అయిన సంజయుని మాటతో ముగుస్తున్నది. అనగా అజ్ఞాని భాగవద్గీతను విన్నా, పఠీయించిన, జ్ఞాని అగునని విశిదమగుచున్నది.
భగవద్గీతా కించిదధీతా
గంగాజల లవకణికా పీతా
సకృదపియేన మురారి సమార్చా
క్రియతే తస్య యమేన న చర్చా
అని భజగోవిందము చెప్పుచున్నది. ఎవనిచేత భగవద్గీత కొంచమైనను అధ్యయనము చేయబడినదో, గంగా జలమును లవణ మాత్రము త్రాగబడినదో, కొంచమైనను ఏదైనా శ్రీకృష్ణునికి అర్పించబడినదో, వానికి ఎటువంటి సంకోచము, భయము లేకుండా, ” నా స్వంతపనులను చక్కపెట్టుకోవాలి, ఇప్పుడు రాలేనని యమునితో వాదించక, అన్నిటిని త్యజించి, తక్షణమే శరీరమును వదలిపెట్టును ” అని భావము.
వరాహపురాణము నందలి గీతమాహాత్మ్యము ” గీతాయాః శ్లోకదశకం, సప్త పంచ చతుష్టయం ద్వౌథ్రీనేకమ్ తదర్థం వా శ్లోకానాం యః పఠీన్నరహ చంద్రలోక మావాప్నొతి వర్షాణామయుతం ధ్రువం గీతా పాఠసమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ “ అని చెప్పుచున్నది. అనగా, గీతలోని శ్లోకాలు పది, ఏడు, ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటికానీ ఆఖరుకు అర్థశ్లోకము కానీ అనుదినము పాఠీఇంచు వాడు పదివేల సంవత్సరాలు చంద్రలోకములో సుఖ జీవనము సాగిస్తాడనడములో సందేహము లేదు. గీత పారాయణము చేస్తూ మరణించే వాడికి తిరిగి మానవ జన్మ లభ్యమగును. భగవద్గీత యందు ఏకీ శ్లోకగీతగా పేరు గాంచిన
యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర పార్ఠో ధనుర్ధరః
తత్రశ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ
అను ఒక శ్లోకమును పఠిఇంచిన ఎడల భగవద్గీతను పూర్తిగా చదివిన పుణ్యము కలుగునని పెద్దలు చెప్పుదురు.
భగవంతుని అవతారమైన శ్రీకృష్ణుడు అర్జునుని పరిస్థితిని చూచి ” నీవు భయపడవద్దు, యుద్దము చేయి, మిగిలిన పని నేను చూసుకుంటాను ” అని చెప్పి ఉండవచ్చును. లేదా మాయ మంత్రములతో కురూపి అయిన కుబ్జను తాకి సౌందర్యవతిగా చేసినట్లు, అర్జునుని తాకి, ఇప్పుడు చేసిన ఆలోచనలు జ్ఞప్తికి రానీయకుండా, పూర్వపు శత్రుభయంకరుడైన అర్జునునిగా మార్చివేసి ఉండవచ్చును. ఇవేవీ చేయకుండా శ్రీకృష్ణుడు గురువై , విచారగ్రస్తుడైన అర్జునుని చూచి, అత్యుత్తమమైన సాంఖ్యయోగమనే ఆత్మ తత్వమును బోధించుటచే, శాశ్వతమైన బ్రహ్మానందమును లక్ష్యముగా చూపెను. కనుకనే ఇది శ్రీమద్భగవద్గీత అయినది.
వేదాంతపరమైన అన్ని మార్గముల సమన్వయము, నిష్కామకర్మ, అను రెండునూ గీత యొక్క ముఖ్య లక్షణములు. ప్రపంచములోని అన్ని కులమతాలకు అతీతముగా, బ్రాహ్మణ చండాల, కుక్క మాంస భక్షకుల యందు సమానమైన ప్రేమ, సర్వభూత దయ కలిగి ఉండాలని గీత బోధిస్తున్నది. అందువలననే వివిధ ఆధ్యాత్మిక చింతనా పద్ధతులను అనుసరించి వారు అనగా ద్వైత మత ప్రచారకులు మధ్వాచార్యులు, అద్వైత మత స్థాపకులు ఆదిశంకరాచార్యులు, విశిష్టాద్వైత మతస్థులు శ్రీకంఠశివాచార్యులు, అందరుకూడా గీత యొక్క విశిష్టతను పొగిడినవారే. మహనీయులైన స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, డా!! సర్వేపల్లి రాధాక్రిష్ణ, ఇతర మతస్థులైన విదేశీయులు సి.పి.బ్రౌన్, ఎడ్విన్ ఆర్నాల్డ్, వార్న్ హేస్టింగ్స్ మొదలగు వారు భాగవద్గీతకు పాఠకులై గీత యొక్క విశిష్ఠతను ఇతరులకు చాటి చెప్పారు.
రామాయణము ఎక్కడ జరుగుచుండునో అక్కడకు ఆంజనేయుడు ఏదో ఒక రూపమున వచ్చునని ప్రతీతి. అలాగే
గోపాలో బాలకృష్ణోపి నారదుద్ధవ పార్షదైహి
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే !!
అనగా ఎచ్చట గీత యొక్క విచారణ, పఠనము బోధనము జరుగుచుండునో అచ్చటకు గోపాలుడగు బాలకృష్ణుడున్నూ, నారద ఉద్ధవాది ఋషి పుంగవులతో కూడా సహాయ నిమిత్తము శీఘ్రముగా వచ్చి చేరుదురని అర్థము. ఆదిమధ్యాంత రహితుడైన అచ్యుతుడు చెప్పినది, పురుష శ్రేష్టులు విన్నటువంటి గీతను విన్న, పఠించిన వార్ల జీవితములు ధన్యము. వారికి భగవంతుని కరుణా కటాక్షములు తప్పక కలుగును.
భగవద్గీత విశిష్టతను నాకు తెలిసినంత వరకు విజ్ఞులైన మీకు తెలియచెప్పాలనే ఉద్దేశముతో అత్యుత్సాహము కనబరచి ఇన్ని విషయములు విశిదీకరించినాను. అంతేకానీ ఇవన్నీ మీకు తెలియదని కాదు.
రేపటి నుండి భగవద్గీత 1వ అధ్యాయము ప్రారంభమగును.
శ్రీమద్భగవద్గీత
ప్రథమోధ్యాయః
అర్జున విషాదయోగః
ధృతరాష్ట్ర ఉవాచ:
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతా యుయుత్సవః
మామకాః పాణ్డవాశ్చైవ కిమ్ ఆకుర్వత సంజయ
శ్లోకార్థము:
సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు యుద్ధసన్నద్ధులైన నావారు, పాండవులు ఏమి చేశారని ధృతరాష్ట్రుడు అడిగాడు.
విశేషార్థము:
ధృతరాష్ట్ర అనగా రాష్ట్రమును లేక రాజ్యమును గట్టిగా పట్టుకున్నవాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా ఉన్నా, జేష్టుడు అయినందున రాజైనాడు. పాండురాజు సహాయముతో నూరు అశ్వమేధ యాగములు చేసి, రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నాడు. పాండురాజు సోదర ప్రేమతో రాజ్య భారమును వహించెను. రాజ్యములో పర్యటిస్తూ ప్రాజాల అవసరములను తీరుస్తూ వారిని కన్నబిడ్డలవలే ఆదరించెను. పాండురాజు ఉన్నంతవరకు అన్నీ తానై ఇది గుడ్డిరాజు పాలన అని ఎన్నడూ లోపము రానీయలేదు. పాండురాజు తనపై చూపిన ప్రేమలో ధృతరాష్ట్రుడు తన తమ్ముని కుమారులపై కొంతైనా చూపించి ఉంటే ఈ మహాభారత యుద్ధము జరిగేదే కాదు. కులక్షయము అయ్యేదేకాదు. పాండురాజు మరణానంతరము అతని కుమారులకు న్యాయముగా ఇవ్వవలసిన రాజ్యమును యిచ్చుటకు సుతరాము ఇష్టపడక నెపమును ధూర్యోధనుని పైకి నెట్టి, తన్నుతాను అసహాయుడుగా చిత్రించుకున్నాడు. తమ్ముని కుమారులకు న్యాయముగా ఇవ్వవలసిన రాజ్యమును కూడా తనదిగా భావించి గట్టిగా పట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు అతనికి తన శరీరలోపము కూడా గుర్తుకు రాలేదు. ” మామకాః ” నావారు అన్నప్పుడు ధృతరాష్ట్రుని మమకారము ఎంత వికారమైనదో తెలుస్తున్నది. నావారు, పాండవులు ఏమి చేశారని అల్పబుద్ధితో అడుగుతున్నాడు.
రాయబార సమయమున తన కుమారులు చేసిన పాశవిక ఆలోచనలతో, శ్రీకృష్ణుని బంధించుటకు ప్రయత్నించినపుడు, ఆ సభలో సాత్వికులను తప్ప మిగిలిన వారందరికి శ్రీకృష్ణుడు మూర్చవచ్చునట్లు చేసెను. ధృతరాష్ట్రునికి దివ్య చక్షువులిచ్చి, శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపెను. శ్రీకృష్ణుడు భగవంతుని అవతారమని తెలి సినా, ధర్మము పాండవుల వైపు ఉన్నదున శ్రీకృష్ణుడు ఆ పక్షమున ఉన్నాడని తెలిసినా కూడా, ధృతరాష్ట్రునికి తనవారి శక్తి సామర్థ్యములపై అపారమైన నమ్మక మున్నది. భీష్మ, ధ్రోన, కృపాచార్య, అశ్వతామ, కర్ణుల శౌర్య పరాక్రములు, దుర్యోధనుని గాధా యుద్ధ నైపుణ్యము ముందు శ్రీకృష్ణ సమేత పాండవులు అల్పముగా కనిపించినారు. కర్ణుడు అర్జునుని , దుర్యోధనుడు భీముని సంహరించిన, పాండవులు యుద్ధమును విరమింతురని భ్రమించాడు. అంతిమ విజయము తన కుమారులదే నని ఆశపడ్డాడు.
సంజయుడు మొదటి రోజు నుండి యుద్ధభూమిలో తిరుగుచూ భీష్ముని అంపశయ్యానతరము ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి భోరున విలపిస్తూ భీష్ముని విషయమును తెలియపరుస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుటయే ఈ మొదటి శ్లోకము. ఈ పది రోజుల యుద్ధవిషయములను మరియు భగవద్గీతను కూడా విన్న ధృతరాష్ట్రుడు అప్పటికి కూడా ఇంకనూ తనవారిపై నమ్మకమును ఉంచుకున్నాదంటే అతడు ఎంతటి మూర్ఖుడో తెలుస్తున్నది. గీతలో భగవంతుని విశ్వరూప సందర్శనమునందు
ద్రోణ్ణంచ భీష్మంచ జయధ్రంచ కర్ణం తతన్యానాపి యోధవీరాన్
మయా హతాంత్వమ్ జహి మావ్యథిష్టాః యుద్ధస్య జేతసీ రాణె సపత్నాన్
అనగా నా చేత ఇదివరకే చంపబడిన ద్రోణ్ణాచార్యుని, భీష్మాచార్యుని ,జయధ్రధుని , కర్ణుని, అట్లే ఇతర యుద్ధవీరులను సైతము నీవు నిమిత్తమాత్రుడవై చంపుము. భయపడకుము. యుద్ధము చేయుము అన్నప్పుడు యుద్ధమందు నీవు శత్రువులను జయించగలవు అని అర్థము. ఇప్పుడైనా ధృతరాష్ట్రుడు మిగిలిన వారిని కాపాడు కొనుటకు యుద్ధమును నిలిపి వేసి ఉండవచ్చును. ఇది అతని స్వయంకృతాపరాధము. ధర్మక్షేత్రమైన కురుక్షేతములో ధర్మమే గెలుస్తుందని తెలిసి కూడా అజ్ఞానముతో జ్ఞాని అయిన సంజయుని యుద్ధ విషయములు అడుగుచున్నాడు.
అంతరార్థము:
కురుక్షేత్ర మనగా అన్నమయ కోశము. ధర్మక్షేత మనగా ప్రాణమయ కోశము. ఈ రెండు కూడా మనిషి స్థూల శరీరమునకు, దాని పరిణామమునకు సంబంధించినది. ధృతరాష్ట్రుడు ఆశా వ్యామోహములు, ఇంద్రియములు, మనస్సు, అహంకారము, అరిషడ్వర్గములన్నియు కలిపి మూసపోసిన తమొగుణము గలవాడు. అవిద్యతో కూడిన అజ్ఞాని, గుడ్డివాడు, అనగా జ్ఞానమను ప్రకాశమును చూడలేనివాడు. నా వారు అనగా తమొగుణమునకు సంబంధించిన వారందరూ ఆజ్ఞానులే. పాండు అనగా తెలుపు. సత్వగుణమునకు ప్రతీక. సంజయుడు సుబుద్ధి గుణము. తమొగుణము, సుబుద్ధి ద్వారా మనస్సు, అహంకార నాయకత్వమున సత్వగుణముతో జరుగు రణ విశేషములను తెలుసుకోగోరుచిన్నది. సత్వగుణము ఆత్మతత్వమునకు సంబంధించినది. ఈ శ్లోకమునకు అంతరార్థ మేమనగా ఆత్మతత్వము అనగా, పాండవులకు అనాత్మ తత్వములైన దుర్యోధనాధులతో కురుక్షేత్రమందు అనగా ఈ స్థూల శరీరమునందు జరుగు యుద్ధ విశేషములను తమొగుణము శుద్ధబుద్ధి తత్వాన్ని అడుగు చున్నది. ఈ శరీరములో జరుగు చున్న మంచి చెడుల పోరాటమే ఈ యుద్ధమని తెలియదగినది.
సంజయ ఉవాచ:
దృష్ట్వాతు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధన స్తదా
ఆచార్యమ్ ఉపసఙ్ఘమ్య రాజా వచనమ్ అబ్రవీత్
శ్లోకార్థము:
రాజైన దుర్యోధనుడు, వ్యూహాకారముగా రచింపబడిన పాండవ సైన్యమును చూచి, ఆచార్యుడైన ద్రోణుని సమీపించి సంజయుడు ఇట్లనెను.
విశేషార్థము:
యుద్ధములందు ఒక్కొక్క అక్షౌహిణికి నియమించ బడిన సైన్యాధ్యక్షులు సర్వసైన్యాధ్యక్షునితో ఉమ్మడిగా చర్చించుకొని, వారి వారి సైన్యములను రోజుకొక వ్యూహముతో శత్రు సైన్యములను మానసిక ఒత్తిడికి గురి చేయడమో, లేదా శత్రు దుర్భేధ్యముగా చేసుకొను చుందురు. ఆయా సైన్యాధ్యక్షుల యొక్క బుద్ధి కుశలతపై లేదా అనుభవముతో ఇట్టి వ్యూహముల రచనా ఆధారపడి ఉంటుంది. పాండవుల పక్షాన సర్వసైన్యాధ్యక్షుడు దృష్టధ్యుమ్నుడు మొదటి రోజు రచించిన వజ్ర వ్యూహమును చూచి, దుర్యోధనునికి ఆశ్చర్యము, మానసికముగా కొంత జంకు కలిగినా, పైకి కనబడనీయలేదు. కౌరవ సేనకు సర్వసైన్యాధ్యక్షుడు తన తాత భీష్ముడే.
పాండవ సేన రచించిన వ్యూహమునకు ధీటుగా ఇంతవరకు భీష్ముడు ఇక్కడ వ్యూహరచన చేయలేదేమో ననిపించింది. ద్రోణాచార్యుడు ఆ కాలములో వివిధ రాజకుమారులకు విలువిద్య, యుద్ధ తంత్రములు నేర్పు వారుగా ప్రసిద్ధి పొందాడు. కౌరవులు, పాండవులే కాక, దృష్ట దృమ్న్యాది రాజ కుమారులు ద్రోణునికి శిష్యులే. దృష్టద్యుమ్నుడు పాండవ సర్వసైన్యాధ్యక్షునిగా తన నైపుణ్యముతో శత్రువులకు ప్రారంభములోనే భీతి కలిగించు వ్యూహమును రచించెను. దుర్యోధనుడు శత్రుపక్షము వారి వ్యూహమును చూచి విస్మయమొంది, భయము చెంది, ధైర్యమును దిగజార్చు కొనుట మొదటి మెట్టు.
పరశురాముని జయించిన ధీరుడు, ఎంతో యుద్ధానుభవము కలిగినటువంటి తనపక్ష సర్వసైన్యాధ్యక్షుడైన తన తాత యొక్క వ్యూహరచనా పటిమను పసిగట్ట లేకపోవుట, తన సైన్యము మీదే నమ్మకము సన్నగిల్లునట్లు భావించుట మరొక అశుభ సూచకము. దుర్యోధనుడు ఈ పరిస్థితిలో మానసికముగా ధైర్యమును కోల్పోయి, ఏమి చేయుటకు పాలుపోక తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళినాడు. పాండురాజు మరణానంతరము యువరాజైన దుర్యోధనుడే తన తండ్రికి బదులుగా రాజ్యమును ఏలుచుండెను. అందువలన అందరిచేత రాజుగా పరిగణింపబడుచుండెను. సంజయుడు యువరాజు అనుటకు బదులుగా ” రాజా వచన మబ్రవీత్ ” రాజు అని సంబోధించినాడు. అదియునుకాక అతను ధృతరాష్ట్రుని వద్ద పనిచెయు చున్నందున, మహారాజు మనసెరిగి ప్రవర్తిస్తున్నందున, దుర్యోధనుని రాజు అని సంబోధించిన ధృతరాష్ట్రుడు సంతోషించునని తలచాడు.
రాజుకు యుద్ధభూమి యందలి వ్యూహరచనలపై ఏదేని సందేహములున్న రాజు ఆ సైన్యాధ్యక్షుని తన వద్దకు పిలిపించుకొని మాట్లాడుతాడు . ఇక్కడ సర్వసైన్యాధ్యక్షుడు తన తాత అయినందున ఆయనపై గౌరవముతో ఈ సేనా వ్యూహమును గురించి చర్చించుటకు ఇష్టపడక, ఈ వ్యూహరచన గురించి సందేహములను ద్రోణుడే తీర్చగల సమర్థుడని, అతనిని రాజు సమీపించి ఇట్లనెను.
అంతరార్థము:
చెడు వైపు మాయా ప్రభావముతో తమూగుణ ప్రధానమైన మనస్సు యొక్క ఆధీనములో ఇంద్రియములు, అరిషడ్వర్గములు, సప్త వ్యసనములు, అష్టమదములు ఉండును. మంచి వైపు చైతన్య శక్తి , జ్ఞానశక్తి అయిన బుద్ధి, సత్వగుణము ఉండును. సత్వ గుణము వైపు తక్కువ గుణములు ఉన్నాకూడా, చెడుపై యుద్దము చేయుచున్నందున, అది తన బుద్ధితో పటిష్టమైన రక్షణ కవచమును ఏర్పరచుకొనుటయే కాక, పోరాటమునకు సర్వసన్నద్దమై ఉన్నది. అహంకారము యొక్క నాయకత్వములోని తమొగుణము సత్వగుణము యొక్క వ్యూహమును చూచి, తనకు ఎక్కువ గుణములు ఉన్నాకూడా, కొంత భీతి చెందినది, ఎవరికి తలవంచని నా అనే అహంకారమైన దుర్యోధనుడు సర్వసైన్యాధ్యక్షుడైన మనస్సు వద్దకు కాక, తన గురువైన రాజోగుణము వద్దకు వెళ్ళి ఇలా చెప్పుచున్నది.
ద్రోణుడు ఆచార్యుడైనా, రాజు వద్ద పనిచెయు చున్నదున, మాయా జూదము, ద్రౌపది వస్రాపహరణము లందు, రాజుగారి మనస్సు సంతోషము కొరకు మారు పలుకాకుండా ఉన్నాడుకదా. అనగా ఈ రాజోగుణములో కొంత సత్వగుణము కలసి ఉన్నా, తమొగుణ ప్రభావము ఎక్కువగా తనపై ఉన్నందున రాజోగుణములోని సత్వగుణము మరుగున పడిపోతుంది. ద్రోణాచార్యుడనే రజోగుణము విలువిద్యను కౌరవ పాండవులకు సమానముగానే బోధించినా, కౌరవుల కంటే పాండవులు ఆ విద్యలో మేటి అయినారంటే అర్థము, రాజోగుణములోని సత్వగుణమును పాండవులు తమ సత్వగుణ ప్రకాశముతో స్వీకరించగా, మిగిలిన చీకటి గుణమును దుర్యోధనాధులనే తమొగుణము తీసుకున్నది. ఈ విషయమును ఇంకా బాగా చెప్పాలంటే, దుర్యోధనాదులు చీకటిలోనే ఉంటూ చీకటినే అనుభవిస్తారు. ఇక్కడ చీకటి అనే తమొగుణము ప్రకాశవంత మైన సత్వ గుణము చేయు పనులను చూచి ఓర్వలేక రజోగుణము వద్దకు వెళ్ళినదని అర్థము.