అచ్యుత యోగ సుధాసారం

– శ్రీ ఉదయభాస్కర్ దువ్వూరి

Last updated: Jan 24th 2019

మొదటి అధ్యాయం

Part 1                                                  08-Nov-2018

యద్యదా చరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే।।

శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తన లేదా ఆచరణలను ఇతరులంతా అనుసరిస్తారు. ఆ వ్యక్తి నెలకొల్పిన ప్రమాణాలను లోకమంతా పాటిస్తారు, సమస్త జనులచేత పాటింప జేస్తారు. అటువంటి మహా మహితాత్ముడు మన శ్రీ యోగి అచ్యుతులు.

1904 లో కూర్గు జిల్లాలోని బెంగూరు అనే ప్రదేశంలో క్షత్రియ కుటుంబం లో జన్మించేరు యోగి అచ్యుతులు. పక్షుల కిలకిలారావాలతోను రమణీయమైన సెలయేరు లతోను సతత హరితారణ్యాలతోను ఒప్పారే కూర్గు ప్రాంతమది.

మా స్వామి సుమారు 1931 ప్రాంతంలో అంటే తన 27వ సంవత్సరంలో మంగళూరు అడవులలో బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్న ఒక ఋషి ద్వారా ఈ యోగ విద్య యొక్క ఉపదేశాన్ని పొందేరు. తర్వాత స్వామి గారి మాటలలో ఆ ఋషి పేరు శివానంద యోగి గా తెలియవచ్చింది. 1938 నుంచి 1940 వరకూ హంపిలోని రత్నకూట గుహలో ఏకాంతవాసములో తపస్సు చేసేరు. తర్వాత చాలాకాలం హంపిలో వైద్యులుగా, కృషీవలులుగా ప్రజలలో ప్రసిద్ధి చెంది సామాన్య మానవునిలా జీవితాన్ని గడిపేరు. 1949 లో హంపిలోని తుంగభద్ర నదిలో ఉన్న విరుపాపుర గడ్డ అనే ద్వీపంలో ఋష్యమూకాశ్రమాన్ని స్థాపించేరు.

ఆచరణ శూన్యమైన మాటలను, క్రియాశూన్యులైన మనుషులను ఆయన ఎప్పుడూ దరి చేరనీయ లేదు. నిజముగా తత్వ కాంక్ష తో తన చెంత చేరిన శిష్యులను సాధనలో పరిపూర్ణులుగా తీర్చి దిద్దేవారు.

మనం తిన్నగా అచ్యుత యోగి విద్య గురించి తెలుసుకుందాం. మధ్య లో సమయం వచ్చినప్పుడల్లా యోగి అచ్యుతుల గురించి వారి బాల్యం, యోగా అభ్యాసం, శిష్యుల సాధనా శిక్షణ గురించిన వివరాలు చెప్పుకుంటూ ఉందాం.

యోగి అచ్యుతులు నేమకల్లు గ్రామంలో ఇచ్చిన ఉపన్యాసంలో వివరించిన ఆధ్యాత్మ సాధన- పరమపదవి (ఏకైక మార్గమే ) అనే అంశమే ఈ యోగవిద్యా విధానానికి అద్దం పడుతుంది. ముందుగా దానిని అర్ధం చేసుకుందాం.

యవ్వనంలో ప్రాపంచిక శుఖాలను అనుభవించి ముసలితనము వచ్చిన తర్వాత మోక్షానికై ప్రాకులాడం అనేది సాధారణంగా మనమంతా, ఈ మానవులంతా, చేసే పని. నిజానికి శరీరంలో బాగా శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమాత్మ దర్శనానికై తీవ్ర కృషి చేస్తే తప్ప ముక్తిని పొందడం మనకు కాని పని.

అలాగే బహు పుస్తక పఠనం వల్లకాని, భక్తి ప్రవచనాలను వినడం వల్లగాని మనం ముక్తిని పొందలేము. ప్రత్యక్ష సాధన లేనిదే నిన్ను నీవు తెలుసుకోవడం గాని, ముక్తిని పొందడం గాని సాధ్యమయ్యే పని కాదు.

దాహంతో ఉన్నవాళ్ళకు నీరు, ఆకలితో ఉన్నవాళ్ళకు అన్నం, బాగా శ్రమ పడిన వాళ్ళకి నిద్ర ఏరకంగా అయితే శరీరానికి తృప్తిని, మనస్సుకు చైతన్యాన్ని ఇస్తాయో అలాగే అసలైన నిజ సాధనామార్గం సాధకుడికి తృప్తిని, చైతాన్యాన్ని ఇస్తుంది.

మనకు ఈ మనుష్య జన్మ ఎందుకు వచ్చి ఉంటుంది? ఉదాహరణకు మనం ఒక కారు లేదా బండిని ఎందుకు తయారు చేసుకుంటాము? ఆ వాహనముచేత పనిచేయించుకోవడానికే కదా! అలాగే మన ఈ శరీరము లోపల ఉన్న చేతనత్వం తనకు నియమించిన పని చేయడానికి ఈ శరీరాన్ని ఆశ్రయిస్తాడు. అంటే తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికే ఈ శరీరాన్ని ఆసరాగా తీసుకొని భూమి మీదకు వస్తోంది.

శ్రద్ధగా పరిశీలిస్తే భూమి మీద పుట్టిన ప్రతి సస్యవర్గం అంటే ప్రతి చెట్టు మనకు నీడనిస్తూ గాని, ఆకు, పూవు పండు ద్వారా గాని ఉపయోగపడుతోంది. పరోపకారం చేస్తూంది. ఈ ప్రపంచంలో సర్వ శ్రేష్ఠమైన మానవ జన్మను పొంది మనం ఏమి పరోపకారం చేస్తున్నాము? కేవలం ఆహార నిద్రా భయ మైధునాదులు తప్ప మనం ఏ ఇతర పని చేయలేకపోతున్నాము.

దైహిక శ్రమయే నిజమైన కర్మ. కర్మ చేయకపోతే నిజమైన స్వరూప జ్ఞానం కలగదు.

నహిదేహ భృతా సక్యం త్యక్తుం కర్మణ్య శేషతః
యస్తుకర్మ ఫలత్యాగీ స త్యాగీత్యభి ధీయతే!!
(భ గీ అ18;శ్లో11)

జన్మ తీసుకున్న ప్రతి మనిషికీ కర్మలను పూర్తిగా వదిలివేయడం అనేది సాధ్యం కాదు. కర్మలను కాకుండా ఆ కర్మల వల్ల వచ్చే ఫలితాలను త్యజించిన వాడే నిజమైన త్యాగి అనబడతాడు.
మనం చేసే ప్రతిపని, మాట్లాడడం, నడవడం, మేల్కొనడం, నిద్రపోవడం మొదలైన పనులన్నీ కర్మలనబడతాయి. మానవుడై పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ పనులు చేయవలసినదేకాని వాటిని వదలి వేయడం సాధ్యంకాదు.

నిషిద్ధ కర్మలు కామ్య కర్మలు చేయడం మాని శాస్త్ర విహితమైన కర్మలు మాత్రమే ఆచరిస్తూ ఉండాలి. చేసే ఆ కర్మల మీద గాని ఆకర్మలనుంచి వచ్చే ఫలితాలమీదగాని మమత, ఆసక్తులు లేకుండా ఉండాలి.

కర్మ ఫలత్యాగే నిజమైన త్యాగి అని చెప్పేరు కదా ఈ శ్లోకంలో. మనం కర్మ చేసిన తర్వాత దాని ఫలితాన్ని కోరినా కోరకున్నా మనం దానిని అనుభవించే తీరాలి అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు “ నతు సన్యాసినాం క్వచిత్” అని. కర్మ ఫలం మీద ఏ మమకారం లేకుండా తామరాకు మీద నీటి బొట్టులా కర్మలను ఆచరించే త్యాగికి ఏకాలములోను కర్మఫలములను ఏ విధముగాను అనుభవించే పని ఉండదు.

మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే
“కర్మణైవహి సంసిద్ధిమ్ ఆస్థితా జనకాదయః…” అని భగవద్గీత మూడవ అధ్యాయం 20వ శ్లోకం లో చెప్పేరు.

జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు మొదలైన జ్ఞానులు ఆసక్తి రహితముగా కర్మలు ఆచరించి పరమ సిద్ధిని పొందేరు అని చెబుతున్నాడు.

Part 2                                                  11-Nov-2018

కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన
మాకర్మ ఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి।।

(భగీ 2అ 47శ్లో)

మన కర్తవ్యము కర్మల నాచరించుట వరకే గాని, ఎన్నటికీ దాని ఫలములయందు మనకు అధికారము లేదు. కర్మఫలములకు మనము హేతువు కాకూడదు. అలా అని కర్మలు మానుటయందు మనము ఆసక్తులు కాకూడదు. ఫలాపేక్ష రహితులై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించడమే మన విధి.

కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః
ఏవం తయీ. నాన్యధేతోఽస్తి నకర్మ లిప్యతే నరే।।

(ఈశావాశ్యోపనిషత్తు)

శాస్త్ర విహితమైన కర్మలు (సూక్ష్మ కర్మలు)అంటే ప్రణవోపాసన, బ్రహ్మవిద్యాసాధన, బ్రహ్మ విద్యా దానం, ప్రాణాయామాలు చేస్తూ మానవుడు నూరు సంవత్సరాలు జీవించాలి. యోగి అచ్యుతులు అంటారు నూరు కాదు నూట ఇరవై సంవత్సరాలు జీవించాలని.

స్థూల కర్మ, సూక్ష్మ కర్మ అని కర్మలను రెండు విధాలుగా తీసుకుంటే స్థూలకర్మ భౌతిక జీవితానిది అవుతుంది. ఈ స్థూలకర్మల వల్ల జరిగే లోక కళ్యాణం నుంచే “పరోపకారార్ధం ఇదం శరీరం” అనే నానుడి వచ్చింది. స్వామిగారు దైహిక శ్రమయే నిజమైన కర్మ అంటూ స్థూలకర్మల విషయమై వ్యవసాయాన్నే శ్రేష్ఠమైన కర్మగా చెప్పేరు. సస్యముల పెంపకం, పశు పోషణలను తన ఆశ్రమంలో పాటించి చూపేరు.

దీపానికి ప్రకాశం, చక్కెరకు తీపి, వేపకు చేదు, పూవులకు పరిమళము ఎంత సహజమైనదో అలాగే ఈ దేహానికి కర్మ సంబంధం కూడా అంతే సహజము. ఈ విషయాన్ని గమనింప గలిగిన చేతనత్వం మనలో ఉంది. దానినే మానవత అంటారు. పరస్పర ప్రేమ, ధర్మము వైపు లక్ష్యము, వివేకము కలిగి మనశ్శాంతితో జీవించడమే మానవత యొక్క లక్ష్యము.

పగలు కర్తవ్యానికి (స్థూల కర్మకు) రాత్రి ధ్యానానికి (సూక్ష్మ కర్మ) అని అంటూ- సాధకుడు అనేవాడు ఉదయం లేచిన వెంటనే నేను ఈ భూమి ఉన్నంత కాలం బ్రతుకుతాను అనే విశ్వాసంతో స్థూలకర్మలు చేయాలని, సాయంత్రం ధ్యానానికి కూర్చున్నప్పుడు ఈరోజే ఆఖరి రోజు, ఈరోజు నేను బ్రహ్మత్వాన్ని పొందుతాను, నన్ను నేను తెలుసుకో గలుగుతాను అనే నిశ్చయ బుద్ధితో కూర్చోవాలి అంటారు శ్రీ యోగి అచ్యుతులు.

మరి కర్మాచరణ వల్ల మనకు నష్టం ఉందా అంటే బ్రహ్మేంద్రియాలతో చేసే సూక్ష్మ కర్మలలో తన వారు మనకు అనే మోహం కలిగితే మనోశక్తి నష్టం అవుతుంది. చూచేటప్పుడు, వినేటప్పుడు ఇది హితమైనది, ఇది అవసరం లేనిది అనే భావన లేకుండా ఉండాలి. ఈ రకమైన సంకుచిత భావనల వల్ల మన బ్రహ్మ నిష్ఠలో నష్టం ఏర్పడుతుంది.

ఫలం గురించి ఆలోచించకుండా ప్రయత్నిస్తోంటే, కర్మాచరణ చేస్తూ ఉంటే తిరిగి చైతన్యాన్ని పొంద గలుగుతారు.

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ద్యో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే.
(భగీ 2అ 48 శ్లో)

సమత్వం లోఉంటూ కర్మలను ఆచరించు. చేసే కర్మల యొక్క ఫలముల మీద ఆసక్తిని వదలినప్పుడు కోపతాపాదులు, హర్షశోకాదులు అనేవి ఉండవు. అప్పుడు చేసే కర్మలు సిద్ధించినా సిద్ధించక పోయినా వాటిగురించిన ఆసక్తి ఉండదు. ఆ స్థితిలో కలిగే సమత్వ బుద్ధి నే యోగము అంటారు.

ఇంక తత్వ సాధనకు అర్హులైన వారు ఎవరు? అంటే ఈ ప్రశ్నకు అందరూ అర్హులే అని నొక్కి చెప్పాలి. బ్రహ్మత్వాన్ని పొందగోరే వారికి జాతి మత స్త్రీ పురుషులు, బాలురు, వృద్ధులు అనే బేధము లేదు. సమస్త మానవాళిని ఉద్ధరించేటందుకే ఆ సర్వ వ్యాపి అయిన పరబ్రహ్మ కంకణం కట్టుకొంది.

(వచ్చే భాగంలో సర్వకాల సర్వావస్థలలో ఎల్లప్పుడూ చేతనత్వంతో ఉండే ఆ బ్రహ్మం గురించి తెలుసుకుందాం.)

Part 3                                                  13-Nov-2018

అనంత కాలం నుండి ఈ మానవుడికి అర్ధంకాని జవాబులు లేని కొన్ని ప్రశ్నలు అలా ఉండి పోయాయి.

కిం కారణం బ్రహ్మ? కుతస్మజాతా
జీవామకేన. క్వచ సంప్రతిష్టితా
అధిష్టితాః కేన సుఖేతరేషు
వర్తామహే బ్రహ్మవిదో వ్యవస్థామ్

।।శ్వేతాశ్వతర।।

బ్రహ్మ మేనా ఈ ప్రపంచానికి మూలకారణం? మనం ఎక్కడనుంచి జన్మించాము? దేని ప్రభావం వల్ల మనం జీవిస్తున్నాము? మనకు చరమస్థానము ఎక్కడ? ఎవరి నియమానుసారం మనం సుఖదుఃఖాల వ్యవస్థకు లోబడి ఉంటున్నాము? ఓ బ్రహ్మవిదులారా! మానవుని సుఖముగా ఉంచేటటువంటి మౌలిక సూత్రాలను మాకు అవగతం చేయండి. అంటూ సృష్టి రహస్యం, జీవిత రహస్యం మరియు మృత్యు రహస్యాల విషయమై తర్జన భర్జన పడతున్నారు.

కొంతమంది మనస్సు దానికి సంబంధించిన విషయాలపై ఆలోచించడం మొదలుపెట్టేరు.

కేనషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణః ప్రధమః ప్రైతియుక్తః
కేనషితాం వాచమిమాం వదంతి
చక్షుః శ్రోత్రం క ఉదేవో యునక్తి

।।కేనోపనిషత్తు।।

మనస్సు దానికి సంబంధించిన విషయాలపై కేంద్రీకరించేట్లు ఏది ప్రేరేపిస్తుంది? దేని ప్రేరణ వల్ల ప్రాణం తన పనులను నిర్వర్తిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి, దేని శక్తివల్ల మనుషులు మాటలు పలుకుతారు? నిజంగా ఏబుద్ధి మన జ్ఞానేంద్రియాలను పనిచేసేట్లా చేస్తుంది?

ఈ మౌలికమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పగలిగేదే తత్వ శాస్త్రము. మన సైన్సు ప్రతి విషయాన్ని దానిని పరిశోధించి తెలుసు కోవాలి అంటుంది. మనకున్న ఈ చిన్న జీవిత కాలంలో అనంతమైన విషయాలను తెలుసుకోవాలంటే సాధ్యమా? కాని ప్రకృతిని అధ్యయనంచేస్తే సమస్త సృష్టి ఒక పరిభ్రమణ రూపంలోనే జరుగుతోంది. స్త్రీ పురుషుల కలయిక ద్వారా మనుషులు జన్మిస్తున్నారు. అదే విధంగా సమస్త జంతుజాలం, క్రిమి కీటకాదులు ఆడ మగ జాతుల కలయిక ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి. అన్నిటికీ బాల్యము యౌవ్వనము, వృద్ధాప్యము మరణము ఉంటున్నాయి. సస్యవర్గం, వృక్ష జాతులు కూడా కొంచెం తేడాతో ఇదేవిధంగా సృష్టి, స్థితి లయాలు పొందుతున్నాయి. పంచ భూతాల కలయికతో పుడుతున్నాయి, వాటిలోనే చివరకు లయమయి పోతున్నాయి.

మన వేదఋషులు వీటన్నిటినీ పరిశీలించి చూస్తే వీటన్నిటికీ ఒకే ఒక మూలసూత్రం ఉండాలని దానిని తెలుసుకోవాలని తలపోశారు.

కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం
విజ్ఞాతం భవతీతి?

।।ముండకోపనిషత్।।

ఓ భగవాన్! దేనిని తెలుసుకోవడం ద్వారా సర్వమూ తెలుసుకోబడుతుంది? అని ప్రశ్నించుకున్నారు.

దానికి బృహదారణ్యకోపనిషత్తు లో తన భార్య యైన మైత్రేయికి యాజ్ఞవల్క్యుడు చెబుతాడు

ఆత్మ వారే ద్రష్టవ్య స్రోత్రవ్యో మంతనవ్యో
నిధిధ్యాసితవః మైత్రేయీ! ఆత్మనో వారే
దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేనేదమ్ సర్వమ్ విదమ్।।

ఓ మైత్రేయీ! దానినే ఆత్మ అంటారు. దాని దర్శనం చేసుకోవాలి. వినాలి మరియు దానినే ధ్యానం చేయాలి. నిజానికి ఆత్మను చూడడం వల్ల, వినడం వల్ల, ఆత్మ గురించి ఆలోచించడం వల్ల, ఆత్మను అర్ధం చేసుకోవడం వల్ల సమస్తమూ తెలుస్తాయి.

ఒకే ఒక్క విషయాన్ని తెలుసుకోవడం ద్వారా సర్వస్వాన్ని అర్ధం చేసుకో గలిగే అపూర్వమైన విజ్ఞానమే యోగ విజ్ఞానము.

అందుకే శ్రీ యోగి అచ్యుతులు మన ఆశ్రమము యొక్క ముఖ్య ధ్యేయం “నిన్ను నీవు తెలుసుకో” అని చెప్పేరు.

ఆ ఆత్మ మన శరీరం లో ఎలా ఉంటుందంటే

దేహేన్ద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణమ్
తద్ వృత్తి సాక్షిణం విద్యాదాత్మానం రాజవత్సదా।

(ఆత్మబోధ)

రాజు తన దర్బారులో జరిగే ఉత్సవ కార్యక్రమం చూస్తాడు. అతడు లేనిదే ఉత్సవం ఉండదు. కాని అతడు ఉత్సవం లో భాగస్తుడు కాదు. మన దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, స్వభావాలకు అతీతము విలక్షణము అయినది ఆత్మ. ఆత్మ అనేది సాక్షి చైతన్యము.

ఆత్మ చైతన్య మాశ్రిత్య దేహేంద్రియ మనోధియః
స్వక్కియార్ధేషు వర్తన్తే సూర్యాలోకం యథాజనాః।।

ఆత్మ అనేది చైతన్యము, కాంతిప్రభ. సూర్యుని చైతన్యకాంతి నుంచి మానవులు జంతువులు వృక్షాలు లతలు శక్తిని తీసుకొని వాటి జీవనాన్ని ఎలా పెంపొందించు కుంటాయో అలాగే ఈ దేహంలోని ఆత్మయొక్క చైతన్యాన్ని ఆశ్రయించుకొని శక్తిని పొంది దేహము, ఇంద్రియాలు, మనస్సు బుద్ధి వాటి వాటి పనులు చేసుకుంటాయి.

ఆ ఆత్మ యొక్క స్వభావం ఎలాటిదంటే

ప్రకాశోఽర్కస్య తోయస్య శైత్యమగ్నేర్యథోష్ణతా
స్వభావః సచ్చిదానన్ద నిత్య నిర్మలతాత్మనః।।

సూర్యునికి ప్రకాశం, నీటికి చల్లదనం, అగ్నికి ఉష్ణం ఏవిధంగా స్వభావాలో, అలాగే ఆత్మకు సత్, చిత్, ఆనందము, నిత్యత్వము, నిర్మలత్వము స్వభావాలు.

Part 4                                                  17-Nov-2018

ఈశావాశ్యోపనిషత్తు ఈ క్రింది మంత్రం తో మొదలవుతుంది

ఈశావాశ్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్… అంటూ ఈశ్ లేదా ఈశ్వర అనే శబ్దమే లేదా ఆ చేతనమే ఎల్లప్పుడు సర్వత్రా విశ్వమంతా నిండి ఉందని చెబుతూంది.

ఏకోవశీ సర్వ భూతాంతరాత్మ
ఏకం రూపం బహుథా యః కరోతి
తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరా
స్తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం

।।కఠోపనిషత్తు।।

సర్వ భూతాలలోను ఉన్న ఆత్మ ఒక్కటే. అదే పరమాత్మ అందరిలోను బహు రూపములుగా
వ్యక్తమవుతున్నాడు. తనలోఉన్న ఆత్మ ఆ విశ్వాత్మ యే, ఆ పరమాత్మయే అని దర్శించిన ధీరులకే శాశ్వతమైన ఆనందం దొరుకుతుందికాని మరి ఏ ఇతరులకు దొరకదు.
ఇదే విషయాన్ని భగవద్గీత 18వ అధ్యాయం లో

సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానమం విద్ధి సాత్వికమ్।।

సమస్త ప్రాణులలోను వేర్వేరుగా కన్పించే ఆత్మను ఎవరైతే శాశ్వతుడైన విభక్తరహితుడైన పరమాత్మగా గుర్తిస్తారో అటువంటి పురుషుని జ్ఞానాన్ని సాత్విక జ్ఞానం అని అంటారు.

ఈశ్వరః సర్వభూతానాం
హృద్దేశేర్జున తిష్ఠతి
భ్రామయన్ సర్వభూతాని
యంత్రారూఢాని మాయయా।।

శరీరమనే యంత్రాన్ని అధిరోహించిన ఆత్మ వారి వారి కర్మలననుసరించి వారిచేత పని చేయిస్తున్నాడు. ఆ పరమాత్మ సకల భూతాల యొక్క హృదయాలలో ఉంటూ వారి వారి స్వభావాదులను అనుసరించి వాళ్ళని నడుపుతూ ఉంటాడు.

ఈ పరిస్థితులలో కర్మబంధాలనుండి విడిపోయి పరమ శాంతిని పొందడానికి మనము ఏమి చేయాలి?

విగ్రహారాధన, భజనలు, పారాయణ చేయడం, ఆలోచించడం వల్లగాని ముక్తి దొరకదు.

అంతేకాదు మనం దేనిని బ్రహ్మమని ఉపాశిస్తున్నామో అది బ్రహ్మము కాదు. బ్రహ్మేంద్రియాలు, మనస్సు ఆ బ్రహ్మాన్ని తెలుసుకోలేవు అంటూ కేనోపనిషత్తులోని ఈ క్రింది 5 మంత్రాలలో వివరంగా చెప్పేరు.

1.యద్వాచా నభ్యుదితం తేన వాగభ్యుద్యతే
ఏది వాక్చత్తికి ఆధారమైనదో కాని వాక్కు చేత తెలియబడదో…

2.యన్మనసా నమనుతే యేనాహుర్మనోమతమ్
ఏది మనస్సునకు ఆధారమైనదో కాని మనస్సు చేత తెలియబడదో…

3.యచ్చక్షుషా నపశ్యతి యేన చక్షూంసి పశ్యతి…
కనుచూపునకు ఆధారమవుతూ ఆ చూపుతో తెలియబడనిది..

4.యచ్చ్రోత్రేణ నశృణోతి యేన శ్రోత మిదం శృతమ్
వినికిడిశక్తి కి ఏది ఆధారమవుతూ అది ఆ వినికిడి చేత తెలియబడనిదో…

5.యత్ప్రాణేన నప్రాణితి యేన ప్రాణః ప్రణీయతే
ఏది ఈ శరీరంలో ప్రాణశక్తికి ఆధారమైనదో కాని ప్రాణ శక్తి చే తెలియబడనిది.. ఉందో అదే బ్రహ్మత్వం.
తదేవ బ్రహ్మత్వం విద్దినేదం యదిద ముపాసతే।

అంటే మనలో ఏది జాగ్రదావస్థ లోను, అలాగే నిద్రావస్థ లోను కూడా హెచ్చెరికతో ఉంటుందో అదే బ్రహ్మత్వము. దీని ఉనికి మనకు శ్వాస గతి ద్వారా ఆడుచున్న ప్రాణశక్తి వల్ల తెలుస్తోంది.

బ్రహ్మత్వాన్ని తెలుసుకోవడానికి ప్రాణశక్తి గురించి తెలియాలి. ప్రాణ శక్తి యొక్క ఉనికి తెలియాలంటే శ్వాస గతికి ఆధారమైన వాయువును తెలుసుకోవాలి. అందుకే వాయువుని ప్రత్యక్షబ్రహ్మ అన్నారు.

ప్రాణాన్ని కల్గి ఉన్న మానవులందరూ ఉత్తమగతిని పొందాలంటే వాయువు ఒక్కటే ఆధారం.
మన శరీరంలోని ప్రాణశక్తికి కావలసిన పోషకాంశము అంటే జీవ శక్తి వాయుమధనం (ప్రాణాయామం) ద్వారా మాత్రమే దొరుకుతుంది. వాయుమధనంలో వచ్చే శక్తిని అశనం అంటారు. ఆ అశనాన్ని గ్రహించి శరీరంలోని ప్రాణశక్తి శక్తిమంతమవుతుంది.

వాయుమధనం నుంచి ఉద్భవించిన అశనం వల్ల మన శరీరం లోని పంచ భూతాలు శుద్ధి చేయబడతాయి. మనస్సులో ఉండే సమస్త ఆలోచనలు తొలగిపోయి అంతర్ముఖతను పొంది, ఆనందానుభవం జ్ఞానోదయం అవుతాయి. కనుక మనందరకూ వాయువే అతిముఖ్యమయినది.

అందుకే తైత్తిరీయోపనిషత్తులోని శాంతి మంత్రం శంన్నో మిత్రః శం వరుణః… అనే మంత్రంలో నమో బ్రహ్మణే అంటూ నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి,ఋతం వదిష్యామి… అన్నారు.

ఓ వాయుదేవా! నీకు నమస్కారము, నీవే మాకు ప్రత్యక్షబ్రహ్మవు. నీవు ఒక్కడివే మాకు ప్రత్యక్షముగా కనుపించే మా జీవనాధారానివి. అందుకే మరొక్కమారు ప్రత్యక్ష బ్రహ్మ వైన నీకు మా నమస్కారము.

Part 5                                                  20-Nov-2018

వాయుమధనము నుంచి జరిగే కాయశుద్ధి (శరీర శుద్ధి), అశన ప్రాప్తి మొదలైన అంశాలను ముందు ముందు సమయం వచ్చినప్పుడు చదువు కుందాం.

యోగము యొక్క విశ్లేషణ లో మనస్సు అనేదానికి ఒక ప్రత్యేక స్థానంఉంది. మన శరీరంలోని ఇంద్రియాలన్నీ మనస్సు యొక్క అధీనంలోనే ఉన్నాయి.

భ గీ 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః
మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతి స్థానికర్షతి।।

ఆత్మను జీవభూతంగా పేర్కొంటూ మనస్సును వృత్తిపరంగా ఆరవ ఇంద్రియం అన్నారు. ఈ మనస్సు అన్ని ఇంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకొని పనిచేయిస్తూంది.

బంధానికి మోక్షానికి మనస్సే కారణం అంటూంది అమృతబిందూపనిషత్తులో2వ మంత్రం.

మన ఏవ మనుష్యాణాం,
కారణం బన్ధ మోక్షయోః
బన్థాయ విషయాసక్తం,
ముక్త్యై నిర్విషయగ్ం స్మృతమ్।।

మన (మనుష్యుల) యొక్క బంధాలకు, మోక్షాన్ని పొందడానికి కూడా మనస్సే కారణమవుతోంది.
విషయాలలో ఆసక్తి కలిగిన మనస్సు బంధాలను పెంచుతోంది. విషయాలమీద ఆసక్తి లేని మనస్సు మోక్షకారకమవుతోంది.

మరి ఈ మనస్సు దేని ఆధారముతో మనగలుగుతోంది? కళ్ళు, ముక్కు, చెవి, నాలుక మొదలైన కర్మేంద్రియాలన్నిటికీ అలుపు ఉంటుంది. అలాగే మనస్సుకూడా నీరస పడిపోతుంది. గాఢ నిద్రలో మనస్సు పనిచేయక స్థబ్ధతని పొందుతుంది. మనస్సే కనక స్వతంత్ర శక్తి అయిఉన్నట్లయితే దానికి అలుపనేదే ఉండదు. ఈ విధంగా తమ తమ దిన చర్యలకై మరొక చేతన శక్తి మీద ఆధారపడే మనస్సు మనకు మోక్షాన్ని ఇవ్వగలుగుతుందా?

చాందోగ్యోపనిషత్తులో

తన్మనో దిశం దిశం పతిత్వాన్యత్రాయతన
మలబ్ధ్వా ప్రాణమేవో పశ్రయతే
ప్రాణ బంధనం హి సోమ్య మనయితి।।

ఓ సౌమ్యా!
మన శరీరంలోని జ్ఞానేంద్రియాలు కామ,క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాదులు ఇచ్ఛ మరియు ద్వేషం అనేటటువంటి వాటివల్ల ఎల్లప్పుడు కదిలించబడి బహిర్ముఖంగా అత్యంత చంచల స్థితిలో ఉంటాయి. వీటినుంచి మనస్సుకి ఈ ఇంద్రియాలు ఆనందం గురించి పడే ఆరాటం వల్ల అలసట వస్తుంది. ఇలా అలసిపోయిన ఇంద్రియాలు విశ్రాంతిని కోరుకుంటాయి.వాటికి నిద్రే ఒక వరం. గాఢ నిద్రలో మనస్సు విశ్రాంతిని పొంది లేచేక తిరిగి ఉత్సాహవంతం అవుతుంది.

మనం నిద్ర పోయేటప్పుడు మనశరీరం ప్రాణం యొక్క అధీనంలో ఉంటుంది. అందుకే పై మంత్రంలో దిశ దిశలా అన్ని కర్మేంద్రియాల వైపు తనకు ఆలంబన కొరకు మనస్సు ప్రాకులాడుతూంటే ఇంద్రియాలన్నీ తాము ప్రాణుని అధీనంలోనే ఉన్నాము నీకు ఆశ్రయం ఇవ్వలేము అని చెబుతాయి. ఎక్కడా ఆశ్రయం దొరకని మనస్సు చివరకు ప్రాణ చేతనాన్నే ఆశ్రయించి విశ్రాంతిని పొందుతుంది, తిరిగి శక్తిని పొందుతుంది.

ఈ ప్రాణ శక్తి నిరంతరం నిర్విరామంగా పనిచేస్తూ శరీరంలోని అన్ని ఇంద్రియాలకు, అవయవాలకు శక్తిని ఇస్తోంది. ఆరవ ఇంద్రియమైన మనస్సు కూడా ప్రాణశక్తినుంచే శక్తిని తీసుకొని పని చేస్తోంది. అందుకే ప్రాణాన్ని మూలాధార చేతనం అంటారు.

సరే, ఇంద్రియాలు మనస్సు శరీరం ప్రాణం పై శక్తి గురించి ఆధారపడితే మరి ప్రాణశక్తికి శక్తి లభించే విధానం ఏది?

వచ్చే భాగంలో మన ముక్తికి సాధనమైన మూలాధారచేతనం అంటే ప్రాణ శక్తి గురించి మరింత తెలుసుకుందాం.

కొంచెం మనస్సు పెట్టి అర్ధం చేసుకుంటూ చదవండి. యోగి అచ్యుతుల యోగవిద్యాపద్ధతి తెలుసుకోండి.

Part 6                                                  18-Dec-2018

ఆత్మ అనేది ఒక శుద్ధ జ్ఞానమయితే ప్రాణమనేది ఒక విలక్షణమైన చేతన శక్తి. ఆత్మ అనేది స్థబ్దతో ఉంటుంది, అన్నిటికీ దూరంగా ఉంటూ తన రహస్య గుహలో ఉంటుంది. ప్రాణము అత్యంత శక్తివంత మైనది చేతనాత్మకమైనది. మన శరీరంలో ఆత్మ కన్న ఒక మెట్టు కిందగా ఉంటుంది.

జ్యేష్ఠశ్రేష్ఠ ప్రజాపతిః అన్నారు ప్రాణాన్ని. ఈ సృష్టి క్రమంలో ప్రప్రధమంగా ఉన్నది ప్రాణశక్తి. ఈశావాశ్యోపనిషత్తులో ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంటూ ఈశ్ అనే శబ్దం తో ప్రాణ శక్తి ఒక్కటీ ఈ జగత్తంతా నిండి ఉంది అని చెప్పేరు. యోగి అచ్యుతులు ప్రాణానికి జ్యేష్ఠత్వాన్ని మాత్రమే ఆపాదిస్తూ శ్రేష్ఠత్వం మాత్రం ఆత్మకే అన్నారు.

మన శరీరంలో ప్రాణం ఉన్నంతవరకే మనస్సు, శరీరం, ఇంద్రియాలు, అవయవాలు పనిచేస్తాయి. ఈ దేహం నుంచి ప్రాణం నిష్క్రమించగానే మనస్సు ఇంద్రియాలు చేతన రహితమవుతాయి.

అలా ఈ శరీరం ప్రాణం యొక్క రక్షణ లో ఉంది. ఆ ప్రాణ శక్తి భ్రూమధ్యానికి వెనుకగా కొండనాలుకకు పైభాగంలో ఉంటుంది. ప్రాణం ఎప్పుడూ క్రిందిస్థాయికి రాదు. దేనినైనా ఉన్నచోటునుండే తన వైపుకు ఆకర్షించు కొంటుంది. మన శరీరంలో ఉండే వాయువుని పైకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంది. తను ఎల్లప్పుడూ ఊర్ధ్వ దిశలో క్రియావాన్ లా కదులుతూ ఆత్మను చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

మన శరీరం ప్రతిరోజూ అలసిపోయి విశ్రాంతిని కోరుతోంది. ఈ శరీరంలోని అంగాంగాలు అలసిపోయి తమ శక్తిని కోల్పోతాయి. వీటిని తిరిగి యధా స్థితికి తేవాలంటే అవసరమైన ఆహారాన్ని అందించాలి. ఆ అన్నాన్ని గ్రహించి మన శరీరం తిరిగి శక్తిని పొందుతోంది. ఈ శరీరం లాగానే మన ప్రాణం కూడా నిరంతరం పని చేస్తూ ఉండడం వల్ల అదికూడా తన శక్తిని కోల్పోతూ ఉంటుంది. భౌతిక శరీరానికి అన్నం ఎలా అయితే శక్తిని ఇస్తుందో అలాగే మన శరీరం లోని ప్రాణ శక్తికి కూడా సూక్ష్మ రూపంలో ఆహారం అవసరము అవుతుంది. దానిని అశనము అంటారు. బ్రహ్మ సూత్రాలలో “అశనగతః ప్రాణః” అని అన్నారు.

ఈ అశనము అనేది Ozone అనేదానికి చాలా దగ్గర దగ్గరగా ఉంటుంది. మన శరీరానికి ఈ అశనము తక్కువ అయితే అలసట వస్తుంది. ఆ అశనాన్ని పొందడానికి ప్రాణం తన మూలస్థానమైన ఆత్మ దగ్గరకు పోయే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు అన్ని ఇంద్రియాలను కదుపుతూ ఆవలింతలు వస్తాయి.

సాధారణంగా రోగులకు ఆవలింతలు రాకపోతే మరణ సమయం ఆసన్నమైందని అంటూ ఉంటారు. మనం నిద్రపోతున్నప్పుడు గురక వస్తుందికదా! మన ప్రాణం ఆత్మను చేరడానికి చేసే ప్రయత్నం లోనే గురక వస్తుంది. అందుచేత ఉదయం మనం లేచే సమయానికి బడలిక పోయి చాలా ఉత్సాహంగా ఉంటాము. సాధన ద్వారా ప్రాణానికి ఆత్మను చేరేటందుకు చేసే ప్రయత్నాన్ని ప్రాణా యామము అంటారు.

మన నిజ స్థితి తల్లి గర్భం లో ఉన్నప్పుడు ఉన్న స్థితి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బయటిగాలి సంపర్కం లేకుండా నాభి నుంచి బ్రహ్మరంధ్రం వరకూ ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అశన ప్రాప్తి అయి తన శరీర నిర్మాణాన్ని చేసుకోగల శక్తిని పొందుతుంది.

ఆ స్థితిలో కన్నులు రెండూ ఆత్మ మీదే కేంద్రీకరించి ఉంటాయి. మనస్సు భ్రూమధ్యం వైపేచూస్తూ అంతర్ముఖంగా ఉంటుంది. నోటిలో సోమ, మధు, అమృత రసాలు ఊరుతూ ఉంటాయి. ఆత్మ యొక్క సాంగత్యంలో మనస్సు ఉచ్ఛస్థితిలో ఉంటూ భూత భవిష్య ద్వర్తమానాలు తెలిసిన ఆనంద స్థితోలో ఉంటుంది. తల్లి గర్భం లో ఉన్నప్పుడు బయటి గాలి సంపర్కం లేకుండా అంతర్ముఖంగా ప్రాణాయామక్రియ నడుస్తూ ఉంటుంది.

ఒకసారి తల్లిగర్భం నుంచి ఈ భూమి మీదకు వచ్చిన వెంటనే బయటి గాలి సంపర్కంతో ప్రాణాయామ క్రియ మొదలయి ఇంద్రియాలు బహిర్ముఖమవుతాయి. నెమ్మదిగా అంతర్ముఖంగా నడుస్తున్న ఆ గతాగతి లోపలి నుంచి బయటకు మారుతుంది. క్రమేపీ స్థూల దేహం పెరుగుతూ వాత పిత్త కఫ దోషాల వల్ల, మనస్సు యొక్క చంచల స్థితి వల్ల అంతర్ముఖ గతాగతి తప్పి పోతుంది.

తిరిగి ఆ అంతర్ముఖ ప్రాణాయామ స్థితిని పొందడానికి చేసే ప్రయత్నమే ఈ అచ్యుత యోగ విద్య. ప్రాణాయామం ద్వారా మన లోని ప్రాణ శక్తి ద్విగుణీకృతమై బలంగా తయారవుతుంది. ఆ బలమైన ప్రాణశక్తి మనస్సుతో కలిసి ప్రాణ మనో మిలనం జరుగుతుంది. దానినే ప్రధమ యోగం అంటారు. అప్పుడే ఈ శరీరం లో ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని చెబుతారు.

ఈ విధంగా ప్రాణ ప్రతిష్ఠను పొందిన సాధకుడు ఇచ్ఛామరణి కాగలుగుతాడు. దీనికి ప్రత్యక్ష సాధన తెలిసే తీరాలి. రెండు వేల సంవత్సరాల క్రితం మన దేశంలో ప్రతి ఒక్కరూ ఈ సాధన చేస్తూ ఉండేవారు. కాల క్రమేణా అలవాటు తప్పి సాధన కనుమరుగయి పోయింది.

ఈ సాధనకు ఆహార నియమాలు పాటిస్తే సాధన సుగమమవుతుంది. మత్తు పదార్ధాలు మనను దారి మళ్ళిస్తాయి. అంటే నిషా కలిగించే కల్లు, సారా, గంజాయి, నల్లమందులేకాదు, మనం తినే చాలా పదార్ధాలలో కూడా ఒక మాదిరి నుంచి హెచ్చు శాతం మత్తు కలిగించేవి ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా మనం నిషేధించాలి.

ఈ సాధనకు సాత్వికాహారమే శ్రేష్ఠం. సులభంగా జీర్ణమవడమే సాత్విక ఆహారం యొక్క విశిష్ఠ లక్షణం. ఇంకొంచెం విపులంగా చెప్పాలంటే మనం తిన్న ఆహారం వల్ల మన దేహంలోకాని మనస్సుకు గాని ఏచెడు పరిణామం లేకుండా ఉండాలి. మాంసాహారులు కోపం తెచ్చుకోకూడదు. మాంసాహారులు ఈ సాధనలో సాగడం చాలా కష్టం. తన్నుతానెరుగుట సాధ్యం కాదనే చెప్పాలి. మాంసాహారం వల్ల మనస్సుకు సంబంధించిన అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ,లోభ,మోహ, మద, మాత్సర్యాదులు విజృంభించి మన వశంలో ఉండవు.

మరి పొగత్రాగడం అనేది తిన్నగా బయటిగాలి సాయంతో చేసే ప్రాణాయామక్రియకు మరింత చెడు చేస్తుంది కనుక అదికూడా నిషేధిస్తేనే మనస్సు శరీరం మన వశంలో ఉండి సాధనలో ప్రగతికి దోహద పడతాయి.

వచ్చే భాగంలో ప్రత్యక్ష సాధన అయిన ప్రాణాయామంలో ఓంకారానుష్ఠానం జరిగే విధానం గురించి తెలుసుకుందాం.

Part 7                                                  29-Dec-2018

ఓంకారానుష్ఠానంగురించి తెలుసుకునే ముందు చాందోగ్యోపనిషత్కులోని ఒక చిన్న కధను గుర్తు తెచ్చుకుందాం.

ప్రజాపతి పుత్రులైన దేవతలు రాక్షసులు తమలో తాము వైరాన్ని పెంచుకొని పరస్పరం యుద్ధానికి సన్నద్ధులయ్యారు. రాక్షసులను జయించగోరి దేవతలు ఉద్గీథోపాసన (ఓంకారనిష్ఠానం) మొదలు పెట్టేరు. దేవతలు ముక్కును ఉపయోగించి ఓంకారోపాసన చేయగా, దానివల్ల ముక్కు ద్వారా సుగంధ దుర్గంధాల మిశ్రమ కర్మ ఫలితం కలిగింది తప్ప అసురులను జయించే శక్తిని పొందలేక పోయారు.

అదే విధంగా దేవతలందరూ వాక్కు, కళ్ళు, చెవులు, మనస్సుల ను ఉపయోగించి ఓంకార ఉపాసన చేయగా రాక్షసులు వాటన్నిటినీ పాపాలతో త్రిప్పి కొట్టేరు. అంటే, వాక్కు సత్యాన్ని, పాపమైన అసత్యాన్ని పలుకుతూ ప్రాణ శక్తిని కోల్పోతూంటుంది. అలాగే కళ్ళు అందమైన రూపాన్ని, పాపమైన కురూపాన్ని చూస్తూ; చెవులు మంచి మాటలను, పాపాలు కలిగించే చెడు మాటలను వింటూ; మనస్సు పాపాన్ని, పుణ్యాన్ని కూడా భావిస్తూ ఉండడం వల్ల వాటితో చేసే ఓంకారోపాసన శక్తి నివ్వక రాక్షసుల చేతిలో ఓడి పోయారు.

చివరగా దేవతలు ముఖ్య ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని గురుస్థానంనుంచి ఉద్గీథోపాసన చేయగా అపరిమితమైన శక్తిని పొంది రాక్షసులతో విజయాన్ని సాధించేరు అని అంటూ ప్రణవోపాసన ఇంద్రియాల ద్వారా జరగలేదు, మన దేహం లోని ముఖ్య శక్తి అయిన ప్రాణాన్ని ఆధారంగా చేసుకొనే చేయబడిందని స్పష్ఠంగా చెప్పేరు.

ముండకోపనిషత్తులో ఇదేవిషయాన్ని

ఓం ప్రణవోధనుః శరోహ్యాత్మా
బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయోభవేత్

అంటూ
ప్రణవ శబ్ధాన్ని ధనుస్సు గా చేసుకొని మనస్సును బాణంగా చేస్తూ బ్రహ్మ స్థానాన్ని (బ్రహ్మేంద్రియాలు అన్నీ కలిసే ప్రధమ స్థానం భ్రూమధ్యం) గురిగా చేసుకొని అప్రమత్తుడై ధనస్సునుంచి విడిచిన బాణం ఏవిధంగా అయితే గురి తప్పకుండా గమ్యాన్ని చేరుతుందో అలాగే ప్రాణుడితో కలిసిన మనస్సు బ్రహ్మ స్థానం వైపు సాగనీ అని చెప్పేరు.

ప్రాణుని గతిలో వచ్చేదే ఝంకారం. దానినే ప్రణవం అంటారు. ఈ ప్రణవ శబ్దం గురుస్థానాన్ని ఆధారంగా చేసుకొని చేయాలి.

అన్తరేణ తాలుకే!
య ఏషస్తన ఇవావలమ్బతే!
సేన్ద్రయోనిః యత్రాసౌ కేశన్తో వివర్తతే!
వ్యపోహ్య శీర్ష కపాలే।

(తైత్తిరీయోపనిషత్తు శిక్షా వల్లి)

నోటి లోపల అంగుటిలో (స్తనాగ్రం లాగ) చిన్న కొండ నాలుక వ్రేలాడుతూ ఉంటుంది. దాని పై భాగాన్నే గురుస్థానం అంటారు. ఆ ప్రదేశము అత్యంత ప్రాముఖ్యమైనది. భ్రూమధ్యానికి సరిగ్గా వెనుక భాగంలో నోటిలో గంటను పోలిన స్తానంలో వ్రేలాడుతూ ఉండే కొండనాలుక పై భాగమే మనలను భగవంతుని దగ్గరకు చేర్చడానికి ఉన్న మార్గము. దానిని ఇంద్రుని స్థానం అనీ, గురుస్థానమనీ అంటారు.ఇక్కడినుంచి ఆ మార్గం శిరస్సులోని కేశాల మూలల వరకూ వ్యాపించి ఉంది. ఇక్కడనుంచి ఉత్పత్తియైన ఓంకారము తిన్నగా సహస్రారంలోని ఆత్మ ప్రదేశాన్ని చేరుతుంది.

ప్రాణుని సాయంతో చేసే ఓంకారానుష్ఠానం ప్రాణాయామాన్ని అనుసరించే సాగుతుందీ అచ్యుత యోగ విద్యలో. ఈ విధంగా ప్రాణాయామమే ముఖ్య సాధన అనీ అదే ప్రత్యక్ష సాధన అనీ చెప్పాలి. కేవలం గ్రంథ పఠనం ద్వారా లభించేది కాదు ఈ విద్య. ఉపదేశం అంటే మాటో లేదా మంత్రమో అయితే ఏదయినా పుస్తకం నుంచే నేర్చుకోవచ్చు.

హస్త మస్తక సంయోగము ద్వారా శిష్యుని కుడి చెవి దగ్గర గురువు చేసే ప్రాణుని ఝంకార శబ్దమే ఉపదేశము. గురువు యొక్క మార్గదర్శకత్వంలో నేర్చుకొని సాధన చేయవలసిన యోగ పద్ధతి ఇది.

దీనికి దాంపత్య జీవనం అడ్డు కాదు. బ్రహ్మ చారులకు వివాహం కాని స్త్రీలకు (ఉపదేశం ఇవ్వడానికి) వారు తప్పక పెళ్ళి చేసుకుంటామని వాగ్దానం చేస్తే తప్ప ఉపదేశం ఇవ్వరు. భార్యా భర్తలిద్దరూ ఈ పద్ధతిలో సాగుతూ యుక్తాహార విహారములతో ఉంటే కలిగే సత్సంతానం ఆరోగ్య వంతులై, మంచి తెలివైన వారై తప్పక జగత్కల్యాణ కారకులు అవుతారు.

Part 8                                                  02-Jan-2019

మోక్ష సాధనకు బ్రహ్మచర్యం అవసరం అనేది నిజమే. కాని స్త్రీ సంపర్కాన్ని వదలడం ఒక్కటే బ్రహ్మచర్యం కాదు. బ్రహ్మేంద్రియాలను ఒకే స్థానంలో నిష్ఠతో నిలపడమే వాస్తవమైన బ్రహ్మ చర్యం అనబడుతుంది. ఈ బ్రహ్మచర్యా వలంబనం సంసారులకు సన్యాసులకు కూడా అవసరమే. ఇది లేనిదే మోక్షసాధన ఎవ్వరికీ సాధ్యం కాదు.

ప్రాణం యొక్క గతాగతిలో పుట్టే ఝంకార శబ్ధాన్నే ప్రణవం అనీ సర్వేంద్రియాలు ఏక స్థానంలో నిలిచినప్పుడు ఆ ప్రణవాన్ని తెలుసుకో గలుగు తారని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము.

శంఖాన్నే ఊది చూడండి. శంఖం అంటే అది స్థూల వస్తువు కాదు. దేహం లో ఉండే కంఠభాగమే అది. శంఖాన్ని మరిస్తే అది విషకంఠమవుతుంది. ఆ కంఠం లోనే మృత్యువు ఉంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఆ ఊదడమనేది అంతర్ముఖంగానే జరగాలి. లోపల చెవులు ప్రణవాన్నే వినాలి. కళ్ళు భ్రూమధ్యాన్నే చూడాలి. ఎందుకంటే భ్రూమధ్యం నుంచే జ్ఞాన నేత్రాన్ని దీపింప జేయగలము. ప్రాణాయామము ద్వారా శంఖాన్ని ఊది శ్రీకంఠులు గా మారాలి. మృత్యుంజయులు అవ్వాలి.

ఈ సృష్ఠి క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే మనం తల్లి గర్భం లోకి ఎలా ప్రవేశించేమో అర్ధం అవుతుంది. ఐతరేయోపనిషత్తు లో

ఓం పురుషే హ వా అయమాదితో గర్భో భవతి।

అంటూ యదార్ధంగా చెప్పాలంటే ముందుగా పురుషుడిలోనే గర్భం కలుగుతోంది. పురుషునిలో ప్రారంభ దశలోని మనిషి రేతస్సు (వీర్యం లేదా శుక్లం) రూపంలో ఉంటాడు. ఈ రేతస్సు అన్ని అవయవాల యొక్క శక్తి సారంగా ఉంటుంది. ప్రాణాయామం చేత రేతస్సు రూపంలో తల్లి గర్భం లో ప్రవేశిస్తున్నాము.

ఎలా అంటే భార్యాభర్తలు ఒక ఆనంద స్థితిలో సమాగమం జరిపినప్పుడు ఆ ఇరువురి శరీరాలలోనూ ప్రాణం యొక్క గతాగతి హెచ్చుతూ ఉన్నప్పుడు భర్త యొక్క ఇంద్ర స్థానం కదలి వీర్యం అధోముఖంగా వచ్చి భార్య గర్భంలో పడి అండాకృతిని పొందుతోంది. ఆ అండం పిండం గా మారి దినదినాభివృద్ధి చెందుతూ సంపూర్ణ శరీరాన్ని పొంది తొమ్మిది నెలల తర్వాత ఈ భూమి మీదకు వస్తోంది.

ఈ విధంగా జీవుడికి మొదటి మూడు నెలలు తండ్రి శరీరంలోను, తరువాతి తొమ్మిది నెలలు తల్లి గర్భం లోను మొత్తం ఒక సంవత్సర కాలం గర్భవాసాన్ని అనుభవిస్తున్నాడు.

తల్లి గర్భం లో ఉండగా ఆ పిండంలోని ప్రాణశక్తి ప్రాణాయామ ప్రక్రియ ద్వారా బయటి గాలి సంపర్కం లేకుండానే అశనోత్పత్తి చేసుకొని తన శరీర రచనను చేసుకుంటూ పరిపూర్ణంగా వృద్ధి చెందుతోంది. ఈ పంచ భూతాత్మకమైన భూమి ఎంతో మనకు తల్లి గర్భంకూడా అంతే. అదే తల్లి సంబంధం అయితే మనకు ప్రాణ శక్తిని, ప్రాణాయామాన్ని ఇచ్చిన తండ్రి సంబంధమే ఎక్కువ.

తల్లిగర్భం ఛేదించుకుని ఈ భూగర్భం లోకి వచ్చినట్లే, మానవుడు ఈ ప్రపంచం నుండి కూడా బయటపడినప్పుడు తనను తాను తెలుసుకో గలుగుతాడు. అంటే స్వరూపదర్శనాన్ని పొందుతాడు. ఆమూలాగ్రం ఈ విషయాన్నే విశదీకరిస్తూ సాధనామార్గాన్ని చూపుతుందీ అచ్యుత యోగవిద్య.

యోగంలో అంటే జీవ ఆత్మల సంయోగంలో మధుర రసం ఊరుతుంది. భార్యాభర్తల సంగమంలో వారి నోటిలో ఊరే రకరకాలైన రసాల వల్లే వారికి ఆ ఆనంద స్థితి ప్రాప్తిస్తుంది. జీవ ఆత్మల సంయోగంలో ఆ రసాలకన్నా వేయి రెట్లు శ్రేష్ఠమైన అమృత రసం స్రవిస్తుంది. దానిని పొందిన వాడు అమరుడు, ఇచ్ఛామరణి అవుతాడు. ఇది మాత్రమే ఏకైక మార్గము. ఈ యోగమార్గంలో సాగి మోక్షసాధన చేయండి. ఇచ్ఛామరణులుగా మారండి. ఇదే శ్రేష్ఠము. ఇది శాశ్వతానంద దాయకమైన మార్గము.

వచ్చే భాగం, రెండవ అధ్యాయం లో యోగి అచ్యుతుల జీవిత విశేషాలతో మొదలుపెట్టి సాధనా విషయమై మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

రెండవ అధ్యాయం

Part 1                                                  05-Jan-2019

మాకు శ్రీ యోగి అచ్యుతుల తత్వం గురించి మాటలాడేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఆయన ఎప్పుడూ తన గురించి ఏమీ చెప్పేవారు కాదు. మహాత్ములు, మహాపురుషులు వారి వారి జీవిత చరిత్ర గురించి మాటలాడటాన్ని ఎప్పుడూ ప్రోత్సహించరు.

యోగి అచ్యుతులు చాలా మితభాషి. వారి నోటినుండి తత్వం తప్ప మరోమాట విని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ ఏకాంతంలోనే ఉండటానికి ఇష్టపడేవారు. కొద్ది నిముషాలు వారి సమక్షం లో గడిపిన ప్రతి ఒక్కరూ మానసిక తన్మయత్వాన్ని పొంది బుద్ధి ప్రచోదనమయిన వాళ్ళే. వారి సహజ సుందర వదనంలో ఎల్లప్పుడూ మౌనం, ఉల్లాసం దర్శనమిస్తూ ఉండేవి.

శ్రీ యోగి అచ్యుతులు 60 కేజీలకు మించని బరువుతో ఆరు అడుగులు(180 సెం మీ) ఎత్తుగా సన్నని బలిష్ఠమైన దేహంతో ఉండేవారు. స్వచ్ఛమైన మేలిమి బంగారపు రంగు దేహ ఛాయతో పొడవుగా ఉండే కోల మొహము, కొన దేలి కొంచెం వంగి ఉన్న ముక్కు, విశాలమైన నుదురు, ఎల్లప్పుడూ మందహాసంతో ఉండే ప్రశాంత మైన ముఖంతో చాలా ఆకర్షణీయంగా ఉండేవారు. తెల్లటి బట్టలనే ధరించేవారు.

వారు సమాధి తీసుకున్న తర్వాత ఆయన ముఖ్య శిష్యులు, స్వామివారు పుట్టిన ప్రదేశానికి వెళ్ళి వారి సంసారము, జీవిత విశేషాలు గురించి కొంచెం తెలుసుకో గలిగారు.

ప్రకృతి సౌందర్యానికి నిలయమై సుప్రసుద్ధమైన కూర్గు జిల్లా భాగమండలం లోని బెంగూరు లో యోగి అచ్యుతులు 1904 సంవత్సరంలో జన్మించారు. కూర్గు ప్రాంతం లో మనుష్యులు సహజంగానే తెలివైన వాళ్ళు, అందమైనవారు, మహా సాహసవంతులు. కావేరీ నది పుట్టిన ప్రదేశము. తపోభూమి. అగస్త్య మహాముని యొక్క దివ్య మహిమలతో వెల్లివిరిసిన ప్రదేశం అది.

వీరి తండ్రి భూప వర్మ. తల్లి పొన్నమ్మ. ముండనుడు అనే ఒక అన్నగారు, నంజుండ, కరుబయ్య, అప్పచ్చ అనే ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. తుంగమ్మ, మాయ అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. బళ్ళారపొండ అనేది వీరి క్షత్రియ కుటుంబపు పేరు. స్వామిగారి పూర్తి పేరు బళ్ళారపొండ బెంగూరు అచ్యుత వర్మ. ముద్దుగా అచ్చయ్య అని పిలిచేవారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా తల్లి శిక్షణలోనే పెరిగారు.

అచ్యుత వర్మ విద్యార్ధి దశలో ఉపాధ్యాయు లందరకూ ఎంతో ఇష్టమైన విద్యార్ధి. వ్యాయామం, ఆటల పోటీలలో ఎప్పుడూ ఫస్టే. మేధమేటిక్స్, సైన్సులు వారి అభిమాన సబ్జక్టులు. డ్రాయింగ్, మ్యూజిక్ (హార్మోనియం) లంటే ఎంతో ఇష్టం. నాటకాలలో వేసేవారు. మంచి నటుడు. కుచేలుని నాటకంలో వీరిదే కుచేలుని పాత్ర. సుధామ పాత్రను చేస్తే ప్రేక్షకులంతా పదే పదే ఆ పాత్ర చేయమని అడిగే వారుట. స్కూల్ లో ఆడ పాత్రలు వేసేవారుట. ఒకసారి చీర కట్టుకొని నిల్చొని ఉంటే వాళ్ళ హెడ్ మాష్టరు వచ్చి అతనినే ఎక్కడ శ్యామణ్ణ? ఇంకారాలేదు అని అడిగేరుట. దానికి స్వామివారు చిరునవ్వు నవ్వితే అప్పుడు గుర్తించి ఆశ్చర్యపోయేరుట.

సందర్భానుసారంగా కవిత్వం రాస్తూండేవారు. ఉపమాలంకారమంటే వీరికి ప్రీతి ఎక్కువ.
చిన్నప్పుట్నుంచీ చాలా ధైర్యశాలి.సూక్ష్మ గ్రాహి. పట్టుదల కల వ్యక్తి. క్రియాశీలి. ఆటలలో హాకీ, క్రికెట్ అంటే ఇష్టం. గుర్రపు స్వారీలో చాలా నైపుణ్యం ఉండేది.

చదువు ముగిసిన వెంటనే కాఫీ ఎస్టేట్ లో ఉద్యోగం. తీరిక సమయాల్లో వైద్యవృత్తి, ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతి, బయోకెమికల్స్ తో బీదలకు ఉచిత వైద్యం.

ఆ చిన్నతనం లోనే సత్యాన్వేషణ, ఆత్మ దర్శనంలో అత్యంత ఆసక్తి కనబరచేవారు. నిజమైన యోగ విద్య గురించిఎంతో మంది సాధువులు, సన్యాసులు, బైరాగులు, ఫకీర్లను, పండితులను కలుస్తూ ఉండేవారు. గుహలలో ఉండే సిద్ధపురుషులను దర్శించి వారిలో నిజమైన యోగవిద్య లేకపోవడం తో నిరంతరం అడవులు, కొండలు, గుహలలో వెదుకుతూ ఉండేవారు. తీరిక అయినప్పుడల్లా వేటకుక్కలను తీసుకొని గుర్రం మీద అడవులలో వేట నెపంతో అన్వేషిస్తూ ఉండేవారు. వేట లో నిష్ణాతులు. గురి చూచి కొట్టడం లో బహు నేర్పరి.

ఒకరోజు సాయంకాలం 4 గంటల వేళ అడవులలో వేటకై వెడుతూండగా ఒక దివ్య పురుషుడు బంగారువన్నె ఛాయతో మెరుస్తూ దర్శనమిచ్చాడు. తాను విద్యాధిపతినని చెప్పి స్వామిగారికి సుమారు సాయంత్రం 7 గంటల సమయం లో బ్రహ్మోపదేశం చేశారు. అప్పుడు స్వామి వయస్సు దాదాపు 27 సంవత్సరాలు.

“నేను విద్యాధిపతిని, నీ విద్య నీకు ఇచ్చి వెడదామని వచ్చాను“. చూడు అని నేలపై సుఖాసనంలో కూర్చొని యోగాభ్యాసం చేసి చూపించాడా దివ్య పురుషుడు.

“నేను పుట్టి పెరిగాక ఇప్పటి వరకూ నేలపై కూర్చో లేదు. నాకు కూర్చోవడం రాదు“ అన్నారు స్వామి.
ఫర్వాలేదు. నీవు ఎంతవరకూ కూర్చో గలిగితే అంతవరకూ కూర్చో మంటే గుర్రం దిగి స్వామి బూటు కాళ్ళతోనే ఆసనం లో కూర్చోగా హస్తమస్తక సంయోగం ద్వారా కుడి చెవి దగ్గర బ్రహ్మోపదేశం ఇచ్చారు. స్వామి గారికి వారి గురువులకు మధ్య సంబంధం సుమారు 7 నిముషాలు ఉండొచ్చు.

అప్పటినుండి వారి సాధన కఠిన నియమాలతో ఒక క్రమ పద్ధతిలో సాగింది.

Part 2                                                  06-Jan-2019

యోగాభ్యాసంలో సహజ ప్రగతిని సాధించడానికి స్వామి గారు ఒక క్రమమైన ఆహార పద్ధతుల్ని ఉపదేశం పొందే ముందే అవలంభించారు. నిర్ధిష్టమైన మార్గం గురించి అన్వేషిస్తూ ముందుగా శరీర తత్వాన్ని ఆకళింపు చేసుకున్నారు.

స్థూల ఆహార విహారాలను బట్టే శరీరం యొక్క స్వస్థత, స్వచ్ఛత ఉంటుందని గ్రహించి, ముందుగా తినే ఆహారం యొక్క పరిమాణం తగ్గించారు. తర్వాత తన కిష్టమైన పదార్ధాలను ఒకటి తర్వాత ఒకటి వదిలేస్తూ వచ్చారు. తర్వాత ఉత్త అన్నము కూర మాత్రమే తినేవారు. క్రమంగా ఉప్పు, కారాలేవీ లేకుండా కూరల్ని ఉడకబెట్టి అన్నంతో తినేవారు. ఆతర్వాత కూరలు కూడా మానేసి కొంత కాలం ఉత్త అన్నమే, తర్వాత దానిలో సగం, తిరిగి దానిలో సగం తింటూ చివరకు అన్నంకూడా బాగా తగ్గించేసేరు. ఈ విధంగా చేస్తున్న తన ఆహారపు అలవాట్లను ఎవరకీ తెలియనీయలేదు.

నెమ్మదిగా ఆ కొద్ది అన్నాన్ని కూడా వదిలి ఏలకులు పచ్చి కొబ్బరి తురుము, ఈ రెండే కొన్ని నెలల పాటు తిన్నారు. ఇదికూడా అయ్యాక అర్ధపావు అటుకులు మాత్రము సుమారు 45 నిముషాల పాటు నమిలి తినేవారు కానీ నీళ్ళు తాగేవారు కాదు. అటుకులు తర్వాత పొట్టుతో కూడిన అతి తక్కువ గోధుమపిండి, అరటిపండు, తేనె కలిపి చాలాకాలం తినేవారు.

కాని అందరిలా నవ్వుతూ ఉత్సాహంగా తిరుగుతూ ఉండేవారు. స్వామి గారు విద్యను పొందిన విధానం, దానికి ముందరే తన శరీరాన్ని యోగాభ్యాసానికి అనువుగా సంస్కరించుకొన్న విధానం ఆయనకు బ్రహ్మవిద్య లో సత్వర ప్రగతిని కలుగజేసి ఆయనను బ్రహ్మఋషి స్థానంలో నిలబెట్టాయి.

ఇంట్లో అంతా నిద్ర పోయిన తర్వాత స్వామి గారు ఆసనం వేసుకొని సాధన మొదలు పెట్టేవారుట.
వారి ప్రాణుని గతాగతి యొక్క గంభీరమైన శబ్ధానికి ఇల్లంతా కంపించిపోయేదిట.

ఇంద్రియాతీతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి మన దేహంలో ఉన్న ఇంద్రియాలనే సహాయ కారులుగా చేసుకోవడం మన సాధనలో మొదటిమెట్టు. ఈ యోగ విద్య వల్ల ముందుగా శరీరం శుద్ధి అవ్వాలి. తద్వారా అంతః శుద్ధి జరుగుతుంది. శరీరంలో ఉండే పంచభూతాలు శుద్ధి అయితే దర్శనాలు ఆనందాది అనుభవాలు కలుగుతాయి.

పృథ్వ్యప్తేజో నిలఖే సముత్థితే
పంచాత్మకే యోగగుణే ప్రవృత్తే
న తస్యరోగో నజరా నమృత్యుః
ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరమ్।।

యోగాభ్యాసం వల్ల మన శరీరంలో ఉండే పంచ భూతాలు శుద్ధి చేయబడతాయి. అప్పుడు భూమి, జలము, అగ్ని, వాయువు ఆకాశం ల యొక్క ఐదు విధాలయిన యోగానుభవాలు కలుగుతాయి. అప్పుడు శరీరమంతా యోగాగ్నితో నిండిపోతుంది. ఆస్థితిని పోందిన సాధకుడ్ని వ్యాధిగాని మృత్యువుగాని దరిచేరవు.

లఘుత్వ మారోగ్యమలోలుపత్వం
వర్ణప్రాసాదః స్వరసౌష్టవం చ
గంధః శుభో మూత్ర పురీషమల్పం
యోగప్రవృత్తిం ప్రధమాం వదంతి।।

శరీరమంతా యోగాగ్నితో నిండి పోయిన సాధకుడికి శరీరం చాలా తేలికగా అయిపోతుంది. ఆరోగ్యం చాలా బావుంటుంది. మనస్సులో ఏ కోరికలు లేకుండా ఉంటుంది. స్వచ్ఛమైన శరీరఛాయ, శ్రావ్యమేన కంఠ స్వరము, ఆహ్లాదకరమైన శరీర వాసన, మలమూత్రాల విసర్జన దాదాపు తగ్గిపోవడం అనేవి యోగాభ్యాస సమయంలో మొదట్లో జరుగుతాయి.

స్వామిగారు సాధనలో సాగుతూ నీలగిరి, బెళగాం, చిత్రదుర్గం మొదలైన జిల్లాలలో తిరుగుతూ వైద్యం, వ్యవసాయం మొదలైన కార్యక్రమాలతో సామాన్య ప్రజలకు అతి చేరువ అయ్యారు. అదే పర్యటనలో భాగంగా స్వామివారు రాయదుర్గం లో ఉన్నప్పుడు విజయీంద్రులు వారి ప్రధమ శిష్యులుగా మారేరు.

Part 3                                                  07-Jan-2019

రాయదుర్గం లో స్వామి డాక్టరుగా పేషెంట్లను చూసి మందులిస్తూండేవారు. ఒకరోజు సాయంత్రం సమయంలో విజయీంద్ర అనే అబ్బాయి విపరీతమైన తలనొప్పి తో బాధపడుతూ
తన ఇద్దరు మిత్రులతో కలిసి మన స్వామి దగ్గరకు వచ్చేడు.

స్వామి మందులివ్వడం అయిపోయేక విజయీంద్రకు డాక్టరును కొన్ని ప్రశ్నలడగాలని అనిపించింది. “ఎందుకు మీరు ఒక్కరే ఉంటారు ఇంతమంది సంసార జీవితం చేస్తూ సుఖానుభవాల్ని పొందుతూంటే?“ అని అడిగేరు.

దానికి స్వామి “నా తపోజీవనం నన్ను ఇలా ఉండనిచ్చింది” అన్నారు.

“ఔను. నాకైతే మిమ్మల్ని చూడగానే మీలో ఒక దివ్యత్వం ఉంది అనిపించింది. మరి తపోజీవులు ఇలా ఎందుకు ఉన్నారు(అంటే కాషాయ బట్టలు లేకుండా) “అని విజయీంద్ర అంటే దానికి స్వామి “అలా వేషాలు వేయడమే తపస్వుల విధానము అనుకొంటే తప్పు” అన్నారు. ఆ రోజు సంభాషణ అలాముగిసింది.

ఐదు సంవత్సరాల తర్వాత విజయీంద్ర తన స్నేహితులతో కలసి హంపి శిథిలాలను చూడడానికి వెళ్ళేరు. అప్పుడు విజయీంద్రకు 18 లేక 19 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పుడు ఉదయాన్నే “సుప్రభాతం” అంటూ స్వామి విజయీంద్ర అతని స్నేహితులు ఉన్న రూములోకి వచ్చేరు. “రండి సర్, ఎంత ఆశ్చర్యం. ఎలా మమ్మల్ని కనుక్కోగలిగేరు” అన్నారు విజయీంద్ర.

ఈ సారి స్వామి పెరిగిన గెడ్డం భుజాలవరకూ పెరిగిన నల్లని తలవెండ్రుకలతో ఉన్నారు. విజయీంద్రగారూ! నేను యోగాభ్యాసంలో కూర్చున్నప్పుడు ఈ ఋష్యమూకంలో వందల కొలది ఆత్మ జ్యోతులు వెలగడం చూశాను. మీరు ఇక్కడ ఉన్నట్లు కనుక్కొని తిన్నగా యోగనుంచి అలాగే లేచి ఇక్కడకొచ్చాను. మీకు తత్వంపై అపారమైన అభిలాష ఉంది కదా?” అన్నారు స్వామి. దానికి విజయీంద్ర ఇలా అన్నారు” సార్! ఆ సాధనలేవో నాకు తెలియదు. పూజా పునస్కారాలు చేసే వాళ్ళను చూశాను. నేనూ చేస్తూ ఉంటాను. కాని నాకు సమాధానం దొరకలేదు. ఈ మధ్య నాకు కొద్దిగాశాంతిని అందించిన విషయం భక్తి. స్వరూపానుభవానికి మార్గం దొరికితే తప్ప మహర్షుల తపస్సు ఇలా బాహ్యానుకరణలతో లభించదు. దానికి యోగ్యులైన గురువు కావాలి అని అర్ధం అయ్యింది.” అంటూ జరిగిన సంభాషణలో స్వామిగారి సమాధానాలను అర్ధంచేసుకొని, “స్వామీ మీలో ఆ దివ్య మార్గం ఉంది. నన్ను ఉద్ధరించండి” అని వేడుకున్నారు విజయీంద్ర.

అప్పుడు స్వామి విజయీంద్ర తో “నేను కొన్ని రోజులు గుహలో ఏకాంతవాసం చేయదలచుకున్నా. మీరుదానికి సహకరిస్తే మిమ్మల్ని అన్నిరకాలుగా చూసుకుంటాను. “అన్న మాటలు ఇంకా ముగియక ముందే“ కానివ్వండి. ఉందాము. మీరు ఇంకే ఆలోచన పెట్టుకోవద్దు” అని అప్రయత్నంగా విజయీంద్ర నోటినుంచి వెలువడ్డాయి.

అలా గురు శిష్యులిద్దరూ కలిసి ఆరోజంతా ఆవాస యోగ్యమైన గుహ గురించి హంపి మొత్తం వెదికి అక్కడ ఉన్న ఎత్తైన కొండ మీద ఉండే రత్నకూట గుహను ఎంచుకున్నారు. రత్నకూట గుహ ఉత్తరాభిముఖంగా ఉంటుంది. దానికి లోపల మరో గుహ. అక్కడ ఒక వ్యక్తి ధ్యానం చేసేందుకు వీలుగా ఒక ఒకటిన్నర అడుగుల ఎత్తైన కట్ట ఉంది. గుహ పైభాగం లో మొదటి అంతస్తులా ఒక మండపం. గుహ ఎదురుగా మరో మంటపం ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని దత్తాత్రేయ యోగ మంటపం అంటారు. (ప్రస్థుతం ఆ రత్నకూట గుహ జైన్ మతస్తుల అధీనంలో ఉంది.)

ఆ ఎత్తైన కొండకు ముందు వెనుక పంటపొలాలు ఉన్నాయి. చుట్టూ ఏమీ లేవు, చిమ్మ చీకటి తప్ప. మొదటినుంచీ ఆ పర్వతం భయంకరమై క్రూర జంతువులు, విష సర్పాలకు నిలయమై ఉండేది. అదే ఇప్పుడు మన స్వామి విజయీంద్రులకు నివాసమయ్యింది.

స్వామి విజయేంద్రతో “ మీరు నాకు ఏరకమైన దుస్తులు వేయదలచుకున్నారో మీ ఇష్టం. మీకు నచ్చిన రీతిలో నన్ను తయారుచేయండి” అన్నారు. తనతో వచ్చిన స్నేహితులను సాగనంపుతూ హోస్పేటకు వెళ్ళి కాళ్ళకు చెక్కతో చేసిన పాదుకలు, బైరాగులు కట్టుకున్నట్లు మెడ వెనుక ముడి వేసుకొనే ఒక దుప్పటికొనుక్కు వచ్చేరు విజయీంద్ర. నదీ తీరంలో స్వామి ఉత్తరాభిముఖంగా నిల్చుంటే ఆయన మెడకు వెనక మెలివేసి ఆ బట్టను కట్టి కాళ్ళకు పాదుకలు తొడిగి స్వామికి సాష్ఠాంగ నమస్కారం చేసేరు విజయీంద్ర. అలా మొదలైంది వారిద్దరి గుహావాసం.

రోజూ నదీస్నానం తర్వాత స్వామి కొండమీద గుహకు వెళ్ళేవారు. ఉదయం స్నానం కనీసం ఒక గంటసేపు సాగుతుంది. తలపై ధారగా నీరు పోసుకుంటూ ఉంటారు. శరీరంలోని నరనరాలను రుద్ది స్నానం చేస్తారు. స్నానం అయిన వెంటనే ప్రసన్న చిత్తంతో ఉత్తరాభిముఖంగా ఆసనం వేసి 2 లేదా రెండున్నర గంటలు ధ్యానం లో ఉండిపోతారు.

విజయీంద్ర హంపికి వెళ్ళి అప్పుడే పిండిన పాలను తను తాగి స్వామికి కొండమీదకు తీసుకొని పోయేవారు. స్వామి వారికి ఆహారంగా రోజూ చాలా కొద్ది పొట్టుతీయని గోధుమపిండి, అరటిపండు తేనెలతో కలిపి ముద్దచేసి ఇచ్చేవారు. అప్పటికే తొమ్మిది పది సంవత్సరాలయ్యింది స్వామి మామూలు భోజనం విడిచి పెట్టి. ఇంక రాత్రి పది గంటలకోసారి స్నానం చేసి ఆసనం వేసుకొని తపస్సుకు కూర్చుంటే ఉదయం ఐదున్నర గంటలకు బయటకు వచ్చేవారు. రత్నకూటగుహ లో వారి దినచర్య ఇది.

Part 4                                                  12-Jan-2019

అప్పటికప్పుడే స్వామిగారు దర్భలు జనపనార తాళ్ళతో కలిపి ఇద్దరికి సరపడే ఒక చాప తయారు చేసేరు. అదే వారిద్దరి జపపానికి ఆసనం, పడుకొనేందుకు చాప కూడా అయ్యింది.

1938వ సంవత్సరం డిసెంబరు నుంచి 1940 నవంబరునెల ఆఖరువరకూ గుహావాసం నడిచింది. రత్నకూట గుహలో స్వామిగారి తపస్సు సమయంలో విజయీంద్రులు ఎన్నో ఎన్నెన్నో తత్వ రహస్యాలను గ్రహించారు.

స్వామి ఒకసారి 14 రోజులపాటు మౌన వ్రతంతో కూడిన ఉపవాస దీక్షలో ఉన్నారు. నిజంగా ఆయన తినేదే అతి తక్కువ తేనె, అరటిపండుతో కూడిన గోధుమ పిండి మిశ్రమం. అదికూడా మానేసి ధ్యానం మౌనాలతో గడిపేరు ఆ14 రోజులు. అయినా ఏకొంచెం కూడా నీరసం లేకుండా మంచి ఉత్సాహంగానే ఉండేవారు. ఏదో పనిమీద బళ్ళారి వెళ్ళిన విజయీంద్ర ఆరోజు అంటే 14 వ రోజు తిరిగి గుహకు వచ్చి ఉండకపోతే స్వామి శాశ్వితంగా మౌనం లోనే ఉండి పోవాలని నిశ్చయించుకున్నారు. ఆరోజు స్వామి మాట్లాడగానే గుహలో ఉండే అందరూ పండుగ చేసుకున్నారు. స్వామి చేత మాట్లాడగలిగించినందుకు విజయీంద్రులను అందరూ మెచ్చుకున్నారు. అలాగే మరొకసారి 40 రోజులు మౌనవ్రతం లో ఉన్నారు.

మౌనం గురించి స్వామిగారు ఏమంటారంటే

“మౌనం అంటే సోమరిపోతుల క్రియాశూన్యత్వం కాదు. ఈ లోకానికి నీనుంచి, నీతోటి వాళ్ళనుంచి ఎలాంటి సేవ జరగాలోఆ సేవకు తయూరవడాన్నే మౌనం అంటారు.

నీ శరీరం మనస్సు, ఇంద్రియాలు పొందే అన్నివిధాలయిన విశ్రాంతికి మౌనమే ఒక సంకేతం.

ఈ మౌనం అనేది నీ వివిధ క్రియా కలాపాలలో ఉండే దోషాలను తొలగించ గలిగేదై ఉండాలి. ఆత్మను మహదాత్మగా చేయగలగాలి.

మనలో ఉండే మానవత్వాన్ని సంస్కరించుకొని దైవత్వపు ఛాయలతో మన స్వరూపాన్ని రూపొందించి ఆ భగవంతునికి ప్రసాదంగా సమర్పించగలగాలి ఆ మౌనం.

అప్పుడే ఆ మౌనం మనలో పరిశుద్ధతను కలుగచేస్తుంది. అప్పుడది ఆత్మానందానికి ఒక విహార కేంద్రం గా మారుతుంది.

మౌనం మన తపోజీవనాన్ని క్రమబద్ధీకరిస్తుంది. మనకు ఈ సంఘానికిమధ్య పరస్పర మైత్రిని కలగజేస్తుంది.”

కాని, మనం ఏవైనా విషయాలు ఇతరులకు వివరిస్తున్నప్పుడు మాటలు తోచకపోతే ఊరకుండడం మౌనంకాదు. మనకు కోపం వచ్చినప్పుడు పిరికితనం వల్ల మాట్లాడక పోవడం మౌనం కాదు.

ఈ మౌనం యొక్క ఆవశ్యకత అర్ధం అయితే మనకు అంతర్ముఖత ఎందుకు కావాలి అనేది అర్ధమవుతుంది.

యోగి అచ్యుతుల మౌనం అలాంటిది. తపస్సు రోజు రోజుకు పెరుగుతోంది. స్వామి రోజురోజుకు అంతర్ముఖుడవుతూ ఉండడం వల్ల రోజు రోజంతా మౌనంగానే ఉన్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి.

ఏకాంతంలో, పవిత్రమైన గుహావాసం లో దివ్యత్వంతో వెలిగిపోతున్న స్వామికి పక్కనే ఆసనం వేసుకొని కూర్చున్న విజయీంద్రులకు ఎన్నో సమస్యలకు సమాధానాలు దొరికాయి.

విజయీంద్రులు ఏమీ అడగలేదు. స్వామి ఏమీ చెప్పలేదు. ఏమీ మాట్లాడని మౌనం. కరుణతో విరసిన కళ్ళతో స్వామి విజయీంద్రులను చూడడం తప్ప ఇంకేమీ ఉండదు. అదే వారిద్దరి మధ్య ఉండే భావార్ధరూపం.

ఈనాటి విషయాన్ని ఒకటి రెండు సార్లు చదివి అర్ధం చేసుకోమని నా మనవి.

Part 5                                                  15-Jan-2019

అది తెల్లవారుఝామున సుమారు 5.00 గంటలయి ఉంటుంది. నిజంగా ఆసమయాన్నే సుప్రభాతం అంటారు. ప్రత్యక్షంగా కన్పించే అతి సుందరమైన వెలుగు. అప్పుడే విజయీంద్ర ధ్యానం ముగించి లేచేరు. ఎవరో ధ్యానం నుంచి మేల్కొలిపినట్లు అయ్యింది. చూస్తే స్వామి ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి గుహనుంచి బయటకు వస్తున్నారు. విజయీంద్ర స్వాని అనుసరించి బయటకు వచ్చేరు. స్వచ్ఛమైన వెన్నెల వెలుగులు ఆ కొండమీద అడవి అంతా పరచుకొని ఎంతో ప్రశాంతంగా అందంగా కనపడుతోంది. కొండ క్రింద పచ్చని పైరులు. పైన బండమీద స్వామిగారు, విజయీంద్ర నిల్చున్నారు.

చూస్తూంటే ఎంతో అశ్చర్యం. విజయీంద్రకు చిరు గజ్జెల సవ్వడి వినబడింది. పక్కన స్వామి ఉన్నా మళ్ళీ వినబడింది. ఆగజ్జల రవళితో పాటు మురళీనాదం కూడా వినబడింది. నిజంగా అది అనిర్వచనీయం. హటాత్తుగా స్వామి కనిపించలేదు. అక్కడ బాలకృష్ణుడు మురళి వాయిస్తూ నాట్యం చేస్తున్నట్టు కన్పించింది. చాలా సేపు ఇలా సాగింది. తర్వాత నెమ్మదిగా శబ్దాలు ఆగి ఆ దృశ్యం మాయమవుతూ స్వామి తిరిగి అక్కడ నిలబడి కన్పించేరు.

విజయేంద్ర వెంటనే స్వామికి సాష్టాంగ ప్రణామం చేసేరు. “రండి విజయీంద్రా నదికి వెళ్ళి స్నానం చేసి వద్దాం” అని వినిపించింది. నెమ్మదిగా విజయీంద్ర, స్వామిని అనుసరించేరు.

ఇక్కడ శ్రీ యోగి అచ్యుతులు విజయీంద్రులతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొంటే తపో జీవనం నిజానికి ఎంతో శుచితో కూడుకొన్నది. నువ్వు ఎంత శుచివి అవుతావో, నువ్వు ఎంత సూక్ష్మం అవుతావో, నువ్వు ఎంత మంచివాడవు అవుతావో, అంతే శుచి, సూక్ష్మత్వం, అంతే మంచితనం తిరిగి తిరిగి వేయింతలై ఫలితాన్నిస్తుంది – అన్నారు.

అంతఃశుద్ధి, కల్మష రహితమైన మనస్సు, మైత్రి, కరుణ,ముదిత, ఉపేక్ష ఉండాలి. ప్రాణాయామం ధ్యానాల వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ప్రసన్నత ఏర్పడుతుంది. ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారానికి వీలు ఏర్పడుతుంది. ఇదే క్రమంలో ఆత్మ శోధన జరగాలి.

అధశుద్ధం భవేద్వస్తు యద్వైవాచామగోచరమ్
ఉతేతి శుద్ధ చిత్తానాం వృత్తి జ్ఞానం తతఃపరమ్!!

వాక్కులకు కనపడని వస్తువు ఏదయితే ఉందో అది శుద్ధమైన వస్తువు (బ్రహ్మము). పరిశుద్ధమైన చిత్తం ఉన్నవారికి మాత్రమే ఆ పరిశద్ధ వస్తు వృత్తి జ్ఞానం తెలుస్తుంది.

ఎవరి పరిశద్ధత, భక్తి, వారికి దివ్య దర్శనాలు, మరియు సత్య సందర్శన చేయిస్తాయి. తపస్సులో సమస్తం కనపడుతుందనేది పరమ సత్యం. ఈ తపో మార్గంలోఋషులు, మునులు, సిద్ధ పురుషుల దర్శనం, వారితో సంభాషణ అనేది పూర్తిగా సాధ్యం. తపో మార్గంలోని దర్శనాలు, అజీర్ణ నిద్రలో వచ్చే స్వప్నాల లాటివి కాదు.

పూర్తి జాగ్రదావస్థలో ఆ దేవుని కృపగా దొరికేవే ఈ దర్శనాలనేవి.

చూడండి, తపస్సు ఫలించాలంటే ఎల్లప్పుడూ ఉల్లాసంగానే ఉండాలి. మనస్సును ఎక్కడో జడంగా పడేస్తే కుదరదు. మనస్సు వికసించాలి.

మనస్సు యొక్క స్వభావం ఏమిటంటే మనను తమస్సులో పడేస్తుంది, తరచు ఉద్రేకానికి లోను చేస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ మనస్సు సుకల్పం, వికల్పం మరియు సంకల్పాలనే మూడు అవస్థల మధ్య లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది.

అందుకే తపస్వులు నిరంతరం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనిని చూసినా మనస్సులో విసుక్కోకుండా, దారి మళ్ళకుండా ప్రగతిపధం లో సాగుతూండాలి. అలా చేయగా చేయగా మనస్సు యొక్క ఉన్నత స్థానం గోచరిస్తుంది. అప్పుడే యోగవిద్యలో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరడం సాధ్యం అవుతుంది.

వైరాగ్యం అనే శబ్దం యొక్క మాయ లో పడిపోకూడదు. వైరాగ్యమంటే జుగుప్స, నిరాశ నిస్పృహ కాదు. సమస్త ద్వంద్వాలలోను సమత్వ దృష్టిని పొంది ఉండడమే.

సమత్వ స్థితిలో ఎంతో ప్రేమమయమైన జీవితాన్ని సాగించాలి. మనస్సు యొక్క వివిధ కార్యాలు అవస్థలు తెలియాలంటే సంయమనం, భూతదయ కలిగి ఎల్లప్పుడు అప్రమత్తతతో ఉండాలి.

గుహలో ఓ రోజు రాత్రి స్వామి గారి పడకపై నాల్గయిదు తెల్లతేళ్ళు వచ్చి పాకడం మొదలు పెట్టాయి. వాటిని నెమ్మదిగా చిన్న చిన్న పుల్లల సాయంతో బయటకు పంపేవారు. ఒక్కొక్క రోజు వాటిని కదపకుండా అలాగే ఆ చాప మీద పడుకొనేవారు. అలా నాల్గయిదు రోజులు వచ్చాయి. నాల్గో రోజు ఎంత ప్రయత్నించినా అవి బయటకు పోలేదు. స్వామి అలాగే వాటికి తగలకుండా పడుకొంటే వాటిలో ఒకటి స్వామిని కుట్టింది. కుట్టిన వెంటనే నాలుగు తెల్లతేళ్ళు వెళ్ళిపోయాయి. కాని స్వామి శరీరం రంగు ఒకరకంగా మారింది. అయినా ఏమీ మాట్లాడక ఆసనం వేసి అఖండ ధ్యానంలో కూర్చున్నారు. ఆ నిష్ఠ చాలా కఠినం. అది స్వామిగారికే చెల్లుతుంది.

Part 6                                                  17-Jan-2019

ఆ రోజు బాగా చలి వేస్తూంటే స్వామిగారు, విజయీంద్ర ఇద్దరూ గుహ లోపల పడుక్కున్నారు. మధ్య రాత్రి చూస్తే స్వామి లేచి గుహ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు. ఏదో ఆర్భాటం కనబడింది. అది పులి. స్వామి మాట్లాడుతున్నారు. “ఏయ్! ఇలా గర్జిస్తే నేను భయ పడతానను కున్నావా? నేను నిరాయుధుడనని ముందుకు రావద్దు. శాంతమైన ఈ గుహలో ప్రశాంత వాతావరణం లో నివసిస్తున్న నాకు పాపం కలగ జేయకు. వద్దు. వెళ్ళిపో” అన్నారు. ఆయన మాటలు విన్న ఆపులి అప్పచి వరకూ గర్జించినది కాస్తా నెమ్మదిగా వెనుదిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోయింది.

అప్పుడు విజయీంద్ర తో “చూసేవా! ఎన్నో సార్లు మనుష్యుల కన్నా జంతువులే తొందరగా అర్ధం చేసుకుంటాయి. వాటికి జ్ఞానాన్ని ఎదిరించే అహంకారం లేదు. తొందరగా తెలుసుకుంటాయి. అహింసా తత్వాన్ని, ప్రేమను, శాంతిని తెలుసుకొని అదేరీతిలో ఆ పరిసరాల్లో ప్రవర్తిస్తాయి. అక్కడ నుంచి బయటకు వెడితే తిరిగి వాటి సహజ ప్రవృత్తితో ఉంటాయి.

కణ్వుని ఆశ్రమంలో పులులు లేళ్ళు సింహాలు జింకలు పరస్పర మైత్రితో ఉన్నాయి. ఎందుకంటే కణ్వ మహర్షి అహింసను మనసా వాచా కర్మణా ఆచరించేడు కాబట్టి.

శాంతానికి, ప్రేమకు జంతువులన్నీ వాటి సహజ సిద్ధమైన క్రూరత్వాన్ని వదలి ప్రకృతిలో లీనమై పోతాయి. ప్రేమతో జీవించడానికి ఇష్ఠపడతాయి. జీవిస్తాయి.

ఒక రోజు రాత్రి స్వామి, విజయీంద్ర ఇద్దరూ దర్భాసనం మీద కూర్చున్నారు. ఉన్నట్టుండి స్వామి లేచి నిలబడి ముందువైపు రెండడుగుల ఎత్తైన గోడ దగ్గరకు పోయి దాని పై ఒక కాలుంచి క్రింద ఒక కాలు పెట్టి నిల్చున్నారు. అక్కడ్నుంచి విజయీంద్రా! చూడండి ఎదురుగా ఉండే ఆ పర్వత శ్రేణులవైపు. అత్యాశ్చర్యం. ఎంత దివ్యమైన ప్రకాశమో అది.

అక్కడ ఒక బంతి ఆకారంలో ఉన్న తెలుపు, నీలి వర్ణాలతో కలిసిన ప్రకాశం అటూ ఇటూ కదులుతూ కనపడుతోంది. అది మాణిక్యం అన్నారు. కొన్ని సర్పాల పడగలపై ఈ మాణిక్యం ఉంటుంది. నిజంగా ఆ దివ్య జ్యోతి దర్శనం విజయీంద్రలో అపారమైన ఆనందాన్ని నింపింది.

ఇటువంటి ఎన్నో అనుభవాలతో స్వామి తపో జీవనం నిర్వరామంగా సాగింది 1940 డిసెంబరు వరకూ. (స్వామి విజయీంద్రుల పుస్తకం నాదేవుడు లో ఎన్నో ఇంకెన్నో విశేషాలున్నాయి).

1940-41 సంవత్సరంలో ఒక కుంభవృష్ఠి కురిసిన రోజు స్వామి, విజయీంద్ర ఇద్దరే ఉన్నారు. రండి ఈ వాన తర్వాత చల్లని గాలిని అనుభ విద్దురుగాని అంటూ అక్కడ్నుంచి బయటకు తీసుకు వచ్చారు విజయీంద్రను. ఆరోజు నిజంగా చల్లని శీతల వాయువులు వారిద్దర్నీ ఎంతో ఆహ్లాద పరిచేయి.

ఈ రోజు విశిష్ఠంగా గుర్తు ఉంచుకో వలసిన రోజు. సుమారు పది సంవత్సరాలుగా మనంచేసే మామూలు భోజనం మానేసిన స్వామి విజయీంద్ర తో “ఈ రాత్రి భోంచేద్దాం విజయీంద్ర గారూ! ఇక నాకు కర్మ రంగంలోకి దిగాలని ఆహ్వానం వచ్చింది. త్రిమూర్తులు నన్ను గుహ నుంచి బయటకు రావాలని ఈ ప్రపంచంలో చేయవలసినది చాలా ఉందని ఆదేశించారు. స్థూలంగా చేయవలసిన పనులు నేను చేయాల్సి ఉంది. అందువల్ల ఈ నిరాహారం, ఉపవాసాలు ఇంక కుదరవు.” అనడంతో విజయీంద్రకు అపారమైన సంతోషం కలిగింది.

సంతోషంతో పరుగెత్తి వంట సామానులన్నీ తెచ్చేరు విజయీంద్ర. ఇద్దరూ కలిసి సాయంత్రానికి భోజనం సిద్ధమైంది. అడవంతా అద్భుతంగా వెన్నెల కాసింది. గుహ బయట ఆ బండరాళ్ళన్నీ వెండికొండల్లా మెరుస్తున్నాయి. పదార్ధాలన్నీ బయటకు తెచ్చి అరటి ఆకులో అన్నం వడ్డించారు విజయీంద్ర. ఆసమయం లో భోజనానికి వచ్చిన స్వామి అకస్మాత్తుగా శరీరాన్ని కుంచించుకొని హూ హూ హూ అంటూ విపరీతంగా జ్వరంతో వణకడం మొదలు పెట్టేరు. ఎలాగో భోజనం అయ్యిందని పించేరు. తర్వాత ఏమేమో తిన్నా అన్నం మాత్రం వండలేదు మళ్ళీ గుహలో ఉండగా.

Part 7                                                  19-Jan-2019

స్వామి గుహ నుంచి హంపి కి మార్చేరు తన కార్యక్రమాన్ని. ఈ హంపి అనేది ఋష్య మూక పర్వతాలు కిష్కింధలతో కూడిన అతి ప్రఖ్యాతి చెందిన ప్రదేశం శ్రీరాముని కాలం నుండీ. అప్పటికే సర్వతో ముఖాభివృద్ధిని పొందిన ప్రదేశం. ఈ హంపి లో కొలువైన దైవాన్ని పంపాపతి, విరూపాక్షుడు అనేపేర్లతో పిలుస్తారు. హంపి అనేది శంకరుని ఒక దివ్యధామం.

కృష్ణ దేవరాయల కాలం లో హంపి విజయనగరం అంగరంగ వైభోగంగా వెల్లి విరిసి సమస్త శోభలతో అలరారి ప్రస్థుతం ఆనాటి సంస్కృతికి చిహ్నంగా మిగిలిన శిధిలాలతో ఒక పర్యాటక ప్రదేశంగా మాత్రమే మనకు పరిచయం.

స్వామి బలవంతంగా విజయీంద్రను అతని ఇంటికి పంపేశారు. తప్పక అతను తన కుటుంబ ఉద్యోగమైన కరణీకం చేసుకోమని. అయిష్ఠమైనా విజయీంద్రకు కరణంగా బాధ్యతలు తీసుకొని పని చేయాల్సి వచ్చింది. అంతకాలం తపస్వుల సన్నిధానంలో ఏకాంతవాసం తో కూడిన గుహావాసం చేసి తిరిగి ఈ ప్రజారణ్యం లో పడడం ఏ మాత్రం ఇష్టం లేదు విజయీంద్రకు. కాని తప్పనిసరి పరిస్థితి.

ఆరోజుల్లో అరకొరగా ఉన్న వైద్య సదుపాయాన్ని చూసి స్వామి ఆ ప్రదేశంలో వైద్యాన్ని ప్రారంభించారు. అప్పుడక్కడ మలేరియా జ్వరం మహమ్మారిలా వ్యాపించి ఉంది. స్వామి చుట్టూ హోమియోపతి, బయోకెమికల్స్, అల్లోపతి మందులు. యువకులు, ముసలి వాళ్ళు కూలీలు మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ గుమిగూడి మందులకై నుంచుంటారు. స్వామి నవ్వుతూ ఎంతో ఓపికతో ప్రతి ఒక్కరకీ సరిపోయే మందులు ఇస్తుంటారు.

అప్పటికే అక్కడకు దగ్గరలో ఉన్న కమలాపురంలో గవర్నమెంటు డాక్టరు ఆసుపత్రి ఉన్నా స్వామి గారి హస్తవాసి మంచిదనే పేరు బాగా వచ్చేసింది. అందువల్ల వారం లో రెండురోజులు కమలాపురం లోని రోగులను చూడడానికి వెళ్ళవలసివచ్చేది.

కరణంగా పని చేస్తున్న విజయీంద్రకు ఒకరోజు విఠలాపురం అనే ఊర్లో ఇంటిలో పడుకొని ఉండగా ఎదురుగా స్వామి నిలబడ్డారు. నిద్ర ఏమీ లేదు. వెల్లకితలా మంచంమీద పడుకొని చూస్తూంటే స్వామి నిలబడి కనపడ్డారు. అంతే ఉన్నపాటున కాళ్ళకు చెప్పులు లేకుండా, జేబులో డబ్బు లేకుండా హుటాహుటీన కాలినడకన బయలు దేరేరు హంపి జేరడానికి. అరికాళ్ళు బొబ్బలెక్కిపోయి, కాళ్ళు ఇంక కదలని స్థితిలో స్వామి దగ్గరకు చేరేరు.

స్వామి కళ్ళెర్ర జేసి కోపంతో “go and get out” అని అరిచేరు. అయినా విజయీంద్ర కదలక పోతే హంటర్ తీసుకొని బలంగా కొడుతూ ఇంటినుంచి బయటకు తీసుకొని వచ్చేరు. అక్కడ జనమంతా చూస్తున్నారు. స్వామి హంటరుతో కొడుతూనే వినపడటం లేదా అంటూ అరుస్తూనే ఉన్నారు. చుట్టూ ఉన్నవాళ్ళు విజయీంద్రతో మీరు ఆయనను ఆపండి. ఆ హంటర్ ఆయన చేతినుండి లాక్కోండి అంటూ చెప్పబోయారు.

విజయీంద్ర, స్వామి కొడుతూంటే పడుతున్నారే కాని తిరగబడటం లేదు. మిగిలిన వాళ్ళతో “ఆయన కొడుతున్నారు. నాకు ఇష్టమే నేను దెబ్బలు తింటున్నాను. మధ్యలో మీకెందుకు, మీ పని చూచుకోండి”, అనగానే వాళ్ళకు ఏమనాలో తెలియక ఊరకున్నారు. చివరకు స్వామే నెగ్గేరు. విజయీంద్ర తిరిగి తన ఊరు వెళ్ళి ఉద్యోగం చేయడం మొదలు పెట్టేరు.

స్వామి వైద్యం తో బాటు 10-20 యెకరాల భూమి సాగు చేయడం గురించి కౌలుకు తీసుకున్నారు. రోజూ సాయంత్రాలు కూలీలకు డబ్బులివ్వాలి. అంతా స్వామి ఇంటిముందర గుమిగూడుతారు. ఈ విధంగా వైద్యం, వ్యవసాయాలతో హంపి చుట్టు పక్కల ఉండే దళితులంతా స్వామికి అతి చేరువ అయ్యారు. ఒకరకమైన సామూహిక శ్రమ కార్యక్రమం మొదలయ్యింది.

స్వామికి తత్వ స్థాపనకై అనుమతి అయ్యింది. ఈ సభ్య సమాజంలో తత్వాన్ని ప్రచారం చేయాలంటే మన లోని భక్తి, ప్రేమలు మాత్రమే సరిపోవు. యుక్తి, తంత్రం కావాలి. ముందుగా ఈ సమాజాని కి సంబంధించిన అవగాహన ఉండాలి. ఉపాయంతో ఈ మనుషుల హృదయాలను గెలవాలి.

సమాజం ఏ దిశలో పోతోంది? వారి అభిరుచులు ఏమిటి? ఏ భాషలో ఏ యే ఉపమానాలతో వివరించాలి? ఈ నాటి సంప్రదాయాలేమిటి? రాజకీయ సామాజిక దృక్పధం ఎలా ఉంది? మానవుని జీవనా సరళిని బట్టి తత్వ ప్రసంగాలు ఉంటే అవి శ్రోతలహృదయాలకు హద్దుకుంటాయి. వారిని ఆలోచింప జేస్తాయి.

దానికి మార్గదర్శకుడు లేదా తత్వబోధకునిలో ఒక క్రమ జీవన విధానం, ఋజు మార్గ నడవడిక, సత్యసంధత, జిజ్ఞాస, తోటి మానవుడి మీద అపారమైన ప్రేమ, భూతదయ ప్రతిబింబించాలి. ఏవో అద్భుతాలు చేయడం, తద్వారా మనుష్యుల ను ఆకర్షించడం లేదా భయ భ్రాంతులను చేయడం లాంటివి చేయకూడదు.

స్థూల సూక్ష్మ కర్మలను సమసామ్యంలో చేయ గలిగిన వ్యక్తే తత్వ స్థాపనకు అర్హుడు. స్థూలకర్మ యైన వ్యవసాయం సూక్ష్మ కర్మయైన తపస్సులను ఎప్పుడూ సమతుల్యంలో నడిపి చూపిన యోగి మన స్వామి.

Part 8                                                  20-Jan-2019

గుహా వాసం అయిన తర్వాత స్వామి విజయీంద్రులను అతని కుల వృత్తి అయిన కరణీకంలో జేరి కరణంగా బాధ్యతలు తీసుకొని పని చేయమని పంపించేసేరు. ఆ తర్వాత అతని తల్లి దండ్రులు అతనికి వివాహం చేసేరు. 1941 లో బళ్ళారి జిల్లాలోని రాయపురం కరణంగారి అమ్మాయి కమలమ్మ తో విజయీంద్రుల వివాహం జరిగింది.

విజయీంద్రులు మంచి ఒడ్డు పొడుగు కలిగి విశాలమైన ఛాతితో నిత్యం వ్యాయామంచేసిన శరీరంలా ఉండి పచ్చటి మేలిమి బంగారు ఛాయతో మెరుస్తూ ఉండేవారు. మంచి గుండ్రని పెద్ద కళ్ళు కను చివరలలో ఎర్రటి జీరలతో మధ్యలో తెల్లగా మెరుస్తూ ఒక యోగి కళ్ళులా ఉండేవి. మెడలోవెండిపోగుతో చేసిన కమలబీజాల మాల లో బంగారు శంఖు చక్రాలు అమర్చబడి అందంగా కనపడేది. పెద్దగా బడికి పోయి చదువుకున్నది థర్డ్ ఫారం వరకూ అయినా ఇంటి దగ్గరకూ టీచర్లు వచ్చి చెప్పిన ఇంగ్లీషు జాగ్రఫీ, హిష్టరీలు బాగా నేర్చుకున్నారు. గణితంలో మాత్రం ఎప్పుడూ వెనకబడి ఉండేవారు.

రాయదుర్గంలో స్కూల్ లో చదువుతున్నప్పుడు ఉపాధ్యాయుల సంఘం లో “ఉపాధ్యాయుల కర్తవ్యభారం” అనే విషయం మీద ప్రసంగించి మంచి ఉపన్యాసకుడు అనే ప్రశంసలను పొందేరు. సమవయస్కులైన పిల్లల లో లేని విశిష్టత వారిలో కనపడేది. అపార ప్రజ్ఞాపాటవం, సాహిత్యోపాసన, కవితాశక్తి వారి సొత్తు. పెద్దగా పాఠశాల విద్యాభ్యాసం లేని విజయీంద్రుల అనర్గళమైన ఇంగ్లీషు, తెలుగు, కన్నడ ప్రసంగాలు, అద్భుత కవితా రచనలు గురించి అడిగితే తాను తన గురువుల చేతిలోని ఒక చమత్కారమే అంటారు.

గురువనే దివ్యమైన పరుసువేది తగిలిన శిష్యుడే ఈ విజయీంద్ర అంటారు. చిన్నప్పటినుంచీ దేవుడిని చేరుకొనే మార్గం గురించి, ఆ దివ్యానుభవాన్ని పొందడానికి ఉండే మార్గం గురించే తహతహ లాడేవారు. స్వామిగారు తనకు గుహావాసంలో చేయూత నిమ్మనగానే కనీసం ఇంటి దగ్గర చెప్పకుండానే రత్నకూట గుహలో స్వామితో పాటు నెలల తరబడి ఉండిపోయారు. తిరిగి స్వామిగారు పంపగా ఇంటికి చేరిన విజయీంద్ర ఇంట్లోవాళ్ళు ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు. పెళ్ళి చేస్తే కుదురుగా ఉంటాడు కదా అని తల్లిదండ్రులు వెంటనే పెళ్ళి చేసేసేరు.

స్వామి దివ్య సన్నిధిలో గుహావాసంలో అంతకాలం గడిపిన తర్వాత సంసార జీవనం చేయడానికి విజయీంద్ర ఎంతగానో నొచ్చుకున్నారు.

కరణంగా గ్రామాధికారంలో ప్రజల అనురాగాన్ని పొందగలిగేరు. ఒక గుమ్మస్తాను పెట్టుకున్నారు. మామూలుగా నవ్వుతూ వివాదాలకు పరిష్కారాలు చెబుతూ ఉండేవారు. క్లిష్టమైన వివాదాలు వస్తే వాటిలో అధర్మం అనాచారం ఎక్కువగా కన్పిస్తే వాళ్ళను పట్టుకొని దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. స్వామి గారు విజయీంద్రను తన వాగీంద్రియంగా చాలా సార్లు పేర్కొన్నారు.

చిన్నతనం నుంచి విజయీంద్రకు చిర పరిచితులైన జయతీర్ధగారు స్వామిగారికి శిష్యుడిగామారిన కధ వచ్చే భాగంలో తెలుసుకుందాం.

మూడవ అధ్యాయం

Part 1                                                  21-Jan-2019

1945 లో జయతీర్ధ రాయపురం లో ఉన్న ఎయిడెడ్ స్కూల్ లో టీచర్ కమ్ మేనేజర్ గా ఉండేవారు. ఆ స్కూల్ కి సర్వస్వం తానే అయి దానిని సర్వతోముఖంగా అభివృద్ధి చేసేరు.

రాయపురం కరణంగారి అమ్మాయి కమలమ్మ తన భర్త విజయీంద్రకు పిచ్చి, మతి స్థిమితం లేదు అని అతని ఇంటి నుంచి తన పుట్టింటికి వచ్చేసింది. ఆ కరణంగారిని జయతీర్ధ తన పినతండ్రి వరసలో పిలిచేవారు. అందువల్ల కమలమ్మ జయతీర్ధ కు కూతురు వరస.

విజయీంద్ర జయతీర్ధకు చిన్నతనం నుంచీ పరిచయమే. అందుకే విజయీంద్ర విషయమై నిజానిజాలు తెలుసుకోడానికి వెంటనే విజయీంద్ర గారి ఊరు వెళ్ళారు. ఆరాత్రి పూర్తిగా విజయీంద్రతో అన్ని విషయాలు చర్చించారు. అందరూ అనుకున్నట్లు వారిలో పిచ్చి లక్షణాలు ఏమీ కనపడలేదు.

విజయీంద్రలోని తీవ్ర వైరాగ్యం, తపోనిష్ఠ, తత్వ స్థాపనలో ఉండే శ్రద్ధ వాటి గురించి మాట్లాడే తీరు చూసి జయతీర్ధ ముగ్ధులైపోయారు. ఇద్దరి మధ్య ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి.

జయతీర్ధ ట్రైనింగ్ స్కూల్ లో ఉన్నప్పుడు విజయీంద్ర రాసిన విషయాలలోని భాషా పటిమ భావ గంభీరతలు ఎంతో బాగా నచ్చాయి జయతీర్ధకు.

ఆ తర్వాత విజయీంద్ర తరచు జయతీర్ధను కలవడానికి వస్తూ ఉండేవారు. ఆ సమయం లో ఒకసారి జయతీర్ధను తనతో తను గ్రామ కరణంగా ఉన్న ఊరు విఠలాపురానికి తీసుకొని పోయారు. అప్పుడు విజయీంద్ర రాసిన ‘కరళుకొరగు’(హంపి దర్శనం) అనే కావ్యాన్ని ఫెయిర్ కాపీ చేసిఇమ్మని జయతీర్ధను కోరేరు. కాపీ చేసేక చూసి జయతీర్ధ “ఈ పుస్తకం చాలా చిన్నదిగా ఉంది. ఇది ఒక ప్రబంధ రూపం దాల్చాలంటే నవబృందావనం – ఋష్యమూకము – బుక్కరాయల ధర్మదృష్టి కూడాచేరిస్తే బావుంటుంది” అని సలహా ఇచ్చేరు. అలా చెప్పిన వెంటనే విజయీంద్ర ఆసువుగా ఋష్యమూకము మీద కవిత చెప్పడం మొదలు పెట్టేరు. రాయడం లో దిట్ట అయిన జయతీర్ధ దానిని అదే స్పీడులో రాసి ఆ పుస్తకానికి ఒక రూపు తెచ్చేరు.

ఇప్పుడా కరుళకొరగు పుస్తక ముద్రణ జరిగి 1946 అక్టోబరు 12 నాడు సన్మాన సభ ఏర్పాటు చేసేరు జయతీర్ధ. యోగి అచ్యుతులను ఈ సన్మాన సభకు ఆహ్వానించడానికి విజయీంద్ర జయతీర్ధ కలిసి బయలుదేరేరు. ఇప్పటి వరకూ స్వామి గురించి విజయీంద్రుల ద్వారా వినడమే కాని ఆయనను చూడలేదు. ఇద్దరూ కలిసి హంపీ చేరేరు. విరూపాక్షుడి గుడి ముందు ఉత్తరాభి ముఖంగా ఉన్న మూడు నాలుగు ఇళ్ళలో ఒక డాబా మీద కూర్చున్న స్వామి ని చూపి వారే యోగి అచ్యుతులు అన్నారు విజయీంద్ర.

స్వామి సుందర రూపం, బ్రహ్మ తేజస్సు, ప్రశాంతత, చిరునవ్వుతో ఉండే వారిని చూసి అకారణంగానే జయతీర్ధకు ఎందుకో భయం కలిగింది. జీవితం లో ఎప్పుడూ ఇంత అధైర్యానికి లోను కాలేదు. ఇద్దరూ డాబా మీదకు వెళ్ళేరు. స్వామి రండి రండి అని ఆహ్వానించేరు. వారే స్వయంగా కాఫీ చేసి ఇచ్చేరు.

విజయీంద్ర జయతీర్ధను స్వామికి పరిచయం చేసేరు. ఇంతకు ముందు ఎక్కడా చూసినట్లు లేదుకదూ? అన్నారు స్వామి.

దానికి జయతీర్ధ “లేదు. జ్ఞాపకం ఉంది నేను ఎస్ ఎస్ ఎల్ సి చదివే రోజుల్లో 1939 డిసెంబరులో మిమ్మల్ని మొళకాల్మూర్ లో కలిశాను.” అన్నారు. “కాదు. 1938 డిసెంబరులో” అని సరి చేసేరు.

ఆరోజుల్లో స్వామి డా।।అచ్చయ్య కేరళ వైద్యుడు అనే పేరుతో మంచి పేంటు షర్టు మోడరన్ డ్రెస్ తో ఉండేవారు.

అప్పుడు జయతీర్ధకు 17 యేళ్ళ వయస్సు. తల్లితండ్రుల కోరిక మేరకు పెళ్ళి చూపులకు వెళ్ళి వస్తూ మొళకాల్మూర్ లో ఓ హొటల్ లో తన బంధువుతో కలిసి టిఫిన్ తిన్ కాఫీ తాగుతున్నారు జయతీర్ధ. దగ్గరలో పక్క బెంచీమీద కూర్చున్న వ్యక్తి జయతీర్ధ గారి బంధువుతో “హనుమేష్! ఎవరితను?” అని ప్రశ్నించేడు. ఆయన తెల్లగా మెరిసిపోతున్న కళ్ళతో మోడరన్ డ్రస్ ట్రౌజర్, బుష్ షర్ట్ వేసుకుని చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. జయతీర్ధ బంధువు వివరాలన్నీ చెబుతూ పెళ్ళి చూపుల విషయం చెప్పేరు. అప్పుడు “వీరికి పెళ్ళా?” అని నవ్వుతోంటే జయతీర్ధకు బాగా కోపం వచ్చింది. “ఎవరీ అధిక ప్రసంగం చేసే వ్యక్తి? వావిషయం ఇతనికెందుకు?” అన్నట్లు కోపంగా అతనివైపు చూసేరు జయతీర్ధ.

ఆ విధంగా స్వామితో ప్రధమ పరిచయం 1938 లోనే జరిగినా జయతీర్ధ 1946 లో స్వామిని కలిసేరు. ఇప్పుడు స్వామి మెడకు ఇరువైపులా జడలు కట్టి వేలాడే నల్లని జుట్టుతో, సింహానికి జూలులా ముఖంలోఅదికూడా ఒక భాగమే అయిన పూర్తి గడ్డంతో అద్భుతమైన ముఖ వర్చస్సుతో చిరునవ్వుతో కనపడుతున్నారు.

Part 2                                                  24-Jan-2019

సాహిత్య అభిమానులైన మిత్రులు కొందరు, ముఖ్యంగా జయతీర్ధగారు కలిసి విజయీంద్రుల కరుళకొరగు అనే గ్రంధాన్ని అచ్చువేయడానికి కావలసిన ధనం విరాళాల రూపంలో వసూలు చేసి ప్రింటింగ్ చేయించేరు. విజయీంద్రుల వారికి సన్మానం చేయాలని నిశ్చయించు కున్నారు. ఈ పూర్తి కార్యక్రమం ఒక్క జయతీర్ధుల నిర్విరామ కృషి ఫలితమే. విజయీంద్రుల సన్మాన సభకు కర్నాటక కుల పురోహితులు శ్రీ ఆలూరు వెంకట్రావుగారు తన అధ్యక్షతన జరిపేందుకు ఒప్పుకున్నారు. శ్రీ యోగి అచ్యుత కుమార్ ఉపన్యాసకులుగా ఉండాలని స్వామిని కోరేరు జయతీర్ధ.

“సంతోషం. ఆ సభ జరగ నీయండి, కాకపోతే క్షమించండి. నాకు రావడం కుదరదు. అదే రోజు ఆంధ్ర హిస్టారికల్ రీసెర్చ్ యసోసియేషన్ సభ ఉంది. నేను దాన్లో పాల్గొనేటందుకు సరేనని ఒప్పుకున్నాను” అన్నారు. దానికి విజయీంద్ర “అదంతా నాకు తెలియదు మీరు రాకపోతే నాకు సన్మానం వద్దు. నేనూ వెళ్ళను” అన్నారు. “సరే, కనీసం ఒక అర్ధగంటేనా ఉండేట్లా వస్తాను. మీరు సభ ప్రారంభించండి.” అన్నారు స్వామి.

అనుకున్న సమయానికి 1946 అక్టోబర్ 12 న విజయీంద్రస్వామి సన్మాన సభ పురోహితులు శ్రీ ఆలూరి వారి అధ్యక్షతన జరిగింది. జయతీర్ధ వారి స్నేహితులు శ్రీ శ్యామ శాస్త్రి హరిదాసులు వేదికమీద నుంచి పూజ్యులైన శ్రీ యోగి అచ్యుతులు సకాలంలో సభకు రాలేక పోయారు అంటూ వారు పంపిన ఆశీర్వచన సందేశం చదివి వినిపించేరు.

సభ మొదలై ఓ గంట గడిచింది. జయతీర్ధ మిత్రుడైన హరిదాసు విజయీంద్రులు రచించిన నవభక్తి పూజ అనే కవితల్ని రాగబద్ధంగా శ్రావ్యంగా పాడుతున్నారు. అంతలో యోగి అచ్యుతులు సభా మందిరం లోకి ప్రవేశించేరు. సభలో సంతోషం ఉప్పొంగింది. అందరూ లేచి నుంచొని జయజయ ధ్వానాలు చేసేరు. స్వామి వారి అమృతవాణి వినేటందుకు అందరూ ఎంతో ఉత్సాహంతో వేచి చూస్తున్నారు.

మీ అందరి ప్రేమకు నా కృతజ్ఞతలు. నేను పంపిన సందేశం శ్రీ శ్యామా శాస్త్రి గారి ద్వారా వినే ఉంటారు. శ్రీ విజయీంద్రులు రేయింబవళ్ళు తను ఏమి కావాలని సతమతమయ్యారో అది వారికి లభించాలని ఆశిస్తూ నేను దీనిని వారికి ఇస్తున్నాను అంటూ తనకు గౌరవ పురస్కారంగా వేసిన దండను విజయీంద్రుల మెడలో వేశారు. విజయీంద్రులు పరమానంద భరితులయ్యారు. పూజ్య శ్రీ యోగి అచ్యుతుల దర్శన భాగ్యంతో పాటు వారి ఉపన్యాసాన్ని పొందిన ఆనాటి సభికులంతా ధన్యులయ్యారు. స్వామి చిరునవ్వుతో చేతులు జోడించి భ్రూమధ్యంలో ఉంచి చేసే నమస్కారంతో ఆనాటి భాషణ ముగించేరు. స్వామి ఆ రోజు రెండు గంటలపాటు వాళ్ళతో గడిపేరు.

జయతీర్ధ స్వామిని బస్సుదాకా సాగనంపడానికి వెళ్ళేరు. బస్సులకదిలే ముందు స్వామి అడిగేరు “హంపికి వస్తారా?” అని; “వస్తాను “అన్నారు జయతీర్ధ; “ఎప్పుడు?”అన్నారు స్వామి; త్వరలోనే అన్నారు జయతీర్ధ. “అలాగే చేయండి, ఓసారి రండి” అని స్వామి అనగానే బస్సు కదిలింది.

ఆరోజు మొత్తం అతిధులందరకీ సరిపడ ఫలహారాలు, టిఫిన్లు జయతీర్ధ యొక్క తల్లి గారే తయారుచేశారు. స్వామిని టిఫెన్ కి ఎందుకు తీసుకొని రాలేదు? కనీసం పళ్ళయినా ఇచ్చి పంపేవా? అని ఆయన తల్లి అడిగే వరకూ జయతీర్ధకు స్పృహే లేదు. స్వామి దర్శనం అయ్యాక ఇంక ఈ వ్యవహారిక దృష్టే ఉండదనేది సత్యమని నిరూపించ బడింది.జయతీర్ధ గారి తండ్రిగారు వచ్చిన వారందరకూ ఉపచారాలు చేసేరు. స్వామికి కాఫీ గాని పండ్లుగాని ఇవ్వనందుకు జయతీర్ధ చాలా నొచ్చుకున్నారు.

అప్పటికే విజయీంద్రకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు పిల్లలతో విజయీంద్రుల భార్య కమలమ్మ విఠలాపురం లోనే ఉంటూండేది. అలా సన్మానాని కని వచ్చిన విజయీంద్ర మరో 30 రోజులు జయతీర్ధ గారిదగ్గరే ఉండిపోయారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరి హోసపేట్ లో ఉన్న తన అన్నగారి ఇంటిలో పదిహేను రోజులుండి తిరిగి జ్వరము తో జయతీర్ధ గారి ఇంటికి చేరేరు. జయతీర్ధ గారు విజయీంద్రుల సమీప బంధువులకు, తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు ఆయన అనారోగ్యం విషయం చెబుతానంటే విజయీంద్రులు ససేమిరా ఒప్పుకోలేదు. స్వామి దయవల్ల ఆయన అనారోగ్యం కుదుట పడగానే జయతీర్ధ ఆయనను విఠలాపురానికి తీసుకొని పోయారు.

అప్పటికే ఇద్దరు చిన్న పిల్లలతో విసిగి వేసారిన కమలమ్మ గారు ఎంతో బాధపడుతున్నారు. ఆమె తండ్రి ఈ పరిస్థితులను తెలుసుకొని ఆమెను పిల్లలను వాళ్ళింటికి తీసుకొని పోయేరు. దానితో జయతీర్ధ విఠలాపురం నుంచి విజయీంద్రను దేవసముద్రం లోని ఆయన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళి వదిలేరు. కుటుంబంతో విసిగిపోయిన విజయీంద్రులు 1947లో తనను తాను సన్యాసిగా ప్రకటించుకున్నారు. ఆ విధంగా స్వామిగారి ప్రధమ శిష్యులు ప్రధాన శిష్యులు అయిన విజయీంద్రులు పూర్తిగా స్వామి గారి సేవకు అంకితమయి పోయేరు. స్వామీ విజయీంద్రులుగా మారిపోయేరు.

సశేషం
ఉదయభాస్కర్ దువ్వూరి

Japa Sadhana – Blog

%d bloggers like this: