– శ్రీ ఉదయభాస్కర్ దువ్వూరి
Last updated: Jun 27th 2019
మొదటి భాగం
శ్రీ శ్రీ యోగి అచ్యుతుల 61వ జయంతి సందర్భంగా సాధక సోదర సోదరీమణులందరకూ స్వాగతం.
మన ఏవ మనుష్యాణాం కారణం బన్ధ మోక్షయోః
బన్ధాయ విషయాసక్తం, ముక్త్యై నిర్విషయగ్ం స్మృతమ్।।
మనుష్యుల యొక్క బంధాలకి మోక్షానికి కూడా మనస్సే కారణమవుతోంది. విషయాలమీద ఆసక్తి ఉన్న మనస్సు ఈ ప్రపంచం తోబంధాన్ని కలిగి ఉంటోంది. ఈ ప్రాపంచక విషయాలలో ఏ రకమైన ఆసక్తి లేని మనస్సు మోక్షానికి కారణమవుతోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే శరీర అభిమానం ఉన్నవారికి సంపూర్ణ అజ్ఞానమే ఉంటుంది. ఈ అజ్ఞానం వల్లే జీవుడు బద్ధుడై జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కోరికలు, కర్మబంధాలు పూర్తిగా విడిపోతే కాని తనను తాను తెలుసుకో లేడు.
ఉదాహరణకు ఒక కొలను లోని తామరపువ్వును తీసుకోండి. తుమ్మెద, కప్ప కూడా దానిని ఆధారంగానే బ్రతుకుతాయి. ఉన్న ఒక్క తేడా ఏమిటంటే తుమ్మెద అందమైన తామరపువ్వునే నివాసంగా చేసుకుని పరాగంలో ములిగి తేలుతూ ఉంటుంది. కప్ప ఏమి చేస్తుంది? అదే తామరపువ్వు కాడ చుట్టూ ఉండే బురదలో పొర్లుతూ ఉంటుంది.
పరాగంతో వెలుగుతూ ఉండే ఆత్మ స్వరూపంలో నిరాసక్తతతో ఉన్న మనస్సు లీనమవడానికి ప్రయత్నిస్తూంటుంది. విషయాలలో చిక్కుకున్న మనస్సు కోరికల లంపటంతో కర్మ బంధాలలో చిక్కుకుని దేహాభిమానంలో పడిపోతోంది.
మనం బ్రహ్మ విద్యలో ఉపదేశాన్ని తీసుకున్నాము. బ్రహ్మజ్ఞానానికి మించింది సమస్త లోకాల్లోనూ ఇంకోటి ఏదీ లేదని మనకు తెలుసు. బ్రహ్మత్వం అనేది నిజంగా మనస్సు కు మిగిలిన ఇంద్రియాలకు అందేదే అయితే మనను ఏదో ఒక ఇంద్రియం బ్రహ్మత్వానికి చేరువగా తీసుకొని పోయేది.
మనం మనలో సాత్విక గుణాలను పై పైకి ప్రదర్శిస్తున్నా అంతరంగం లో అనేక వికల్పాలుండి ఒక్క క్షణమైనా అవమానాన్ని సహించలేము. మనస్సు నిండా మనకు కీర్తి ప్రతిష్ఠలమీదే కోరిక ఉంటుంది. కామక్రోధాలు లోపల రగులూతూ ఉంటాయి. పైకి బ్రహ్మనిష్ఠునిలా వేషం. అటువంటప్పుడు మనం చేసే సాధన ఎలా ఫలితాలను ఇస్తుంది చెప్పండి.
కామక్రోధాలనే ఈ రెండు మనోవృత్తులు మనకు జ్ఞానప్రాప్తిని కలగనీయవు. అజ్ఞానం, మాయ, కోరికలు, కర్మ అనేవి మృత్యువు యొక్క ధర్మాలు. మనం మృత్యుంజయులు కావాలంటే వీటి బారినుండి బయట పడాలి.
సస్వరూపజ్ఞానమనేది మన గురువుయొక్క కృపతోటే సాధ్యం. గురువు మీద భక్తి, నమ్మకం లేకుండా మనం ఎంత సాధన చేస్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది?
నేను అభాగ్యుడిని. దురదృష్టవంతుణ్ణి, నేను పాపిని అనుకోవడాన్నే అవిద్య అజ్ఞానం అంటారు. అంతఃకరణలో కలవరంవల్ల ఎల్లవేళలా అశాంతిగా ఉండేవాళ్ళు, ఇంద్రియలోలత్వం వల్ల మనస్సులో ఆంధోళన పడేవాళ్ళు బ్రహ్మజ్ఞానానికి దరిదాపులకు కూడా వెళ్ళలేరు.
సంసారులైనా సన్యాసులైనా తన్ను తాను తెలుసుకోవాలంటే సాధనతో తన శరీరాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. స్థిరమైన మనస్సుతో ధ్యానం చేయాలి.
మనస్సుకు స్థిరత్వం రావాలంటే గురువు మీద అచంచలమైన విశ్వాసం, భక్తి ఉండాలి. అకుంఠిత దీక్షతో, ఏకాగ్ర చిత్తంతో చేసే సాధనే మనస్సుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. తన సర్వస్వాన్ని సమర్పించు కుంటే తప్ప మన మనస్సు మనస్తత్వమనే స్తాయికి చేరలేదు.
గురువు మీద భక్తి విశ్వాసాల గురించి చెప్పేటప్పుడు నేను ఎప్పుడూ శబరి గురించి శంకర భగవత్పాదుల ప్రధమ శిష్యులు పద్మపాదుడి గురించీ చెబుతూ ఉంటాను కదా! ఈ సారి వేదధర్ముడి శిష్యుడైన దీపకుడి గురించి తెలుసుకుందాం.
అంగీరసుడి ఆశ్రమంలో వేదధర్ముడనే గురువు ఉన్నాడు. ఆయనకు అనేకమంది శిష్యులున్నారు. వాళ్ళు శ్రుతులు స్మృతులు అధ్యనంచేస్తున్నారు. వారి చదువు సమాప్తం కావచ్చింది. వాళ్ళని వేదధర్ముడు పరీక్షించాలనుకొన్నాడు.
శిష్యులందర్నీ సమావేశ పరచి ఇలా అన్నాడు. “ జన్మాంతరాలలో నేను ఆర్జించిన మహాపాపం నాకు సంక్రమించింది ఈ జన్మలో దానిలో చాలా భాగము నా తపోనుష్టానాలతో ప్రక్షాళనం చేసుకున్నాను. కాని మిగిలిన పారబ్ధ పాపం నేను అనుభవిస్తేకాని నశించదు. అది నశిస్తేకాని నాకు మోక్షం సిద్ధించదు. అందుకని నేను ప్రయత్న పూర్వకంగా ఆ పాపాన్ని అనుభ వించాలని నిశ్చయించుకున్నాను. వారణాసి లో నా పాపాన్ని అనుభవిస్తాను. ఆ సమయంలో నన్ను రక్షించ గలిగిన సమర్ధుడు మీలో ఎవరున్నారు? ” అని అడిగేడు వేదధర్ముడు.
వేదధర్ముడి శిష్యులలో ప్రధముడు, ముఖ్యుడు అయిన దీపకుడు గురువుకు నమస్కారంచేసి “ స్వామీ! నా దేహంలో శక్తి ఉన్నంతవరకూ నేను సేవ చేస్తాను. మీరు చెప్పినట్లు పాపం అనుభవించనిదే అది నాశము కాదు. ” అన్నాడు.
వేదధర్ముడు “ శిష్యా! నా పాప ఫలంగా నేను కుష్ఠు రోగిగా, అంధుడిగా ఇరువైఒక్క సంవత్సరాలు గడపాలి. నన్ను ఆ 21 సంత్సరాలు కంటికి రెప్పలా కాపాడ గలవా? నీకా శక్తి ఉంటే చెప్పు ” అని అన్నాడు.
దానికి దీపకుడు “స్వామీ! మీ పాప క్షయాన్ని నా దేహంతో చేస్తాను. 21 సంవత్సరాలు నేను కుష్ఠిరోగి గా అంధుడిగా ఉంటాను నాకు ఆజ్ఞ ఇవ్వండి” అని గురువు కాళ్ళమీద పడ్డాడు.
అప్పుడు వేదధర్ముడు “ నాయనా! నా పాపగతి ఎలాంటిదంటే, నా పాపాన్ని నేనే స్వయంగా అనుభవించాలి. శిష్యులు మొదలైన వాళ్ళ ద్వారా పాపక్షయం అవదు. కాబట్టి నేను ఈ దేహంతోనే పాపాన్ని అనుభవిస్తాను. నీకు శక్తి ఉంటే నన్ను కాశీ చేర్చి నాపాపనాశ పర్యంతం నన్ను కాపాడు. నీ ద్వారా నేను పాప రహితుణ్ణి అయి పరమ పదవిని పొందుతాను. ” అన్నాడు.
దీపకుడు “ మీరు నాకు కాశీ విశ్వనాధులతో సమానులు. మిమ్మల్ని కాశీ చేర్చి సేవిస్తాను ” అని వాగ్దానం చేసి గురువును కాశీలోని మణికర్ణిక ఘట్టంలో ఒక మంచి ప్రదేశంలో నివాసాన్ని ఏర్పాటు చేసేడు.
వేదధర్ముడు గంగలో స్నానంచేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించి తన ప్రారబ్ధ పాపమైన కుష్ఠురోగాన్ని పొంది నేత్రహీనుడై ఎంతో దుఃఖం లో మునిగి పోయాడు.
వేదధర్ముడి శరీరమంతా కుష్ఠురోగం వ్యాపించి దుర్వాసన రావడం మొదలైంది. శరీరమంతా ఆ రోగ క్రిములు వ్యాపించేయి. దానివల్ల వచ్చే దుఃఖం తో తను ఆత్మ జ్ఞాని ననే జ్ఞానం పూర్తిగా నశించింది. ఒకసారి శరీరం రోగ గ్రస్తమయితే వాళ్ళలో క్రూరత్వం పెరిగిపోతుంది. కోపం అసహనం వేయింతలయిపోతుంది.
దీపకుడు గురువు శరీరాన్ని చక్కగా శుభ్రపరుస్తూ ఎప్పటికప్పుడు గంగాస్నానం చేయిస్తూ, బిక్షమెత్తి గురువుకు అన్నం పెడుతున్నాడు. కాని రోగంవల్ల పెరిగిన క్రూరత్వంతో శిష్యుడు తెచ్చిన అన్నాన్ని భూమిమీద విసరి కొట్టి అన్నం తక్కువ అయింది అనేవాడు. ఎక్కువ అన్నం తెస్తే కొంచెం తిని రుచిగా లేదని పారవేసేవాడు. ఎక్కువ రకాలయిన ఆహార పదార్ధాలు కావాలని పేచీ పెట్టేవాడు. అలాగే యాచించి తెస్తే దీపకుణ్ణి ఇష్ఠం వచ్చినట్టు తిట్టి, కొట్టి బాధించేవాడు.
ఒక్కొక్కరోజు శిష్యుణ్ణి చేరదీసి “ నీవు నా గురించి చాలా బాధలు పడుతున్నావు. నా శిష్య శిఖామణివి ” అని మెచ్చుకొనేవాడు. మళ్ళీ ఇంతలోనే గురువు మనస్సు మారిపోయేది. “ నువ్వు నా దుర్వాసన పోయేట్లా కడగడం లేదు. దోమలు ఈగలు ముసురుతున్నా తోలటంలేదు ” అని తిట్టేవాడు. సరే అని శుభ్రం చేసి ఈగల్ని తోలుతోంటే తనకు అన్నం లేటయిందని తిట్టేవాడు.
అప్పుడప్పుడు గురువు” దీపకా! పాప గతి ఇలానే ఉంటుంది. పాపం అధికంగా ఉన్నచోట దైన్యం అసూయ దుష్టత్వం గూడు కట్టుకొని శుభాశుభాలు తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. అందుకే పాపాత్ముడికి ఉన్మత్తుడికి తేడా ఉండదు. ” అని చెబుతూనే మరింత హింసిస్తూ ఉండేవాడు.
ఇంతటి బాధలలోను గురువు యొక్క దోషాలని ఎంచకుండా, గురువు భయపెట్టినా, వారించినా గురువునే ఈశ్వరునిగా భావించి గురుసేవ చేస్తున్నాడు దీపకుడు. కాశీ క్షేత్రంలో ఉన్నా ఏ ఒక్కరోజు విశ్వేశ్వరుణ్ణి దర్శించలేదు గురు సేవా తత్పరుడై ఉన్నాడు.
ఈ విధంగా గురువే సర్వస్వంగా సేవ చేస్తున్న దీపకుణ్ణి చూచి కాశీ విశ్వేశ్వరుడు ప్రసన్నుడై దర్శనమిచ్చి నీ గురుభక్తి కి మెచ్చేను. నీకు ఒక వరమిస్తున్నాను కోరుకో అన్నాడు. శంకరా! పరమేశ్వరా! నా గురువుకు తెలపకుండా నేను వరం కోరలేను. నాగురువు అనుమతి తీసుకొని చెబుతాను అన్నాడు దీపకుడు.
తన గురువును చేరి “ గురుదేవా! కాశీ విశ్వనాథుడు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. మీరు అనుజ్ఞ ఇస్తే మీకు రోగము అంధత్వం పోవాలని కోరుకుంటాను “ అన్నాడు దీపకుడు.
దానికి గురువు విపరీతమైన కోపంతో “ నువ్వు నాకు సేవలు చేయడం వల్ల అలసిపోయి ఉంటావు. కాని నా వ్యాథి ఉపశమనానికి ఈశ్వరుణ్ణి ప్రార్ధించకూడదు. అనుభవించనిదే పాపం నశించదు అని చెప్పేనుకదా! వరం వల్ల నివారణ అయితే వచ్చే జన్మలో అనుభవించాలి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ రోగ శేషం నా మోక్షానికి విఘ్నకారి అవుతుంది. అందుకని వద్దు ” అన్నాడు. సరే యని దీపకుడు ఈశ్వరుని దగ్గరకు వచ్చి “ నాకు వరం తో పని లేదు. నా గురువుకి ఇష్టం లేని వరాన్ని నేను స్వీకరించలేను ” అని సమాధానం చెప్పేడు.
ఆ ఈశ్వరుడు, విష్ణువు ఇతర దేవతలు వింటూండగా ఈ గురు శిష్యుల కధ చెప్పేడు. గురువు ఆజ్ఞ లేదని నన్ను వరమే కోరలేదు అంటే విష్ణువు కూడా ఆశ్చర్య పడ్డాడు. ఆ గురువునే త్రిమూర్తి స్వరూపునిగా సంకల్పించి సేవ చేస్తున్న గురుభక్తి పరాయణుడైన దీపకుణ్ణి చూడాలని శ్రీమహా విష్ణువు తలచేడు. తలచినదే తడవుగా దీపకుడి ముందు ప్రత్యక్షమయ్యేడు.
ఓ దీపకుడా! నువ్వు మోక్షపరమైన గురభక్తిని చూపిస్తున్నావు. ప్రతి గురు భక్తుడూ నా భక్తుడే. మాతాపితృ సేవకులందరూ నా భక్తులే. విద్వాంసులను విప్రులను, తపస్వులు, యతులు, యోగులను సేవించే వాళ్ళంతా నా అనుంగు భక్తులే. నీ భక్తికి బద్ధుడనై వచ్చేను. నువ్వు ఏదైనా వరం కోరుకో అన్నాడు శ్రీమహా విష్ణువు.
దీపకుడంటున్నాడు “ మాకు బ్రహ్మోపదేశం ఇచ్చింది, సర్వ విద్యలు నేర్పేది గురువే. త్రిమూర్తులు గురువు యొక్క అధీనంలోనే ఉంటారు కదా! అటువంటప్పుడు మాకు ఇతరలదేవతలతో పని ఏముంది? సర్వ దేవతలు, సర్వ తీర్ధాలు మా గురువే. నీ విచ్చే వరం నా గురువు నాకివ్వడా? గురువును కాదని వేరొకరి వద్ద ఏ శిష్యుడు వెడతాడు? అందువల్ల నాకు ఏ వరమూ వద్దు “ అన్నాడు దీపకుడు.
దానికి విష్ణువు ఎంతో సంతోషించి “ ఓ శిష్య శిఖామణీ నీవు ఎంతో ధన్యుడవు. నీ గురువు ఇంకా ఉత్తముడు. నేను వచ్చేను కాబట్టి నువ్వు ఏదయినా వరం కోరుకో ” అన్నాడు.
అప్పుడు దీపకుడు “ ఓ స్వామీ నువ్వు వరమీయాలి అనుకొంటే నాకు గురువు మీద మరింత భక్తి విశ్వాసం అధికమయ్యేట్లు వరమియ్యి. నా జన్మకదే పదివేలు ” అన్నాడు. దానికి విష్ణువు ఎంతో సంతోషించి దీపకుణ్ణి ఆశీర్వదించి అంతర్ధానమయిపోయేడు. దీపకుడు అక్కడ్నుంచి తన గురువును చేరేడు.
సర్వజ్ఞుడైన గురువు దీపకుణ్ణి ఇలా అడిగేడు. “ నీతో మహావిష్ణువు సంభాషించేడుకదా! నా మనస్సును దహించే విధంగా నువ్వు ఏం వరం కోరేవు ” అని. దానికి దీపకుడు “ స్వామీ! నేనేమీ కోరక పోయినా నాకు అచంచలమైన గురు భక్తిని ప్రసాదించేడు ” అని చెప్పేడు. దానికి వేదధర్ముడు చాలా సంతోషించేడు. “ దీపకా! నీవు కాశీలో చిరంజీవివై ఉంటావు. అష్ఠసిద్దులు నీ అధీనంలో ఉంటాయి. నవ నిధులు నీ ద్వారంలో నివశిస్తాయి. కాశీ విశ్వేశ్వరుడు నీ అధీనంలో ఉంటాడు.నిన్ను స్మరించినంత మాత్రాన మానవులు పుత్ర పౌత్రాదులతో సర్వ సంపదలతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నివసిస్తారు. ” అని ఆశీర్వదిస్తూ వేదధర్ముడు పాపరహితుడై దివ్య దేహుడై ప్రకాశిస్తూ దర్శనమిచ్చేడు. శిష్యుణ్ణి పరీక్షించడానికి గురువు అంతకాలం కుష్ఠురోగిగా, అంధుడిగా ఉన్నాడు తప్ప ఆ బ్రహ్మజ్ఞానికి పాపం ఎక్కడనుంచి వస్తుంది.
యోగి అచ్యుతులు విజయీంద్రులతో తపస్సు గురించి మాట్లాడుతూ మనస్సు యొక్క స్థితులను ఇలా వివరించారు:
తపస్సు ఫలించాలంటే ఎప్పుడూ ఉల్లాసంగానే ఉండాలి. మనస్సును ఎక్కడో జడంగా పడేస్తే కుదరదు. ఆ మనస్సు వికసించాలి. ఇంద్రియాల స్థాయిలోనే ఉంటే మనస్సు యొక్క స్వభావం తమస్సులో పడిపోవడం, రెండవది ఉద్రేకానికి లోనవడం జరుగుతుంది. ఈ రెండూ జరగకుండా చూచు కోవాలి. తపస్వులు నిరంతరం చాలా జాగ్రత్తగా ఉండాలి.మనస్సులో దేనిని చూసినా విసుక్కోకుండా ఉండాలి. ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడే మనస్సు యొక్క ఉన్నత స్థానం తెలుస్తుంది.
ఇంద్రియాల ద్వారా పనిచేసే మనస్సుకు సుకల్పం, వికల్పం, సంకల్పం అనే అవస్థలు ఉంటాయి. ఈ మూడు అవస్థలు అర్ధం అవ్వాలంటే మనలో సంయమనం సమత్వం బాగా పెరగాలి. భూత దయ ఉండాలి. ఎంతో అప్రమత్తత అవసరం.
మనస్సును అర్ధం చేసుకోవాలంటే ముందుగా వాయుతత్వాన్ని అర్ధం చేసుకోవాలి.
ఈ భూమి మీద ఋతువులను అనుసరించి గాలి వీస్తూ ఉంటుంది. కొంతకాలం హెచ్చుగాను, కొంతకాలం నెమ్మదిగాను, ఒక్కొక్క సారి పూర్తిగా నేలను తాకుతూ, తర్వాత కొంచెం ఎత్తులోను వీస్తూ ఉంటుంది. మళ్ళీ ఊర్ధ్వ ముఖంగా ఈశాన్య గాలులు, ఇంక బహిర్ముఖంగా నైరుతి గాలులు వీస్తాయి. అప్పుడు మంచు వానలతో కూడిన గాలి వీస్తూ వాతావరణాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. తద్వారా ఈ లోకం యొక్క స్థితి గతులు సరవుతూ ఉంటాయి.
ఇదే రకంగా మన శరీరంలో 49 ప్రదేశాలలో మరుత్తులనే పేరుతో వాయువు శరీర స్థితిని సరి చేస్తూ ఉంటుంది. మన ప్రాణాయామం (వాయుమధనం) సక్రమంగా నియమంగా రోజూ చేస్తూఉంటే కాలాను గుణంగా ఊర్ధ్వ ముఖంగా వాయు గమనం సాగుతుంది. రోజు రోజుకి వాయు గమనం ఉచ్ఛ స్థితికి పోతూంటే భూమి మీద ఏవిధంగా అయితే వర్షం మంచులు కురుస్తాయో అలాగే మన తలలోని దహరాకాశం నుంచి ( బ్రహ్మ రంధ్రం) కొని ద్రవాలు నోటిలోకి వర్షిస్తాయి. ఆ ద్రవాలనే సోమరసము, మధురసము, అమృతము అంటారు.
వీటిలో మొదటిగా స్రవించే రసాన్ని సోమరసం అంటారు. దీనిని త్రాగడం ద్వారా శరీరం శుద్ధి అవుతుంది. మనకు దాహం వేసినప్పుడు నీరు త్రాగితే ఎలాంటి తృప్తి కలుగుతుందో అలాగే సోమరస పానంతో శరీరం ఎంతో తృప్తిని ఆనందాన్ని పొందుతుంది. శరీరం శుద్ధి అవుతున్న కొద్దీ శ్రేష్ఠమైన రసాలు ఊరుతూ మనఃశుద్ధికి కూడా తోడ్పడతాయి.
ఈ ప్రాణాయామము లేదా వాయుమధన క్రియ లో ప్రాణానికి అశన ప్రాప్తి జరుగుతుంది. ప్రాణుడు బలిష్ఠుడవుతాడు. అప్పుడు మనస్సు ప్రాణుని వైపు ఆకర్షంప బడుతుంది. ప్రాణ మనో మిలనం జరిగి మన శరీరంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. వాయువు, వాయుమధనం సహాయంతో ప్రాణుడి నిజతత్వం తెలుస్తుంది. మనస్సు ఉచ్ఛస్థితి అంటే మానస అనే స్థితికి చేరుతుంది. ఇక్కడి వరకూ వాయువునాధారంగా చేసుకొని సాగిన ప్రాణాయామ క్రియ నుంచి విడివడి ప్రాణము మనస్సు కలిసి ఆత్మ సందర్శనార్ధం చేసే ప్రయాణాన్ని తపస్సు అంటారు. అంటే వాయువు ఆధారం ఇక్కడివరకే. అంటే నిజ తత్వం తెలియగానే వాయు తత్వాన్నుంచి ఆత్మసోధనకు ప్రయత్నించాలి.
న ప్రాణేన నపానేన మర్త్యో జీవతి కశ్చన
ఇతరేణతు జీవంతి అస్మినే తా ఉపాశ్రితౌ।।
అంటూ ఆత్మను తెలియడమే తత్వ జ్ఞానానికి మూలం అన్నారు.
అన్నింటిలోకి శాంతి యే ముఖ్యమైనది. అందుకే స్వామి గారు శాంతియే నా దైవం అన్నారు. మనకు శాంతి దొరకాలంటే తత్వమే ముఖ్యంగా తెలియాలి. తత్వం తెలుసుకోవాలంటే మానసిక నిష్ఠ ముఖ్యము. మనో నిష్ఠకు దేహారోగ్యం ముఖ్యం. అంటే స్థూల దేహం శుద్ధిచేయబడాలి. ప్రత్యక్ష సాధన లేకుండా తత్వం తెలియదు.
తత్వం అంటే మనం చదివిన లేదా విన్న కధలను తిరగ రాయడం లేదా మనకు తెలిసినదంతా, తెలుసుకున్నదంతా మాట్లాడటం కాదు.
కాయకల్పము ముక్తి సాధన అన్న పుస్తకంలో స్వామిగారు తత్వాన్ని ఇలా నిర్వచించేరు. ఈ భూగోళం రూపొందడానికి మూలకారణమైన శాశ్వతమైన చేతనం ఒకటి ఉంది. ఆ చేతనం నుండి వ్యాపించినదాన్నే, (సృష్ఠించ బడినదాన్నే) తత్వం అంటారు. ఆ చేతనత్వం గురించి తద్వారా వ్యాప్తి చెందిన ఈ విశ్వం గురించిన క్రమాన్నే (జ్ఞానాన్నే) తత్వ జ్ఞానం అంటారు. అంటే ఏ క్రమంలో ఏ పద్ధతిలో ఈ భూమి మీద సమస్తము ఉత్పన్నమవుతున్నాయి వాటి రచనా విధానం తెలియ చెప్పేదే తత్వజ్ఞానం.
అంతర్ముఖంగా తపించాలి. పూర్ణత్వాన్ని పొందాలి. ఈ ప్రపంచం యొక్క బాహ్య చక్రాన్ని సరిదిద్దడానికి అవసరమైన స్థూల కర్మలను చేసి మానవ జాతిని తపోమయ జీవనంలో నడపాలి. ఆ మహామార్గంలో మానవాళిని నడపడానికి పడే ఆతృతనే తత్వం అంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే. ఈ భూప్రపంచం లో మాత్రమే మోక్ష మార్గం ఉంది. తల్లి గర్భాన్ని ఛేదించుకొని ఈ ప్రపంచం లోకి ఎలా వచ్చేమో అలాగే ఈ ప్రపంచం నుండి బయట పడితే సస్వరూప జ్ఞానం కలుగుతుంది.
దీనిని తెలుసుకోవడానికి ఆహార నియమం ఒక్కటీ చాలదు. మనస్సును నిగ్రహించాలి కాని హఠం చేయ కూడదు. అచంచలమైన ఉన్నత స్థితి ఒకటి ఉంది అనే దృఢమైన విశ్వాసం ఉండాలి. దానిని సాధించడం భక్తి తో మాత్రమే సాధ్యం.
అందుకే సాధకుడనేవాడికి గురువు మీద తన సాధనా పద్ధతిమీద భక్తి, అచంచలమైన విశ్వాసం ఉండాలి. సర్వార్పణ బుద్ధి తో సాధన చేయాలి.
రెండవ భాగం
సాధన ప్రగతిలో వివిధ దశలు.
ఉపదేశం తీసుకున్నది మొదలు ముందుగా ప్రాణాయామంలో రెండు గతులు సక్రమంగా వస్తున్నాయా లేదా అనే విషయానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. రెండు గతులు గురు స్థానం నుంచి పైకి క్రిందకు సమాన పొడవులో జరుగుతున్నాయా లేదా అనేది సరి చూడాలి. ఈ రెండింటి కన్న సాధకుడు కౌపీనం సక్రమంగా ముడి వేసుకొని ధరిస్తున్నాడా లేదా అనేది చెక్ చేయాలి. ఆసనం లో కింద చుట్ట తగినంత ఎత్తులో ఉందో లేదో సరిచూడాలి. కుడికాలు మీద ఎడమ కాలు పెట్టి చేతివ్రేళ్ళతో ముద్ర సరిగ్గా పెడుతున్నాడా లేదా అనేది చెక్ చేయాలి. దృష్ఠి భ్రూమధ్యంలో కేంద్రీకరించేడా లేదా అనేది చూడాలి.
జపం చేసే ప్రదేశం ఎలా ఉండాలి అంటే:
సమే శుచౌ శర్కరావహ్ని వాలుకా
వివర్జితే శబ్దజలాశ్రయాదిభిః
మనోనుకూలే నత చక్షుపీడనే
గుహా నివాతాశ్రయణే ప్రయోజయేత్।।
శ్వేతాశ్వతర
నేల మిట్టపల్లాలు లేకుండా సమంగా ఉండాలి. దుమ్మూ, ఇసుక, గులకరాళ్ళు, తేమ, నిప్పూ లేకుండా ఉండాలి. గోడవలు, పెద్ద పెద్ద శబ్దాలు మొదలైన బాధ కలిగించేవి ఉండకూడదు. పరిసరాలు కంటికి ఆనందం కలిగించేవిగా ఉండాలి.ఏకాగ్రత కలిగించగల గుహలా ఉండాలి.
సుఖేనైవ భవేద్యస్మిన్న జస్రం బ్రహ్మచింతనమ్
ఆసనం తద్వజానీయాదన్య త్సుఖ వినాశనమ్.
తేజోబిందూ
ఏ ఆసనంలో కూర్చుంటే బ్రహ్మచింతనం అంటే ధ్యానం నిరాటంకంగా, సుఖంగా సాగుతుందో దానిని ఆసనం అంటారు. మిగిలినవన్నీ ఆ సుఖాన్ని చెడగొట్టేవే.
ప్రాణాయామ ప్రక్రియలో గురుస్థానాన్ని ఆధారంగా చేసుకొని వాయుమధనం ఏ విధంగా చేయాలి అంటే
యధైవోత్పల నాళేన తోయమాకర్షయేన్నరః
తధైవోత్కర్షయే ద్వాయుం యోగీయోగపదేస్థితః
ధ్యానబిందూ
మధ్యలో రంధ్రమున్న కలువకాడతో మానవుడు నీటిని ఎలా పైకి పీలుస్తాడో అలాగే శరీరమంతటా నిండి ఉన్న వాయువును ఆకర్షిస్తే ఆ సాధకుడు త్వరగా యోగపధంలో స్తిరపడతాడు.
పృథ్వ్యప్తేజో నిలఖే సముత్థితే
పంచాత్మకే యోగగుణ ప్రవృత్తే
నతస్య రోగో నజరా నమృత్యుః
ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం।।
శ్వేతాశ్వతర
భూమి జలం, అగ్ని, వాయువు, ఆకాశము అనే ఐదు తత్వాలతో తయారయిన శరీరం కాబట్టి అవి యోగాభ్యాసంలో శుద్ధి అవుతోంటే ఒక్కొక్క తత్వాన్నుంచి ఒక్కొక్క అనుభవం వస్తుంది. ఈ అయిదు శుద్ధి అయిన తర్వాత సాధకుని శరీరం యోగాగ్ని తో నిండిపోతుంది. అప్పుడతనిని ముసలితనము, అపమృత్యువు దరిచేరలేవు.
లఘుత్వ మారోగ్యమలోలుపత్వం
వర్ణప్రాసాదః స్వరసౌష్ఠవంచ।
గంధః శుభో మూత్రపురీష మల్పం
యోగప్రవృత్తిం ప్రధమాం వదంతి।।
శ్వేతాశ్వతర
శరీరం తేలికగా అవడం, మంచి ఆరోగ్యం, దేనిగురించి ఆతృత పడకుండా ఉండడం, శ్వచ్ఛమైన శరీర ఛాయ, శ్రావ్యమైన కంఠధ్వని, మిక్కిలి ఆహ్లాదకరమైన దేహ వాసన ఉంటూ మలమూత్రాల విసర్జన పూర్తిగాతగ్గిపోతుంది.
శృణుయా దక్షిణకర్ణే నాదమంతర్గతం సదా
శ్రూయతే ప్రథమాభ్యాసే నాదో నానావిధో మహాన్
వర్థమానస్తథాభ్యాసే శ్రూయతే సూక్ష్మసూక్ష్మతః।।
నాదబిందూ
యెల్లవేళలా కుడి చెవినుంచి అంతర్గతంగా ఉండేనాదాన్ని వింటూండాలి. యోగాభ్యాసం ప్రధమ దశలో లోపలినుంచి ప్రణవ నాదం వివిధరకాలయిన మహానాదం లా వినబడుతుంది. నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటే సూక్ష్మాతి సూక్ష్మమైన నాదం లా వినబడుతుంది.
యత్ర కుత్రాపి వానాదే లగతి ప్రథమం మనః
తత్ర తత్ర స్థిరీభూత్వా తేన సార్ధం విలీయతే।।
ఆరకరకాలైన నాదాలలో ఏదో ఒకదానిమీద మనస్సు లగ్నమవుతుంది. అక్కడే స్థిరపడి దానిలో మనస్సు లీనమైపోతుంది.
స శబ్దశ్చాక్షరే లీనో నిశ్శబ్దం పరమం పదమ్
సదా నాదాను సంధానా త్సంక్షీణా వాసనాతు యా
ఆ శబ్దం అక్షరబ్రహ్మలో లీనమైపోతుంది. అప్పుడు నిశ్శబ్దమే పరమపదమవుతుంది. నిరంతర నాదాను సంధానము వల్ల సమస్త వాసనలు క్షీణించిపోతాయి.
హ్రస్వో దహతి పాపాని దీర్ఘ స్సంపత్ ప్రదోవ్యయః
అర్ధమాత్రా సమాయుక్తః ప్రణవో మోక్షదాయకః
ధ్యానబిందూ
ప్రణవోపాసన అంటే ఉధ్గీథము తగినంత సమయం హ్రస్వ గతిలో చేస్తే జన్మ జన్మలలోని పాపాలు భస్మీపటలం అవుతాయి. దీర్ఘగతిలో చేసే ఉధ్గీథము ఆయురారోగ్య ఆశ్వర్యాలను కలుగ జేస్తుంది. మంచి ఆరోగ్యం ఐశ్వర్యాలను పొందాలంటే దీర్ఘగతి మంచిగా తగినంత సమయం చేయాలి. హిస్సింగ్ తో శబ్దం లేకుండా చాలా స్పీడ్ గా చేసే ఉధ్గీథం వల్ల మోక్షానికి దారి దొరకుతుంది.
దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్బ్రహ్మమయం జగత్
సాదృష్టిం పరమోదారా ననాసాగ్రావలోకిని।।
తేజోబిందూ
దృష్టిని జ్ఞానమయం చేసి జగత్తంతటినీ బ్రహ్మ మయంగా చూడడమనేది పరమ ఉత్కృష్టమైన పద్ధతి.
ద్రష్టృ దర్శన దృశ్యానాం విరామో యత్రవా భవేత్
దృష్టి స్తత్రైవ కర్తవ్యా న నసాగ్రావలోకినీ।।
ద్రష్ట- చూచేవాడు, దర్శనము-చూపు, దృశ్యము- బ్రహ్మము -ఈ మూడూ ఐక్యం అయే చోటు—
చూచేవాడు, దేనితో చూస్తున్నామో ఆ కంటి చూపు, దేనినయితే మనం చూస్తున్నామో ఆ బ్రహ్మ పదార్ధము ఈ మూడు ఐక్యమయిపోయి ఏ రకమైన వ్యాపారము లేకుండా ఉంటాయో అక్కడ దృష్టిని నిలపాలి. అంతేకాని ఊరికినే నాసాగ్రం లోని భ్రూమధ్యంలో దృష్టి నిలిపి కూర్చుంటే చాలదు.
అలా చూస్తున్నా కూడా మనస్సు నిలవటంలేదు, ఎక్కడెక్కడికో పోతోంది. అప్పుడు ఏం చేయాలి అంటే
యత్ర యత్ర మనోయాతి బ్రహ్మణ స్తత్రదర్శనాత్
మనసా ధారణం చైవ ధారణాసా పరా మతా।।
మనస్సు ఎక్కడెక్కడికి పోతోందో వాటన్నిటిమీద బ్రహ్మత్వాన్ని ఆపాదించుకొని వాటన్నిటినీ బ్రహ్మ వస్తువు లాగే చూడాలి. దానినే ధారణ అంటారు. అప్పుడు
బ్రహ్మైవాస్మీతి సద్వృత్త్యా నిరాలంబ తయా స్థితిః
ధ్యాన శబ్దేన విఖ్యాతః పరమానంద దాయకః।।
నేనే బ్రహ్మను అనే భావన తప్ప మనస్సులో మరో దృశ్యమే లేకుండా ఉంటుంది. దానినే ధ్యానం అంటారు. ఆ స్థితి పరమానందాన్ని ఇస్తుంది.
సమాధౌ క్రియమాణే తు విఘ్నా న్యాయంతి వై బలాత్।
ఈ విధంగా సమాధి స్థితికి చేరబోయే సమయంలో మనకు తెలియకుండానే ఎన్నో విఘ్నాలు వచ్చి మీద పడతాయి. అవి ఏమిటంటే
అనుసంధానరాహిత్య మాలస్యం భోగలాలసమ్।।
లయస్తమశ్చ విక్షేప స్తేజః స్వేదశ్చ శూన్యతా।।
ఒక విషయాన్ని దానికి సంబంధించిన మనకు తెలిసిన తమస్సు వ్యాపిస్తుంది.మరో విషయంతో కలిపి అర్ధం చేసుకోలేక పోవడం, చేసే ధ్యానం మీద అలసత్వం, ఆ ధ్యానం చేయడానికి బద్ధకం ఏర్పడపతుంది. భోగాలమీదకు మనస్సు పోతుంది. మనసులో ఉన్న ఉత్సాహం చెదిరి పోతుంది. ఒళ్ళంతా చెమటలు పడుతూంటుంది. మనస్సులో శూన్యత్వం ఏర్పడుతుంది.
ఏవగ్ంహి విఘ్నబాహుళ్యం త్యాజ్యం బ్రహ్మ విశారదైః ।।
ఈ సమయంలో సాధకులు తెలివిగా ఇవన్నీ ప్రకృతినుంచి ఏర్పడే విఘ్నాలుగా తెలుసుకొని వాటిని ప్రక్కకు నెట్టి సాధనలో సాగాలి.
ఇటువంటి సమయంలో సాధకులలో భావచైతన్యం వస్తే భావుకత ఏర్పడుతుంది. శూన్యత్వాన్ని తలిస్తే శూన్యత్వమే ఏర్పడి సాధన నిలిచిపోతుంది. అందుకని బ్రహ్మపదార్ధం మీదే మనస్సు ఉంచి సాధన సాగిస్తే పూర్ణత్వం కలిగి సమాధి స్థితి కలుగుతుంది.
బ్రహ్మత్వం అనేది శుద్ధమైన వస్తువు. మాటలకు కాని కంటికి కాని అందని వస్తువు.
అథ శుద్ధం భవే ద్వస్తు యద్వై వాచా మగోచరమ్
ఉదేతి శుద్ధచిత్తానాం వృత్తిజ్ఞానం తతః పరమ్।।
ఆ శుద్ధమైన బ్రహ్మత్వాన్ని దర్శించాలంటే పరిశుద్ధమైన చిత్తం ఉండడం ఎంతో అవసరం.
ఆహార నియమాలు:
కట్వామ్ల లవణత్యాగీ క్షీరపానరతస్సుఖీ
బ్రహ్మచారీ మితీహారీ యోగీయోగ పరాయణః
అబ్దాదూర్ధ్వం భవేత్సిద్ధో నాత్రకార్యా విచారణా।।
కారము, పులుపు, ఉప్పు వదిలి పాలు తాగుతూ సాధన చేసే సాధకుడు త్వరగా గమ్యాన్ని చేరగలుగుతాడు. బ్రహ్మచారీ, మితాహారీ అయిన యోగి యోగమార్గంలో సాగితే ఒక సంవత్సరం లోనే సిద్ధిని పొందుతాడు. దాన్లో ఏ సంశయం లేదు. తీవ్రముగా సాధనలో సాగదలిచిన సాధకులు ఆవాలు, చింతపండు, వేడి చేసే పదార్ధాలు, కారము, ఆకు కూరలు, ఇంగువ, వెల్లుల్లి తగ్గించాలి.
గోధూమ మద్గ శాల్యన్నం యోగ వృద్ధికం విదుః।
గోధుమలు, పెసలు, మంచి వరి అన్నము తినే సాధకునకు యోగసిద్ధి త్వరగా కలుగుతుంది.
ఈ సాధనలో అనుభవాలు అనేవి వారి వారి సాధనయొక్క తీవ్రతను బట్టి, పూర్వకర్మ సారముగా కలుగుతాయి. అలాగే వారి వారి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితుల ఉన్నతిని బట్టి కలుగుతాయి.
ఈ సాధనలో సామాన్యంగా అందరకీ కలిగే అనుభవాలు:
1. సాధన మొదలుపెట్టిన వెంటనేముందుగా లాలాజలం బాగా స్రవించి జీర్ణ శక్తి అధికం అవుతుంది.
2. సాధన తీవ్రతలో గతాగతి బాగా జరిపినప్పుడు విపరీతంగా చమటలు పట్టి శరీరమంతా, కూర్చున్న ఆసనం అన్నీ తడిసిపోతాయి.
3. శరీరంలో ఉండే వ్యాధులు నయమవుతాయి.
4. శరీరంలో ఉండే 72వేల నాడులు శుద్ధీకరించబడి శరీరం కాంతివంతం అవుతుంది.
5. సాధనలో అనేక రసాలు ఊరుతాయి. లాలారసం, సోమరసం, మధురసం మొదలైనవి.
6. అనేక వాసనలు- అంటే మల్లెల వాసన, శ్రీగంధం, ఇంకా అనేక దివ్య వాసనలు కలుగుతాయి.
7. అనేక మంగళ నాదాలు, సంగీత నాదాలు వినబడతాయి.
8. సాధనలో అనేక వర్ణకాంతులు, కాంతి పుంజాలు కనబడతాయి.
9. అప్పుడప్పుడు కొన్ని దివ్య వాక్యాలు, శ్లోకాలు, మంత్రాలు వినిపించవచ్చు.
10. అనేక ఋషులు, సిద్ధపురుషులు దివ్యపురుషుల దర్శనాలు కలగోచ్చు.
సశేషం
ఉదయభాస్కర్ దువ్వూరి