కర్మ

– శ్రీ ఉదయభాస్కర్ దువ్వూరి

Last updated: Jul 3rd 2019

భగవద్గీత రెండవ అధ్యాయం మూడు నాలుగు అధ్యాయాలలో కర్మను గురించిన వివరణ చూద్దాం.

నాల్గవ అధ్యాయంలో 16 శ్లోకంలో

కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్

కర్మ కిమ్, అకర్మ కిమ్, ఇతి అత్ర కవయః అపి మోహితాః-
కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? ఈ విషయాన్ని నిర్ణయించడంలో గొప్ప గొప్ప విధ్వాంసులు కూడా తికమక పడుతున్నారు. కనుక, కర్మ తత్వాన్ని నీకు చక్కగా విపులీకరిస్తాను.
తద్వారా నువ్వు అశుభకారకమైన ఆ కర్మ బంధం నుండి ముక్తుడువవుతావు.

ఆదిశంకరుల ఆత్మ బోధలో కర్మ అంటే దేహం, మనస్సు, బుద్ధి అనేవాటితో తాదాత్మ్యం చెందినప్పుడే కర్మలు చేయ బడతాయి అని నిర్వచించేరు.

ఉదాహరణకు మన ఇంద్రియాల పనులన్నీ కర్మలనే చెప్పాలి. కంటితో చూడడమనేది కర్మ అవుతుంది. చెవులతో వినడం అనేది కూడా కర్మే. అంటే మన శరీరంలోని ప్రతి ఇంద్రియం చేసేపని ఒక కర్మే. వీటిని కర్మ, అకర్మ, వికర్మ అని ఆ కర్మలను బట్టి చెప్పబడతాయి.

ఇంద్రియాలు పనిచేస్తున్నంత కాలం కర్మ చేయకుండా ఉండడమనేది సాధ్యమేకాదు. మరి కర్మ పరిత్యాగమనేది ఎలా జరుగుతుంది?

ఈ విషయాలమీద రేపట్నుంచి మనం చర్చిద్దాం.

!!——————————-!!

సాధకులు కొంచెం తెలివితో శ్రద్ధగా చదివి అర్ధం చేసుకోవలసిన విషయమీ కర్మ తత్వం. ఇది అర్ధమయితే కర్మ యొక్క కర్తృత్వ, భోక్తుత్వాలు అర్ధం అవుతాయి. రెండుమూడు సార్లు చదివి అర్ధం గ్రహించండి.

3వ అధ్యాయంలో 27 శ్లోకంలో

ప్రకృతేః క్ర్యమాణాని గుణైః కర్మాణి సర్వశః
అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే।।3.27

కర్మలన్నీ ప్రకృతి గుణాల ద్వారానే చేయబడుతున్నాయి అంటున్నాడు. అంటే ప్రకృతిలోంచి పుట్టిన సత్త్వ రజస్తమో గుణాలే బుద్ధి, అహంకారం, మనస్సు, అకాశాది పంచభూతాలు,శ్రోత్రాది దశేంద్రియాలు,శబ్దాది పంచ విషయాలు మొత్తం ఈ 23 తత్వాలు కర్మకారకాలుగా చెప్పబడ్డాయి.

అంతఃకరణము, ఇంద్రియాలు విషయాలను గ్రహిస్తూ ఉంటాయి. అంటే బుద్ధి విషయ విశ్లేషణకు, నిశ్చయానికి తోడ్పడుతుంది.మనస్సు మననం చేస్తే, చెవి శబ్దాన్ని, చర్మం స్పర్శను, కళ్ళు రూపాన్ని, నాలుక రుచిని, ముక్కు వాసనను గ్రహిస్తూంటాయి. వాక్కు మాటల్ని ఉచ్ఛరిస్తూంటే, చేతులు వస్తువులను పరిగ్రహిస్తాయి.కాళ్ళు శరీరాన్ని నడిపిస్తేగుదోపస్థలు మలమూత్ర విసర్జన చేస్తాయి. ఇవన్నీ కర్మలే. కాని మనం ఆత్మాభిమానం కలిగి ఈ కర్మలన్నీమనమే చేస్తున్నామనుకొని ఆ కర్మలతో సంబంధమేర్పరచుకొని మనమే చేస్తున్నామనే కర్తృత్వ భావాన్ని భావించడంవల్ల మనకు ఆ కర్మలతో బంధమేర్పడుతోంది. ఆ కర్మ ఫలాలను అనుభవించడానికై మనం మాటిమాటికీ జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడుతున్నాము.

కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణః
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః।। 4.17

కర్మ తత్వం తెలుసుకోవాలి. అలాగే అకర్మ, వికర్మ లక్షణాలు కూడా తెలుసుకోవడమనేది చాలా అవసరం. ఎందుకంటే కర్మ తత్వం చాలా నిగూఢమైనది.

శాస్త్ర విహిత కర్మాచరణమే కర్మ అంటే అది పూర్తి కర్మతత్వం అవదు.
మనోవాక్కాయములతో చేయబడే క్రియలను త్యజించడం అకర్మ అవదు. ఏకర్మా చేయకుండా ఊరికినే ఉండడం అకర్మ కాదు. అబద్ధము, కపటము, దోంగతనం, వ్యభిచారం, హింస అనే పాప కర్మలను వికర్మలంటారు అంటే అదికూడా వికర్మల యదార్ధ స్వరూపాన్ని చూపలేవు. శాస్త్రవర్జితమైనది, నిషిద్ధమైన కర్మలు మాత్రమే వికర్మ కాదు.

ఈ కర్మాచరణం లోగల భేదాలను బట్టి ఆ కర్మ స్వరూపమే మారిపోతుంది. మనిషిని బట్టి, కర్మను బట్టి, కర్తవ్యాన్ని బట్టి, లక్షణాలను బట్టి కర్మ యొక్క తత్వం మారిపోతుంది.

ఇవి కాక త్రివిధ కర్మల గురించి శంకరాచార్యుల తత్వ బోధలో

కర్మాణి కతివిధాని సంతీతి చేత్
ఆగామిసంచితప్రారబ్ధభేదేన త్రివిధాని సంతి

అంటూ కర్మలు మూడు విధాలు- ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు గా పేర్కొన్నారు.

వీటిని గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాం.

!!——————————-!!

కర్మా చరణం లో ఇంద్రియాలకే ప్రాధాన్యత ఎక్కువ. మనషష్ఠా నింద్రియాణి అంటూ మనస్సును ఆరో ఇంద్రియంగా చెప్పేరు. పంచ ప్రాణాలను కూడా ఇంద్రియాలుగానే వర్ణించేరు. ఈ విధంగా ఇంద్రియ శబ్దంలో 23 తత్వాలను చేర్చేసేరు.

తత్వబోధలో త్రివిధ కర్మలు ఆగామి, సంచిత, ప్రారబ్ధకర్మల గురించిన వివరణ ఇలా ఉంది.

1. ఆగామి కర్మలు:

మనం చేసే ప్రతి కర్మ ఆగామి కర్మ కిందే వస్తుంది. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. ( ఆకలి అనే కర్మకు ఫలితం తినగానే ఆకలి తీరుతుంది- ఇది ఫలితం).మరి కొన్ని తరవాత కాలంలోను, ఇంకొన్ని తరువాత జన్మలోను ఫలితాలనిస్తాయి. కొన్ని కొన్ని కర్మలు ఏ ఫలితాలను ఇవ్వక పోవచ్చు.

మనంచేసే కొన్ని కర్మలు, పాపకార్యాలు పుణ్యకార్యాలు, దాన ధర్మాలు అనేవాటికి ఎప్పుడో ఫలితాలు ఇవ్వడానికి కూడబెట్టబడి అంటే సంచితం చేయబడి ఉంటాయి. ఈ రకంగా మనం ఈ జన్మలో చేసే కర్మలన్నిటినీ ఆగామి కర్మలుగానే పిలుస్తాము.

2. సంచిత కర్మలు:

సంచితం కర్మ కిమ్
అనంతకోటిజన్మనాం బీజభూతం సన్
యత్కర్మజాతం పూర్వార్జితం తిష్ఠతి
తత్ సంచితం జ్ఞేయమ్।।
తత్వ బోధ

ప్రతి జన్మలోనూ వ్యక్తి ప్రోగు చేసుకున్న కర్మలు సంచిత కర్మలు. అప్పుడప్పుడు చేసినపుణ్య కర్మల ఫలితంగా రాబోయే జన్మలలో సుఖ శాంతులు, నిషిద్ధ కర్మల వల్ల హీన జన్మలు దుఃఖాలు ప్రాప్తిస్తాయి.

మనం వివిధ జన్మలలో చేసిన కర్మల ఫలితాలను ఆ యా జన్మలలో అనుభవించడానికి అవక, సంచితమయి మనతో ఒక జన్మ నుంచి మరొక జన్మకు తీసుకొని పోతాము. జీవుడు శరీరాన్ని వదలినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదలకుండా అతనితో పాటు వస్తూంటాయి.

3.ప్రారబ్ధ కర్మలు:

ప్రారబ్ధం కర్మ కిమితి చేత్
ఇదం శరీరముత్పద్య ఇహ లోకే ఏవ
సుఖదుఃఖాదిప్రదం యత్కర్మ తత్ప్రారబ్ధం
భోగేన నష్టం భవతి
ప్రారబ్ధ కర్మాణాం భోగదేవ క్షయఇతి।।
తత్వబోధ

ప్ర+ ఆరబ్ధకర్మ- సంచితకర్మలలో తను ఈ జన్మలో అనిభవించవలసిన కర్మల సమాహారమే ఈ జన్మ అవుతుంది. గత జన్మలోని కర్మ సంచితమై ఆ జన్మలో అనుభవయోగ్యంకాక మిగిలినదే ప్రస్తుత జన్మకు ప్రారబ్ధకర్మగా మారుతోంది.

సంచిత కర్మల రూపంలో మనను అంటివచ్చే కర్మలలో పక్వానికి వచ్చిన కర్మలు ఈ జన్మలో ఫలితాలనిస్తాయి.అంటే ప్రారబ్ధ కర్మలు అనుభవించడానికి తగిన శరీరం దొరకగానే ఆ జన్మలో ఆయా ప్రారబ్ద కర్మలను అనుభవిస్తారు. ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి తగిన శరీరం, తల్లి గర్భాన్ని ఎంచుకొని ఆ గర్భం లో ప్రవేశిస్తారు. ఆ ప్రారబ్ధకర్మ ఎంతటిదైనా అనుభవించక తప్పదు.

ఒక్కొక్క సారి ఈ ప్రారబ్ద కర్మను తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ మరికొన్ని కొత్త కర్మలు చేసి జనన మరణ వలయంలో తిరుగుతూనే ఉంటారు.

ఈ జన్మల పరంపరలు కొనసాగడానికి కారణం అహంకారమనే చెప్పాలి. ఇంద్రియాల వల్ల జరిగే కర్మలకు కర్తృత్వాన్ని మనమీద ఆపాదించు కుంటున్నాము. అహంకారం నుంచి అజ్ఞానం, దానినుంచి నేను నాది అనే అభిమానం ఏర్పడతాయి. అభిమానం నుంచి కామ క్రోధమోహాలు అర్పడతాయి. వాటినుంచి ప్రతికర్మలు, వాటినుంచి పునర్జన్మలు వస్తాయి.

అందువల్ల ప్రారబ్ధ కర్మలను చిత్త సుద్ధితో అనుభవిస్తూ పోతే జన్మ పరంపర ఆగుతుంది.

మరి జ్ఞానులకు కర్మ బంధాలు లేవని వారు ఆసక్తి రహితంగా కర్మలు ఆచరించి పరమసిద్ధిని పొందేరని చెబుతారుకదా!’

కర్మణైవ హి సంసిద్ధిమ్ ఆస్థితా జనకాదయః
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి।।
భ.గీ.3.20

జనకుడు మొదలైన జ్ఞానులు అంటే జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు మొదలయిన జ్ఞాను లంతా మమతాసక్తులు, కోరికలు వదిలి కేవలం పరమాత్మ ప్రాప్తికై కర్మలను( వీటినే జ్ఞానోత్తర కర్మలు అంటారు) ఆచరించి పరమసిద్ధిని పొందేరు. కాబట్టి లోకహితాన్ని కోరి కర్మలు చేయడమే సముచితము.

అప్పుడు ఈ బ్రహ్మజ్ఞానులు చేసిన ఆసక్తిరహిత కర్మల ద్వారా వచ్చిన పాప పుణ్యాలు ఏమవుతాయి? బ్రహ్మజ్ఞాని మోక్షం పొందాలంటే అతని పాపపుణ్యాలు పూర్తిగా లేకుండా అయిపోవాలి కదా! ఎలాగటంటే బ్రహ్మజ్ఞానికి ఆగామి కర్మ ఒక్కటే ఉంటుంది. అది బ్రహ్మజ్ఞానాన్నినపొందిన తర్వాత తను చేసిన కర్మలు మాత్రమే.

ఆత్మజ్ఞాని యొక్క కర్మల ఫలితం అతను తీసుకోకపోతే ఆ కర్మఫలితాలను ఎవరు పంచుకుంటారు అంటే

తత్వబోధలో:

కించ యే జ్ఞానినం స్తువంతి, భజంతి, అర్చయంతి, తాన్ప్రతి జాఞానికృతం ఆగామిపుణ్యం గచ్ఛతి।।

బ్రహ్మవేత్తను గౌరవించి మన్నించి సేవ చేసేవాళ్ళు ఆ జ్ఞాని చేసిన పుణ్యమంతా పంచుకుంటారు.

యే జ్ఞానినం నిందంతి, ద్విషంతి, దుఃఖ ప్రధానం కుర్వంతి తాన్ప్రతి జ్ఞానికృతం సర్వమాగామి క్రియమాణం యదవాచ్యం కర్మ పాపాత్మకం తద్గచ్చతి.

ఎవరు అతని పట్ల అగౌరవంగా ప్రవర్తించి ద్వేషించి కించపరచి దుఃఖాన్ని కలిగిస్తారో వారంతా ఆయన చేసిన దుష్కృతాల యొక్క ఫలితాలను పంచికుంటారు.

అంటే

సుహృదః పుణ్యకృత్యం
దుర్హృదః పాపకృత్యం గృహ్ణంతి।।

ఆత్మజ్ఞాని చేసిన పుణ్య కర్మలు పుణ్యాత్ములకు సజ్జనులకు సుహృదయులకు చెందితే; దుష్టులు, అసూయాపరులు, అతనిని ద్వేషించిన వాళ్ళు ఆత్మజ్ఞాని చేసిన పాపకార్యాల ఫలితాన్ని పంచుకుంటారు.

అందుకే గురువు దయకు పాత్రులు కండి. గురువుమీద అపారమైన విశ్వాసాన్ని ఉంచి, గురువును సేవించి గురువు యొక్క కృప, కరుణా దృష్టి మీమీద పడేటట్లు చూసుకోండి,

!!——————————-!!

కర్మ యొక్క నిజ తత్వం తెలియాలంటే త్రిగుణాలు, అంతః కరణాల గురించి వివరణగా తెలిసుకోవాలి.

ఎందుకంటే 3వ అధ్యాయం లో 27 వ శ్లోకంలోను 14వ అధ్యాయం 19వ శ్లోకం లోను కర్మలన్నీ త్రిగుణాలవల్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు.

సత్వ రజస్తమో గుణాలుప్రకృతి యొక్క కార్యాలయితే ఇంద్రియాలు మనస్సు బుద్ధి, ఇంద్రియ విషయాలు గుణముల యొక్క విస్తృతరూపాలే. దీనినుంచి గుణముల ద్వారా సమస్త కర్మలు జరుగుతున్నాయని, కర్మలన్నీ ప్రకృతి ద్వారా జరుగుతున్నాయని తెలుసుకోవాలి.
అందుచేత 14వ అధ్యాయం గుణత్రయవిభాగ యోగం చదువుకుంటే కర్మ తత్వం మరింత వివరంగా తెలుస్తుంది.

సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్।14.05

సత్వమ్ రజః తమః ఇతి ప్రకృతి సంభవాః గుణాః-
సత్వ రజో తమస్సు లనే మూడుగుణాలు ప్రకృతినుంచి ఉత్పన్నమయ్యాయి. అంటే ఈ ప్రకృతిలోని సమస్త జడ పదార్ధాలు ఈ మూడు గుణాలనుంచే పుట్టాయని అర్ధం.

అవ్యయమ్ దేహినమ్ దేహే నిబధ్నంతి- ఈ మూడు గుణాలనుంచి పుట్టే అజ్ఞానం ( సుఖదుఃఖాలు, పాప పుణ్యాలు మొదలైనవి) వల్ల జీవాత్మను ఈ దేహంలో బంధిస్తున్నాయి.

ప్రధమంగా సత్వగుణం:
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్
సుఖసంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ।।

తత్ర సత్త్వమ్ నిర్మలత్వాత్ ప్రకాశకమ్ అనామయమ్- పైన చెప్పిన మూడు గుణాలలో సత్త్వగుణం చాలా నిర్మల మైనది. ప్రకాశాన్ని ఇచ్చేది. అంతేకాకుండా వికారరహితమైనది కూడాను. సత్వ గుణం వల్ల అంతఃకరణం లోను, ఇంద్రియాలలోను ఒకరకమైన ప్రకాశం ఏర్పడు తుంది. దుఃఖాలు, దుర్గుణాలు, దురాచారాలు నశించి శాంతి లభిస్తుంది. మనిషిలో చేతనత్వం పెరుగుతుంది.

సుఖసంగేన చ జ్ఞాన సంగేన బధ్నాతి- సత్వగుణం వల్ల మంచి సాత్విక సుఖాన్ని జ్ఞానాన్ని పొందుతాడు. సుఖము, జ్ఞానముల మీద ఉండే అభిమానం వల్ల జీవుడు ఈ శరీరం లో బంధింప బడతాడు. ఈ సాత్విక సుఖం మూడు విధాలుగా ఉందిట.

సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ
అభ్యసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి।।18.36

ఇదానీమ్ త్రివిధమ్ సుఖమ్ తు మే శృణు-
ఇప్పుడు మూడు విధాలయిన సుఖాల గురించి చెబుతాను విను.

యత్ర అభ్యాసాత్ రమతే చ- భజనలు, ప్రార్ధనలు, ధ్యానాల యొక్క సాధనల వల్ల ఆనందాన్ని పొందుతాడో

దుఃఖాంతమ్ నిగచ్చతి- ఏ సుఖం నుంచి సమస్త దుఃఖాలను అతిక్రమించి సుఖాన్ని పొందుతాడో దానిని సాత్విక సుఖం అంటారు. ఇహ పరలోక భోగాల వల్ల వచ్చే సుఖాలను తృణీకరించి పరమాత్మ చింతన లోనే నిమగ్న మైనప్పుడు ఈ సాత్విక సుఖం కలుగుతుంది. అంటే సాధన ద్వారానే ఈ స్థితిని చేర గలుగుతాడు.

యత్రదగ్రే విషమివ పరిణామే మృతోపమమ్
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధి ప్రసాదజమ్।। 18.37

యత్ అగ్రే విషమ్ ఇవ పరిణామే తత్ అమృతోపమమ్- సాత్విక సుఖం సాధించడానికి చేసే సాధనలలో వైరాగ్య శమ దమాది షడ్గుణ సంపత్తిని పొందేటందుకు చేసే ప్రయత్నం ప్రారంభంలో విషమంగాను విషతుల్యంగాను అనుపించినా చివరకు సాత్విక సుఖప్రాప్తి వల్ల అమృత తుల్యంగా కనపడుతుంది.

అతః ఆత్మబుద్ధి ప్రసాదజమ్ -అది పొందిన తర్వాత ఎల్లప్పుడూ పరమాత్మకు సంబంధించిన విషయాలలోన్ నిమగ్నమవుతాడు. అదే సాత్విక సుఖం.

తత్ సుఖం సాత్వికమ్ ప్రోక్తమ్-అలాటి సుఖాన్ని సాత్విక సుఖంగా చెబుతారు.

!!——————————-!!

14వ అధ్యాయం 9 వ శ్లోకంలో “సత్వం సుఖే సంజయతి” అంటూ సత్త్వ గుణం జీవుణ్ణి సుఖాలలో నిమగ్నమయ్యేట్లు చేస్తుంది అని చెబుతున్నాడు.

సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత।। భగీ.14.11

యదా అస్మిన్ దేహే సర్వ ద్వారేషు ప్రకాశః జ్ఞానమ్ ఉపజాయతే- ఏ సమయంలో అయితే ఈ దేహం లోను, అంతఃకరణాలు మరియు ఇంద్రియాలలో ప్రకాశం అంటే చైతన్యం, దానితోపాటు వివేక శక్తి ఏర్పడుతుందో

తదా సత్వమ్ ఉత వివృద్ధమ్ ఇతి విద్యాత్- అప్పుడు సత్వగుణం వృద్ధి చెందిందని
తెలుసుకోవాలి.

శరీరంలో చైతన్యం ఏర్పడి శరీరం బాగా తేలిక అయిపోతుంది. ఇంద్రియాలు అంతఃకరణాలు లో నిర్మలత్వం ఏర్పడుతుంది.

సత్యాసత్యములు, కర్తవ్యాకర్తవ్యములు నిర్ణయించ గలిగే వివేక శక్తి జాగృతమవుతుంది.
ప్రకాశము జ్ఞానము కలిగిన తర్వాత సహజ సిద్ధమైన వైరాగ్యం ఏర్పడుతుంది.
దీనిని బట్టి సత్వగుణం వృద్ధి చెందిందని తెలుసుకోవాలి.

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే।।
భగీ.14.14

పైన చెప్పిన విధంగా సత్వగుణం పెరుగు తున్నప్పుడు ఆ సాధకునికి మృత్యువు ప్రాప్తిస్తే,
ఆచరించడం ద్వారా అతను ఉత్తమకర్మలు ఆచరించేవాళ్ళు వెళ్ళే నిర్మలమైన స్వర్గాది దివ్యలోకాలను పొందుతాడు.

భగీ.14.16- కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలం- శ్రేష్ఠమైన కర్మలను ( నిష్కామ భావంతో చేసే శాస్త్ర విహిత కర్మలు) ఆచరించడం వల్ల సాత్త్విక ఫలాలయిన సుఖం, జ్ఞానం, వైరాగ్యం మొదలైన నిర్మలఫలాలు దొరుకుతాయి.

భగీ.14.17- సత్త్వాత్ సంజాయతే జ్ఞానమ్- సత్వ గుణం నుండి జ్ఞానం ( ప్రకాశం, సుఖం, శాంతి
మొదలైనవి) ఉత్పన్నమవుతుంది.

భగీ.14.18- ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా- సత్వగుణ ప్రధానులు స్వర్గాది ఊర్ధ్వ లోకాలకు పోతారు.

ఈ సాత్విక గుణాన్ని తత్త్వపరిశీలన అనే అచ్యుతాశ్రమ పుస్తకంలో మన ఆశ్రమ ప్రధాన గురువులు శ్రీ శ్రీ స్వామి సీతారామ్ ఈ క్రింది విధంగా చెప్పేరు.

సాత్విక గుణమనేది ముఖ్యంగా జ్ఞానప్రదమైనది.

సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విధ్ధి సాత్త్వికమ్।।
భగీ.18.20

యేన విభక్తేషు సర్వభూతేషు ఏకమ్ అవ్యయం అవిభక్తమ్ భావమ్ ఈక్షతే తద్ జ్ఞానం సాత్త్వి-
ఎవరయితేవేరువేరుగా ఉండే సమస్త ప్రాణులలోను ఒక్కడే అయిన, శాశ్వతుడైన పరమాత్మయే అవిభక్తం అని ( విభాగరహితుడు లేదా అఖండ సమభావ స్థితుడు అని) భావిస్తూ చూస్తాడో అతను జ్ఞాని అనబడతాడు.

తత్ జ్ఞానమ్ సాత్వికమ్ విద్ధి-ఆతని జ్ఞానాన్ని సాత్త్విక జ్ఞానం అంటారు. దీనినే కఠోపనిషత్తులో

ఏకోవశీ సర్వభూతాంతరాత్మా
ఏకం రూపం బహుదా కరోతి
తమాత్మస్థం యేను పశ్యంతి ధీరాః
తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం।।

సమస్త జీవుల అంతరాత్మలో ఉండే ఒకటే అయినమూలచేతనము ఈ సృష్ఠిలోని సమస్తాన్ని తన అధీనంలో ఉంచుకొని బహు రూపాలలో కనపడుతోంది. ఎవరయితే తమ ఆత్మయందు
స్థిర చిత్తులై దీనిని తెలుసుకుంటారో అటువంటి ధీరులకు శాశ్వతమైన సుఖం లభిస్తుంది. అని చెప్పేరు.

నియతం సంగరహితమ్ అరాగద్వేషతః కృతమ్ అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్వికముచ్యతే।।
భగీ.18.23

శాస్త్ర విహితము, కర్తృత్వాభిమానం లేనిది, ఫలాపేక్ష రహితము, నిస్సంగము, రాగద్వేష
రహితమైన కర్మ సాత్విక కర్మ అనబడుతుంది.
సాత్త్విక కర్మలు ఎల్లప్పుడూ స్థిరమైన ఆనందాన్ని కలిగిస్తాయి.

ముక్తసంగోనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్యసిద్ధోర్నిర్వికారః కర్తా సాత్త్విక ముచ్యతే।। భగీ.18.26

ఆసక్తిని త్యజించినవాడు, అహంకార రహితంగా మాట్లాడేవాడు, సిద్ధి అసిద్ధులయెడల, హర్ష శోకాది వికారాలకు లోనుకాకుండా ఉండేవాడు, ధైర్యం ఉత్సాహం ఉండి జయాపజయాలమీద ఆసక్తి లేకుండా ఉండే వాడిని సాత్త్విక కర్త అంటారు.

ఈ సత్వ గుణం వల్ల హృదయం ప్రశాంతంగా ఉంటుంది. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం, కర్తవ్యం, అకర్తవ్యం, భయం, అభయం, బంధము మోక్షాలను తెలుసుకో గలిగిన బుద్ధిని సాత్త్విక బుద్ధి అంటారు.

ఈ గుణం కలవారు మంచి విచక్షణా జ్ఞానం, సంస్కారం, ఆధ్యాత్మ సాధనలో మంచి అవగాహన, దేనికీ చలించని స్వభావం, నిగ్రహశక్తి కలిగి ఉంటారు.

అంటే ఆత్మ నిగ్రహము, ఆత్మ శిక్షణ వల్ల కలిగే సుఖాన్ని సాత్త్విక సుఖం అంటారు.

భగీ.17.4- యజంతే సాత్వికా దేవాన్ – సాత్త్వికులు దేవతలను పూజిస్తారు.

వచ్చే భాగంలో సాత్వికులు తినే ఆహార పదార్ధాల గురించి చదువుకుందాం

!!——————————-!!

వారి వారి స్వభావాలను అనుసరించి వారు తినే ఆహారపదార్ధాలుకూడా మూడు విధాలుగా ఉంటాయి. అంటూ 17వ అధ్యాయంలో 7వ శ్లోకం:

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు।।

వారి వారి గుణములననుసరించి, వాళ్ళకు ఇష్టమైన ఆహారాలు కూడా మూడు విధాలుగా ఉంటాయి. అలాగే ఆయా మనుషులు చేసే పనులు అంటే యజ్ఞాలు, తపస్సులు, దానాలు కూడా మూడు విధాలుగా ఉంటాయి.

ఆయుః సత్త్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః
రస్యాః స్నిగ్థాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్విక ప్రియాః।। 17.8

సాత్త్విక ప్రియాః ఆహారాః ఆయుస్సత్త్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః-

సాత్త్విక గుణం కలవారికి ప్రియమైన ఆహార పదార్ధాలంటే ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యం, సుఖము, ప్రీతి మొదలైనవాటిని అభివృద్ధి పరిచే ఆహార పదార్ధాలు. అవి రస్యాః- పాలు, చక్కెర, మొదలైన రసయుక్తము లైన పదార్ధాలు రస్యములనబడతాయి.

స్నిగ్ధాః- వెన్న, నేయి, మొదలైన సాత్త్విక పదార్ధాల నుండి తీయబడిన నూనె లాంటి స్నేహయుక్త వదార్ధాలను స్నిగ్ధములంటారు.

స్థిరాః- తిన్న తర్వాత ఎక్కువ కాలము వరకూ శరీరంలో శక్తినిచ్చే సారం కల పదార్ధాలు- ఇవి ఓజస్సును అభివృద్ధి చేస్తాయి.

హృద్యాః- కుళ్ళిపోనివి, అపవిత్రం కానివి, పరిశుద్ధంగా ఉన్నవిచూచినంత మాత్రమే సాత్వికాభిరుచులు కలగజేసే పదార్ధాలను హృద్యములు అంటారు.

ఆహారాః- భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములనే నాలుగు విధాలైనఆహార పదార్ధాలు భుజించడానికి యోగ్యమైనవి.

దంతములతో నమిలి తినే అన్నము, రొట్టె మొదలానవి భక్ష్యములు.

నమలకుండానే డైరెక్టుగా తినే పాలు పెరుగుమొదలైన ద్రవ పదార్ధాలు భోజ్యాలు.

నాలుకతో నాకుతూ ఆస్వాదిస్తూ తినే తేనె, పచ్చళ్ళు మొదలైనవి లేహ్యాలు.

నోటితో పీలుస్తూ తినే చెరకు, పళ్ళు మొదలైన వాటిని చోష్యములు అంటారు.

అలాగే మనుష్యులు చేసే యజ్ఞము(కర్మ), తపస్సు, దానం కూడా గుణాలను బట్టి మూడు విధాలుగా ఉంటాయి.

ఇక్కడ యజ్ఞం అనేదానిని కామ్య కర్మ, నిష్కామ కర్మలుగా చెప్పుకోవచ్చు. 15 వ అధ్యాయం లో 11 శ్లోకంలో శాస్త్ర విహిత కర్మలు, ప్రతిఫలాపేక్ష లేకుండాచేసే కర్మలన్నిటినీవసాత్విక కర్మలంటారు.

తపస్సు అనేది శారీరిక, వాచిక, మానసిక తపస్సులని మూడు విధాలు.

శారీరిక తపస్సు:

దేవద్విజగురు ప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే।।
17.14

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం; శౌచము (పవిత్రత), ఆర్జవమ్ ( మనోవాక్కాయములలో సరళత్వాన్ని కలిగి ఉండడం), బ్రహ్మచర్యం, అహింస అనేవి శారీరక తపస్సులనబడతాయి.

వాచిక తపస్సు:

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయమ్ తప ఉచ్యతే।। 17.15

ఉద్వేగాన్ని కలిగించనిది, ప్రియమైనది, హితమును కూర్చేది,యదార్ధమైన భాషణము, అలాగే వేదశాస్త్ర పఠనముతో ఆ పరమేశ్వరుని నామజప సాధనలన్నీ వాచిక తపస్సులవుతాయి.
ఇవి అన్నీ వాగ్దోషాన్ని నసింపజేసి అంతఃకరణాన్ని, వాక్కును పవిత్రం చేస్తాయి.

మానసిక తపస్సు:

మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే।। 17.16

మనః ప్రసన్నత, శాంత స్వభావం, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలైనవ్న్నీ మానసిక తపస్సులవుతాయి.

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః అఫలాకాంక్షి భిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే।।
17.17

పైన చెప్పిన శారీరిక, వాచిక, మానసికతపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సులంటారు.

దానం:

దాతవ్యమితి యద్దానం దీయతే నుపకారిణే
దేశే కాలే చ పాత్రేచ తద్దానం సాత్త్వికం స్మృతమ్।। 17.20

దానం చేయడమే కర్తవ్యం అనే భావంతో తగిన ప్రదేశాలలోను, దుర్భిక్ష కాలాలలోను చేసే దానము; ఆకలిదప్పులతో బాధపడే వారికి, అంగవైకల్యం కలవారికి, రోగులకు, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలైన పాత్రులకు ప్రత్యుపకారం ఆసించక నిస్వార్ధభవం తో చేసే దానాన్ని సాత్త్విక దానం అంటారు.
అందుచేత సత్వగుణపూర్ణత్వం లో నిష్కామ భావం యొక్క ప్రాముఖ్యతను వివరించేరు.

వచ్చే భాగంలో రాజస గుణం గురించి చదువుకుందాం

!!——————————-!!

రజోగుణం:

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినమ్।। భగీ14.07

రాగాత్మకమ్ రజః తృష్ణాసంగ సముద్భవమ్ విద్ధి-
రాగాత్మకమైన రజోగుణం, కామము, ఆసక్తి లనుంచి ఉత్పన్నమైనదని తెలియాలి.

తత్ దేహినమ్ కర్మసంగేన నిబధ్నాతి- ఆ రజోగుణం జీవాత్మను కర్మలు, వాటినుంచి వచ్చే ఫలాల యొక్క సాంగత్యంతో కలిపి బంధిస్తాయి.

కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్।।
భగీ 3.37

రజోగుణ సముద్భవః ఏషః కామః క్రోధః – రజో గుణం నుంచి ఉద్భవించినదే కామము. ఇదే క్రోధం యొక్క రూపాన్ని దాలుస్తుంది.

ఏషః మహాశనః మహాపాప్మా- కామమనేది అంతము లేనిది. భోగానుభవాలతో తీరేదికాదు. ఇది మిక్కిలి పాపిష్ఠిది. అంతులేని పాప కర్మాచరణానికి కామమే ప్రేరణ శక్తి.

ఇహ ఏనమ్ వైరిణమ్ విద్ధి- ఈ విషయం లో కామమును పరమ శత్రువు గా తెలుసుకోవాలి.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే।। భగీ2.62

విషయాన్ ధ్యాయతః పుంసః తేషు సంగః ఉపజాయతే- శబ్దాది విషయాలను గురించి ఆలోచించే వ్యక్తికి ఆ శబ్దాది విషయాలలో ఆసక్తి ఏర్పడుతుంది.

సంగాత్ కామః సంజాయతే- ఆ ఆసక్తి వల్ల కోరిక లేదా కామము(విషయవాంఛ) కలుగుతుంది.

కామాత్ క్రోధః అభిజాయతే-ఆ కోరిక వల్ల ( ఆ కోరిక తీరనప్పుడు ) కోపము ఉత్పన్నమవుతుంది.

ఆ క్రోధం నుంచి వ్యామోహం, వ్యామోహం వల్ల స్మృతి భ్రంశం దానినుంచి జ్ఞాపక శక్తి నశిస్తుంది. తద్వారా మనుష్యుని పతనం ఏర్పడుతుంది.

లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ।।
భగీ14.12

రజోగుణం ఎక్కువ అయినప్పుడు లోభము, ప్రాపంచక విషయాలమీద ఆసక్తి, స్వార్ధ బుద్ధితో సకామ భావంతో కర్మాచరణం, అశాంతి, విషయ భోగలాలస అనేవి కలుగుతాయి.

రజసి ప్రలయం గత్వా కర్మ సంగిషు జాయతే -భగీ14.15

రజోగుణం వృద్ధి చెందినప్పుడు చనిపోయిన వాడు కర్మలమీద ఆసక్తి కలిగిన మానవులలోనే తిరిగి జన్మిస్తాడు.

భగీ14.16- రజసస్తు ఫలం దుఃఖమ్- రాజస కర్మలకు ఫలితం దుఃఖము.
భగీ14.17- రజసో లోభ ఏవచ- రజోగుణం వల్ల లోభం పెరుగుతుంది.
భగీ17.18- మధ్యే తిష్ఠంతి రాజసాః- రజోగుణం కలిగిన పురుషులు మానవ లోకంలోనే తిరిగి తిరిగి పుడుతూంటారు.

యత్తు కామేప్సునా కర్మసాహంకారేణ వాపునః
క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్
భగీ18.24

భోగలాలసుడైన పురుషునిచేత లేదా అహంకారి యైన మనుష్యుని చేతను మిక్కిలి శ్రమతో చేయబడిన కర్మను రాజస కర్మ అంటారు. కోరికలతో నిండి అహంకారంతో కూడి శ్రమ కలిగేటట్లు చేసే కర్మ రాజస కర్మ అనబడుతుంది.

రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః।। భగీ18.27

కర్మఫలాపేక్ష ఉన్నవాడు, మోహావేశుడు, హింసాప్రవృత్తి కలవాడు, శౌచం లేనివాడు,( అపవిత్ర ప్రవర్తన కలవాడు),హర్షశోకాలతో నిండిఉండేవాడిని రాజస కర్త అంటారు.

రాజసగుణం కలవారికి క్రోధం,ఆవేశం, భోగలాలసత్వం, ధనాపేక్ష అధికంగా ఉంటాయి.

వీరికి కీర్తి కాంక్ష చాలా అధికంగా ఉంటుంది. మిక్కలి ధైర్యవంతులై ఉంటారు. అధికార ఆధిపత్యానికై ఆరాట పడుతూంటారు. ధనార్జనకు ప్రాముఖ్యతనిస్తారు.

యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ
అయథావత్ ప్రజానాతి బద్ధిః సా పార్ధ రాజసీ।। భగీ18.31

ధర్మాన్ని, అధర్మాన్ని; కార్యాన్ని, అకార్యాన్ని (కర్తవ్యాకర్తవ్యాలను)విపరీత బుద్ధితో తెలుసుకుంటారు. కాని యదార్ధ స్వరూపాన్ని గ్రహించలేరు. దీనిని రాజస బుద్ధి అంటారు.

రాజసగుణులు ధర్మార్ధ కామాల ఆచరణలో ధైర్యంగా ఉంటారు.

యయా తు ధర్మకామార్ధాన్ ధృత్యా ధారయతేర్జున
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్ధ రాజసీ।। భగీ18.34

రాజస ధృతి కలిగిన వ్యక్తులు ధర్మాన్ని, అర్ధాన్ని, కామాన్ని ఆసక్తితో ఫలాపేక్షతో ఆచరిస్తారు.

యత్తు ప్రత్యుపకారార్ధం ఫలముద్దిశ్య వా పునః
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం।।
భగీ 17.21

యత్ తు పరిక్లిష్టమ్ చ ప్రత్యుపకార అర్ధమ్ ఫలమ్ ఉద్దిశ్య వా పునః దీయతే-

ఏ దానమైతే మనఃక్లేశంతోను, ప్రత్యుపకారం పొందడానికి ఫలాలను ఆశించి ఇయ్యబడతోయో;
(ఇష్టం లేకుండా ఇతరుల బలవంతం మీద ఇచ్చే దానం మనఃక్లేశంతో ఇచ్చే దానం గా అనబడుతుంది. ముందు ముందు తనకు ఉపయోగపడతాడనే దృష్టితో ఇచ్చే దానం వాస్తవంగా దానమే కాదు.)

తత్ దానమ్ రాజసమ్ స్మృతమ్- ఆ దానము రాజస దానం అనబడుతుంది.

పృథక్త్వేన తు యద్జ్ఞానం నానా భావాన్ పృథగ్విధాన్
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ది రాజసమ్।। భగీ18.21

తు యత్ జ్ఞానమ్ సర్వేషు భూతేషు పృథగ్విధాన్ నానాభావాన్ పృథక్త్వేన వేత్తి-
ఏ జ్ఞానం వల్ల సమస్త ప్రాణులలో వేరు వేరుగా ఉండే వివిధ భావాలను దేనికది వేరు వేరు అని తలుస్తారో;
తత్ జ్ఞానమ్ రాజసమ్ విద్ది- ఆ జ్ఞానం రాజసజ్ఞానం అనబడుతుంది.

విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే
మృతోపమమ్
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం।।భగీ18.38

మనుష్యుడు మనస్సు, ఇంద్రియముల ద్వారా విషయ సంయోగం ఉన్నంత వరకూఅతడు ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వాటిమీద ఉండే ఆసక్తి కారణంగా ఆ సుఖాలు అత్యంత ప్రియంగా అనిపిస్తాయి. ప్రారంభం లో ఆ భోగానుభవం అమృత తుల్యంగా అనిపించినా యదార్ధంగా సుఖం ఏమాత్రం కాదు. అది విష తుల్యమే.అలాంటి సుఖాన్ని రాజస సుఖం అంటారు.

!!——————————-!!

రజోగుణ స్వభావులు తినే ఆహార పదార్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కట్వమ్లలవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకమయప్రదాః।। భగీ17.9

కటు, ఆమ్ల, లవణ, అత్యుష్ణ, తీక్ష్ణ, రూక్ష విదాహినః-
చేదు (వేప, కాకర మొదలైనవి), పులుపు (చింత కాయలు, చింతపండు మొదలై..),ఉప్పు, తీక్ష్ణ అంటే మిక్కిలి వేడి పదార్ధాలైన మిరపకాయలు, కారము; రూక్ష అంటే వేయించడం వల్ల మాడిన పదార్ధాలు, విదాహినః అంటే ఆవాలు మొదలైన దాహక పదార్ధాలు;

దుఃఖ శోక, ఆమయప్రదాః ఆహారాః రాజసస్య ఇష్టాః-
అటువంటి పదార్ధాలు దుఃఖాన్ని అంటే పైన చెప్పిన పదార్ధాలు తింటున్నప్పుడు గొంతులోను, నాలుక మీద, దవడలలోను మంట పుట్టడం, పుల్లటి పదార్ధాల వల్ల నోటిలోని పళ్ళు పులిసిపోవడం, కళ్ళ నుండి ముక్కు రంధ్రాలనుండి నీరళ్ళు రావడం, ఎక్కిళ్ళు రావడం మొదలైన వాటినే దుఃఖాలు అని, తిన్న తర్వాత వచ్చ్ కడుపు నొప్పి, విరోచనాలు మొదలైన వాటిని శోకాలు, ఆమయములు అంటారు. చింతను కలుగజేసి రోగాలను కలిగించే ఆహార పదార్ధాలు రాజస స్వభావం కలవారికి ఇష్టమైన పదార్ధాలు.

అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్।। భగీ17.12

యత్ యజ్ఞాత్ దంబార్ధమ్ ఏవ చ ఫలమ్ అపి అభిసంధాయ ఇజ్యతే తత్ రాజసమ్ విద్ధి-
ఏ కార్యమయితే సరిఅయిన నిష్ట లేకుండా గొప్ప గురించి (ఆడంబరము కొరకు) చేస్తారో, అలాగే ఏదో ఫలితాన్ని ఆశించి చేస్తారో ఆ కార్యాన్ని రాజస కార్యం అంటారు.

సత్కారమాన పూజార్ధం తపో దంభ్న చైవ యత్
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధృవం।।భగీ17.18

యత్ తపః సత్కారమాన పూజార్ధమ్ చ ఏవ వా-
ఇతరుల నుండి సత్కారాలు, గౌరవాలు, పూజలు అందుకోడానికి చేసే తపస్సులు, వ్రతాలు, లేదా

దంబేన క్రియతే అధ్రువమ్ చలమ్ తత్ తపః రాజసమ్ ప్రోక్తమ్-
ఇతరులను మోసగించే విధమేన క్రియల వల్ల నిజంగా ఫలితం ఉంటుందో లేదో తెలియదు. క్షణిక సుఖాల నిచ్చే పూజలు, వ్రతాలు, తపస్సులు రాజస తపస్సులనబడతాయి.

అలాగే రాజస దానమంటే ప్రతిఫలాపేక్షతో కాని, ఏదైనా ఒత్తిడులకు లోనై కాని విధిలేక బాధ పడుతూ చేసే దానాలనురాజస దానం అంటారని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము.

సశేషం
ఉదయభాస్కర్ దువ్వూరి

Japa Sadhana – Blog

%d bloggers like this: