అచ్యుత యోగవిద్యాసాధన – సాధకుల ప్రగతి – విశ్లేషణ

– by Udaybhaskar Duvvuri

Last updated: Jun 5th 2018

అచ్యుతాశ్రమ సాధకులారా,

59వ జయంతి సందర్భంగా మీకందరకూ నాయొక్క హార్ధిక శుభాకాంక్షలు.

మన మందరమూ క్రితం పది, పదిహేను సంవత్సరాల నుంచి అచ్యుత యోగ విద్య లో సాగుతూ ఒక స్ధాయికి చేరిన సాధకులమే. మరి మన సాధనలో ప్రగతి ఎందుకు కనిపించడం లేదు?

ఈ రోజు దీనిని విశ్లేషిద్దాము. మీకందరకూ తెలుసు. ప్రస్ధానత్రయం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత బ్రహ్మసూత్రాలు.

ఉపనిషత్తులంటే గురువుకు సమీపంగా ఉండి గురు శిష్యుల సంవాదము ద్వారా బ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని దానిని సాధించే విధానము అని.

భగవద్గీత మన దైనందిక చర్యలో భాగంగా దానిని పారాయణ చేయడం, అనుసరించడం పరిపాటి. ప్రత్యేకంగా అచ్యుతాశ్రమము భగవద్గీతలో చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరణలో పెడుతూ అచ్యుత యోగవిద్యను సాధన చేస్తున్నాము.

మనం వేసే ఆసనం గురించి భగవద్గీత 6వ అధ్యాయంలో 13వ శ్లోకం ఏమి చెప్పుతుంది అంటే

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్ధిరః
సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాశ్చానవలోకయన్!!

సమం కాయం – శరీరాన్ని నిటారుగాఉంచాలి;
శిరోగ్రీవం – మెడను, శిరస్సును శరీరముతో సమముగా నిటారుగా ఉండేటట్లు ఉంచాలి.
అచలమ్ స్ధిరః – ఏరకమైన చలనము లేకుండా కదలని కొండ వలె స్ధిరముగా ఉంచాలి. అంటే వెన్నెముకను నిటారుగా ఉంచాలి.
సంప్రేక్ష్య – రెండు కన్నుల నుంచి వచ్చే దృష్టి;
నాశికాగ్రమ్ – ముక్కు యొక్క అగ్ర భాగంలో (అంటే రెండు కన్నుల మధ్య భాగం- అంటే భృకుటినందు) గురుస్ధానం అనబడే ప్రదేశం లో కేంద్రీకృతంచేసి;
స్వమ్ – తనలోకి;
దిశాశ్చ– తనయొక్క అంతర్దిశలోనికి;
అవలోకయన్ – చూస్తూ తనను తాను విశ్లేషించు కోవాలి.
ఈ ఆసనాన్నే స్ధిరాసనం అనీ, సుఖాసనం అని అంటారు.

శ్వేతాశ్వతరోపనిషత్తులో ఆసనాన్ని ఎలా చెప్పేడంటే

సుఖేనైవ భవేద్యస్మి న్నజస్రం బ్రహ్మ చింతనమ్
ఆసనం తద్వజానీయాదన్యత్సుఖ వినాశనమ్!!

ఏ ఆసనంలో కూర్చొంటే ఎల్లప్పుడు బ్రహ్మ చింతన సుఖముగా అవుతుందో దానినే ఆసనం అని తెలుసుకోవాలి. తక్కిన ఆసనాలన్నీ సుఖాన్ని చెడగొట్టేవి మాత్రమే అని తెలుసుకోవాలి.

ఇంక జపం చేసుకొనే ప్రదేశం ఎలా ఉండాలి?

సమే శుచౌ శర్కరా వహ్ని వాలుకా
వివర్జితే శబ్ద జలాశ్రయాదిభిః
మనోనుకూలే నత చక్షు పీడనే
గుహా నివాతాశ్రయణే ప్రయోజయేత్!!

యోగాభ్యాసానికి ఎన్నుకొనే స్థలం ఎలా ఉండాలంటే…

నేల మెట్ట పల్లాలు లేకుండా సమంగా ఉండాలి.
దుమ్ము, గులకరాళ్ళు తేమ, నిప్పు లాంటివి లేకుండా శుభ్రమైన ప్రదేశమై ఉండాలి.
మనస్సును చెదర్చేటటువంటి శబ్దము లేకుండా ఉండాలి.
మనస్సుకు ఏకాగ్రతను కల్పించేట్లుగా ఉండాలి.
కంటికి ఆనందం కల్పించేట్లు ఉండాలి కాని బాధ కల్గించేట్టు ఉండకూడదు.
ఉండడానికి అనువుగా ఉండే మంచి గుహ లాంటి ఇల్లు అయి ఉండాలి.

ఇలాంటి ప్రదేశాలలు మాత్రమే యోగాభ్యాసానికి అనుకూలమైనవి.

మనం చేసే జపం కూడా భగవద్గీత లో చెప్పి నట్లుగానే

అపానే జుహ్వతిప్రాణం ప్రాణేపానం తధాపరే
ప్రాణాపాన గతీ రుధ్వా ప్రాణాయామ పరాయణాః!

అపరే నియతాహారాః ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి
సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః!!

మన ఉపనిషద్ ఋషులు ఏమి అధ్యయనం చేసేరంటే

మన శరీరంలో ఉండే ప్రాణ శక్తి అది శరీరంలోని వివిధ ప్రదేశాలలో చేసే పనిని బట్టి ప్రాణ, అపాన, వ్యాన, ఉదన, సమాన అని పేర్లు పెట్టారు.

వాటిని అధ్వయనం చేయగా ప్రాణ అపాన వాయువులు శరీరంలో విరుద్ధ దిశలలో ప్రవర్తిస్తున్నట్లు కనిపెట్టారు.

ప్రాణ వాయువు హీలియమ్ లాగ అతి తేలికగా ఉండి ఎల్లప్పుడూ కొండనాలుక పై భాగంలో ఉంటూ, అంటే గురుస్తానానికి దగ్గరగా ఉంటుంది.

అపాన వాయువు కార్బన్ డయాక్సైడ్ లా అతి బరువుగా ఉండి నాభి స్థానానికి దిగువగా గుద స్తానానికి దగ్గరగా ఉంటుంది.

అపాన వాయువు ఎల్లప్పుడూ ప్రాణవాయువుని కిందకు లాగి తనలో కలుపుకోవాలని, అంటే మింగేయాలని చూస్తూ ఉంటుంది.

ప్రాణ వాయువు కూడా అపాన వాయువులో కలిసి పోయి దానిని శుభ్రపరచి తనతో పైకి తేవాలని ప్రయత్నిస్తూంటుంది.

వీటి విరుద్ధ స్వభావాలను చూసి, ఈ రెండింటినీ ఒక గతిలో పెడితే ఉపయోగం ఉంటుంది అని ఆలోచించారు.

అదే విధంగా సహజ గతాగతిలో ఉన్న ప్రాణాపానాలను ప్రాణాయామం అన్నారు.

గతీ రుధ్వా అంటే చాలా మంది నిలపడం అనుకొన్నారు,

కాని ప్రాణ అపానాల గతాగతి సహజ రీతిలో సాగుతూంటే ఆ గతిని అదే రీతిలో కొనసాగించాలి (continuous motion is called a state of rest- probably it was misunderstood by many as stopping respiratory activity) అని అర్ధం చేసుకోలేక సహజ గతికి విరుద్ధంగా శ్వాసను బంధించి ఏమేమో చేయబోయి భంగ పడ్డారు.

అదే రీతిలో మనం ప్రాణాయామ ప్రక్రియ క్రితం పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తూ ధ్యానంలో కూర్చొంటున్నాము. కాని మన కృషికి తగ్గ ఫలితాలు సాధించలేక పోతున్నాము. ఎందు వల్ల?

ముందుగా మనం ఏమి చేస్తున్నామో చూద్దాం. మూడు గతులలో మనం జపం చేస్తున్నాము. ఆ మూడు గతుల వల్ల మనకు లాభం ఏమిటి?

హ్రస్వో దహతి పాపాని
దీర్ఘ. సంపద్ప్రయో వ్యయః
అర్ధమాత్రా సమాయుక్త ప్రణవో
మోక్ష దాయకః

మన జపం లో దీర్ఘ గతి హ్రస్వ గతి శబ్ద రహిత త్వరిత హ్రస్వ గతి.
దీర్ఘ గతి మనం నిలకడగా నిధానంగా చేయడం వల్ల ఆయుష్షు, ఆరోగ్యము మరియు ఐశ్వర్యము దొరుకుతాయనడంలో ఏరకమయిన సందేహము లేదు.

దీర్ఘగతి నిలకడగా కనీసం 15 నుంచి 20 సెకన్లు పై గతి, అలాగే అన్నే సెకన్లు కిందగతి ఉండేటట్లుగా చేయాలి.

దీనివల్ల సాయంత్రం చేసే జపం లో శరీరంలో ఉన్న అలసట అంతా దూరమై పోతుంది. శరీరం ధ్యానానికి ఉద్యుక్తమౌతుంది.

మధ్యగతిలో జనించే ఉష్ణం వల్ల ప్రాణుడు బలిష్టుడౌతాడు.

ఇంద్రియాల ద్వారా అధోముఖంగా బాహ్యంగా వర్తిస్తున్న మనస్సు ప్రాణుడిచే ఆకర్షింప బడతాడు.
ఈ క్రమంలో విపరీతమైన ఉష్ణం జనిస్తుంది.

ఈ సమయంలో పట్టు వదలకుండా మధ్య గతి చేస్తే ఎన్నో జన్మలనుంచి మనతో తీసుకొని వస్తున్న పాపాలన్నీ భస్మమయిపోతాయి.

అందుకని మధ్య గతి లో పట్టు దొరికితే వదలకుండా శరీర త్రాణ పెంచుకొంటూ ఉష్ణ శక్తిని జనింప చేయాలి. ఇక్కడ ఉత్పత్తి అయిన ఉష్ణమే విద్యుత్తు గా మారుతుంది.

ఇంక మధ్య గతి చేయలేని సమయంలో శబ్దరహిత హిస్సింగ్ సౌండ్ త్వరిత హ్రస్వగతికి మారాలి.
అప్పుడు మనస్సును ప్రాణాయామముతో పైకి పైకి తీసుకొనిపోవాలి. ఇదే మనలను ఆత్మ సందర్శనానికి తీసుకొని పోగలుగుతుంది.

చూడండి, మీరందరూ ఇక్కడి వరకూ క్రితం ఐదు, పది సంవత్సరాల నుంచి జపసాధన, పైన చెప్పిన విధంగా, చేస్తూనే ఉన్నారు.

తర్వాత శాంతి గతి లో శరీరాన్ని శరీరంలోని కండరాలను పూర్తిగా సడలించి అప్రమత్తతతో ప్రాణము యొక్క గమనాన్ని, ప్రాణ మనో మిలనాన్ని గమనించడమే ధ్యానం లో ముఖ్యము.

అదే పద్ధతిలో రకరకాలయిన రసాలు ఊరుతూ ఉంటాయి. ఒక్కొక్క బిందువు పైనుంచి అంటే కొండనాలుక పై భాగంనుంచి క్రిందకు జారుతూంటే ధ్యానంలో తురీయాస్ధితి అనుభవమవుతుంది.

ఇప్పుడు మనం ఎందుకు జపంలో ఉన్నత స్ధాయికి పోలేక పోతున్నాము? మనం సాధన చేస్తున్న విద్య పేరేమిటి? బ్రహ్మ విద్యే కదా?

ప్రస్తానత్రయం అనే మాట మీరందరూ వినే ఉంటారు.

భగవద్గీత, ఉపనిషత్తులు మరియు బ్రహ్మ సూత్రాలు – ఈ మూడింటినీ కలిపి ప్రస్తానత్రయం అంటారు.

మనకు భగవద్గీత, ఉపనిషత్తుల గురించి ఎంతో కొంత తెలుసు. మరి బ్రహ్మ సూత్రాలంటే ఏమిటి?

ఎవరయితే బ్రహ్మత్వాన్ని కోరుతారో, ఎవరైతే తన్ను తాను తెలుసుకోదలుచుకొన్నారో వాళ్ళు పాటించ వలసిన సూత్రాలు.

అంటే అది Practical guide for the seekers of “Know thyself”.

బ్రహ్మ సూత్రాలు ఎలా మొదలవుతాయంటే

– మొదటి సూత్రం- ” అధాతో బ్రహ్మ జిజ్ఞాస “ అంటే ఏమిటో తెలుసా?

Therefore you can start Brhmajijnasa-

దీని అర్ధం – నిన్ను నీ అర్హత ఏమిటు అని – ఇంజనీరింగ్ లో చేరాలంటే ఇంటర్ పాస్ అయ్యావా? ఎమ్సెట్ లో నీ రేంకు ఎంత?

నీలో ఉండే జిజ్ఞాస చాలదు. నీయొక్క సంశిద్ధత ఏమిటి అని ప్రశ్నిస్తోంది.

మనకు ఇంజనీరింగ్ కి అర్హతలలాగే బ్రహ్మ జిజ్ఞాస మొదలు పెట్టడానికి – సాధన చతుష్టయము లో నీ స్తానం ఎక్కడ అనేది తెలుసు కోవడానికి కొన్నిప్రశ్నలు వేస్తారు గురువులు.

ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళనే బ్రహ్మత్వానికి అర్హులని నిర్ణయించి వాళ్ళకు మాత్రమే సాధనకు అనుమతి ఇస్తారు. దానిలో నెగ్గని వాళ్ళను తిరిగి సాధనచతుష్టయాన్ని అర్ధం చేసుకొని పాటించి ముందుకు వెళ్ళిన వాళ్ళను మాత్రమే బ్రహ్మ జిజ్ఞాసకు అర్హులుగా ఎంచుకొంటారు.

మరి సాధన చతుష్టయం అంటే

I.   నిత్యానిత్య వస్తు వివేకము
II.  ఐహిక ఆముష్మిక ఫలభోగ విరాగము
III. శమ దమాది షడ్గుణ సంపత్తి
IV.  ముముక్షత్వము

అనే ఈ నాలుగు వాచా కర్మణ ఆచరించి ఆకళింపు చేసుకొంటేనే ఆధ్యాత్మికంగా ముందుకు పోగలుగుతారు. ఇవి లేనిచో బ్రహ్మ నిష సిద్ధించదు. ముందుగా

I.  నిత్యానిత్య వస్తు వివేకము:

దేహము అనిత్యము, నిత్యమైనది ఈ శరీరములో ఉండేటటువంటి నిత్య సత్య పదార్ధము.
ఉదాహరణకు, మనంకట్టుకొనే బట్టలు ఆనిత్యమైనవి, ఏ దూదితో ఈ బట్టలు తయారయ్యేయో ఆ దూది నిత్యమైనది.

ఇదేవిధంగా త్రికాలాలతోటి సంబంధమున్నవి, దేశ కాల వస్తుకృతములు అనేవన్నీ అనిత్యములనే ధ్యాస కలగడమే నిత్యము అనిత్యముల తారతమ్యాన్ని తెలుసుకోగలిగిన జ్ఞానం.

II. ఐహిక ఆముష్మిక ఫల భోగ విరాగము:

ఈ భూమి మీద దొరికే సమస్త భోగ భాగ్యాలు, యజ్ఞయాగాది క్రతువుల ద్వారా పరలోకములో దొరకబోయే సుఖాల మీదేరకమైన ఇచ్ఛ, కోరిక లేకుండా ఉండడం అనేది ఈ వైరాగ్యం లోకి వస్తుంది.

III. శమము, దమము,ఉపరతి, తితీక్ష,శ్రద్ధ మరియు సమాధానము:

ఈ ఆరు గుణాలు యందు ఆధిక్యతను సాధించాలి.

1. శమము: మనకు తాపత్రయాన్ని పెంచే విషయాలలో ఉండే దోషాలను మాటమాటికి తలంచుకొంటూ,వాటిమీద విరక్తి కలిగి ఉండాలి. మనోబుద్ధి చిత్త అహంకారాలను వాటివృత్తులలో ప్రవేశింపనీయకుండా బ్రహ్మ లక్ష్యములోనే నిలపడం శమము అనబడుతుంది.

2. దమము:

a.   జ్ఞానేంద్రియాలు (శబ్ద,స్పర్శ,రూప,రస,గంధదులు);
b.    కర్మేంద్రియాలు (వాక్కు, పాణి,పాదము, పాయువు, ఉపస్ధ)

వీటిని వాని వాని వ్యాపారములందు ప్రవేశింప నీయక పరబ్రహ్ము నందు ఐక్యమొనరించుట- దమము అసబడుతుంది.

3. ఉపరతి: చంచలమైన మనస్సును నిశ్చలముగా చేసి భాహ్య విషయాలనుంచి మరలించి ఎల్లప్పుడుబ్రహ్మ లక్ష్యములోనే నిలపడాన్ని ఉపరతి అంటారు.

4. తితీక్ష: శీతోష్ణ క్షుత్పిపాసా, మానావమానాది ద్వంద్వముల వల్ల కలిగే దుఃఖములనోర్చుకొంటూ;
ఇతరులనుంచి సంభవించే దుఃఖాలకు, ప్రతీకారము చేయగలిగిన శక్తి గలిగిఉండీ ప్రతీకారము చేయకుండా ఉండి చిత్త వ్యాకులము గాని వాక్పారుష్యముగానొ లేకుండా ఉండుటనే తితీక్ష అంటారు.

5. శ్రద్ధ: శాస్రము, గురువాక్యము సత్యమనెడినిశ్చయ బుద్ధి కలిగి ఉండటాన్ని శ్రద్ధ అంటారు.

6. సమాధానము: గురువు ఉపదేసించినది, వేదాంతశాస్త్రంలో చెప్పినది ఒకటే అని నిశ్చయించుకొని మనస్సును లక్ష్య వస్తువు మీదనే నిరంతరమూ నిలపడాన్ని సమాధానం అంటారు.

IV. ముముక్షుత్వము: అజ్ఞాన కల్పితములగు అహంకారాదిదేహాంతము వరకూగల బంధనాలలో చిక్కి అగ్నిచే గాల్పబడుతున్న వాని వలె పరితపించుచూ సద్గురు బోధ వల్ల ఆయా బంధనాలనుండి విముక్తుడుకావాలి అనే తీవ్ర ఇచ్ఛను ముముక్షత్వము అంటారు.

చూడండి సాధన చతుష్టయాన్ని తెలుసుకొన్నారు కదా! ఎవరికయితే తీవ్రమైన వైరాగ్యం, మోక్షేచ్ఛ కొంచెం తక్కువగా ఉంటాయో వాళ్ళకు శమదమాది షడ్గుణాలు ఉన్నా అవి ఫలితాలను ఇవ్వవు.
విషయాసక్తి అంతటి ప్రమాదకరము. జ్ఞానోత్పత్తి కలుగదు. అంతరంగ భక్తి అతి ముఖ్యమైనది.

బ్రహ్మత్వాన్ని పొందాలంటే శమదమాదులతో కూడిన అంతరంగ భక్తి ముఖ్యము, శ్రేష్ఠము.

బ్రహ్మము నందు, గురువు నందు అచంచలమైన భక్తి గల సాధకునకు నేను సర్వ శక్తిమంతుడను, సచ్చిదానంద స్వరూపుడను అని బ్రహ్మ భావముతో తలచుచుండుటయే బ్రహ్మానుచింతన.

ఇప్పుడు చెప్పండి మనం ఎక్కడ ఉన్నాము? ఇంకా ఎంత దూరం ప్రయాణించవలసి ఉంది? ఇప్పటికైనా అర్ధం అయ్యిందా? మనలో లోపించినది ఏముంది? మిగిలిన యమ నియమాదులు పాటించకుండా మనం చేసే సాధన ప్రగతి మార్గంలో పయనించకపోవడాన్ని చర్చిద్దాం.

మనం నిజంగానే యమ నియమాలను అశ్రద్ధ చేశామేమో అనిపిస్తూంది. ఒకసారి యమము అంటే ఏమిటి నియమమంటే ఏమిటో చూద్దాం.

యమము అంటే అణచుట. లేదా వశములో ఉంచుకొనుట. దేశ కాల మానాది పరిస్తితులను లెక్కలోకి తీసుకోకుండా సర్వ కాల సర్వావస్తలయందు పాటించ వలసిన వ్రతము ఇది ఈ యమాన్ని సక్రమంగా పాటిస్తే చిత్తంలోని మలం పూర్తిగా తొలగిపోతుంది.

అహింస (Non Violence),
సత్యం (Absolute Truthfulness),
అస్తేయము (Non Steeling),
బ్రహ్మ చర్యము (Absolute Sexual Restraint),
అపరిగ్రహము (Acceptance of nothing even when it is absolutely necessary)

– ఈ అయిదు నియమాలను యమము అంటారు.

ముందుగా…

a) అహింస:
అహింస అంటే కేవలం భౌతికంగా హింసించకుండా ఉంఢమే కాదు, మానసికంగా కూడా హింసించ కూడదు. ఎవరినీ ద్వేషించ కూడదు.- దీన్నే వైరత్యాగం అంటారు. దీనకి ఒక చక్కటి ఉదాహరణ:

వ్యాసుడు మహా భారతంలో రాస్తాడు- దుష్యంతుడు కణ్వాశ్రమంలో ప్రవేశించినప్పుడు అక్కడ పులులు లేళ్ళు కూడా మైత్రీభావంతో ఉన్నాయని. కణ్వుడు అనుసరించిన అహింసా మార్గమే జంతువులు సహజ శత్రుత్వాన్ని వీఢానికి కారణం.

b) సత్యం:
సత్య వాక్పరిపాలనలో హరిశ్చంద్రుని సాటి ఎవరూ లేరు.
సత్యానకి ఋతానికి ఉండే వ్యత్యాసం ఏమిటంటే ఏసత్యాన్నయితే కన్నులతో దర్శిస్తారో అది ఋతం. కన్నులతో చూచినది, చెవులతో విన్నవి యధాతధంగా ప్రకటించడం సర్వకాల సర్వావస్తలలోనూ సత్యాన్నే పలకడం. ఇక్కడ మనో వాక్కాయ కర్మలలో ఐక్యత సాధించాలి.
ఏ చిన్న విషయంలో కూడా అసత్యమాడితే దానివల్ల యోగ భ్రష్ఠమౌతుంది. ఇది పాటించడం వల్ల వాక్సుద్ధి కలుగుతుంది.

c) అస్తేయం:
ఇతరుల ద్రవ్యాన్ని దొంగిలించకుండా ఉండడం – కేవలం భౌతికంగానే కాదు,
మానసికంగా కూడా ఆ కోరిక ఉండకూడదు.- ఇది పాటిస్తే అపార సంపద లభిస్తుంది.

d) అపరిగ్రహం:
దానాలు తీసుకోకూడదు. ఇతరుల ధనాన్ని గాని, వారి వస్తువులను గాని తీసుకో కూడదు.
ఎవ్వరి ధనాన్ని ఆశించవద్దు. అవసరమైనా కూడా ఇతరులనుంచి ఏవస్తువునీ తీసుకోకుండా ఉండాలి. దీని వల్ల – పూర్వ జన్మ విశేషాలు, రాబోయే జన్మల విశేషాలు తెలుస్తాయి.

e) బ్రహ్మ చర్యం:
విషయ సుఖాలు పూర్తిగా వదిలివేయాలి. లైంగిక సుఖాలు వదిలేస్తే(తగ్గిస్తే) వీర్యవృద్ధి జరుగుతుంది. ప్రాణాయామ ప్రక్రియలో వీర్యం తేజస్సు గాను, తేజస్సు ఓజస్సుగాను మారి బ్రహ్త్వానికి దగ్గరగా తీసుకొని పోతుంది.

ఈ యమములు జాతి కుల వివక్ష లేకుండా అందరకీ అన్ని కాలాలలోనూ వర్తిస్తాయి.

నియమము
నియమము అంటే ఏర్పాటు, కట్టు, ప్రతిజ్ఞ, ఆజ్ఞ, వ్రత నిష్ఠ అని అర్ధం.

శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః

నియమములు కూడా అయిదు గా విభజించేరు.

  1. శౌచము (External and Internal Purification),
  2. సంతోషము (Contentment),
  3. తపస్సు (Austerity),
  4. స్వాధ్యాయము,
  5. ఈశ్వర ప్రణిధానము (Deep Devotion to God)

1. శౌచము:

శరీరాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం. జల స్నానం, మలత్యాగం.అంటారు.శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచినప్పుడే మనస్సుని కూడా నిర్మలంగా ఉంచడం సాధ్యమౌతుంది అని చెబుతోంది.

అంతఃశుద్ధి, కల్మష రహితమైన మనస్సు, మైత్రి, కరుణ,ముదిత, ఉపేక్ష ఉండాలి.
అంతఃకరణ సుద్ధి జరుగుతుంది.ప్రసన్నత ఏర్పడుతుంది. ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారానికి వీలు ఏర్పడుతుంది. ఇది అత్యంత ఆవశ్యకము.

అధశుద్ధం భవేద్వస్తు యద్వైవాచామగోచరమ్
ఉతేతి శుద్ధ చిత్తానాం వృత్తి జ్ఞానం తతఃపరమ్!!

వాక్కులకు కనపడని వస్తువు ఏదయితే ఉందో అది శుద్ధమైన వస్తువు (బ్రహ్మము).
పరిశుద్ధమైనచిత్తం ఉన్నవారికి మాత్రమే ఆపరిశద్ధ వస్తు వృత్తి జ్ఞానం తెలుస్తుంది.

ఇక్కడ శ్రీ యోగి అచ్యుతుల మాటలు జ్ఞాపకం చేసుకొంటే తపో జీవనం నిజానికి ఎంతో శుచితో కూడుకొన్నది.

నువ్వు ఎంత శుచివి అవుతావో, నువ్వు ఎంత సూక్ష్మం అవుతావో, నువ్వు ఎంత మంచివాడవవుతావో,
అంతే శుచి, సూక్ష్మత్వం, అంతే మంచితనం తిరిగి తిరిగి వేయింతలై ఫలితాన్నిస్తుంది – అన్నారు.

2. సంతోషము:
ఉన్నదానితో సంతృపు చెందడం. మనస్సుని ఎల్లప్పుడు ఉల్లాసంగా, ఉత్సహంగా ఉంచడమే సంతోషం.

3. తపస్సు:
శీతోష్ణ క్షుత్పిపాసములు ఒక్కటిగా తలుస్తూ మనస్సును లక్ష్య వస్తువు మీద పెట్టడం తపస్సు అనబడుతుంది.

4. స్వాధ్యాయం:
చేసిన తపస్సులోని అనుభవాలను వేదాలు ఉపనిషత్తులలోని విషయాలతో సరిపోల్చుకోడానికి ఉపయోగించే అధ్యయనమే స్వాధ్యాయం.

5. ఈశ్వర ప్రణిధానము:
ఈశ్వరునిమీద( భగవంతునిమీద), గురువు మీద అచంచలమైన విశ్వసం తో దృఢ భక్తితో కర్మలనాచరించడం.

ఇవన్నీ మనందృష్ఠిలో ఉంచుకొని యమ నియమాలను, సాధన చతుష్టయాన్ని పాటిస్తూ మనజపం కొనసాగిస్తే ఒకే ఒక సంవత్సరంలో ఆత్మ సాక్షాత్కారం ప్రతి ఒక్కరికీ సాధ్యమే. మనమందరం సంసార సాగరాన్ని ఈదుతూ ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్నామంటే మన గురువులు శ్రీ యోగి అచ్యుతులు తప్పక అనుగ్రహిస్తారు. మనలో ప్రతి ఒక్క సాధకుడు ఈ జన్మలోనే ఫలశృతిని పొందుతాడు. తధాస్తు.

శుభం స్వస్తి
ఉదయభాస్కర్ దువ్వూరి

Japa Sadhana – Blog

%d bloggers like this: