స్థితప్రజ్ఞ లక్షణాలు

– శ్రీ ఉదయభాస్కర్ దువ్వూరి

Last updated: Jul 1st 2019

మనం అచ్యుత యోగసుధాసారం లో స్వామీ జయతీర్ధుల గురించి తిరిగి మొదలు పెట్టే ముందు భగవద్గీత లోని రెండవ అధ్యాయంలో ఉన్న స్థిత ప్రజ్ఞ లక్షణాలు చదువుకుందాం.

రెండవ అధ్యాయం 54 వ శ్లోకంలో అర్జునుడు నాలుగు ప్రశ్నలు అడుగు తాడు.

స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్ధస్య కేశవ
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్।।54

ఓ కేశవా!

1.. సమాధి స్థితుడై పరమాత్మ దర్శనాన్ని చేసుకొన్న స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి? అంటే స్థిత ప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు?

2. (కిమ్ ప్రభాషేత)అతను ఏవిధంగా మాట్లాడుతాడు?

3. (కిమ్ ఆసీత) ఏ విధంగా నిశ్చలంగా ఉంటాడు?

4. (కిమ్ వ్రజేత) ఎల్లా నడుచుకుంటాడు? ఏ విధంగా ఉంటాయి అతని ఆచరణలు?

మొదటి ప్రశ్నకు సమాధానం:

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే।। 55

యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి – మనస్సులోని సర్వ కోరికలు పూర్తిగా తొలిగి పోతాయో, కోరికలన్నీ పూర్తిగా నశించి పోతాయో అతను స్థిత ప్రజ్ఞుడు అనబడతాడు.

ఆత్మనా ఆత్మని ఏవ తుష్టః తదా స్థితప్రజ్ఞః ఉచ్యతే- అంటే అంతఃకరణంలో ఉన్న కోరికలన్నీ తొలిగిపోయిన తర్వాత దృశ్యమనేదే తొలగి పోతుంది. అప్పుడు నిత్య శుద్ధబుద్ధ పరమాత్మ యొక్క యదార్ధ స్వరూపాన్ని దర్శించి అతనిలోనే తృప్తిని పరమానందాన్ని పొందడానినే ఆత్మ ద్వారా ఆత్మలోనే తృప్తిని పొందడం అంటారు. అల్లా ఆత్మలోనే ఆత్మానందాన్ని పొందిన వాళ్ళను స్థితప్రజ్ఞులు అంటారు.

ఇదే విషయాన్ని మూడవ అధ్యాయంలో 17వ శ్లోకంలో వివరించేరు.

యస్త్మాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే।।

యః మానవః ( స్థితప్రజ్ఞః) ఆత్మరతిః ఏవ చ ఆత్మ తృప్తః ; చ ఆత్మని ఏవ సంతుష్టః స్యాత్, తస్య కార్యమ్ న విద్యతే –

పరమాత్ముడి సాన్నిధ్యాన్ని పొందిన వ్యక్తి కోరికలను జయించినవాడై ఉంటాడు. అతను సర్వకాల సర్వావస్థలలోను పరమాత్మ స్వరూపంలోనే లీనమై ఉంటాడు. నిత్యమూ ఆత్మానందంలోనే ఉంటూ పరిపూర్ణ కాముడై ఉంటాడు. అతడు నిత్య తృప్తి, నిత్య సంతుష్టుడు. అతనిపై శాస్త్ర విహిత కర్మల యొక్క ప్రభావం ఉండదు. అతనికి కర్తవ్యమనేది ఉండదు. కాని లోకములో ఇంద్రియ సంబంధమైన కర్మలు జరుగుతూ ఉంటాయి.

రెండవ ప్రశ్నకు సమాధానం:

2. కిమ్ ప్రభాషేత: అతను (స్థిత ప్రజ్ఞుడు) ఏ విధంగా మాట్లాడుతాడు?

ఇక్కడ స్థిత ప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు అనేదానికి అర్ధం అది సాధారణ సంభాషణ కాదు అని తెలుసుకోవాలి. అతని మనో భావాలు మానసిక స్థిరత్వం అని మాత్రమే అర్ధం చేసుకోవాలి.

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే।। 2.56

దుఃఖేషు అనుద్విగ్న మనాః – స్థితప్రజ్నుని మాటలలో ఏమాత్రము ఉద్వేగం ఉండదు.
మహా దుర్భరములైన దుఃఖాలకు కూడా అతని మనస్సు ఉద్వేగపడదు.

సుఖేషు విగతస్పృహః- ప్రపంచం లోని సమస్త సుఖాలు ఒక్కసారి కలిగినా కూడా అతని మనస్సు ఉద్వేగపడదు, వాక్కులో ఏమాత్రమూ పొంగి పోడు, ఆసక్తి రహితుడై ఉంటాడు.

వీతరాగ భయక్రోధః- అంతఃకరణములోను వాక్కులోను ఆసక్తి, భయం, క్రోధం ఏమాత్రమూ ఉండవు. అంటే స్థితప్రజ్ఞుడి అంతఃకరణం ఏ విధంగా అయితే ఆసక్తి రహితంగాను, భయక్రోధ రహితంగాను శాంతంగాను ఉంటుందో, అతని మాటలు కూడా అంత శాంతం గాను ఉంటాయి.

ముని స్థితధీః ఉచ్యతే – ముని అంటే వాచంయమో మునిః- వాచం నియచ్ఛతీతి వాచంయమః,- వాక్కును నిలుపు వాడు; మన్యతే మునిః,-జ్ఞానం కలవాడు; సర్వ ధర్మాణాం మననాన్మునిః,-సర్వ ధర్మాలను తెలిసిన వాడవడం వల్ల ముని అనబడతాడు.

దుఃఖములొచ్చినప్పుడు ఉద్వేగానికి లోనుకాకుండా, సుఖాలలో ఎవని అంతఃకరణము ఏకొంచము చలింపకుండా ఉంటుందో, మనస్సులోను, వాక్కులోను ఆసక్తి, భయం, క్రోధం లేకుండా శాంతంగా, సరళంగా ఉంటుందో అటువంటి సర్వధర్మాలు తెలిసిన మునిని స్థితప్రజ్ఞుడు అంటారు.

ఇలా అంటూ 2.57 శ్లోకం లో

యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్
నాభి నందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా।।

యః సర్వత్ర అనభిస్నేహః తత్ తత్ శుభ అశుభమ్ ప్రాప్య నద్వేష్టి, న అభినందతి – చూడండి ఎవరయితే ఎల్లప్పుడూ తను పొందిన శుభాశుభముల యందు మమత అసక్తి లేకుండా ఉంటూ పరిశుద్ధమైన ప్రేమతో మాటలతో లోక హితాన్నే కోరుతాడో ఆ పురుషుడే స్థితప్రజ్ఞుడు అనబడతాడు. అతనిని స్థిరబుద్ధి కలిగిన మహా యోగి అంటారు.

3. కిమ్ ఆశీత? స్థిత ప్రజ్ఞుడు ఏవిధంగా కూర్చుంటాడు? అంటే ఎంత నిశ్చలంగా ఉంటాడు?

యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః
ఇంద్రియాణీంద్రియార్ధేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా।।2.58

కూర్మః సర్వశః అంగాని సంహరతే ఇవ యదా అయమ్ ఇంద్రియార్ధేభ్యః ఇంద్రియాణి సంహరతే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా –

తాబేలు తన అవయవాలను అన్నివైపులనుండీ తన లోనికి ముడుచుకున్నట్లే, ఇంద్రియాలను ఇంద్రియార్ధాల (విషయాలనుండి) నుండి అన్ని వైపులనుండీ ఉపసంహరించు కోగలిగిన పురుషుని బుద్ధి (ప్రజ్ఞ) స్థిరంగా ఉంటుంది.

ఇది చెప్పుకోడానికి ఎంతో శులభంగా ఉన్నా మనస్సు ఇంద్రియార్ధాలనుండి విడివడడమే అతి పెద్ద ఘనకార్యం.

మనస్సు అన్ని వేళలా ఏం చేస్తుందంటే
ధ్యాన స్థితిలో ఉన్న సాధకుని మనస్సు ప్రతి ఇంద్రియం దగ్గరకూ వెళ్ళి తనకు ఆశ్రయం ఇమ్మని వేడుకొంటుంది ఇంద్రియార్ధాల గురించి.

తన్మనో దిశం దిశం పతిత్వా న్యత్రాయతన మలబ్ధ్వా ప్రాణ మేవోపశ్రయతే ప్రాణ బంధనంహి సౌమ్య మనయితి।। (చాందోగ్య)

ఆ పురుషుడు తీవ్ర సాధనలో ఉన్నాడు. అతనిలో ప్రాణ శక్తి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆసమయంలో ఇంద్రియాలన్నీ ప్రాణుని యొక్క అధీనం లో ఉంటాయి. అందువల్ల ప్రాణుని అధీనం లో ఉన్న ఇంద్రియాలు మనస్సును దరిచేరనీయవు. నిరాకరిస్తాయి. అంటే ఇంద్రియార్ధాలు ( శబ్ద, స్పర్శ, రూప, రస గంధాదులు) మనస్సును చలింప చేయలేక పోతాయి. అప్పుడు మనస్సు వేరే దారిలేక ప్రాణ శక్తి చేతనే ఆకర్షింపబడి మానస లేదా బుద్ధిగా మారుతుంది. అప్పుడు తల్లి చంకలో చేరిన బిడ్డలా బుద్ధి ఆనందమయ స్థితిలో స్థిరమవుతుంది.

ఇంద్రియాల ద్వారా ఇంద్రియార్ధాలను గ్రహించ లేకపోయినా కూడా ఆ విషయ వాసన, విషయాలమీద ఉండే ఆసక్తి ఎక్కడకీ పోదు. కాని స్ధిత ప్రజ్ఞుడికి విషయవాసనల మీది ఆసక్తి కూడా తొలగిపోతుంది. ఇదే విషయాన్ని 2.59 వ శ్లోకంలో

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః
రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే।।

నిరాహారస్య( దేహినః ) విషయాః వినివర్తంతే-
మన శరీరానికి ఆహారం ఎలాగో ఇంద్రియాలకు విషయాలనేవి ఆహారం. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఇంద్రియాల ద్వారా గ్రహింప బడక పోతే ఆ విషయాలన్నీ తొలగిపోతాయి. కాని,
రసవర్జం- శబ్దాది విషయాలమీద ఉండే ఆసక్తి ఎక్కడకీ పోదు. ప్రయత్న పూర్వకంగా మనస్సును నిరోధించ వచ్చు కూడా అయినా ఆసక్తి మాత్రం తగ్గదు.

అస్య(స్థితప్రజ్ఞస్య) రసః అపి పరమ్ దృష్ట్వా నివర్తతే।- ఆ మిగిలిన కించిత్ ఆసక్తి కూడా పర బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత ఆ స్థితప్రజ్ఞుడికి పూర్తిగా తొలగి పోతుంది. బ్రహ్మ సాక్షాత్కారం తర్వాత ఆత్మ తన అస్థిత్వాన్ని కోల్పోతుంది. దానితో విషయ నివృత్తి, విషయాసక్తి కూడా సహజంగానే నశిస్తుంది.

ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే।। 2.65

ఇప్పటి వరకూ ఇంద్రియాలన్నింటినీ మన వశంలోకి ఎలా తెచ్చుకోవాలి, అవి ఎలా వస్తాయి అనే వాటిగురించి తెలుసుకున్నాము. ఇంద్రియాలు వశం లోకి రావడం వల్ల రాగద్వేషాలు నశించి సాధకుని మనస్సు శుద్ధమై స్వచ్ఛమవుతుంది. అప్పుడు ఆధ్యాత్మికంగా శాంతి అంటే ఏమిటో అనుభవం లోకి వస్తుంది. ఈ శుఖశాంతులయొక్క కొలమానమే ప్రసాదం అనబడుతుంది.

ప్రసాదే అస్య సర్వ దుఃఖానామ్ హానిః ఉపజాయతే- ఆ ప్రసాదం లభించగానే ఆ సాధకుని సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. ఎల్లప్పుడు ఆనందమయ స్థితి లోనే ఉంటాడు. ఇక్కడ సమస్త దుఃఖాలు అంటే ఆధ్యాత్మిక (మన లోపల ఆధి వ్యాధుల వల్ల కలిగే తాపాలు), ఆధి దైవిక (భూమి మొదలైన పంచభూత ప్రకోపం వల్ల వచ్చే పిడుగులు, భూకంపాలు, ఉప్పెనలు మొదలైన క్లేశాలు), ఆధి భౌతిక (దారా పుత్రాదులు, ఇరుగు పొరుగు వాళ్ళు, కుక్కలు, దొంగలు మొదలైన వారివల్లవచ్చే క్లేశాలు)దుఃఖాల వల్ల అతను చలించడు. ఎల్లప్పుడూ ఆనందమయ స్థితిలోనే ఉంటాడు.

ప్రసన్నచేతసః బుద్ధిః ఆశు హి పర్యవతిష్ఠతే-
అటువంటి ప్రసన్న చిత్తుడైన సాధకుని బుద్ధి అన్ని బంధాలనుండి వైదొలగి సర్వకాల సర్వావస్థల లోను పరమాత్మ యందు స్థిరమై ఉంటుంది.

ఇంకొంచె వివరంగా చెబుతున్నాడు.

నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా
న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్।। 2.66

అయుక్తస్య బుద్ధి న అస్తి-
ఇంద్రియాలను వశం లో ఉంచుకోలేని వానికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు.

అయుక్తస్య భావన న-
అలాటి బుద్ధి లేని వానికి పరమాత్మయందు మనస్సు లగ్నం కాదు.

అభావయతః శాంతి న-
పరమాత్మ యందు మనస్సు లగ్నం కాకపోతే శాంతి లభించదు.

అశాంతస్య సుఖమ్ కుతః-
శాంతం లేని వానికి శుఖం ఎలా వస్తుంది? రాదు. సర్వదా అశాంతిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు.

ఇంద్రియాణాం హి చరతాం యన్మనోనువిధీయతే
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి।।2.67

ఇవ అంభసి నావమ్ వాయుః హరతి ఇవ-
నీటిలో చుక్కాని లేని నావను గాలి ఏ విధంగా నెట్టి వేస్తుందో

చరతామ్ ఇంద్రియాణామ్ మనః యత్ అనువిధీయతే-
ఇంద్రియాలమీద వశం లేని మనస్సు ఏ ఇంద్రియంతో జత కడితే దానివల్లే మనో నిగ్రహాన్ని కోల్పోతుంది.

తత్ అస్య ప్రజ్ఞామ్ హరతి-
వఆ ఇంద్రియ లోలత్వమే సాధకుని బుద్ధిని హరిస్తుంది

శ్రీ ఆది శంకరుల వివేక చూడామణి లో

శబ్దాదిభిః పంచభిరేవ పంచ
పంచత్వమాపుః స్వగుణేన బద్ధాః
కురంగ మాతంగ పతంగ మీన
భృంగా నరః పంచభిరంచితః కిమ్।।

కురంగము( లేడి), మాతంగము(ఏనుగు), పతంగము (మిడుత), మీన( చేప), భృంగము (తుమ్మెద) అనే ఈ అయిదు ఒక్కొక్క ఇంద్రియ లోలత్వం వల్ల వాటి జీవితాలు కోల్పోతున్నాయి.

ఎలాగంటే లేడివేణుగానానికి భ్రమపడి పరుగెత్తి వేటగాడి వలలో చిక్కుకుంటోంది. అంటే శ్రవణేంద్రియం వల్ల మోసపోతోంది. మగ ఏనుగు ఆడ ఏనుగు కర స్పర్శకు లొంగిపోయి గుంటలోపడి తన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకొంటూంది. స్పర్శేంద్రియం వల్ల ఏనుగు మోసపోతోంది. మిడుత అగ్ని జ్వాలకు భ్రమ పడి మంటలో పడి దేహత్యాగం చేస్తోంది. నయనేంద్రియం వల్ల మంటను వెలుతురు గా భ్రమ పడి దానిలోకి దుముకుతోంది. చేప ఎఱకు ఆశపడి గాలానికి చిక్కుతోంది. రసేంద్రియానికి దాసోహమంటోంది. భృంగము చంపక పుష్ప పరిమళానికి ఆశ పడి ఆ పుష్పంలో చిక్కుకొని ప్రాణాలు వదులుతోంది. అంటే ఘ్రాణేంద్రియానికి బానిస అయి అసువులు కోల్పోతోంది.

అలాంటిది శబ్దాది పంచేంద్రియాలు కలిగిన మానవుడు గతి ఏమిటి? అని ప్రశ్నిస్తున్నాడు.

తస్మాద్యస్య మహాబాహో! నిగృహీతాని సర్వశః
ఇంద్రియాణీంద్రియార్ధేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా।।2.68

యస్య ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సర్వశః నిగృహీతాని- ఎవని యొక్క ఇంద్రియాలు ఇంద్రియ విషయాలనుండి పూర్తిగా నిగ్రహింప బడతాయో
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా- అతని యొక్క బుద్ధి స్థిరంగా ప్రతిష్ఠితం అవుతుంది.

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సానిశా పశ్యతో మునేః।।2.69

సర్వ భూతానామ్ యా నిశా తస్యామ్ సంయమీ ( స్థితప్రజ్ఞః) జాగర్తి – సమస్త జీవరాసులకు ఏదయితే రాత్రి అనబడుతుందో ఆ రాత్రి వేళలో స్థిత ప్రజ్ఞుడు ప్రజ్ఞతో ఉంటాడు, అంటే జాగ్రదావస్థలో ఉంటాడు. సాధనలో తన శరీరాన్ని మనస్సును బ్రహ్మజ్ఞాన సముపార్జనకు అనువుగా మార్చుకుంటాడు.

భూతాని జాగ్రతి యస్యామ్ పశ్యతః మునేః సా నిశా- సమస్త భూతాలు అంటే సకల ప్రాణులు హెచ్చరికతో మెలుకువగా ఉండే ఆ పగటి దినం పరమాత్వ తత్వాన్ని తెలుసుకొన్న మునికి రాత్రి తో సమానము. అంటే ఇంద్రియ సుఖాలను కలుగజేసే పగటిపూట కార్యాలన్నీ నిరాసక్తి కరమైనవి ఆ బ్రహ్మజ్ఞానికి.

ఈ శ్లోకంలో విస్ఫష్ఠంగా గ్రహించడానికి, జ్ఞానకాంక్షులకు అంటే సాధకులకు నిరీంద్రియ సంపదను కైవసం చేసుకోవడానికి రాత్రి ఎంత ముఖ్యమైనదో చెబుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. రాత్రి ధ్యానానికి పగలు కర్తవ్యానికి అనేవిషయం నిర్ద్వంద్వంగా చెప్పేసేడు భగవానుడు. ఇప్పుడైనా మేల్కొనక పోతే నష్టపోయేదెవరు? చెప్పండి. అందుకని తప్పక ధ్యానానికి ప్రాధాన్యతనిచ్చి రాత్రి తినే ఆహారాన్ని నియంత్రించి మనస్సును శరీరాన్ని సాధనకనువుగా మలచుకున్నప్పుడే మనం మన గమ్యాన్ని చేరగలుగుతాము.

ఈ రెండు శ్లోకాలు మన సాధకులకు అత్యంత ముఖ్యమైనవి. బాగా చదివి అర్ధం చేసుకోండి.

ఆపూర్యమాణమచలం ప్రతిష్ఠం సముద్రమాపఃప్రవిశంతి యద్వత్
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ।। 2.70

యద్వత్ ఆపః ఆపూర్యమాణమ్ అచలప్రతిష్ఠం సముద్రమ్ ప్రవిశంతి-
ఆపూర్యమాణం అచలం ప్రతిష్ఠం అంటే సర్వతోముఖంగా నీళ్ళతోటి పరిపూర్ణమై నిశ్చలంగా ఉండే సముద్రం వంటి వాడు స్థితప్రజ్ఞుడు.
అతనిమీద సంసార సుఖదుఃఖాలు ఎన్ని వచ్చి పడినా అతను విచలితుడు కాడు.

ఎన్నో నదులలోని రకరకాలయిన నీరు సముద్రంలో నిరంతరం వచ్చి చేరుతున్నా సముద్రం చలించ కుండా నిశ్చలంగా ఉంటుంది. నదులలో సరోవరాలలో కొంచె ఎక్కువ నీరు రాగానే ఆనదికి సరోవరానికి వరదలు వస్తాయి. కాని ఎన్ని నదుల నీరు వచ్చి చేరినా సముద్రానికి ఏ ఒడుదుడుకులు లేక నిశ్చలంగా ఉంటుంది. అలాగే సంసారం లోని సుఖ దుఃఖాలు ఎన్ని వచ్చినా వాటి ఒడు దుడుకు లకు జ్ఞాని చలించడు.

తద్వత్ సర్వే కామాః యమ్ ప్రవిశంతి-
అల్లాగే సకల భోగాలు , భోగేచ్ఛల అవసరం ఏమాత్రం లేకున్నా, ప్రారబ్దానుసారం జ్ఞానికి వివిధ భోగాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. కాని ఆ భోగాలు అతనిలో హర్షశోకాలను, రాగద్వేషాలను, కానక్రోధాలను, లోభమోహాలను, భయోద్వేగాలను మఱి ఏ ఇతర వికారాలను ఉత్పత్తి చేయలేవు. అతనిని నిశ్చల స్థితినుంచి ఏమాత్రమూ కదపలేవు.

సః శాంతిమ్ ఆప్నోతి కామకామీ న-
ఆ పురుషుడు ఎల్లప్పుడూ పరమ శాంతినే పొందుతూ ఉంటాడు. అలాగే భోగాలమీద కోరిక కలిగిన వానికి శాంతి దొరకదు.

విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిఃస్పృహః
నిర్మమో నిరగంకారః స శాంతిమధిగచ్ఛతి।। 2.71

యః పుమాన్ సర్వాన్ కామాన్ విహాయ-
ఏ పురుషుడయితే సమస్తమైన కోరికలను త్యజిస్తాడో,

నిర్మమః నిరహంకారః నిస్పృహః చరతి-
మమతా రహితిడై, అహంకార రహితుడై, ఆసక్తిరహితుడై చరిస్తూ ఉంటాడో
సః శాంతిమ్ అధిగచ్ఛతి-
అతనే శాంతిని పోందుతాడు అంటూ మొదటి శ్లోకంలో అడిగిన నాల్గవ ప్రశ్న కిమ్ వ్రజేత అనేదానికి పూర్తి సమాధానాన్ని చెబుతూ స్థితప్రజ్ఞుడి మహిమను ఈ క్రింది శ్లోకంలో చెబుతున్నాడు.

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్ధ నైనాం ప్రాప్య విముహ్యతి
స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి।। 2.72

ఏషా బ్రాహ్మీ స్థితిః – దీనినే అంటే ఈ బ్రహ్మ ప్రాప్తిని పొందిన సాధకుని స్థితినే స్థితప్రజ్ఞ స్థితి, బ్రహ్మజ్ఞాన స్థితి అంటారు.

ఏనామ్ ప్రాప్య న విముహ్యతి- ఆ బ్రహ్మజ్ఞాన స్థితిని పొందిన తర్వాత ఆ యోగి ఎన్నడూ మోహవశుడు కాడు. మోహము సమూలముగా అతనినుండి తొలగిపోతుంది. ఆ స్థితిని పొందిన వాడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఈ జీవిత కాలం లోనే జీవన్ముక్తుడు అవుతాడనడంలో సందేహమే లేదు.

అంతకాలే అపి అస్యామ్ స్థిత్వా బ్రహ్మ నిర్వాణమ్ ఋచ్ఛతి- జీవన్ముక్తుడైన బ్రహ్మజ్ఞాని తన మరణ సమయంలోకూడా ఆ బ్రహ్మానంద స్థితినే పొందుతాడు. నిశ్ఛల స్థితిలో ఉంటాడు. సమత్వాన్ని పొంది ఉంటాడు. మోహరహితుడై ఉంటాడు. ఎల్లప్పుడూ తన సస్వరూప స్థితిలోనే ఉండడం వల్ల మరణానికి జీవనానికి అతీతుడై బ్రాహ్మీ స్థితిలోనే ఉంటాడు. అంటూ స్థిత ప్రజ్ఞుడు ఏస్థితిలో ఉంటాడనే విషయాన్ని వివరించారు.

సశేషం
ఉదయభాస్కర్ దువ్వూరి

Japa Sadhana – Blog

%d bloggers like this: